Wednesday, November 29, 2023

సాల్జ్బర్గ్

ఇంతకు ముందు భాగం ఇక్కడ చదవొచ్చు. 

హాల్ స్టాట్ నుండి సాల్జ్బర్గ్ కు ఆల్పైన్ పర్వతాల మీదుగా ప్రయాణం. దారంతా పచ్చని కొండలు, వాటి మీద ఎత్తైన చెట్లు, మధ్యలో అక్కడక్కడా చిన్న ఊర్లు. ఆ పచ్చని కొండలను చూస్తుంటే గంట సేపు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. 


సాల్జ్బర్గ్, ఆస్ట్రియా దేశం లోని రాష్ట్రము, పట్టణమూను. సాల్జ్బర్గ్ కు ఆ పేరేలా వచ్చిందంటే అక్కడ ఉన్న ఉప్పు గనుల వలన. జర్మన్ భాషలో సాల్జ్ అంటే ఉప్పు, బర్గ్ అంటే కోట. సాల్జ్బర్గ్ క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండీ ఉంది. అక్కడ ఆస్ట్రియన్ జర్మన్, ఆస్ట్రో బవేరియన్ భాషలు మాట్లాడతారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో సాల్జ్బర్గ్ కూడా ఒకటి.

సాల్జ్బర్గ్ లో మేము తీసుకున్న హోటల్ డోరియంట్ సిటీ హోటల్. విశాలంగా గాలీ వెలుతురుతో బావుందా హోటల్. సామానంతా లోపల పెట్టి ఊరు చూడడానికి బయలుదేరాము. 



ఒక్క రెండు మలుపులు తిరగగానే కనిపించింది మొజార్ట్ పుట్టిన ఇల్లు. ఊల్ఫ్ గాంగ్  ఆమెడ్యుయస్ మోజార్ట్, పద్దెనిమిదవ శతాబ్దపు ప్రముఖ మ్యుజీషియన్, కంపోజరూను. మోజార్ట్ బాల మేధావి, తన ఆరేళ్ళ వయస్సులో వియన్నాలోని షాన్బ్రిన్ ప్యాలస్ లో ఎంప్రెస్ మెరియా థెరిస్సా ముందు కాన్సర్ట్ ఇచ్చాడు. పాపం అతని జీవించింది ముప్పై ఏళ్ళే కానీ, తను సృష్టించిన సంగీతానికి మాత్రం మరణం లేదు.  

మోజార్ట్ ఇంటి నుండి ఇంకొంచెం దూరం వెళ్ళగానే కనిపించింది మీరాబెల్ ప్యాలస్. దాన్ని పదిహేడవ శతాబ్దంలో ఆర్చ్ బిషప్ ఊల్ఫ్ డైట్రిక్ రైతనౌ తన ప్రేయసి సలోమ్ ఆల్ట్ కోసం కట్టించాడు. ప్యాలస్ చుట్టూ అందంగా తోటలు మధ్యలో బొరాక్ స్టైల్ లో విగ్రహాలు, ఫౌంటెన్ లు. ఇవన్నీ నచ్చేసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాలో కొంత భాగం అక్కడ తీసారు. ఆ ప్యాలస్ హాల్ లో కాన్సర్ట్స్, బాల్ డాన్స్ లు జరుగుతూ ఉంటాయి.  



ప్యాలస్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే కనిపించింది సాల్జక్ నది. వడివడిగా పారుతున్న నీళ్ళు, నది వంపులో ఒక వైపు అందమైన చర్చ్,  మరో వైపు క్లాక్ టవర్. 

మరో వైపు తీరుగా కట్టిన ఇళ్ళ వెనుకనున్న కొండ మీద పెద్ద కోట. ఎటు చూసినా అద్భుతమే. మాటల్లో చెప్పడానికి అక్షరాలలో ఒదిగే అందమా అది, చూసి తీరవలసిందే. 

ఇంకాస్త దగ్గరగా వెళ్ళేసరికి బ్రిడ్జ్ మెష్ హోలీ  ఆడినట్లు రంగులతో హంగులతో ఉంది. ఆదేమిటో చూడాలని దగ్గరగా వెళ్ళాం. రంగు రంగుల తాళం కప్పలు, అవును మీరు సరిగ్గానే చదివారు, అవన్నీ రంగురంగుల తాళం కప్పలు. వింతగా ఉంది కదూ! తమ ప్రేమను నిలుపుకోవడానికి ప్రేమ పావురాలు చేసిన ప్రయత్నాలవి. తాళం కప్పను మెష్ కు కట్టేసి తాళాన్ని నదిలోకి విసిరేస్తే ఆ ప్రేమ కలకాలం నిలుస్తుందట. హౌ రొమాంటిక్!  

అంతకు ముందు వస్తున్నప్పుడు దారిలో తాజ్ పాలస్ అనే రెస్టారెంట్ చూసాం. ఆ రోజు రాత్రి భోజనానికి నేరుగా అక్కడకే వెళ్ళాం. మేము అడిగినవి అన్నీ తెచ్చి పెట్టాక స్వయంగా ఆ హోటల్ ఓనరే వచ్చి భోజనం ఎలా ఉందని పలకరించారు. మోహమాటంతో చెప్పడం కాదు కానీ భోజనం నిజంగానే బావుంది. ఆ రెస్టారెంట్ పెట్టి ఇరవై ఏళ్ళయిందట. మా ఊర్లో ఏ రెస్టారెంట్ ఓనరూ గట్టిగా రెండు సంవత్సరాలు నడపడం కష్టం అనేస్తారు, మరిక్కడ ఇరవై ఏళ్ళుగా ఎలా నడుపుతున్నారో. 

