Sunday, June 24, 2012

అద్దబాలు

      ఆవేళ ఆదివార౦. సూరీడు ఇంకా నిద్ర లేవలేదేమో పొగమంచు ప్రకృతితో గుసగుసలాడుతోంది. అప్పుడే నిద్రలేచిన అమ్మ మొక్కల దగ్గరకు వెళ్లింది. రోజూలా స్కూళ్ళు, ఆఫీసుల హడావిళ్ళు లేవుగా, ఈ వేళ అమ్మకు ఆటవిడుపన్నమాట. రాత్రి పూసిన ఛమేలీలను పలకరించి, గులాబీలను ముద్దుచేసి, రానిన్కులస్ రంగులను చూసి ఆశ్చర్యపడి, ఇంటి వెనుకనున్న పెరట్లో గట్టుమీద కూర్చుంది. నారింజ చెట్టు మీద పక్షులు, ఆ కొమ్మ ఈ కొమ్మ మీదకు గెంతుతూ పాటలు పాడుతున్నాయి.

       పండు నిద్రలేచి కళ్ళు తెరిచాడు. కిటికీలోంచి వెలుతురు పడుతూ వుంది. పక్కకు చూస్తే నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతూ వున్నాడు నాన్న, అమ్మ కనిపించలేదు. మంచం మీదనుంచి జారి కిందకు దిగాడు. పడగ్గది తలుపు దగ్గరగా వేసివుంది. మెల్లగా నడుస్తూ వెళ్ళి తొంగి చూశాడు. హాల్ వే అంతా ఖాళీగా వుంది. అమ్మకోసం వెతుకుతూ ఫామిలీ రూంలోకి వచ్చాడు. గ్లాస్ డోర్ వెనుక కూర్చుని వుందమ్మ. మెల్లగా తలుపు తెరుచుకుని పండు కూడా వచ్చి అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. విమానం బొమ్మలున్న తెల్ల నైట్ డ్రెస్ వేసుకుని నందివర్ధనంలా ముద్దుగా వున్నాడు పండు.

"అమ్మా"
"ఊ..."

"నువ్వేం చేత్తున్నావ్?"
"పువ్వులు చూస్తున్నాను నాన్నా?"
"ఎందుకు?"
"ఎందుకంటే..అందంగా ఉన్నాయి కదా అందుకు"
"ఓ...మలి పచ్చి?" ఆకాశం వైపు చూపిస్తూ అడిగాడు.
"అది కూడా అందంగా ఉంది"
"చైకిలు?" అన్నాడు దూరంగా వున్న తన బుజ్జి సైకిల్ని చూపిస్తూ.
"బుజ్జిపండు సైకిలు కదా అది కూడా చాలా అందంగా ఉంది" పండును ముద్దు పెట్టుకుని చెప్పింది అమ్మ. "లోపలకు వెళదాం పద, బ్రష్ చేసుకుని పాలు తాగుదువు గాని" అంటూ పండును దింపి పైకిలేచి౦ది.
"పాలు కూదా అందంగా వుంతాయా?"


     అమ్మ నవ్వుతూ తలూపి పండును తీసుకుని లోపలకు వెళ్ళి బ్రష్ చేసి౦ది. "నువ్వు వెళ్ళి అక్కను నిద్రలేపు ఈలోగా నేను పాలు కలుపుతాను" అంటూ వంటగదిలోకి వెళ్లింది అమ్మ. అక్కను లేపమంటే ఎక్కడలేని ఉత్సాహం పండుకు. రయ్యిన పరిగెత్తుతూ అక్క గది దగ్గరకు వెళ్లాడు. ఈలోగా అమ్మ పాలు కప్పులో పోసి మైక్రో వొవెన్ లో పెట్టింది. రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టిన దోసెల పిండి తీసి బయటపెట్టి మైక్రో వోవెన్ లోని వేడిపాలు బయటకు తీసి అందులో చాకొలేట్ పౌడర్ కలిపి సిప్పర్ లో పోసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. పండు మాటలు ఎక్కడా వినపడలేదు.

"పండూ, రామ్మా పాలు తాగుదువుగాని" పిలిచింది అమ్మ. పండు దగ్గరనుండి సమాధానం లేదు. అమ్మకు ఏదో అనుమానం వచ్చి మెల్లగా వెళ్ళి చూస్తే పండు బాత్ రూంలోనుండి వస్తూ కనిపించాడు.
"బాత్రూమ్ లో ఏం చేస్తున్నావ్ నాన్నా?"

