Monday, July 28, 2014

సాహితీ బంధువులు

"అసలు బంధువులతోనే నాలుగు మాటలు మాట్లాడడానికి తీరిక లేకపోతుంటే ఇంకా ఈ సాహితీ బంధువులేమిటి?" అనుకుంటున్నారా. మన బంధువుల సంగతి తరువాత మాట్లాడుకుందాం కానీ ఈ సాహితీ బంధువుల గురంచి మాత్రం మీకు చెప్పకుండా ఉండలేక పోతున్నాను. 

*                        *                         *                       *                         *

"మనమో కుగ్రామంలో ఉంటున్నాం కదూ!" నాటా సభల నుండి బయలుదేరి కారు ఊరిదారి పట్టగానే మా వారితో అన్నాను.
"అదేం? మన ఊర్లో కూడా హారిస్ టీటర్, వాల్మార్ట్, లోవ్స్ అన్నీ ఉన్నాయిగా?" ఆశ్చర్యపోయారు.
"అవన్నీ కాదు. అట్లాంటాలో నెలనెలా సాహితీ సభలు జరుగుతాయట. ఇండియా నుండి సాహితీ వేత్తలు వచ్చినప్పుడు కూడా అందరూ సమావేశమవుతారట." 
"మనమూ మొదలుపెడదాం. పైగా రమణి గారు కూడా వస్తున్నారుగా" సబ్ వే ముందు కారు ఆపుతూ అన్నారు.
"మన ఊళ్ళో పుస్తకం చదివేవాళ్ళని, అందులో తెలుగు పుస్తకం చదివేవాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు." అన్నాను.
"ఫణిగారు, మాధవ్ గారు జులై ఆఖరి వారం రమణి గారిని అట్లాంటా తీసుకువెళ్ళడానికి వస్తామన్నారు. వారికిష్టమైతే ఆ వారాంతం సాహితీ సదస్సు ఏర్పాటు చేద్దాం" 
"అలాగే కాని ఎవరైనా వస్తారంటారా? " 
"ఏమో! ఇలా సాహితీ సదస్సు  జరుగుతుందని మెయిల్ పంపిద్దాం. ఆసక్తి ఉన్నవాళ్ళు వస్తారు".


"సాహితీ మిత్రులకు అభినందనలు, 

మన ఊరికి ప్రముఖ సినీ రచియిత, నంది అవార్డు గ్రహీత బలబద్రపాత్రుని రమణి గారు వచ్చారు, వారితో పాటు హాస్య కథల రచయిత ఫణి డొక్కా గారు, మరియు మరో రచయిత మాధవ్ దుర్భగారు అట్లాంటా నుంచి వస్తున్నారు. మనం ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకుని ఒక సాహితీ సదస్సు ఏర్పాటు చేసుకుంటే ఎలావుంటుందనే ఆలోచన వచ్చింది, వచ్చిన వెంటనే మీరు గుర్తు వచ్చారు. ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మా ఇంట్లో సదస్సు జరుగుతుంది. మీకు తెలిసిన సాహిత్యాభిమానులను కూడా ఆహ్వానించగలరు" అంటూ మెయిల్ పంపించాము.

*                        *                         *                       *                         *

రమణి గారు ఓ పది రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు. అప్పటినుండి మా తోట పువ్వులు పుయ్యడం మానేసి నవ్వులు పుయ్యడం మొదలెట్టింది. బంధు మిత్రులతో ఇల్లంతా సందడే. ఒక్కరేగా వచ్చింది మరి ఈ సందడేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఆ ఒక్కరూ మొత్తం సినీ ఫీల్డ్ ని, కాదు కాదు యావత్ ప్రపంచాన్నే వెంటబెట్టుకుని వచ్చేశారు. 

ఈ శనివారం మధ్యాహ్నానికి ఫణి గారు, మాధవ్ దుర్భా గారు వచ్చారు. భోజనాలు చేస్తూ కబుర్లు చెప్పుకున్నామో, కబుర్లే భోంచేశామో చెప్పడం కష్టమే! ఒక్క క్షణంలో టైం మూడున్నరైంది. 

