Sunday, December 10, 2023

మిలాన్

ముందుభాగం కబుర్లు ఇక్కడ చదవొచ్చు. 

మన దేశంలో రాష్ట్రాలున్నట్లుగా ఇటలీలో ప్రాంతాలు(రీజియన్స్) ఉన్నాయి, మొత్తం ఇరవై. మిలాన్, ఉత్తర ఇటలీ లోని లంబార్డి ప్రాంతానికి రాజధాని, ఇటలీ లోని పెద్ద నగరాలలో రెండవది. అక్కడ క్రీస్తు పూర్వం ఐదువందల సంవత్సరం నుండీ మనుష్యులు నివసిస్తూ ఉండడమే కాక అప్పట్లో కూడా అది ప్రముఖమైన పట్టణమే.

ప్రాగ్ నుండి ఉదయం ఎనిమిది గంటలకు ఫ్లైట్ లో బయలుదేరి తొమ్మిదిన్నరకు మిలాన్ చేరాము. అదే మొదటిసారి మేము ఇటలీకు రావడం. వీలయినంత వరకూ ఊబర్, టాక్సీ, వాకింగ్ టూర్స్ తీసుకోకుండా స్వంతంగా ఇటలీ చూడాలని మా కోరిక.
 
                                    PC: Italy Tours Online 
ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే ఎదురుగానే ఉంది మెట్రో స్టేషన్. గూగుల్ మ్యాప్స్ చూస్తే మరో పది నిముషాలలోనే మెట్రో వస్తున్నట్లుగా ఉంది. టికెట్ తీసుకుని స్టేషన్ లోపలకు వెళ్ళాం. అక్కడ చాలా మందే ఉన్నారు. మ్యాప్ లో చూపించనట్లు ఖచ్చితంగా పదినిముషాలలో ట్రైన్ వచ్చింది.
 
లగేజ్ పెట్టడానికి సీట్స్ పైనా, పక్కనా రాక్స్ ఉన్నాయి. సూట్ కేసెస్ పైన పెట్టి సీట్ లో కూర్చున్నాము. మా ఎదురు సీట్ లో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు, ఒకళ్ళది రష్యా, మరొకళ్ళది ఉక్రైన్. వాళ్ళు ప్రాహా యూనివర్సిటీలో చదువుతున్నారు,  వాళ్ళ మేజర్ ఇంటర్నేషనల్ టూరిజం. వాళ్ళ దేశాల గురించీ పేరెంట్స్ గురించీ చాలా కబుర్లు చెప్పారు. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే చెక్ భాషలో చదివితే ప్రాహా (ప్రాహా లో చెక్ భాష మాట్లాడతారు) లో కాలేజ్ ఎడ్యుకేషన్ ఉచితమట. వాళ్ళ దేశాలలో చెక్ నేర్చుకోవడానికి ట్యూషన్ చెప్పించుకుని ప్రాహా యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నారు. చెక్స్ వాళ్ళ భాషను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇస్తున్నట్లున్నది. ఇద్దరమ్మాయిలూ మిలాన్ చూడడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎవరికి మాత్రం ఉండదు ప్రపంచంలోని నాలుగు ఫాషన్ కాపిటల్స్ లో మిలాన్ కూడా ఒకటి.  అక్కడ గెలరియో మాల్ చూడడానికి ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు. 

మెట్రో దిగాక టాక్సీ తీసుకుందామా అనిపించింది కానీ స్వంతంగా ఇటలీ చూడాలని కదా అనుకున్నాం అందుకని సిటీ బస్ ఎక్కడానికి బస్ షెల్టర్ దగ్గరకు వెళ్ళాం. గూగుల్ మ్యాప్ లో చూస్తే పది నిముషాలలో బస్ వస్తున్నట్లుగా ఉంది. బస్ ఎక్కాక అక్కడ వాళ్ళ సహాయంతో టికెట్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం.
 