"ఏం చైతల్లా?"

     అమ్మకు నమ్మకం కలగలా, బాత్రూమ్ లోకి వెళ్ళి చూసింది. టబ్ బయట నీళ్ళు లేవు, బ్రష్ లు బ్రష్ హోల్డ్రర్ లోనే వున్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే వున్నాయి. పండును ఎత్తుకుని అక్క గదిలోకి వెళ్ళి అక్కను నిద్రలేపి బ్రష్ చేసుకోమని చెప్పి వంటగదిలోకి వచ్చింది. పండును హై చైర్ లో కూచోబెట్టి సిప్పర్ చేతికిచ్చింది. రోజులా మాట్లాడకుండా నిశ్శబ్దంగా పాలు తాగుతున్నాడు. 


"అమ్మా...." అంటూ బాత్ రూం లోనుండి అక్క పెద్దగా అరిచింది.
"ఎందుకురా అలా అరుస్తావు?" అంటూ అక్క దగ్గరకు వెళ్లిందమ్మ. అక్క బాత్ రూంలో షెల్ఫ్ ఓపెన్ చేసి నిలుచుని వుంది. అమ్మ రాగానే అమ్మకు చూపించింది. షెల్ఫ్లో అక్కడక్కడా ఎఱ్ఱని గీతలున్నాయి. అమ్మకు పండు ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నాడో అర్ధం అయింది. 


"అమ్మలూ పండు హైచైర్ లో వున్నాడు వెళ్ళి తీసుకురా"
అక్క వెళ్ళి హై చైర్ బెల్ట్ తీసి పండును కిందకు దింపింది. మెల్లగా నడుస్తూ అక్క వెనుగ్గా వచ్చాడు. "పండూ ఎవరమ్మా ఇది చేసింది?" ఆ ఎఱ్ఱని గీతలు చూపిస్తూ అడిగింది.
"కక్క చేచింది" నమ్మకంగా చెప్పాడు.
"నేనా..నేను చెయ్యలేదు" అక్క తల అడ్డంగా ఊపింది.
"కక్కే చేసింది" మరింత స్పష్టంగా చెప్పాడు.
"ఏం చేసింది నాన్నా?"
"లిప్చిక్ తో ఇత్తా ఇత్తా గీతలు గీచింది" వేలితో గీసి చూపించాడు.
"నేను కాదు" అమాయకంగా చూస్తూ తల గబాగబా తిప్పింది అక్క.
ఈలోగా నాన్నకూడా నిద్ర లేచి వచ్చాడు. "ఏవైంది?" అడిగాడు నాన్న.
నాన్నను చూసిన ఉత్సాహంలో మరింత స్పష్టంగా "కక్క చేచింది" చెప్పాడు పండు.

అమ్మ పండును కోపంగా చూస్తూ "తప్పుకదూ నాన్నా నువ్వు చేసి అక్క మీద చెప్పొచ్చా" అంది.
"నేను చేతలా..కక్కే చేచింది"


      అమ్మకు ఈసారి చాలా కోపం వచ్చింది. అమ్మ పండును కోప్పడబోతుంటే నన్నేమో "పోనీలేరా వాడికెన్నేళ్ళు మెల్లగా నేర్చుకు౦టాడులే," అని పండును ఎత్తుకుని బయటకు తీసికెళ్ళి మెల్లగా అబద్దాలు చెప్పడం ఎంత తప్పో చెప్ప్డాడు. నాన్న చెప్పినవన్నీ పెద్దపెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తూ బుద్దిగా విన్నాడు పండు. తరువాత  అక్క, పండు ఆటల్లో పడ్డారు. నాన్న వంట గదిలోకి వచ్చాడు. అమ్మ ఇంకా కోపంగానే ఉంది. 


"ఏం చెప్పారు వాడికి" నాన్న వైపు తిరిగి అడిగింది.
"చిన్నవాడు కదా మెల్లగా చెప్పాలి, నువ్విప్పుడు వాడిని కోప్పడ్డావనుకో నీ కోపాన్నిఅర్ధం చేసుకునే వయసు కాదు వాడికి. సరే, ఇవాళ వెదర్ బావుంది, పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్దామా?" అడిగాడు. "అలాగే" అ౦టూ కాఫీ కలిపి ఒకకప్పు నాన్నకిచ్చి రెండో కప్పు పట్టుకుని పిల్లల దగ్గరకు వెళ్లింది అమ్మ.


