Sunday, August 24, 2014

ఇంతకాలం ఏం చేస్తున్నట్లు?

    ఒకటా రెండా మూడేళ్ళవుతోంది. అయినా ఏం లాభం? ఏదో ఉద్దరించేస్తారని ఇన్ని రోజులు వృధా చేశాం. ఎన్ని సాయంత్రాలు పార్టీలకు ఆలస్యంగా వెళ్ళామో! ఎన్ని మధ్యాహ్నాలు నిద్రలు త్యాగం చేశామో ఆ భగవంతుడికే తెలుసు. ఇంత చేసి చివరకు ఏమైంది?

    మూడేళ్ళ క్రితం ఇదే రోజుల్లో మా పిల్లాడ్ని తెలుగు బడిలో చేర్చాను. అసలు నాకు పంపించాలనే లేదు. "ఈ రోజుల్లో తెలుగెందుకు పనికొస్తుందీ" అంటూనే వున్నారు మా వారు. మా పక్కిళ్ళ వాళ్ళంతా పంపిస్తుంటే మనం పంపకపోతే బావుండదని ఆయన్ను ఒప్పించి మరీ పంపించాను. పైగా అప్పుడప్పుడూ టివిల్లో అదీ కూడా చూపిస్తున్నారుగా తెలుగు నేర్చుకుంటున్న పిల్లల్ని. చెప్పుకోవడానికి కాస్త గర్వంగా కూడా ఉంటుంది.

    ఏదో వారానికో గంటే కదా అనుకున్నా. చేరాక తెలిసింది అక్కడ కూడా హోం వర్క్ ఉంటుందని. మొదటే తెలిస్తే ఆ..సింగినాదం అనుకుని అసలు చేర్పించేదాన్నే కాదు. ఆ రోజు పాఠశాల ఓరియెంటేషన్ కి వెళ్ళాల్సింది. కాస్త మబ్బేయడం చూసి బద్దకించాను. అక్కడే చెప్పార్ట రోజుకో పావుగంట చొప్పున వారానికి నాలుగు రోజులు హోం వర్క్ చేయించాలని. స్కూల్ వర్క్, కుమాను చేసేసరికే రాత్రి ఎనిమిదవుతుంది, ఇక తెలుక్కు టైం ఎక్కడుంటుందీ?

    సౌజన్య వాళ్ళమ్మాయి అన్ని హోం వర్క్ లు గంటలో చేసేస్తుందని ఆవిడ ఒకటే గొప్పలు.... ఎక్కడా అనకండి. ఆ పిల్ల ఒట్టి ముచ్చు. కూర్చున్న దగ్గరనుండి కదలకుండా మొత్తం హోం వర్క్ చేసేస్తుంది. అలా చేస్తే ఎవరికి మాత్రం అవదూ! మా వాడు అట్లా కాదు. మాహా యాక్టివ్. ఒక్క పావుగంట కూర్చుంటే ఎక్కువ .... నేనట్లా ఫోన్ అందుకోగానే చటుక్కున ఏ స్కూటరో తీసుకుపోయి చీకటి పడ్డాగ్గాని రాడు. పిల్లలన్న తరువాత ఆ మాత్రం ఆడకోకపోతే యెట్లా! అప్పటికీ హోం వర్క్ చేయించకుండా యేమీ లేను. వీలయినప్పుడల్లా ఆదివారాలు ఓ గంట కూర్చోపెట్టి వారం మొత్తం చెయ్యాల్సింది రాయించేస్తాను. అట్లా చేస్తే వాళ్ళకు రాదని వాళ్ళ టీచర్లు ఒకటే ఏడుపు. అట్లాంటివనీ నేను పట్టించుకోనులెండి. మనకు తోచింది మనం చేస్తాం కాని వాళ్ళు చెప్పింది మనం చేసేదేవిటీ?