ఉదయం వియన్నాలో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం హాల్స్టాట్ లో భోజనం, రాత్రి సాల్జ్బర్గ్ లో డిన్నర్. బావుంది కదూ! ఆ చల్లని రాత్రి ఈ కబుర్లే చెప్పుకుంటూ రూమ్ కు చేరాం.   

ఉదయం హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు మళ్ళీ నది దగ్గరకు వెళ్దామా అనే ఉంది. “పెదనాన్నా, మీరు కబుర్లు చెప్పి మమ్మల్ని ఊరంతా నడిపించేస్తున్నారని” పిల్లలు అనడంతో  “సరే పదండి, ఇప్పుడు బస్ ఎక్కించేస్తానని” బస్ స్టాండ్ దగ్గరకు తీసుకుని వెళ్ళారు పెదనాన్న. ఎక్కిన ఐదు నిముషాల్లోనే  బ్రిడ్జ్ దాటి నదికి అవతల వైపున దింపేసింది బస్. కోట వరకూ వెళ్ళదట. 

బస్ దిగాక ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్ళాం, ఆ ప్రాంతాన్ని అంతా  ఆల్స్టాట్ అంటారు. పన్నెండవ శతాబ్దంలో అక్కడ ట్రేడింగ్ జరిగేది, ప్రస్తుతం కూడా అంతే. అప్పట్లో వస్తు మార్పిడి జరిగేది, ఇప్పడు డబ్బు తీసుకుని వస్తువులివ్వడం జరుగుతోంది. ఆ వధిలో మోజార్ట్ ఉన్న ఇల్లు ఉంది, దాన్ని మోజార్ట్ మ్యూజియమ్ చేసారు. 

అక్కడి నుండి కోటదగ్గరకు వెళుతుంటే పెద్ద ఖాళీ స్థలం మధ్యలో ఫౌంటెన్ కనిపించాయి.  ఆ ఫౌంటెన్ ను పదిహేడవ శతాబ్దంలో కట్టారట. సెంట్రల్ యూరప్ మొత్తంలో అతి పెద్ద ఫౌంటెన్ అది.  

అది దాటి ముందుకు వెళితే కనిపించాయి ఎప్పుడో పదహారు, పదిహేడవ శతాబ్దాలలో కట్టిన ఇళ్ళు, కెథడ్రల్. ఆ ప్రాంతం మొత్తాన్ని రెసిడెంట్జ్ ప్లాజ్ అంటారు. అక్కడి నుండి దూరంగా కొండమీద హోహెన్ సాల్జ్బర్గ్ ఫోర్టెస్ కనిపిస్తోంది.   

 

ఆ కోట దగ్గరకు వెళ్ళడానికి  ఫానిక్యులర్ ఉంది. అది ప్రతి పది నిముషాలకు కోట దగ్గరకు వెళ్ళి కిందకు వస్తోంది. ఆ ఫానిక్యులర్ వెళ్తున్న రైలు పట్టాలు పదహారవ శతాబ్దంలో వేసినవి. బహుశా అంత వయసున్న రైలు పట్టాలు మరెక్కడా లేవేమో.  

Photo Courtacy; salzburg-portal.com

కోట చూద్దామని పైకి వెళ్ళిన వాళ్ళం ఆ కోట లోపలకు వెళ్ళడం కూడా మరచిపోయి ఆ ఊరి అందాన్ని అలా చూస్తూ ఉండిపోయాం. 


కోట అంటే ఏదో పాతగా ఉంటుందని అనుకున్నాం కానీ చక్కగా మ్యూజియమ్ చేసారు దాన్ని.  అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులు, ఆట బొమ్మలు, యుద్ద సామగ్రి, అన్నీ భద్రంగా ఉంచారు. కొన్ని గదులలో  వాళ్ళు ఎలా ఉండేవారో, ఏం చేసేవారో , ఏం తినేవారో అన్నీ డాక్యుమెంటరీలుగా చూపిస్తున్నారు. కోటను చూసి ఫానిక్యులర్ లో కిందకు వచ్చేసాం.

         

సాల్జ్బర్గ్ లో ఏడవ శతాబ్దం నుండీ మోనస్ట్రీ ఉంది. వారు ఉండే ప్రాంతాన్ని సెయింట్ పీటర్స్ అబీ అంటారు. అక్కడొక శ్మశానం ఉంది. సాల్జ్బర్గ్ వెళ్ళిన వారు తప్పనిసరిగా శ్మశానానికి వెళతారు, కంగారూ పడకండి చూడడానికే లెండి. ముందు శ్మశానాన్ని చూడడం ఏమిటీ, వద్దులే అనుకున్నవాళ్ళం కాస్తా ఇక్కడ వరకూ వచ్చాం కదా ఒకసారి వెళదాం అనుకున్నాం. లోపలకు వెళ్ళాక మాకక్కడ శ్మశానానికి బదులుగా అందమైన తోట కనిపించింది. ఇదేమిటి దారి కానీ తప్పామా అనుకున్నాం కానీ తప్పలేదు మేం నిలబడి దిక్కులు చూస్తూ ఉంది శ్మశానం లోనే.  


