Friday, December 2, 2011

ఎంచక్కా లాప్ టాప్ ముందు కూర్చున్నానా, అప్పుడూ....

“అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా”

“ఏమైంది తమరికివాళ?”

“ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా....అంతా..”

“అబ్బా...ఆపండీ, ఇంత విషాదగీతమా?”

“మా మీద ఎంతటి ప్రేమ దేవేరీ! మా గానములోని విషాదము మిమ్ము కదిలించినదా?”

“గానములోన రాగము, గళమున మాధుర్యము లోపించినవి ప్రాణనాధా....ఇంతకూ ఆ గీతమాలపించిన కారణంబెట్టిది?”

“హా.....దేవీ కారణము నడుగుచు౦టివా! మా ప్రాణేశ్వరి బ్లాగోగుల మాయలో నుండి మా బాగోగులు మరచిన, మేమిక ఏలాటి పాటలు పాడగలము దేవేరీ..”

"శివ శివా... ఈ అపవాదు మాకేల? ఇదంతా చవితి చంద్రుని గాంచిన దోషము కాబోలు....”ఇంతకూ మా వలన జరిగిన అపరాధము యేమియో సెలవీయుము స్వామీ..”

“ఈ దేవేరి వంటింటి సామ్రాజ్యమునేలి ఎన్ని యుగములైనది?....అ౦దునూ మా అనుంగు చెక్కలను సృష్టించి ఎన్ని దినములైనదియో జ్ఞాపకముయున్నదా దేవీ?”

ఓ శ్రీవారికి ‘చెక్కల’ మీద మనసాయనా....లేశమాత్రము ఆలసించక మొదలిడుదును...

“మేము చెంతనేయుండి మీ తయారీ విధంబును గాంచవచ్చునా.. మీ సృష్టి యందు మాకాసక్తి బహుమెండుగ నున్నది.”

“అటులనే స్వామీ కాంచవచ్చును, చేయందించ వచ్చును కూడా...”

                  *   *     *     *    *     *

కాంతులీను స్టీలు గిన్నెయందు పచ్చని శనగపప్పును, తగినంత జలమును ఉంచిన అవి కొంతసేపు ముచ్చటించుకొనును. అవ్విధ౦భుగనే సగ్గుబియ్యము, మజ్జిగ కలయికకు కూడా ఏర్పాట్లు గావి౦చవాలయును.

                                                                                  

“స్వామీ మన 'హిమసందుక' నందు బందీలైయున్న ‘చక్కనైన మిరపకాయల’కు, ‘సొగసరి అల్లము’నకు బంధ విముక్తము గావి౦పుడు.”

“అటులనే దేవీ..”

మేము వయ్యారాల జీలకర్రతో వాటిని కలిపి ఈ రాతిబండలో వేసి.....

“దేవీ... ఆకుపచ్చని వర్ణములో బహు సుందరముగ నున్నది ఈ మిశ్రమము. ఆ, అటుపిమ్మట?”

పండు వెన్నెల వంటి బియ్యప్పిండికి నవనీతమును జోడించి మిగిలిన దినుసులన్నియు కలిపి చక్కని గోపురము నిర్మి౦పవలెను. సైంధవ లవణము బహు ముఖ్యము సుమా!

“దేవేరీ మా మాతామహులు ఇందున ఉల్లి, వేరుసెనగ లను కూడా జోడి౦చెదరు.”

మీకవి ప్రియములైన మాకునూ ప్రియములే...అటులనే కానింతుము.

చిన్ని చిన్ని కుడుములను వరుసగా నమర్చి వాటిని సుతారముగా గిన్నెతో......

“వా..దేవీ వా.. ఆహా! ఏమి మీ చేతి మహత్యము, కుడుములు అందమైన చందమామలైపోయెనే  .. భళి దేవీ..భళి."

“స్వామీ మనమిప్పుడు యమధర్ముల వారి కార్యమొనరించవలె.”

“ఏమది దేవీ?”

"వేడి వేడి నూనెలో వీటిని పడవేయాలి స్వామీ.”

“అంత అపరాధమూలేమి చేసినవి దేవీ?”

“పూర్వజన్మ కర్మఫలము స్వామీ, దోషపరిహారార్ధము.”

“అటులనా.... అయినాచో వేగిరము కానిమ్ము.”



“దేవేరీ ఈ పరిసరములలో అమృతము లేదు కదా”

“లేదు నాధా.”

“మరి ఈ చెక్కలకా రుచియేల అబ్బినది?”

“ఊరుకోండి మీరు మరీనూ....”