      ఓ వారం తరువాత ఉదయాన్నే షేవింగ్ చేసుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్లాడు నాన్న. "పండూ" పెద్దగా పిలిచాడు నాన్న. అమ్మ, అక్క పరుగెట్టుకునెళ్లారు, వెనుకే మెల్లగా పండు. నాన్న షెల్ఫ్ డ్రాఅర్ దగ్గర నిలబడి వున్నాడు. పాల సముద్రం మీద నురగలా౦టి తెల్లని పదార్ధం తప్ప ఆ అరలో ఉండాల్సిన వస్తువులు కనిపించలేదు.

"ఎవర్రా ఇది చేసింది?"నాన్న నవ్వు కనిపించకుండా జాగ్రత్త పడుతూ పిల్లల్ని అడిగాడు.
అక్క నోరు తెరవకముందే "కక్క చేచింది" చెప్పాడు పండు.
"ఎలా చేసి౦దమ్మా?" అడిగింది అమ్మ.
"చేవింగ్ కీం ఇలా పోచేచింది" చెప్పాడు పండు.
"నేను చేయాలా" అక్క అరిచింది.
"మళ్ళీ అబద్దమా?" అడిగాడు నాన్న.
"అద్దబ౦ కాదు చేవింగ్ కీం" చెప్పాడు పండు.
"నేను చెయ్యలేదు నాన్నా" అక్క కోపంగా చెప్పింది. 


      అమ్మ పండును తీసుకుని పక్కగదిలోకి వెళ్ళగానే, నాన్న అక్కను దగ్గరకు తీసుకుని "నువ్వు చెయ్యలేదు నాన్నా, చిట్టితల్లి అబద్ధం చెప్పదని నాకు తెలుసుగా..పండు చిన్నవాడు కదా వాడికి మనం చెప్పింది అర్ధం కావడం లేదు. కొన్నిరోజులు ఇలాంటివి మనం పట్టించుకోలేదనుకో వాడే మానేస్తాడు" చెప్పాడు నాన్న.

      డైనింగ్ టేబుల్ మీద ఉప్పుతో వేసిన బొమ్మలు చూసినా, పుస్తకాలలో క్రేయాన్స్ తో గీసిన గీతలు కనిపించినా, ఫ్రిడ్జ్ ముందు నీళ్ళ మడుగు తయారైనా ఎవరూ మాట్లాడలేదు. నాన్న చెప్పినట్లుగానే కొన్నిరోజులకు పండు అలాంటి పనులు చేయడం మానేశాడు.

       తరువాతెప్పుడో ఓ రెండేళ్ళ తరువాత పండు ఏదో విషయంలో అబద్ధం చెప్పగానే ఇంట్లో అందరూ పండుతో మాట్లాడమని చెప్పేశారు. పండు పెద్దగా ఏడ్చి గొడవపెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరకు పండు ఇంకెప్పుడూ అబద్ధం చెప్పనని చెప్పాక అమ్మ పండును ఎత్తుకుని ముద్దుపెట్టుకు౦ది. ఆ రాత్రి పడుకునేప్పుడు పండుకు "నాన్న పులి" కథ చెప్పి౦దమ్మ. ఇంకా ఇలా అబద్దాలు చెపితే తనమాట ఎవరూ నమ్మరని ఎప్పడూ అబద్దాలు చెప్పకూడదని, అక్క అస్సలు అబద్దాలు చెప్పదని అందుకే అక్కంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పింది. ఆ తరువాతెప్పుడూ పండు అబద్దాలు చెప్పలేదు.


