Tuesday, November 28, 2023

హాల్ స్టాట్

ఈ పోస్ట్ యూరప్ ప్రయాణం లో ఒక భాగం. ఇంతకు ముందుభాగం ఇక్కడ చదవొచ్చు. 

వియన్నా నుండి హాల్ స్టాట్ కు ఆల్ఫ్స్ పర్వతాల మీదుగా ప్రయాణం. పచ్చని పర్వతాలు వాటి మధ్యలో బొమ్మరిళ్ళలా కనిపినస్తున్న ఊర్లు, పర్వత శిఖరాలని తాకుతూ మేఘాలు, ఉండుండి పడుతున్న చిరు జల్లు, చాలా అందంగా సాగింది ప్రయాణం అంతా. 


హాల్ స్టాట్, ఆస్ట్రియాలోని ఒక చిన్న ఊరు. అక్కడ క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దం నుండీ మనుష్యులు ఉన్నట్లుగా అంచనా. ఏడువేల సంవత్సరాల నాటి సాల్ట్ మైన్స్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. యునెస్కో వార్ల్డ్ హెరిటేజ్ సైట్స్ లో హాల్ స్టాట్ కూడా ఒకటి. వియన్నా నుండి సాల్జ్ బర్గ్ కు వెళ్తూ మధ్యలో హాల్ స్టాట్ దగ్గర ఆగాలని మా ఆలోచన.

మేము హాల్ స్టాట్ చేరే సరికి దాదాపుగా ఒంటిగంట అవుతోంది. ఆ ఊర్లోకి రాగానే మొదట్లోనే మమ్మల్ని దింపేసి కార్ పార్క్ చేయడానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు డ్రైవర్. మైన్స్ దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాము కానీ తగినంత సమయం లేదు. మైన్స్ ఉన్న పర్వతం పైకి వెళ్ళడానికి మాత్రం ఫానిక్యులర్ ఉంది. ఫానిక్యులర్ అంటే బుల్లి రైలు, పట్టాల మీద పైకి కిందకూ తిరుగుతూ ఉంటుంది. టికెట్ తీసుకుని ఫానిక్యులర్ ఎక్కాము.


పైకి వెళ్ళి చూస్తే పెద్ద లేక్, చుట్టూ పర్వతాలు వాటి మధ్య నుండి వెళుతూ శిఖరాలను కమ్మేసిన తెల్లని మేఘాలు, సన్నగా పడుతున్న వానజల్లు, బొమ్మరిళ్ళలా కనిపిస్తున్న బుల్లి ఇళ్ళు. భలే నచ్చేసింది ఆ ఊరు. ఫ్రోజన్ సినిమా లోని అరెండేల్ ను హాల్ స్టాట్ చూసే డిజైన్ చేసారట. 



హాల్ స్టాట్ ను వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సెయింట్  మైకేల్ చాపెల్ కు తప్పనిసరిగా వెళతారు. ఎందుకంటే అక్కడ పెయింట్ చేసిన పుర్రెలు ఉంటాయి. నిజం,స్కల్స్ కు అలా ఎందుకు పెయింట్ వేస్తారో తెలుసా? హాల్ స్టాట్ చాలా చిన్న ఊరు, ఇళ్ళు కట్టుకోవడానికే స్థలం లేదు, ఇక శ్మశానానికి స్థలం ఎక్కడ. అందుకని ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సమాధులను తొవ్వి స్కెలిటన్స్ ను బయటకు తీసి స్కల్స్ మీద పేర్లు వ్రాసి, పెయింట్ చేసి ఆ చాపెల్ లో పెడతారు. వీటిని బోన్ హౌసెస్ అంటారు. ఇటువంటి పద్ధతి అమెరికాలో కూడా ఉంది.

      Photo Courtesy:  Beinhaus Hallstatt » Your holiday in Hallstatt / Austria

డ్రైవర్ ఎక్కడో కార్ పార్క్ చేసుకున్నాడుగా రమ్మని కాల్ చేస్తే చెప్పాడు. ఆ ఊర్లోకి కారు వెళ్ళదు ఎక్కడకు వెళ్ళాలన్నా నడుస్తూనే వెళ్ళాలని. నడవడానికి ఇబ్బంది లేదు, అయినా అది ఎంత ఊరని. కానీ ఒక్కటే సమస్య చలి, వర్షమూను, దాంతో ఎక్కడికీ వెళ్ళలేకపోయాం. 

అయితేనేం అక్కడ ఉన్నది కాసేపే అయినా ఎంతో కాలం జ్ఞాపకంగా మిగిలిపోయే అందమైన ఊరది. ఆ పూటకు ఒక చిన్న రెస్టారెంట్ వెతుక్కుని భోజనం చేసి అక్కడి నుండి  సాల్జ్బర్గ్  బయలుదేరాము.    

తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు.

No comments:

Leave your Comment

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.