యూరప్ లో శ్మశానాలు కూడా ఇంత అందంగా ఉంటాయా అని ఆశ్చర్యపోయాం. అక్కడ మరో ఆసక్తి కరమైన విషయం కనిపించింది. సమాధి మీద ఒక పేరు కదా ఉండాలి, అలా కాక కొన్నింటి మీద దాదాపు పది పేర్ల దాకా ఉన్నాయి. అదేమిటో తెలుసుకోవాలని గూగుల్ చేసాం. ప్రతి సమాధిని పది సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలట. అయోమయంగా చూసాను, పోయిన వాళ్ళు రెన్యువల్ ఎలా చేసుకుంటారు అని. “ఊరుకో అక్కా, నువ్వు మరీనూ. వాళ్ళకు పిల్లలు ఉండరా” అన్నది మా తోటికోడలు. వాళ్ళు కట్టకపోతేనో అన్నాను, అందుకే కాబోలు ఒక్కోదాని మీద అన్ని పేర్లు అనుకున్నాం. ఇంత అందమైన శ్మశానాన్ని ఎక్కడా చూడలేదు మనం కూడా ఒక ప్లాట్ బుక్ చేసుకుందామా అని కబుర్లు చెప్పుకుంటూ అన్నీ తిరిగి చూసాం. అలా శ్మశానం మధ్యలో నిలబడి సరదా కబుర్లు చెప్పుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు.  

సెయింట్ పీటర్స్ అబీ దగ్గర నుండి వస్తుంటే దారిలో బొమ్మలు వేసేవాళ్ళు,  గిటారిస్ట్ లు కనిపించారు. 

దారిలో ఒకతను బంగారు బాల్ మీదెక్కి నిలబడి ఉన్నాడు మొహంలో ఒక బాధో సంతోషమో ఏమీ లేకుండా. అతనెందుకు అలా ఉన్నాడు? ఆ బంగారు బాల్ ఏమిటీ, అని చూస్తే జర్మన్ కళాకారుడైన స్టీఫెన్ బాల్కెన్హాల్ తయారుచేసాట్ట ఆ బంగారు గ్లోబ్ ను, దాని పైనున్న మనిషిని. ఆ మనిషిని అలా భావ రహితంగా ఎందుకు తయారు చేశాడో మరి. 

ఆ వేళ లంచ్ కు ఫిలాఫెల్ రాప్స్ తీసుకుని నది ఒడ్డునున్న చిన్న గోడ మీద కూర్చున్నాము. ఫిలాఫెల్ శనగలతో మెడిటేరియన్ వాళ్ళు వేసే వడలు, వాటిని చెపాతీలో చుట్టి కాసిని ఆకులు, సాస్ లు వేసి ఇస్తే అవే రాప్స్. అంటే మేము కూర్చున్న గోడకు దిగువగా బైక్ ట్రాక్ ఉంది. రయ్యిన పోతున్న సైకిల్స్, సైకిల్ తొట్టిలో నవ్వులు రువ్వుతున్న పిల్లల్ని చూస్తూ లంచ్ పూర్తి చేసాము.  


అప్పడే ఒక గమ్మత్తు జరిగింది. నది ఒడ్డున నీళ్ళ పక్కకు ఒక చిన్న సైజ్ టూర్ బస్ నీళ్ళ దగ్గరగా వచ్చి  ఆగింది. టూరిస్ట్ లు దిగుతారేమో అని చూస్తూ ఉన్నా౦. బస్ లోంచి ఇద్దరు చెంగున  కిందకు దూకి, బస్ కు అటూ ఇటూ రెండు మొప్పలు తొడిగారు. పాపం పిచ్చిది తనొక బస్సునని మర్చి పోయి చేపలాగా ఈదుకుంటూ నీళ్ళ లోకి వెళ్ళిపోయింది.  


అక్కడే ఉంటే మాక్కూడా ఎవరైనా మొప్పలు తగిలించేస్తారేమోనని అక్కడి నుండి వెంటనే బయలుదేరాం. మ్యూజిక్ యూనివర్సిటీ మీదుగా వెళ్ళి ఒక కఫే దగ్గర ఆగాము. అన్నట్లు మీకు చెప్పలేదు కదూ, యూరప్ లో కాఫీ ఆర్డర్ చేస్తే తప్పనిసరిగా ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇస్తారు. నీళ్ళు తాగి కాఫీ తాగితేనే కాఫీ టేస్ట్ తెలుస్తుందట. కాఫీలు కబుర్లు అయ్యాక హోటల్ కు వెళ్ళిపోయాము. 

ఆ రాత్రి మళ్ళీ నది దగ్గరకు వెళ్దామన్న నా మాటను, “స్వామీ నదికి పోలేదా” అని కామెడీ డైలాగ్ చెప్పి కొట్టి పడేశారు. అప్పటికి అందరికీ ఓపికలు అయిపోయాయి పాపం. డిన్నర్ కు హోటల్ కు దగ్గరే ఉన్న చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాము. అక్కడ పెదనాన్న చాప్ స్టిక్స్ తో ఫుడ్ ను ఎలా పట్టుకోవాలో నేర్పిస్తే పిల్లలు, అమ్మ పోటీలు పడి పెదనాన్నప్లేట్ లో చాప్ స్టిక్ తో సూషీ వడ్డించి గురు దక్షిణ ఇచ్చుకున్నారు. ఆర్డర్ చేసినవి రెస్టారెంట్ వాళ్ళు వడ్డిస్తే కబుర్లనీ, నవ్వులనూ వాటితో కలిపేసి భోజనాలు చేసేసాము.

