ఈ పోస్ట్ కు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.
రోమ్ కు వెళ్ళిన రెండవ రోజు ఉదయాన్నే విల్లా బొర్గీస్ గార్డెన్ కు వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ నుండి రోమన్ ఫోరమ్ కు ట్రామ్ లో వెళ్ళాము. ఫోరమ్ చూడడానికి ముందుగానే ఆన్ లైన్ లో 'స్కిప్ ది లైన్' టికెట్స్ తీసుకోవడంతో లైన్ లో నిలబడవలసిన అవసరం లేకుండా లోపలకు వెళ్ళాము. రోమన్ ఫోరమ్ చూసేముందు రోమ్ చరిత్ర కొంత తెలుసుకుందాం.
రోములస్ (Romulus) పరిపాలించడం వలన రోమ్ నగరానికి ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం గుర్తుందా. అలా క్రీస్తు పూర్వం ఏడు వందల యాభైమూడవ సంవత్సరం(753 BC) లో రోమ్ మొదలైంది. అక్కడ నుండి నూటయాభై సంవత్సరాల పాటు ఏడుగురు రాజులు రోమ్ ను పరిపాలించారు. ఆ తరువాత రాజరికం అంతరించి ప్రజాస్వామ్యం మొదలైంది.
రోమ్ లో రెండు వర్గాలు ఉండేవి, పేర్టిషియన్స్ (Patricians) భూస్వాములు, ధనవంతులు, ప్లెబియన్స్ (plebeians) సామాన్య పౌరులు, బానిసలు. రోమ్ లో పేరుకు ప్రజాస్వామ్యమే ఉన్నా ప్రభుత్వయంత్రాంగంలో అంతా పేర్టిషియన్స్ ఉండేవారు. వారిలో వారికి రాజకీయంగా వివాదాలు ఏర్పడి యుధ్ధాలు జరగడంతో అలజడి మొదలైంది. చివరకు జూలియస్ సీజర్ (Julius Ceasar) హత్యతో ప్రజాస్వామ్యానికి తెరపడింది. జూలియస్ సీజర్ మేనల్లుడు అగస్టస్ (Augustus) రోమ్ కు రాజయ్యాడు. అలా క్రీస్తు పూర్వం ఇరవైయ్యేడవ సంవత్సరంలో (27 AD) రోమ్ లో మళ్ళీ రాజరికం మొదలయ్యింది, రోమ్ నగరం విస్తరించి తిరుగులేని సామ్రాజ్యం అయింది. ఆ తరువాత మత పరమైన మార్పులు జరిగి క్రిస్టియానిటీ (Christianity) రోమ్ లో స్థానం ఏర్పరుచుకుంది రోమన్ ఫోరం శిథిలమయ్యింది.
picture courtesy: Roman Forum - Wikiwand
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన గరిగిపోయే.
యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రికలంతరించె!
ఒకప్పటి వైభవానికి సాక్ష్యంగా ఆ ఫోరమ్ లో నిలిచిన శిథిలాలను చూడగానే జాషువా కవి పద్యం గుర్తొచ్చింది. రోమన్ ఫోరమ్ లోని ఆ రాతి స్తంభాలు శతాబ్దాల కథలు వినిపించాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని నిర్వహించిన విధానం, కోర్ట్ లు, మార్కెట్, రాజులు, యుద్ధాలు అప్పటి నమ్మకాలు, అలజడులు, వాటి వెనుక కారణాలు ఇలా ఎన్నో.
రోమన్ ఫోరమ్ పాలటీనా హిల్ (palatine hill), కపిటలైన్ హిల్ (Capitoline Hill) మధ్యలో ఉంది. ఆ ప్రాంతం నగరానికి మధ్యలో ఉండడంతో మొదట అక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉండేది. తరువాత కాలంలో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నంగా నిలిచిన స్థూపాలు, భవనాలు, విజయ సంకేతంగా కట్టించిన ఆర్చ్ లు, సభలు, సమావేశాలు, వేడుకలు, జైత్ర యాత్ర లతో ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. అక్కడ ఉన్న కొన్ని కట్టడాల గురించి తెలుసుకుందాం.
'ఆర్చ్ ఆఫ్ టైటస్ '(Arch of Titus, 70 BC), టైటస్(Titus) మహారాజు జరూసలెమ్(Jerusalem) మీద సాధించిన విజయానికి గుర్తుగా కట్టినది. ఆ ఆర్చ్ కి లోపల ఒక వైపున రథం మీద మహారాజు యుద్దానికి వెళ్తున్న చిత్రం, మరో వైపు యుద్దం గెలిచి జెరూసలేమ్ నుండి జ్యూవిష్(Jewish) లకు సంబధించిన పవిత్రమైన మినోర(Menorah), వెండి ట్రంపెట్(Trumpet) లాంటివి తీసుకుని వస్తున్న చిత్రాలు ఉన్నాయి.