    పద్యం సరిగ్గా చెప్పలేదనీ, ప కు, వ కు తేడా లేకుండా రాస్తున్నాడని, బ కు తలకట్టిస్తున్నాడని...... ఇంకా ఏమిటేమిటో సణుగుళ్ళు. ఆ టీచర్లు తీరి కూర్చుని తెలుగో అని మా ప్రాణాలు తీయకపోతే ఏ తెలుగు సినిమా అన్నా చూసుకోవచ్చుగా అంత తెలుగు మీద అభిమానం ఉన్నవాళ్లు.

    అక్షరాలంటే సరే ఏదోలే అనుకోవచ్చు. సుమతీ శతకాలు, వేమన శతకాలు అట. ఎందుకు పనికొస్తాయవి? చిన్నప్పుడు మేమూ చదువుకున్నాం. అవన్నీ బుర్రలో కెక్కించుకుంటే ఇట్లా ఉండేవాళ్ళమా. ఈ రోజుల్లో కావలసింది పక్కవాడ్ని తొక్కేసి యెట్లా పైకి రావాలి? లేదా సూది తీసి పక్కన పెడుతూ దుంగను మోస్తున్న మొహం ఎలా పెట్టాలి" ఇలాంటివి నేర్పాలి కాని..ఇలా నీతి, నిజాయితీ అని పాడుచేసే చదువులెందుకు?

    ఈ పిల్లాడు మాత్రం ఎన్నాళ్ళు వెళతాడ్లే అనుకున్నా! మూడేళ్ళయినా మానేస్తాననే మాటే లేదు. పిల్లలకు కథలూ కాకరకాయలూ అంటూ క్లాసు మానకుండా ఏవో ఎత్తులు వేస్తూనే ఉంటారు ఆ టీచర్లు. నాకు తెలీకడుగుతాను తెలుగు నేర్పించడానికి కథలెందుకు? మీరే చెప్పండి. ఉండబట్టలేక ఆ మాట అడిగాను కూడా! "వీళ్ళు చదివే ఇంగ్లీషు పుస్తకాల్లో పెద్దగా నేర్చుకునేవేం ఉండవండీ. వాళ్ళకు లోకజ్ఞానం రావడానికి మేము పంచతంత్రం కథలూ, నీతి కథలూ చెప్తాం" అని సమాధానం. ఆ లోకజ్ఞానమే ఉంటే వీళ్ళు నాలుగు రాళ్ళు సంపాదించుకునే ఆలోచనే చేసేవాళ్ళుగా.

   చదువంటే ఏదో అనుకోవచ్చు, వార్షికోత్సవం ఒకటి చేసి నాటకాలు, డ్రామాలు అంటూ మా ప్రాణాలు తోడేస్తారు. అదేమంటే మేమే ప్రాక్టీస్ చేయిస్తాము. మీరు కొంచెం మెయిల్స్ అవీ చూసి వస్తున్నారో లేదో రిప్లై ఇవ్వండి చాలు అంటారు. క్లాసుకు పంపించడమే కాక మళ్ళీ ఈ మెయిల్ చూడ్డం దానికి రిప్లై ఇవ్వడం మనకేం పని లేదనుకున్నారా! నేనేం పట్టించుకోలా. వాళ్ళ తిప్పలేవో వాళ్ళే పడ్డారు. వార్షికోత్సవం నాడు నాటకం చూశాం. అల్లూరి సీతారామరాజుని అందరూ పొగడడమే. మా వాడి వేషం అది కాదు లెండి. ఆ వేషం మా వాడికివ్వలేదేమని అడిగాను. "తెలుగు కాస్త మాట్లాడేవాళ్ళకిచ్చాం అన్నారు కాని, అదేం కాదు వాళ్ళమ్మ ఏ టీచర్ కో ఫ్రెండ్  అయివుంటుంది.