మేము బస్ దిగేసరికి పన్నెండు గంటలవుతోంది. మేము తీసుకున్న అపార్ట్మెంట్ కు ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళకు అడ్రస్ చూపించి అడిగితే ఎదురుగా ఉన్న చిన్న వీధి చూపించారు. ఇరుకుగా ఉందా వీధి, గోడల మీద, తలుపుల మీద అంతా గ్రాఫిటీ. అదంతా చూసి మేము హోటల్ కాకుండా ఎయిర్బియన్బి తీసుకుని తప్పు చేసామా అనిపించింది.

అపార్ట్మెంట్ ఎదురుగా నిలబడి మెసేజ్ చేయగానే ఒక పాతికేళ్ళ అమ్మాయి తలుపు తెరిచింది. మా ఫ్లాట్ మొదటి అంతస్తులో ఉందని చెప్తూ వద్దంటున్నా వినక చనువుగా నా దగ్గర నుండి సూట్ కేస్ తీసుకుని మెట్లమీదుగా పైకి దారి తీసింది. తాళం తీసి లోపలకు వెళ్ళగానే ఎదురుగా హాల్ వే, హాల్ వేకు ఒకవైపున బాత్ రూమ్, వాకిన్ క్లోజెట్, అటక మీదకు వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అవి దాటి వెళితే ఒక చిన్న గది, అందులోనే వైపున సోఫా, మరొక వైపున కిచెన్ ఉన్నాయి. ఆ ఇంటిలో స్టవ్, ఫ్రిడ్జ్, ఎసి, వాషర్ ఇలా కావలసిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ సరేకానీ బెడ్ ఏదీ అనుకుంటున్నారా. అటక మీదే పడక, పైన క్వీన్ సైజ్ బెడ్ ఉంది. ఇద్దరు మనుషులు ఉండడానికి ఎంత స్థలం కావాలో అంతే ఉందా ఫ్లాట్. అలాంటి ఇంటిలో కనుక రోజుకు ఖచ్చితంగా మరో నాలుగు గంటలు మిగులుతాయి.

ఎసి ఇరవై కంటే ఎక్కువ పెంచొద్దనీ, చెత్త, రీసైకిలింగ్ ఐటెమ్స్ వేరువేరుగా వేయమని మరీ మరీ చెప్పింది. ఆ నగరంలో రూల్స్ చాలా ఖచ్చితంగా పాటిస్తారట. చివరగా మాకు ఫ్లాట్, అపార్ట్మెంట్ మెయిన్ డోర్ తాళాలు ఇచ్చి అవి ఎలా వాడాలో చూపించింది. దగ్గరలో మంచి రెస్టారెంట్స్ ఉన్నాయా అని అడిగితే  “డోంట్ వర్రీ ఇటాలియన్స్ డోంట్ ఫీడ్ యు బ్యాడ్ ఫుడ్” అంటూ అవసరమైతే తనకు కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయింది. డ్రయ్యర్ లేకుండా బట్టలు ఎలా ఆరతాయనే సందేహం ఉందిగా, అదేదో తెలుసుకుందామని తేలికగా ఉండే బట్టలు కొన్ని వాషర్ లో వేసి ఊరు చూడడానికి బయలుదేరాం.
 
 
మా అపార్ట్మెంట్ కు నడిచే దూరంలోనే ఉంది గెలారియో మాల్, ముందుగా అక్కడికే వెళ్ళాం. అక్కడన్నీ బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి, ప్రతి షాప్ ముందు లోపలకు వెళ్ళడానికి పెద్ద క్యూ ఉంది. అయినా మేము ఆ షాప్స్ కోసం కాదు అక్కడకు వెళ్ళింది ఆ మాల్ ఆర్కిటెక్చర్ చూడడానికి.