"ఇంతకూ మేం దేనిగురించి మాట్లాడాలి? "అడిగారు ఫణి గారు. 
"ఏదైనా హాస్య ప్రధానంగా అయితే బావుంటుందేమోనండి. నిజజీవితంలోగాని, సాహిత్యంలోగాని మీ ఇష్టం" చెప్పారు రఘు.
"జ్యోతిర్మయి గారూ సుమారుగా ఎంతమంది వస్తారండి? " అడిగారు మాధవ్ గారు.
"సాహిత్యం అంటే ఆసక్తి ఉండొచ్చని మేం అనుకున్న వాళ్ళకి మెయిల్ పంపాపండి. ఓ పది మంది రావచ్చు." అని సమాధానం ఇచ్చాను. వారు కూడా రారేమోనని మనసులో సందేహమే!

మరో పావుగంట గడిచింది. ఓ నలుగురు మిత్రులు వచ్చి అతిధులను పరిచయం చేసుకుని, మా మధ్యగదిలో ఓ ముప్పై మంది కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేసేశారు. ఓ ఇద్దరమ్మాయిలు వంటగదిలోకి దూరిపోయి వద్దన్నా వినక ఫ్రీజర్ లోని స్వీట్ కార్న్ ని, అరలోని టీపొడిని పొయ్యెక్కించారు. "మీరెళ్ళి ఆ వచ్చేవాళ్ళను చూసుకోండి" అంటూ నన్నా ప్రాంతాల నుండి తరిమేశారు.

మరో పావుగంటకు ఒకరొకరూ రావడం మొదలెట్టారు. వేసవిలో తెల్లిదండ్రులు అమెరికాలోని పిల్లల దగ్గరకు రావడం మామూలే. అలా వచ్చిన పెద్దవారిలో లైబ్రేరియన్, తెలుగు ప్రొఫెసర్, సోషల్ వర్కర్ ఇలాంటి వాళ్ళు రావడం సభకు నిండుదనం తెచ్చింది. పరిచయాలతో మొదలై,  చలం సాహిత్యం, సెన్సార్ బోర్డ్, ప్రస్తుతం వస్తున్న సీరియల్స్, వాటి తీరుతెన్నులు,  సినిమా వెనుక కష్టాలు, మంచి కథలు ఇలా అన్ని అంశాలను హాస్యంలో రంగరించి వచ్చిన ఆ ముగ్గురూ మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెళ్ళారు. నవ్వులు, చప్పట్లు, ప్రశ్నోత్తరాలతో సమయం ఎలా గడిచిందో! రాత్రి ఎనిమిదైనా ఎవరికీ కదలాలని లేదు. 

 

అందరూ వెళుతుండగా మాధవ్ గారన్నారు. "సాహితీ సదస్సులకు ఫోన్ చేసి పిలిస్తేనే రావడం కష్టం. అలాంటిది మీ ఊర్లో ఒక్క మెయిల్ పంపితే దాదాపుగా ముప్పై మంది రావడం...ఇలా ఇన్ని గంటలు ఆసక్తిగా వినడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇకనుండి మా సాహితీ సభలు మీ ఊర్లో పెట్టుకోలనిపిస్తుంది" అని. "రావడం మా ఊరి విశేషమైనా వారిని ఆసక్తిగా కట్టిపడేసిన ఘనత మీదేనన్నాను". 

పుస్తకాల్లో ఇంత హాస్యం ఉంటుందా అని మా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓ ఇద్దరు స్నేహితులు నన్ను పక్కకు పిలిచి "ఫణి గారు, మాధవ్ గారు అట్లాంటాలోనే ఉంటారు కదండీ. వారిని మన వేదిక మీద ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమం చేస్తే బావుంటుందని" వారి మనసులో మాట చెప్పారు. ఇంకో నలుగురు "ఇకనుండీ మనం ప్రతి నెలా కలిసి ఒక పుస్తకం గురుంచో ఒక కథ గురుంచో మాట్లాడుకుందాం" అని చెప్పారు. "ఉందిలే మంచి కాలం ముందు ముందునా" అని మనసులోనే పాడుకున్నాను.

