అమెరికాలో దసరా సంబరాలను జరుపుకోని ఊరు, జరుపని తెలుగు అసోసియేషన్ వుండదు. మా తెలుగు తరగతి పిల్లల్ని "దసరా అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటాం?" అని అడిగాను. పండుగ గురించి చెప్పలేకపోయారు, కానీ పండుగ సంబరాలుగా వారు స్టేజి మీద వేసే 'గంతులు' గురించి చెప్పారు. పిల్లలకు ఈ పండుగ పుట్టు పూర్వోత్తరాలు గురించి చెప్పి, మనం చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళమో వాళ్లకు చూపించాలనిపించింది. ఆ ప్రయత్నమే ఈ 'దసరా సంబరాలు' .
'ఉగాది వేడుకలు' వేసిన పిల్లలందరూ మాం..ఛి ఉత్సాహంగా 'సై' అన్నారు. ఇక్కడో చిన్న ఇబ్బంది ఎదురైంది. ఉగాది వేడుకలు వేసినప్పుడు తరగతిలో పన్నెండు మంది పిల్లలున్నారు, ఇప్పుడు ఇరవై ఐదు మ౦ది అయ్యారు. వీళ్ళు కాక ఫ్రెండ్స్ పిల్లలు ఓ ఏడెనిమిది మంది ఎవరిని కాదన్నా బావుండదు. "మరి ఇంతమందితో నాటకం... " చూద్దాం మరో ప్రయత్నం అనుకుంటూ, ఓ ఇద్దరు పిల్లలు కథ చెప్పే లాగానూ, మరో ఇద్దరు వినే లాగాను స్క్రిప్ట్ మొదలు పెట్టాను. ఇక కథలోకి ఈ సారి సీతా సమేతంగా రాములవారూనూ, తోడుగా లక్ష్మణుడూ, ఇక హనుమంతులవారు సరేసరి రాముడు ఎక్కడుంటే వారిక అక్కడేగా మరీ, వచ్చేశారు... సంబరాల విషయానికి వస్తే పంతులు గారూ, పిల్లలూ, పులి వేషాల వాళ్ళూ. అబ్బో.. తలచుకుంటేనే భలే ఉత్సాహంగా ఉందిలే. చకా చకా వ్రాశేసి స్నేహితులకి చూపించేశా.
స్క్రిప్ట్ వైపు నా మొహం వైపు మార్చి మార్చి చూశారు. చూశారంటే చూడరు మరీ... పోయినసారి "మీ ఇంట్లో కవ్వముందా, పాలకేనుందా?" అని వాళ్ళను అటకలూ అవీ ఎక్కి౦చేశానుగా...చూడ్డం అయిన తరువాత "పోయినసారంటే ఏవో దొరికేశాయి. ఇప్పుడీ కిరీటాలు, పూలదండలూ, పట్టుపీతా౦బరాలూ, గధలూ ఇవన్నీ ఎలా? ఇదేమన్నా ఇండియానా" అని మెత్తమెత్తగా చీవాట్లేశారు. "ఏదో చేద్దాంగా" అన్నా నమ్మకంగా, మనసులో పీచు పీచు మంటూనే ఉంది.
ఎవరెవరికి ఏ ఏ వేషాలు ఇవ్వాలో నిర్ణయించి, వారితో ఆమోదముద్ర వేయించుకుని పిల్లల వాయిస్ రికార్డింగ్ మొదలు పెట్టాం. రాక్షసులు ఆ రోజుల్లో ప్రజలను నానా బాధలూ పెట్టడం కథల్లో చదువుకున్నాం. కాని ఈ ఇరయై శతాబ్దంలోకి కూడా వచ్చి బాధ పెడతారని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. 'మహిషాసురుడు' అని పలకడానికి పిల్లల్ని ఎన్నెన్ని బాధలు పెట్టాడని! కొన్ని సార్లు ఆ బాధ భరించలేక 'మైషాసురుడ'ని, అది కూడా కుదరనప్పుడు 'మహిషుడు' అనికూడా అనిపించాం. ఇక కథకు ముఖ్యమైన డయలాగ్స్ దుర్గాదేవి మహిషాసురిడివి. “అవి సరిగ్గా చెప్పాలంటే పిల్లలకు కష్టం ఎవరైనా పెద్దవాళ్ళతో రికార్డు చేయిద్దాం” అన్నా. "ఎందుకమ్మడూ మన ముచ్చట్లు గ్రాంధికంలో మార్చి చెప్పేస్తేపోలా" అని శ్రీవారన్నారు. "అలాక్కానీయండన్నా".
