Showing posts with label మధురస్మృతులు. Show all posts
Showing posts with label మధురస్మృతులు. Show all posts

Sunday, June 12, 2016

అనుకోలేదేనాడూ...

"సమయం ఐదవుతోంది నిద్ర పట్టడం లేదామ్మా?" అనడిగాడు పండు. జీవితంలో కొన్ని రోజులు సప్త వర్ణాల్ని ఒంటికి అద్దుకుని ఇంద్రధనస్సు మీద  ఊయలలు ఊగుతాయట. వినడమే కాని ఆ రోజులెలా ఉంటాయో నిన్నటి వరకు తెలియలేదు. అంతటి భాగ్యాన్ని చవిచూసిన నాడు ఇక నిద్రెలా పడుతుంది? నిన్న సాయంత్రం నుండి జరిగిన ప్రతి అంశమూ మధురంగా మనసును ఊపేస్తూ... ఒక్కొక్క జ్ఞాపకం మెత్తగా మనసులో ఇంకుతుంటే ఇది నిజమా! నిజమేనా? అని ఇంకా అనుమానంగానే ఉంది.  
అక్కడ ప్రతి టేబుల్ మధ్యలోనూ కొలువు తీరాయే తెల్ల గులాబీలు, లిల్లీలు ఇక్కడ తీరిగ్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎవరూ లేరనుకున్నాయో ఏమో ఏమిటేమిటో కబుర్లు. వాటికి స్వర్గలోకం ఎలా ఉంటుందో చూడాలని కోరిక ఉండేదట. ఆ చుక్కలు, చంద్రుని సమక్షంలో నిన్న జరిగిన సంబరం చూశాక ఆ కోరిక తీరిపోయిందట. "మా సుధీర్, శిరీష లాంటి తమ్ముడు, మరదలు, శ్రీదేవి, కేశవరావు గారి లాంటి స్నేహితులు ఉంటే ఆ బ్రహ్మ దేముడు మాత్రం స్వర్గంలో ఎందుకు ఉంటానంటాడు... వెంటనే దిగి భూలోకానికి వచ్చెయ్యడూ" అంటూ గుసగుసలు పోతున్నాయ్.
             *            *          *         *           *            *          *         
ఖాళీగా ఉండే బ్రిడ్జ్ హామ్టన్ క్లబ్ హౌస్ ఆ అలంకరణతో ఏకంగా ఆకాశంతోనే పోటీ పడిందంటే అతిశయోక్తి కాదు. మా ఫొటోలన్నీ ఎలా సేకరించారో అద్భుతమైన ఫోటో సైన్ ఇన్ ఆల్బం తయారు చేశారు. షాండ్లియర్, సెంటర్ పీసెస్, బాక్ డ్రాప్, నక్షత్రాలతో కిటికీ తెరలు....  
ప్రతిదీ శ్రద్దగా తయారుచేసిన శ్రీదేవి, కేశవ్ రావు గారి తీరు చూసి ఆ అనుబంధానికి ఏ పేరు పెట్టాలో అర్థం కాలేదు. అసలీ ఋణానుబంధం ఏనాటిదో అనే సందేహం కలుగుతోంది. 

మా జీవితాన్నే చిత్రంగా చలన చిత్రంలా మలచి మమ్మల్ని కూర్చోపెట్టి మరీ చూపించారు. అందులో నటించిన విజయ, కృష్ణ, అనురాధ, రామారావు, రఘు, సూర్య, రాఘు గారి పేరెంట్స్ నటనా కౌశలం అమోఘం. 



ఆరునెలల క్రితమే ప్రణాలిక సిద్దమైనా పదేళ్ళ పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ రహస్యాన్ని పదిలంగా కాపాడడం ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతెంత దూరలనుండో స్నేహితులు అభిమానంతో వచ్చారు. ఎంతో మంది ఉత్సాహంగా ఎన్నో చేశారు. వారందరి ఆత్మీయతకు గుండె తడి తెలుస్తోంది. ఆ అనుభూతి ఎంత హాయిగా ఉందంటే అభిమానాలు, సంబంధాలు అన్నీ ఎండమావులే అనుకునే బలహీన క్షణాలు ఉంటాయిగా అవి మొహం ముడుచుకుని ఇక తిరిగి రామంటూ పారిపోయేటంత. 

సంతోషాల శిఖరాలు ఎక్కినప్పుడే కాదు, అవరోధాల అగాధాలు దాటినప్పుడు కూడా ఎన్నో సందర్భాలలో మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపించిన ఆత్మీయుల సమక్షంలో మా పాతికేళ్ళ వివాహ వార్షికోత్సవం జరగడం తలుచుకున్న కొద్దీ మహా సంబరంగానూ ఉంది.  

ఏమన్నారు మంజుల... "ఎవరేమి చేస్తారో తెలియదు కాని ప్రతిదీ ఇద్దరిదీని" అని. ఆ ఈశ్వరునికి శరీరంలో సగభాగం పార్వతికి ఇవ్వడమే తెలుసు. నా ఈశుడు తన ఆత్మలో నన్నే నిలుపుకున్నాడు అందుకే ప్రతి పనిలోనూ ఇద్దరం కనిపిస్తూ ఉంటాం. బిందు అనుకుంటుందీ "మా అక్క చిచ్చుబుడ్డీ. తను తల వంచదు, మా రఘు బావను తల వంచనివ్వదు" అని. పిచ్చి బిందూ ఆ నాడు దాక్షాయణి పరాభవాన్ని భరించలేక అగ్నికి ఆహుతి అయింది. ఈశ్వరుడిలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, జరగబోయే ఘోరాన్ని ముందే పసిగట్టి దక్షుని మనసును సైతం మార్చగల ముందు చూపు మీ బావకు ఉండబట్టే నాకు దక్షాయణిలా పరాభవాన్ని చవిచూడాల్సిన అవసరం కలగలేదు.  తలవంచని తనం నాదే కాని ఆ అవసరాన్ని రానివ్వని చాకచక్యం మీ బావది.  