Friday, June 15, 2012

మరీ చోద్యం కాకపోతే

        'ఈ పూట కాస్త ఇల్లు సర్దుదా౦' అని పైఅరలో వున్నడబ్బా కిందకు దించి మూత తెరిచాను. కళకళ్ళాడుతూ దేవతల బొమ్మలు, తళతళలాడే తులసి కోటలు, ముచ్చటైన కుంకుమ భరిణలు, మిలమిలలతో వెండిపూలు, ఇంకా అలాంటివే ఏమిటేమిటో దర్శనమిచ్చాయి. "ఇవన్నీ ఏమిటి?" అనుకుంటున్నారా....మీకంతా వివరంగా చెప్తాగా. సత్యన్నారాయణ స్వామి వ్రతాల తాలూకు వెండి కుంకుమ భరిణలు, గృహప్రవేశానికి తులసి చెట్లు, బారసాల కృష్ణులు, ఓణీల పండుగల లక్ష్మీదేవి బొమ్మలు... లాంటివన్నమాట. పాప౦ ఇచ్చిన వాళ్ళు గుర్తుగా ఉంటుందనుకుంటారు. ఓ పది భరిణలు, ఎనిమిది తులసి చెట్లు, తొమ్మిది దేవతలు, ఓ ఇరవై ముచ్చటైన పూలలో ఎవరేది ఇచ్చారో ఎలా గుర్తుపెట్టుకోవడం? ఈ రోజుల్లో బారసాల పిల్లాడి పేరే గుర్తుండడం లేదు ఇక ఈ వస్తువులనేం గుర్తుపెట్టుకుంటాం. వీటన్నింటినీ ఇప్పుడేం చేయాలి? సరే వాటిని పక్కన పెట్టి బెడ్రూం క్లోజెట్ దగ్గరకు వెళ్లాను.

         ఇంద్రధనస్సుకొన్ని వందల ముక్కలై అరల్లో సర్దుకున్నట్లుగా గుట్టలు గుట్టలుగా బట్టలు. కొన్నింటికి మెరుపులు అద్దినట్లు తళుకులు కూడానూ...అన్ని బట్టలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోయి గుండ్రాలు చుడితే...డాలరు ఖర్చు పెట్టడానికి యాభైఐదు సార్లు ఆలోచించే నేను రెండేళ్ళ వరకూ రాముకదా అని కట్టలు కట్టలు వెచ్చించిన సందర్భాలు గుర్తొచ్చాయి. స్వయ౦కృతాపరాధం అంటారా...అబ్బే అదేం కాదు పూర్తిగా వినండి. 
ఇప్పుడు ఇక్కడ కూడా ఇంటికి వెళితే జాకెట్ ముక్క పెట్టడాలు మొదలెట్టారు. ఏదో మన సాంప్రదాయం ప్రకారం బొట్టుపెడితే బావుంటుంది. పైగా ఇప్పుడు మాచింగ్ జాకెట్లూ, డిజైనర్ జాకెట్లూ వేసుకు౦టున్నా౦గా, ఆ జాకెట్ ముక్కలనేం చేసుకోవాలో తెలీదు. అది చాలనట్లు గృహప్రవేశాలకు చీరలు కూడానూ.. వద్ద౦టే మరి పద్ధతిగా ఉండదు...ఏదో ఇష్టం లేని మొగుడుతో అయితే సర్దుకుపోగలం కానీ నచ్చని చీర కట్టలేంగా...

     ఇండియా నుంచి వచ్చే ముందు రోజు "అమ్మాయ్ నీకోసం ఈ ఉప్పాడచీర తీసిపెట్టాను." అని ఓ పాకెట్ చేతిలో పెడతారు. ఇలా పెట్టిన చీరలే పెట్టె నిండిపోయాక, కొన్న చీరలు మరోపెట్టెలో సర్దుకుని ఇక్కడకు తీసుకొస్తే ఆ బట్టలన్నీ ఇలా అసూర్యంపశ్యలుగా మిగిలిపోయాయన్నమాట. ఈ మధ్య నాలాంటి వాళ్ళకోసమే ఎయిర్ లైన్స్ వాళ్ళు లగేజ్ బరువు తగ్గించారేమో..ఆ వంకనన్నా ఈసారి నుండి తక్కువ సామానుతో రావచ్చు.