ఇక మధ్య మధ్యలో దేవతలొచ్చేప్పుడు పెట్టిన మ్యూజిక్ లవీ 'యు ట్యూబ్' వారి సౌజన్యంతో. అన్నింటికన్నా ముఖ్యమైన పాట 'ధరణికి సంబరాలు' సిలికాన్ ఆంధ్ర వారి అనుమతితో వారి పాటను తీసుకున్నాము. ఆడియో రికార్డింగ్ పూర్తయ్యింది.
ఇక ఆక్ససరీస్..అదేనండీ వస్తుసామాగ్రి. ము౦దస్తుగా కిరీటాలు: మైకేల్స్ లో గోల్డ్ కలర్ గిఫ్ట్ రాప్, జువల్స్, గ్లిట్టర్ గ్లూ, కన్ఫెట్టి లాంటి వన్నీ తెచ్చాం. గిఫ్ట్ రాప్ పోస్టర్కి అంటించి కిరీటం డిజైన్ వేసి కట్ చేసాం. ఇప్పుడు ర౦గుల రంగుల రాళ్ళు అంటించి గ్లూతో అందంగా అలంకరించా౦. టడా.... అందమైన కిరీట౦ రెడీ, తలకు పెట్టుకుని చూడగానే కళ్ళు కనిపించలా, ముందు అర్చ్ కట్ చేయడం మరచాం. ఇంకా నయం, అన్నీ అలా చేశా౦ కాదు. అలా౦టి పొరపాటు రాకుండా మిగిలినవన్నీ జాగ్రత్తగా చేశా౦లెండి. అందమైన కిరీటాలు తయారయ్యాయ్.
స్ట్రీమర్స్ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మాలలు అల్లేశా౦. ఇక బాణాలు 'హోం డిపో' లో కర్రలకి గోల్డ్ ఫాయిల్ రాపింగ్. ఇకపోతే పట్టు పీతాంబరాలు....ఉన్నారుగా మన భారతనాట్యం అమ్మాయిలు, వాళ్ళ డ్రెస్ కొంచెంగా మార్చితే మంచి పంచెలు తయారు.
మా హనుమంతుడ్ని మీరు చూసి తీరాల్సిందే. ఆ అలంకరణలో నా ప్రమేయమెంత మాత్రం లేదు సుమండీ..మొత్తం వాళ్ళ అమ్మగారు చూసుకున్నారు. అలాగే దుర్గాదేవి, మహిషాసురుడు, గద, బతుకమ్మ కూడా....ఇక పులులు, ఈ కాస్ట్యూమ్ కోసం వెతకని షాపూ, వెబ్సైటు లేదు. చివరాఖరకి అమ్మాయిల సెక్షన్లో చిరుతపులులు దొరికాయి. 'జోయాన్స్' లో బట్ట తెచ్చి తోకలు కుట్టాం. సరంజామా అంతా పూర్తయ్యింది కదా. అమ్మాయిలకు పోచ౦పల్లి చీరలు కట్టాలనుకున్నాం. తెలిసినవారందరూ వారి పెట్టెలన్నీ వెతికి చీరలిచ్చారు.
