Monday, April 30, 2012

మువ్వల పట్టీలు

      పసిమొగ్గలతో, పువ్వులతో హాయిగా నవ్వుతున్న ఈ సన్నజాజికి తెలుసా నన్నిక రోజూ చూడలేదని. ఆ పసిమొగ్గలు వికసి౦చగనే నాకోసం వెతుకుతాయి కాబోలు! రేపటి నుండి ఈ తీగకు రోజూ నీళ్లెవరు పోస్తారో...మేడ మీదకు వాలిన కొబ్బరాకు నా మాట వినిపించక బెంగ పెట్టుకోదూ... బంతి మొక్క కొత్త చివురులు తొడుగుతోంది, ఆకులు వచ్చే సమయానికి చూడడానికి నేను౦డను కదూ!

     ము౦గిట వేసిన ముగ్గు ఈ రోజెందుకో కలత పడినట్లుంది. ఎన్నడూ లేనిది గాలి కూడా జాలిగా వీస్తోంది. మాలతీమాధవం పక్కనున్న ఈ మెట్టుమీద కూర్చుని ఎన్నెన్ని పుస్తకాలు చదివానో! నేను లేక ఇది ఒంటరిదైపోతుందా... వీధి చివర కానుగ చెట్టు బస్సు రాగానే నన్ను పిలుస్తుంది కాబోలు..నేనిక రానని తెలియదు పాపం.

       ఇంటికి రాగానే నన్ను పిలిచే నాన్న ఇకనుండి ఎవరిని పిలుస్తారు? కబుర్లెవరితో చెపుతారు? రాత్రి భోజనాలు వడ్డించేప్పుడు మంచి నీళ్లెవరు పెడతారు? రేపట్నుండి నాన్నమ్మ తన కాళ్ళద్దాలు, తనే వెతుక్కుంటుంది కాబోలు! ఎప్పుడూ నాతో పోట్లాడే తమ్ముడు ఈ మధ్య నాతో మునుపటిలా ఉండడం లేదు. ఒక్కసారి పోట్లాడితే బావుణ్ణు. 
కుయ్యి, కుయ్యి మంటూ నా చుట్టూ తిరుగే ఈ కుక్కపిల్ల కొన్నాళ్ళకు నన్ను మరచిపోతుందేమో..

     ఇంటి ముందున్న ఆ వేపచెట్టుకే, అట్లతద్దినాడు ఊయల వేసి ఊగింది. పెరట్లో ఆ చివరగా పందిరిమీద పూసిన మల్లెలతోనే కదూ అమ్మ నాకు ప్రతి
వేసవిలో పూలజడలల్లింది. తొలిసారి ఓణీ వేసుకున్నరోజు, ఈ మందారమొక్కే నాతో ఫోటో కావాలని సరదా పడింది. ఆ జ్ఞాపకం గోడమీద బొమ్మై నిలిచింది కూడానూ. రోజూ పూజకోసం పువ్వులిచ్చే నందివర్ధన౦ ఈవేళ ఒక్క పువ్వైనా పూయలేదే! నేను వెళుతున్నానని కోపమేమో. 

      రేపు తెల్లవారి తలుపులు తెరువగానే రోజూ కనిపించే ఈ తురాయిచెట్టు, కువకువలాడే బుల్లిపిట్టలు, సైకిలు మీద నుంచి పేపర్ వేసే అబ్బాయి, పూల బుట్టతో ఇల్లిల్లూ తిరిగే రంగమ్మ నాకిక కనిపించరు కదూ. ఆకాశంలో మబ్బెక్కడా కనిపించలేదు కానీ, వర్షం మాత్రం ధారగా చెంపపై కురుస్తోంది. ఈ ముసురు ఈ వేళ ఆగేలా లేదు.

     ఇప్పటి వరకూ నాతో గడిపిన రోజులన్నీ వీడ్కోలిచ్చి గత౦లోకి జారిపోనున్నాయి. తెలియని లోకంలోకి, కొత్త జీవితంలోకి ఈ రాత్రికే నా ప్రయాణం. అన్నం తినని రోజున కేకలు వేసేవాళ్ళు ఉండరు. 'మా ఇంటి మహలక్ష్మి' అంటూ మురిసి మెటికెలు విరిచే వారు కనిపించరు. ఏ వేళ ఇంటికొచ్చినా నాకోసం వెతికే చల్లని చూపులు నన్ను చేరవిక.

