Friday, October 31, 2025

జ్సయాన్ నేషనల్ పార్క్ (Zion National Park)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ప్రయాణం మొదటి నుండి చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

యూటా(Utah)లోని మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్(Mighty Five National Parks) లో జ్సయాన్ నేషనల్ పార్క్ (Zion National Park) ఒకటి. మేము జ్సయాన్ కు వెళ్ళేసరికి సూర్యాస్తమయం అవడంతో నీరెండ ఆ కొండలపై బంగారు పూత పూస్తూ ఆ ప్రాంతం అంతా అద్భుతంగా ఉంది. 

కాసేపటికి సూరీడు వెళ్ళిపోయి చంద్రోదయం అయింది. వెన్నెల వెలుగుల్లో ఆ కొండలు మరింత అందంగా ఉన్నాయి. అలా వెన్నెల్లో ఆ కొండల అందాలు చూస్తూ ఘాట్ రోడ్ మెలికల్లో దాదాపుగా ఒక అరగంట ప్రయాణం చేశాము. 

అక్కడ కొండలు, మాన్యుమెంట్ వ్యాలీలోని కొండల్లా ఎరుపు రంగులో కాక తెల్లగా ఉన్నాయి. దానికి కారణం నవాహో శాండ్ స్టోన్. ఆ ఇసుకలో ఐరన్ ఆక్సైడ్ శాతం తక్కువ.

జ్సయాన్ నేషనల్ పార్క్ కు కొంచెం దూరంలో వున్న ‘హిల్టన్ ఆటో క్యాంప్’ సైట్ లో ఆ రోజు మా బస. చుట్టూ కొండలు కొండ కింద  దూరంగా క్యాబిన్స్, ట్రెయిలర్స్ లో వసతి ఏర్పాటు చేశారు. క్యాంప్ సైట్ లోనే స్విమ్మింగ్ పూల్, రిసెప్షన్, రెస్టరెంట్ ఉన్నాయి. ప్రతి ట్రెయిలర్ లో ఒక క్వీన్ బెడ్, సోఫా బెడ్,  మైక్రోవేవ్, ఫుల్ బాత్ ఉన్నాయి. ట్రెయిలర్ లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలం మాకు ఆ విధంగా తీరింది.  విశాలమైన ఆకాశం కింద ఫైర్ ప్లేస్ వెచ్చదనం అనుభవిస్తూ ప్రకాశవంతమైన చుక్కల్ని చూడడం మాత్రం గొప్ప అనుభూతి. 

 A silver trailer parked on a dirt road

AI-generated content may be incorrect.  

పూర్తిగా తెల్లవారక ముందే నిద్ర లేచి నేషనల్ పార్క్ కు వెళ్ళడానికి తయారయిపోయాము. రాత్రి చీకట్లో కనిపించని అందలన్నీ తొలి పొద్దు వెలుగుల్లో తేటతెల్లం అవుతుంటే ఆ దృశ్యం ఎంతో బావుంది.

జ్సయాన్ పార్క్ లోపలకు వెళ్ళడానికి ప్రయివేట్ వాహనాలకు అనుమతి లేదు. టూరిస్ట్స్ కోసం షటిల్ బసెస్ తిరుగుతూ ఉంటాయి. ఆలస్యం చేస్తే షటిల్ బస్ షెల్టర్ దగ్గర పార్కింగ్ దొరకడం కష్టమని, ఉదయం ఆరున్నరకే రిసెప్షన్ దగ్గరున్న కఫే లో కాఫీ తీసుకుని జ్సయాన్ పార్క్ దగ్గరకు బయలుదేరాము. అన్నట్లు నేషనల్ గవర్నమెంట్ షట్ డౌన్ అయినా కూడా యూటా స్టేట్ గవర్నమెంట్ ఆ పార్క్స్ నిర్వహణ బాధ్యత తీసుకోవడం వలన మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ మూసివేసినట్లయితే మా ప్రయాణంలో చాలా ముఖ్యం అనుకున్న ఆ పార్క్ ను చూడలేకపోయేవాళ్ళము.

