Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Thursday, April 30, 2020

కౌముది పత్రికలో నా కవిత 'పరీక్ష'

'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రికలో నాకవిత 'పరీక్ష' ప్రచురితమైంది. 

ఈ కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.



Thursday, February 14, 2013

నీకో అరుదైన బహుమానం ఇవ్వాలని....


కొమ్మపై ఊయలలూగే కోయిలమ్మ నడిగాను 
నీ పిలుపుకన్నా మధురమైన పాటేదీ లేదన్నది! 

మాపటేళ మరులు గొలిపు మరుమల్లియ నడిగాను 
నీ స్పర్శకు మించిన లాలిత్యం తనకేదన్నది! 

తోటలన్నీ తిరిగాను! చెట్టు చెట్టునూ వెతికాను 
నీ మనసుకన్నా అందమైన సుమమేదీ లేదన్నవి ! 

నీరెండ జల్లుల్లో విరిసే ఇంద్రధనస్సు నడిగాను 
నీ నవ్వుకు సరితూగే వర్ణం తన దరి లేదన్నది! 

నిశీధి వీధుల్లో మెరిసే చుక్కని కలిశాను 
నీ కళ్ళలోని కాంతిముందు తన మెరుపేపాటిదన్నది! 

శ్రావ్యమైన పాట కోసం రాగాలను సాయమడిగాను, 
నీ అనురాగానికి మించిన రాగమేదీ లేవన్నవి! 

మదిలోని భావనను కవితను చేసి కానుకివ్వాలనుకున్నాను 
నీ ప్రేమకు సరితూగే భాషలేదని తెలుసుకున్నాను! 

నిండు మనసు తప్ప వేరేమీ ఇవ్వలేని పేదరాలిని 
రిక్తహస్తాలతో నీ ఎదుట నిలిచాను! 

నీ కౌగిలి చేరిన మరుక్షణ౦ రాణినయ్యాను! 
సామ్రాజ్ఞినయ్యాను!! 


Wednesday, July 4, 2012

కౌముదిలో నా కవిత 'ప్రతిఫలం'

నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ప్రతిఫలం 


సందె మబ్బులు
చీకటి మాటుకు తప్పుకుంటున్నై!
వేచియున్న కలువపై
వెన్నెల పరచుకుంటోంది!

మదిలో ఏ మూలో...
నిశ్శబ్దపు ఒంటరి రాత్రి
జ్ఞాపకాల దొంతర కదిలిన చప్పుడు!

అప్పుడెప్పుడో...
'నీకేం కావాలని' కదూ అడిగావ్!
ఏం అడగాలో ...
ఎలా చెప్పాలో... తెలియని రోజులు
ఒక్క నవ్వు నవ్వేసి ఊరుకున్నా!

ఆ తరువాతెప్పుడో ...
'ఏం తెచ్చానో చూడమ'న్నావ్,
మూసిన గుప్పెట్లో విరిసిన మల్లెలు!

వెన్నెల విహారాలు...
జాజిపూల పరిమళాలు!
వలపు సయ్యాటలు...
సరసాల సరాగాలు!

మోయలేని భారంతో...
మనసు కృంగిన రోజు
కొండంత ఓదార్పైనావు!

అనుభవాలు
పాఠాలయ్యాయి!
జీవితం గోదారి పాయలా
నిండుగా సాగిపోతుంది!

అప్పటి నీ ప్రశ్నకు,
ఇప్పటి నా సమాధానం
అదే చిరునవ్వు!

కాలంతో పాటు కలసిపోనీక
నువ్వు కాపాడిన
'నా నవ్వు'కు
ప్రతిఫలంగా నీకు నేనేమివ్వగలను?


Thursday, May 3, 2012

కౌముదిలో నా కవిత 'వెఱ్ఱి ఆశ '

నా కవిత 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'మే' సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

           వెఱ్ఱి ఆశ 

అయినా అంత తొందరేంటి నీకు?
కలిసెళ్దాం అనుకున్నాం కదా!
నువ్వొక్కదానివే అలా వెళ్లిపోవడమేనా?

ఎవరేమైతే నీకేం? ఎవరెలాపోతేనేం?
అరె....వెళ్లేముందు కనీసం ఓ మాట...