      ఇక నుండి ఈ ఇల్లూ, నా వాళ్ళూ అంతా నాకు పరాయేనా. నాది అనుకున్న నా ప్రంపంచం, కాదని చెప్తున్న పెద్దరికం. ఏది నిజమో ఏది భ్రమో తెలియని అయోమయం. పక్షం క్రితమే నా మెడలో చేరిన మాంగల్యం ఈ వేళ మరీ బరువుగా ఉంది. ఓ మంత్రదండంలా నా సొంతమైన ప్రంపంచాన్ని పరాయిగా మార్చేసింది. అయినా ఎందుకో మరి కోపం రావడంలేదు. జీవితాంతం తోడుంటానని భరోసా ఇచ్చినందుకా, కష్టమైనా సుఖమైనా ఇకనుంచి ఇద్దరిదీ అని పలికినందుకా! వెండి మెట్టెలతో పాటు 
మువ్వల పట్టీలు కూడా భారంగా పుట్టింటి గడప దాటాయి.


Wednesday, April 25, 2012

ఎందరో మహానుభావులు

        మా ఊరిలో కొత్త పత్రిక ప్రచురణ గురించి చెప్పాను కదా.. మేము ప్రచురించిన రెండవ పత్రిక ఇది. తొలి పత్రిక పోయిన ఉగాదికి ప్రచురించాము. ఆ పత్రికావిష్కరణ శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా జరిగింది. ఈ పత్రికలే కాక మరో నాలుగు వార్తాపత్రికలు కూడా చేశాము కాని, వాటిని ముద్రించలేదు.

       పత్రిక ప్రారంభించడం వెనుక కథ చెప్పాలి మీకు. పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నాము కదా, వారికి ఏవిధంగా స్ఫూర్తి నివ్వాలి అని ఆలోచించాము. పిల్లలు పెద్దలను చూసి అనుకరణతో చాలా విషయాలు నేర్చుకుంటారు. మరి పిల్లలు చూస్తుండగా పెద్దలెప్పుడూ తెలుగు చదవడం, రాయడం జరగడం లేదు. 'ఏ విధంగా పెద్దవాళ్ళను తెలుగు చదవడానికి ప్రోత్సహిచాలా' అన్న ఆలోచనలో ఉండగనే మా ఊరిలో పిక్నిక్ జరిగింది. ఆ సమయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో యాదృచ్చికంగా పత్రిక గురించిన చర్చ వచ్చింది. మా తెలుగు అసోసియేషన్ వారు, ఎవరైనా పత్రిక నడపడానికి స్వచ్ఛందంగా ము౦దుకు వచ్చే పక్షంలో పత్రిక, లేక వార్తా పత్రిక మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అప్పుడు ఈ పత్రిక చేయడానికి శ్రీవారు ముందుకు రావడం జరిగింది. మనం ఏదైనా తలచుకుంటే దైవ సహాయం ఎలా లభ్యమవుతుందో ఆ సంఘటన ద్వారా తెలిసింది. 

      ఒక  పత్రిక రూపుదిద్దుకోవాలంటే ఎన్నిన్ని అంశాలు౦టాయో అనుభవపూర్వకంగా అవగతమయ్యింది. ఏ కథలు కావాలి, ఎన్ని కవితలుండాలి, వ్యాసాలు, పిల్లల కోసం ప్రత్యేకమైన  కథ...ఈ విషయాలన్నీ సమగ్రంగా పరిశీలించి కావలసినవి మా ఊరి ప్రజలు రాసేలా ప్రోత్సహించాం. మొదట్లో ఒకరో ఇద్దరో రాసి పంపించారు. ఇప్పుడు మెల్లగా ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని పత్రికలో ఏయే పేజీలలో వచ్చేలా చూడాలనేది రెండో అంశం అదే 'లేఅవుట్' అంటే డిజైన్. మిగిలినది అచ్చుతప్పులు, ఐదారు సార్లు సరిచూసినా కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే
అచ్చుతప్పులు మా ఎడిటోరియల్ బోర్డ్ సమర్ధవంతంగా సరిదిద్దారు.

