మా చిన్నప్పుడు ధనుర్మాసంలో ఊరంతా ముగ్గులతో, గొబ్బెమ్మలతో, తోరణాలతో, బొమ్మల కొలువులతో, గంగిరెద్దులతో,
బసవన్నలతో కళకళలాడుతుందేది. పండుగ మరో సంబరం బంధువుల రాకపోకలు. ఇప్పుడు కూడా ధనుర్మాసమూ ఉందీ, సంక్రాంతీ ఉంది. కాకపోతే కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి పెద్ద పెద్ద మార్పులకే లోనయింది. అప్పటి సందడిని తీసుకురాలేము కానీ, ఆ సంస్కృతికి చిహ్నాలుగా బొమ్మల కొలువులు
పెడుతున్నాం, ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడ మాకు స్నేహితులే
బంధువులు, వారందరితో కలసి ఈ సంవత్సరం సంక్రాంతి సందడి సందడిగా
జరుపుకున్నాం.
తెలుగువారందర౦
కలసి చేసుకునే మా ఊరి ‘సంక్రాంతి సంబరాల్లో’ చిన్నపిల్లలు రంగురంగుల కాగితాల మీద అందమైన బొమ్మలు గీశారు, 'మ్యూజికల్ చైర్స్ 'లో కుర్చీల కోసం వారి పోటీ ఎన్నికలను తలపించిది.
ఇక పెద్దవాళ్ళేమో
“బావున్నారా? మనం కలసి చాలా
రోజులయింది కదూ.”
“అవునండీ చాలా రోజులయింది. మనం ఆఖరున
కలిసింది జాహ్నవి వాళ్ళ పార్టీలో అనుకుంటా.” లాంటి పలకరింపులూ.....
“ఏంటిలా చిక్కిపోయావ్ గిరిజా? డైటింగా?”
“నిజంగా తగ్గానా! థాంక్యూ థాంక్యూ.”
“శ్రుతి ఎలా ఉంది? మళ్ళీ
ఎప్పుడొస్తుంది?”
“నెక్స్ట్ మంత్ వాళ్లకి ఓ ఫోర్ డేస్
బ్రేక్ ఉందిట. టెన్త్ నొస్తుంది భారతీ.”
"ఏంటి౦త లేట్ గా వచ్చారు?"
"మా ఆఫీస్ లో రిలీజ్ వుంది, అందుకే వీకెండ్ కూడా చావగొడ్తున్నారు."
లాంటి
పరామర్శలూ, ప్రశ్నోత్తరాలూ...
“వాణీ, నీ చీర కలర్ చాలా బావుంది. ఏం చీరది?”
“మా అమ్మ ఏదో పేరు చెప్పింది. గుర్తులేదు జానకీ. మొన్న సౌమ్యా వాళ్ళతో పంపించింది.”
“మాగజైన్ చదివారా?”
“ఆ చదివాను సార్. ఆర్టికల్స్ అన్నీ చాలా బావున్నాయి.”
“హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా
వుంది?”
“ఏదీ తెలంగాణా విషయం తేలేదాకా
ఆగాల్సిందే” లాంటి కబుర్లతో మనసులు కలబోసుకున్నారు.
ఈలోగా పిజ్జా కి పిలుపొచ్చింది. పూర్ణ చంద్రబింబాల్లాంటి
పిజ్జాలను చూసిన పిల్లల మొహాల్లో వెన్నెల
వెలుగులు విరిశాయి. తల్లులు “అమ్మయ్య! ఈ పూట తినిపించాల్సిన బాధ లేదని” బోలెడంత ఆనందపడ్డారు.
వంటలన్నీ అందంగా రెండు బల్లల మీద
అమిరిపోయాయి. వడ్డించడానికి ఔత్సాహికులంతా గరిటలతో సిద్దమయ్యారు. “ఆహా”....”ఓహో”
లతో భోజనాలు ముగిశాయి. అన౦తరం ‘బింగో’ అంకెల కాగితాలు అందరి చేతుల్లో
రెపరెపలాడాయి. పిల్లలందరూ పెద్దలుగా సంయమనం పాటిస్తే, పెద్దలు ఉత్కంఠతో
పిల్లలైపోయారు. చిట్టచివరగా అంత్యాక్షరి....పాతపాటల పలకరింపులు, కొత్తపాటల
కేరింతలలో పాత, కొత్త గొంతులు కలగలసిన ఆనందంలో నవ్య సంక్రాంతి అందంగా నవ్వింది.
కొస మెరుపు
చిన్నపనిక్కూడా మేమున్నామ౦టూ
ముందుకొచ్చిన స్నేహశీలత అభినందనీయం. ఆహుతులను సకుటుంబ సమేతంగా చిత్రాలు తీసి వాటిని అప్పటికప్పుడు తెరపై చూపించడం ఈ సంక్రాంతి ప్రత్యేక ఆకర్షణ. కబుర్ల మధ్యలో భోజనాలు బహు
పసందు. 'బింగో' ఆట ఉత్కంఠభరితం. చివరగా ఆడిన అంత్యాక్షరి వేడుకకు చక్కటి ముగింపు. అందరి మధ్య సమయం మాత్రం మాట వినక పరుగులే తీసింది. స్మృతిహారానికి మరో ముత్యం తోడయ్యింది.