ఆ మాల్ ను పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ప్రారంభించారు. అప్పట్లోనే అంత పెద్ద మాల్ ఉండేదా అని ఆశ్చర్యం వేసింది. నాలుగు పెద్ద బిల్డింగ్స్ ను ఒకదానిని ఒకటి కలుపుతూ పైన గ్లాస్ రూఫ్, నాలుగు బిల్డింగ్స్ కలసే దగ్గర పెద్ద గ్లాస్ డోమ్ ఉంది. అప్పట్లో అంత ఎత్తులో గ్లాస్ డోమ్ ఎలా పెట్టారో మరి.
మిలాన్ లో చూడవలసిన మరో ప్రదేశం డ్యూమో డి మిలనో. ఆ డ్యూమో గురించి తెలుసుకునే ముందు చర్చ్, కాథడ్రల్, డ్యూమో, బసిల్లికా వీటి గురించి తెలుసుకుందాం. 

చర్చ్ అంటే క్రైస్తవుల ప్రార్ధనా స్థలం, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కూడా కావచ్చు. చర్చ్ లో పాస్టర్ ప్రార్థనలు అవీ చేయిస్తూ ఉంటారు. కెథడ్రల్ అంటే పెద్ద చర్చ్, ఒక్కసారిగా ఎక్కువ మంది ప్రార్థనలు చేయడానికి, పండుగలు అవీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ కెథడ్రల్స్ చాలా అందంగా ఉంటాయి. ఈ కెథడ్రల్స్ కు పెద్ద బిషప్.

ఇక బసిల్లికా చెప్పాలంటే, రోమన్ కాథలిక్ పోప్ అనుమతితో చర్చ్ బసిల్లికా అవుతుంది. బసిల్లికాలో ముఖ్యమైన పండుగలు చేయడానికి సమావేశాలకు వీలుగా మధ్యలో పెద్ద స్థలం ఉండీ చుట్టూ ఎక్కువ మంది కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. ఈ బసిల్లికాలో మత పెద్దల మృత దేహాలను భద్రపరుస్తారు. 

ఇటాలియన్ లో డ్యూమో అనే పదానికి ఇంగ్లీష్ అర్థం కాథడ్రల్, డోమ్. మిలాన్, ఫ్లోరెన్స్, సియన్నా, పీసాలలోని ప్రముఖమైన డ్యూమోలున్నాయి. ఆ డ్యూమోల విశిష్టత వాటి ఆర్కిటెక్చర్. 

ఇక మన కథలోకి వద్దాం. గెలారియో మాల్ అవరణలోనే మిలాన్ డ్యూమో ఉంది. ఆరువందల ఏళ్ళ నుండీ ఉన్న ఆ డ్యూమోను కట్టడానికి నాలుగు శతాబ్దాలు పట్టిందిట. ఆ డ్యూమో ప్రాముఖ్యత ఏమిటంటే అక్కడున్న విగ్రహాలు. దాదాపు మూడువేల ఐదువందలకు పైగా విగ్రహాలు ఉన్నాయి. రూఫ్ పైకి మెట్లమీదుగా వెళ్ళొచ్చు, లిఫ్ట్ లో కూడా ఉంది కానీ అది అది కొంతవరకే పైకి తీసుకెళ్ళింది. లిఫ్ట్ దిగి మెట్ల మీదుగా రూఫ్ పైకి వెళ్ళాము. అక్కడ  అన్ని వైపులా ఎత్తుగా విగ్రహాలు ఉన్నాయి, అన్నింటికంటే ఎత్తుగా బంగారు రంగులో మడోనా (మేరీ మాత) విగ్రహం ఉంది. 
 
 
మధ్యాహ్నపు టెండ తన ప్రతాపం చూపిస్తోంది. రూఫ్ మీద నుండి కిందకు రావడానికి లిఫ్ట్ లేదు. మెట్లు దిగితే నేరుగా కేథడ్రల్ లోపలకు వెళ్ళాము. మొజాయిక్ తో డిజైన్ చేసిన నేల, పెద్ద పెద్ద స్తంభాలు, రంగులతో బొమ్మలు వేసిన కిటికీ అద్దాలు, విగ్రహాలతో ఎంతో అందంగా ఆర్భాటంగా ఉందా  డ్యూమో.
 