మొదట మేము సాల్జ్బర్గ్ కు వెళ్ళాలని అనుకోలేదు. వెళ్ళకపోతే మాత్రం చాలా మిస్ అయ్యేవాళ్ళం. గలగల పారే ఆ నది, పక్కనే ఉన్న చర్చ్, ఆ కోట, ఆ సాయంత్రం అన్నీ మనసులో అలా నిలిచి పోయాయి.


తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు. 

Tuesday, November 28, 2023

హాల్ స్టాట్

ఇంతకు ముందు భాగం ఇక్కడ చదవొచ్చు. 

వియన్నా నుండి హాల్ స్టాట్ కు ఆల్ఫ్స్ పర్వతాల మీదుగా ప్రయాణం. పచ్చని పర్వతాలు వాటి మధ్యలో బొమ్మరిళ్ళలా కనిపినస్తున్న ఊర్లు, పర్వత శిఖరాలని తాకుతూ మేఘాలు, ఉండుండి పడుతున్న చిరు జల్లు, చాలా అందంగా సాగింది ప్రయాణం అంతా. 


హాల్ స్టాట్, ఆస్ట్రియాలోని ఒక చిన్న ఊరు. అక్కడ క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దం నుండీ మనుష్యులు ఉన్నట్లుగా అంచనా. ఏడువేల సంవత్సరాల నాటి సాల్ట్ మైన్స్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. యునెస్కో వార్ల్డ్ హెరిటేజ్ సైట్స్ లో హాల్ స్టాట్ కూడా ఒకటి. వియన్నా నుండి సాల్జ్ బర్గ్ కు వెళ్తూ మధ్యలో హాల్ స్టాట్ దగ్గర ఆగాలని మా ఆలోచన.

మేము హాల్ స్టాట్ చేరే సరికి దాదాపుగా ఒంటిగంట అవుతోంది. ఆ ఊర్లోకి రాగానే మొదట్లోనే మమ్మల్ని దింపేసి కార్ పార్క్ చేయడానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు డ్రైవర్. మైన్స్ దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాము కానీ తగినంత సమయం లేదు. మైన్స్ ఉన్న పర్వతం పైకి వెళ్ళడానికి మాత్రం ఫానిక్యులర్ ఉంది. ఫానిక్యులర్ అంటే బుల్లి రైలు, పట్టాల మీద పైకి కిందకూ తిరుగుతూ ఉంటుంది. టికెట్ తీసుకుని ఫానిక్యులర్ ఎక్కాము.


పైకి వెళ్ళి చూస్తే పెద్ద లేక్, చుట్టూ పర్వతాలు వాటి మధ్య నుండి వెళుతూ శిఖరాలను కమ్మేసిన తెల్లని మేఘాలు, సన్నగా పడుతున్న వానజల్లు, బొమ్మరిళ్ళలా కనిపిస్తున్న బుల్లి ఇళ్ళు. భలే నచ్చేసింది ఆ ఊరు. ఫ్రోజన్ సినిమా లోని అరెండేల్ ను హాల్ స్టాట్ చూసే డిజైన్ చేసారట. 



హాల్ స్టాట్ ను వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సెయింట్  మైకేల్ చాపెల్ కు తప్పనిసరిగా వెళతారు. ఎందుకంటే అక్కడ పెయింట్ చేసిన పుర్రెలు ఉంటాయి. నిజం,స్కల్స్ కు అలా ఎందుకు పెయింట్ వేస్తారో తెలుసా? హాల్ స్టాట్ చాలా చిన్న ఊరు, ఇళ్ళు కట్టుకోవడానికే స్థలం లేదు, ఇక శ్మశానానికి స్థలం ఎక్కడ. అందుకని ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సమాధులను తొవ్వి స్కెలిటన్స్ ను బయటకు తీసి స్కల్స్ మీద పేర్లు వ్రాసి, పెయింట్ చేసి ఆ చాపెల్ లో పెడతారు. వీటిని బోన్ హౌసెస్ అంటారు. ఇటువంటి పద్ధతి అమెరికాలో కూడా ఉంది.

      Photo Courtesy:  Beinhaus Hallstatt » Your holiday in Hallstatt / Austria

డ్రైవర్ ఎక్కడో కార్ పార్క్ చేసుకున్నాడుగా రమ్మని కాల్ చేస్తే చెప్పాడు. ఆ ఊర్లోకి కారు వెళ్ళదు ఎక్కడకు వెళ్ళాలన్నా నడుస్తూనే వెళ్ళాలని. నడవడానికి ఇబ్బంది లేదు, అయినా అది ఎంత ఊరని. కానీ ఒక్కటే సమస్య చలి, వర్షమూను, దాంతో ఎక్కడికీ వెళ్ళలేకపోయాం. 

అయితేనేం అక్కడ ఉన్నది కాసేపే అయినా ఎంతో కాలం జ్ఞాపకంగా మిగిలిపోయే అందమైన ఊరది. ఆ పూటకు ఒక చిన్న రెస్టారెంట్ వెతుక్కుని భోజనం చేసి అక్కడి నుండి  సాల్జ్బర్గ్  బయలుదేరాము.    

తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు.

Monday, November 27, 2023

వియనా

యూరప్ ప్రయాణ సన్నాహాలు మొదటి నుండి చదవాలనుకుంటే  ఇక్కడ కు వెళ్ళండి. 