Picture Courtecy: Ct-viasacra1 - Via Sacra - Wikipedia
వయా సేక్రా (Via Sacra). రోమన్ ఫోరమ్ లోని ముఖ్యమైన కట్టడాల మధ్యగా వెళ్ళే ప్రధాన మార్గం. యుద్ధములో గెలిచిన రాజు ఊరేగింపు ఆ దారి వెంబడే వెళ్ళేది.
'బాసిల్లికా ఆఫ్ మాక్సె౦చెస్' (Basilica of Maxentius, 312 BC). ఈ భవనం రోమన్ ఫోరమ్ లోని అతి పెద్ద కట్టడం, దీనిని పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, న్యాయస్థానంగానూ ఉపయోగించేవారు. ఈ భవనం ఆర్కిటెక్చర్ ఆధారంగానే న్యూయార్క్ పెన్ స్టేషన్ కట్టారు.
టెంపుల్ ఆఫ్ ఆంటోనైనస్ పైయస్ అండ్ ఫాస్టిన (Temple of Antoninus Pius and Faustina, 104 AD) ను ఆంటోనైనస్ తన భార్య ఫాస్టిన జ్ఞాపకార్థంగా కట్టించారు. ఆంటోనైనస్, ఫాస్టిన ప్రజలకు ప్రీతి పాత్రమైన వారు. ఫాస్టిన, స్త్రీల కోసం, బాలికల విద్య కోసం ఎన్నో పధకాలు అమలు చేయించారు. ఆ టెంపుల్ లోనే ఆంటోనైనస్ పార్ధివ దేహాన్ని కూడా ఉంచారు.
టెంపుల్ ఆఫ్ కాస్టొరి అండ్ పొలుక్స్, (Temple of Castor and Pollux, 495 BC). కాస్టొరి, పొలుక్స్ ఇద్దరూ డెమి గాడ్స్. గ్రీకు రోమన్ పురాణాలలో దేవునికి లేదా దేవతకు మనిషికి పుట్టిన వారిని డెమి గాడ్స్ అంటారు. రోమన్ రిపబ్లిక్ ఏర్పడడానికి కారణమైన రిగలస్ యుద్ద౦ (Battle of Lake Regillus) యుద్దం జరిగినప్పుడు, కాస్టొరి, పొలుక్స్ ఆ యుద్దంలో రోమన్స్ కు సహాయం చేసి గెలిపించారట.
టెంపుల్ ఆఫ్ శాటర్న్,( The Temple of Saturn, 499 BC). రోమన్ ఫోరం లో అతి పురతమైన కట్టడం. మొదట కట్టిన గుడి శిథిలమైతే క్రీస్తు పూర్వం నలభై రెండవ సంవత్సరంలో(42 BC) ఆ ప్రదేశంలోనే మళ్ళీ కట్టారు. ఆ గుడిని కోశాగారంగా ఉపయోగించేవారు.
టెంపుల్ ఆఫ్ వెస్ట (Temple of Vesta). వెస్ట దేవత గృహానికి, కుటుంబ సౌభాగ్యానికి, ముఖ్యంగా ఆహారం తయారయ్యే అగ్ని గుండానికి సంబంధించిన దేవత. రోమన్ పురాణం ప్రకారం ఆవిడ కన్య. అందుకని వెస్ట గుడి బాధ్యతలు కన్యలే నిర్వహించాలనే నియమం ఉండేది.
వెస్టల్ వర్జిన్స్(Vesta Virgins), రోమన్ పూజారిణులు. టెంపుల్ ఆఫ్ వెస్టా లోని అఖండ దీపాన్ని అన్ని వేళలా వెలుగుతూ ఉండేలా చూడడం వీరి బాధ్యత. ఆ దీపం రోమ్ సౌభాగ్యం అని రోమన్ల నమ్మకం. అలా ఆ దీపం వెస్ట గుడిలో వెయ్యేళ్ళ పాటు వెలిగింది.