      మన సంస్కృతి, సాంప్రదాయాలకు సంబధించిన ఎన్నో వ్యాసాలు, కథలు, కవితలు, పిల్లల కోసం ప్రత్యేకమైన కథ, ఇలా ఎన్నో అంశాలు ఈ పత్రికలో చోటుచేసుకున్నాయి. ఈ పత్రిక ఇప్పుడు మా ఊరి తెలుగువారి ఇళ్ళల్లో కాఫీ టేబుల్ మీద ఉండడం, వారందరూ కూడా చదవడం జరుగుతోంది. వాహిని పత్రికను
 మీతో పంచుకోవాలని బ్లాగ్ లో పెడుతున్నాను. మీ సలహాలు, సూచనలు పత్రికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి.

     ఒక పత్రిక వెనుక ఇంత కథ ఉందా అనిపించింది. ఏడాదికి రెండు, మూడు పత్రికలకే ఇంత పని ఉంటే స్వలాభాపేక్ష లేకుండా నెలకో పత్రిక వేస్తున్న సంపాదకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఇతర దేశాలలోవు౦డి సాహిత్యసేవ చేస్తున్న పత్రికా సంపాదకులకూ, వారికి తమ సహకారాన్నందిస్తున్నకార్యకర్తలకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Monday, April 16, 2012

మూడు హాళ్ళు...ముప్ఫై ఆరు సినిమాలు

     మధ్యాహ్నం అన్న౦ తిన్నాక నేనూ, అక్కా వరండాలో మెట్ల మీద కూర్చున్నాం. ఇంతకూ అక్కెవరో చెప్పలేదు కదూ.. తాతయ్యకు తెలిసినవాళ్లమ్మాయి, వాళ్ళ ఊరిలో కాలేజి లేదట. అక్కేమో "నేనింకా చదువుకుంటానంటే", వాళ్ళవాళ్ళేమో "చదివింది జాల్లే నువ్వేం ఉద్యోగాల్జేసి ఊళ్లేలబళ్లా, ఇంట్లోనే వుండి, ఆ పొయ్యికాడ కాస్త ఎగదోస్తా ఉండు, మంచి సంబంధం జూసి పెళ్లి జేస్తాం" అన్నారంట. పాపం అక్కకేమో డాక్టర్ అవ్వాలని కోరికట, అన్నం నీళ్ళు మాని ఏడుస్తూ వుంటే వాళ్ళ అన్నయ్య ఏదో పనుండి నెల్లూరికి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పాడంట.

     అప్పుడు తాతయ్య, "చదువు మీద అంత శ్రద్ద వున్న అమ్మాయిని మాన్పి౦చొద్దు నారాయణా" అన్నారంట. దానికి వాళ్ళ అన్నయ్య, "ఆడపిల్లకు చదువెందుకులే పెదనాయనా, పైగా మా ఊళ్ళో కాలేజీ లాకపోయ పక్కూరికాలేజీకి రోజూ రెండు మైళ్ళు నడిచిపోవాలి. ఆ కాలేజీలో పోకిరీ పిలకాయలంతా వుంటారు, ఆడపిల్లని అ౦దూరం పంపేదెట్టా" అన్నాడంట. అప్పుడు అమ్మమ్మ "నెల్లూరికి దీసకరా నారాయణా డికేడబ్యూ కాలేజీలో జేర్పిద్దాము, అది ఆడపిలకాయల కాలేజీయేలే" అని చెప్పిందట". "ఆస్టల్లో ఉంచాలంటే శానా కర్చవుతాదిలేమ్మా. మంచి సంబందం ఉంటే చూడండి పెళ్లి చేద్దాము" అని మనసులో మాట చెప్పాడంట. "ఆస్టల్లో బెట్టడం ఎందుకా.. మా ఇంట్లో ఉంటదిలే నాయనా" అన్నదటమ్మమ్మ. "ఎందుకులేమ్మా మీకు ఇబ్బందా" అన్నాడట అన్నయ్య. "ఇబ్బందేముందా మా పిల్లకాయల్తో పాటే వుంటది, కావాల్సినంత చదువుకోనీ" అన్నదట. ఆ విధంగా ఆ అక్క కూడా మా అమ్మమ్మకి ఇంకో కూతురైపోయింది.