 
దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో మాల్ కు వెళ్తే అక్కడ షాప్స్ ముందు లైన్స్ అలానే ఉన్నాయి. మేము ఇంటర్ నెట్ లో చూసినప్పుడు మాల్ ఇరవై నాలు గంటలు ఓపెన్ ఉంటుందని ఉంది. సరే రూమ్ కి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని ఏ ఏడుగంటలకో వద్దామని రూమ్ కి వెళ్ళాము.
వాషర్ లో వేసిన బట్టలు తీసి అక్కడ యాటిక్ కు రెయిల్స్ ఉంటే వాటి మీద ఆరేసాం. కాసేపు పడుకుని లేచి, సాయంత్రం ఏడవుతుండగా మాల్ కు వెళ్ళాము. దాదాపుగా అన్ని షాప్స్ మూసేసి ఉన్నాయి. నెట్ లో చూస్తే మాల్ ఓపెన్ షాప్స్ క్లోజ్ అని ఉంది. రాత్రంతా షాప్స్ ఉండక పోవచ్చు కానీ అంత బిజీ సిటీలో వారం మధ్యలో కూడా ఏడు గంటలకే మూసేయడం ఏమిటి అని ఆశ్చర్యపోయాం. తరువాత తెలిసింది ఏమిటంటే యూరప్ లో ఎక్కువ భాగం సాయంత్రం ఏడు గంటల తరువాత షాప్స్ ఏవీ తెరిచి ఉండవని.

సరే షాప్స్ ఎలాగూ లేవుగా అని అక్కడ డిన్నర్ చేద్దామని రెస్టారెంట్ కు వెళ్ళాం. అది మరో పొరపాటు, ఎప్పుడూ అలా మెయిన్ అట్రాక్షన్ ప్రాంతాలలో రెస్టారెంట్ కు వెళ్ళకండి అని ఫేస్ బుక్ మిత్రులు హెచ్చరించారు కూడా. అయినా వినకుండా వెళ్ళాం. వెళ్ళిన వాళ్ళం ఏ విజిటేయరియన్ ఫుడ్డో ఆర్డర్ చేయొచ్చుగా. ఇండియన్ వెయిటర్ మాట విని సామన్ ఆర్డర్ చేసాను. నాలుగు చేప ముక్కలు, లెటస్, కొంచెం క్రీమ్ చీజ్ ఉన్న ప్లేట్ తీసుకుని వచ్చాడు. చేప చూస్తే లేత  పింక్ రంగులో ఉంది. సందేహం వచ్చి వెయిటర్ ను పిలిచి ఈ చాపను వుడక బెట్టలేదా అని అడిగాను. అబ్బే లేదు, ఆ డిష్ ఎలాగే చేస్తారని చెప్పాడు. ఏం ఆర్డర్ చేసానని ఆడక్కండి, నాకు మాత్రం ఏం తెలుసు మెన్యూ అంతా ఇటాలియన్ ఉంది. ఇక చేసేదేం ఉంది. ఇటలీలో ఏం ఆర్డర్ చేసినా ఒక బుట్ట నిండుగా బ్రెడ్స్ తెచ్చి పెడతారు. ఆ పూటకు అవే తినేసి బయటపడ్డాం. ఇటలియన ఫుడ్ అని బోలెడు అనుకుంటూ వచ్చిన మాకు మొదటి డిన్నర్ అలా అయింది.

మా డిన్నర్ అయ్యేసరికి రాత్రి ఎనిమిది అవుతోంది. పగటి ఎండ పోయి రాత్రి చల్లగా హాయిగా ఉంది. లైట్స్ వెలుగులో డ్యూమో మాత్రం అద్భుతంగా ఉంది.
తరువాత రోజు ఉదయమే మేము వెనిస్ వెళ్తోంది. ఆ రాత్రి అపార్ట్మెంట్ కు వెళ్తూ గ్రాసరీస్ దగ్గర ఆగి కోడి గుడ్లు, మంచి నీళ్ళు తీసుకుని వెళ్ళాం. మరిచే పోయాను ఇటలీలో ఈ నీళ్ళు కొనడానికి ఒక కథ ఉంది. అక్కడ వట్టి నీళ్ళు కావాలంటే స్టిల్ వాటర్ కొనాలి. ఆ స్టిల్ వాటర్, సోడా రెండూ ఒక్క లాంటి బాటిల్స్ లోనే ఉంటాయి. ఇటలీ టూర్ మొత్తం మీద ఒక ఆరు సార్లయినా నీళ్ళకు బదులు సోడా కొని ఉంటాము. అక్కడ పంపులలో వచ్చే నీళ్ళు తాగొచ్చు కానీ మా చాదస్తం, ఆ నీళ్ళు తాగి ఆరోగ్యం పాడయితే దేశం కానీ దేశంలో ఇబ్బంది పడతాం కదా.

ఉదయం లేచి ఇటలీలో మొదటి వంట అని ఉత్సాహంగా ఆమ్లెట్ వేయడానికి పాన్, ఉప్పూ, మిరియాల పొడి అన్నీ తీసి పెట్టి స్టవ్ ఆన్ చేద్దాం అంటే అవదే. అలాంటి స్టవ్ ఆన్ చేయడం ఎలా అని గూగుల్ చేసాం, అబ్బే ఉపయోగం లేదు. ఆ ఇంటి ఓనర్ కు మెసేజ్ పెట్టాం, వాళ్ళు అప్పటికి లేచినట్లు లేదు రిప్లై రాలేదు. ఇక చేసేదేం ఉంది ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసి కోడి గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టి మా సామాన్లు తీసుకుని ఇంటికి తాళం వేయకుండా తలుపు దగ్గరగా వేసి బయట పడ్డాం. తాళం వేయవద్దు క్లీనర్స్ వస్తారని ఇంటి వాళ్ళే చెప్పారు లెండి. 

ఉదయం ఏడున్నరవుతోంది టైమ్. చెరుగుతున్నప్పుడు చేటలోంచి బియ్యం ఒక్కసారిగా పైకి లేచి కిందకు పడినట్లు ముందురోజు హడావిడి అంతా సర్దుకుని నిశ్శబ్దంగా ఉందా నగరం. టాక్సీ తీసుకుని రైల్వే స్టేషన్ కు బయలుదేరాం. డ్రైవర్ వచ్చీ రాని ఇంగ్లీష్ లో కబుర్లు చెప్పాడు. అతను నెపోలి, నేపల్స్ లో పని దొరకడం కష్టమై ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం మిలాన్ కు వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడట. అతనికి ముగ్గురు పిల్లలు, అందులో చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కూడా ఉంది. ఇటలీలో ఎవరూ ముప్పై వచ్చేవరకూ పెళ్ళి మాటే ఎత్తరట. దారిలో అన్నీ చూపిస్తూ స్టేషన్ దగ్గర దింపాడు.
అదే యూరప్ లో మొదటి సారి ట్రైన్ స్టేషన్ చూడడం. అది ట్రైన్ స్టేషన్ లాగా అనిపించలేదు, ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అక్కడ షాప్స్, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ ఉన్నాయి. స్వంతంగా యూరప్ ప్రయాణం అనుకున్నప్పటి నుండీ ఈ ట్రైన్ ఎక్కడం గురించే కంగారు పడ్డాము, ట్రైన్ ఎక్కడకు వస్తుంది ఎలా ఎక్కుతాము అని. అక్కడ బోర్డ్ మీద ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫార్మ్ మీదకు వస్తుందో చక్కగా చూపిస్తున్నారు. టికెట్ స్కాన్ చేసి ప్లాట్ ఫార్మ్ మీదకు వెళ్ళాం. బిజినెస్ క్లాస్ సీటింగ్ బావుంది, ఫ్లైట్ లో ఉన్నట్లుగా హోస్ట్ ఉన్నారు. మధ్యలో ఫ్లైట్ లో ఇచ్చినట్లు స్నాక్స్ ఇచ్చారు.
 