ఈ పాతికేళ్ళ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు... అనుబంధాలు. అవి తలచుకున్న కొద్దీ మనసు గతంలోకి పరుగులు తీస్తోంది. లేలేత పరిచయాలు... ఆ స్నేహ పరిమాళాల ఘుమఘుమలతో ఈ రేయి తెల్లవారబోతోంది. రంగులు అద్దిన 'నేడు' ఇంద్రధనస్సుపై సవారి చేస్తోంది.

"అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
గుండెల్లో ఇన్నాళ్లు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా!"

ఆ చందమామ మీద కూర్చుని ఆత్మీయుల అభిమానంలో తడిసి ముద్దవుతున్నప్పుడు నా మనసులో మెదిలిన భావాలకు అద్దం ఈ పాట.   

మాతో వారి అనుబంధాన్ని నలుగురితోనూ పంచుకున్న ఆత్మీయులకు, ఈ అనుభవాన్ని మాకు పదిలంగా అందించిన ఆత్మబంధువులకు కృతజ్ఞతలు చెప్పి దూరం పెట్టలేను. మీ స్నేహ సంతకాన్ని బ్రతుకు పుస్తకంలో చివరి పేజీలో సైతం పదిలంగా దాచుకుంటాను. 

Sunday, March 13, 2016

కాన్ కూన్ - మెక్సికో

       "రండి రండి ప్రయాణం బాగా జరిగిందా?" అంటూ రిసార్ట్ దగ్గర వేన్ దిగగానే పువ్విచ్చి ఓ పలకరింపు. బాగానే జరిగిందంటూ సూట్ కేస్ తీసుకోబోతుంటే, "అవన్నీ మేం లోపల పెట్టిస్తాం, ఎప్పుడనగా బయరుదేరారో ఏమిటో ముందు లోపలకు వెళ్ళండి, మీకోసం అంతా ఎదురు చూస్తున్నారు" అంటూ హడావిడి పెట్టేశారు. లోపలకు వెళ్ళామా...

      చక్కగా అలంకరించుకున్న ఓ ఇద్దరు అమ్మాయిలు ఆ కబురూ ఈ కబురు చెప్తూ ఇవాళ్టి నుండి మీరు మాకు చుట్టాలే ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అంటూ మా చేతికో  కడియం తొడిగారు. ఎప్పుడు తయారు చేశారో ఏమిటో మాటల్లోనే ఓ కేక్ ఇచ్చి మీరు ఇది తీసుకోవాల్సిందే అంటూ బలవంతపెట్టేశారు.

        ఇంతకీ ఎక్కడికెళ్ళారు, ఏమిటీ హడావిడి... ఇదేగా ప్రశ్న. ప్రశాంతంగా ఓ నాలుగు రోజులు గడపాలని కాన్ కూన్ వెళ్దామనుకున్నాం. ప్రయాణం అనుకున్నాక ఎలా వెళ్ళాలి? ఏ రిసార్ట్ బుక్ చేసుకోవాలి? అక్కడ చూడవలసినవి ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు. ఇంటర్ నెట్ అంతా గాలించాం. కొంతమంది కొన్ని రిసార్ట్స్ బ్రహ్మండంగా ఉన్నాయంటే మరి కొందరు ఆ రూమ్స్ ఏమిటో వాసన వేస్తున్నాయన్నారు. సముద్రం చూస్తూ సర్వం మరిచిపోగలం అనే వారు కొందరైతే, ఎక్కడా అసలు అలలే లేవు, అంతా సీ వీడ్ అనేవారు మరికొందరు... ఇలా రకరకాల సమాచారాలు. ఏం చెయ్యాలో తోచలేదు. సరే ఏదో ఒకటి అనుకుంటూ ధైర్యం చేసి మూన్ పాలస్ రిసార్ట్ బుక్ చేశాం.

    
        రిసార్ట్స్ బుక్ చెయ్యాలని చూసినప్పుడు కాన్ కూన్, ప్లాయా డెల్ కర్మన్ అని రెండు ప్రాంతాలు కనిపించాయి. ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాలేదు. అక్కడికి వెళ్ళాక తెలిసిందేమిటంటే కాన్ కూన్ వైపు బీచ్ లో సీ వీడ్ ఎక్కువగా ఉంటుందనీ, అక్కడ నీళ్ళలోకి దిగడం కష్టం. అయితే సముద్రం చూడడానికి నెమ్మదిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకోవాలని వచ్చినవాళ్ళకు ఇక్కడ బావుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి దగ్గర.
     ప్లాయా డెల్ కర్మన్ సందడిగా ఉండే ప్రాంతం, డోన్ టౌన్ కి దగ్గర. చుట్టుపక్కల షాపింగ్, రెస్టారెంట్స్ బావుంటాయి. కాజ్ మల్ ఐలెండ్ అక్కడకు దగ్గర. సముద్రంలో పెద్ద అలలు ఉన్నాకూడా దిగడానికి బావుంటుంది.
        మేము పాలస్ రిసార్ట్స్ వారి మూన్ పాలస్ లో బుక్ చేసుకున్నాం. అక్కడ సన్ రైజ్, న్యుజుక్, గ్రాండ్ అని మూడు బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఓ రెండు వేలకు పైగా రూమ్స్ ఉండొచ్చు. మగిలిన రెండింటికంటె సన్ రైజ్ లో రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువ. పిల్లలకు ఇక్కడ చాలా బావుంటుంది. న్యుజుక్ మధ్య వయస్సు వాళ్ళకు గ్రాండ్ పెద్దవాళ్ళకు బావుంటుంది. అయితే ఏ బ్లాక్ లో ఉన్నా కూడా ఉన్నా ప్రతి పదిహేను నిముషాలకు లాబీ టు లాబీ బస్ తిరుగుతూ ఉంటుంది.
ఓషన్ ఫ్రంట్ రూమ్ అంటే కిటికీ నుండి ఎక్కడో సముద్రం కనిపిస్తునదనుకున్నాం కనీ ఇలా మరీ ఇరవై అడుగుల దూరంలో  అలల గలగలలు వింటూ నిద్రపోతాం అనుకోలేదు. 
కళ్ళు తెరవగానే కనిపించిన అద్భుత సౌందర్యం.


