Sunday, December 4, 2011

ఎప్పటికీ నాతోనే ఉండిపోవా

ప్రియమైన నీకు,

         శ్రావణంలో వచ్చి వెళ్ళావు, కార్తీకం కూడా వెళ్ళిపోయింది. నీ దగ్గర నుంచి చిన్న కబురు కూడా లేదు. వెన్నెల వెలుగులతో వస్తావు, నీవున్నన్నాళ్ళు వసంతాలు పూయిస్తావు. నువ్వు నా దగ్గర్నున్నంత సేపూ నన్ను నేల మీద నడవనీయవు కదా! కాళ్ళు కందిపోతాయనా? నువ్వు వస్తూ తెచ్చిన బహుమతులన్నీ పదిలంగా దాచాను. మనసు మూగవోయినపుడు నాకవే ప్రియనేస్తాలు. ఎప్పటినుంచో నీకో విషయం చెప్పాలని చూస్తున్నాను. తెలియని సంకోచమేదో అడ్డుతెర వేస్తోంది.

         మొన్నోరోజు బయటకు వెళ్ళాను. అందరూ అడగడమే నీ గురించి, నువ్వు లేని లోటు నా ముఖంలో కనిపిస్తూందట. నలుగురిలో మరీ ఒంటరితనం భరించలేక వెనక్కు వచ్చేశాను. మనం చేతిలో చేయి వేసుకుని చేసిన విహారాలు నీకు గుర్తున్నాయా? నాకా రోజులన్నీ కళ్ళ ముందే మెదలుతున్నాయి, ఆ జ్ఞాపకాల్లోనే నేను నేనుగా మనగలిగేది. పండుగేదో వస్తున్నట్లుంది. అయినా నువ్వులేందే అది పండుగెలా అవుతుంది! తోడుగ నువ్వుంటే అమావాస్య కూడా పండువెన్నెలే నాకు. నీకోసం ఎన్ని రోజులని ఎదురుచూడను?

         నా విన్నపాన్ని మన్నించి దరిచేరవా. అయినా నీకెక్కడ తీరుతుందిలే, వెయ్యిళ్ళ పూజారివి. అందరికీ నువ్వంటే ఎంతో ఇష్టమట, నీకోసం ఎదురుచూస్తూ ఉంటారట, నీకోసం ఏమైనా చేస్తారట. ఏం మాయ చేశావో అందర్నీ ఇలా వశపరచుకున్నావు. నిన్ను చూస్తే ఒక్కోసారి ఎంత అసూయగా ఉంటుందో తెలుసా! మొన్న నువ్వెళ్ళాక, తిరిగి చూస్తే ఏము౦దీ అంతటా శూన్యమే. ‘అన౦దమా’ అత్యాశ అనుకోక ఎప్పటికీ నాతోనే ఉండిపోవా..నా బ్రతుకు దారంతా నాతోనే నడుస్తావని ఆశిస్తూ..

నీ
నేను





11 comments:

  1. ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏమిటో
    పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
    దాహానిదా స్నేహానిదా ఈ సూచనా ఏమిటో
    తేల్చుకో నయనమా ఎవరిదీ తొలితడి
    ఓ.. పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా

    ఏమిటో మీ టపా చూసి ఆ సాంగ్ మైండ్ లో డాన్స్ చేసింది

    ReplyDelete
  2. ప్రియాతి ప్రియమయిన నీకు,
    నీ నేను వ్రాయునది. శ్రావణంలో నీ దగ్గర నించి వచ్చేసిన తరువాత నేను నీకు ఎన్నో రకాలుగా పలకరిస్తూనే ఉన్నాను. కార్తీక మాస మలయమారుతాన్నై వచ్చి నీ చెంపను గిచ్చి పోయాను. అక్కడ నీకు చలిగా ఉందని ఉదయాన్నే నా నులువెచ్చని వెచ్చని కౌగిలిలో వెచ్చదనం పంచాలని తొలి కిరణాన్నై వచ్చాను. ఆకలేసినప్పుడు ఆహారాన్నై వచ్చా. బోసి నవ్వులలో చేరాలని వచ్చాను. ఇలా నిన్ను నీకు తెలియకుండా చూడాలని ఎన్నో మారు వేషాలలో వచ్చాను. నీ చుట్టునే తిరుగుతున్నాను. ఇప్పటికయినా నన్ను పోల్చుకో. నేనిక్కడే ఉన్నాను. ఎక్కడికీ పోలేదు. ఈ బ్లాగులో, పాఠకుల కన్నుల్లో, వ్యాఖ్యలలో అంతట నేనే అయి ఉన్నాను.
    ఎన్నటికీ నీ
    నేను.

    ReplyDelete
  3. "‘అన౦దమా’ అత్యాశ అనుకోక ఎప్పటికీ నాతోనే ఉండిపోవా..నా బ్రతుకు దారంతా నాతోనే నడుస్తావని ఆశిస్తూ.."
    "ఆనందమే జీవిత మకరందం"
    నిజమేనండీ జీవితమంతా మనతోనే ఆనందం నడిస్తే నిజంగా అంతకంటే అదృష్టం వుంటుందా???

    ReplyDelete
  4. భావుకతలో ములిగిపోయారు

    ReplyDelete
  5. చాలా బాగుంది.

    ReplyDelete
  6. @ తెలుగు పాటలు గారూ..ఈ లేఖ ఓ పాటని మీ మదిలో డాన్స్ చేయించిందా..అయితే ఈ లేఖకు సార్ధకత లభించినట్లే..మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    @

    ReplyDelete
  7. ప్రియమైన నీకు,

    నిన్ను నేను చూడలేదనుకున్నావు కాదూ..ఏ మూలో దాగున్న నిన్ను నా ఎదుటకు తెచ్చే ప్రయత్నమే ఇది. మలయమారుతం నన్ను తాకిన క్షణం రేగిన అలజడికి కవితై కానుకలంది౦చా. నీ అనురాగం కిరణమైననాడు మంచులా కరగిపోయా. నువ్వెన్ని రూపాలలో ఉన్నా నిన్ను పోల్చుకోలేనా! బ్రతుకంతా కలిసే ఉందామని తీసుకున్న మాట మరిచాననుకున్నావా..నీకై వెతుకుతూ ఏ బ్లాగునందు దాక్కున్నా వెతికి వారికి వ్యాఖ్య లంచంగా ఇచ్చి మరీ నిన్ను తెచ్చుకు౦టూనే ఉన్నాగా..నువ్వు నన్ను వీడినా నేను నేన్ను వీడను. ఇవాళ నీ జాడ తెలిపిన రసజ్ఞకు ధన్యవాదములతో..

    నీ
    నేను.

    ReplyDelete
  8. @ రాజి గారూ అంత కంటే అదృష్టం ఉండదండీ...ఆనందం ఉంటే అన్నీ ఉన్నట్టే కదండీ..ధన్యవాదాలు.

    @ బాబాయి గారూ మీ కరెంటు కష్టాల్లో కూడా కామెంటు పెట్టారు. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    @ రఘు గారూ స్వాగతమండీ..మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  9. దూరమైన దాని కోసం ప్రియంగా ఎదురుచూపు చూడటంలోనే ..విలువ ఇనుమడిస్తుంది. తిరిగి చేరువైనప్పుడు ఆ ఆనందాహం విలువ రెట్టింపు అవుతుంది. .. అభివ్యక్తీకరణ.. శైలి.చాలా బాగున్నాయి. అభినందనలు.. అందుకోండి.. శీతల పవనాలని ..ఆస్వాదిస్తూ.. హిమ వర్షంలో.. తడుస్తూ.. నేను.. ఇందు ఉన్నాని .. చెపుతుంది..

    ReplyDelete
  10. ధన్యవాదాలు వనజగారూ..

    ReplyDelete
  11. @జ్యోతిర్మయి గారు

    మీతోటి చందమామను అయితే పెటేస్కోండి ... కాని జాబిలమ్మ ను మట్టుకు ఇలా పంపండి.. మీరు ఇలా నాకు పోటికి వస్తే ఎలా ? తనకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని పిలవట్లే మీరేంటి పదే పదే అలా పిలిచేస్తారు.. మా పైన జాలి గీలి లేనట్టు వుందే మీకు. అప్పుడే కొలత కూడా వేసాను నానుంచి చాలా దూరం వెళిపోయింది మీకు దెగ్గరగా వచ్చేసింది ఈ సమయానికి . కాస్త రాత్రికల్లా ఇక్కడికి పంపాలని నా మనవి.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.