అయినా ఏ రోజు నువ్వు నా మాట విన్నావు కనుక!
నా కోసం వేచి వుండకన్నానా ...
రాత్రవనీ, అపరాత్రవనీ,
నేనొచ్చేదాకా కళ్ళు వాకిటనే!
తిండీ లేదూ ...నిద్రా లేదూ....

అసలు నువ్వెంత గడుసుదానివంటే...
నా ఇష్టాలేంటో తెలుసుకున్నావు కాని,
కనీసం ఒక్కసారైనా, నీకు నచ్చేవే౦టో చెప్పావా?
నన్ను పసివాడిగా మార్చి ఏమి తెలియకుండా చేశావ్!

నీ కెంత స్వార్ధం లేకపోతే...
సంతోషాన్నంతా మూట కట్టుకుని,
విషాదాన్ని విరజిమ్మివెళ్తావ్ ?

నాకేనా పౌరుషం లేనిది?
నీ తలపులన్నీ ఈ పూటే తుడిచేస్తా....

అదేంటో.... చెరిపేస్తున్నకొద్దీ కనిపిస్తూనే వున్నయ్
ఊట బావిలో నీరులా....
అవి కూడా నీ అంతే మొండివి మరి!

నీ ఉనికితో నా మనసంతా వెల్లవేసినట్టున్నావ్
ఏ వైపు చూసినా నీ రూపమే!

నువ్వు మొన్న కట్టిన పచ్చ చీర
జ్ఞాపకాల అలల్ని రేపుతోంది!

నువ్వు నాటిన మల్లెమొక్క
నిను గానక... బిక్క మొహం వేసింది!

నా సంతోషానికి అవసరమైన మందేదో
చెప్పడం మరిచిపోయావ్,
ఎదుటనున్న కాలం అంతా....
నీ తలపులు మోస్తూ బ్రతకమన్నావా!

తిట్టానని కోపగించుకుని రాకుండా వుండకేం!
మరుజన్మలోనైనా... నన్ను కలుస్తావని వెఱ్ఱి ఆశ!!

Tuesday, April 10, 2012

సంబరం అంబరమైన వేళ

      ఇది నిజమా..నిజంగానేనా, నిజంగా నేనేనా...ఏమిటో కొత్తకొత్తగా... వింతగా... కొండంత ఆనంద౦, ఒకింత ఆశ్చర్యంతో కలసి ఈ చిన్న మదిలో సందడి చేస్తోంది..

     ఈ ఆకాశం ఇంత నీలంగా, నిర్మలంగా ఉందేవిటి...వెండి మబ్బులు ముసిముసి నవ్వులు రువ్వుతూ వెళుతున్నట్లుగా లేవూ...చల్లగాలి మరింత హాయిగా వీస్తోంది. రోజూ చూసే ఈ మందారం ఇవాళ మరింత అందంగా పూసిందే...ఆ రావి చెట్టు ఆకులన్నీ వింత నాట్యం చేస్తున్నట్లుగా ఎలా ఊగుతున్నాయో...గోడమీద కాలెండర్ మీదన్న బోసినవ్వుల పసి పాపలను చూస్తోంటే కలిగిన పరవశం, మది దాటి అంబరాన ఇంద్రధనస్సై మెరిసింది.

     ఆ నాటి ఆ ఆనందం విహంగమై ఎగురి విహ౦గలో వాలింది.

నా కవిత ప్రచురించిన విహంగ సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.



మధురమైన సంగతేదో
ఎదనుచేరి మురిసింది!
ఎన్నడూ ఎరుగనిది
ఏమిటో ఈ భావం!
నన్ను నాకే కొత్తగ చూపే
ఓ వింత యోగం!

నీటిని తనలో నింపుకున్న
నీలిమేఘపు పరవశమా!

చినుకు బరువును మోసే వేళ
ముత్తెపుచిప్ప తన్మయమా!
అంకురాన్ని దాచుకున్న
తొలిబీజపు మైమరుపా!

కొత్త చివురులు తొడుగుతున్న
హరిద్రువపు పులకి౦తా!

మది దాగని భావమొకటి
పెదవిన పువ్వై విరిసింది!

ఒడినిండే సంబరమేదో
అ౦బరమై నిలిచింది!!



