Wednesday, October 12, 2016

ఈ ఏడు రోజులూ...

          ఒక్కోసారి అనుకోకుండా ఏవో జరిగిపోతూ ఉంటాయి. అలాంటివేవో కొన్ని గొప్ప అనుభూతిని ఇచ్చి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటిదే ప్రస్తుతం నాకనుభవమైంది. నిజం చెప్పొద్దూ! నాకు భగవంతునిపై భక్తి ఉంది కాని. ఈ పూజలూ, నామ సంకీర్తనల మీద బొత్తిగా నమ్మకం లేదు. అందుకు కారణం అవి నిత్యం చేస్తూ కూడా ప్రవర్తనలో ఎటువంటి స్వచ్చత లేనటువంటి వారిని చూసి ఏర్పరచుకున్న తేలిక భావం. అది పూర్తిగా నా అజ్ఞానమే అని ఇప్పుడర్థం అయింది. సిద్దాంతాలు పాటించే వారికి నేనూహించిన పరిణితి లేదని సిద్ధాంతమే తప్పనుకోవడం అజ్ఞానమే కదండీ. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానానికి తోడు ఎక్కడ ఏది చదివితే అది నిజం అనుకున్న అపోహా కూడా తోడయ్యింది.

        ఇంతకూ ఈ ఉపోద్ఘాతానికి కారణం ఏమిటంటే భాగవత సప్తాహం వినే అవకాశం లభించింది. వేదవ్యాసుల వారు, ఋషి పుంగవులు, శుక మహర్షుల వారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శ్రీ రామ చంద్రుల వారు, శ్రీ కృష్ణ పరమాత్మ... వీరందరినీ దర్శించే భాగ్యం కలిగింది. అది ఎలా ఏమిటీ అని చెప్పాలంటే చాలా కథే ఉంది. క్లుప్తంగా శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారు ఈ నవరాత్రులలో మాకా భాగ్యాన్ని కలిగించారు. 

        ఏదో మా కమ్యూనిటీలో ఏర్పాటు చేస్తున్నారు. పైగా ఆర్గనైజర్స్ అంతా బాగా కావలసిన వారు వెళ్ళకపోతే బావుండదు ఒక్కసారి విందాం అనుకుంటూ మొదటి రోజు వెళ్ళిన దాన్ని తరువాత రోజుల్లో సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూశాను. వేదసారాన్ని, ఉపనిషత్తులలోని అంశాలను, భాగవతాన్ని విన్న తరువాత వాటి గురించి ఎంతో తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలైంది.

       నేను విన్నదేదో మీకు చెప్పాలనే ఉత్సాహంతో రాయడం మొదలుపెట్టాను కాని, సత్యం మాత్రం నేను మరచిపోకుండా ఉండడం కోసం రాసుకుంటున్నవివి.

మొదటి రోజు:
  • వేదం ఇలా ఉండాలని శాసించి చెప్తోంది. ఇతిహాసాలు ఎలా ఉంటే బావుంటుందో ఉదాహరణలతో వివరించి చెప్తున్నాయి. 
  • ఉపనిషత్తులు ఆత్మ, పరమాత్మల మధ్య సంబంధాన్ని పిట్టకథల రూపంలో వివరిస్తున్నాయి.
  • తపస్సు చేత కృత యుగంలో, యజ్ఞ యాగాదుల వలన త్రేతా యుగంలో, పూజాధికాల వలన ద్వాపర యుగంలో వచ్చే ఫలితం, కలి యుగంలో భగవన్నామ స్మరణతో సాధ్యమౌతుంది. నామస్మరణ చేయడమంటే కేవలం పెదవులతో కాక హృదయంలో భగవంతుని నింపుకుని చేయాలి. 
  • కాలానుగుణంగా ధర్మం మారుతుంది కాని సత్యం శాశ్వతమైనది.
  • కలి స్థానాలు: జూదశాల, పానశాల, విశృంఖల భావాలు కలిగిన కామము, జీవ హింస, అక్రమార్జితము.
రెండవ రోజు
  • పంచభూతాలు మానవ శరీరం మీద ప్రభావితం చూపిస్తాయి.
  • జ్ఞానేంద్రియాలు: చక్షువు, శ్రవణేంద్రియం, ఘ్రాణేంద్రియము, రసనేంద్రియం, స్పర్శే౦ద్రియం. శ్రవణం అన్నింటికంటే ప్రధానమైన ఇంద్రియం. కర్మేంద్రియాలు: కాళ్ళు, చేతులు, మాట్లాడే నాలుక, మల, మూత్ర ద్వారాలు. 
  • ఇంద్రియాలు సుఖానిస్తున్నాయని అనిపిస్తూనే ఉంటుంది కాని అవి దుఃఖానికి కారణాలు. బుద్దితో ఇంద్రియ నిగ్రహం సాధించగలం. మహర్షికి, మనిషికి ఉన్న తేడా ఇంద్రియ నిగ్రహం.
  • మనుషులుగా చేయవలసిన ఉత్తమ క్రియ దానం. 
  • పుణ్యకార్యముల వలన, పరమాత్మ యొక్క నామస్మరణ వలన సంచితములు, ఆగామి కర్మలు తొలగిపోతాయి. పారబ్దకర్మలు మాత్రం అనుభవించి తీరవలసినదే. 
  • పరమాత్మ  అవతారములు ఇరవై ఒకటి. 
మూడవ రోజు
  • వేదవ్యాస మహర్షి వేదాలను శాఖలుగా విధజించారు. మహా భారతమును, శ్రీ మద్భాగవతమును, అష్టాదశ పురాణాలను రచించారు. 
  • శబ్దం యొక్క జీవితం కొంతకాలమే ఉంటుంది. భావము యొక్క జీవితం మరి కొంతకాలం ఉంటుంది. దానిని ధారణ చేస్తే మాత్రమే అది జీవితకాలం ఉంటుంది.
  • భగవంతుని ప్రీతిగా ఆరాధించాలి. జీవనంలో భాగం చేసుకోవాలి. 
  • అసూయ అన్నింటికంటే పెద్ద దుర్గుణం. 
నాలుగవ రోజు
  • కష్టాలను భగవతానుగ్రహములుగా భావించాలి.
  • సంపన్నులవడమంటే ఐశ్వర్యం కూడబెట్టడం కాదు. భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకోవడం.
  • భక్తికి, ముక్తికి గొప్ప ఉదాహరణ శ్రీ కులశేఖర్ ఆళ్వార్.  
  • ఋషులు చేసిన అత్యోత్తమ త్యాగ ఫలితమే వేద సంపద. 
  • వివాహ ధర్మాలు: ధర్మార్ధ, కామ, మోక్షములలో దంపతులిద్దరూ భాగస్వాములు.  
  • ఆలోచన, వచనం, ఆచరణ అన్నీ ఒకే విధంగా ఉండాలి. 
  • భాగవతంలో సృష్టి ప్రాత్కాలం నుండి ప్రపంచంలోని మార్పులు గురించి వివరంగా చెప్పబడి ఉన్నది. చరిత్రకు సంబంధించిన అన్ని అంశములు విశదీకరించి ఉన్నాయి. గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తుంది. అన్ని లోకాల గురించి చెప్పబడియుంది.
  • సర్పాలు, నాగులు రెండూ వేరువేరు.
  • వేద జ్ఞాన సంపద గురించి తెలుసుకోవాలి. 
  • హైందవ ధర్మం: సొంత లాభం కన్నా పర ధర్మం మిన్న.   
  • సత్యం, శాంతి, ఓర్పు, సహనం, శుచి, క్షమ, ప్రేమ ఇవన్నీ ఉన్నచోట భగవంతుడు ఉంటాడు. 
ఐదవ రోజు
  • విషయముల బారి నుండి కాపాడుకోవడం భాగవత శ్రవణం వలన సాధ్యమౌతుంది. తప్పొప్పుల హెచ్చరికలు చేసి మనస్సును శుద్ధి చేస్తుంది.  
  • హరి నామం పాపను ఆలోచనను ఆదిలోనే హరించి వేస్తుంది. 
  • సంకల్పం సరిగ్గా ఉంటే ఇబ్బంది ఎదురైతే భగవంతుడే స్వయంగా వచ్చి ఆ పనిని పూర్తి చేస్తాడు.
  • ఒక విషయాన్నిమనం ఏ భావనతో చూస్తామో మనకు ఆ విషయం అదే భావనతో కనిపిస్తుంది. 
అరవ రోజు 
  • శ్రీక్రియ ఉపదేశం 
  • అంత్యకాల స్మృతిలో భగవన్నామ స్వరణ చేస్తే మోక్షం లభిస్తుంది. అయితే ఆ సమయంలో స్ఫురణకు రావాలంటే మనస్సుకు అటువంటి తర్ఫీదు నివ్వడం వలనే అది సాధ్యమౌతుంది. 
ఏడవ రోజు
  • భక్తి అంటే నమ్మకం, అటువంటి నమ్మకం కలగడం అపురూపమైన వరం.
  • శరణాగతులకు ఎప్పుడూ భగవంతుని అనుగ్రహం ఉంటుంది. 
  • శ్రీమద్భాగవతం చదివేప్పుడు దశమ స్కందంతో మొదలు పెట్టాలి. 
  • కాలక్షేపం ఎప్పుడూ సత్కాలక్షేపమే అయి ఉండాలి.  
         ఈ ఏడు రోజులూ పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనటువంటిది. ఇంతేనా ఈ బాధ, క్రోధం, అవమానం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ వదిలి వేయడం ఇంత సుఖంగా ఉంటుందా.... ఆ బరువు దించేయగానే మనసు మహా తేలికైపోయింది. మోక్షమన్నది మరెక్కడో లేదనిపించింది. ఈ స్థితి కొనసాగాలంటే మర్గాలేవో తెలిసినట్లే అనిపించింది. కృష్ణా రామా అంటూ కాలం గడపడం వృద్ధాప్యంలో కాదు. చిన్న వయస్సులోనే ఈ విషయాలు తెలుసుకోగలిగితే జీవితాన్ని సుఖంగా మలచుకోగలం.