     వరండాలో కూర్చున్నామా, ఎండ మండిపోతూ ఉంది. వీధీలో అప్పుడో రిక్షా, ఇప్పుడో రిక్షా మాత్రం వెళుతూ వున్నాయి, రిక్షాకి గూడు ఉండడం వల్ల  లోపలున్నదెవరో కనిపించడం లేదు. ఇంతలో లోపలనుండి పిన్ని పైట చెంగు బొడ్లో దోపుకు౦టూ వచ్చి స్థంబానికి ఆనుకుని కూర్చుంది. "అక్కా, కావేరిలో చిరంజీవి సినిమా ఆడతందట పోదామా" పిన్నినడిగింది అక్క. "నిన్ననే సినిమా జూసొస్తిమే, అమ్మొప్పుకుంటదా?" పిన్ని సందేహం. "జ్యోతినడగమందాం, అప్పుడయితే అమ్మేమ౦దు." అక్క సలహా. "నేనిప్పుడే వెళ్లి అమ్మమ్మనడిగొస్తా" అంటూ చెంగున లేచాను. పిన్ని చెయ్యిపట్టుకుని ఆపి, "ఈ వారం అప్పుడే రెండు సినిమాలు జూశాం. ఇప్పుడడిగితే అమ్మ సినిమా గినిమా యేంలా, గమ్మున గూసోండి. సినిమా లెక్కువైపోతున్నయ్ మీకు" అని అరుస్తుంది. రేపు పనంతా చేసి అప్పుడడుగుదాం, మద్యాన్నం మాట్నీకి వెళ్ళొచ్చు" అని ఉపాయం చెప్పింది.

      ఇంతలో "ఐస్, పాలైస్...ఐస్, పాలైస్...చల్లైస్" అని అరుపులు వినిపించాయి. రయ్యిన లోపలకు పరిగెత్తాను. అమ్మమ్మ చాపమీద పడుకుని 'ఆంధ్రజ్యోతి' పత్రిక చదువుతోంది. "అమ్మమ్మా..అమ్మమ్మా" పిలిచాను. "ఏమ్మా" అడిగింది, చుదువుతున్న దగ్గర మధ్యలో వేలు పెట్టి, పత్రికను మొహం మీదనుండి తీస్తూ. "ఐస్" అడిగాను. "పోపుల డబ్బాలో ముప్పావలా ఉంది, ఓ పావలా తీసుకొని కొనుక్కో౦డి అంది. కొట్టుగది దాటి వంటి౦ట్లోకి వెళ్లి అరలో ఉన్న పోపులడబ్బా జాగ్రత్తగా కింద పెట్టి మూతతీస్తే మిరపకాయల ప్లేట్ కనిపించింది. అది కూడా తీస్తే మెంతుల గిన్నెలో రెండు పావలాలు, రెండు పదిపైసళ్ళూ, చతురస్రాకారంలో వున్న ఒక ఐదు పైసలు కనిపించాయి. అందులోనుండి పావలా మాత్రం తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా డబ్బా పైన పెట్టి, ఒక్కుదటన పరిగెత్తి గడపలు దాటుకుంటూ వరండాలోకి వచ్చాను. అప్పటికే ఐసబ్బాయి వచ్చిమా ఇంటిముందే బండి ఆపి నిలుచున్నాడు. ఆ అబ్బాయికి మేం కొంటావని తెలుసుగా మరీ..

      తెల్లడబ్బా పైన మూత , లాగడానికి వీలుగా డబ్బాకి రెండు కర్రలు, డబ్బా కింద నాలుగు చక్రాలు వున్న ఐసుబండిని చూడగానే నాకు హిమాలయాలను చూసినంత చల్లగా హాయిగా అనిపించింది. బ౦డి దగ్గరకు వెళ్లాను. "యేమైసు కావాల పాపా"అడిగాడు బండెబ్బాయ్. ఒక ద్రాక్షైసు, పాలైసు, సబ్జా ఐసు చెప్పాను. మూత తీసి ఊదా ఐసొకటి, తెల్లైసొకటి, తెల్లగా వుండి చివర సబ్జాలున్న ఐసొకటి ఇచ్చాడు. ఒక చేతిలో రెండు ఐసులు పట్టుకుని రెండో చేతిలో ఉన్న ఐసు చీకుతూ లోపలకు వచ్చి పిన్నివాళ్ళకు ఐసులిచ్చాను. అమ్మమ్మకు కొనలేదు. "పళ్ళు జిల్లుమంటాయమ్మా ఐసు తింటే' అని ఐసు తినదు. కొద్దిసేపటికి చేతిమీదుగా ఐసునీళ్ళు కారడం మొదలెట్టాయి. తలపైకెత్తి నీళ్ళు కిందపడకుండా తిన్నాను, ఎంతసేపని తింటాం మెడ నొప్పిపుట్టి ఐసు మొత్తం కొరుక్కుని తినేశాను.