        ఇక వంటగది విషయానికి వస్తే పూజలు, వ్రతాల బాపతు ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు...చిన్నప్పుడే నయం, అమ్మా వాళ్ళు పసుపు కుంకానికి వెళ్తే చక్కగా బొట్టుపెట్టి కాళ్ళకు పసుపు రాసి స్వీటు, హాటు, పండు, ఆకులు, వక్కపొడి పొట్లం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంటికి రాగానే తినేవన్నీ పిల్లలం తీసేసుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు తాంబూలం వేసుకునేవారు. అంతటితో అవి పూర్తయ్యేవి. ఈ సమస్య ఇక్కడే అనుకున్నాను. పోయినసారి ఇండియా వెళ్ళినప్పుడు మా అత్తగారింట్లో ఒక పెద్ద అద్దాల బీరువా నిండా స్టీలు డబ్బాలు కనిపించాయి. మా అత్తయ్యకు స్టీలు అంటే ఇష్టమని తెలుసు మరీ ఇన్ని స్టీలు డబ్బాలు కోనేంత అనుకోలేదు. అయితే మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే అవి ఆవిడ కొనలేదట, జ్ఞాపకార్ధాలవట. అవి అడ్డం రావడం వల్ల ఆవిడ అవసరమైన గిన్నెలు ఎక్కడో పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. 


      వంట గదిలో పాంట్రీలోకి వెళ్లాను. అక్కడ మొదటిసారి భోజనానికి వచ్చిన వారు తెచ్చిన గృహోపకరణాలు, గృహాలంకరణాలు....రకరకాల రంగుల్లో, ఆకారాల్లో కనిపించాయి. వాటిని ఎక్కడా పెట్టలేను అలాగని గుడ్ విల్ లో ఇచ్చెయ్యనూలేను. వాటిని తీసెయ్యాలంటే మనం 'గుర్తుగా ఉంచుకుంటాం అని కదా ఇచ్చారు' అనిపిస్తుంది. అవన్నీ ఓ పక్కన పెట్టాను, వాటినేం చెయ్యాలో తెలీదు.

          బయట వాళ్ళ సంగతి సరే...ఇంట్లో వున్న వాళ్ళు "సర్ప్రైజ్" అంటూ బర్త్ డేకి, వాలెంటైన్ డేకి, మారేజ్ డే కి, ఇంకా మదర్స్ డేకి పెర్ఫ్యూమ్స్, చిన్న చిన్న డెకొరేటివ్ పీసెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి లెండి. దేవుడి అర తీశాను. ఓ యాభై మంది వినాయకుళ్ళు, ఇరవై మంది సాయిబాబాలు, కొలువై వున్నారు. ఇండియా నుండి వస్తూ పుణ్య క్షేత్రాలు దర్శించిన వాళ్ళు తెచ్చి ఇచ్చినవి. ఇంకా చిన్న చిన్న పాకెట్ లలో పసుపు, కుంకుమలు. బాబాలు ఇచ్చిన పూసల దండలు...ఈ లెక్కన పోగు చేస్తుంటే కొన్నాళ్ళ తరువాత ఈ ఇల్లు ఓ మ్యూజియంలా తయారవుతు౦దేమో... సాయినాథా నన్ను నువ్వే కాపాడాలి తండ్రీ...

       ఇవాళ ఇల్లు సర్దుదామని మొదలుపెట్టి, ఇలా అనేకరకాల వస్తువుల మధ్య చిక్కుకుని, నిండా ఐదున్నర అడుగుల ఎత్తులేని నాకు ఇన్ని బట్టలా అని విరక్తి చెంది, నా బాధను ఈ బ్లాగులో పెడుతున్నాను. ఇలా ఆలోచిస్తుంటే ఓ కథ గుర్తొచ్చింది. ఒక ఫ్యాక్టరీలో పని చేసే ఆవిడ సాయంత్రం వస్తూ వస్తూ కొంచెం బియ్యం, కూరగాయలు, బట్టల సోడా, నూనె, కిరసనాయలు, కాసిని మల్లెపూలు కొనుక్కుని ఇంటికొచ్చి తెచ్చిన వాటితో ఆ   రోజు కానిచ్చి ఆ పూట ప్రశాంతంగా నిద్రపోయిందట. ఇలా హృదయం లేని వస్తువుల మధ్య చిక్కుకునే కష్టాలు లేవు కదా ఆవిడకు...అకటా...నీలాకాశం, వెండిమబ్బులు, పచ్చని చెట్లను చూడకుండా, చక్కని పాటలు వినకుండా ఈ రోజు ఇలా బలయ్యానేమిటి?

