ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
మొదట మాకు ఆ ఐలెండ్స్ కు వెళ్ళే ఆలోచన లేదు. వెనిస్ కు వెళ్ళిన రోజు మధ్యాహ్నం మ్యాప్ చూస్తే మురానో అక్కడకు దగ్గరలోనే ఉన్నట్లు తెలిసింది. ఊరికే కాసేపలా వెళ్ళొద్దామని బయలుదేరాము. నీళ్ళ మీద వేపరెట్టో వెళుతూ ఉంటే ఏడ్రియాటిక్ సముద్రపు గాలి చల్లగా హాయిగా ఉంది. అక్కడక్కడా చిన్న చిన్న ఐలెండ్స్ కనిపిస్తూ ఉన్నాయి.
ఇరవై నిముషాలలో మురానో ఐలెండ్ కు చేరుకున్నాం. వేపరెట్టో దిగి ఐలెండ్ లోపలకు వెళ్ళగానే మధ్యలో కెనాల్ దానికి అటూ ఇటూ ఇళ్ళు, గాజు వస్తువులున్న షాప్స్, రెస్టరెంట్స్ ఉన్నాయి. మురానోలో గాజు తయారీ ఫాక్టరీ ఉంది. అక్కడకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ ఫాక్టరీకి వెళతారు కానీ మేము ఇదివరలో న్యూయార్క్ దగ్గర గ్లాస్ ఫాక్టరీ చూసి ఉన్నాము కాబట్టి మళ్ళీ మురానోలో వెళ్ళలేదు. అక్కడ తయారు చేసిన గాజు వస్తువులు, షా౦డ్లియర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్క షాండ్లియర్ ఖరీదు తొమ్మిది నుండి పదిహేను వేల యూరోల వరకూ ఉంది.
అప్పుడు టైమ్ మూడున్నర అవుతోంది. అక్కడి నుండి బూరానోకు అరగంట ప్రయాణం. అంటే అక్కడికి వెళ్ళేసరికి నాలుగవుతుంది. బూరానో నుండి తిరిగి వెనిస్ కు వెళ్ళడానికి ఆఖరి వేపరెట్టో ఐదు గంటలకు ఉంది. అంటే మేము బురానో లో కేవలం ఒక నలభై ఐదు నిముషాలు మాత్రమే ఉండగలం. అయినా సరే వెళ్ళాలనే నిర్ణయించుకున్నాం.
ఆ రోజు ఉదయం మిలాన్ లో ట్రైన్ ఎలా ఎక్కడమా అని కంగారు పడ్డవాళ్ళం, ఇక్కడ ఐలెండ్ లో చిక్కుకు పోతేనో అని కంగారు పడలేదు. ధైర్యం పెరిగి పోయింది.
డాక్ దగ్గర దిగి ఐలెండ్ లోపలకు అడుగు పెట్టగానే చక్కని పరిమళం పలకరించింది, ఎక్కడా అని చూస్తే ఆ ఇళ్ళ ముందు అల్లుకున్న పచ్చని స్టార్ జాస్మిన్ తీగలు, తీగల నిండా విరపూసిన తెల్లని మల్లెలు కనిపించాయి. ఐలెండ్ లో ఉన్నంత సేపూ ఆ పువ్వుల పరిమళం మమ్మల్ని చుట్టుముట్టే ఉంది. బూరానోలో రంగు రంగుల ఇళ్ళు ఏదో ఒకటి రెండు వీధులలో ఉంటాయి అనుకున్నాము కానీ, ఐలెండ్ లోని ఇళ్ళన్నీ అలాగే చక్కని రంగులతో కళకళలాడి పోతున్నాయి. అది చూడగానే పండగ నెలలో రంగురంగుల ముగ్గులతో కళకళలాడే మా అమ్మమ్మ వాళ్ళ వీధి గుర్తొచ్చింది.
ఆ పువ్వుల పరిమళం, వేసవి మధ్యాహ్నపు నిశ్శబ్దం మేము ఇటలీలో ఉన్నామని, అదొక ద్వీపమని ఏదీ గుర్తుకు రాలేదు. అక్కడే ఉండి ఆ ప్రశాంతతలో ఒక భాగమై పోవాలని అనిపించింది. ఆ టూరిస్ట్ లు తప్పకుండా బూరానోకు వెళ్ళండి అని ఎందుకు చెప్పారో అప్పుడర్థ౦ అయింది.
ఇవన్నీ కథలేనేమో నాకు తెలియదు, తెలిసింది చెప్పానంతే. వాళ్ళు, ఇళ్ళకు రంగులు ఎందుకు వేసుకుంటేనేం లెండి, చూడడానికి మాత్రం ముచ్చటగా ఉన్నాయి.
మొగవాళ్ళేమో చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు, అప్పుడు అక్కడి ఆడవాళ్ళు ఏం చేసారో తెలుసా లేసు తయారీ మొదలు పెట్టారు. ఏదో కాలక్షేపంగా కాదు దీక్షగా. ఏ శతాబ్దంలో మొదలెట్టారో తెలియదు కానీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. పైగా ఈ లేస్ తయారీ నేర్పడానికి అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. బూరానో లేస్ గౌన్ లు యూరప్ లోని రాజవంశీకులు తెప్పించుకునే వారట. లేసులతో బట్టలే కాక రకరకాల వస్తువులు కూడా తయారు చేస్తారు.