ఆస్ట్రియా మధ్యయూరప్ లోని ఒక దేశము. వియనా ఆస్ట్రియా రాజధాని. ఆస్ట్రియా మొత్తం జనాభాలో మూడవ వంతు జనాభా వియనాలో ఉంటారు. వియనా నగరము, రాష్ట్రము కూడా, అక్కడ మొత్తం ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి.ఈ నగరం పాతరాతి యుగం నుండీ ఉన్నట్లుగా చరిత్ర చెపుతోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో వియనా కూడా ఒకటి.


షార్లెట్ నుండి వియన్నాకు డైరెక్ట్ ఫ్లైట్ లేదు. జూన్ రెండవ తేదీ ఉదయం బయలుదేరి, వాషింగ్టన్ డిసి లో ఫ్లైట్ మారి మూడవ తేదీ ఉదయానికి వియనాకు చేరాం. ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ వాళ్ళు మేము కంగారు పడినట్లు లాగేజ్ కొలతలు, బరువులు చూడలేదు, పాస్పోర్ట్ మాత్రం చూసి పంపించారంతే. ఈ మాత్రం దానికి ఎంత కంగారు పడ్డామో కదా. 

ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ వాళ్ళకు మర్యాదలు ఎక్కువే. ఫ్లైట్ ఎక్కిన వెంటనే స్నాక్స్, ఓ రెండు గంటల తరువాత డిన్నర్ ఇచ్చారు. బ్రేక్ ఫాస్ట్ కు మాత్రం మఫిన్ ఇచ్చారు. ఉదయాన్నే అంత తీపి తినడం మనకు కష్టం.


ఫ్లైట్ ఆగి ఆగగానే సెక్యూరిటీ చెక్ ముగించుకుని ఝామ్మంటూ బయటకు వచ్చా౦, చెకిన్ లాగేజ్ కోసం వెయిట్ చేయక్కర్లేదుగా. మా వాళ్ళు అప్పటికే వచ్చేసి మాకోసం వెయిట్ చూస్తూ ఉన్నారు. లెట్స్ బిగిన్ ద ఫన్ అనుకుంటూ బయటకు వచ్చాం. మమ్మల్ని పికప్ చేసుకుని సిటీ చూపించడానికి టాక్సీ డ్రైవర్ వచ్చాడు. అతను పాకిస్తాన్ నుండి వచ్చి వియన్నా లో సెటిల్ అయ్యాడట. “అమ్మయ్య, మేం కష్టపడి జర్మన్ ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు” అనుకున్నాం. వేన్ కూడా మాకు తగ్గట్టే ఉంది. వెనుక రెండు వరుసల సీట్స్ ఎదురెదురుగా ఉన్నాయి, ఇంట్లో హాల్ లో కూర్చున్నట్లు కూర్చుని మొదలెట్టేసాం ప్రయాణం కబుర్లు.

వేర్ టు గో ఫస్ట్ అనగానే కాఫీ అని నాలుగు గొంతులు అరిచాయి. డ్రైవర్ ను కఫే సెంట్రల్ కు తీసుకుని వెళ్ళమన్నాం. ఆ మాత్రం కాఫీ ఎయిర్ పోర్ట్ లోనే తాగొచ్చుగా అనే అనుమానం మీకు రావచ్చు. కఫే సెంట్రల్ కే వెళ్ళడానికో కారణం ఉంది. “దేర్ ఆర్ కాఫీ హౌసెస్ దేర్ ఈజ్ కాఫీ సెంట్రల్” అని వాళ్ళ వెబ్సైట్ లో ఉండడం చూసాం. అబ్బో అంత గర్వంగా రాసుకున్నారు అసలు కథే౦టో చూద్దామని వెళ్ళాం. 

ఇరవై అడుగుల ఎత్తులో సీలింగ్, పిల్లర్స్, వాల్ పేపర్, షాండలియర్స్, మార్బుల్ టాప్ టేబుల్స్, సోఫాలు, న్యూస్ పేపర్ స్టాండ్స్, ఫ్లవర్ వేజెస్ బాగానే ఉంది హడావిడి. కానీ అసలు విషయం అది కాదు ఆ కఫే వయస్సు దాదాపు నూట నలభై సంవత్సరాలు, అప్పట్లో అది కవులు, ఆర్కిటెక్ట్స్, ఫిలాంతరఫీస్ట్స్, డాక్టర్స్ కు సమావేశ స్థలం. ఆ కఫే లో అక్కడకు వచ్చే వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. సైకోఅనాలిసిస్ ఫౌండర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అక్కడకు వస్తూ ఉండేవారట. తను రాసిన “ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్” అనే పుస్తకం వలనే వియనాకు ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ అనే పేరు వచ్చింది.

కఫే సెంట్రల్ దగ్గర ఇరవై నిముషాలు వెయిట్ చేసిన తరువాత వెయిటర్ ఒక మూల యల్ షేప్ లో ఉన్న సోఫా చూపించి మెన్యూ మా ముందు పెట్టి వెళ్ళి పోయాడు. మెన్యులో కపూచినో, లాటే లతో పాటు ములాంజ్ అనే వెరైటీ కాఫీ కనిపించింది. కపూచినో కు దీనికీ తేడా ఏమిటంటే కపూచినోలో డికాషన్ పైన కాస్త పాలనురగు వేస్తారు, ములాంజ్ కు డికాషన్ పైన కాసిని వేడి పాలు పోసి దాని పైన పాల నురుగు వేస్తారు. ఎలా ఉంటుందో చూద్దామని ములాంజ్ ఆర్డర్ చేసాం. కపూచినో కంటే ఎక్కువ నచ్చేసింది.