36 comments:

  1. oh.. my goodness.. wonderful recipe. Excellent saying..Thank you very much.

    ReplyDelete
  2. వామ్మో! భలే చెప్పారండీ!మేమింకోలా చేస్తామే!!

    ReplyDelete
  3. అబ్బో అవిచుస్తుంటే లాలాజలం ఉరుతుంది, అవిపంపితే సంతోషంగా తినిపెట్టేస్తాం :)

    ReplyDelete
  4. భలే గా చెప్పారే! నైస్.

    ReplyDelete
  5. వావ్.. భలే రాసారండీ.. అద్భుతంగా ఉంది మీ పాకశాస్త్ర ప్రావీణ్యం.. వాహ్వా వాహ్వా.. :))

    ReplyDelete
  6. ఇప్పటి వరకూ ఇంత క్రియేటివ్ గా రెసిపీ చెప్పడం నేను చూడలేదండీ. ఇది చేయడం నా వల్ల కాదుగానీ ఇంత క్రియేటివ్ గా రాసినందుకు మాత్రం మీకు వీరతాళ్ళు.

    ReplyDelete
  7. జగదేక వీరుడు , అతిలోక సుందరి :)

    ReplyDelete
  8. గ్రాంధికం వంటల్లో కూడా ఉపయోగించి భర్త తో కలిసి మెలిసి వంట గది సరాగాలు అందం గా చెప్పారండి.

    ReplyDelete
  9. @ వనజగారూ ధన్యవాదాలు.

    @ మందాకిని గారూ ధన్యవాదాలు..కొత్త రెసిపీ "మా వంటా వార్పూ" లో పెట్టేయండి.

    @ తెలుగు పాటలు గారూ దానికేం భాగ్యం అడ్రెస్ ఇవ్వండి పంపించేస్తాను. ధన్యవాదాలు

    @ కృష్ణప్రియ గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  10. @ మధురవాణి గారూ ధన్యవాదాలు..

    @ శంకర్ గారూ ఎప్పుడో రామాయణ కాలంలో కనిపించారు, మళ్ళీ ఇన్నాళ్ళకు. నా వంటేమో కాని మీ వ్యాఖ్య అమోఘం. ధన్యవాదాలు

    @ మౌళి గారూ..హహహ, అయితే మమ్మల్ని గుర్తు పట్టేసారన్నమాట. మీ వ్యాఖ్య సూపరు. ధన్యవాదాలు.

    @ నాగమణి గారూ "వంట గది సరాగాలంటారా"....బావుందండీ..ధన్యవాదాలు.

    ReplyDelete
  11. హహ్హహ్హహా.. బావుందండీ!

    ReplyDelete
  12. చాలా బావున్నాయండీ...
    మీ మాటలేకాదు.. ఫొటోలూనూ.

    ReplyDelete
  13. వంటలో కూడా కవిత్వాన్ని ఒలికించేశారు
    బ్యూటిఫుల్

    ReplyDelete
  14. ఆహా బహు బాగుగానున్నవి తమరి ఈ చక్కిలములు. అమృతమునే మరపించినట్లు చేసి మీ నాథుని మెప్పించిన విధము బహు ముచ్చటకొల్పుచున్నది. అది అటుల ఉండనిమ్ము, ఇంతకూ గ్రాంధికము మీద మనసైనదీ! ఏమి ఈ మాయ? ఆ ఘటోత్కచుల వారు చూసినచో ఇటు వైపు వేంచేయుదరేమో బ్లాగరీ...కాస్త గమనించుకోండి సుమా!

    ReplyDelete
  15. ఎప్పటినుంచో మీ బ్లాగ్ చదువుతూ కామెంట్కు బద్దకించేదాన్ని!ఇవ్వాళ్ళ కామెంట్ పెట్టకపోతే ఘోరం. సూపర్ ఐడియా!బాగుంది రెసిపీ, పోస్టూ రెండూ....

    ReplyDelete
  16. అందంగా చెప్పేరు.

    ReplyDelete
  17. Wonderful!!! భలే రాశారు. చాలా సృజనాత్మకంగా.

    ReplyDelete
  18. @ సునీత గారూ స్వాగతం..మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    @ కష్టేఫలే....బాబాయిగారూ ధన్యవాదాలు.

    @ శశిర గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  19. కొత్తావకాయ గారూ, గీతిక గారూ, లత గారూ ధన్యవాదాలు.