     ఈ మధ్య మా వాడు ఇంట్లో కనిపించినవన్నీ తీసి క్లోజేట్ లో పడేసి తలుపేస్తున్నాడు. అదేమంటే మా తెలుగు టీచర్ ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టమన్నాడని సమాధానం. ఆ పద్యాలో శ్లోకాలో పాడో.. ఆ నేర్పించే వాటితో ఊరుకోక మంచి విషయం అని ఒకటి మొదలెట్టారుగా. అప్పటినుండి వీడు అన్నం తింటున్నప్పుడు టివి కట్టేయడం, గుమ్మం ఎదురుగా వదలిన చెప్పుల్ని పక్కకు తోసేయడమూనూ..వెతుక్కోలేక చస్తున్నాం. ఆ మాత్రం విషయాలు మనం చెప్పుకోలేమూ పెద్దయ్యాక, ఎనిమిదేళ్ళ వాడికి అవన్నీ ఇప్పట్నుండే ఎందుకు?

     ఇంతకీ వాళ్ళు చెప్తున్న పాఠాలెక్కడివనుకున్నారు... ఏ స్టేట్ సిలబస్సో 

అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇక్కడ పిల్లల అవసరాలకు తగ్గట్లుగా ఏమిటో వాళ్ళే రాసుకున్నారట. పిల్లలకు సరదాగా ఉండేలా వర్క్ షీట్స్ కూడా చేశార్ట. ఇవన్నీ చెయ్యడానికి వీళ్ళకేం తెలుగులో డాక్టరేట్లు లేవు. పదో తరగతి దాకా వెలగబెట్టిన తెలుగు చదువే. ఇలాంటి వాళ్ళే, వీళ్ళకో పది మంది వత్తాసు. "అబ్బా ఇంత బాగా ఉంది అంత బాగా ఉంది. మీరు ఏం ఆశించకుండా ఇంత చేస్తున్నారూ" అని. నేను మాత్రం నమ్మను బాబూ. ఈ రోజుల్లో ఎవరు మాత్రం ఊరికినే చేస్తారు? నాలుగు రోజుల్లో నాలుగొందలు ఫీజు పెట్టకపోతే నన్నడగండి. 

     ఇవన్నీ సరే. "మీరు పిల్లలతో ఇంట్లో తెలుగులో మాట్లాడండో" అని ఒకటే నస. అది చాలనట్లు రాత్రిపూట తెలుగు కథ చదివి వినిపించాలట. ఓ టీచర్ అయితే ఇంకా రెండు మెట్లు ఎక్కువే. మమ్మల్ని కూడా తెలుగు పుస్తకాలు చదవమంటుంది. అలా అయితే వాళ్లకు మన భాష మీద ఆసక్తి పెరుగుతుందట. ఇంకా నయం వాళ్ళకోసం మమ్మల్ని హిస్టరీ, జాగ్రఫీ పుస్తకాలు చదవమన్నది కాదు! వింటున్నాం కదా అని చెవిలో ఏకంగా కేలీఫ్లవర్స్ పెట్టడమే. మన పిల్లలెవరు కనిపించినా తెలుగులోనే మాట్లాడమని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తున్నారు. నేను మాత్రం పిల్లల్ని తెలుగులో మాట్లాడమని కష్టపెట్టలేను బాబూ!

    పోయినాదివారం సౌజన్య వాళ్ళమ్మాయి రేడియోలో ఏదో ప్రోగ్రాం చేసిందట. వాళ్ళ నాన్నమ్మ ఊరూ, వాడా మైకు పెట్టేసింది. వాళ్ళది ఇండియాలో మా పక్క వీధేలెండి. మా వాడు కూడా నాలుగు తెలుగు ముక్కలు రాస్తున్నాడు. కూడుకుని కూడుకుని చదువుతున్నాడు. అయినా మూడేళ్ళు పంపినా ఒక్క ముక్క మాట్లాడించలేక పోయాక తెలుగు బడికి పంపించి ఏం లాభం? ఇంతకాలం వాడి టీచర్ ఏం చేస్తున్నట్లు?

28 comments:

 1. u r right don't encourage telugu

  ReplyDelete
  Replies
  1. :)
   ధన్యవాదాలు అజ్ఞాత గారు.

   Delete
 2. Replies
  1. ధన్యవాదాలు కిషోర్ గారు.

   Delete
 3. mee slesha baagundi.
  maa baa tittaaru telugubadini :)

  ReplyDelete
  Replies
  1. అప్పుడన్నా మానేస్తారేమో అనుకున్నానండి. మహా మొండి ఘటాలు కదూ! ఈ ఏడు దాదాపుగా వంద రిజిస్ట్రేషన్లట. :)
   ధన్యవాదాలు కృష్ణ గారు.

   Delete
 4. Mare... baaga cheparandi ;-) ~Neelima

  ReplyDelete
  Replies
  1. నచ్చిందంటే మీరు నాలాంటి వారేనన్న మాట. ; - )
   ధన్యవాదాలు నీలిమా గారు.

   Delete
 5. బాగుందండీ :)
  అటునుండి నరుక్కొచ్చినట్టున్నారు!!

  ReplyDelete
  Replies
  1. :)
   ధన్యవాదాలు నాగరాజ్ గారు.

   Delete
 6. నాగరాజ్ అన్నయ్య గారి కామెంటే నాదీనూ.. :)
  అయినా నేనిది చెప్పే తీరాలండీ. మీ శైలి నాకు ఎంత నచ్చిందో........!!

  ReplyDelete
  Replies
  1. మీరు నరుక్కొచ్చానంటున్నారా! ఎలాగోలా బాట వెయ్యడం ముఖ్యం కదూ..
   ధన్యవాదాలు ప్రియ గారు.

   Delete
 7. అద్భుత: ! చక్కని శ్లేష! తేట తెనుగులో మాధుర్యం ఒకసారి చవి చూస్తే యెవరికీ వదలబుద్ది కాదు. నాగరాజ్ గారు అన్నట్టు అటునుండి బాగా నరుక్కొచ్చారు!

  ReplyDelete
  Replies
  1. మీ వ్యాఖ్య ఎంతో మధురంగా ఉంది. ధన్యవాదాలు వై జె గారు.

   Delete
 8. ఇలాక్కూడా చెప్పొచ్చునన్నమాట..మా బాగా చెప్పారు.

  ReplyDelete
 9. తెలుగు మీద జనాలకు, మహా ఇల్లాళ్ళకు ఎంత ఏవగిపు ఉందో చాలా బాగా చెప్పారు, మీ శైలి బాగుంటుంది

  ReplyDelete
  Replies
  1. థాంక్యు ఫాతిమా గారు.

   Delete
 10. Chala bagundi Jyothirmayi Garu, eppati kaina telugu vaadakam perigithi baguntundi anipistondi. Nice article

  ReplyDelete
  Replies
  1. నిజమేనండి. పెరగడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. థాంక్యు.

   Delete
 11. బాగు౦ది మిా రచన

  ReplyDelete
  Replies
  1. థాంక్యు రావిశేఖర్ గారు.

   Delete
 12. ఔను, అయినా మల్ళీ మీరు తెలుగులో బ్లాగడం ...మీ వాడ్ని గురించి వాడి తెలుగు గురించి చెప్పుకోవడానికి కాదు? ఇహ ఆ దేవుడు కూడా క్షమించడు మిమ్మల్ని. వందకు మించిన నమోదులే!

  ReplyDelete
  Replies
  1. తిట్టారా పొగిడారా అని ఓ క్షణం కంగారు పడ్డాను. :)) థాంక్యు అనిల్ గారు.

   Delete
 13. చక్కటి శైలి. అందమైన భావవ్యక్తీకరణ. మీ తెలుగు పాఠశాల దినదిన ప్రవర్ధమానమవ్వాలని ఆశిస్తున్నాను జ్యోతిగారు.

  ReplyDelete
  Replies
  1. హమారా వేదిక ద్వారా మీరందస్తున్న ప్రోత్సాహంతో మా పాఠశాలే కాదు. అమెరికాలో ఇంతకాలం తెరవెనుక ప్రకాశిస్తున్న తెలుగు బడుల దివ్య తేజస్సును ప్రపంచం గుర్తించగలదని భావిస్తున్నాను. ధన్యవాదాలు సురేష్ గారు.

   Delete
 14. Can't stop smiling all the way while reading...Good one.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.