   


    

కాఫీలు అయ్యాక కృసాంట్స్, బాయిల్డ్ ఎగ్, సూప్, కేక్స్ ఆర్డర్ చేసాం. అన్నట్లు కృసాంట్ ఎక్కడ పుట్టిందో తెలుసా, ఇంకెక్కడ ఆస్ట్రియాలోనే. ఆర్డర్ వచ్చేలోగా చుట్టూ ఉన్న వాళ్ళను గమనిస్తే అంతా రకరకాల ప్రాంతాల నుండి వచ్చినట్లున్నారు. ఎవరికీ తొందర లేనట్లు నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. మేము కూడా అదే పద్దతి ఫాలో అవుతూ కాఫీలు, కబుర్లు అయ్యాక నింపాదిగా హోటల్ కు బయలుదేరాము.  



డ్రైవర్. పార్లమెంట్, ఆప్రా హౌస్, స్పానిష్ రైడింగ్ స్కూల్ అన్నీ చూపిస్తూ తీసుకువెళ్తున్నాడు. ఆ ఊరిలో బిల్డింగ్స్ అన్నీ ఒకే ఎత్తులో ఉండాలనే రిస్ట్రిక్క్షన్ ఉన్నదట. ఒకే ఎత్తులోని ఇళ్ళతో ఆ వీధులు ముచ్చటగా ఉన్నాయి.       



కబుర్లలోనే వచ్చేసింది మా హోటల్, మెర్క్యూర్ వియన్ వెస్ట్ బాన్హాఫ్. మెట్రో స్టేషన్, షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ అక్కడకు దగ్గరలోనే ఉన్నాయి. హోటల్ లో చెకిన్ చేసి ఊరు చూడాలని బయలుదేరాం.   

ముందుగా నాష్ మార్కెట్(Naschmarkt) కు వెళ్ళాం. పదహారవ శతాబ్దంలో ప్రారంభించిన ఆ మార్కెట్  ఇప్పటికీ నడుస్తోంది. అప్పుడు మొదలెట్టారని అప్పటి వస్తువులు అమ్మడం లేదులెండి, ఇప్పటివే అమ్ముతున్నారు. హెర్బ్స్, చీజ్, బ్రెడ్, సీ ఫుడ్, పండ్లు ఒకటేమిటి అక్కడ సమస్తం దొరుకుతున్నాయి. వియన్నాలో ఇండియన్స్ బాగానే ఉన్నట్లున్నారు. ఆ మార్కెట్ లో ఇండియన్ షాప్ కూడా ఉంది. కొబ్బరి నీళ్ళు, ఆగరుబత్తీలు, మసాలా పొడులు లాంటి వన్నీ ఉన్నాయక్కడ. ఇక ఫుడ్ ఐటెమ్స్ అయితే చెప్పనే అక్కర్లేదు. సూషీ, కబాబ్స్, ఫిలాఫెల్, బకలవా, రాప్స్, నూడిల్స్ అలాఅ ఎన్నో ఫుడ్ వెరైటీలు దొరికే రెస్టరెంట్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా వస్తువు దొరకలేదు అంటే దాన్ని వాడాల్సిన అవసరమే లేదు అని అర్ధమట. అబ్బో ఎంత గర్వం అనుకున్నా౦ కానీ ఆ మార్కెట్ చూసాక వాళ్ళకా మాత్రం గర్వం ఉండడంలో తప్పులేదనిపించింది.  


 

 

ఆ మార్కెట్ లో కాసిన పండ్లూ అవీ కొనుక్కుని అక్కడి నుండి షాన్బ్రిన్ ప్యాలస్ కు వెళ్ళాం. ఆ ప్యాలస్ గురించి చెప్పుకునే ముందు హాబ్స్బర్గ్ డైనాస్టీ గురించి చెప్పుకోవాలి. 

హాబ్స్బర్గ్స్(Habsburgs) అనే జర్మన్స్ పదిహేనవ  శతాబ్దం నుండి ఇరవైయ్యొవ శతాబ్దం వరకూ యూరప్ లోని ఆస్ట్రియా, హంగేరీ, బొహేమియా, స్పైన్, నెదర్లాండ్స్, లెక్జ౦బర్గ్ ఇంకా ఎన్నో దేశాలను పరిపాలించారు. అయితే ఎంపరర్ చార్ల్స్ సిక్స్ కొడుకు చిన్నతనంలోనే చనిపోవడంతో ఇక ఆ వంశానికి వారసులు లేరు. చార్ల్స్ రాజ్యానికి వారసుడు లేకపోతే వారసురాలు అధికారం లోకి రావచ్చనే ప్రతిపాదన తెచ్చి అందరితో ఒప్పించారు. తన పెద్ద కుమార్తె అయిన  మరియా థెరిస్సాకు రాజ్యం అప్పగించాలని ఆయన కోరిక. 

పేపర్ల మీద సంతకాలైతే అయ్యాయి కానీ ఆయన చనిపోయిన వెంటనే ఆ ప్రతిపాదనకు  ఒప్పుకోమంటూ యుద్దాలు మొదలయ్యాయి. ఏడేళ్ళు పాటు జరిగిన యుద్దం తరువాత ఆర్చ్ డచ్చెస్ మరియా థెరిస్సా ఎంప్రెస్ మరియా థెరిస్సా అయ్యారు. కానీ ఆ యుద్దంలో హాబ్స్బర్గ్ కొన్ని దేశాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఖజానా ఖాళీ అయింది. ఆ విపత్కర పరిస్థితి నుండి హాబ్స్బర్గ్ సామ్రాజ్యాన్ని కాపాడి ఆవిడ నలభై సంవత్సరాల పాటు పరిపాలించారు. మరియా థెరెస్సాకు తన చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు బహుమతిగా ఇచ్చిన షాన్బ్రిన్ ప్యాలస్ (Schonbrunn Palace) నే రీమోడల్ చేయించి తన సమ్మర్ ప్యాలస్ గా చేసుకున్నారు. 

ఆవిడ మనవడు యంపరర్ ఫ్రాన్జ్ జోసెఫ్ భార్య ఎంప్రెస్ సిసిది మరో కథ. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షిని రాజరికపు పంజరంలో పెట్టినట్లు అయింది. ఆవిడ మీద సినిమా కూడా తీసారు.  

ఆ ప్యాలస్ చూడడానికి టికెట్ తో పాటు ఆడియో టూర్ కూడా తీసుకున్నాము. రిమోట్ లాంటి డివైజె ఇచ్చారు, ఆ డివైజ్ లో ఏ నంబర్ నొక్కితే ఆ  నంబర్ ఉన్న గది విశేషాలు వినొచ్చు. ఆ ప్యాలస్, చుట్టూ ఉన్న గార్డెన్స్ అన్నీ బొరాక్, రొకోకో స్టైల్ లో కట్టారు. బొరాక్ స్టైల్ లోని కట్టడాలు అన్నీ గ్రాండ్ గా ఉంటాయి. బొరాక్  స్టైల్ తరువాత యూరప్ లో పాపులర్ అయింది రొకొకో. అందమైన పెయింటింగ్స్, ఖరీదైన పెద్ద పెద్ద షాండలియర్స్,  స్తంభాల మీద బంగారంతో వేసిన డిజైన్స్ తో ప్యాలస్ అంతా చాలా అందంగా ఉన్నది. 


 

photo source: Visiting Vienna's Schönbrunn Palace: Highlights, Tips & Tours | PlanetWare

ప్యాలస్ లో పద్నాలుeగు వందల గదులున్నాయి గాని టూరిస్ట్ లు అందులో నలభై గదులు చూడొచ్చు. మేము ఇరవై గదులు చూసేసరికే సాయంత్రం అయిపోయింది. ఇక ఆ ప్యాలస్ లో గదులన్నీ తిరగాలంటే ఒక సంవత్సరం పడుతుందేమో. 

అక్కడి నుండి మా డ్రైవర్ మీకో మంచి ప్లేస్ చూపిస్తానని కాలిన్బర్గ్ మౌంటెన్ కి తీసుకెళ్ళాడు. అక్కడి నుండి చూస్తుంటే, ఊరు, ఊరి మధ్యలో నది, అక్కడక్కడా బ్రిడ్జెస్,  కొండ పైన చల్లని గాలి, బావుందా ప్లేస్.  


డ్రైవర్ మమ్మల్ని ఏడింటికి హోటల్ దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా అమెరికాలో లాగానే సమ్మర్ లో రాత్రి తొమ్మిదికి కానీ చీకటి పడదు. ఆ రాత్రి పక్కనే ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్, వాపియానో లో డిన్నర్ చేసాము. పాస్తా, పిజ్జా, సలాడ్ అన్నింటిలో మనం ఏవి వేయమంటే అవి వేసి చేసి ఇచ్చారు.   

ప్రతి హోటల్ కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.  ఆ హోటల్  లో కొత్తగా అనిపించినవి జర్మన్ లో రాసిన ఐటం నేమ్స్, సలాడ్స్ ను బాటిల్స్ లో పెట్టడం.


బ్రేక్ ఫాస్ట్ అయ్యాక దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కు వెళ్ళాం. అక్కడ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ కనిపించింది. అది ఊర్లో అన్ని దగ్గర్లా ఆగకుండా అట్రాక్షన్స్ దగ్గర మాత్రమే ఆగుతుంది, బస్ పాస్ తీసుకుంటే రోజు మొత్తంలో ఎన్నిసార్లయినా ఎక్కొచ్చు. పాస్ తీసుకుని డబుల్ డెకర్ బస్ లో పైకి వెళ్ళి కూర్చున్నాము. ప్రతి సీట్ కు హెడ్ ఫోన్స్ ఉన్నాయి  అవి పెట్టుకుంటే రూట్ కామెంటరీ వినిపించాలి కానీ మా హెడ్ ఫోన్స్ లో ఏ శబ్దమూ రాలేదు. 

ముందు రోజు షాన్బ్రిన్  ప్యాలస్ చూసా౦ కానీ గార్డెన్ చూడలేదగా, అందుకని ముందు అక్కడకే వెళ్ళాం. ఆ  ప్యాలస్, గార్డెన్ మొత్తం నాలుగు వందల ఎకరాలు ఉంటుంది. కనిపించినంత మేరా ఎటువైపు చూసినా వరుసగా పొడుగాటి చెట్లు, మధ్యలో దారి, దూరంగా ఫౌంటెన్ లు, ఎంతో అందంగా ఉందా గార్డెన్. మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా చల్లగా ఉంది ఆ ప్రాంతం అంతా.      