      బాగా నచ్చిన అంశం సత్వ గుణంలో కూడా చేస్తున్నటువంటి పొరపాటు. కోరికలో స్వార్ధం ఉంటుంది, చివరకు మోక్షాన్ని కోరుకోవడంతో సహా. ఎటువంటి ప్రలోభానికి లోనవని శ్రీ కులశేఖర్ ఆళ్వార్ నకు శతకోటి ప్రణామాలు. వారు భగవంతుని కోరుకున్నారట "స్వామీ భాగవతుల పాద ధూళి స్పర్శ నిరంతరము నా శిరస్సుపై పడేలా అనుగ్రహహించ"మని. వారికి తిరుపతి గర్భగుడి ద్వారానికి గడపగా ఉండే వరం ఇచ్చారట. ఆ గడపను 'కులశేఖర్ పడి' అంటారుట.

        ఈ కార్యక్రం దిగ్విజయం అవ్వడానికి ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ పోయారే తప్ప ఏ ఒక్కరూ కూడా గుర్తింపు కోసం పని చెయ్యగా చూడలేదు. సత్సాంగత్యం  దొరికింది.

ఇంతటి భాగ్యాన్ని కలిగించిన గురువుగారిని పరిచయం చేసుకుందాం.

       శ్రీ తిరుప్పావై కోకిల మంజులశ్రీ అమ్మగారు శ్రీ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు. సుమారుగా 45౦ గోశాలల బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. గోసంరక్షణ కోసం గవర్నమెంట్ తో పోరాడి ఎన్నో GOలు శాంక్షన్ చేయించారు. ఈ గోసంరక్షార్ధం వీరు అవైదిక మతస్తులతో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. శిధిలావస్థలో వున్న దేవాలయాలను పునరుద్దీకరించే కార్యక్రమాలు కూడా వీరు చేస్తుంటారు. కుంకుమ ఉద్యమాన్ని చేపట్టారు. హిందూ ధర్మశాస్త్రాన్ని గురించిన వీరి ప్రసంగాలు సుమారు వెయ్యికి పైగా టివిలో ప్రసారం అయ్యాయి. వీరు ఈ అమెరికా పర్యటనలో భాగంగా లాస్ ఏంజలస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, షార్లెట్ పట్టణాలలో భాగవత సప్తాహం చేశారు. అట్లాంటా సత్యన్నారణ స్వామి ఆలయంలో ఈ వారం చెప్తున్నారు.


Wednesday, August 24, 2016

అర్థం అయినట్లా? కానట్లా?

మొన్న మొన్నేగా పరీక్షలు పెట్టి మార్కులిచ్చి, ఏడాది విజయవంతంగా పూర్తి చేసినందుకు  పిల్లలకు ఓ రెండు పిజ్జా ముక్కలు పెట్టాం. అదే రోజు "అమ్మయ్య ఇంక రెండు నెల్ల పాటు తెలుగు బాధ లేద"ని మురిసిపోతున్న అమ్మల చేతికి వేసవి అభ్యాసాలు ఇచ్చి ఇక నుండి ఈ పిల్లలకు తల్లైనా టీచరైనా మీరే. ఇవి పూర్తిచేయించి, ఇప్పటి వరకు నేర్చుకున్నవి మర్చిపోకుండా చూడండి."  అని మా టీచర్లు కన్నీళ్ళతో జాగ్రత్తలు చెప్పారు కూడానూ! అదేమిటో గట్టిగా రెండు వారాలు గడిచినట్టు లేదు అప్పుడే మళ్ళీ పాఠశాల తెరిచే రోజులొచ్చేశాయి.

ఇంతకూ టీచర్లందరూ ఏం చేస్తున్నారా అని ఈ వారం ఒక్కోళ్ళకీ ఫోన్ లు చేయడం మొదలెట్టాను. వాళ్ళ అంతరంగమేమిటో మీరు కూడా వినండి.

కదిలించినవి'ట'

అమ్మా మీ వలన నా మనవడు నేను మాట్లాడుకోగలుగుతున్నాం. మంచి పని చేస్తున్నారు తల్లీ అంటూ వచ్చిన ఫోన్ కాల్.

మీరు క్లాసులో ఎలా చెప్తున్నారో ఏమో కాని మా వాడితో నేను రెండేళ్ళ నుండీ చేయించలేని పనులు మీ మాట విని చక్కగా చేస్తున్నాడు థాంక్స్ టీచర్ అన్న ప్రశంస.

ఆరేళ్ళ నుండి షార్లెట్ లో ఉంటున్నాను. నేను ఇంట్లో ఉన్నానో లేనో ఎవ్వరికీ తెలీదు. రెండు వారాలు ఇండియా వెళ్ళి వచ్చేసరికీ "ఏమండీ ఎలా ఉన్నారు? జెట్ లాగ్ ఉందా? వంటా అదీ అని హడావిడి పడక రెస్ట్ తీసుకొండ్. మేము సాయంత్రం కూరలు తెస్తున్నాం" అన్న పేరెంట్స్ వాట్స్ ఆప్ మెసేజెస్.

తెలుగు నేర్పించాలని తపన పడుతున్న మీరు సరస్వతీ దేవితో సమానం. మీ దీవెనలు కావాలంటూ ఇంటికి పిలిచి భోజనం పెట్టి పండు తాంబూలం ఇచ్చి పిల్లాడితో కాళ్ళకు దండం పెట్టించి చేసిన సత్కారం.

ఇప్పటికి రెండు సార్లు అమెరికా వచ్చానమ్మా, ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్ళిపోదామా అని ఉండేది. ఈ సారలా కాదు  మా పిల్లలిద్దరూ చక్కగా కబుర్లు చెప్తున్నారు థాంక్స్ మ్మా అన్న ఓ ఆంటీ మాటలు.
రగిలించినవి'ట'

ఏదో పార్టీ లో ఒక టీచర్ ని కలసిన పేరెంట్ , "సంవత్సరం నుండి క్లాస్ కు వెళ్తున్నా మా  పిల్లలు అస్సలు తెలుగులో మాట్లాడడం లేదండీ" అన్నారట. దానికి ఆ టీచర్ "తెలుగులో మాట్లాడం దాని తీరు తెన్నులు" గురించి ఓపిగ్గా ఓ పావుగంట పాటు వివరించారట. వెళ్ళేప్పుడు ఆ తండ్రి గారు, say good night to uncle. అంటూ పిల్లలకు చెప్పి See you on Sunday అని టీచర్ తో అంటూ వెళ్ళిపోయారట.

"ఫలానా రోజున పరీక్ష ఉంటుందని  పంపించిన మెయిల్ కి సమాధానం లేదు. తీరా పరీక్షకు పంపలేదని ఫోన్ చేస్తే నేను ఉద్యోగం చేస్తున్నానండి. నాకు కుదరక తీసుకురాలేదు. మరో  రోజు పెట్టండి." అన్న సమాధానం. 

"ఈ ఏడాది పాఠాలు చెప్పాం. వచ్చే ఏడాది మా ఇద్దరికీ  కుదరడం లేదు, మీరెవరైనా క్లాస్ తీసుకుంటారా అని టీచర్స్ ఓ  తరగతి పేరెంట్ ని అడిగితే దానికి  "అబ్బే మాకు కుదరండి. ఏదో మీ దగ్గర దింపిన గంటలో గ్రాసరీస్ అవీ తెచ్చుకోవడమో ఇంట్లో పనులేవో చేసుకుంటాం. మాకేలా కుదురుతుందీ అంటూ వచ్చిన  సమాధానం.    

అదండీ సంగతి. ఎండా వానా రెండూ ఉంటాయ మరి. అయినా ఇవన్నీ తెలిసినవేగా! అప్పట్లోనే ఆవిడెవరో బోలెడు బాధ పడిపోయారు కూడానూ. ఏమిటంటారా?  ఇక్కడ నొక్కితే మరొక్కమారు చదువుకోవచ్చు.

ఇక ప్రస్తుతానికి వస్తే ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మరో పది మంది కొత్త టీచర్లు మేం పాఠాలు చెప్తామంటూ ముందుకు వచ్చారు. అందులో తొమ్మిది మంది పాఠశాలకు పూర్తిగా పరిచయం లేని వాళ్ళు. మరో ముగ్గురు వాలంటీర్స్ "పాఠాలు చెప్పమన్నా చెప్తాం లేదా ఎప్పుడు ఏ పని కి సహాయం కావాలన్నా మేం రెడీ" అంటూ ఈ మధ్యే జరిగిన ఓ పిక్నిక్ లో కలిసి చెప్పారు.

పరీక్షలు, పాఠాలు, ఉపాధ్యాయులు, తరగతులు ఓ రెండు నెల్ల పాటు సందడే సందడి. మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవ్.

అన్నట్టు ఈ మధ్యే ఓపెన్ హౌస్ లో చెప్పిన మాట మీకు చెప్పడం మరిచేపోయాను.

"ఆవకాయ పెట్టడం పూర్తయ్యింది. ఆగస్ట్ నెలాఖరకు ఉపాధ్యాయులకు అందజేయబడుతుంది. ఉపాధ్యాయులు, "ఆవకాయ అమోఘంగా ఉంది. వారానికి నాలుగు రోజులపాటు తినండ"ని ఒక గిన్నెలోనో డబ్బాలోనే కొంచెం కొంచెంగా  ప్రతి వారమూ విద్యార్ధులకు ఇస్తారు.

ఇంటి దగ్గర వారానికో నాలుగు రోజులు అమ్మో, నాన్నో వేడిగా అన్నం వండి, కమ్మని నెయ్యి, కాస్తంత పప్పు కలిపి, పిల్లలకు ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తే దాని రుచి వాళ్ళు ఆస్వాదించ గలుగుతారు. అలా కాదు, ఆ తీరిక మాకు లేదు, ఆదివారం మధ్యాహ్నం రాత్రి మిగిలిన అన్నంలోనో, బిర్యానీ లోనో వారం మొత్తం తినాల్సిన ఆవకాయంతా కలిపేసి, బలవంతంగా పిల్లలకు తినిపించేస్తామంటే ... ఆ కారం తినలేక పిల్లలకు ఆవకాయ మీదే అయిష్టం కలుగుతుంది."


ఇదండీ సంగతి. విన్న వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతకూ వారికి విషయం అర్థం అయినట్లా? కానట్లా?


Sunday, June 12, 2016

అనుకోలేదేనాడూ...

"సమయం ఐదవుతోంది నిద్ర పట్టడం లేదామ్మా?" అనడిగాడు పండు. జీవితంలో కొన్ని రోజులు సప్త వర్ణాల్ని ఒంటికి అద్దుకుని ఇంద్రధనస్సు మీద  ఊయలలు ఊగుతాయట. వినడమే కాని ఆ రోజులెలా ఉంటాయో నిన్నటి వరకు తెలియలేదు. అంతటి భాగ్యాన్ని చవిచూసిన నాడు ఇక నిద్రెలా పడుతుంది? నిన్న సాయంత్రం నుండి జరిగిన ప్రతి అంశమూ మధురంగా మనసును ఊపేస్తూ... ఒక్కొక్క జ్ఞాపకం మెత్తగా మనసులో ఇంకుతుంటే ఇది నిజమా! నిజమేనా? అని ఇంకా అనుమానంగానే ఉంది.  
అక్కడ ప్రతి టేబుల్ మధ్యలోనూ కొలువు తీరాయే తెల్ల గులాబీలు, లిల్లీలు ఇక్కడ తీరిగ్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎవరూ లేరనుకున్నాయో ఏమో ఏమిటేమిటో కబుర్లు. వాటికి స్వర్గలోకం ఎలా ఉంటుందో చూడాలని కోరిక ఉండేదట. ఆ చుక్కలు, చంద్రుని సమక్షంలో నిన్న జరిగిన సంబరం చూశాక ఆ కోరిక తీరిపోయిందట. "మా సుధీర్, శిరీష లాంటి తమ్ముడు, మరదలు, శ్రీదేవి, కేశవరావు గారి లాంటి స్నేహితులు ఉంటే ఆ బ్రహ్మ దేముడు మాత్రం స్వర్గంలో ఎందుకు ఉంటానంటాడు... వెంటనే దిగి భూలోకానికి వచ్చెయ్యడూ" అంటూ గుసగుసలు పోతున్నాయ్.
             *            *          *         *           *            *          *         
ఖాళీగా ఉండే బ్రిడ్జ్ హామ్టన్ క్లబ్ హౌస్ ఆ అలంకరణతో ఏకంగా ఆకాశంతోనే పోటీ పడిందంటే అతిశయోక్తి కాదు. మా ఫొటోలన్నీ ఎలా సేకరించారో అద్భుతమైన ఫోటో సైన్ ఇన్ ఆల్బం తయారు చేశారు. షాండ్లియర్, సెంటర్ పీసెస్, బాక్ డ్రాప్, నక్షత్రాలతో కిటికీ తెరలు....  
ప్రతిదీ శ్రద్దగా తయారుచేసిన శ్రీదేవి, కేశవ్ రావు గారి తీరు చూసి ఆ అనుబంధానికి ఏ పేరు పెట్టాలో అర్థం కాలేదు. అసలీ ఋణానుబంధం ఏనాటిదో అనే సందేహం కలుగుతోంది. 

మా జీవితాన్నే చిత్రంగా చలన చిత్రంలా మలచి మమ్మల్ని కూర్చోపెట్టి మరీ చూపించారు. అందులో నటించిన విజయ, కృష్ణ, అనురాధ, రామారావు, రఘు, సూర్య, రాఘు గారి పేరెంట్స్ నటనా కౌశలం అమోఘం. 



ఆరునెలల క్రితమే ప్రణాలిక సిద్దమైనా పదేళ్ళ పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ రహస్యాన్ని పదిలంగా కాపాడడం ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతెంత దూరలనుండో స్నేహితులు అభిమానంతో వచ్చారు. ఎంతో మంది ఉత్సాహంగా ఎన్నో చేశారు. వారందరి ఆత్మీయతకు గుండె తడి తెలుస్తోంది. ఆ అనుభూతి ఎంత హాయిగా ఉందంటే అభిమానాలు, సంబంధాలు అన్నీ ఎండమావులే అనుకునే బలహీన క్షణాలు ఉంటాయిగా అవి మొహం ముడుచుకుని ఇక తిరిగి రామంటూ పారిపోయేటంత. 

సంతోషాల శిఖరాలు ఎక్కినప్పుడే కాదు, అవరోధాల అగాధాలు దాటినప్పుడు కూడా ఎన్నో సందర్భాలలో మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపించిన ఆత్మీయుల సమక్షంలో మా పాతికేళ్ళ వివాహ వార్షికోత్సవం జరగడం తలుచుకున్న కొద్దీ మహా సంబరంగానూ ఉంది.  

ఏమన్నారు మంజుల... "ఎవరేమి చేస్తారో తెలియదు కాని ప్రతిదీ ఇద్దరిదీని" అని. ఆ ఈశ్వరునికి శరీరంలో సగభాగం పార్వతికి ఇవ్వడమే తెలుసు. నా ఈశుడు తన ఆత్మలో నన్నే నిలుపుకున్నాడు అందుకే ప్రతి పనిలోనూ ఇద్దరం కనిపిస్తూ ఉంటాం. బిందు అనుకుంటుందీ "మా అక్క చిచ్చుబుడ్డీ. తను తల వంచదు, మా రఘు బావను తల వంచనివ్వదు" అని. పిచ్చి బిందూ ఆ నాడు దాక్షాయణి పరాభవాన్ని భరించలేక అగ్నికి ఆహుతి అయింది. ఈశ్వరుడిలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, జరగబోయే ఘోరాన్ని ముందే పసిగట్టి దక్షుని మనసును సైతం మార్చగల ముందు చూపు మీ బావకు ఉండబట్టే నాకు దక్షాయణిలా పరాభవాన్ని చవిచూడాల్సిన అవసరం కలగలేదు.  తలవంచని తనం నాదే కాని ఆ అవసరాన్ని రానివ్వని చాకచక్యం మీ బావది.  

ఈ పాతికేళ్ళ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు... అనుబంధాలు. అవి తలచుకున్న కొద్దీ మనసు గతంలోకి పరుగులు తీస్తోంది. లేలేత పరిచయాలు... ఆ స్నేహ పరిమాళాల ఘుమఘుమలతో ఈ రేయి తెల్లవారబోతోంది. రంగులు అద్దిన 'నేడు' ఇంద్రధనస్సుపై సవారి చేస్తోంది.

"అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
గుండెల్లో ఇన్నాళ్లు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా!"

ఆ చందమామ మీద కూర్చుని ఆత్మీయుల అభిమానంలో తడిసి ముద్దవుతున్నప్పుడు నా మనసులో మెదిలిన భావాలకు అద్దం ఈ పాట.   

మాతో వారి అనుబంధాన్ని నలుగురితోనూ పంచుకున్న ఆత్మీయులకు, ఈ అనుభవాన్ని మాకు పదిలంగా అందించిన ఆత్మబంధువులకు కృతజ్ఞతలు చెప్పి దూరం పెట్టలేను. మీ స్నేహ సంతకాన్ని బ్రతుకు పుస్తకంలో చివరి పేజీలో సైతం పదిలంగా దాచుకుంటాను. 

Thursday, May 5, 2016

అనుబంధం - ఆత్మీయత

       అప్పుడే ఏడాది పూర్తయ్యింది చిత్రంగా లేదూ! ప్రతి ఏడాది అనుకునే మాటే అయినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మా చిన్న కుటుంబం పెరిగి పెద్దదవుతోంది. ఇప్పుడు సరిపడా ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో కనీసం ఓ నూట యాభై గదులన్నా ఉండాలి. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా పాఠశాల గురించి చెప్తున్నానండీ.

       తొంభై ఏడు మంది విద్యర్దులున్న పాఠశాలలో పోయినేడాది హఠాత్తుగా మరో నూట ఇరవై మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. ఏం చెయ్యాలా అని ఆలోచించే లోపలే ఓ ఇరవై రెండు మంది ఉపాధ్యాయులు మేం పాఠాలు చెప్తాం అంటూ ముందుకు రావడం తలచుకుంటే మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. పాఠశాలలో గత ఆరేళ్లుగా పాఠాలు చెప్తున్నవారున్నారు. మార్గ మధ్యలో కలసిన వారున్నారు, పోయినేడాది ఓపెన్ హౌస్ కి వచ్చి అప్పటికప్పుడు మేము కూడా పాఠాలు చెప్తాం అంటూ ముందుకు వచ్చిన వారున్నారు. అందరు టీచర్లు కూడా విజయవంతంగా ఈ ఏడాది పాఠాలు చెప్పడం పూర్తిచేశారు.

ఈ ఏడాది మురిపించిన అనుభవాలు కొన్ని....

"మేము మీ పిల్లలకు తెలుగు చెప్పడం మొదలు పెడుతున్నాం, ఈ ఏడాదే కాదు మన ఈ సంబంధం మరో నాలుగేళ్ళు పాటు కొనసాగుతుంది అంటూ ఒక టీచర్ పేరెంట్స్ కి పంపిన మెయిల్ తొలి మెయిల్ చూసినప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. 

నిన్న ఒక టీచర్ మాట్లాడుతూ విద్యార్ధులకు నేర్పించిన దానికన్నాతాను నేర్చుకున్నదే ఎక్కువన్నారు. అది నూటికి నూరు పాళ్ళు నిజం. పిల్లలకు సుభాషితాలు, శతకాలు నేర్పిస్తున్నప్పుడు జీవితాన్ని తరచి చూసుకున్నది నాకూ అనుభవమే.

"ఇంతకు ముందు ఊర్లో ఉన్నామో లేదో, అసలు నేననేదాన్ని ఒకదాన్ని ఉన్నాననే ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఓ రెండు వారాలు ఇండియా వెళ్ళిరాగానే ఎలా ఉన్నారు? జెట్ లాగ్ ఉందా? ఏమైనా వంట చేశారా? లేదా మ క్లాస్ పేరెంట్స్ అంటూ పలకరిస్తుంటే కళ్ళు చెమర్చాయంటే నమ్మండి". అంటూ మరో టీచర్.

"పిల్లలూ వారి పేరెంట్స్ తో పిక్నిక్ భలే సరదాగా గడిచింది. ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేశాం. మన టీచర్స్ అందరం కూడా వచ్చే ఏడాది తప్పక పిక్నిక్ వెళ్దాం" అంటూ మరో టీచర్.

"ఈ చిన్న పిల్లలకు ఇన్ని యాక్టివిటీస్  ఏమిటండీ. ఎప్పుడు క్లాస్ రీస్కెడ్యూల్ చెయ్యలన్నా కుదరదు. మాకు పిల్లల యాక్టివిటీస్  మీద పూర్తి అవగాహన వచ్చింది. మా అమ్మాయి పెద్దయ్యాక ఏ క్లాస్ ముఖ్యమో ఏది కాదో ఇప్పుడే తెలిసి పోయింది" అంటూ ఓ రెండేళ్ళ పాప ఉన్న టీచర్ ఆనందంగా చెప్పారు.

"మా పిల్లలు అ అంటే అట్టు, ఆ అంటే ఆవడ, ఇ అంటే ఇడ్లీ అంటూ చెప్తున్నరండీ" అని ఓ టీచర్ మురిపెం.

మొన్న ఒక ఈవెంట్ కి వెళితే  ఓ నాలుగురు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి హాగ్ లు ఇచ్చేశారు. ఎవరా అని చూస్తే పోయిన సంవత్సరం నా క్లాస్ విద్యార్ధులు అని తృప్తిగా మరో టీచర్...

మేము మా క్లాస్ పిల్లలతో క్రిస్ మస్ సెలవలలో జింజర్ బ్రెడ్ హౌస్ చేశామని ఒకరు, మా క్లాస్ వారందరం కలసి సంక్రాంతి జరుపుకున్నామని మరొకరు ఇలా ప్రతి తరగతిలో టీచర్ కు విద్యార్ధుల కుటుంబాలకు పెరుగుతున్న అనుబంధం చూస్తుంటే ఆనందంగానూ ఆశ్చర్యంగా ఉంది.

      ఇంతమందిని అలరించిన పాఠశాల వేసవి విశ్రాంతి తీసుకోబోతోంది. మా పిల్లలకు ఇక మీరే ఉపాధ్యాయులంటూ విద్యార్ధులను తల్లిదండ్రులకు అప్పగించిన టీచర్లు, పిల్లలకు అక్షరాలు చక్కగా వచ్చేశాయి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వాక్యాలు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. మేము ఎలా పంపిస్తున్నామో వేసవి అనంతరం మాకు ఈ పిల్లలను అలాగే తిరిగి ఇవ్వాలని పేరెంట్స్ కు జాగ్రత్తలు చెప్తున్న టీచర్లతో ఈ వారం హడావిడిగా ఉంది.

    తెలుగు నేర్పించడమే ప్రధానంగా మొదలుపెట్టిన పాఠశాల అనుబంధాల అల్లికతో కొత్త పుంతలు తొక్కడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.



Monday, April 18, 2016

అర్థం చేసుకోరూ...

        అబ్బ! ఈ పెద్దవాళ్ళున్నారు చూశారూ...వాళ్ళకేం చెప్పినా అర్థం కాదు. అప్పటికీ మనం ఎంతో ఓపిగ్గా explain చేస్తామా, అయినా కూడా అర్థం చేసుకోరు. మా నాన్నగారైతే మరీనూ. సంతకం చేయమని report card చేతికివ్వగానే దాన్ని పైనుంచి కిందకు చూస్తారు. ఆయనకు ముందుగా అందులో B, C, D, లే కనిపిస్తాయి. మనం Alphabets నేర్చుకునేప్పుడు ముందు ఏం నేర్చుకుంటాం? A నే కదా. అంటే report card లో కూడా ముందు A నే చూడాలి కదా! ఆహా.. A తప్ప మిగిలినవవ్నీ చూసేసి grades ఎందుకిలా వచ్చాయ్ పండూ అనేస్తారు. 

        అప్పటికీ చెప్తాను, B కూడా మంచిదే నాన్నా discriminate చెయ్యకూడదు అని. పైగా మా teacher కూడా B మంచిదనే చెప్పారు అని చెప్తాను. వినరుగా! మీ teachers అలాగే చెప్తారు. A ఒక్కటే మంచిది అని గాఠిగా వాదించేస్తారు. టీచర్ చెప్పిన పాఠాలేమో జాగ్రత్తగా వినాలి, మిగిలినవి వినకూడదంటే ఎలాగో మీరే చెప్పండి. 

        ఇంకా ఏమో చిన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చదివేవారో అప్పటికప్పుడు ఒక గంట సేపు lecture ఇచ్చేస్తారు. అప్పుడంటే వాళ్ళకు video games, movies, play dates, soccer ఇవన్నీ లేకపోబట్టి bohr కొట్టి చదివారు గాని లేకపోతే అంతలా చదివేవారా ఏమిటి?

Saturday, April 16, 2016

సరదా సరదాగా....

పండు:  అమ్మాటార్గెట్ కి వెళ్దామా?     
అమ్మ:  ఇప్పుడా చాలా పొద్దుపోయింది పండూ. రేపు వెళ్దాంలే.
పండు : ప్లీజ్ ఇప్పుడే వెళ్దాం. 
అమ్మ:  సర్లే. ఇంతకూ నీకక్కడేం కావాలి?
పండు:  ఇరవై హెర్షీస్  చాక్లెట్స్. 
అమ్మ: అన్ని చాక్లెట్లే! ఎందుకు?
పండు: ఏం కొన్నా అక్కతో షేర్ చేసుకోమని చెప్పావ్ గా. పంతొమ్మిది నాకు. అక్కకొకటి. 

*               *               *                  *                 *               *

నాన్న: పండూ, చాలా ఆలస్యమైంది. పుస్తకం మూసేసి నిద్రపో. 
పండు: నిద్ర రావడంలేదు నాన్నా. నువ్వో కథ చెప్పు.
నాన్న: కథ చెప్పాలానాకు రావే. 
పండు: అన్నీ అబద్దాలు. నీకొచ్చు.
నాన్న: నిజంగా రావు నాన్నా.
పండు: మా మేనేజర్ అస్సలు సెలవు ఇవ్వడంలేదు.  ఏదో ఒక కథ చెప్పి ఈ శుక్రవారం డుమ్మా కొట్టెయ్యాలని అమ్మతో చెప్పడం నేను విన్నాలే.  

*               *               *                  *                 *               * 

నాన్న: పండూ, ఎక్కడకు వెళ్తున్నావు?
పండు: నితిన్ వాళ్ళింటికి నాన్నా.
నాన్న: ఎప్పుడొస్తావు?
పండు: ఏడింటికొస్తాను.
నాన్న: త్వరగా వచ్చెయ్. ఇవాళ డిన్నర్ లజానియా.
పండు: డిన్నర్ కి బయటకు వెళ్తున్నామా?
నాన్న: లేదు నేనే చేస్తున్నా.
పండు: ఎక్స్ పెరిమెంటా?
నాన్న: ఎస్.
పండు: అమ్మ ట్రిప్ నుండి ఎప్పుడు వస్తుంది నాన్నా?
నాన్న: ఇంకో రెండ్రోజుల్లో వచ్చేస్తుంది.
పండు: అప్పటివరకు నితిన్ వాళ్ళమ్మ నన్ను డిన్నర్ వాళ్ళింట్లోనే చేయమన్నారు. 

*               *               *                  *                 *               *

అమ్మ:  పండూ, ఇండియా నుండి అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు.
పండు: ఎప్పుడు?
అమ్మ:  రేపు సమ్మర్లో. నీకేం తేవాలని అడిగారు. ఇంతకీ నీకేం కావలి?
పండు: నాకు జామకాయలు కావాలి.
అమ్మ: ఫ్రూట్స్ ఫ్లైట్ లో తేకూడదు.
పండు: సీషెల్స్.
అమ్మ: అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర సముద్రం ఎక్కడుందిసీషెల్స్ కష్టం.
పండు: అక్కడ బుల్లి కోడిపిల్లలు ఉన్నాయ్ గా. అవి తెమ్మను.
అమ్మ: ఎలా తెస్తారుసూట్ కేస్ లో పెడితే చచ్చిపోతాయి.
పండుసూట్కేస్ లో ఎందుకుపట్టుకుని తేవచ్చుగా?
అమ్మ: అలా తెస్తే ఎగిరి పోవూ?
పండు: పిచ్చమ్మా ఎగరడం వాటికేమైనా కొత్తాచక్కగా ఎగురుకుంటూ వచ్చేస్తాయి. 
  
*               *               *                  *                 *               * 

పండు: నాన్నా నాకు కోక్ కావాలి.
నాన్న: కోక్ హెల్త్ కి అస్సలు మంచిది కాదు. నీకు ఎక్కిళ్ళొస్తున్నాయ్ మంచి నీళ్ళు తాగు.
పండు: నీళ్ళు తాగితే ఏమౌతుంది నాన్నా?
నాన్న: ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
పండు: ఎన్ని తాగాలి?
నాన్న: ఓ గ్లాస్ తాగు.
పండు: తాగాను....ఇంకా ఆగలేదు.
నాన్న: ఇంకో గ్లాస్ తాగు.
పండు: సరే.... ఇంకా ఆగలేదు నాన్నా.
నాన్న: అవునా. ఆగాలే.
పండు: నీళ్ళు తాగితే ఎక్కిళ్ళు ఆగుతాయని నీకెవరు చెప్పారు నాన్నా?
నాన్న: ఎవరో చెప్పారు, గుర్తు లేదు. 
పండు: ఎప్పుడు చెప్పారు?
నాన్న: గుర్తు లేదు.
పండు: అయితే ఏం చెప్పారో కూడా మర్చిపోయుంటావ్. సరిగ్గా గుర్తు తెచ్చుకో నాన్నా. కోక్ తాగాలని చెప్పుంటారు.    

*               *               *                  *                 *               *

పండు: నాన్నా మనమో ఆట ఆడుకుందామా?
నాన్న: ఆటా సరే. ఏమిటో చెప్పు.
పండు: క్వొశ్చన్స్ అండ్ ఆన్సర్స్.
నాన్న: కొత్త గేమ్... బావుందే. ఇంతకూ ఎవరు అడగాలిఎవరు చెప్పాలి?
పండు: నేనడిగితే నువ్వు చెప్పాలి. నువ్వడిగితే నేను చెప్తాను.  
నాన్న: సరే!
పండు: ముందు నేనడుగుతాను. కాళ్ళతో ఏం చేస్తాం?
నాన్న: నడుస్తాం, పరిగెడతాం. 
పండు: మరి కళ్ళతో?
నాన్న: చూస్తాము. ఇప్పుడు నేనడుగుతాను. చెవులతో ఏం చేస్తాం?
పండు: వింటాం.
నాన్న: మరి ముక్కుతో?
పండు: వాసన చూస్తాం.
నాన్న: చూశావా, మన శరీరంలో అన్ని భాగాలు కూడా ఏదో ఒక ప్రయోజనం కోసమే ఉంటాయి. 
పండు: నాన్నా మరి ఐబ్రోస్ తో ఏం చేస్తాం?
నాన్న: ??

*               *               *                  *                 *               *

వీకెండేగా లాప్ టాప్ లు, ఐపాడ్ లు పక్కన పెట్టి పిల్లలకు ఇలాంటివేవో చదివి వినిపించగలిగితే బావుంటుందనీ...

Wednesday, April 6, 2016

అంత అదృష్టం నాకెక్కడిది?

        ఇదిగో మిమ్మల్నే, ఇడ్లీ చల్లారిపోతోంది త్వరగా రండి. కాఫీ తాగేసి వెళ్తారా, ట్రావల్ మగ్ లో పోసివ్వనా? ఎనిమిదైపోతోందని రోజూ హడావిడి పడకపోతే ఓ పావుగంట ముందు లేవచ్చుగా! ఏమిటీ...ఇవాళ ఆఫిసుకు వెళ్ళక్కర్లేదా... వర్క్ ఫ్రం హోమా? ఆ విషయం రాత్రే చెప్తే హాయిగా ఏ మసాలా దోసెలో వేసుకునే వాళ్ళంగా. సర్లే రండి, ఆకలి దంచేస్తోంది... ఇడ్లీ తింటూ మాట్లాడుకుందాం.
            *                       *                    *                       *  
        నిన్నలేదూ.... ఎందుకా నవ్వూ! అర్థమైంది లెండి. నిన్న లేదూ అన్నాననేగా. నిన్నెప్పుడూ ఉంటుంది. రేపే ఎంతమందికి ఉంటుందో తెలీదు. నిన్న రేపు సంగతెందుకుగాని అసలు విషయం చెప్పమంటారా? అది చెప్పబోతుంటేనే మధ్యలో మీ నవ్వు....ఇంతకీ ఏం చెప్పాలనుకున్నానబ్బా. ఆ మధ్యలో మాట్లాడకుండా విషయం పూర్తిగా వినండి. నిన్నా........ఇప్పుడే రావాలా ఆఫీస్ కాల్. ఇక మధ్యాహ్నం వరకు దొరకరు అయ్యగారు. 
           *                       *                    *                       *         
         నేను బయటకు వెళ్తున్నాను. షాప్ లో కొన్ని రిటర్న్స్ ఇవ్వాలి. అలాగే లైబ్రరీలో కొంచెం పనుంది, వచ్చేసరికి ఆలశ్యం అవుతుందేమో! కూరలన్నీ కౌంటర్ మీదే పెట్టాను, రైస్ కుక్కర్ కూడా ఆన్ చేశాను. మీరు భోంచేసెయ్యండి. పనిలో పడి మొన్నట్లా మూడింటివరకూ తినకుండా ఉంటారేమో! షుగర్ డౌన్ అయితే కష్టం. ఏమిటీ అలా చెయ్యరా సరే! అయినా ఒంటిగంటకు ఫోన్ చేసి గుర్తు చేస్తాలే. మరి నా సంగతంటారా? బయటే ఏదో ఒకటి తినేస్తాను. 
           *                       *                    *                       *         
         అయ్యో! ఫోన్ చేయడం మార్చేపోయాను. ఏమిటీ... లంచ్ చేసేశారా?  గిన్నెల్లో గరిటెలు సింకులో పెట్టి మూతలు సరిగ్గా పెట్టారా? గుర్తు చెయ్యక్కర్లేదా. సరే! పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోకండి సాయంత్రానికి పుల్లగా అయిపోతుంది. అసలే ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది కూడా! 

        అన్నట్లు ఇవాళ సాయంత్రం సుగుణా వాళ్ళింట్లో గెట్ టు గెదర్ ఉంది. ఏడింటికల్లా రమ్మన్నారు. ఐదున్నరకు జిమ్ కి వెళ్దామా? త్వరగా వచ్చేస్తే రెడీ అవడానికి టైం ఉంటుంది. ఏమిటీ ఇవాళ జిమ్ కి వెళ్ళాలని లేదా! రోజూ ఇలా ఏదో ఒక వంకతో జిమ్ మానేయాలని చూస్తే ఎలా? రేపు హైకింగ్ వెళ్దామంటారా. సరేలే. రమేష్ వాళ్ళు కూడా వస్తారేమో కనుక్కోండి....ఓ ఆల్రెడీ కనుక్కున్నారా. మరీ...ఆరింటికి బయలుదేరితే సరిపోతుందిగా! ఇంట్లో వాటర్ బాటిల్స్ లేవనుకుంటాను, టార్గెట్ లో తీసుకుని వస్తాలెండి. గ్రనోలా బార్స్ కూడా తేనా? ఏమిటీ ఎక్స్ట్రాకేలరీస్ ఎందుకంటారా? సర్లే ఆపిల్స్ తీసుకెళ్దాం. ఏమంటున్నారు....సరిగ్గా వినపడట్లేదు. కట్ అవుతోంది....ఇక్కడ సిగ్నల్ బాగా లేనట్లుంది...... కాన్ఫరెన్స్ కాల్ కి టైం అవుతోందా ... సర్లెండి బై మరి.  
           *                       *                    *                       *         
         ఇవాళ వర్క్ త్వరగా అయిపోయినట్లుందే, టీ తాగుతారా? ఏమిటీ... మీరే పెడతారా? సరే నాకు గ్రీన్ టీ వద్దు. నార్మల్ టీ కావాలి, అసలే మధ్యాహ్నం లంచ్ సరిగ్గా చేయలేదు. ఎందుకు చేయలేదంటారా?....డెలీలో ఫ్రెంచ్ బ్రెడ్ తీసుకున్నాను. అది గట్టిగా  రాయిలా ఉంది. అసలే పళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయ్ దాంతో తినలేక పోయాను. ఏమిటీ డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళమంటారా. వద్దులెండి వెళ్తే విజ్డమ్ టీత్ అన్నీ పీకేయ్యాలంటాడేమో! ఇవాళ పనులన్నీ పూర్తయినట్లేనా? ఓ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడారా. మొన్న నేను మాట్లాడితే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కట్టమన్నారు. మీకు రెండొందలకే ఎలా ఒప్పుకున్నారబ్బా!... ఫేస్ వాల్యూ అంటారా! వాళ్ళతోగాని ఫేస్ టైం చేశారా ఏమిటి? లేదా. చేశారేమో వాళ్ళు కూడా నాలానే మిమ్మల్ని చూసి అమాయకులని మోసపోయారనుకున్నాను.  

         సర్లెండి కబుర్లు తరువాత చెప్పుకుందాం, ఆరయిపోతోంది, ముందు మీరు డ్రెస్ ఛేంజ్ చేసుకుంటే నేనెళ్ళి చీరకట్టుకునొస్తాను... ఆల్రెడీ మార్చుకున్నారా. ఈ కార్గో షార్ట్స్ ఏమిటి లాన్ మొవ్ చెయ్యడానికి వెళ్తున్నట్లుంది. ఇదిగో ఈ పచ్చగళ్ళ చొక్కా, మొన్న కొన్న  చినో పాంట్ వేసుకోండి బావుంటుంది. 
           *                       *                    *                       *         
        పదకొండవుతోంది పడుకుందామా! .....ఫ్రైడేనేగా సినిమా చూద్దామంటారా. సరే యుట్యూబ్ లో సర్చ్  చేయండి, అయినా ఏం మంచి సినిమాలున్నాయ్ అన్నీ చెత్త. అయితే పుస్తకం చదువుకుందామంటారా!.... ఓ ఆల్రెడీ పుస్తకం తెచ్చేశారే... మళ్ళీ గోదావరి కథలేనా...ఇది ఆరోసారి కదూ చదవడం!.....అలా గోదారొడ్డున తిరిగి రావడం కోసం ఎన్నిసార్లయినా చదవొచ్చునంటారా. నిజమే! తలుపు తీస్తున్నారెందుకు? ఇప్పటికిప్పుడు గోదారెళ్దామంటారా ఏం? వెన్నెల పుచ్చపువ్వులా ఉందా..... కాసేపలా వాకింగ్ కి వెళ్ళొద్దామంటారా....ఇంత రాత్రి నాకు భయం బాబూ! నేను రాను. మీరొక్కళ్ళే వెళ్ళొస్తానంటున్నారా?  ఏ పిశాచాలన్నా ఎత్తుకుపోగలవు జాగ్రత్త. ఏమిటీ.... అంత అదృష్టం మీకెక్కడదంటారా?  
           *                       *                    *                       *    

        మరీ నిశ్సబ్దంగా ఉంది ... సందడంతా ఏమైపోయిందని ఇల్లేమో దిగులు పెట్టేసుకుంది. ఆ టికెట్టేదో కొంచెం ప్రీపోన్ చేసుకుని త్వరగా వచ్చెయ్యకూడదూ!


Monday, March 14, 2016

కాన్ కూన్ - మాయన్ నాగరికత

     Cancun, మెక్సికో తూర్పు వైపున ఉన్న Quntana Roo రాష్ట్రంలోని ఒక పట్టణం. దీనిని కరేబియన్ సముద్రంలోకి చొచ్చుకుని వచ్చిన Yukatan ద్వీపకల్పముపై నిర్మించారు. 45 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో Puerto Juárez అనే చిన్న గ్రామం ఉండేదట. ఇసుక తప్ప మరేమీలేని ఆ ప్రదేశం నేడు ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోవడం ఆశ్చర్యకరమైన విషయం.

యుకాటన్ ఈశాన్యం వైపునున్న తీరప్రాంతాన్ని Rivera Maya అంటారు. ఈ ప్రాంతంలో సముద్రగర్భాన వందల కిలోమీటర్ల వరకూ పగడపు దీవులు వ్యాపించి ఉన్నాయి.



నీలం, పచ్చ కలగలిపిన రంగులో సముద్రం, తెల్లని మెత్తని ఇసుక ఈ ప్రాంతం ప్రత్యేకతలు.




సున్నపురాయిని తొలుచుకుని ఏర్పడ్డ అతి పెద్ద caverns , కేనోట్స్ (బావులు) ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ.


మాయన్ నాగరికత: Kukulkan అనే రెక్కలు కలిగిన పెద్ద పామును మాయన్లు భగవంతునిగా కొలుస్తారు. Cancun అంటే మాయన్ భాషలో పుట్ట, లేదా పాము సింహాసనము అని అర్ధం.










                                                                              మాయన్లు వ్రాయడం నేర్చుకున్నారు, ఆ లిపి బొమ్మలతో ఉండేది. పద్దెనిమిది నెలలతో కాలెండర్ ను రూపొంచించారు. న్యాయ వవస్థ, వైద్య విధానాలు ఉండేవి. ఖంగోళాన్ని పరిశీలించారు. అలాగే ఆట స్థలాలు కట్టారు, అందమైన కుండలు, బొమ్మలు తాయారు చేయడం, రబ్బరు తయారు చేయడం నేర్చుకున్నారు. ఇంతటి నాగరికతను సాధించినటువంటి మాయన్లు చివరకు అవన్నీ వదిలి ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చిందో తెలియజేసే వివరాలు స్పష్టంగా లేవు.

మేము రెండు టూర్లకు వెళ్ళాము. ఆ వివరాలు:

Chichin Itza: మాయన్ నాగరికత ప్రతిబింబించే పురాతనమైన ఊరు. క్రీస్తు శకం 750 నుండి 1200 వరకు ఎంతో అభివృద్ధి సాధించినటువంటి నగరం ఇది. ఇక్కడ దొరికిన శిధిలాలలో ఎన్నో గుళ్ళు, పిరమిడ్ ఉన్నాయి. ఇవి ఈజిప్ట్ పిరమిడ్ ల వంటివి కావు. మాయన్ లకు ఇవి చాలా పవిత్రమైనవి. వీరి కట్టడాలు ఎంతో ప్రసిద్ది.

El Castillo
El Castillo స్పానిష్ లో కుకుల్కన్ గుడి అని అర్ధం. ఈ పిరమిడ్ కు నాలుగు వైపులా ఒక్కో వైపు 91 మెట్లుంటాయి, అంటే మొత్తం 364 పైన ఉన్న ఉన్న మేట్టుతో కలసి మొత్తం 365. అప్పట్లోనే సంవత్సరంలో రోజులు లెక్కించారు. అక్కడ మెట్లకు సుమారుగా 30 అడుగుల దూరంలో నిలబడి చప్పట్లు కొడితే పైనుండి Quetzal పక్షి కూత వినిపిస్తుంది. అది ఎలా సాధ్యమౌంతుందో నేటి వరకు కూడా ఎవరూ కనిపెట్టని విషయం. Quetzal పక్షిని వీరు దైవ దూతగా కొలుస్తారు.

         పిరమిడ్ పక్కనే ఒక బాల్ కోర్ట్ ఉంది. 225 అడుగుల వెడల్పు, 545 అడుగుల పొడవున  బాల్ కోర్ట్ ఒక చివర మాయన్ రాజు కూర్చుని మాట్లాడితే ఆ చివరకు స్పష్టంగా వినపడడం మరో విశేషం. Ullama అనే ఆట అక్కడ ఆడతారు. దాదాపుగా 3 కిలోలకు పైగా ఉన్న బాల్ ను ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నట్టి రింగ్ లో వెయ్యాలి. అదీ చేతులు, కాళ్ళు, తల ఉపయోగించకుండా కేవలం నడుము ఉపయోగించి మాత్రమే ఆడాలి.

గెలిచిన ఆటగాడు ఓడిపోయిన వారి తల నరుకుతాడు. చరిత్రలో నరబలి చాలా ఆచారాల్లో కనిపిస్తుంది. మాయన్ నాగరికతలో ప్రాణత్యాగం చేయడం భగవంతునికి రక్తాన్ని, ప్రాణాన్ని అర్పించడం అతి ముఖ్యమైన రివాజులు.

మాయన్ లు నివసించిన ఇల్లు. కర్రలతో కట్టి మట్టితో అలికి పైన గడ్డి కప్పుతారు.


టూర్ విశేషాలు: ఉదయం 7:30 బయలుదేరితే, సాయంత్రం 8:30 కి రిసార్ట్ కి వచ్చాము. పిరమిడ్ తప్పక చూడవలసినది. అక్కడ చూసిన బావి, గిఫ్ట్ షాప్ అవన్నీ పెద్దగా చూడవలసినవి కాదు, సమయం వృధా అనిపించింది. ఈత వచ్చి నలభై అడుగుల లోతు బావిలో ఈదగలిగితే బావి దగ్గరకు వెళ్ళొచ్చు. స్నీకర్స్, బేతింగ్ సూట్ కావాలని చెప్తారు కాని బావిలో దిగకపోతే బెతింగ్ సూట్ అవసరం లేదనిపించింది. వాతావరనం వేడిగా ఉంటే స్నీకర్స్ లేకపోతేనే మంచిది. టూర్ వాళ్ళే మంచినీళ్ళు, సోడా ఇచ్చారు. పిరమిడ్ కి వెళ్ళే దారిలో రెస్ట్ రూమ్స్ దగ్గర ఆపారు కాని అవి శుభ్రంగా లేవు. పిరమిడ్ దగ్గర వున్న రెస్టారెంట్ లో  భోజనం ఫరవాలేదు, మాయన్ చికన్, స్వీట్ పొటాటో డిసర్ట్ వెరైటీగా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ టూర్ వాళ్ళే ఇచ్చారు కాని, నీళ్ళు, డ్రింక్స్ మనమే కొనాలి.

Rio Secreto Tour:

పచ్చని చెట్ల మధ్యలో, మట్టి రోడ్డు మీద సైకిల్ మీద వెళ్ళడం అదీ రెండు దశాబ్దాల తరువాత సైకిల్ తొక్కడం ఓ గొప్ప అనుభూతి. దాదాపుగా ముప్పై అడుగుల లోతున్న దిగుడు బావిలోకి తాడుతో వేలాడుతూ దిగడం...కొంచెం భయం వేసింది కాని దిగిన తరువాత చాలా బావుంది.
టూర్ గైడ్ Mugeil, ఓ ఇరవై ఏళ్ళ పిల్లవాడు చక్కగా వివరించి చెప్తూ అన్నీ చూపించాడు. అక్కడే బట్టలు మార్చుకోవడానికి వసతి, వస్తువులు పెట్టుకోవడానికి లాకర్లు ఉన్నాయి. భోజనం కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు.

ఈ టూర్ విశేషం ఏమిటంటే స్టాలగ్టైట్, స్టాలగ్మైట్ లు ఏర్పడినటువంటి గుహలో దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం ప్రయాణిస్తాము. Luray Caverns, Virginia లో ఇలాంటివి చూశాము కాని, ఇలా భూగర్భనదిలో నడవడం ఇదే ప్రధమం. చీకటి, నిశ్శబ్దం... హెల్మెట్ కున్న లైట్ ఆపేస్తే కళ్ళు మూసినా, తెరిచినా ఒక్కటే. నీళ్ళు మాత్రం స్వచ్చంగా ఉన్నాయి. మెడ లోతు వరకూ వచ్చిన నీళ్ళలో దాదాపుగా తేలుతున్నట్లుగా నడిచాం. దేవతలు ఇటువంటి గుహలలో ఉంటారని మయన్ల నమ్మకం. అందువలన వారెవరూ ఈ గుహలలోకి వెళ్ళేవారు కాదట. 

టూర్ విశేషాలు: 8:30కి  ప్రైవేట్ వేన్ లో బయలుదేరితే సాయంత్రం 6:00 గంటలకు రిసార్ట్ కి తిరిగి వచ్చాము. ఒక్క రిసార్ట్ నుండే ఎక్కువమంది వెళ్ళినట్లయితే అంత సమయం పట్టకపోవచ్చు. రెస్టారెంట్ లో నెపోలియన్ ఫుడ్, కాక్టస్ కర్రీ, హైబిస్ కస్ జ్యూస్ వెరైటీగా అనిపించాయి. కెమెరా తీసుకుని వెళ్ళలేము. వాళ్ళు తీసిన ఫోటోలు కొనుక్కోవాలి.  

స్కూబా డైవింగ్ ఈ ప్రాంతంలో చాలా బావుంటుంది కాని సమయం సరిపోక వెళ్ళలేకపోయాము. వారం రోజులు వెళ్తేసరిపోవచ్చు. అలాగే డౌన్ టౌన్ కి వెళ్ళితే కూడా బావుంటుందని విన్నాము. రిసార్ట్ నుండి సొంతంగా బయటకు వెళ్ళేట్లయితే వేరే దేశం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని వెళితే మంచిది. 

మూన్ పాలస్ రిసార్ట్ కబుర్లు ఇక్కడ...