వీరి నివాసం వెస్ట టెంపుల్ వెనుక ఉన్న అందమైన భవనం. వీరి సేవ కోసం, మందీ మార్బలం ఉండేవారు. వీరి కోసం ప్రత్యకమైన దుస్తులు నేసేవారు. వీరు ఊరిలోకి వెళ్ళాలంటే గుర్రపు బండ్లు సిద్ధంగా ఉండేవి. ఒకవేళ కాలినడకన వెళితే సెనేటర్ అయినా సరె ఆగి వారికి దారి ఇవ్వవలసిందే. అన్ని ప్రధాన వేడుకలలోనూ మొదటి వరుస వారిదే. వీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు, పన్ను కట్టనక్కర్లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ పదవీ బాధ్యతకు పేర్టిషియన్స్ కుటుంబంలోని కన్యలు మాత్రమే అర్హులు. వీరిని ఎంచుకునే బాధ్యత ప్రధాన పూజరిది.
వెస్ట వర్జిన్స్ కు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. వీరు ముప్పై ఏళ్ళ పాటు ఆ గుడికే అంకితమవుతామని ప్రమాణం చేయాలి. వారు వారి కుటుంబంతో కానీ, బంధు మిత్రులతో కానీ కలువకూడదు. వారికి సంసారమూ, పిల్లలు అనే ఆలోచనే రాకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే వారికి మరణ దండన విధించే వారు. దానికి కారణం వెస్టల్ వర్జిన్స్ పవిత్రంగా ఉండాలి, వారి తప్పటడుగు రోమ్ కు అరిష్టం అని నమ్మేవారు. వారి శిక్ష అమలు విధానం ఎలా ఉండేదంటే వారికి కాస్త నూనె, దీపం, బ్రెడ్ ముక్క ఇచ్చి నేల మాళికలో ఉంచేవారు. ఆహారం లేకపోవడం వలన వారు మరణించే వారు.
ముప్పై ఏళ్ళ పాటు వెస్టల్ వర్జిన్స్ గా ఉండి, బాధ్యత తీరిన తరువాత వారు పెళ్ళి చేసుకోవడానికి అర్హులు. అయితే అప్పటివరకూ సాధారణ జీవితం గడపక పోవడం వలన పెళ్ళి అవడమే కష్టం, ఒకవేళ పెళ్ళి చేసుకున్నా సాధారణ జీవన విధానంలో ఇమాడలేక విడిపోయే వారు. మరికొంత మంది జీవిత కాలం ఆ భవనంలోనే ఉండి పోయేవారు.
చూరియా జూలియా (Curia Iulia 44 BC), రోమన్ ఫోరమ్ లోని ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయం. రోమ్ కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను అక్కడ భద్రపరిచే వారు. ఏడవ శతాబ్దంలో దీనిని చర్చ్ గా మార్చారు.
రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన తరువాత కొన్ని కట్టడాలను చర్చ్ లుగా మార్చారు. తరువాత కాలంలో భూకంపాలు, వరదలు, తుఫాన్ ల తాకిడికి ఆ ప్రాంతం అంతా బీడు పడి దుమ్ము పేరుకుపోయి భూస్థాపితం అయింది. పదహారవ శతాబ్దంలో జరిపిన తవ్వకాలలో ఆ శిథిలాలు బయట పడ్డాయి. ఆ ప్రాంతాన్ని మొత్తం బయటకు తీయడానికి దాదాపుగా వంద సంవత్సరాలు పట్టింది. ఈ సమాచారం అంతా చరిత్ర పుస్తకాలు, వెబ్ సైట్స్ నుండి సేకరించింది. ఇవన్నీ పదిలపరిచి అందించిన వారికి ధన్యవాదాలు.
అలా రోమన్ ఫోరమ్ లో ఆ కట్టడాలవీ చూస్తూ దాదాపు రెండు గంటల వరకూ అక్కడే ఉన్నాము. తిరిగి వస్తుంటే అనిపించింది. ముందు రోజు ట్రెవీ ఫౌంటెన్ లో కాయిన్ వేయలేదు కాకమ్మ కథ అనుకుంటూ, కానీ అక్కడకు వెళ్ళి కాయిన్ వేస్తే మళ్ళీ రోమ్ కు రాగలమేమో అని.
వస్తూ వస్తూ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి లంచ్ చేసి మా గది వెళ్ళి సాయంత్రం నాలుగింటి వరకూ నిద్ర పోయాము. లేచాక తయారయి బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కి గమ్యం లేని ప్రయాణం చేసి ఊరు తిరిగి వచ్చాము. మధ్యాహ్నం భోజనం ఆలస్యంగా చేయడంతో ఆకలి అనిపించలేదు. ఇక మళ్ళీ భోజనం అదీ చేయకుండా ఆ రాత్రి త్వరగా నిద్రపోయాము. తరవాత రోజు ఉదయాన్నే ఏడున్నరకు వాటికన్ సిటీ టూర్ కు వెళ్ళాలి.
ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.