Wednesday, December 23, 2015

తుది మజిలీ

"ఏమైనా అయన అలా చేసి ఉండకూడదు."
"ఎవరూ?"
"రంగనాథ్ గారు...ఆత్మహత్య పాపం కదా?"
"ఆత్మహత్య-పిరికితనం, ప్రాణ త్యాగం-పౌరుషం, సజీవ సమాధి-పరిపూర్ణత్వం అంటూ మరణం పట్ల ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం విన్నావుగా"
"వింటే..."
"అంతా అనుభవించేశాను ఇంకేమిటీ జీవితం అని రాధాకృష్ణ గారితో ఇంటర్యూలో కూడా  చెప్పారు."
"అదంతా ఏం కాదులే... పిల్లలు చూడలేదట, అస్సలు ఆయన దగ్గరకు రానే రారట, ఒంటరిగా ఉండడంతో ఆయనకు డిప్రషన్ అట. వృద్దాప్యంలో తండ్రిని పట్టించుకోక పోవడం ఎంత దారుణం!"
"అట, అట, అట... ఆ మాటలలో నిజమేమిటో మనకు తెలుసా? అసలు తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?"
"ఏమిటంటే కళాకారుల జీవితం నలుగురికీ సంబంధించిందీనూ! అయనంటే నాకు గొప్ప అభిమానం"
"అవునా!"
"నమ్మవా? "
"నమ్మాన్లే ...నువ్వు మాట్లాడుతున్నవన్నీ వింటున్నాగా! అభిమానం చూపించే పద్ధతి ఇదే కాబోలు."
"అంత నిష్టూరమేం! తెలుసుకోవాలనుకోవడం తప్పా?"
"మీ ఇంటి విషయాలు నువ్వు ప్రపంచమంతా చాటుకోవాలనుకుంటావా?"
"అదీ ఇదీ ఒకటేనా?"
"కానే కాదు. ముఖ్యంగా తండ్రి చనిపోయిన కొన్ని గంటలలో జరిగిందేమిటో కూడా పూర్తిగా జీర్ణించుకోలేని అయోమయంలో ఇష్టం లేకపోయినా నలుగురి ఎదుట మాట్లాడవలసిన పరిస్థితి ఉంది చూశావూ... అది మనలాంటి వాళ్ళకెలా తెలుస్తుంది..."

"......"
"......."

"అయన ఎంత మంచి కవితలు రాశారు..."
"నిజమే"
"అలాంటి తండ్రి కడుపున బుట్టి అలా ప్రవర్తించడం తప్పు కదూ!"
"అవును... నేనూ నమ్మలేక పోతున్నాను."
"చూశావా, చివరకు ఒప్పుకున్నావ్"
"ఓ వ్యక్తిని అభిమానిస్తూ ఆ పెంపకంలో పెరిగిన వారి గురించి నువ్విలా ఆలోచించగలుగుతున్నావంటే, ఆయన మాటల మీద, వ్యక్తిత్వం మీద నీకు విశ్వాసం లేదన్న మాటేగా!"

"...."

"ఒక్క విషయం ఆలోచించు. తల్లిలేని లోటు వయసుతో సంబంధం లేనిది. తండ్రి కూడా అర్ధాంతరంగా దూరమయిన క్షణాలలో వారి మానసిక స్థితి ఎలా ఉంటుందోనన్న విషయం మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది. సానుభూతి చూపించి సహానుభూతిని అందించాల్సిన సమయంలో అపోహలు, అనుమానాలను వ్యక్తం చేయడం భావ్యమా? ఒక కళాకారుడిగా ఆ అక్షరశిల్పి సమాజానికి అందించిన సేవలకు ప్రతిఫలంగా ఆయన పోయిన తరువాత ఆ కుటుంబాన్ని ఒక ముద్దాయిగా నిలబెడుతున్న మన సంస్కారాన్ని ఏమనాలి? "




"అన్నీ తెలిసిన మనిషి కూడా బలహీన క్షణాలకు లొంగిపోవడం..."
"బలహీనక్షణాలో... బలమైన వైరాగ్యమో నిర్ణయించడానికి మనమెవరం?"

"ఎవరు  ఏ దారి వెంబడి వచ్చారో, పూల బాసలే విన్నారో,  ముళ్ళ కంపలు తొలగించడానికి  వారికి యుద్దాలే చేయవలసి వచ్చిందో ఎవరికి తెలుసు? తుది మజిలీ ఏమిటో ఎవరం ఊహించగలం?"


రంగనాథ్ గారికి అశ్రునయనాలతో నివాళి.

Thursday, December 3, 2015

పదుగురాడిన మాట

        ఉదయం మెలుకువ రాగానే రాత్రి పడుకునేదాకా స్వారీ చేసిన ఆలోచన చటుక్కున తిరిగొచ్చింది. దాన్ని వదిలించుకోవడం ఎంతైనా అవసరం. లేకపోతే ఓ రోజుని స్వాహా చేసేస్తుంది, అసలే ఆలోచనకు ఆకలెక్కువ.

       ఇలా పడుకుంటే కుదిరేలా లేదు, లేచి కిటికీ తెరలు తొలిగించాను. సూరీడు చలికి బద్దకించాడో ఏమిటో ఇంకా చీకటి చిక్కగానే ఉంది. ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు గాని, మనస్సును అదుపులో పెట్టాలంటే ఏదో ఒక పనిచేయాలి. వంట గది వైపుగా అడుగులు వేశాను. ఫ్రిడ్జ్ లో నండి కూరగాయలు తీసి ముక్కలు తరిగి వంట మొదలెట్టాను. అలవాటుగా చేతులు పనిచేస్తున్నా ఆలోచన మాత్రం వదలట్లేదు. ఏమిటో అంత దీర్ఘాలోచన అనుకుంటున్నారా! మనుష్యులు... మనస్థత్వాలు. ఎప్పటికీ అర్ధం కాని అంశం కదూ ఇది!

      చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఒక బీద బ్రాహ్మణుడు మేక పిల్లని భుజాన వేసుకు వెళ్తుంటాడు. ఆ దారిలో వెళ్తున్న దొంగలు నలుగురికి ఆ మేకను ఎలాగైనా స్వంతం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. దానితో వారు ఒకరి తరువాత ఒకరు ఆ బ్రాహ్మణుడికి ఎదురు పడి "ఏమయ్యా కుక్కను భుజాన వేసుకుని వెళ్తున్నావు" అని అడుగుతారు. మొదట అది మేకే అని చెప్పిన బ్రాహ్మణుడు నలుగురూ ఒకే మాట చెప్పడంతో అది కుక్కే అన్న అభిప్రాయానికి వచ్చి దాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. "పదుగురాడిన మాట పాటియై ధరజెల్లు ఒక్కడాడు మాట ఎక్కదు ఎందు" అని వేమన గారన్నారు. పై రెండింటి సారాంశం కూడా ఒక్కటే, పది మందీ ఏమంటే అదే చెల్లుతుంది అని. 

      ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆనాడు మంచో చెడో పది మందీ ఓ మాట చెప్పేవారు. వినడం వినకపోవడం ఎదుటి వారి గుణగణాల్ని బట్టి ఉంటుందనుకోండి. అది వేరే విషయం. కాని ఈ నాడు అసలు మాట చెప్పడమే మానేశారు. ఎందుకనీ అంటారా? అదిగో అదే నా ఆలోచన. 

      జరుగబోయే అనర్ధాలు తెలిసి కూడా ఇవన్నీ మనకెందుకులే మనకిప్పుడేమీ నష్టం జరగడం లేదుగా అనే అలసత్వం కావచ్చు. లేదా "ఇలా ఆలోచించడం తప్పు, ఇలా చెయ్యకూడదు, ఒక్క ఆలోచన వల్ల వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది, తద్వారా నష్టపోయేది మనమే" అన్న విషయం నిక్కచ్చిగా చెప్తే స్నేహితునికో, ఒక వర్గానికో దూరమౌతామన్న స్వార్ధపూరితమైన మొహమాటం కావచ్చు. ఇలాంటి మొహమాటానికి పోయే కదా దుర్యోధనుడి అధర్మమైన కోరికకు మద్దతునిచ్చి కర్ణుడు కురువంశ పతనానికి పరోక్షంగా కారణమయ్యాడు. 

      ఎదురుగా ఎన్నెన్నో ఘోరాలు జరుగుతుంటాయి అవన్నీ పెద్ద పెద్ద అవాంతరాలు తెచ్చి పెట్టేవి కావు. కాని అలా అని ఊరుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో 'ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్' బ్లాగ్ లో 'బురద గుంట- రేప్ ప్రపంచం' లో సవివరంగా వ్రాశారు. 

      ఇలాంటి అనర్ధాలు చాలనట్లు పుండు మీద రసి కారినట్లు ఈ కులపిచ్చి ఒకటి. ఆ దుర్వాసన నేడు ఖండాంతరాలు దాటి వాడవాడలా వ్యాపిస్తోంది. ఇలాంటి పదాలు వాడడానికే అసహ్యంగా ఉంది. చదవడానికి మీకెలా ఉందో మరి. అంతకంటే దరిద్రమైన ఉపమానాలు వాడడానికి సంస్కారం అడ్డం వస్తోంది. 

       ఎన్నో విషయాలను మనం చూసి చూడనట్లు వదిలివేస్తున్నాం. వాటివలన జరుగుతున్న అనర్ధాలకు మాత్రం విపరీతంగా స్పందిస్తున్నాం. ప్రతి మనిషికీ ఏవేవో కోరికలు ఉంటాయి, అందరీ ఆలోచన ధోరణీ ఒక్కలా ఉండదు. కాని ఆ కోరికలు వ్యవస్థను నాశనం చేస్తున్నాయని తెలిశాక కూడా ఖడించక పోవడం, చూసి చూడనట్లు మాట్లాడకుండా ఊరుకుంటున్నామంటే ఆ నేరంలో మనమూ భాగం పంచుకుంటున్నామనే అర్ధం.

      ముఖ్యంగా నాయకులు, ఒక రంగంలో విజయం సాధించిన వారు, గురువులు..... నలుగురి దృష్టి వారిపై ఉంటుంది. వారిని అనుసరించే వారు కూడా కోకొల్లలు. అలాంటి వారు సంయమనం పాటిస్తూ, అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలి. తడబడితే అది నమ్మకం మీద, మానవత్వం మీద కదా దెబ్బ తగిలేది. ఆ నమ్మకమే పోయాక చేయడానికేమి మిగిలుంటుంది? 

        సమస్యను మొక్కగానే తుంచేస్తే అది మానులా ఎదగకుండా ఉంటుంది. గోటినే ఉపయోగించడం మరచిపోయిన వాళ్ళం, మనకు గొడ్డలి పట్టుకోవడం చేతనవుతుందా? యావత్ ప్రాణకోటిలో మనిషికి మాత్రమే ఉన్న వరం... మాట. అనవసర మొహమాటాలు వదిలిపెడితే మనిషి జన్మకు సార్ధకత చేకూరుతుంది.