Tuesday, January 24, 2012

ఓ కన్నీటి బిందువు

ఎద వ్యధగా మసలిన వేళ
రెప్పల మాటున ఒదిగి౦ది!

మనసు భారమై వగచే వేళ
ఓదార్పై నిలిచింది!

చీకటి నిండిన ఏకాంతంలొ
వాగై వరదై పొంగింది!

మబ్బులు వీడిన మరునిముషాన
ఆనవాలే లేక అదృశ్యమైంది !!




Wednesday, January 11, 2012

హారం పత్రిక 'సరాగ' లో నా కవిత

      హారం పత్రిక నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో నా కవితకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా హారం పత్రిక సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుకు౦టున్నాను. హారం పత్రిక 'సరాగ' ను ఇక్కడ చూడొచ్చు.

చుక్క పొడిచే వేళకైనా...

మంచుతెరను తొలగించుకొని 
భూమిని తాకిందో రవికిరణం!
ఆనందంతో జంటపక్షులు
ప్రభాతగీతం పాడుతున్నాయి! 
రోజులానే!!

నిదురలేచిన నందివర్ధనం 
మనోహరంగా నవ్వుతోంది! 
రెక్కవిచ్చిన మందార౦
సిగ్గురంగును పులుముకుంది! 
ఎప్పట్లానే!!

ఎండవేళ ఆవు, దూడకు
వేపచెట్టు గొడుగయ్యింది!
కొమ్మ మీది కోయిలమ్మ
కొత్త రాగం అందుకుంది!
నిన్నటిలానే!!

పెరటిలోని తులసికోట
దిగులేదో పెట్టుకుంది!
పోయ్యిలోని పిల్లికూన
పక్కకైనా జరగనంది!

చెండులోని మల్లెమొగ్గ 
పరిమళాలు పంచకుంది! 
వీధి గడప ఎవరికోసమో
తొంగి తొంగి చూస్తోంది!

చుక్కపొడిచే వేళకైనా
తలుపు చప్పుడవుతుందా!!

Tuesday, January 3, 2012

కౌముదిలో నా కవిత 'ప్రయాణం'

ఉన్న వూరిని కన్న వాళ్ళని చూసి ఎన్నేళ్లయిందో..
ఉరుకులు పరుగుల నుంచి కాస్తంత ఆటవిడుపు!

కనుచూపు మేరలో ప్రయాణం...
అంగళ్లన్నీ తిరిగి... అవీ ఇవీ పోగేశా౦
అటకమీంచి దుమ్ముదులిపి...పెట్టెలేమో సర్దేశా౦!

ఇంకెంత చుక్క పొడిచే లోపే ఊరు చేరిపోతాం..
అయినవాళ్ళ సందిట్లో వేగిరం వాలిపోతాం!

మురిపాలు, ముచ్చట్లు, కౌగిలింతలు, పలకరింపులు..
పేరు పేరునా పలకరించి... కానుకలేవో ఇచ్చేశాం!

తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న
మనకోసమే వేచి వున్నారు మరి!

అదిగదిగో బట్టల దుకాణం, ఆ వైపునేమో సూపర్ బజారు,
ఈ పక్కనే నగల కొట్టు, అటు మూలన బోటిక్కు!

తిరిగేశాం...చూశాశాం ...దొరికినవన్నీ కొనేశాం
అవసరముందో లేదో...అక్కడివన్నీ దొరకవుగా!

హడావిడంతా విచ్చు రూపాయలదే...
ఉన్నచోట ఉండక ఒకటే పరుగులు!

ఆవకాయ, నిమ్మకాయ, మాగాయ, వుసిరి,
సోలెడు పసుపు, తవ్వెడు కారం....
పట్టేసాం..దంచేసాం..మూటలన్నీ కట్టేశా౦!

ఇంకెంత పొద్దు వాలే లోగానే..
తట్ట, బుట్ట, పెట్టె, బేడా
నట్టింట చేరినయ్!

అర్ధరాత్రి జేట్లాగ్ భాగ్యంతో..
ఒంటరిగా కూర్చుని తలచుకుంటే..
ఏవీ కన్నవాళ్ళతో గడిపిన నాలుగు క్షణాలు!
ఈ హడావిడిలో విశ్రాంతి ఏ మూల నక్కిందో మరి!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'జనవరి 'సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.




Thursday, December 29, 2011

ప్రయాణం

అటక మీద పెట్టెలన్నీ
నట్టింటికి చేరాయి!

పయనమయ్యే వస్తువులేవో
పెట్టెలోన కూర్చున్నాయి!

అలసి సొలసిన ఇస్త్రీపెట్టె
పగటి నిద్రకు జోగుతోంది!

గోడుకున్న కిటికీలన్నీ
తెరల మాటున తప్పుకున్నాయి!

అరలోని తాళం కప్ప
తలుపు గడియను చేరింది!

ఒంటరియైన ఇల్లు మాత్రం
దిగులు మొహం వేసుకుంది!!

Wednesday, November 30, 2011

కౌముదిలో నా కవిత 'నిర్వేదం'

చెట్టు మీద పిట్ట ఒకటి జాలిగా చూసింది
ఒంటరి నక్షత్రం బాధగా నిట్టూర్చింది!

ఆనవాలు లేని అలజడేదో...
తొంగి తొంగి చూస్తోంది!

ముక్కలైన రోజులన్నీ...
చీకటి మాటున మెసలుతున్నై!

నిన్న మానిన గాయం
కొత్త మందును కోరుతోంది!

మరచిపోయిన సంగతేదో...
దిగులుకు తోడై వచ్చింది!

అంతులేని విషాదానికి
పాత చిరునామా దొరికింది !

నిలకడలేని ఆలోచన
అంధకారాన్ని ఆశ్రయమడిగింది!

రాలిపోయే ఉల్కను చూసి
ఎగిసే అల విరిగి౦ది!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'డిసెంబర్ 'సంచికలో ప్రచురితమైంది. నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

Tuesday, November 15, 2011

ఆఖరి మజిలీ

మెంతిగింజ ఆవగింజతో
అవహేళనగా అన్నది
నా రంగు నీకేదని!

దనియం జీలకర్రతో
బడాయికి పోయింది
నా అందం నీకు లేదని!

మిరియ౦ లవంగంతో
బీరాలు పలికింది
నా ఘాటు నీకేదని!

వెల్లుల్లి ఉల్లితో
పుల్లవిరుపుగా అన్నది
నీకన్నా నేనెంతో నాజూకని!

కారంతో పసుపు
గుసగుసలాడింది
రూపంలో తామొక్కటేనని!

పొయ్యిమీద కూర
ఫక్కున నవ్వింది
ఎవరెన్ని పలికినా
చివరికి కలిసేది నాలోనేగా అని!!

మూర్తిగారి సలహా ననుసరించి కవిత పేరు మార్చడం జరిగింది. తమ అమూల్యమైన సలహా ఇచ్చినందుకు మూర్తిగారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

Sunday, November 6, 2011

ఎవరు నీవూ...నీ రూపమేది

ముసురు కమ్మిన వేదనలో
ప్రభవి౦చే రవి కిరణం!

విజయోత్సాహపు అంబరంలో
తేలిపోయే తెలి మబ్బు తునక!

సంక్లిష్ట సమస్యల సంశయంలో
సప్తవర్ణాల ఇంద్రధనస్సు!

దిక్కు తోచని అమావాస నిశిలో
వెలిగే చిరుతారక!

జీవితపు అలల కల్లోలంలో
నావను నడిపే చుక్కాని!

యోజనాల దూరల్లో వున్నా
నీలి మేఘానికి నీటి ముత్యానికి
నడుమనున్నదే స్నేహం!!


ఎంత దూరాన ఉన్నా ఎన్నో సందర్భాలలో నా తోడుగా నిలిచి నన్ను ముందుకు నడిపించిన స్నేహానికి ఓ స్మృతి హారం.


Friday, November 4, 2011

గువ్వ ..గోరింక

మునిమాపు వేళల్లో
సంధ్యాకాంత సింగారాలు!

వినువీధుల అరుణిమల్లో
విహంగాల విహారాలు!

వడగాల్పుల వేడిమిలో
పిల్లతెమ్మెరల వింజామరలు!

విరజాజుల జావళిలో
మొగ్గవిచ్చు మల్లియలు!

వేచియున్న వాకిటిలో
చిరపరిచిత పదసవ్వడులు!