       మూన్ పాలస్ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్, అంటే ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఫ్రీ. ఇటాలియన్, మెక్సికన్, కరేబియన్, బ్రెజిలియన్ ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏ రెస్టారెంట్ కైనా వెళ్ళొచ్చు. దాదాపుగా క్రూజ్ లాగా అనుకోవచ్చు, కాని అక్కడ ఇన్ని రెస్టారెంట్స్ ఉండవు. ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. ఆలూ పాలక్, చికెన్ కార్రీ, పొటాటో ఫ్రై, ఎగ్ ప్లాంట్ కర్రీ ఇలా మన వంటలు కాస్త ఉప్పూ, కారం తక్కువైనా రుచిగానే ఉన్నాయి.




      ప్రతి రోజూ సాయంత్రం ఏదో ఒక షో ఉంటుంది. ఫైర్ షో చూడలనుకున్నాము కాని గాలి ఎక్కువగా ఉన్న ఉందండంతో అది చెయ్యలేకపోయారు. బెల్లీ డాన్స్ కి వెళ్ళాము. అక్కడ సగానికి పైగా హిందీ పాటలకే డాన్స్ చేశారు, కోరియోగ్రఫీ కొత్తగా ఉంది.


     మేమున్న దగ్గర సీ వీడ్ ఎక్కువగా ఉండడంతో సముద్రంలో దిగాలనిపించలేదు. ఒకప్పుడు బాగానే ఉండేదట. కోరల్ రీఫ్ ఏర్పడిన కారణంగా సీ వీడ్ ఎక్కువగా వస్తున్నదట. ప్లాయా డెల్ కర్మన్ లో పాలస్ రిసార్ట్స్ వారి మరో రెండు రిసార్ట్స్ ఉన్నాయి. సన్ పాలస్, బీచ్ పాలస్... అవి ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయట. రెస్టారెంట్స్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుందని విన్నాము. అక్కడకు మూన్ పాలస్ నుండి రిసార్ట్ బస్ లు వెళుతూ ఉంటాయి. ఆ రిసార్ట్ లో అన్ని వసతులూ వాడుకోవచ్చు.

బడి, గుడికి, పెళ్ళికి వెళ్ళాలంటే కొన్ని సాంప్రదాయలుంటాయి. అలాగే ఇక్కడ బీచ్ వెకేషన్ కి కూడా అవసరం లేదనుకుంటే ఫరవాలేదు కాని లేదంటే వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని వెళ్తే మంచింది.

ముందుగా తెలుసుకున్నవి, అక్కడికి వెళ్ళాక తెలిసినవి:
  • వెకేషన్ గురించి పూర్తిగా తెలుసుకుని కావలసిన వస్తువులు సమకూర్చుకోవడం. కొన్ని రెస్టారెంట్స్ కి వెళ్ళాలంటే సెమై ఫార్మల్ డ్రెస్ ఉండాలి. అలాగే బేతింగ్ సూట్స్, సన్ బ్లాక్ లోషన్స్, హాట్స్, గాగుల్స్ ....
  • రిసార్ట్ కి వెళ్ళిన వెంటనే షోస్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాయి, ఏ రెస్టారెంట్ లో ఏ ఫుడ్ ఉంటుంది, రెస్టారెంట్, పూల్ టైమింగ్స్ అన్నీ తెలుసుకోవడం మంచిది. అలాగే వాళ్ళ సర్వీసెస్ కూడా. 
  • రిసార్ట్ అంతా చూపిస్తాము, ఒక్క గంటన్నర చాలు అంటూ అపాయింట్ ఇస్తారు. అయితే అది రిసార్ట్ చూపించడంతో పాటు రిసార్ట్ మెంబెర్ షిప్ గురించి తెలియజేయడం. అది ఉదయం 8:30 నుండి 2 గంటల వరకూ పట్టింది. మెంబెర్షిప్ ఆ ఒక్క రిసార్ట్ వరకే కాకా ప్రంపంచంలోని అనేక దేశాల రిసార్ట్స్, హోటల్స్ లో డిస్కౌంట్ ఉంటుంది. పర్యాటన ఇష్టం ఉన్నవాళ్ళకు ఇవి ఉపయోగమే అనిపించింది, లేకపోతే ఊరికే టైమ్ వెస్ట్. 
  • రిసార్ట్ క్రెడిట్స్ ఇస్తారు. అవి రొమాంటిక్ డిన్నర్స్, స్పా సర్వీసెస్ కు వాడుకోవచ్చు. టాక్స్ చాలా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. గిఫ్ట్ షాప్ దగ్గర అవి వాడడం అనవసరం అనిపించింది. 
నచ్చినవి:

Food: Fried Banana, Omelet, Fresh Green juice, Lime soup, Mixed fruit juice, 7 onion soup, Fresh pastries, 6 course meal.

New Foods: Crepe, Cactus curry, Sweet and spicy Popsicle, Fish soup, Habanero hot sauce.

Facilities: Pools, Spa, Food service at the pool, Special dinners, Beautiful walkways.

మరచిపోలేని అనుభూతులు: అందమైన సముద్రం, ప్రకృతి, గుహలో నీళ్ళలో నడవడం, సైకిల్ తొక్కడం, సూర్యోదయాలు, రిసార్ట్ వారి మర్యాదలు.

మాయన్ నాగరికత గురించి, టూర్స్ గురించిన విశేషాలు ఇక్కడ.... 

Tuesday, July 8, 2014

పన్నీటి తలపులు నిండగా...

     పూర్వం ఐదు రోజుల పెళ్ళిళ్ళు చేసేవార్ట. ఆత్మీయులతో ముచ్చట్లు, బాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, పట్టు చీరల గరగరలు, కొత్త చుట్టరికాలు, హడావిడి పరుగులు....అలంటి పెళ్ళికి వెళ్ళొచ్చాక ఎలా ఉంటుందో అలా ఉందిప్పుడు. ఇంతకూ ఏమిటీ హడావిడి? ఎక్కడకు వెళ్ళామనే కదూ సందేహం. నాటా సంబరాలకు వెళ్ళాం. 

    శుక్రవారం అట్లాంటా చేరి మేరియట్ ముందు కారు దిగగానే ఆత్మీయ పలకరింపులు, ముప్పైయిదో అంతస్తులో ఓ అందమైన గది. అక్కడినుండి కిందకు చూస్తే ఆశ్చర్యం! సంబరాలు చూడడానికేమో ఆకాశాన్ని ఖాళీ చేసేసి చుక్కలన్నీ నేలకు దిగివచ్చాయి. 

   చీరలమీద చెమ్కీలయ్యాయి. చంద్రబోస్ గారి పాటలో అక్షరాలయ్యాయి, బాలుగారి స్వరంలో రాగాలయ్యాయి, నిర్మల గారి పదానికి అందెలయ్యాయి, రామారెడ్డి గారి పద్యాలలో ఛందస్సయ్యాయి, సాహితీ సభలలో చెణుకులయ్యాయి...అక్కడా ఇక్కడా అనేమిటి అంతటా తామై చుక్కలు మెరిసిపోయాయి....మురిసిపోయాయి.

   మృష్టాన్న భోజనం, చీనీ చినాంబరాలు, పద్యాలు, పాటలు, పుస్తకాలు, అవధానాలు...ఒకటా. రెండు రోజులూ మరో ప్రపంచంలోవున్నట్లే. ఇల్లూ, వాకిలి, మొక్కలు, పిల్లలు, బ్లాగులూ ఇలా ఏవీ గుర్తే రాలేదు. నాకు నచ్చినవి కొన్ని మీతో పంచుకుందామని...పదిలంగా దాచుకుందామని.

సంగీత నవావధానం  


సంగీత నవావధానం 
ఈ అవధానానికి శ్రీనివాస్ కిషోర్ భరద్వాజ గారు అధ్యక్షత వహించారు. మీగడ రామలింగస్వామి గారు అవధాని. రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సింహాచల శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వడ్డే కృష్ణ గారు, బాలాంత్రపు శారద గారు, దుర్వాసుల శిరీష గారు, దువ్వూరి రమేష్ గారు, ప్రాశ్నికులు. 

ఇదే మొదటిసారి సంగీతావధానం చూడడం. ప్రశ్నికులు అవధానిగారికి ఓ పద్యం ఇచ్చి ఫలానా రాగంలో పాడమని చెప్పగానే అవధాని గారు రాగాలు తెలియని వారికి కూడా అర్ధమయ్యే రీతిలో రెండు మూడు పాటల పల్లవులు పాడి ఆ రాగంలో పద్యం పాడారు. కొన్ని రాగాల విశిష్టతలను కూడా చెప్పారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

పాటలు, పాట్లు, హిట్లు 


పేరు గమ్మత్తుగా ఉంది కదూ! చంద్రబోస్ గారే పెట్టారట. ఈ కార్యక్రమంలో రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు పాల్గొన్నారు. 

పాట నచ్చితే మన మొబైల్ లోనో, ఐపాడ్ లోనో ఓ వెయ్యిసార్లన్నా వినేస్తూ ఉంటాం. ఆ పాట ఎవరు రాసారన్నది కూడా చాలా సార్లు పట్టించుకోము. అలాంటి పాటలు రాయడానికి పడే పాట్లు గురించే వివరించారు. అది కూడా పొట్ట చెక్కలయ్యేట్లు నవ్విస్తూ. రెండు గంటల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అందరూ పెద్ద పెద్ద రచయితలు ఎలా ఉంటారో అనుకున్నాను. వారికెవ్వరికీ కొంచం కూడా గర్వం లేదు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడారు.

సాహితీ సదస్సు 

అశోక్ తేజ గారు 'నేలమ్మా... నేలమ్మా' అని పాడుతుంటే గుండె చెమ్మ కంటిలో మెరిసింది. వెన్నెలకంటి గారు 
 శ్రోతల ప్రశ్నలకు సమాధానంగా ఘంటసాల గారి పాటల గురించి, పాటల వెనుక కథల గురంచి ఎన్నో విషయాలు చెప్పారు. రమణి గారు మాటలు ఆ సభలో నవ్వుల పువ్వులు పూయించాయి. గెద్దాల రాధిక గారు కథ చదివారు. 
సింహాచల శాస్త్రి గారు వాగ్గేయకారుల గురించి వివరిస్తూ పద్యాలు పాడారు. భవిష్యత్తులో వారి హరికథ వినే భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. 













ఈ సభకు అధ్యక్షత వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అరుదైన, అందమైన జ్జ్ఞాపకాన్ని పదిలపరుచుకునే అవకాశాన్నిచ్చిన మాధవ్ దుర్భ గారికి, సాహితీ విభాగం సభ్యులకు అనేకానేక ధన్యవాదాలు.  


అష్టావధానం 

శతావధాని నరాల రామారెడ్డిగారి అష్టావధానం చూసే భాగ్యం ఇన్నాళ్ళకు కలిగింది. సంచాలకులు: రసరాజు గారు, పృఛ్ఛకులు: ఆచార్య ఫణీంద్ర గారు, ఓలేటి నరసింహారావుగారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, కొత్త రఘునాథ్ గారు, డాక్టర్ బి,కే మోహన్, బాలాంత్రపు వెంకట రమణ గారు,  కొలిచాల సురేష్ గారు డొక్కా ఫణీంద్ర గారు. 
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు అవధాని గారిని, సంచాలకుల వారిని, పృఛ్ఛకులను సన్మానించారు. 
నరాల రామారెడ్డి గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు
రసరాజు గారు 
ఓలేటి నరసింహరావు గారు
డాక్టర్ బి కె మోహన్ గారు  
బాలాంత్రపు రమణ గారు 
ఈమాట సంపాదకులు కొలిచాల సురేష్ గారు
ఆచార్య ఫణీంద్ర గారు ప్రపంచాభాషలందు వెలుగు తెలుగు అన్నారు. గుర్తుంచుకోవలసిన మాట కదూ! వారు గుణింతాలలో దైవత్వాన్ని చూపించారు.
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు 
నాటా జ్ఞాపిక 'స్రవంతి' సంపాదకులు కొత్త రఘునాథ్ గారు
'సాహిత్య రత్న' అవార్డ్ గ్రహీత డొక్కా ఫణి కుమార్ గారు  
రసరాజు గారు, జోన్నవిత్తులు గారు
ఘంటసాల రత్నకుమార్ గారు
ఈ సాహితీ వేదిక నిర్వాహకులు డాక్టర్ మాధవ్ దుర్భాగారు, ఎడవల్లి రామ్ గారు, చెన్నుభొట్ల రాధ గారు.


Sunday, November 20, 2011

మనసాడెనే మయూరమై

సంబరంగా జాజితీగ
నవ్వుపువ్వులు రువ్వుతోంది!

గాలిపాటకు కొబ్బరాకు
పరవశంగా ఊగుతోంది!

అరవిరిసిన చెంగలువ
పరిమళాలు చల్లుతోంది!

ఆకసాన తుంటరిమేఘం
వలపుగీతం పాడుతోంది!

వెన్నెలవేళ నీలాకాశం
వింత అంద౦ ఒలికిస్తోంది!

సత్యునిగాంచిన సంతసం
పార్ధివిమోమున పొడవడుతోంది!!

Wednesday, November 16, 2011

మరుగేలరా ఓ రాఘవా

నా నీకు,
          ఆకాశం నాలాగే వేచి చూస్తున్నట్టుంది. చందమామను నిన్ననగా పంపాను నిన్ను చూసిరమ్మని, ఇంకా రానేలేదు. నా ఆలోచనలకు అంతరాయం కలుగుతుందనేమో ప్రకృతి సైతం చిత్తరువై చూస్తో౦ది. నిజం, కొబ్బరాకులన్నీ ఏదో మౌనరాగం వింటున్నట్టు గంభీరంగా వున్నాయి. కదలని మబ్బులు నిశ్శబ్దగీత౦ పాడుతున్నాయి. జాజితీగ జాలిగా ఇటే చూస్తోంది. ఒంటరి నక్షత్రం మిణుకు మిణుకుమంటోంది.

          ఏవేవో ఊసులు చెపుతూ నన్నల్లుకుని ఎన్నో ఊహలు. చిరుగాలై నిన్ను చుట్టుముట్టాలని, విరిజల్లై అభిషేకించాలని, సాగారాన్నై నీ పాదాలు తాకాలని, తెలిమబ్బై నీకు గొడుగు పట్టాలని, కిన్నెరనై నీకు సప్తస్వరాలు వినిపించాలని, ఊర్వశినై స్వర్గాన్నే నీ దరికి తేవాలని, ఇలా ఎన్నెన్నో.... నీతో కలసి వెలుగునీడల కలయికను, వేకువలో తొలి ఉషస్సును పంచుకోవాలనుంది. ఈ శరత్కాలపు రేయి మధురమైన పాటలు మంద్రస్థాయిలో వింటూ వినీలాకాశపు పందిరి కి౦ద వెన్నెలస్నానాలు చేయాలనుంది. రాత్రి మనల్ని దాటి సాగిపోతూ ఉంటే, కదిలే కాలాన్ని చూస్తూ అలా ఆగిపోవాలనుంది!

         ఎలా దాటనీ రాత్రిని? నీ పదసవ్వడి వినని నాడు ఇంకే శబ్దమూ నన్ను చేరకున్నది. ఎద వాకిట యుగాలపాటు వేచియున్నాను నువ్వొచ్చే మధురక్షణాల కోసం... అలసటతో రెప్పవాల్చుతానేమో! నన్ను దాటి వెళ్ళిపోకు. ఈ చిత్ర పటానికి నీ స్పర్శతోనే జీవం.

నీ
నేను

Thursday, November 10, 2011

లేత ఇల్లాలి ముదురు పాకం

            అదేమో కార్తీక మాసం, మాదేమో కొత్త కాపురం. మా చుట్టుపక్కల వారందరూ రకరకాల వంటల చేసేసుకు౦టున్నారు. నాక్కూడా ఏదైనా పిండివంట చేద్దామనే మహత్తరమైన ఐడియా తట్టింది. ముందస్తుగా లడ్డు చేద్దామనుకున్నా. లడ్డు తయారీ విశేషాలు కనుకున్నాక, అది చాలా ముదురు స్వీటని  నాలాంటి లేత ఇల్లాలికి కష్టమని అర్ధమైంది. బాదుషా గురించి అడిగా ఉహూ.. అదికూడా కుదేరేపని కాదు. మైసూర్ పాక్, జిలేబి, మడత కాజా, గవ్వలు, ఇలా అన్నింటి తీరుతెన్నులు తెలుసుకున్నాక, ఔరా! వీటివెనుక ఇంత చరిత్రు౦దా అని ఆశ్చర్యపోయి, చివరగా గులాబ్ జామ్ కి ఫిక్స్ అయ్యా. 

          ఆ సాయత్రం నేను మా శ్రీవారు తీరిగ్గా షాపుకి వెళ్లి గులాబ్ జాం ప్యాకెట్ కొని  పక్కనే ఉన్న పార్క్ లో చెట్టాపట్టాలేసుకుని రాత్రివేళకు ఇంటికి చేరాం. తీరగ్గా బోజనాలు అవీ కానిచ్చి గులాబ్ జాం చేసే మహత్కార కార్యానికి శ్రీకారం చుట్టా౦. పౌడర్ కలపడానికి ఒక గిన్నె, నీళ్ళకో గ్లాసు, వేపడానికో బాండలి, చక్కెర, ఏలుకలు, నూనె వగైరాలన్నీ సిద్దం చేసుకున్నాం.

          ఇక తయారీ మొదలు, అదే ఆయన చదవడం నేను చెయ్యడం అన్నమాట. చక్కెర వంద గ్రాములు అన్నారు. మన దగ్గర ఐదు వందల గ్రాములు ఉంది. ఎలా అని తర్జన బర్జన పడి ఏదో ఉపాయం కనిపెట్టాం. సరే పిండి కలపడం పూర్తయ్యింది. ఇక చక్కెర పాకం. ఖాళీ గిన్నెలో చక్కెర, ఓ రెండు స్పూనులు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాను. 

              ఇక్కడ మీకో విషయం చెప్పాలి. మా అమ్మ మైసూర్ పాక్ చాలా బాగా చేసేవారు. ఆ పాకం పట్టేప్పుడు నన్ను ఓ ప్లేటులో నీళ్ళు పోసుకురమ్మనే వారు. ఆ నీళ్ళలో ఈ మరిగిన పాకం కొంచెం వేసేవారు. తీగ సాగిందో లేదో విచారణకన్నమాట. ఆ విషయం గుర్తుంచుకుని నేను కూడా బాగా తీగ సాగేదాక పాకం పట్టేసా. పాకం బ్రంహాండంగా కుదిరింది. మరో పక్క  బా౦డలిలో గులాబ్ జామూన్లను పాకెట్లో చెప్పినట్లుగా బంగారు రంగు వచ్చేవరకు వేపుతూ, నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి ఆశ్చర్యపడిపోయేలా మా వారికి తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నా. చివరగా ఈ గులాబ్ జూమూన్లను పాకంలో వేసేసాను.
              
               లేత బంగారు రంగు పాకంలో ముదురు బంగారపు జామూన్లు చూడ్డానికి బహు ముచ్చటగా ఉన్నాయి. గులాబ్ జామూన్లు పాకంలో నానాలిగా, అప్పటికే పదకొండున్నర అయింది, రేపు చూద్దాం అనుకుని సంతృప్తిగా వెళ్లి పడుకున్నాం. ఉదయాన్నే లేచి మా తొలి పిండివ౦ట చూద్దామని వంట గదిలోకి అడుగు పెట్టా.  ఇంకేముంది రాత్రికి రాత్రి గిన్నెకి జామూన్లకి ఎంత గట్టి బంధమేర్పడి౦దంటే ఒకదాన్ని వదిలి ఒకటి రానంటాయి.

          కొస మెరుపుగా మన వంట ప్రావీణ్య౦ తెలిసిన మా పుట్టింటి వారు పోస్ట్లో ఎంచక్కా మా ఊరి మైసూర్ పాక్ లు పంపించారు. అవి తినేసి వాటి మాధుర్యాన్ని ఆ జ్ఞాపక౦తో కలిపేసి అప్పుడప్పుడు ఇలా గుర్తు చేసుకుంటాం అన్నమాట. మీరందరూ అన్ని బ్లాగులలోనూ మంచి మంచి వంటలు తినేసి భుక్తాయసంతో తీరిగ్గా కూర్చుని ఉంటారుగా...నలుగురు కలసి నవ్వేవేళ ఒక పసందైన జ్ఞాపకాన్ని మీతో పంచుకుందామని....  

(ఎన్నెల గారిచ్చిన సలహా మేరకు 'ఆశ్చర్యంలో ముంచి వేసిన గులాబ్ జామూన్లు' అనే పేరును 'లేత ఇల్లాలి ముదురు పాకం'గా మార్చాను. ధన్యవాదాలు ఎన్నెల్ గారు)

Friday, November 4, 2011

గువ్వ ..గోరింక

మునిమాపు వేళల్లో
సంధ్యాకాంత సింగారాలు!

వినువీధుల అరుణిమల్లో
విహంగాల విహారాలు!

వడగాల్పుల వేడిమిలో
పిల్లతెమ్మెరల వింజామరలు!

విరజాజుల జావళిలో
మొగ్గవిచ్చు మల్లియలు!

వేచియున్న వాకిటిలో
చిరపరిచిత పదసవ్వడులు!

గాజుల సడి నేపధ్యంలో
కడకొంగుతో మంతనాలు!

ఎదను మీటిన వలపుల్లో
చిలిపితనపు చిరునగవులు!!

Friday, October 21, 2011

సహజీవనం

ఓ చూపు స్నేహంగా నవ్వింది
బిడియం రెప్పల పరదా వేసింది!

ఉత్తరం కుశలమడిగింది
సంశయం సమాధానమిచ్చింది!

మానసం మధుకరమై మసలింది
సేనము ప్రసూనమై విరిసింది!

సఖునికి సంవాసము సమకూరింది
చెలువ చెంతకు చేరింది!

సహవాసం సరిగమలు పలికించింది
సంసారం సౌహిత్యంగా సాగింది!!

Tuesday, October 11, 2011

మది పలికిన మోహన రాగం...

మొన్నటి ఓ క్షణం..
గమనాన్ని మరచింది!

తలచిన అనునిత్యం ..
నవరాగం వినిపించింది!

మోయలేని భావమేదో..
అరుణిమయై విరిసింది!

మది పలికిన మోహన రాగం...
సమ్మోహన గీతమైంది!!

Monday, October 10, 2011

కలకానిది...నిజమైనది

నిన్న రాత్రి ఓ స్వప్నం..
దూరాన ఎచటికో పయనం!

తరంగిణీ తీరాలు...
హరిద్రువ సమూహాలు!

ఆకశాన ఎగిరే గువ్వలు
మధూలికా మంజరులు
అనన్య సామాన్యములు!

ఊహు...ఇవేవీ కావు
నిరంతరాన్వేషణ... 
ఎందాకో ఈ ప్రయాణం!

రాసులుగా  పోసిన రత్నాలు
మరకతమణి మాణిక్యాలు!
ఎన్నటికీ కానేరవు!

వెతుకుతున్నది కానరాక...
దారి తెన్నూ తెలియక
చటుక్కున కళ్ళు తెరిచాను!

ఆ చిరు కదలికకే చెంతకు చేర్చుకున్న
నీ సాంగత్యంలో  తెలిసింది!

కలలో దొరకనిది ఇలలో నాదైనది 
నా కంటే అదృష్టవంతులెవరు?



Saturday, October 1, 2011

కౌముదిలో నా కవిత 'ఎడబాటు'


ఈ దారిలోనే కదూ నా చిన్నారి
బుల్లి బుల్లి అడుగులతో పరుగులు తీసింది!
అదిగో ఆ తోటలోనే మునుపెన్నడో
ఊయల ఊగిన సందడి!

ముచ్చటైన సైకిలును చూసి
మోమున మెరిసిన సంతోషం!
చారడేసి కళ్ళతో బెంగగా
స్కూలుకు వెళ్ళిన వైనం!

శాంతాతో ఫోటోలు, జింజెర్ బ్రెడ్ హౌసులు,
హాలోవీన్ డ్రస్సులు, ఈస్టర్ ఎగ్ హంట్లు,
కోరస్ పాటలు, టెన్నిస్ ఆటలు
ఓహ్! ఎన్నెన్నో!
అవన్నీ నిన్న మొన్నలా లేదూ!

ప్రతి మలుపులో వేలు పట్టుకుని నడిపించాను!
మలుపులన్నీ దాటి చూద్దును కదా
ఆ చివర మలుపు తిరుగుతూ
ప్రగతి పథంలో తాను!

తన జ్ఞాపకాల బాసటగా
ఈ చివర నేను!

నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'అక్టోబర్ 'సంచికలో ప్రచురితమైంది.

నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

Tuesday, September 20, 2011

నిరీక్షణ


ఈ రేయి ఎన్నటికి తరిగేనో...
నా ఉద్వేగం చూసి
క్షణాలన్నీ చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నై!

చీకటి చిక్కనై చిందులు వేస్తోంది!
వెన్నల చిన్నబోయి
మబ్బుల మాటున మోము చాటేసింది!

విరిసిన మల్లెలు
గుసగుసలు పోతున్నై!
నిశీధి అంచుల్లోకి
నిశ్శబ్దం మెల్లగా జారిపోతోంది!!

వెలుగు రేఖ ఒక్కటి
అలవోకగా తొంగి చూసింది...
నిదురించిన తోట
బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది!

ఏమయిందో ఏమో
చుక్కలు మెల్లగా తప్పుకున్నై!
రేతిరి తన రాజ్యాన్ని వదిలి...
తెలియని తీరాలకు తరిలి పోయింది!

ఎదురు చూసిన యెదలో
సందడి మొదలైయ్యింది...
తూరుపు దిక్కున
సన్నాహాల కోలాహలం!

వాకిట వేచిన నెచ్చెలి కోసం
వెలుతురు బాటలో సూరీడు!!


తొలి ప్రచురణ కౌముదిలో...

Friday, September 2, 2011

ప్రేమ లేఖ

ప్రియమైన శ్రీవారికి,

       నిన్న ఉదయం కిటికీ తీయగానే ఇంకా చీకటి పోలేదులా వుంది. చలి చలిగా వుంది. ఓ కప్పు కాఫీ కలుపుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాను. బయట చీకటి కరిగి పల్చని వెలుతురు పరుచుకు౦టో౦ది. ఆకాశం మబ్బు పట్టి ఎంత బావుందో! నింగి నేలా అంతా కలసి పోయినట్లు...ఒకరోజు మీకు గుర్తుందా ఉదయం నిద్రలేచి కళ్ళు తెరవగానే వర్షం పడుతూ కనిపించింది. 'వీపింగ్ విల్లో' మీద నుంచి చినుకులు పడడం.... సిడి లో మంచి పాటలు వింటూ... ఓహ్! ప్చ్ ఇప్పుడు కూడా ప్రక్కన మీరుంటే బావుండేదనిపించింది. ఇలా ప్రకృతిని చూస్తూ జీవితమంతా గడిపేయొచ్చు కదూ! ఓ సారి తెల్ల తెల్లని మంచు కురుస్తూ, మరో సారి ఫాల్ కలర్స్ తో, ఇంకోసారి  రంగు రంగుల పువ్వులు, వాటి కోసం వచ్చే సీతాకోక చిలుకలు, బుల్లి బుల్లి పక్షులు.... కాని ఏమైనా వర్షం అందం వర్షానిదే. ఇలాంటి వర్షంలోనే కదూ మనం కారులో షికారు కెళ్ళే వాళ్ళం. 

         ఎందుకో మన పెళ్లి రోజు గుర్తొచ్చింది.  పెళ్ళిపీటల మీద కూర్చుని తలంబ్రాలు పోసుకున్నది నిన్న మొన్నలా లేదు. ఓ సారి నేనిలా అంటే ఏం లేదు...మనం యుగ యుగాలనుండీ కలిసి ఉన్నట్లుగా వుంది అన్నారు. అదీ నిజమే 'ఈ నాటి ఈ బంధమేనాటిదో' అని ఆత్రేయగారన్నట్లు...  మనబంధం ఏ నాటిదో  అనిపిస్తుంది.  ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో. వర్షం తగ్గిపోయిందని వాకింగ్ కి బయలు దేరాను.  

        రోడ్డు మీద వెళుతూ వుంటే పక్కన మీరున్నట్లే అనిపించింది. ఆ  పూల గురించి...పిట్టల గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో కదా! ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాను. వచ్చీ రాగానే 'అమ్మడూ కాఫీ' అనడం మీకలవాటు. స్నానం లేదు, పూజ లేదు దిగాలుగా కూర్చుండి పోయాను. బైట సన్న  సన్నగా తుంపర మొదలైంది. ఎప్పటి సంగతో 'చినుకు చినుకు సందడితో చిట పాట చిరు సవ్వడితో' పాట వింటూ వర్షం చూసిన ఉదయం మదిలో భారంగా మెదిలింది. వర్షం చూస్తూ పుస్తకం చదవడమంటే మీ కిష్టం, నేనేమో పుస్తకంలో మునిగేతే బైట వర్షమే పడుతుందో వరదలే వస్తున్నాయో ఎవరికి తెలుస్తుందని పోట్లాదేదాన్ని కదూ. జాజి పూల మాలకడుతూ ఎన్నెన్ని ఊసులల్లుకున్నమో కదూ! 

            నా ఊహలలో నేను౦డగానే  పన్నెండయ్యి౦ది. అప్పటికి నేనింకా మెయిల్ కూడా చూడలేదు. మెయిల్ ఓపెన్ చెయ్యగానే మొన్న రాత్రి మీరు  పంపిన పాట 'నీవు రావు నిదుర రాదు' విన్నాను. మరీ దిగులేసి మన ఆల్బం ముందు వేసుకుని కూర్చున్నాను. 'షానన్ ఫాల్స్'  లో రాళ్ళ మీద నడిచిన రోజులు, 'మయామి బీచ్' లో గవ్వలేరిన క్షణాలు, 'నయాగరా'లో మన నయగారాలు, తీపి గుర్తులు నెమరువేస్తూ ఉండిపోయాను.

       సంధ్య దిగులుగా వెళ్ళింది. గుండెల్లో గుబులు  చీకటై విశ్వమంతా వ్యాపించిది. దిగులేసిన చెంద్రుడు నాతో చెలిమికి వెన్నెలతో రాయబారం పంపాడు. కిటికీ పక్కగా కుర్చీ వేసుకు కూర్చున్నాను.  బయట వెన్నెల ఎంత అందంగా వు౦దనుకున్నారూ... మీతో కలసి 'వెన్నెల రేయి ఎంతో చలి చలి' పాట వినాలని పించిది. ఎదురు చూసిన చుక్కలు వెల వెలబోతూ తప్పుకున్నై. క్షణాలే   శత్రువులై నా మీద దాడి చెయ్యడం మొదలెట్టాయ్.  ఎంతకీ తరగని రాత్రి ఏవేవో ఆలోచనలతో గడిపేశాను...అన్నీ మీ  గురించే.

        ఇవేమీ తెలియని ఉష గంతులేస్తూ వచ్చేసింది. సంతోషాల తోరణాలు కడుతూ పసిడి కిరణాలు సందడి చేసాయ్.  మొక్కల సరదా చూద్దామని అలా బయటకు వెళ్లాను. మన మినీ రోజెస్ ఇవాళ ఎన్ని పూలు పూశాయో! లోపలికి వస్తూ మీకిష్టమైన ఎర్ర గులాబీలు తెచ్చి వేజ్ లో  పెట్టాను. చిత్రంగా లేదూ పదిహేనేళ్ళ క్రిందటి మాట. మీరప్పుడనేవారు  గుర్తుందా. మన మధ్య ప్రేమ రోజు రోజుకూ పెరుగుతుంది కాని తగ్గదని. ఎన్నటికీ వాడిపోని మన ప్రేమ కుసుమాల సాక్షిగా

          నిను చూడక నేనుండలేనూ ఈ జన్మలో మరి ఆ  జన్మలో మరి ఏ జన్మకైనా ఇలాగే....
                                                          
మీ 
శ్రీమతి 


తొలి ప్రచురణ వాహినిలో....