వింటర్ లో చలికి తట్టుకోలేని మొక్కలను లోపల పెట్టడానికి ఆ గార్డెన్ లో ఆరంజరీ ఉంది. దానిని కేవలం మొక్కలు పెట్టడానికే కాక కాన్సర్ట్స్ కు, సోషల్ గేదరింగ్స్ లాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. యూరప్ లో పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఇలా గార్డెన్లో ఆరంజరీ ఉండడం ఒక స్టేటస్ సింబల్. షాన్బ్రిన్  ఆరంజరీలో సినిమా, టీవి షోస్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. 

అన్నట్లు మీకు చెప్పలేదు కదూ. వియనాకు మరో పేరు కూడా ఉంది ‘సిటీ ఆఫ్ మ్యూజిక్‘ అని. ఎందుకో తెలుసా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్ మోజార్ట్, బీథోవెన్ లు వియానాలోనే ఉండేవారు, అక్కడ తరచుగా మ్యూజిక్ కాన్సర్ట్స్, బాల్ డాన్సెస్ జరుగుతూ ఉండడం ఈ రెండూ కారణాలు.  ఆ గార్డెన్ చూసాక అక్కడినుండి హిస్టారిక్ సిటీ సెంటర్ కు వచ్చాము. ఆర్టిస్టిక్ బిల్డింగ్స్, వాటి మధ్య వీధుల్లో అక్కడక్కడా రెస్టారెంట్ వాళ్ళు వేసిన టేబుల్స్, అక్కడ కూర్చున్న లంచ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్న కస్టమర్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. బహుశా పరుగులు లేని ప్రశాంతమైన వాతావరణం వల్లనేమో.  

లంచ్ అయ్యాక పిల్లలు, పెదనాన్న ఆల్బర్టినా మొడర్న్ ఆర్ట్ మ్యూజియంకు వెళ్ళారు.  అప్పటి వరకూ అన్నీ పాతవే చూసాంగా, కాస్త కొత్తగా ఏమైనా చూడాలని అనుకున్నారేమో! 

సాయంత్రం ఆరవుతుండగా ప్రాటర్ అమ్యూజ్ మెంట్ పార్క్ కు వెళదామని బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళామా, హాప్ ఆన్ హాప్ ఆఫ్ వాళ్ళు మేం బస్ లు సాయంత్రం ఆరు దాకే నడుపుతాం అనేసారు. అదేమిటి రోజు మొత్తం తిరగాలని కదా డే పాస్ తీసుకున్నాం,  ఆరింటికే ఆపడం ఏమిటి అనుకుని వాళ్ళను కనుక్కుంటే తెలిసింది. యూరప్ లో మన లాగా రాత్రి పగలూ పని చేయరని. ఇక చేసేదేముంది ట్రామ్ ఎక్కి ప్రాటర్ పార్క్ దగ్గర దిగాము. ఇంతకూ ఆ అమ్యూజ్ మెంట్ పార్క్ లో ఏముందో మీకు చెప్పలేదు కదూ! 

వీనారీసన్రాడ్, పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభించిన ఫెర్రిస్ వీల్, అది ఇప్పటికీ నడుస్తూ ఉంది. పార్క్ దగ్గర బస్ దిగి అమ్యూజ్ మెంట్ పార్క్ వైపుకు నడవడం మొదలు పెట్టాం. చాలా పెద్ద పార్క్ అది, పిల్లలు, పెద్దవాళ్లు అంతా బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఒక అరగంట నడిస్తే వచ్చింది, ప్రాటర్ అమ్యూజ్ మెంట్ పార్క్. ఆ ఫెర్రీస్ వీల్ ఎక్కి సిటీని చూడడం బావుంది.     





అక్కడి నుండి బయటకు వచ్చేసరికి దాదాపుగా ఎనిమిదవుతోంది. దగ్గరలోనే ఉన్న జపనీస్ ఫాస్ట్ ఫుడ్ రెస్టరెంట్ లో డిన్నర్ చేసాము. సూషీ చేయడం రాక అలా చుట్టారో లేదా కొత్తగా ఉండాలని అనుకున్నారో కానీ ఆ చుట్టడం వెరైటీగా ఉంది. డిన్నర్ అయ్యాక ట్రామ్ లోనే తిరిగి హోటల్ కు వెళ్ళాము. 


ఆ కొత్త దేశంలో వెళ్ళాలని అనిపించిన దగ్గరకల్లా వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ బాగా ఉపయోగపడ్డాయి. కలసి కబుర్లు చెప్పుకుంటూ నింపాదిగా ఊరు చూడడం మా అందరికీ నచ్చేసింది. మాకున్న రెండు రోజుల్లో టైమ్ ని కొంచెం అటూ ఇటూ సర్దితే ఓప్రా హౌస్, స్పానిష్ స్కూల్, హబ్స్బర్గ్ ప్యాలస్, ఎంప్రెస్ సిసీ మ్యూజియమ్ లాంటివేవో చూసి ఉండే వాళ్ళం. కానీ తరువాతెప్పుడో మా వియాన్నా ప్రయాణాన్ని తలచుకుంటే టైమ్ ని అలా ఇలా సర్దడమే గుర్తుంటుంది కాని వెళ్ళిన ప్లేసెస్ కాదు. మాకిలాగే బావుంది. 

తరువాత రోజు ఉదయం హోటల్లో  బ్రేక్ ఫాస్ట్ చేసి ముందుగా బుక్ చేసుకున్న వ్యాన్ లో కు బయలుదేరాము. 

తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు.