Thursday, April 25, 2019

పాటషాల

ఈ రోజు ఉదయం కాఫీ లేదు. ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్ లో పాలు లేని విషయం నిన్న సాయంత్రం  అంత ముఖ్యమైన విషయంగా తోచలేదు మరి. సరే ఉద్యోగం ఒకటి ఉందిగా ఉదయం ఆరున్నరకల్లా ఇంటి దగ్గర బయలుదేరితేగాని ఏడుగంటల ట్రైన్  దొరకదు. ఇవాళ హడావిడిగా లేచి పరుగులు పెడుతూ వచ్చి ట్రైన్ లో కూర్చున్నాను. రాత్రి కిక్ ఇంకా దిగలేదు, ఫుల్  హాంగ్ ఓవర్. 

"ఏమిటీ ఈ కోణం కూడా ఉందేమిటి" అని అపనమ్మకమూ, ఆశ్చర్యమూ కలిపేసి అలా కోపంగా చూడకండి. సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి మత్తులో ఉంటానో మా వాళ్ళందరకూ తెలుసు. అర్ధరాత్రుళ్ళు మెయిల్స్, వాట్స్ ఆప్ మెసేజెస్ వెళ్తుంటాయ్ కదా! సిలబస్ మీద పనిచేస్తుంటే నిద్రెలా పడుతుంది? సరే ఇదంతా మాకెందుకు చెప్తున్నట్లు అనుకుంటున్నారా?

నేపథ్యం తెలియకపోతే విషయం పూర్తిగా అర్ధం కాదుగా అందుకని.

ఇంతలో ఒకావిడ ట్రైన్  ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లన్నీ వదిలేసి నా పక్కన వచ్చి కూర్చున్నారు.

"ఆర్ యు జ్యోతి? ”
"యా, సారీ ఐ డోంట్ రిమెంబర్ యు, డిడ్ వుయ్ మీట్ సంవేర్? " అడిగాను. 
"పాటషాల" అన్నారు. 

మత్తు కొంచెం దిగింది. పాఠషాల అయితే. చి, ఛీ పాఠశాల అయితే నన్ను గుర్తుపట్టాలిగా, నేనేనా అని  ఎందుకడుగుతున్నట్లు. సందేహం వచ్చింది. అవున్లే పట్టుదో, కాటన్ దో ఏదో ఒక చీర కట్టుకుని ఎప్పుడూ ఇంత బొట్టూ, కాటుకతో కనిపించే నేను ఇలా తెల్ల చొక్కా, నల్ల పేంట్ వేసుకుని, మొహాన బొట్టూ అదీ లేకుండా బరువు కళ్ళతో ట్రైన్ లో ఓ మూల కూర్చునుంటే ఎవరు మాత్రం గుర్తు పట్టగలరు? ఎందుకైనా మంచిదని

"డు యు స్పీక్ తెలుగు?" అని అడిగాను.
"పాటషాల అంటుంటే" అన్నారావిడ. 

మత్తుపూర్తిగా దిగింది.  
"ఓ మీ పిల్లలు పాఠశాలలో ఉన్నారా? ఒకటవ తరగతా?" అడిగాను. 
"లేదండీ నాలుగవ తరగతి" చెప్పారు. 
😭

సిలబస్ రివ్యూ చేస్తున్నప్పుడు ప్రతివారం డిక్టేషన్ లో పాఠశాల, భారతదేశము ఉండాలని లక్ష్మి గారు  ఎందుకన్నారో అప్పుడర్ధం అయ్యింది.

ఈ సారి సమ్మర్ వర్క్ లో శలు, ళలు, ణాలు.. ఇంకా ఫలు, ఠలు, ఢలు...... 😡😡😡

Tuesday, April 16, 2019

పాఠశాల పదవ వార్షికోత్సవం

పాఠశాల పదవ వార్షికోత్సవం జరుపుకున్నాం. అవునండీ పదవ వార్షికోత్సవమే. షార్లెట్ లో పుట్టి పెరిగిన పాఠశాల. ఎట్లా జరుపుకున్నామో తెలుసా! ధూమ్ ధామ్ గా జరుపుకున్నాం. 200 మంది విద్యార్ధులు, 37 మంది ఉపాధ్యాయులు, 700 మందికి పైగా సభ్యులు కలసి చేసుకున్నామంటే మరి చూడండి. మా ఉపాధ్యాయులు మంచి మంచి పాటలు, పద్యాలు, నాటికలు వేయించారు. చిన్న పిల్లలైనా మా విద్యార్ధులు బహు చక్కగా ప్రదర్శించారు. వార్షికోత్సవం నాటి భోజనల్లోకి వెయ్యికి పైగా లడ్లు స్వయంగా చేసుకున్నాం. బకెట్లు అవీ అంత తేలిగ్గా దొరకని అమెరికాలో కూడా బకెట్లతో సాంబారు వడ్డించుకున్నాం. భోజనానంతరం వేసుకున్న కిళ్ళీలు కూడా మేమే తయరుచేసుకున్నాం.