కార్ పార్క్ చేసి బస్ షెల్టర్ దగ్గరకు వెళ్ళేసరికి షటిల్ బస్ రెడీగా ఉంది. ఆ షటిల్ ఎక్కి చివరి స్టాప్, టెంపుల్ ఆఫ్ సినవావా(Temple of Sinawava) దగ్గరకు దిగాము. ‘సినవావా’ ఆదివాసుల దేవుడు. అక్కడ ఎత్తైన కొండల మధ్యలో విగ్రహం వెలసినట్లుగా ఉండడంతో ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. 

షెల్టర్ దగ్గర బస్ దిగి నడవడం మొదలుపెట్టాము. చుట్టూ ఎత్తైన కొండలు, ఒక వైపు ఏవో పసుపు రంగు పువ్వులు, మరో వైపు చిన్న కాలువలా ప్రవహిస్తున్న నది (Virgin River), హఠాత్తుగా మలుపు తిరిగే కొండ దారి, వీటన్నింటితో ఆ ఉదయపు నడక ఎంతో ఆహ్లాదంగా ఉంది.

    

సుమారుగా ఒక మైలు దూరం నడిచాక ఆ దారి ఆగిపోయి, రెండు కొండల మధ్యలో వర్జిన్ నది వొరుసుకుని ప్రవహిస్తూ ఉంది. అక్కడి వరకు వెళ్ళిన వారు కొందరు వాటర్ షూస్ వేసికుని, స్టిక్స్ పట్టుకుని నడుస్తూ వెళ్లిపోతున్నారు. ఆ ప్రాంతాన్ని ‘నారోస్ (Narrows)’ అంటారు. అలా నీళ్ళలో నడవడం పెద్ద ప్రమాదమేమీ కాదు కానీ, మేమది చేయాలని అనుకోలేదు. అన్నట్టు, ఈ వర్జిన్ నది కొలరాడో నదికి ఉపనది. వర్జిన్ నది, లేక్ మీడ్ (Lake Mead) దగ్గర కోలారాడో నదిలో కలసిపోతుంది.

A map with a route

వెళ్ళిన దారిలోనే వెనకకు వచ్చి సినవావా స్టాప్ దగ్గర షటిల్ బస్ ఎక్కి ‘బిగ్ బెండ్’ స్టాప్ దగ్గర దిగాము. ఆ ప్రాంతంలో కొండ పెద్ద వంపు తిరిగి ఉండంతో దానికి ఆ పేరు పెట్టారు. అక్కడి నుండి దాని పక్క స్టాప్ ‘వీపింగ్ రాక్(Weeping Rock)’ వరకు నడవడం మొదలు పెట్టాము. ఎత్తైన కొండల మధ్య నున్న విశాలమైన ఆ మైదానంలో మాలాగా నడుస్తున్న వాళ్ళు ఒకరిద్దరు తప్ప మరెవ్వరూ లేరు. నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో కొండల మధ్య నడుస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది.  

వీపింగ్ రాక్ దగ్గరకు వెళ్ళడానికి కొద్దిగా ఎక్కాల్సివచ్చింది కానీ మరీ పెద్ద హైక్ ఏమీ కాదు. అక్కడకు వెళ్ళి చూస్తే కొండ వంపు తిగిరి ముందుకు చొచ్చుకుని వచ్చి దానిపైనుండి నీటి చుక్కలు బొట్టు బొట్టుగా జారి పడుతున్నాయి. ఆ రాలుతున్న నీటి చుక్కల్ని వేలి చివర నిలబెట్టే ప్రయత్నం సరదాగా అనిపించింది. ఇంతకూ దానిని వీపింగ్ రాక్ అని ఎందుకన్నారో మరి అవి ఆనంద భాష్పాలు అయి ఉండొచ్చుగా మనం దానికి ‘ఆనందిని’ అని పేరు పెడదాం.     

అక్కడ షటిల్ ఎక్కి జ్సయాన్ లాడ్జ్ దగ్గర దిగి, ‘ఎమరాల్డ్ పూల్స్’ (Emerald Pools) వైపుకు నడవడం మొదలుపెట్టాము. అక్కడకు వెళ్ళాలంటే కొండ పైకి ఎక్కాలి కానీ దారంతా చెట్ల నీడ పడుతూ ఉండడంతో పెద్ద కష్టం అనిపించలేదు. పైకి వెళ్ళాక కొండ పై నుండి జారుతున్న నీళ్ళు చిరుజల్లుగా నేలను తడిపేస్తున్నాయి. హఠాత్తుగా వీచిన గాలికి ఆ జల్లు కాస్తా మమ్మల్ని మొత్తంగా తడిపేసింది. లేత ఎండ ఆ నీళ్ళ మీద ఇంద్రధనస్సులు పూయిస్తే, జారి పడిన నీళ్ళు లోయలో పచ్చలు మెరిపించాయి.

ఎమరాల్డ్ పూల్స్ చూసి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటుతోంది. జ్సయాన్ లాడ్జ్ దగ్గర ఉన్న క్యాజల్ డోమ్ కేఫ్ (Castle Dome Café) దగ్గరకు వెళ్ళాము. అక్కడ వేడి వేడిగా బర్గర్స్, హాట్ డాగ్స్, చికెన్ టెండర్స్, పిజ్జా పాక్ చేసి ఉన్నాయి. ఆర్డర్ చేసి వేచి చూడవలసిన అవసరం లేకుండా ఈ పద్దతి బావుందే అనుకుంటూ బర్గర్స్, చికెన్ టెండర్స్ తీసుకుని లంచ్ చేసి తిరిగి షటిల్ ఎక్కి విజిటింగ్ సెంటర్ కు వెళ్ళాము.

ప్రతి నేషనల్ పార్క్ విజిటర్ సెంటర్ లో ఆ నేషనల్ పార్క్ స్టాంప్ ఉంటుంది. పార్క్ చూసిన వారు తమ నేషనల్ పార్క్స్ పాస్పోర్ట్ లో ఆ స్టాంప్స్ వేసుకుంటారు. పండు కూడా తన పాస్పోర్ట్ లో స్టాంప్ వేసుకున్నాడు. దాదాపుగా ఒంటి గంట ప్రాంతంలో అక్కడ నుండి బయలుదేరి వ్యూపాయింట్స్ దగ్గర ఆగి చూస్తుంటే ఆ కొండలు అద్బుతంగా కనిపించాయి. 

A rocky mountain with trees and blue sky

AI-generated content may be incorrect.  

మేము ఊహించిన దానికన్నా జ్సయాన్ పార్క్ చాలా బావుంది. మరోసారి వచ్చి, అక్కడే మూడు రోజులు ఉండి హైకింగ్ చేయాలని అనుకుంటూ బ్రైస్ కెన్యన్ నేషనల్ పార్క్(Bryce Canyon National Park)కు బయలుదేరాము.

ఈ ప్రయాణంలో తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

Thursday, October 30, 2025

హార్స్ షూ బెండ్ (Horseshoe Bend)

ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ప్రయాణం మొదటి నుండి చదవాలనుకుంటే ఇక్కడకు, ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

మాన్యుమెంట్ వ్యాలీ(Monument Valley) నుండి అక్కడికి మూడు గంటల దూరంలో ఉన్న వైర్ పాస్ ట్రైల్ హెడ్ (Wire Pass Trailhead) కు వెళ్ళాలని బయలుదేరాము. 'పేజ్(Page)' అనే ఊరిలో లంచ్ చేసి వెళ్తూ ఉంటె దారిలో హార్స్ షూ బెండ్(Horseshoe Bend) కనిపించింది. అక్కడ కొలరాడో నది  కొండ చుట్టూ తిరిగి లోయలో ప్రవహించడం చూస్తే అది గుర్రపు డెక్క ఆకారంలో కనిపిస్తుంది. 

అది చూసి వెళదామని అక్కడ ఆగాము. పార్కింగ్ నుండి నది దగ్గరకు వెళ్ళాలంటే ముప్పాతిక మైలు దూరం నడవాలి. ఎక్కడా చిన్న చెట్టు నీడ లేకపోయినా అంతా దిగడమే కాబట్టి మధ్యాహ్నపు టెండ అంత ఇబ్బంది పెట్టలేదు.
దగ్గరకు వెళ్ళాక చూస్తే కొలరాడో నది దాదాపు వెయ్యి అడుగుల లోతులో ప్రవహిస్తూ ఎర్రని కొండ మెడలో నీలాల పట్టెడ పెట్టినట్లుంది.
కొలరాడో నది అక్కడి నుండి నేరుగా గ్రాండ్ కెన్యన్(Grand Canyon)కు వెళ్తుంది. ఆ నది ప్రవహించినన్ని లోయలలో మరే నదీ ప్రవహించి ఉండదేమో. దాని కారణంగానే గ్రాండ్ కెన్యన్ ఏర్పడింది.
హార్స్ షూ బెండ్ నుండి పార్కింగ్ కు తిరిగి వచ్చేటప్పుడు ఎండ తీవ్రత తెలిసింది. దారిలో రెండు చోట్ల షెల్టర్స్ ఉన్నాయి కానీ, అవి పెద్దగా ఎండను ఆపడం లేదు, పైగా అంతా ఎక్కడం. హార్స్ షూ బెండ్ చూడాలంటే సూర్యోదయం కానీ, లేదా సూర్యాస్తమయం కానీ మంచి సమయం అనుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించాము.

వైర్ పాస్ ట్రైల్ హెడ్ వెళ్ళడానికి మెయిన్ రోడ్ వదిలి అడ్డదారి తీసుకునేటప్పటికి దాదాపుగా ఐదు గంటలు దాటుతోంది. అక్కడ మేము చూడాలని అనుకున్న స్లాట్ కెన్యన్(Slot Canyon)కు నడిచే వెళ్ళాలి. వెళ్ళి రావడానికి దాదాపుగా రెండు గంటలన్నా పట్టొచ్చు. ఏడారిలో సూర్యాస్తమయం తరువాత త్వరగా చీకటి పడుతుందట. చీకట్లో అటువైపు వెళ్ళడం అంత క్షేమం కాదని ఆ ప్రయత్నం మానుకుని నేరుగా జ్సయాన్ నేషనల్ పార్క్ (Zion National Park) కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.

ఈ ప్రయాణంలో తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

Wednesday, October 29, 2025

మాన్యుమెంట్ వ్యాలీ (Monument Valley)








ఈ పోస్ట్ నేషనల్ పార్క్స్ ప్రయాణం లోని భాగం. ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు, ప్రయాణం మొదటి నుండీ చదవాలనుకుంటే ఇక్కడకు వెళ్ళండి.

కోర్టెజ్(Cortez) నుండి మాన్యుమెంట్ వ్యాలీ(Monument Valley)కి రెండు గంటల ప్రయాణం. అంతా ఎడారి, అక్కడక్కడా ఎత్తైన కొండలు దారి పక్కన ఏవో చిన్న చిన్న ఎడారి మొక్కలు తప్ప ఎక్కడా పెద్దగా చెట్లు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతం ఎంతో విశాలంగా కనిపించింది.

     
ఒక ముప్పావు గంట ప్రయాణం తరువాత ఫోర్ కార్నర్స్ మాన్యుమెంట్(Four Corners Monument) వచ్చింది. అది ఆరిజోనా (Arizona), యూటా(Utah), కొలరాడో(Colorado), న్యూ మెక్సికో(New Mexico) ఈ నాలుగు రాష్ట్రాలు కలసే అరుదైన ప్రదేశం. మేము ముందుగా అనుకున్న సమయానికి బయలుదేరగలిగితే అక్కడ ఆగే వాళ్ళం కానీ, బయలుదేరడమే ఆలస్యం అవడంతో అక్కడకు వెళ్ళలేకపోయాము.

పిక్చర్ కార్టెసీ: A Guide for Visiting Four Corners Monument - Ace Adventurer
మరి కొంతదూరం వెళ్ళేసరికి రోడ్ చివర ఎత్తైన కొండలు కనిపించాయి. ఆ రోడ్ మీదే ఫారెస్ట్ గంప్(Forest Gump) సినిమా తీసింది. 

Picture Courtesy: Monument Valley - Wikipedia
మాన్యుమెంట్ వ్యాలీలో లో కొండలు కొన్ని చదరంగా పందిరి మంచల్లా (Mesas), ఇంకొన్ని గోపుర శిఖరల్లా (spires), మరి కొన్ని ఒంటి స్తంభం మేడల్లా(Buttes) ఉన్నాయి. ఆ కొండలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.





కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో సముద్రపు నీళ్ళు భూమి మీదకు వస్తూ ఉండేవి. ఆటుపోటుల కారణంగా ఆ నీళ్ళు రావడం, వెళ్ళడం జరిగేది. వచ్చిన ప్రతిసారీ కాస్త మట్టి, ఇసుక, గవ్వలు, ఖనిజాలు వదిలి వెళ్ళేవి. ఇలా రావడం పోవడం కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు జరిగినది. ఆ తరువాత ఆ ప్రాంతానికి వరదలు రావడం, తద్వారా కాలువలు ఏర్పడడం ఆ తరువాత అవి నదులుగా మారడం వీటన్నిటి వలన మరికొంత మట్టి, బురద చేరడం జరిగింది. ఆ ఇసుక మట్టి, ఖనిజాలు కలిసి రాళ్ళుగా మారడం మొదలైంది. 

ఆ తరువాత భూమిలో ఏమి మార్పు వచ్చిందో ఏమో ఆ ప్రాంతం అంతా అమాంతంగా పైకి లేచింది. వర్షం, మంచు, గాలి, ఎండ వీటితో ఆ రాళ్ళు వివిధ రకాల ఆకారాలుగా రూపాంతరం చెందాయి. అక్కడి నదులు ఆ రాళ్ళ మధ్య వొరుసుకుని ప్రవహించడంతో కొండల మధ్య లోయలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతమే కొలరాడో పీఠభూమి. ఆ పీఠభూమిలోనే మేము ప్రయాణం చేస్తున్నది. ఎడారి లాంటి నేలపై ఒకప్పుడు సముద్రాలు, నదులు పారేవని తెలిసినప్పుడు “ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయనే” సామెత గుర్తొచ్చింది.

ఇంతకూ ఆ కొండలకు ఎరుపు రంగు ఎలా వచ్చిందో తెలుసా? సముద్రపు నీళ్ళు వదిలి వెళ్ళిన బురదలో ఉన్న ఐరన్, ఆక్సిడైజ్ అవడంతో అక్కడ ఇసుక, మట్టి కూడా ఆ రంగులోకి మారాయి. మేము మరీ పొద్దెక్కాక వెళ్ళాము కానీ, సూర్యోదయంలో కానీ సూర్యాస్తమయంలో కానీ వెళ్ళి ఉంటే ఆ ప్రాంతం అంతా ఇంకా అందంగా కనిపించేది.

మరో విషయం తెలుసా! మాన్యుమెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అమెరికాకు సంబంధించినది కాదు, నవాహో దేశానికి(Navajo Nation) చెందినది. 
పద్నాలుగవ శతాబ్దంలో నవాహొ ఆదివాసీలు ఆ ప్రాంతానికి  వలస వచ్చి, అక్కడే స్థిరపడ్డారు. వారు మట్టి, చెక్కతో ఇళ్ళు కట్టుకుని ప్రకృతిలో మమేకమై జీవనం సాగించేవారు. గుడారాల్లా ఉండే వారి ఇళ్ళను హోగాన్స్(Hogans) అంటారు. గొర్రెల పెంపకం వారి ప్రధాన ఆదాయం. ఆడవారు ఊలుతో బట్టలు, దుప్పట్లు లాంటివి అల్లేవారు, మగవారు వ్యవసాయం చేసేవారు. వారు నగలు తయారు చేయడంలో సిద్దహస్తులు. వీరు మాతృవంశ పద్ధతిని(matrilineal) అనుసరిస్తారు, అంటే వాళ్ళ వంశం తల్లి వైపు నుండి నిర్ణయించబడుతుంది. తల్లి నుండి కూతురికి ఆస్తి వస్తుంది. పెళ్ళైన తరువాత భర్త, భార్య ఇంటికి వెళ్తాడు. 
Picture courtesy: Four Sacred Mountains Protect This Valley Where Navajo Creation Stories Were Born

తరువాత శతాబ్దాలలో వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు, మూడువందల మైళ్ళు నడిపించినటువంటి దారుణాలు కూడా జరిగాయి గానీ, చివరకు వారి ప్రాంతాన్ని వారు నిలబెట్టుకున్నారు. ఆ విధంగా నవాహొ దేశం వారికి స్వంతం అయింది. 
ప్రస్తుతం అది అమెరికాలో ఉన్న మరో దేశం. ఇప్పటి నవాహో దేశం అభివృద్ది చెంది స్వంత గవర్నమెంట్ ఏర్పర్చుకుంది. నవాహో ప్రజలకు నవాహో, అమెరికా రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. ఆరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాలలోని కొంత భాగం నవాహొ దేశం కిందకు వస్తుంది.

ఈ ప్రయాణం తరువాత భాగం చదవలనుకుంటే ఇక్కడకు వెళ్ళండి. 

Tuesday, October 28, 2025

నేషనల్ పార్క్స్

రోజులన్నీ మామూలుగానే ఉంటాయి కానీ, కొన్ని మాత్రం ముందుగా ఎలాంటి సంకేతం ఇవ్వకుండా హఠాత్తుగా మనల్ని ఆశ్చర్యంలో ముంచేసి తీయని జ్ఞాపకాలను కానుకగా ఇస్తాయి. అలాంటివే ఈ అక్టోబర్ నెల మొదటి వారం రోజులు.

దాదాపుగా నెల క్రితం, అంటే సెప్టంబర్ నెల ఆఖరి ఆదివారం సాయంత్రం నేనూ, తనూ, పండూ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. పండుకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆ రోజు మా ఇద్దరికీ ‘యూటా నేషనల్ పార్క్స్(Utah National Parks)’ గురించి చెప్తూ అక్కడకు వెళ్ళడానికి అక్టోబర్ మంచి సమయం అన్నాడు. అయితే ఈ అక్టోబర్ లోనే వెళ్దాం అని డేట్స్ చూస్తే అక్టోబర్ మొదటి వారంలో తప్ప మరి ఏ వారంలోనూ మాకు కుదిరేలా లేదు. మరీ వారంలో ఏర్పాట్లవీ చేసుకుని వెళ్ళాలంటే కుదరదు కదా వద్దులే అన్నా వాళ్ళిద్దరూ “ఎందుకు కుదరదూ?” అంటూ అక్కడ ఏఏ పార్క్స్ కు వెళ్ళాలో చూసి, రానూ పోనూ ప్రయాణంతో సహా వారం రోజులు సరిపోతుందన్నారు.

శని, ఆదివారాలు పోయినా నాలుగు రోజులు సెలవు తీసుకోవాలంటే ఆఫీస్ లో ఒక మాట చెప్పాలి కదా! సోమవారం మధ్యాహ్నానికి చెప్పడం అయింది, ఆ తరువాత ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేయడం, హైకింగ్ షూస్ కొనడమూ పూర్తి అయింది. ఆ తరువాత తెలిసింది గవర్న్మెంట్ షట్ డౌన్ గురించి, ప్రయాణపు ఏర్పాట్లు పూర్తయ్యాక చేయగలిగిందేమీ లేదు కనుక చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అనుకుంటూ బుధవారం సాయంత్రం ఫ్లైట్ ఎక్కాము.

ఈ ప్రయాణంలో మేము వెళ్ళాలని అనుకున్నవి మాన్యుమెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ (Monument Valley National Park), మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్ (Mighty five National Parks), బ్లాక్ కెన్యన్ నేషనల్ పార్క్(Black Canyon National Park).
అక్టోబర్ రెండవ తేదీన షార్లెట్(Charlotte)లో బయలుదేరి, డాలస్(Dallas) దగ్గర ఫ్లైట్ మారి, కొలరాడో(Colorado) లోని డ్యురాంగో(Durango) అనే ఊరికి వెళ్ళాము. డ్యురాంగో ఎయిర్పోర్ట్ ఎంత చిన్నదంటే, ఒక చిన్న సైజ్ బస్ స్టాండ్ లాగా ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర రెంటల్ కార్ తీసుకుని కోర్టెజ్(Cortez) అనే ఊరికి బయలుదేరాము. ఆ ఊరు మాన్యుమెంట్ వ్యాలీ(Monument Valley)కి వెళ్ళే దారిలో ఉంది, ఆ రాత్రికి అక్కడే ఉండబోతున్నాము. 
ఎయిర్పోర్ట్ నుండి కోర్టెజ్ కు గంట ప్రయణం. బయలుదేరిన కాసేపటికి ఏవో కొండల్లో వెళ్తున్నట్లు తెలుస్తుంది కానీ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. దారిలో వేరే కార్స్ కూడా ఎదురవలేదు. ఒక అరగంట పోయాక టైర్ లో గాలి తగ్గడం గమనించాము. కోర్టెజ్ కు వెళ్ళిన వెంటనే వాల్మార్ట్ దగ్గర ఆగి చూస్తే టైర్ లో ఏదో గుచ్చుకుని ఉంది. అప్పటికి టైమ్ తొమ్మిదవుతోంది. వాల్మార్ట్ లో మంచి నీళ్ళు, స్నాక్స్ తీసుకుని నేరుగా హోటల్ కు వెళ్ళి రోడ్ సర్వీస్ కు ఫోన్ చేసాం. రోడ్ సర్వీస్ వాళ్ళు వస్తున్నామన్నారు కానీ రాలేదు. ఆ రాత్రి కార్ అక్కడే ఉంచితే టైర్ సెంటర్ కు టౌ చేయాల్సి వస్తుందని, కార్ ను దగ్గరలో ఉన్న టైర్ సెంటర్ దగ్గర పార్క్ చేశాము.

కోర్టెజ్ లో మేము తీసుకున్న హోటల్ హాలీడే ఇన్(Holiday Inn Express Mesa Verde-Cortez by IHG). హోటల్ కొంచెం పాతగా అనిపించినా పయనీర్ డెకరేషన్ తో అందంగా ఉంది.

తరువాత రోజు ఉదయం టైర్ మార్పించుకుని బయలుదేరేసరికి మేము అనుకున్న సమయానికన్నా రెండున్నర గంటలు ఆలస్యం అయింది. 

తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.