      అంతా వినేసి "మరీ చోద్యం కాకపోతే ఈ మాత్రం దానికి ఓ టపా" అనుకోకండి. ఈ సమస్య చాలా తీవ్రమైనది ముఖ్యంగా నాలాంటి ఇల్లాళ్ళకు. 
ఈ రోజుల్లో ఏ ఇల్లు చూసినా గడియారంలో అంకెల్లా పొందిగ్గా కాకుండా, చిక్కుపడిన ఊలు దారంలా గజిబిజిగా వుంటోంది. ఇంట్లో అవసరమైన వస్తువులు ఏవీ కనిపించడం లేదు. పైగా అనవసరమైన వస్తువుల కోసం ధనం, సమయం ఎంత వృధా చేస్తున్నామో చూడండి.  ఇలా అయితే మరి ఇక జ్ఞాపకం మాటేమిటంటారా? ఒక మనిషినో లేక వేడుకనో గుర్తుపెట్టుకోవాలంటే వస్తువుల మీద ఆధారపడాలా...వారితో గడిపిన సమయ౦ చాలదా...

     వరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే నాలుగు పండ్లు ఇచ్చి సంతోషంగా వారితో గడిపివద్దాం. మనం ఇచ్చే వస్తువులు వారికి అఖ్ఖర్లేదు. వారికి కావలసినవి/నచ్చినవి వారినే కొనుక్కోనిద్దాం. 

Friday, June 8, 2012

నా ప్రాణమా...

      మీరు వెళ్లి ఒక్కరోజే అయినా ఎన్నో ఏళ్ళయినట్లుగా వుంది. ఈ వేళ నిద్ర లేవగానే అలవాటుగా పక్కకు చూశాను. దుప్పటి చుట్టుకుని నా పక్కనే పడుకునే చిట్టితల్లి కనిపించలేదు. గది బయటకు రాగానే పాప ఆడుతూ వదిలేసిన కుక్కర్ గిన్నెలోని కిచెన్ టవల్, సోఫా పక్కగా బోలెడన్ని గీతలతో 'మేగ్నాడూడిల్' కనిపించాయి. ఇలాంటివి చూసినప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని ఎవరైనా చెపితే నమ్మే వాడిని కాదేమో!

     వంటగదిలో శుభ్రంగా సర్ది పెట్టి ఉంచిన కౌంటర్ మీద రోజూ వుండే సీరియల్ బౌల్ లేదు. అలమరలోని బౌల్ తీసుకుని సీరియల్ వేసుకున్నాను, ఒంటరిగా తినాలనిపించలేదు. కాఫీ కలుపుకున్నాను కానీ చేదుగా ఉంది, కాఫీ పొడి ఎక్కువేయడం వల్లేనని సర్దిచెప్పుకున్నాను. టివీ లో వార్తలు చూసి పాపను లేపడానికి గదిలోకి వెళ్లాను. ఖాళీగా వున్న మంచం నన్ను వెక్కిరించింది. షేవింగ్ చేసుకుంటూ అద్దంలోకి చూస్తే షేవింగ్ క్రీం రాసుకున్న నా మొహాన్ని ఆశ్చర్యంగా చూసే చిట్టితల్లి కనిపించలేదు. కొంచెం క్రీం ముక్కు మీద రాయగానే కిలకిలా నవ్వే ఆ నవ్వు గుర్తొచ్చి౦ది.

     ఇలా లాభం లేదు.. ఆదివారమే అయినా ఆఫీస్ కి వెళ్లాలని షూ స్టాండ్ దగ్గర షూ వేసుకు౦టు౦టే, తనని కూడా తీసికెళ్ళమని షూ తెచ్చుకుని అల్లరి చేసే చిట్టితల్లి గుర్తొచ్చింది. అప్పుడప్పుడూ అల్లరి చేస్తుందని విసుక్కునే వాడిని కదూ, ప్చ్ ఇప్పుడు అలా అల్లరి చేస్తేవాళ్ళుంటే బావుండనిపిస్తోంది. కారెక్కగానే ఖాళీగా ఉన్న కార్ సీట్ పక్కనే పాప సిప్పర్ కనిపించింది. నిన్న హడావిడిలో కారులో వదిలేసినట్లుంది.

      చిట్టితల్లి ఫ్లైట్ లో బాగా పడుకుందా? నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదుగా. నేనిక్కడున్నా నా మనసు మీతో ప్రయాణం చేస్తూనే వుంది. మీరు ఎప్పుడు ఎక్కడ దిగుతారో ఏం చేస్తుంటారో ఊహిస్తూ ఉన్నాను. దుబాయ్ లో దిగగానే మెయిల్ పంపించమన్నాను, పాపతో కుదరలేదా పంపించలేదు. నేను ఇక్కడ లాప్ టాప్ ముందు కూర్చుని ఎంత ఎదురు చూశానో తెలుసా!