ఎప్పట్లాగే ఈ వార్షికోత్సవం కోసం కూడా మా పాఠశాల తల్లిదండ్రులతో సహా ఎవరినీ చందాలు అడగలేదు. మా విద్యార్ధులు తలకో నలభై డాలర్లు వేసుకున్న డబ్బుల్లో వాళ్ళకి తెలుగులో వ్రాసిన ట్రోఫీలు, ఉపాధ్యాయులకు ప్రముఖ రచయితలు స్వయంగా సంతకం చేసిన పుస్తకంతో పాటు చిన్న బహుమానం, పూర్వ ఉపాధ్యాయులకు ట్రోఫీలు, స్వచ్చంద కార్యకర్తలకు బుల్లి బహుమానాలు కూడా ఇవ్వగాలిగాం.

పాఠశాల గుర్తింపు చిహ్నంలో ఏం ఉన్నాయో తెలుసా? భాష, భావం, భవిత. వాటి అర్ధం భాషను నేర్పిస్తూ, మంచి భావాలు పెంపొందించి భవిత సన్మార్గంలో ఉండేట్టు చూడడం అన్నమాట. ఈ భావాలు పెంపొందించడం అంటే పాఠ్యాంశాలలో మంచి మాట, సుభాషితాలు పెట్టడమే కాక వాటిని ముందు ఆచరించి చూపిస్తున్నాం. ఎలా అంటారా?

ఉదాహరణకి ఫీజు లేకపోతే కమిట్ మెంట్ ఉండదనే భావనను తోసిరాజన్నాం, ఒక సంస్థ అభివృద్దికి ధనమో, ప్రచారమో అవసరం లేదని ఢ౦కా భజాయించి చెప్పాం. ఇప్పటివరకు మా కార్యక్రమాలకు స్పాన్సర్స్ లేరు. ఎవరైనా విరాళం ఇస్తామన్నా మేము తిరస్కరిస్తుంటాం.

మామూలుగా ఇవన్నీ చెప్పుకుంటే బాకా ఊదుకున్నట్లు ఉంటుందేమో అని మొహమాట పడేవాళ్ళం అయితే ఈసారి మా కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిధిలే ఆ మాట చెప్పాక మేము కూడా మహా గర్వంగా చెప్పుకుంటున్నాం. శ్రమ అనుకోకుండా ఎంతో దూరం నుండి మా కార్యక్రమానికి విచ్చేసి మా కుటుంబసభ్యుల్లా కలసిపోయిన కిరణ్ ప్రభ గారికి, కాంతి గారికి, ఫణి గారికి, శ్రీనివాస్ భరద్వాజ కిషోర్ గారికి, రవి శంకర్ గారికి అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

పాఠశాాల ఉపాధ్యాయులకు ఒక పుస్తకం బహుమతిగా ఇవ్వడం పోయినేడాది నుండి మొదలుపెట్టాం. ఈ ఏడాది కొంతమంది రచయితలు పాఠశాల బృందానికి తమ సంతకంతో పుస్తకాలు పంపించారు. మధురాంతకం నరేంద్రగారికి, వారణాసి నాగలక్ష్మి గారికి, డొక్కా ఫణి కుమార్ గారికి, దగ్గుమాటి పద్మాకర్ గారికి, మునుకుంట్ల గునుపూడి అపర్ణ గారికి, రాధ మండువ గారికి, సోమరాజు సుశీల గారికి, పీ. సత్యవతి, అత్తలూరి విజయలక్ష్మి గారికి, పొత్తూరి విజయలక్ష్మి గారికి వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీరిలో చాలా మంది రచయితలు ఉచితంగా తమ పుస్తకాలు పంపించారు.

అతిధుల మాటల్లో
https://www.paatasalausa.org/videos