Sunday, March 13, 2016

కాన్ కూన్ - మెక్సికో

       "రండి రండి ప్రయాణం బాగా జరిగిందా?" అంటూ రిసార్ట్ దగ్గర వేన్ దిగగానే పువ్విచ్చి ఓ పలకరింపు. బాగానే జరిగిందంటూ సూట్ కేస్ తీసుకోబోతుంటే, "అవన్నీ మేం లోపల పెట్టిస్తాం, ఎప్పుడనగా బయరుదేరారో ఏమిటో ముందు లోపలకు వెళ్ళండి, మీకోసం అంతా ఎదురు చూస్తున్నారు" అంటూ హడావిడి పెట్టేశారు. లోపలకు వెళ్ళామా...

      చక్కగా అలంకరించుకున్న ఓ ఇద్దరు అమ్మాయిలు ఆ కబురూ ఈ కబురు చెప్తూ ఇవాళ్టి నుండి మీరు మాకు చుట్టాలే ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అంటూ మా చేతికో  కడియం తొడిగారు. ఎప్పుడు తయారు చేశారో ఏమిటో మాటల్లోనే ఓ కేక్ ఇచ్చి మీరు ఇది తీసుకోవాల్సిందే అంటూ బలవంతపెట్టేశారు.

        ఇంతకీ ఎక్కడికెళ్ళారు, ఏమిటీ హడావిడి... ఇదేగా ప్రశ్న. ప్రశాంతంగా ఓ నాలుగు రోజులు గడపాలని కాన్ కూన్ వెళ్దామనుకున్నాం. ప్రయాణం అనుకున్నాక ఎలా వెళ్ళాలి? ఏ రిసార్ట్ బుక్ చేసుకోవాలి? అక్కడ చూడవలసినవి ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు. ఇంటర్ నెట్ అంతా గాలించాం. కొంతమంది కొన్ని రిసార్ట్స్ బ్రహ్మండంగా ఉన్నాయంటే మరి కొందరు ఆ రూమ్స్ ఏమిటో వాసన వేస్తున్నాయన్నారు. సముద్రం చూస్తూ సర్వం మరిచిపోగలం అనే వారు కొందరైతే, ఎక్కడా అసలు అలలే లేవు, అంతా సీ వీడ్ అనేవారు మరికొందరు... ఇలా రకరకాల సమాచారాలు. ఏం చెయ్యాలో తోచలేదు. సరే ఏదో ఒకటి అనుకుంటూ ధైర్యం చేసి మూన్ పాలస్ రిసార్ట్ బుక్ చేశాం.

    
        రిసార్ట్స్ బుక్ చెయ్యాలని చూసినప్పుడు కాన్ కూన్, ప్లాయా డెల్ కర్మన్ అని రెండు ప్రాంతాలు కనిపించాయి. ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాలేదు. అక్కడికి వెళ్ళాక తెలిసిందేమిటంటే కాన్ కూన్ వైపు బీచ్ లో సీ వీడ్ ఎక్కువగా ఉంటుందనీ, అక్కడ నీళ్ళలోకి దిగడం కష్టం. అయితే సముద్రం చూడడానికి నెమ్మదిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకోవాలని వచ్చినవాళ్ళకు ఇక్కడ బావుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి దగ్గర.
     ప్లాయా డెల్ కర్మన్ సందడిగా ఉండే ప్రాంతం, డోన్ టౌన్ కి దగ్గర. చుట్టుపక్కల షాపింగ్, రెస్టారెంట్స్ బావుంటాయి. కాజ్ మల్ ఐలెండ్ అక్కడకు దగ్గర. సముద్రంలో పెద్ద అలలు ఉన్నాకూడా దిగడానికి బావుంటుంది.
        మేము పాలస్ రిసార్ట్స్ వారి మూన్ పాలస్ లో బుక్ చేసుకున్నాం. అక్కడ సన్ రైజ్, న్యుజుక్, గ్రాండ్ అని మూడు బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఓ రెండు వేలకు పైగా రూమ్స్ ఉండొచ్చు. మగిలిన రెండింటికంటె సన్ రైజ్ లో రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువ. పిల్లలకు ఇక్కడ చాలా బావుంటుంది. న్యుజుక్ మధ్య వయస్సు వాళ్ళకు గ్రాండ్ పెద్దవాళ్ళకు బావుంటుంది. అయితే ఏ బ్లాక్ లో ఉన్నా కూడా ఉన్నా ప్రతి పదిహేను నిముషాలకు లాబీ టు లాబీ బస్ తిరుగుతూ ఉంటుంది.
ఓషన్ ఫ్రంట్ రూమ్ అంటే కిటికీ నుండి ఎక్కడో సముద్రం కనిపిస్తునదనుకున్నాం కనీ ఇలా మరీ ఇరవై అడుగుల దూరంలో  అలల గలగలలు వింటూ నిద్రపోతాం అనుకోలేదు. 
కళ్ళు తెరవగానే కనిపించిన అద్భుత సౌందర్యం.


       మూన్ పాలస్ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్, అంటే ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఫ్రీ. ఇటాలియన్, మెక్సికన్, కరేబియన్, బ్రెజిలియన్ ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏ రెస్టారెంట్ కైనా వెళ్ళొచ్చు. దాదాపుగా క్రూజ్ లాగా అనుకోవచ్చు, కాని అక్కడ ఇన్ని రెస్టారెంట్స్ ఉండవు. ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. ఆలూ పాలక్, చికెన్ కార్రీ, పొటాటో ఫ్రై, ఎగ్ ప్లాంట్ కర్రీ ఇలా మన వంటలు కాస్త ఉప్పూ, కారం తక్కువైనా రుచిగానే ఉన్నాయి.




      ప్రతి రోజూ సాయంత్రం ఏదో ఒక షో ఉంటుంది. ఫైర్ షో చూడలనుకున్నాము కాని గాలి ఎక్కువగా ఉన్న ఉందండంతో అది చెయ్యలేకపోయారు. బెల్లీ డాన్స్ కి వెళ్ళాము. అక్కడ సగానికి పైగా హిందీ పాటలకే డాన్స్ చేశారు, కోరియోగ్రఫీ కొత్తగా ఉంది.


     మేమున్న దగ్గర సీ వీడ్ ఎక్కువగా ఉండడంతో సముద్రంలో దిగాలనిపించలేదు. ఒకప్పుడు బాగానే ఉండేదట. కోరల్ రీఫ్ ఏర్పడిన కారణంగా సీ వీడ్ ఎక్కువగా వస్తున్నదట. ప్లాయా డెల్ కర్మన్ లో పాలస్ రిసార్ట్స్ వారి మరో రెండు రిసార్ట్స్ ఉన్నాయి. సన్ పాలస్, బీచ్ పాలస్... అవి ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయట. రెస్టారెంట్స్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుందని విన్నాము. అక్కడకు మూన్ పాలస్ నుండి రిసార్ట్ బస్ లు వెళుతూ ఉంటాయి. ఆ రిసార్ట్ లో అన్ని వసతులూ వాడుకోవచ్చు.

బడి, గుడికి, పెళ్ళికి వెళ్ళాలంటే కొన్ని సాంప్రదాయలుంటాయి. అలాగే ఇక్కడ బీచ్ వెకేషన్ కి కూడా అవసరం లేదనుకుంటే ఫరవాలేదు కాని లేదంటే వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని వెళ్తే మంచింది.

ముందుగా తెలుసుకున్నవి, అక్కడికి వెళ్ళాక తెలిసినవి:
  • వెకేషన్ గురించి పూర్తిగా తెలుసుకుని కావలసిన వస్తువులు సమకూర్చుకోవడం. కొన్ని రెస్టారెంట్స్ కి వెళ్ళాలంటే సెమై ఫార్మల్ డ్రెస్ ఉండాలి. అలాగే బేతింగ్ సూట్స్, సన్ బ్లాక్ లోషన్స్, హాట్స్, గాగుల్స్ ....
  • రిసార్ట్ కి వెళ్ళిన వెంటనే షోస్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాయి, ఏ రెస్టారెంట్ లో ఏ ఫుడ్ ఉంటుంది, రెస్టారెంట్, పూల్ టైమింగ్స్ అన్నీ తెలుసుకోవడం మంచిది. అలాగే వాళ్ళ సర్వీసెస్ కూడా. 
  • రిసార్ట్ అంతా చూపిస్తాము, ఒక్క గంటన్నర చాలు అంటూ అపాయింట్ ఇస్తారు. అయితే అది రిసార్ట్ చూపించడంతో పాటు రిసార్ట్ మెంబెర్ షిప్ గురించి తెలియజేయడం. అది ఉదయం 8:30 నుండి 2 గంటల వరకూ పట్టింది. మెంబెర్షిప్ ఆ ఒక్క రిసార్ట్ వరకే కాకా ప్రంపంచంలోని అనేక దేశాల రిసార్ట్స్, హోటల్స్ లో డిస్కౌంట్ ఉంటుంది. పర్యాటన ఇష్టం ఉన్నవాళ్ళకు ఇవి ఉపయోగమే అనిపించింది, లేకపోతే ఊరికే టైమ్ వెస్ట్. 
  • రిసార్ట్ క్రెడిట్స్ ఇస్తారు. అవి రొమాంటిక్ డిన్నర్స్, స్పా సర్వీసెస్ కు వాడుకోవచ్చు. టాక్స్ చాలా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. గిఫ్ట్ షాప్ దగ్గర అవి వాడడం అనవసరం అనిపించింది. 
నచ్చినవి:

Food: Fried Banana, Omelet, Fresh Green juice, Lime soup, Mixed fruit juice, 7 onion soup, Fresh pastries, 6 course meal.

New Foods: Crepe, Cactus curry, Sweet and spicy Popsicle, Fish soup, Habanero hot sauce.

Facilities: Pools, Spa, Food service at the pool, Special dinners, Beautiful walkways.

మరచిపోలేని అనుభూతులు: అందమైన సముద్రం, ప్రకృతి, గుహలో నీళ్ళలో నడవడం, సైకిల్ తొక్కడం, సూర్యోదయాలు, రిసార్ట్ వారి మర్యాదలు.

మాయన్ నాగరికత గురించి, టూర్స్ గురించిన విశేషాలు ఇక్కడ.... 

Monday, February 29, 2016

ఏమిటీ పాఠశాల??