     అయినా నీకిదేమైనా న్యాయంగా వుందా..మీ అమ్మానాన్నలను చూడాలని నన్నూ, నా కూతుర్ని వేరు చేస్తావా? అదీ రెండున్నర నెలలా..నేను తనను వదిలి వుండగలననే అనుకుంటున్నావా. పోనీ వచ్చేద్దామన్నా ఆఫీస్ లో పరిస్థితి సెలవు పెట్టేలా లేదే...నీ హృదయం ఇంత పాషాణ౦గా ఎలా మారింది? ఏరోజైనా నిన్ను పల్లెత్తుమాటన్నానా? గుండెల్లో పెట్టి చూసుకున్నా కూడా పుట్టింటి ఊసు రాగానే నీ కళ్ళలో వెలిగే వెలుగు నన్నెంత బాధ పెడుతుందో తెలుసా..మన పెళ్ళికి ముందు నన్ను వదిలి క్షణమైనా ఉండలేనన్న నువ్వేనా నన్నొదిలి సంతోషంగా వెళ్లి౦ది? నిన్ను చూడకుండా నేను ఎలా వుండగలననుకున్నావ్?

     రోజూ నా భుజం మీద తల వాల్చి పడుకునే అలవాటు నీకు, మరి ఈ రెండు నెలలు నీకు సరిగ్గా నిద్ర పడుతుందా...మధ్యాహ్నం 'క్రాకర్ అండ్ బారెల్' కి వెళ్ళాను. పోయినసారి మనం వెళ్ళినప్పుడు నీకు నచ్చి సేల్ లో కొంటానని పక్కకు పెట్టావుగా ఆ క్రిస్టల్ వేజ్ కొని తీసుకొచ్చాను. నువ్వు పెట్టినట్లుగా అందులో నీళ్ళు పోసి గులాబీ పెట్టాను. ఆ పువ్వు చూడగానే నవ్వుతున్న నీ మొహం కనిపించింది. 'క్రేటర్ లేక్' కి వెళ్ళినప్పుడు బాక్ గ్రవుండ్ లో నీళ్ళు కనిపించేలాగా నీకు ఫోటో తీశాను చూడు...అది తీసి ఎండ్ టేబుల్ మీద ఫ్రేం లో పెట్టాను. అలా అయినా నువ్వు ఎదురుగా కనిపిస్తూ వుంటావని!

     సాయంత్రం ప్రవీణ్ వాళ్ళింటికి భోజనానికి పిలిచారు. అట్టహాసంగా ఎన్నో వంటలు చేశారు కాని, ఏ కూర కూడా నువ్వు చేసినట్లుగా లేదు. నాకు నీ చేత్తో చేసే పప్పుచారు, పచ్చడే కావాలి, మనిద్దరం కలసి భోజనం చేయాలి. అక్కడ అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మనం ఎవరింటికి వెళ్ళినా నిన్ను పట్టించుకోవట్లేదని గొడవ పెట్టేదానివా..ఇవాళ నువ్వు లేకుండా నేనక్కడ ప్రశాంతంగా ఉండలేకపోయాను.

     చీకటి నీడల్లో ఇంటికి చేరాను, దీపం లేని ఇల్లు శుష్కహాసంతో దర్శనమిచ్చింది. నవ్వు లేని నేను, ఇల్లు ఇరువురమూ ఒంటరులమే. ఉదయం నుండి పట్టించుకోలేదనేమో గులాబి రంగు దుప్పటి అలిగి మంచం మీద ఓ మూల కూర్చుంది. కిటికీలోంచి నెలవంక జాలిగా చూస్తోంది. చల్లగాలి గదిలోదూరి చలిగాలిగా మారింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద దువ్వెనకు చిక్కుకున్న పొడవైన నల్లని వెంట్రుక ఒక్కటే నా కళ్ళకు అందంగా కనిపిస్తోంది. నీ గొంతు విని ఇప్పటికి ముప్పై ఆరు గంటలైంది. నిన్ను చూడకుండా వుండడం నా వల్ల కాదురా...టికెట్ ప్రీపోన్ చేసుకుని వెంటనే వచ్చేయకూడదూ!

