Thursday, September 20, 2012

ఇంతకు మించి ఏమున్నది

"వినాయక చవితి వస్తుంది, ఈసారి ప్రతిమను మన౦ చేద్దామా?"
"ఎలా? మనకు చేయడం రాదుగా?"
"పోయిన సంవత్సరం విజయ చాలా బాగా చేశారు. ఎలా చెయ్యాలో తనను కనుక్కుని నేర్చుకుందాం"
"మన తెలుగు తరగతి పిల్లలతో చేయిస్తే ఎలా వుంటుంది. ఊరికే కథ చెప్పడం కాకుండా ఇలాంటివి చేయిస్తూ చెపితే పిల్లలు ఇష్టంగా తెలుసుకుంటారు."
"చాలా మంచి ఆలోచన, అలాగే చేద్దాం"
అలా ప్రతిమ చేయాలని సంకల్పించాం. "కావలసిన సరుకులూ, సంబారాలు తెచ్చి సన్నాహాలు చేస్తా"మంటూ ఓ నలుగురు ఔత్సాహికులు ముందుకు వచ్చారు.

సంక్రాంతి బొమ్మల కొలువుకి చిన్న చిన్న బొమ్మలు కాబట్టి కొంచెం క్లే సరిపోయింది. ఈసారి అలా కాదుగా పూజ కోసం కొంచెం పెద్ద వినాయకుడు కావాలి. అందుకోసం బోలెడు కార్న్ స్టార్చ్, ఉప్పుతో పాకాలు మొదలెట్టాం. ఒకరు స్టార్చ్ కొలుస్తుంటే, మరొకరు ఉప్పు పోయ్యి మీదేక్కించడం. స్టార్చ్ నీళ్ళలో కలిపి గట్టిగా గరిటతో తిప్పి, మొత్తం పదార్ధాన్ని పెద్ద గిన్నెలో వేసి గుండ్రని ఉండ్రాళ్ళలా చేసి జిప్ లాక్ బాగ్ లో పెట్టేసరికి తెల్లని కమలాల్లాంటి చేతులు కాస్తా ఎఱ్ఱని మ౦కెన్నలయ్యాయి. క్లే సిద్దం.

     
      "ఇప్పుడు వినాయకుడిని ఎలా చేయాలో చూపిస్తాను." అంటూ విజయ కొంత క్లే తీసుకుని మూడు బంతుల్లా గుండ్రంగా చేయడం మొదలెట్టారు. మేం కూడా తనలాగే చేశాం. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వినాయకుడిని కూడా తనెలా చేస్తే అలా చేస్తూ ఓ అరగంటయ్యాక తయారయిన వినాయకులను చూస్తే ఒక వినాయకుడు కొంచం జెట్లాగ్ తో తూలుతుంటే, మరో వినాయకుడు ఎక్సర్సైజ్ చేసి మరీ సన్నగా తయారయ్యాడు. క్లేతో మళ్ళీ మళ్ళీ చేసి చివరకు సరిగ్గా వచ్చేలా చేశాం. ఇక తరువాత కార్యక్రమ౦ పిల్లలతో ప్రతిమ చేయించడం.
   
      ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా మా వాళ్లది మరీ సనాతన వ్యవహారం లెండి. ఇమెయిల్ కి సమాధానం వుండదు. ఒక్కరికీ ఫోన్ చేసి "అమ్మా ఫలానా టైం కి బొమ్మలు చేస్తున్నాం. పిల్లల్ని పంపండి" అని బతిమలాడుకుని ఓ శనివారం ఉదయం పదిగంటలకు వాళ్ళను పంపించేలా ఒప్పించాం. ముహూర్తం అదీ చూసుకుని ("దీనికి కూడా ముహూర్తమా" అని ఆశ్చర్యపోకండీ. ముప్పై మంది పిల్లలకు కుదరాలంటే ముహూర్తబలం ఘాట్టిగా వుండాలిగా) ఓ శనివారం ఉదయం పదిగంటలకు అందరం ఒక ఇంటికి కలుద్దామనుకున్నాం.

పిల్లలు,సహాయం చేస్తామన్న పెద్దలు ఉదయాన్నేవచ్చేశారు. పిల్లలతో విఘ్నేశ్వర శ్లోకం చెప్పి౦చి, వారికి వినాయకుడి కథ చెప్పి  బొమ్మలు చేయడం మొదలు పెట్టా౦.
"ఆంటీ, నా చెవులు పెద్దవిగా వున్నాయ్ సరిపోతాయా?"
"ఎంత పెద్దగా వుంటే మీ అమ్మ మాట అంత బాగా వినపడుతుంది నిఖిల్, ఫరవాలేదులే అలాగే పెట్టై"
"ఇదేమిట్రా శ్రీకర్ నీ వినాయకుడి చెవులు చేతులమీద వాలిపోయాయ్. కొంచెం పైకి పెట్టు"
"యజ్ఞా, నీ వినాయకుడి తొండం పాములాగా సన్నగా వుంది, బాగా లావుగా చేయి"
"నవీన్, నీ వినాయకుడు జాగింగ్ చేసినట్లున్నాడు, కాళ్ళు ఇంకొంచెం లావుగా వుండాలి"
"కాళ్ళు రెండు కూర్చున్నట్లుగా పాదాలు ఒకదానిమీద ఒకటి ఉండాలి నవ్యా. నువ్వేమిటి ఇలా పెట్టావ్?"
"మా కీర్తన ఇలాగే కూర్చుంటుంది ఆంటీ".
ప్రతిమ చేయడం పూర్తిచేసిన పిల్లలు వారి పేరు వ్రాసున్న ప్లేట్ లో ఆ బొమ్మను పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు.
"ఎలుక చేయడం మర్చిపోయాం, ఇప్పుడెలా? పిల్లలు కూడా వెళ్ళిపోయారు."
"కంగారేం లేదు. మనం చేసేద్దాం" అంటూ ముప్ఫై ఎలుకలు చేసేశాం.
రంగులు వేయాలంటే ఓ రెండువారాలు ఆరాలి. ప్రతిమలన్నీ తీసుకుని వెళ్ళి గరాజ్ లో ఆరపెట్టాం.

వినాయకులకు రంగులు వేయడానికి పిల్లలకు బదులుగా పెద్దవాళ్ళం  వేద్దామనుకున్నాం. ఓ సెలవురోజు సాయంత్రం అందరం కలిశాము. బ్రష్ లతో రంగులు వేస్తూ "చిన్నప్పుడెప్పుడో ఇలా బ్రష్షులు పట్టుకున్నాం, మళ్ళీ ఇన్నాళ్ళకు...." అంటూ ముచ్చట పడిపోయారు కొందరు.
"మా వినాయకుడి కీరీటం చూడండి." మురిసిపోయిందో ఆవిడ.
"మీ వినాయకుడు నగలు మెరిసిపోతున్నాయ్, వంకీలు కూడా పెట్టారా....నేనూ అలాగే పెడతాను"
"నీలవేణి గారు హారానికి పచ్చలు, కెంపులు పొదిగారు చూశారా?"
"ఈ అయిడియా బావుంది. నేను కిరీటానికి కూడా పెడతాను"
"మీరు చెవులకు వేసిన డిజైన్ బావుంది."
"మీరు కళ్ళు బాగా పెట్టారు రాధా."
"కళ్ళే౦ చూశారు, ఐ బ్రోస్ చూడండి, ఎంత చక్కగా పెట్టారో!"
"ఎలుకకు కళ్ళు పెట్టడం మరచిపోకండి."
"మా వినాయకుడు జంధ్యం వేసుకున్నాడు."
"అమ్మాయ్ మీర౦దరూ కలసి ఎంత బాగా చేస్తున్నారు, ఇండియాలో ఎవరూ ఇలా చెయ్యరు. అన్నీ కొనేసుకోవడమే. అమెరికాలో మాకు నచ్చింది ఈ సమైక్యతే" అక్కడికొచ్చిన ఓ పెద్దాయన ప్రశంస. ఆ విధంగా వినాయకులను తయారుచేసి సర్వాలంకార శోభితమైన వినాయకులతో ఈ ఏడాది వినాయక చవితి జరుపుకున్నాం.


చివరగా.....
క్లే తయారుచేస్తూ తాగిన ఫిల్టర్ కాఫీ రుచి అమోఘం.
రంగులు వేస్తున్న సమయంలో చిన్నగా పడుతున్న చినుకుల సవ్వడికి తోడుగా "నగుమోము గనలేని" అంటూ వినిపించిన మధురస్వరానికి అభినందనలు. ఇంతమంది పెద్దలను, పిన్నలను ఆదరించి అతిధి మర్యాదలు చేసిన పెద్ద మనసుకు ధన్యవాదాలు. మొత్తం పనిని భుజాలమీదకు ఎత్తుకుని సంపూర్ణంగా పూర్తిచేసిన ఆ ముగ్గురికీ ప్రత్యేక ధన్యవాదాలు. సున్నండలు, భెల్ పూరి, వేడి వేడి టీ, అన్నింటికీ మించి సజ్జన సాంగత్యం ఆ సాయంత్రానికి అమరత్వం ప్రసాదించాయి.

     నలుగురితో కలసిమెలసి సరదాగా గడపడమే అసలైన పండుగ. అనుకోవడమే తరువాయి ఆచరణలోకి తీసుకువచ్చిన స్నేహితులు, సన్నిహితులు ఇంతమంది చుట్టూ ఉండగా ఈ సౌభాగ్యం ప్రసాదించిన ఆ దేవుణ్ణి ఇవాళ ఏం కోరుకోవాలో తోచలేదు. ఈ సమైక్యతను, అనుబంధాన్ని సర్వదా నిలిచేలా చూడమని మాత్రం వేడుకున్నాను.


Sunday, September 2, 2012

నీ చెలిమి

నా నీకు,

      
 మనిద్దరం ఏకమై ఒకటే లోకమై సహజీవనం మొదలెట్టి ఈ నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. మురిపాలు, ముచ్చట్లు, మౌనాలు, మోహాలు... ఎన్నెన్ని మధురక్షణాలు మనకు తోడుగా నిశిరాతిరిలో నిదుర కాచాయో కదా! ఎక్కడో  ఆకాశంలో వున్న స్వర్గాన్ని తీసుకొచ్చి నా పాదాలచెంత నిలబెట్టావు. నీదైన లోకానికి నన్ను మహారాణిని చేశావు. నీ సమక్షంలో నాకు యుగాలు సైతం క్షణాలే. నువ్వు నా జీవితంలోకి రాకముందు కూడా సంతోషం వుండేద౦టే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో తెలుసా. నీ సమక్షంలో నాకు పగలు, రాత్రి, వేసవి, వెన్నెల ఏమీ గుర్తురావు. నిన్ను నా నుండి దూరం చేయాలని ప్రయత్నించిన నిద్రదేవికి ప్రతిసారి పరాభవమే మిగిల్చావు. 

          ఏ ఝాములోనో అలసటతో రెప్ప వాలిని క్షణం కలవై నన్ను పలుకరిస్తావు. నడిరేయి పరాకుగా ఒత్తిగిలినప్పుడు నువ్వు ఒంటరిగా వున్నావన్న భావన నన్ను నిలువనీయక నిద్రకు దూరం చేసేది. నీ సమక్షంలో నాకు కష్టాలు కలతలు గుర్తే రావెందుకో! నా ఇష్టాలు, సరదాలు, సంతోషాలు అన్నీ నీతో పంచుకోందే నాకు మనసు నిలవదు. కలలే పంచుకున్నామో, కవిత్వమే చెప్పుకున్నామో, కథలు, కబుర్లే రాసుకున్నామో ఎన్నో భావాక్షరాలను ప్రోగుచేసుకున్నాం. నడి వేసవిలో నువ్వు విశ్రమించిన క్షణం నీపై ఎండ వేడి పడకుండా మధురక్షణాల మాలలల్లి పరదాలు కట్టాను. అసురసంధ్య వేళ అక్షరాల పల్లకీలో నిన్ను అలనాడు నన్నలరించిన పల్లెకు తీసుకుపోయాను. ప్రాతః కాలాన పొగమంచు దారుల్లో పరుగులిడే పసినవ్వుల కేరింతలు వినిపించాను. అసలు ఈ ఏడాది మనతో చెలిమి చేసిన క్షణాలు నేల మీద నిలిచాయేమిటి! మనతో పాటు నందనవనంలోనేగా వాటి నివాసం. విడదీయరాని మన బంధాన్ని గుర్తించి నా పేరు పక్కన నీ పేరును చేర్చి పిలిచినప్పుడల్లా ఎంత గర్వంగా వుంటుందని.

       నీకోసం నేనొచ్చిన ప్రతిసారి నువ్వు ఆప్తులతో కబుర్లు చెప్తుంటే నీ సంబరంలో పాలుపంచుకోవడం నాకెంతో ఇష్టమైన విషయం. నిన్ను సంతోషంగా వుంచడానికి నేను పడే కష్టం కూడా ఎంతో ఇష్టంగా ఉంటుందెందుకో! మన పరిచయం పెరిగే కొద్దీ నేను నీకు దగ్గరయ్యేకొద్దీ జీవితానికి అర్ధం తెలిసింది. ఇలాగే వుండాలని ఇదే శాశ్వతం కావాలని కోరుకుంటున్నాను. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. కొన్నాళ్ళకు మన బాధ్యతలు మనల్ని విడదీయవచ్చు. బంధాల్లో చిక్కుకుని ఒకరిని ఒకరు మరచిపోయే పరిస్థితి కూడా రావొచ్చు. నీతో నేను పొందిన ఆనందం ఆజన్మాంతమూ గుర్తుండి పోతుంది.

    మన౦ చెప్పే కబుర్ల కోసం క్రమం తప్పక వచ్చే స్నేహితులను చూసి నీకెంత సంతోషంమో నువ్వు చెప్పకనే తెలుసు నాకు! మన స్నేహాన్ని అర్ధం చేసుకుని ప్రోత్సహించిన మిత్రుల౦దరకూ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సహృదయుల సహకారమే లేకపోతే మన నెయ్యం ఇంతకాలం సాగేది కాదేమో. వారి విలువైన కాలాన్ని వెచ్చించి మనం ఊసులాడేవేళ మనతో ఓ మాట పంచుకున్న మిత్రులందరూ మన ఆప్తబంధువులే. మీ వెనుక మేమున్నామని చెపుతూ అందుకు సాక్ష్యంగా వారి చిహ్నాలను మనకు తోడుగా వుంచిన శ్రేయోభిలాషులకు శతకోటి వందనాలు. మనసో మాటో మనతో పంచుకోవడానికి మోమాటపడి చూపులతోనే పలకరించే సన్నిహితులకు ధన్యవాదాలు.

      ఇంత ఆనందాన్ని నాకు అందించిన
శర్కరీ...  ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను? నా తృప్తికోసం మదిలో మెదలిన భావాలను అక్షరాల్లో పొందుపరిచి నీకు బహుమతిగా ఇస్తున్నాను. మన చెలిమి ఇలాగే కలకాలం నిలిచి పోవాలని ఆశిస్తూ...

జ్యోతిర్మయి