అందరూ వెళ్ళాక సినిమాల గురించి మాట్లాడుతుండగా ఫణిగారన్నారు "మంచి సినిమాలు వస్తున్నాయి కాని వాటిని చూసి ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడంతో ఎవరికీ వాటిని తీసే ఉత్సాహం ఉండట్లేదని". 
"నిజమే కదా!" అనిపించింది. ఎందుకంటే మిధునం లాంటి సినిమాలు మా ఊర్లో రిలీజ్ కూడా అవవు. 
దానికి ఆయన చెప్పారు "ప్రతి ఊరిలో ఓ వందమందిమి కలసి మంచి సినిమా తీస్తే మేము తప్పకుండా చూస్తామని చెప్తే ఆ సినిమా తీసేవాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళకు నష్టమూ రాదు" అని. 
గొప్ప పరిష్కారం! సమస్య గురించి వందసార్లు మాట్లాడడం కన్నా పరిష్కారం వైపు ఓ రెండు అడుగులు వేస్తే సమస్య ఇట్టే తేలిపోతోంది. ఏమంటారు?

అవండీ సాహితీ బంధువుల విశేషాలు. అలా నిన్నంతా మా ఇంట్లో హాస్య రసం యేరులై ప్రవహించింది. ఇప్పడు కూడా ఏ వైపు చూసినా నవ్వులే కనిపిస్తున్నాయ్.  Tuesday, July 8, 2014

పన్నీటి తలపులు నిండగా...

     పూర్వం ఐదు రోజుల పెళ్ళిళ్ళు చేసేవార్ట. ఆత్మీయులతో ముచ్చట్లు, బాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, పట్టు చీరల గరగరలు, కొత్త చుట్టరికాలు, హడావిడి పరుగులు....అలంటి పెళ్ళికి వెళ్ళొచ్చాక ఎలా ఉంటుందో అలా ఉందిప్పుడు. ఇంతకూ ఏమిటీ హడావిడి? ఎక్కడకు వెళ్ళామనే కదూ సందేహం. నాటా సంబరాలకు వెళ్ళాం. 

    శుక్రవారం అట్లాంటా చేరి మేరియట్ ముందు కారు దిగగానే ఆత్మీయ పలకరింపులు, ముప్పైయిదో అంతస్తులో ఓ అందమైన గది. అక్కడినుండి కిందకు చూస్తే ఆశ్చర్యం! సంబరాలు చూడడానికేమో ఆకాశాన్ని ఖాళీ చేసేసి చుక్కలన్నీ నేలకు దిగివచ్చాయి. 

   చీరలమీద చెమ్కీలయ్యాయి. చంద్రబోస్ గారి పాటలో అక్షరాలయ్యాయి, బాలుగారి స్వరంలో రాగాలయ్యాయి, నిర్మల గారి పదానికి అందెలయ్యాయి, రామారెడ్డి గారి పద్యాలలో ఛందస్సయ్యాయి, సాహితీ సభలలో చెణుకులయ్యాయి...అక్కడా ఇక్కడా అనేమిటి అంతటా తామై చుక్కలు మెరిసిపోయాయి....మురిసిపోయాయి.

   మృష్టాన్న భోజనం, చీనీ చినాంబరాలు, పద్యాలు, పాటలు, పుస్తకాలు, అవధానాలు...ఒకటా. రెండు రోజులూ మరో ప్రపంచంలోవున్నట్లే. ఇల్లూ, వాకిలి, మొక్కలు, పిల్లలు, బ్లాగులూ ఇలా ఏవీ గుర్తే రాలేదు. నాకు నచ్చినవి కొన్ని మీతో పంచుకుందామని...పదిలంగా దాచుకుందామని.

సంగీత నవావధానం  


సంగీత నవావధానం 
ఈ అవధానానికి శ్రీనివాస్ కిషోర్ భరద్వాజ గారు అధ్యక్షత వహించారు. మీగడ రామలింగస్వామి గారు అవధాని. రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సింహాచల శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వడ్డే కృష్ణ గారు, బాలాంత్రపు శారద గారు, దుర్వాసుల శిరీష గారు, దువ్వూరి రమేష్ గారు, ప్రాశ్నికులు. 