ఎప్పటికీ నీ....

Monday, June 4, 2012

వేసవిలో చల్లని రోజు

    గాలికి చిన్నగా ఊగుతున్న ఎత్తైన పచ్చని చెట్లు, మధ్యలో కొలను, దూరంగా పిల్లల ఆటస్థలం నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి, అద్భుతమైన చిత్తరువులా ఉందా ప్రదేశం. నీటి అలలపై చెట్ల నీడ అందంగా కదులుతోంది. కొమ్మ మీద రెండు పిట్టలు విశ్రాంతిగా కూర్చుని వున్నాయి. దూరంగా వున్న ఆటస్థలంలో పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారు. సన్నని కాలిబాటకు ఇరువైపులా పచ్చిక, కొంచెం దూరంగా వాలీబాల్ కోర్టు, బాట చివరగా రెండు విశ్రాంతి మందిరాలు వున్నాయి. నీటిపై నుండి వీస్తున్న గాలి చల్లగా ఆహ్లాదంగా వుంది.

       ఆ ప్రాంతానికి మెల్లగా ఒక్కో కుంటుంబమే వస్తోంది, తెలిసిన వారు ఒక
రినొకరు ఆప్యాయంగా   పలకరించుకుంటుంటే, తెలియని వారు పరిచయం చేసుకుంటున్నారు. మధ్యాహ్నానికి ఆ ప్రదేశ౦ జనసందోహంతో నిండిపోయింది. హుషారైన పాటలు చెట్ల మధ్యలో తిరుగుతూ గాలితో సయ్యాటలాడుతున్నాయి.

         బుజ్జిపండు తన స్నేహితులతో కలసి చెట్టుకు 
తాడుకట్టి కొమ్మపైకెక్కే ప్రయత్నంలో వున్నాడు. ఒక గంట తర్వాత 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న విధంగా చెట్టెక్కి కూర్చున్నాడు.      
       కాటన్ కాండీ కొనుక్కుని చెంప మీద బొమ్మలు వేయించుకుంటున్న చిన్నారులను ముద్దాడి, తాడును పట్టుకుని లాగుతూ బలాబలాలను తేల్చుకుంటున్న పిల్లల్ని ఉత్సాహపరిచి, కబడ్డీ ఆట కాసేపు చూసి, వాలీబాల్ ఎగిరిన వైపు చూస్తే నీలాకాశంలో తెల్లని మేఘాలు కనిపించాయి. తోటలో పువ్వులు లేని వెలితి పిల్లల నవ్వులు భర్తీ చేశాయి.

     
నిన్న మా ఊరిలో జరిగిన వనభోజనాల కార్యక్రమంలో పెళ్ళి హడావిడి కనిపించింది. ఎంతో మందిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. ప్రతి పనికీ మేమున్నామంటూ ముందుకు వచ్చిన వాళ్ళు, తీసుకున్న పనిని చివరివరకూ వదలక పూర్తి చేసిన వాళ్ళు, చేసే పని అందరకీ తెలియాలని తాపత్రయపడిన వాళ్ళు, ఇలా చేస్తే బావుంటుందని సలహా ఇచ్చిన వాళ్ళు ఇలా ఎందరో...అయితే ఎక్కువ శాతం, ప్రతి పనిలో పాలుపంచుకుంటూ పక్క వారిని మనస్పూర్తిగా మెచ్చుకున్న వాళ్ళే కనిపించారు. 

      ఏ ప్రయోజనమూ ఆశించకుండా పలువురి ఆనందం కోసం కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకున వాళ్ళను, పిల్లలకు మరచిపోలేని అనుభూతిని మిగల్చాలని అహర్నిశలూ శ్రమపడిన వాళ్ళను, బరువులు మోసిన వాళ్ళను, చెత్తను తీసివేయడానికి సైతం వెనుకాడని వాళ్ళను చూశాను. సజ్జన సాంగత్యం లభించింది.

      భోజనాల ఏర్పాట్లలో హడావిడిగా ఉ
న్నాకూడా, చాలా మంది స్నేహితులను కలిసే అవకాశం కలిగింది. నలుగురితో కలసి పనిచేసిన  ఆన౦దం దక్కింది. నా తలపులలో ఓ వేసవి రోజు చల్లగా హాయిగా నిలిచిపోయింది.