గాజుల సడి నేపధ్యంలో
కడకొంగుతో మంతనాలు!

ఎదను మీటిన వలపుల్లో
చిలిపితనపు చిరునగవులు!!

Monday, October 31, 2011

ఆశావాదం

బీటలు వారిన నేలపై
స్వాతి చినుకుల సంబరం!

మోడువారిన మానుపై
చివురాకుల కలకలం!

వసివాడిన పసిమొగ్గ
వికసిస్తున్న పరిమళం!

ఒ౦టరియైన నింగికి 
నెలవంక స్నేహితం!

ముసురేసిన మబ్బును దాటి
దూసుకు వస్తున్న రవికిరణం!

భారమైన బ్రతుకునకు
ఆలంబన ఆశావాదం!! 



Friday, October 21, 2011

సహజీవనం

ఓ చూపు స్నేహంగా నవ్వింది
బిడియం రెప్పల పరదా వేసింది!

ఉత్తరం కుశలమడిగింది
సంశయం సమాధానమిచ్చింది!

మానసం మధుకరమై మసలింది
సేనము ప్రసూనమై విరిసింది!

సఖునికి సంవాసము సమకూరింది
చెలువ చెంతకు చేరింది!

సహవాసం సరిగమలు పలికించింది
సంసారం సౌహిత్యంగా సాగింది!!

Thursday, October 20, 2011

ఓ చిన్ని వ్యాఖ్య

అనుకోని వేళల్లో
అదాటుగా ఎదురౌతుంది!

చూపులతోనే
చిరునవ్వులు పూయిస్తుంది!

అంతరంగాన్ని
నూతనోత్సాహంతో ని౦పేస్తు౦ది!

ఓ అనుభూతిని
బహుమతిగా ఇస్తుంది!

వెన్నుతట్టి
మున్ముందుకు నడిపిస్తుంది!!


Tuesday, October 18, 2011

సంకల్ప౦

ఓ చిన్న విత్తనం
చివురులు తొడిగి...

మొక్కై ఎదిగి
మానై నిలిచింది!

శిఖరాగ్రాన్ని చూస్తూ
ఆసక్తి ఆసరాగా..
ఏకాగ్రత తోడుగా...

ఒక్కో మెట్టూ ఎక్కుతూ..
గమ్యం చేరిననాడు!

అంబరాన్నంటే  ఆనందం
సాగరమంత  సంబరం!

ఈ పయనంలో
దొరికిన ఒక్కో అనుభవం
ఓ అనుభూతికి తార్కాణం!!


Thursday, October 13, 2011

మధురభావం

చూపులు కలసిన శుభవేళ
కలసిన మనసుల ఆనందహేల!

కలబోసుకున్న కబుర్లు
నవజీవన  సోపానాలు!

ఉత్సాహం ఉరకలు వేసింది
ఉల్లాసం పరుగులు తీసింది!

నీవే నేనను మధురభావం
ఇరు హృదయాలకి  ప్రణయవేదం !

పరిచయం చిరునామా మార్చుకుంది
ఒంటరితనం జంటను చేరుకుంది!!

Tuesday, October 11, 2011

మది పలికిన మోహన రాగం...

మొన్నటి ఓ క్షణం..
గమనాన్ని మరచింది!

తలచిన అనునిత్యం ..
నవరాగం వినిపించింది!

మోయలేని భావమేదో..
అరుణిమయై విరిసింది!

మది పలికిన మోహన రాగం...
సమ్మోహన గీతమైంది!!

Sunday, October 2, 2011

పూలు గుసగుసలాడేనని...


చిలిపిగ తొంగి చూస్తోంది
దాగని చిరునవ్వొకటి!

పువ్వూ అందమే, ముల్లూ అందమే
గరికా అందమే, విరిగిన కొమ్మా అందమే!

నేల నొదిలి, నింగి కెగరి
చుక్కల లోకంలో, వెన్నెల తీరంలో!

తనువు మరచి, తరుణం మరచి
నన్ను నేనే మరచి!

చెంగున లేడిలా గంతులేయాలని
చేప పిల్లలా ఈదులాడాలని!

అణువణువున ఉత్సాహం
మానసాన  ఆనందతాండవం!!