ఇదే మొదటిసారి సంగీతావధానం చూడడం. ప్రశ్నికులు అవధానిగారికి ఓ పద్యం ఇచ్చి ఫలానా రాగంలో పాడమని చెప్పగానే అవధాని గారు రాగాలు తెలియని వారికి కూడా అర్ధమయ్యే రీతిలో రెండు మూడు పాటల పల్లవులు పాడి ఆ రాగంలో పద్యం పాడారు. కొన్ని రాగాల విశిష్టతలను కూడా చెప్పారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

పాటలు, పాట్లు, హిట్లు 


పేరు గమ్మత్తుగా ఉంది కదూ! చంద్రబోస్ గారే పెట్టారట. ఈ కార్యక్రమంలో రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు పాల్గొన్నారు. 

పాట నచ్చితే మన మొబైల్ లోనో, ఐపాడ్ లోనో ఓ వెయ్యిసార్లన్నా వినేస్తూ ఉంటాం. ఆ పాట ఎవరు రాసారన్నది కూడా చాలా సార్లు పట్టించుకోము. అలాంటి పాటలు రాయడానికి పడే పాట్లు గురించే వివరించారు. అది కూడా పొట్ట చెక్కలయ్యేట్లు నవ్విస్తూ. రెండు గంటల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అందరూ పెద్ద పెద్ద రచయితలు ఎలా ఉంటారో అనుకున్నాను. వారికెవ్వరికీ కొంచం కూడా గర్వం లేదు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడారు.

సాహితీ సదస్సు 

అశోక్ తేజ గారు 'నేలమ్మా... నేలమ్మా' అని పాడుతుంటే గుండె చెమ్మ కంటిలో మెరిసింది. వెన్నెలకంటి గారు 
 శ్రోతల ప్రశ్నలకు సమాధానంగా ఘంటసాల గారి పాటల గురించి, పాటల వెనుక కథల గురంచి ఎన్నో విషయాలు చెప్పారు. రమణి గారు మాటలు ఆ సభలో నవ్వుల పువ్వులు పూయించాయి. గెద్దాల రాధిక గారు కథ చదివారు. 
సింహాచల శాస్త్రి గారు వాగ్గేయకారుల గురించి వివరిస్తూ పద్యాలు పాడారు. భవిష్యత్తులో వారి హరికథ వినే భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. 

ఈ సభకు అధ్యక్షత వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అరుదైన, అందమైన జ్జ్ఞాపకాన్ని పదిలపరుచుకునే అవకాశాన్నిచ్చిన మాధవ్ దుర్భ గారికి, సాహితీ విభాగం సభ్యులకు అనేకానేక ధన్యవాదాలు.  


అష్టావధానం 

శతావధాని నరాల రామారెడ్డిగారి అష్టావధానం చూసే భాగ్యం ఇన్నాళ్ళకు కలిగింది. సంచాలకులు: రసరాజు గారు, పృఛ్ఛకులు: ఆచార్య ఫణీంద్ర గారు, ఓలేటి నరసింహారావుగారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, కొత్త రఘునాథ్ గారు, డాక్టర్ బి,కే మోహన్, బాలాంత్రపు వెంకట రమణ గారు,  కొలిచాల సురేష్ గారు డొక్కా ఫణీంద్ర గారు. 
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు అవధాని గారిని, సంచాలకుల వారిని, పృఛ్ఛకులను సన్మానించారు. 
నరాల రామారెడ్డి గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు
రసరాజు గారు 
ఓలేటి నరసింహరావు గారు
డాక్టర్ బి కె మోహన్ గారు  
బాలాంత్రపు రమణ గారు 
ఈమాట సంపాదకులు కొలిచాల సురేష్ గారు
ఆచార్య ఫణీంద్ర గారు ప్రపంచాభాషలందు వెలుగు తెలుగు అన్నారు. గుర్తుంచుకోవలసిన మాట కదూ! వారు గుణింతాలలో దైవత్వాన్ని చూపించారు.
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు 
నాటా జ్ఞాపిక 'స్రవంతి' సంపాదకులు కొత్త రఘునాథ్ గారు
'సాహిత్య రత్న' అవార్డ్ గ్రహీత డొక్కా ఫణి కుమార్ గారు  
రసరాజు గారు, జోన్నవిత్తులు గారు
ఘంటసాల రత్నకుమార్ గారు
ఈ సాహితీ వేదిక నిర్వాహకులు డాక్టర్ మాధవ్ దుర్భాగారు, ఎడవల్లి రామ్ గారు, చెన్నుభొట్ల రాధ గారు.