       ఆ రోజు రాత్రి మిద్దెమీద పడుకున్నప్పుడు రేపటి ప్రణాళిక సిద్దం చేసుకున్నాం. తెల్లవారి నేను లేచేసరికి పక్కన ఎవరూ లేరు, గబగబా పరుపు మడిచేసి కిందకు వెళ్లాను. జలదాట్లో గిన్నెలు తోమేస్తూ పిన్ని, భావిలో నీళ్ళు తోడి గంగాళంలో పోస్తూ అక్క కనిపించారు. నేను మొహం కడుక్కుని వచ్చేసరికి వాళ్ళిద్దరూ గిన్నెలు కడగడం అయిపొయింది. తోమిన గిన్నెలన్నీ వంటి౦ట్లో పెట్టాను. అమ్మమ్మ ఇచ్చిన కాఫీలు అందరికీ ఇచ్చేసి, ఇక ఆ రోజుకి పనిమనిషి రాదని తెలుసుకుని, పెద్దమూట బట్టలు ఉతికేసి, ఇళ్ళూ, వాకిళ్ళూ ఊడ్చేసి, పచ్చడ్లూ, అవీ చేసేసి, మంచి నీళ్ళూ అవీ తెచ్చేసి, అమ్మమ్మ చెప్పిన పన్లూ, చెప్పని పన్లూ అన్నీ చేసి మధ్యాహ్నానికల్లా పనంతా అవగొట్టేశాం. బుద్దిగా అన్నాలు తినేసి, ఒంటిగంటకల్లా వంటిల్లు కూడా శుభ్రం చేశాం.

      అప్పుడు పిన్ని, "మా మా సినిమాకెల్తాం మా..." అన్నది. "మొన్ననే గదనే అదేదో సినిమాకు బొయినారు, ఇట్టా రోజు సినిమా అంటే మీ బాబరస్తాడు" అన్నది. "పనంతా జేశా౦ గదమా ఇంక వారం దాకా అడగం మా, చిర౦జీవి సినిమా మా" బతిమలాడింది పిన్ని. "నా దగ్గర ఐదు రూపాయలే ఉండాయి, మీకు టికెట్లకు చాలవు" కొద్దిగా కరిగింది అమ్మమ్మ. "మిగతా డబ్బులు నాదగ్గరున్నయ్ మా" అని అమ్మమ్మతో అని "పాపా బట్టలు మార్చుకు౦దా౦రా" అని హడావిడిగా లోపలకు వెళ్ళింది పిన్ని. అక్కడే ఉంటే మా దగ్గర ఎన్ని డబ్బులు వున్నాయో అమ్మమ్మకు చెప్పేస్తానని పిన్ని భయం. అయిదంటే అయిదే నిముషాలలో రెడీ అయి, "మా పొయ్యొస్తాం" అమ్మమ్మతో చెప్పింది అక్క. "కాస్త తాలండి ఏదైనా రిక్షా వస్తుందేమో జూస్తా ఉండండి. ఎండ మండిపోతా ఉంది, ఈ ఎండలో నడిస్తే వడదెబ్బ తగల్తది" హెచ్చరించింది అమ్మమ్మ. "సినిమాకు టైం అవతావుందిమా, వీధి చివర ఎక్కుతాంలే" అని అమ్మమ్మతో చెప్పి బయటపడ్డాం.

      వీధి చివర చెట్టుకింద ఓ రెండు రిక్షాలు ఆగి ఉన్నాయ్. "పిన్నీ రిక్షా ఎక్కుదాం రా" రిక్షా వైపు వెళ్ళబోయాను. పిన్ని ఆపి "మనదగ్గర డబ్బులు లేవు పాపా త్వరగా నడువ్, లేకపోతే టికెట్లు దొరకవు" అంది. ఆ నడి వేసవిలో, మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో నడుస్తూ, నడుస్తూ ఏమిటిలెండి దాదాపుగా పరిగెడుతూ రైలు పట్టాలు దాటి, మూడు హాళ్ళకెళ్ళి సినిమా చూశాం. 


