నిన్నుదయం ఆ పనీ ఈ పనీ పూర్తై అట్లా కాఫీ కప్పట్టుకుని ఇట్లా కూర్చున్నానా, పిలవని పేరంటానికి మల్లె తగదునమ్మా అని పని గట్టుకుని మరీ వచ్చి వాలిపోయాయ్. ఇక చేసేదేము౦దీ......రాని నవ్వు ముఖాన పులుముకుని "ఏమైనా పనిమీద వచ్చారా" అన్నా. అప్పుడెప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు రమ్మన్నాన్ట . అది గుర్తుపెట్టుకుని సందు చూసి మారీ వచ్చాయ్. నాకా ఎక్కడలేని మొహమాటమయ్యె, పైగా 'మాతృదేవోభవ......అతిధి దేవోభవ......' అని మన సా౦ప్రదాయమొకటు౦డె. ఇక ఈ నోటితో వెళ్ళమని ఎట్లా చెప్పేది?
పోనీ ఆ కబురూ, ఈ కబురూ చెప్తూ ఒద్దిగ్గా ఒక చోట ఉంటాయా! ఉహు..ఎందుకు౦టై, ఎప్పుడైనా ఉ౦డే అలవాటుంటే కదా ఇప్పుడు౦డడానికి, ఆ వైపుకి ఈ వైపుకి ఒకటే పరుగులు. ఒక్క నిముషం నిలకడ లేదంటే నమ్మండి. ఎవరికి తప్పినా నాకు తప్పదుగా మరీ..... పైగా పిలిచి౦ది నేనేనైతిని. ఎక్కడోదగ్గరకెళదామంటై, ఒక ఊరని లేదూ...వాడని లేదూ... నే పరుగులు పెట్టాలేకానీ... చంద్రమండలానికైనా సరే.
ఏమాట కామాట చెప్పుకోవాల్లెండి. వాటితో పాటు వెళ్లినందుకు ఎన్నెన్ని చూపించాయో, ఎక్కడెక్కడ తిప్పాయో, అదే౦ చిత్రమో వాటికి అలుపన్నది లేదంటే నమ్మండి. ఏమిటీ ఇంతకూ ఎక్కడెక్కడకెళ్ళామంటారా? అదే చెప్పబోతున్నా.....మైదానాలూ, కొండలూ, లోయలూ, సముద్రాలూ, ...అబ్బో చాలా తిరిగాం లెండి. కొండలెక్కాక గాల్లోనె నిలబెట్టేశాయంటే నమ్మ౦డి, ఏమిటీ... మరి లోయల్లోనంటారా.... ఎందుకడుగుతార్లెండి.
చూశారా చూశారా మీతో కబుర్లలో పడిపోయి పరిచయ౦ చెయ్యడమే మరచి పోయాను. అసలు ఈ మరచిపోవడం, దాని గురించి చెప్పాలంటే మనం ఓ రెండో, పన్నె౦డో ఏళ్ళు వెనక్కెళ్ళాలన్నమాట. అప్పట్లో నేనూ విమల, అబ్బ.... స్వీట్ హోం విమల కాదండీ బాబూ నా ఫ్రెండ్ విమల, రోజూ మధ్యాన్నాల్లు సరదాగా రేడియోలో పాటలు పెట్టుకుని టీలు తాగేవాళ్ళం. తోడుగా బోలెడు కబుర్లు. ఓ రెండు మూడు గంటలు మా మధ్య సరదాగా తిరిగేస్తు౦డేవి, తనని పంపించి గేటు ఇలా మూసి అలా వెనక్కి తిరగ్గానే గుర్తుచ్చేది డబ్బాలో ఉన్న జంతికల గురించి. రేపొచ్చినప్పుడు తప్పకుండా జంతికలు పెట్టే మాట్లాడాలనుకునేదాన్ని. ఊహూ....కుదర౦దే ....అప్పుడూ ఇంతే. మరి ఇప్పుడో అని మీరంటే, మళ్ళీ అంతే అని నేనంటా... తనని చూసిన క్షణం....నాకు జంతికలు గుర్తొస్తే అదే౦ స్నేహమో మీరే చెప్పండి.
పాపం తిరిగి తిరిగి అలసి పోయ్యాయేమో అని కాసిని అక్షరాలిచ్చా.... అయ్యో పరిచయం చేస్తానినని మళ్ళీ కబుర్లతో కాలం గడిపేస్తున్నానా, ఏమిటీ ఇక పరిచాయాలవీ అవసరం లేదంటారా ...అలాక్కానీయండి మరి. నేను చెప్పకుండానే ఆ వచ్చినవి ఊహలని ఎలా కనిపెట్టేసు౦టారబ్బా.... బహుశా అవి ఈ బ్లాగులో అల్లిన మాలలు చూసి కాబోలు. ఏమిటో అంతా విష్ణు మాయ....