    @ సుభ...లెస్స పలికితివి బాలా ధన్యవాదములు. మీ వ్యాఖ్య కడు ముచ్చట గొలుపుచునున్నది ఈ సంతోష సమయమున బహుమానముగా ఈ సువర్ణ హారము గైకొనుము. ఘటోత్ఘజుల వారు వేంచేసిన నేమి, నలభీములను తలదన్ను వంటల బ్లాగరులు మన మిత్రులే వారి సహాయము నర్ది౦తును.

    ReplyDelete
  20. ఓలమ్మో ఓలమ్మో ఏటి , చెక్కల గురించి గూడక ఇట్టా రాసేత్తుంటే నా అసుంటోల్లకి అర్ధం అయ్యేదెట్ల బగమంతుడా ! (just kidding)
    Your idea and execution are awesome ! recipe is simply superb !

    ReplyDelete
  21. అరదం కాకపోనీకి ఏటున్నాదమ్మాయిగోరూ..నాతో ఎకసెకా లాడేత్తున్నారు గదేటి. తొలిసూరి ఇటేపొచ్చినారు.. కూసింత సేపు కూకోండి. కొబ్బరినీళ్ళట్టుకొత్తాను.

    ధన్యవాదాలు శ్రావ్య గారూ..

    ReplyDelete
  22. fridge ki meeru pettina peru himasanduka adbhuthamugaa vunnadi. chaala rojula tharuvatha ante kaashi majili kathalu chadivaaka malli grandhika bashalo chadivaanu. manasu nindipoyindi.

    ReplyDelete
  23. గీతా-యశస్వి గారూ..ధన్యవాదాలు.

    ReplyDelete
  24. భలే చెప్పారండీ!

    ReplyDelete
  25. భలే చెప్పారండీ!

    ReplyDelete
  26. మాధవి గారూ మీరా..మీ పేరు తెలియని రోజుల్లో మీ తెలుగు భాషలో ఏదో వ్యాఖ్య పెట్టాను కదూ..చాలా రోజుల తరువాత కనిపించారు. బావున్నారా..వ్యాఖ్యతో పలకరించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  27. Veru nice narration andi :) Enjoyed... especially Yamudi partu..

    ReplyDelete
  28. ధన్యవాదాలు లక్ష్మీ శిరీష గారూ :)

    ReplyDelete
  29. వామ్మో... జ్యోతిర్మయిగారూ... మీరు ఇలా కూడా రాస్తారా...

    ఎంత బాగా రాశారు... ఒక్కసారిగా సీన్ అంతా కళ్లముందు కట్టింది... మిమ్మల్ని దేవేరి రూపంలో ఊహించుకుంటే భలే చక్కగా ఉన్నారు... :)

    వంటకాల గురించి ఇలా కూడా చెప్పవచ్చని ఇప్పుడే తెలిసింది.. థ్యాంక్యూ....

    ReplyDelete
  30. బహు చక్కగా చెప్పితిరీ ,చేసితిరి నోరురేలా :)

    ReplyDelete
    Replies
    1. :) అప్పట్లో మీ పరిచయ భాగ్యం అవలేదనుకుంటా.. ధన్యవాదాలు రాధిక గారు.

      Delete
  31. సుజన పాలూరిFebruary 27, 2015 at 8:49 AM

    ఎప్పటినుండో మీ బ్లాగు చదువుతున్నా ఇంతవరకూ కామెంటలేదు. కానీ ఈ బ్లాగు బహు బాగు. భళారే శర్కరీ!

    ReplyDelete
  32. రెండు వేల పదకొండు టపా కి రెండువేల పదిహేను లో కామెంటు రావటం డానికి శర్కరి వారు సమాధానం ఇవ్వడం !

    శభాష్ ! ఇది కాదూ తెలుగు బ్లాగు అందులో నూ మంచి మేటరు కున్న తెలుగు బ్లాగు సత్తా !

    (ఏమంటే ఈ మధ్య కొంత జ్యోతిర్ మాయీ వారు బ్లాగు రాయటం కుదించే సేరు ! కౌముది కి అంకిత మై పోయినట్టు ఉన్నారు ! )
    కూసింత బ్లాగు లోకాన్ని కూడా గమనించ వలె ! జేకే !)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  33. కామెంట్ కు సమాధానమిస్తూ నేనూ తారీఖు చూసి ఆశ్చర్యపోయాను. ఈ టపా వ్రాసి మూడేళ్ళయిందా అని. ఈ ఏడాది 'కౌముది'లో కూడా ఏమీ వ్రాయలేదు. రాయాలండీ. పూర్తిగా భవసాగరంలో మునిగి పోయాను.

    జిలేబి గారూ మీరిలా వచ్చి పలకరించడం.. ఎంతో సంతోషంగా ఉంది సుమండీ.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.