ముందు నాటిక అనుభవంతో సీనుల వారీగా రిహార్సిల్స్ మొదలుపెట్టాం. ఐయిగిరినందిని పిల్లలు, పులివేషం పిల్లలు, ధరణికి సంబరాలు పిల్లలూ, అయోధ్యవాసులూ, కథకులూ, చివరగా మహిషాసురుడూ, దుర్గాదేవీనూ. ఈ నాటిక రిహార్సిల్స్ జరిగినన్ని రోజులూ మా మెయిల్ సబ్జక్ట్స్ పేర్లన్నమాట. బావున్నై కదూ. డాన్స్ వేస్తున్న పిల్లలు ఎక్కువ మంది అవడం వల్ల స్థలాభావం, సమయాభావం కలిగింది. ఒక్క నెల్లాళ్ళు సాయంత్రం ఐదు ను౦డి ఆరు మధ్యలో ఎవరొస్తే వాళ్ళకు డాన్స్ నేర్పించడంవల్ల దాన్ని అధిగమించాం. అలా నాటిక రిహార్సల్స్ పూర్తయ్యాయి.
ఈ నాటికవేయడానికి ముందు నాటిక అంత ఆదుర్దా లేదు. మా పిల్లల అభినయం తెలిసిందిగా మరీ. మా పిల్లలు మరోసారి మా ఊరి ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి౦చేశారు. అన్నట్టు ఈ పిల్లల్లో ఒక్క నులుగురైదుగురు తప్ప మిగిలిన వారందరూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలేనండోయ్..
కొస మెరుపు
పిల్లలకు దసరా పండుగ గురించి తెలిసింది. మహిషాసురుడు దుర్గాదేవి స్టేజికి ఆ చివర ఒకరు, ఈ చివర ఒకరు నిలబడి వీడియో గ్రాఫర్ లను అయోమయంలో పడేశారు.
రామ లక్ష్మణులు పాపం అడవి నుండి సరాసరి ఇటే వచ్చినట్లున్నారు, కాళ్లు నొప్పెట్టి స్టేజికి మధ్యకు రాలేకపోయారు.
మొదటి భాగం
రెండొవ భాగం
చాలా బాగుందండీ! ఎంత ఒపికో మీకు! మేము బొమ్మల కొలువు సంక్రాంతికి పెడతాం. మా ఇంట్లో ఈ తొమ్మిది రోజులూ ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు. ఇక్కడ కూడా నేను తొమ్మిది రోజులూ ఉపవాసం ఉండి పూజ చేసుకుంటాను. మహిషాసురమర్దిని వేషం వేసింది గౌరే కదూ! అయ్యో మా రామయ్య బక్క చిక్కిపోయాడండీ! బతుకమ్మ సంబరాలు బాగున్నాయి! పిల్లలు ఈ చీరల్లో కొప్పు పెట్టుకుని ఎంత ముద్దొస్తున్నారో! చాలా చక్కగా చేయించారు అన్నీ!
ReplyDeleteఇదివరకు అడిగానో లేదో గుర్తులేదు.... మరోసారి అడుగుతున్నాను...
ReplyDeleteమీరు ఉండేది ఎక్కడ... సిలికాన్ ఆంధ్రా అని రాసారు కాబట్టి బే ఏరియా అని అర్థం అయ్యింది...
చెప్పడం ఇబ్బంది అనిపిస్తే మెయిలు ఐ.డి. ఇస్తాను...
ఉగాది నాటిక చూసాను... ఇది వీకెండ్ లోగా తప్పక చూస్తాను..
కానీ మీ ఈ ప్రయత్నం అభినందనీయం.... ఇక్కడ ఉండి కూడా ఇన్ని చేస్తున్నారంటే......... మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో కూడా అర్థం కావడంలేదు...
రసజ్ఞా అమెరికాలో బొమ్మల కొలువు దసరాకు కొంతమంది, సంక్రాంతికి కొంతమంది పెడతారు. దుర్గాదేవిని బాగానే గుర్తుపట్టావు. రామయ్య పాపం వనవాసం నుండి వచ్చాడు కదా మరి అందుకే బక్కచిక్కాడు.
ReplyDeleteతొమ్మ్దిరోజులు ఉపవాసం ఉండి పూజ చేస్తావా..నీకెంత ఓపిక రసజ్ఞా..
ధన్యవాదాలు.
మాధవి గారూ మేము ఇంతకు ముందు బే ఏరియాలో చాలా సంవత్సరాలు ఉన్నాము...పిల్లలకి తెలుగు నేర్పించడం, వాళ్ళతో ఇలాంటి నాటికలు వేయించడం చాలా సరదాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మెయిల్ ఐ.డి. ఇవ్వండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.
ReplyDeleteఎంత ఓపిక.. !! చాలా గొప్ప పని చేస్తున్నారు. భావితరం కి..మన సంస్కృతీ-సంప్రదాయాలు తెలియజేసే ప్రయత్నంలో.. మీ పని వేళలు..తీరు బాటు చేసుకోవడం,విసుగు పడకుండా. చేస్తున్నారు. గ్రేట్ !!!!.అలుపెరగని ప్రయాణం చేస్తున్నప్పుడు..చక్కని ఫలితాలు వస్తాయండీ.. అభినందనలు.
ReplyDeleteఇక్కడ పుట్టి పెరిగే పిల్లల చేత అలా తెలుగు మాట్లాడిస్తున్నందుకు మీ ఓపికను నిజంగా మెచ్చుకోవాలండి.
ReplyDeleteఅబ్బా ఎంత కష్టపడ్డారు. సంస్కృతి మీద ప్రేమ ఇంత చేయిస్తూవుంది. భగవంతుడు మీకందరికి చిరాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నా! శతమానమ్ భవతి.....
ReplyDeleteకళ్ళు కాయలు కాచి, పూలు పూసేసాక ఇప్పుడు చూపించారన్నమాట మీ దశరా సంబరాలు.. ఏదైతేనేమీ మంచి కనువిందు చేసారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలమూ దక్కింది.. సూపరో సూపరు బాబోయ్ మీ సంబరాలు. పిల్లలు విరగతీసేసారు. గౌరీ ఏది చేసినా సూపర్ డూపర్ హిట్ ఐపోతోందండోయ్. పిల్లలందరికీ అభినందనలు, మీకు శుభాకాంక్షలూనూ కార్యక్రమం ఇంత విజయవంతమైనందుకు.
ReplyDelete@ వనజ గారూ..పిల్లలతో పని చేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంటుందండీ..వాళ్ళ అమాయకమైన మొహాలు చూస్తూ పాఠాలు చెప్పండం ఓ గొప్ప అనుభూతి..మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు..
ReplyDelete@ భాస్కర్ గారూ....మా ప్రయత్నాలు ముఖ్యంగా వారితో తెలుగు మాట్లాడి౦చడమే..దానికి తగ్గట్టుగా పాఠాలను తయారుచేస్తున్నాము. ధన్యవాదాలు
@ బాబాయి గారూ..సంస్కృతి మీద ఇష్టమే మా చేత ఈ పనులన్నీ చేయిస్తు౦ద౦డీ...వందనములు.
ReplyDelete@ సుభా మీ చేత కళ్ళు కాయలు కాచేలా చేయించింది ఇది కాదు..త్వరలో వస్తుంది..గౌరీ ఏం చేసినా ఎంతో ఇష్టంగా చేస్తుంది...మా పిల్లల తరపునుంచి కూడా..నీకు ధన్యవాదాలు.
చాలా సంతోషమండీ. ముచ్చటగా ఉన్నది.
ReplyDeleteవెళ్ళాలని ఉంది స్క్రిప్ట్ ఎవర్రాశారండీ? absolutely brilliant.
ReplyDeleteAudio mixing and the various accents are brilliant too.
కొత్తపాళీ గారూ మీ వ్యాఖ్యను నా ప్రత్యేక సత్కారంగా భావిస్తాను. అలాంటిది ఇవాళ మూడు వ్యాఖ్యలు..మీకు బోలెడు ధన్యవాదాలు..
ReplyDelete'వెళ్ళాలని ఉంది కానీ' నేనే వ్రాశానండీ..మొదటి రెండు నాటికలు పిల్లలతో వేయించాక, పెద్దవాళ్ళతో ఒక నాటిక చేద్దాం అన్న ఆలోచనతో మొదలుపెట్టాను. అందులో నటించిన వాళ్ళందరూ కూడా ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. ఆడియో మిక్సి౦గ్ మా వారు చేశారు.
ధన్యవాదాలు.
Well done.
ReplyDeleteకొత్తపాళీ గారూ..ధన్యవాదాలు
ReplyDelete