ముందుభాగం కబుర్లు ఇక్కడ చదవొచ్చు.
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. చెక్స్ దానిని ప్రాహా అంటారు. అక్కడ చెక్, స్లోవక్, పోలిష్ భాషలు మాట్లాడతారు. యునెస్కో వర్ల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ప్రాహా కూడా ఒకటి.
లగేజ్ అంతా పెట్టేసి దగ్గరలోనే ఉన్న బిబి రెస్టారెంట్ కు వెళ్ళాము. అది హై ఎండ్ సబ్వే లా ఉంది, సబ్స్, ఫ్రెష్ ఆరంజ్ జ్యూస్ తీసుకున్నాం. ప్రాహాలో యూరోలు తీసుకోరు అక్కడ వాడడం కోసం క్రౌన్స్ కూడా తెచ్చుకున్నాం. లంచ్ చేసాక ఎదురుగా ఉన్న షెల్టర్ కు వెళ్ళి క్యాజల్ వైపు వెళ్ళే ట్రామ్ ఎక్కాము.

ప్రాహా లోని కోట(కోటల సముదాయం) యూరప్ లోనే అతి పెద్ద క్యాజల్ కాంప్లెక్స్ ట. ఈ క్యాజల్ అతి పురాతనమైనది. మొదటి శతాబ్దంలో కట్టిన క్యాజల్ స్థానం లోనే పద్నాలుగవ శతాబ్దంలో యంపరర్ చార్లెస్ ఫోర్ ఆధ్వర్యంలో గాథిక్ స్టైల్ లో పెద్ద క్యాజల్ కట్టారు. ఆ కాంప్లెక్స్ లో కెథడ్రల్, బసిల్లికా, ఎన్నో కోర్ట్ యార్డ్ లు ఉన్నాయి. ఈ క్యాజల్ లో గతంలో రాయల్ ఫామిలీస్, ఆర్చ్ బిషప్ ఉండేవారు, ప్రస్తుతం చెక్ రాష్ట్రపతి నివాసంగా మార్చారు.ప్రాగ్ లో పెట్రిన్ టవర్ అని ఒక టవర్ ఉంది. దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాహాలో ‘చెక్ కెసిటి’ అని ఒక టూరిజం క్లబ్ పంతొమ్మిదవ శతాబ్దం నుండీ నడుస్తోంది. ఆ క్లబ్ లో ప్రస్తుతం నలభై వేల మంది ఉన్నారు. ఈ గ్రూప్ వాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పేరిస్ లోని ఐఫిల్ టవర్ చూసి ముచ్చటపడి ప్రాహా లో కూడా అలాంటిది ఒకటి ఉంటే బావుంటుందని అనుకున్నారట. ఊరికే అనుకోవడమే కాక డొనేషన్స్ కలెక్ట్ చేసి కేవలం నాలుగు నెలలోనే పెట్రిన్ టవర్ కట్టారు. దానిని ప్రాహాలో ‘జెనెరల్ లాండ్ సెంటెన్నియల్ ఎగ్జిబిషన్’ అనే ఫెయిర్లో ప్రదర్శించారు. మొదట్లో అది లుక్ అవుట్ టవర్ లాగా, ఆ తరువాత టెలివిజన్ టవర్ లాగానూ ఉపయోగపడింది.
క్యాజల్ నుండి పెట్రిన్ టవర్ కు వెళ్ళడానికి ఊబర్ బుక్ చేస్తే అది రావడానికి దాదాపు నలభై ఐదు నిముషాలు పట్టింది. ఊబర్ లో పెట్రిన్ టవర్ దగ్గర వెళ్ళి చూసి అదే ఊబర్ లో హోటల్ కు వెళ్ళిపోయాము.
ఆ సాయంత్రం చీకటి పడబోతుండగా ఓల్డ్ టౌన్ స్క్వేర్ కు వెళ్ళాము. అక్కడ ఓల్డ్ టౌన్ హాల్ టవర్ మీద ఒక ఆస్ట్రనామికల్ క్లాక్ ఉంది. పదిహేనవ శతాబ్దంలో తయారుచేసిన ఆ క్లాక్ ఇప్పటికీ పనిచేస్తోంది.

అక్కడి నుండి చార్ల్స్ బ్రిడ్జ్ వరకూ వెళ్ళేరంతా చిన్నషాప్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎక్కువగా స్వీట్స్, చాకొలెట్స్ షాప్స్ కనిపించాయి. అవన్నీ దాటి వెళితే చార్ల్స్ బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ కు రెండు వైపులా పెద్ద టవర్స్, బ్రిడ్జ్ మీద వరుసగా ముప్పై విగ్రహాలు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ ఏన్నో చారిత్రాత్మక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి.
రాత్రి పదకొండు గంటల వరకూ అక్కడే ఉండి లేట్ గా డిన్నర్ చేసాం. ఎవరికీ అక్కడ నుండి కదలాలని లేదు. ఎందుకంటే ఇక్కడి నుండి మా ప్రయాణాలు వేరవబోతున్నాయి.
తరువాత రోజు ఉదయం ఆరుగంటలకు పిల్లలు కూడా లేచి వచ్చారు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అక్కడి నుండి మేమిద్దరం ఇటలీ వెళ్ళబోతున్నాం, మా మరిది వాళ్ళు మరో రోజు ప్రాహా లో ఉండి ఇండియా వెళ్ళిపోతున్నారు. మేము యూరప్ లో కలసి గడిపింది ఐదు రోజులే అయినా మా అందరికీ బెస్ట్ వెకేషన్ అది.
తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు.
Chaala baagundi andi. Keep going the series.
ReplyDelete