  
   
మా ఎదురుగా ఒక యాభై ఏళ్ళ ఆవిడ, ఒక పాతికేళ్ళ అతను కూర్చున్నారు. వాళ్ళ డ్రస్ చూస్తే ఇద్దరూ ఏదో ఆఫీస్ కు వెళ్తున్నట్లుగా ఉన్నారు. కూర్చోగానే ఏవో పేపర్లు ముందేసుకుని ఆవిడ చెప్తున్నారు, ఆ అబ్బాయి తల ఊపుతున్నాడు. అంతా ఇంటాలియన్ లోనే. దిగబోయే ముందు మేము కూడా ఐటి సెక్యూరిటీ వాళ్ళమే అని తెలిసి కాస్త కబుర్లు చెప్పారు. ఆవిడ ఒక కంపెనీకి డైరెక్టర్, ఆ అబ్బాయి తన సెక్రటరి. వాళ్ళు ఏదో కంపెనీకి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు.

మాకు రెండో వైపున ఉన్న కిటికీ దగ్గర ఇద్దరు పంజాబీ అక్కా చెల్లెళ్ళు కూర్చున్నారు. ఒకరు ఇండియా నుండి ఒకరు అమెరికా నుండి ఇటలీ చూడడానికి వచ్చారు. సంవత్సరానికి ఒకసారి ఇలా ఇద్దరూ టూర్స్ కు వెళ్తుంటారట. ఫామిలీ, ఉద్యోగాలు అన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టి అలా అక్కా చెల్లెళ్ళు కలిసి కొంత కాలం గడపడం చేయడం బావుంది కదూ. వాళ్ళ అమ్మా, నాన్నా యూరప్ అంతా చూసేసారట. వాళ్ళు వెనిస్ సిటీలో దిగిపోయారు. సిటీలో ఉండడం వలన మంచి హోటల్స్ తక్కువ అద్దెలో దొరుకుతాయట. అయితే  అక్కడ నుండి వెనిస్ ఐలెండ్ కు రావాలంటే దాదాపుగా అరగంట పైనే పడుతుంది.

వాళ్ళు దిగి వెళ్ళాక మా వెనుక సీట్ లో ఉన్న అమెరికా నుండి వస్తున్న మరో ఫామిలీ పరిచయం అయ్యారు. అమ్మా, నాన్న, ఇద్దరు చిన్న పిల్లలు. మేము ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్తుంటే వాళ్ళు దక్షిణాన ఉన్న నేపల్స్ లో లాండ్ అయి రోమ్, ఫ్లోరెన్స్ చూసి వెనిస్ కు వెళ్తున్నారు. మేము కనుక పాంపే వెళ్ళేట్లయితే హెర్క్యులేనియమ్ మాత్రం మిస్ అవ్వొద్దని సలహా ఇచ్చారు. మా కబుర్లలోనే వెనిస్ వచ్చేసింది. అలా జరిగింది మా మిలాన్ ట్రిప్, మొదటి యూరప్ ట్రైన్ ప్రయాణం. 

ప్రయాణం కబుర్లు మొదటి నుండి చదవాలంటే ఇక్కడకు, తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

4 comments:

  1. -

    ఇటలీ మిలాను నగరము !
    తటిత్తు కాంతులను జూడ తనువూగెన్ వె
    న్కటి భవనమ్ముల సొబగుల
    హొ టింగు రంగా యటంచు హొయలను జూపన్

    జిలేబుల్స్

    ReplyDelete
  2. Chaala baagundi. Andi.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.