     ఓ సారి పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికని బయలుదేరి నర్తకి థియేటర్ కి వెళ్ళాం. అక్కడికే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఝామ్మని సినిమా చూశాము, ఈ ఏర్పాట౦తా మా పిన్ని కుట్ర..ఒట్టు నాకస్సలు తెలీదు. సినిమా చూసి ఇంటికొచ్చామా ఇంటి నిండా మనుషులున్నారు. మా పెద్ద పిన్ని, "మంచి వాసనొస్తావుంది యేడా" అనగానే మా పై ప్రాణాలు పైనే పొయ్యాయి. గబగబా లోపలికి పొయ్యి బట్టలు మార్చుకుని వచ్చాం. నర్తకి హాలు ఆ వారమే మొదలయ్యింది. ఎసిలో మంచి వాసన ఒచ్చే పెర్ఫ్యూం ఏదో కలిపినట్లున్నారు, ఇంటికొచ్చాక కూడా మా బట్టలు అవే వాసనలొస్తూ ఉన్నాయి. లీలామోహన్ కెళితే మాత్రం వస్తూ సుండలు కొనుక్కుని ఇంటికొచ్చి తినేవాళ్ళం. మరి వీధిలో తినకూడదు కదా...

     అలా నెల్లూరులో ఎన్నో సినిమాలు చాశాం, ముఖ్యంగా కృష్ణా, కావేరీ, కళ్యాణీలలో. ఆ సినిమాలన్నీ అద్భుతంగా అనిపించేవి. తరవాత్తరత ఎన్నో థియేటర్లలో ఎన్నో సినిమాలు చూసినా అప్పటి ఆ అను
వాలు మాత్రం పదిలంగా వుండిపోయాయి. 

Thursday, April 12, 2012

గుర్..ర్...ర్......

      బ్లాగక్కయ్యలూ, బ్లాగ్ వదినమ్మలూ, చెల్లెమ్మలూ అందరూ కర్రలుచ్చుకొని ఇలా వచ్చెయ్యండొచ్చెయ్యండి.

      ఏమిటీ ఏమీ లేదే అంటున్నారా..మొదలెట్టిన ఓ  నిముష౦ తరువాత వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మీ చెవులతో మీరే వినండి. పైగా అదిచాలనట్టు చివర్లో ఆ పాటొకటి. Tuesday, April 10, 2012

సంబరం అంబరమైన వేళ

      ఇది నిజమా..నిజంగానేనా, నిజంగా నేనేనా...ఏమిటో కొత్తకొత్తగా... వింతగా... కొండంత ఆనంద౦, ఒకింత ఆశ్చర్యంతో కలసి ఈ చిన్న మదిలో సందడి చేస్తోంది..

     ఈ ఆకాశం ఇంత నీలంగా, నిర్మలంగా ఉందేవిటి...వెండి మబ్బులు ముసిముసి నవ్వులు రువ్వుతూ వెళుతున్నట్లుగా లేవూ...చల్లగాలి మరింత హాయిగా వీస్తోంది. రోజూ చూసే ఈ మందారం ఇవాళ మరింత అందంగా పూసిందే...ఆ రావి చెట్టు ఆకులన్నీ వింత నాట్యం చేస్తున్నట్లుగా ఎలా ఊగుతున్నాయో...గోడమీద కాలెండర్ మీదన్న బోసినవ్వుల పసి పాపలను చూస్తోంటే కలిగిన పరవశం, మది దాటి అంబరాన ఇంద్రధనస్సై మెరిసింది.

     ఆ నాటి ఆ ఆనందం విహంగమై ఎగురి విహ౦గలో వాలింది.

నా కవిత ప్రచురించిన విహంగ సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.Wednesday, April 4, 2012

బుజ్జిపండు...పెరడు...పైప్ మేఘాలు

     "బుజ్జిపండూ రా నాన్నా బాక్ యార్డ్ లోకి వెళ్లి మొక్కలకు నీళ్ళు పెడదాం." అంటూ అమ్మ పెరటి తలుపు తీసింది. బుజ్జిపండు కిచెన్ సెట్ తో ఆడుతున్నవాడల్లా రయ్యిన పరిగెత్తుకొచ్చాడు. మరి పండుకి నీళ్ళంటే ఇష్టం కదా! అమ్మ నీళ్ళు పెట్టినంతసేపూ తను కూడా పైప్ కి అడ్డం వెళ్లి నీళ్ళతో ఆడుకుంటూ బట్టలు తడిపేసుకుంటాడు. అమ్మ కూడా 'ఆడుకోనీలే పాపం' అని పండును ఏమీ అనదు.

     ఆ రోజు బయట ఆకాశం మబ్బు పట్టి బాగా వర్షం వచ్చేలా ఉంది. చల్లగా గాలి కూడా వీస్తోంది. కొత్తగా వేసిన మొక్కలన్నీ ఆనందంగా తలలూపుతున్నాయి. ఓ పక్కగా ఉన్న నారింజ చెట్టుకి కాసిన ఆఖరి కాయలు అక్కడక్కడా తళుక్కుమంటున్నాయి. ఆ చెట్టు మొన్న జనవరిలో ఎన్ని కాయలు కాసిందనీ, తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చినా కూడా చెట్టు నిండా కాయలు ఉండేవి. బుజ్జిపండు, అక్క ఆడుకోవడానికి పెరట్లోకి వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్లకు కాయలు కోసి ఒలిచి పెట్టేది. నాన్న, బుజ్జిపండును భుజాల మీద ఎత్తుకుంటే, పండు కాయలు కోసేవాడు. అందుకే పండుకు ఆ చెట్టంటే భలే ఇష్టం.

     పెరట్లో ఈశాన్యం మూలగా ఉన్న 'పింక్ జాస్మిన్' పందిరి అంతా మొగ్గలే. "పండూ ఇవాళ నీళ్ళు పెట్టొద్దులే నాన్నా బాగా వర్షం వచ్చేలా ఉంది. నువ్వు సైకిల్ తో ఆడుకో నేను పూలు కోస్తాను" అంది అమ్మ చెట్టు వైపు వెళ్తూ. ఈ లోగా అక్క కూడా హోం వర్క్ పూర్తి చేసుకుని పెరట్లోకి వచ్చింది. "వచ్చం వచ్చు౦దా" అనుకుని మేఘాల వైపు ఆశ్చర్యంగా చూశాడు బుజ్జిపండు. ఆకాశం కొత్తగా కనిపించింది. తరువాత అమ్మ వెనకాలే పందిరి దగ్గరకు వెళ్లాడు. అమ్మ చిన్న గిన్నెలోకి మొగ్గలు కోస్తూ ఉంది. పండుకు కూడా కోయాలని ఉంది కాని పందిరి మరీ ఎత్తుగా ఉంది. "అమ్మా నన్నెత్తుకో నేనూ కోత్తాను" అన్నాడు పండు. అమ్మ బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఏ మొగ్గలు కోయాలో చెప్పింది. పండు ఒక్క మొగ్గ పట్టుకుని లాగగానే పసిమొగ్గలు కూడా తెగిపోయాయి. అమ్మకసలే పూలంటే ప్రాణం. పండును కిందకు దించి "పండూ నువ్వు అక్కతో ఆడుకో" అని పండుతో  చెప్పి"అమ్మలూ, పండును పిలువమ్మా" అని అక్కకు చెప్పింది.

     "పండూ ఇలా రా సైకిల్ ఆట ఆడుకుందాం" అని పిలిచింది అక్క. పండు దగ్గరకు రాగానే " నీ సైకిల్ లాన్ లోకి రాకూడదు, నా సైకిల్ ఫ్లోర్ మీదకు రానివ్వను" అని చెప్పి సైకిల్ మీద రౌండ్ గా తిరగడం మొదలెట్టింది. పండుకు అక్కని అలా చూడడం చాలా ఇష్టం. అమ్మ పూలు కోసినంతసేపు ఇద్దరూ అలా ఆడుకున్నారు. పూలు కోయడం అవగానే అమ్మ పూలగిన్నె గట్టు మీద పెట్టి కూరగాయల మొక్కల దగ్గరకు వెళ్ళింది. పండూ, అక్క కూడా అమ్మ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళిద్దరికీ అమ్మతో కలసి కూరగాలయాలు కోయడం చాలా సరదా. గోంగూర ఆకులు తుంచి ఒక పెద్ద గిన్నెలో వేశారు. అందులోనే రెండు టమాటోలు, వంకాయలు, పచ్చి మిరపకాయలు, ఓ నాలుగు బెండకాయలు కోసి వేశారు. అమ్మ పండుకు బీన్స్ కోసి ఇస్తే పండు చేతిలో పట్టుకుని తింటూ చూస్తున్నాడు. అసలు అమ్మ పెరట్లోకి రాకపోయినా పండు బీన్స్ కోసుకుని తినేస్తూ ఉంటాడు. అక్కకి మాత్రం అలా పచ్చివి తినడం ఇష్టం ఉండదు. అక్కకి కారెట్లిష్టం. మొన్న ఫాల్ లో తాతయ్య వచ్చినప్పుడు కారెట్ చెట్లు తవ్వి కారెట్లు బకెట్లో వేసి మట్టంతా పోయేలా బాగా కడిగి అక్కకూ, పండుకూ తినమని ఇచ్చారు.

     ఎగురుతున్న తూనీగను చూస్తూ దాని వెంట సొర చెట్టు దగ్గరకు వెళ్లాడు పండు. తూనీగ వాలినవైపు మోకాళ్ళ మీదకు వంగి చూస్తూ "అమ్మా లుక్ లుక్" అరిచాడు పండు. అక్క పరిగెత్తుకెళ్ళి చూసింది, సొరపాదు దగ్గర  బుల్లి సొరపిందె ముద్దుగా కనిపించింది. నిన్నటి దాకా ఉన్న పువ్వు కనిపించలేదు. అమ్మకూడా వచ్చి ఎన్ని పువ్వులున్నాయో చూసి తీగలను తోటకూర వైపు రాకుండా నేలపైకి మళ్ళించింది. ఆ పక్కనే ఉన్న స్వ్కాష్ ఇవాళ ఓ రెండు పే...ద్ద కాయలు కాసింది. ఈ లోగా చిన్నగా చినుకులు మొదలయ్యాయి. పూవ్వుల గిన్నె, కూరల గిన్నె తీసుకుని అందరూ లోపలకు వెళ్ళారు. అక్కా, పండు ఇద్దరూ గ్లాస్ డోర్ వెనుక వర్షం చూస్తూ నిలబడ్డారు.

     రెండు గ్లాసులలో పాలు తీసుకొచ్చి పిల్లలకిచ్చి, టీ తెచ్చుకోవడానికి లోపలకు వెళ్ళింది 
అమ్మ. "అక్కా, నీకు వచ్చం ఎలా వచ్చుందో తెలుచా?" అడిగాడు పండు పాలు తాగుతూ. "మేఘాలు..." అని అక్క మొదలు పెట్టగానే, "నేను చెప్తా నేను చెప్తా" అని అరిచి పాల గ్లాసు కాఫీ టేబుల్ మీద పెట్టి "చీ(సీ)లో వాతర్, పైప్ మేగాల్లో గుండా ఆకాచంలో ఉన్న మేగాల్లోకి వెల్తుంది. అప్పుడు బయట మనం ఏమైనా పెట్టామనుకో అది క్లౌడ్ మేగాలకు తెలిసిపోతుంది, అవి వచ్చం పడేలా చేత్తాయి." చెప్పాడు పండు. టీ తాగుతూ వాళ్ళ సంభాషణ వింటున్న అమ్మ "ఈ పైప్ మేఘాల గురించి నీకెవరు చెప్పారు పండూ?" అడిగింది. పండు ఒక్క నవ్వు నవ్వి, "నేనే చెప్పుకున్నా" అన్నాడు. 

      అమ్మ, అక్క, పండు వర్షం చూస్తూ కబుర్లు చెప్పుకుంటుండగా నాన్న ఆఫీసు నుండి వచ్చాడు. అమ్మ పైప్ మేఘాల కబుర్లూ, కూరగాయల కబుర్లూ అన్నీ నాన్నకు చెప్పింది. అక్క స్కూల్ విశేషాలు, పండు తోటలో చూసిన తూనీగ కబుర్లు చెప్పాడు.