         "ఎక్కడా అడ్వర్ టైజ్ మెంట్ లేదు. ఏ టివిలోనూ చూడలేదు, వార్తా పత్రికలోనూ చదివిన గుర్తులేదు. ఈ 250 మంది విద్యార్ధులేమిటీ! 45 మంది టీచర్లేమిటీ! మూడు ఊర్లలో ఈ తరగతులేమిటీ! ఏడాదికి ఏడాదికీ రెట్టింపు సంఖ్యలో విద్యార్ధులు పెరుగడమేమిటీ? ఏడువందల మందితో వార్షికోత్సవమా! పైగా ఇంతమంది కార్యకర్తలు ఏదో తమ కుటుంబంలో పనిలా చకచకా చేసేస్తున్నారు, అచ్చ తెలుగు వంటకాలు వండి తీసుకుని వచ్చి మారీ విందుభోజనం పెడుతున్నారు. ఎలా సాధ్యం అవుతోంది ఇదంతా?" అంటూ వేరే ఊరు నుండి మా ఊరు వచ్చిన వారు, నిన్న జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో కలసినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానంగానే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. 

      "పాఠశాల అంటే ఏమిటి? ఏం చేస్తున్నామిక్కడ?" అన్న విషయానికి వస్తే బంధాలు, బంధుత్వాలు గురించి చెప్పుకోవాలి. మనిషి సంఘజీవి. సుఖమైనా దుఃఖమైనా పంచుకునే వారుండాలి, మన వాళ్ళైతే మరీ సంతోషం. రక్త సంబంధీకుల మధ్యైనా సరే అనుబంధం బలపడాలంటే అర్ధం చేసుకునే భాష ప్రధానం. మన పిల్లలకు మన పెద్దవాళ్ళతో అనుబంధం ఏర్పడడానికి అవరోధంగా ఉంది ఈ భాష. మాతృభాష మనం పిల్లలకు నేర్పించినట్లయితే ఆ సమస్యను అధిగమించవచ్చుననే ఉద్దేశ్యంతో 2009 జనవరిలో చార్లెట్ లో మొదలైంది పాఠశాల. 

       అయితే ఇప్పటి విద్యావిధానం అటు ఇండియాలో కానీయండి ఇక్కడ కానీయండి కేవలం బ్రతుకు తెరువు చూపించే చదువుల పట్ల శ్రద్ధ వహిస్తున్నాయి కాని, మానవ సంబంధాలు, అనుబంధాలు, మానసిక వికాసం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనం చిన్నప్పుడు నలుగురి మధ్య పెరిగిన వాతావరణం కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రోజులో ఎక్కువ శాతం చదువు, వారి క్లాసులు వాటితోటే వారికి సమయం గడిచిపోతోంది. మిగిలిన సమయం ఎలెక్ట్రానిక్స్... పిల్లలకు మంచీ, చెడూ చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా పూర్తిగా మనమీదే ఉంది. ఇవన్నీ కూడా పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు వారిని గమనించి తెలుసుకున్న అంశాలు. అందుకే తెలుగు నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్న పాఠశాల విద్యావిధానంలో నీతి శతకాలు, మంచి విషయాలు, సుభాషితాలు చేర్చడం జరిగింది. ఈ శతకాలు నేర్చుకోవడం వలన మరో ప్రయోజనం భాషలో స్పష్టత పెరగడం. 

      భాష భావం భవిత...ఇవి పాఠశాల లక్ష్యాలు. మాతృభాషను బోధిస్తూ, విద్యార్ధులలో మంచి భావాలు పెంపొందించి భవితను సన్మార్గం వైపు నడిపించడమే పాఠశాల ముఖ్యోద్దేశ్యం.

       ఏడేళ్ళ క్రితం తెలుగు నేర్పించాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురైన సమస్య ఏమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి? పుస్తకాలు లేవు, ఇండియా నుండి తెప్పించిన పుస్తకాలు తెలుగు రాయడం నేర్పించడానికి ఉపయోగపడుతున్నాయి కాని మాట్లాడడం నేర్పడానికి కాదు. అప్పుడే సిలబిస్ స్వంతంగా తాయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపకల్పనే ఈ నాటి నాలుగు తరగతుల పాఠ్యాంశాలు. ఆ తరువాత పిల్లలకు ఆసక్తి కరంగా ఉండేలా వర్క్ షీట్స్ తాయారు చేయడం జరిగింది. ఈ అభ్యాసాలు పూర్తిచేయడం వలన వారికి రాయడం, చదవడమే కాక చక్కని తెలుగు మాట్లాడానికి కూడా తేలిక అయింది.


      "నేను ప్రొఫెసర్ ను కాను, లక్చరర్ ని కాను, చివరకు టీచర్ ని కూడా కాను మరి నాకున్న పరిమితజ్ఞానంతో తాయారు చేసినటువంటి ఈ సిలబస్ సరైనదేనా? ఎవరైనా తెలిసిన వారు చూసి చెపితే బావుణ్ణు" అని అనుకుంటూ ఉండేదాన్ని. అనుకోకుండా ఓ ఆరు నెలల క్రితం "తెలుగు ఎందుకు నేర్పించాలి?" అన్న చర్చలో పాల్గొనడం జరిగింది. అదే చర్చలో పాల్గొన్నటువంటి కేతు విశ్వనాధ రెడ్డి గారి మాటల ద్వారా వారు పలు విద్యా సంస్థల సిలబస్ ను పరిశీలించినట్లుగా అర్ధం అయింది. వారు డా|| బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటి డైరెక్టర్ గా పని చేసిన వారూ, ప్రముఖ కథకులు, విమర్శకులు కూడానూ. వారికి విషయం చెప్పాను. ఆయన వెంటనే "తప్పకుండానమ్మా పంపించండి చూద్దాం"  అన్నారు. సిలబస్ పంపించాను. 

     వారు క్షుణ్ణంగా పరిశీలించి, సిలబస్ లోని ప్రతి వాక్యాన్ని వివరిస్తూ దాదాపుగా మూడు గంటలు నాతో మాట్లాడారు. వారేమన్నారంటే "పరభాషా మాధ్యంలో పెరుగుతున్న పిల్లలకు ముందుగా నేర్పవల్సింది మాతృభాషలో మాట్లాడడం. అది కూడా చాలా సులువుగా ఉండాలి. వారి తల మీద బరువులా ఉండకూడదు. బాగ్ ని సంచి అని, టేబుల్ ని బల్ల అని, సాక్స్ ను మేజోళ్ళు అని  నేర్పనవసరంలేదు. వాడుక భాష నేర్పినట్లయితే వారు సులభంగా నేర్చుకోగలుగుతారు. మీ సిలబస్ సరళంగా నేర్చుకునేలా ఉంది. ఇలాగే ఉండాలి కూడా". అంటూ అక్కడా చిన్న చిన్న మార్పులు సూచించారు. ఆ మాటతో గొప్ప ఉత్సాహం వచ్చింది. 

       షికాగో, విస్కాన్సిన్, అగస్టా, మెంఫిస్... ఇలా చాలా ప్రాంతాల వారు మా పాఠశాల విద్యావిధానం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సిలబస్ అడిగితే సంతోషంగా ఇస్తున్నాం. అయితే ఒక్క షరతు ఈ సిలబస్ ను విజ్ఞానం పంచడానికి ఉపయోగించాలే తప్ప వ్యాపారంగా మార్చుకోవడానికి కాదు. అంటే తెలుగు నేర్పించడానికి మా సిలబస్ తీసుకున్నట్లయితే వారికి పాఠాలు ఉచితంగా చెప్పాలి. న్యూ జెర్సీ లోని జై గురుదత్త సంస్థ వారు పాఠశాల సిలబస్ నుపయోగించి పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు.  

      మాకు తెలుగు నేర్పించడమే ప్రధానం. అందుకే మా ఉపాధ్యాయులే విద్యార్ధుల దగ్గరకు వెళ్తారు. అర్ధం కాలేదా? మా పాఠశాలకు స్కూల్స్ అవీ అవసరం లేదండీ. ఉపాధ్యాయుల ఇళ్ళే తరగతులు. ఆరుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులు, అంతకు మించితే ఇద్దరు ఉపాధ్యాయులు. సంఖ్య ఎక్కువైన కొద్దీ విద్యార్ధులందరినీ పట్టించుకోవడం కుదరదు.  

      భాష కోసం ఏమైనా చెయ్యాలనే తపన ఉన్నవారు కొందరైతే, ఎలాగూ మన పిల్లలకు నేర్పాలనుకుంటున్నాం మరికొంత మందితో కలిసైతే ఉత్సాహంగా నేర్చుకుంటారని అనుకునే వారు మరికొందరు. పాఠశాల వలన మా పిల్లలు మా పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతున్నారు ప్రతిగా పాఠశాలకు ఏమైనా చెయ్యాలనుకునే వారు ఇంకొందరు. ఇలా ఎవరికి వారు ఆలోచించుకుని పాఠాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు.  

       ఎక్కడా అడ్వర్టైజ్ మెంట్ లేదేమిటి? అని వారిడిన ప్రశ్నకు మా సమాధానం అడ్వర్ టైజ్ మెంట్ ఇవ్వడానికి ఇది వ్యాపార సంస్థ కాదు. పిల్లలకు తెలుగు నేర్పించండి అని మేమెవ్వరికీ చెప్పం. పిల్లలకు తెలుగు నేర్పించాలనుకోవడం స్వవిషయం. తెలుగు నేర్పించాలనుకునే వారికి సహాయం చేస్తాం. మా పాఠశాల తల్లిదండ్రులకు కూడా ఒక్కటే చెప్తాం. "మీరే మీ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులు దానికి సులువైన మార్గం చూపిస్తారు."     
  
        కొలంబియా తెలుగు అసోసియేషన్ వారు పోయిన సంవత్సరమే పాఠశాల తరగతులు మొదలు పెట్టారు. ఈ ఏడాది అక్కడ నలభైకి పైగా విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. రాలేలో ఈ ఏడాదే పాఠశాల మొదలైంది. అక్కడ కూడా పాతిక మంది వరకు విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు తెలుగు నేర్చుకోవడం చూస్తుంటే మాతృభాష మీద పెరుగుతున్న మమకారానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది.