Showing posts with label బంగారు బాల్యం. Show all posts
Showing posts with label బంగారు బాల్యం. Show all posts

Tuesday, January 15, 2019

కనుమ

ముగ్గుడబ్బా, రంగుల డబ్బాలన్నీ తీసుకొచ్చి అరుగుమీద పెడుతున్నా. "పాపా, ఈ రోజు రంగులు బళ్ళా, లోపల బెట్టెయ్" చెప్పింది పిన్ని.
"ఎందుకు పిన్నీ"?
"ఈ రోజు కనప్పండగ్గదా రధం ముగ్గెయ్యాల. రంగులుబళ్ళా, సందులోకి బొయ్యా రొన్ని కారబ్బంతులు, చావంతులూ దీసకరా."
"రథం ముగ్గే ఎందుకెయ్యాలి పిన్నీ"
"దానికో కతుంది చెప్తానుండు.ఈ పండక్కి బల్చక్రవొర్తి పాతాళం నుండి బూలోకానికొస్తాడు."
"బల్చక్రవర్తంటే మూడు వరాలిచ్చాడు. ఆయనేనా?"
"ఆ ఆయనే, ఈ రోజు పండగైపోతళ్ళా మళ్ళాయన పాతాళానికి బొయ్యేదానికీ రధం" చెప్పింది.
"ఒకవేళ మనం రధం ముగ్గు వెయ్యకపోతే మనింట్లోనే ఉండిపోతాడా?"
", వుండి పొయ్యా మనింట్లో బిందెలూ, గంగాళాలు దానం జేసేస్తాడు."
"అమ్మో, అయితే మనం ఎప్పుడూ రథం ముగ్గే వేద్దాం కనుమ రోజు."
నేను పూలు తీసుకుని వచ్చేసరికి చకచకా చుక్కలు పెట్టేసింది పిన్ని. ముగ్గుతో చుక్కల చుట్టూ మెలికలు తిప్పి చివరగా రెండు చక్రాలు వేసి పసుపు కుంకుమలు పూలరెక్కలు చల్లగానే అచ్చంగా పూలరథమే మా వాకిట ముందర.

*                *             *                 *                *             *                 *           
వడ్లకొట్టు మీద కూర్చుని నేనూ తమ్ముడూ నిప్పట్లు తింటున్నాం. "జోతా, అమ్మమ్మ నడిగి పసూకుంకుం తీసకరా" పురమాయించాడు మామయ్య.
"ఎందుకు మావయ్యా?" అంటూ చెంగున కిందకు దూకాడు తమ్ముడు.
"ఇవాళ కనప్పండగ కదా పశూల్ని కడిగి పసుంకుంకాలు బెట్టాల"
"బర్రెలకా?" ఆశ్చర్యపోయాడు తమ్ముడు.
"ఆ బర్లెకీ, ఎద్దలగ్గూడా" అంటూ పశువుల కొట్టం వైపు వెళ్ళాడు. వెనకే తమ్ముడు.
నేనూ, పిన్ని కొట్టంలోకి వెళ్ళేసరికి మామయ్యలిద్దరూ గడ్డి చుట్ట తీసుకుని పశువులను శుభ్రంగా తోమి, చెంబుతో నీళ్ళు పోస్తున్నారు. ముత్తయ్య కొట్టంలో అప్పటికే గడ్డి గాదం లేకుండా శుభ్రంగా చిమ్మి నీళ్ళు జల్లాడు. పిన్ని ఒక పక్కగా ముగ్గేసి ముగ్గు ముందు ఇటుకరాళ్ళతో పొయ్యి చేసి అందులో ఎండుకట్టెలు పెట్టింది.
"ఎందుకు పిన్నీ ఇక్కడ పొయ్యి?"
"పొంగలి బెట్టి పశూలకు నైవేద్దం బెట్టేదానికి." చెప్పింది.
"ఇక్కడా.. కొట్టంలోనా?" ఆశ్చర్యపోయాను.
"ఆ ఇక్కడే."
మాటలల్లోనే అమ్మమ్మ వచ్చింది. పొయ్యి రాజేసి పసుపురాసి కుంకుమ బెట్టిన పొంగలి గిన్నె పొయ్యిమీద పెట్టింది. మామయ్య పశువులను కడగడం పూర్తిచేసి కొమ్ములకు పచ్చని పసుపు, ఎరుపు రంగులు వేసి ఆరాక కొమ్ముల చివరలో కుచ్చులు కట్టాడు.
"పాపా కుంకుం బెడ్డువురా" పిలిచాడు మామయ్య.
భయంగా చూశాను. అదసలే డిల్లీ బర్రె. "రా జోతా, యేం జైదులే నేనుళ్ళా" అంటూ దాని గంగడోలు నిమురుతూ పిలిచాడు. రెండు చెవుల మధ్యగా తలపైన పసుపురాసి కుంకమ పెట్టాను. ఈలోగా మిగిలిన బర్రెలకు, ఎద్దులకు పిన్ని పసుపురాసి బొట్లు పెట్టింది. ఎద్దుల మెడలో కొత్త పట్టెడలు వేసారు. అలికి ముగ్గులు పెట్టిన కొట్టం రంగుల కొమ్ములు, మువ్వల పట్టెడలు, పసుపు కుంకుమలతో పశువులు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. పశువులకు నమస్కారం చేసుకుని పొంగలి నైవేద్యం పెట్టింది అమ్మమ్మ. అమ్మమ్మ చేసినట్టే నమస్కారం చేసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి ఘుమఘుమలు.

పొయ్యి మీద మాంసం కూర ఉడుకుతూ ఉంది. ఇంకో పొయ్యి మీద పెద్ద బాండలి పెట్టింది అమ్మ వడలు వెయ్యడానికి.
"నాకాకలేస్తంది అన్నం బెట్టుమా." అమ్మ పక్కన కూర్చుంటూ అడిగాడు తమ్ముడు.
"రొంత తాల్నాయినా అమ్మ వడలేస్తళ్ళా. అయిపోయినంక వడలు, అన్నం అన్నీ తిందువుగాని" చెప్పింది అమ్మ.
"నాకు వడలొద్దు. అన్నం బెట్టు."
"అట్టనగూడదు నాయినా. కనుమనాడు మినుము కొరకాల." చెప్పింది అమ్మమ్మ.
"వడలు గాల్నియ్ గానా మిగతా పిలకాయిల్ని గూడా బిలువ్. అట్నే బాయి కాడ కాళ్జేతులు కడుక్కుని రండి. అందరొక్కసారే తిందురు." పిలిచింది అమ్మ.
ఈ రోజుతో బడి సెలవలైపోయాయి. రేపే ఊరికి ప్రయాణం. 

*                *             *                 *                *             *                 *        

నాతో ప్రయాణం చేస్తూ పండగ సంబరాన్ని పంచుకున్న మిత్రులకు పెద్దలకు ధన్యవాదాలు. "అవీ ఇవీ రాయడం కాదు ఈసారి రాస్తే నెల్లూరి భాషలోనే రాయాలి" అని దబాయించి ప్రోత్సహించిన ప్రియనేస్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. 


Monday, January 14, 2019

సంక్రాంతి


       రోజుకన్నా ముందే తెల్లారినట్లుందివాళ. తీప్పొంగలి, కొత్తబట్టలు గుర్తురాగానే చెంగున మంచం దిగి గుమ్మాన్ని దాటుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. అప్పటికే స్నానం చేసి పెద్ద పండక్కని కుట్టించుకున్న పావడా పైటా వేసుకుని తలకు పిడప చుట్టుకుని దేవుడింట్లోకి వెళ్తూవుంది పిన్ని. చేతిలో తామరాకులో చుట్టిన పూలు. "పిన్నీ పిన్నీ నేను పటాలకు పూలుబెడతా" అంటూ వెంట పడ్డాను. 

"అట్నేబెడుదువులేగానా, గంగాళంలో నీళ్ళు తోడుండాయి ముందు బొయ్యా నీళ్ళు బోసుకునిరా" చెప్పింది. స్నానం చేసి వచ్చేసరికి పిన్ని దేవుడి పటాలన్నీశుభ్రంగా కడిగి గంధం, పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంది. ఆకు మధ్యలో పసుపుతో గౌరీ దేవిని కూడా చేసి పెట్టింది. "పాపా, తావరాకులో కదంబమాల తుంచి పెట్టుండాను, విడి పూలీడుండయ్ పటాలన్నింటికీ పెట్టు." అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. పటాలకు పూలు పెట్టడం పూర్తవగానే బంతిపూలు, మామిడాాకులతో దండ గుచ్చి వీధి గుమ్మానికి కట్టడానికి బయటకు వచ్చాం.

ఇంతలో "డబుక్ డక్ డబుక్ డక్" అని ఢక్కీ మోగించుకుంటూ బుడబుక్కల అతను వచ్చాడు. "అంబ పలుకు జగదాంబ పలుకు కంచి లోనీ కామాక్షీ పలకు, మహా ప్రభువులకు జయం కలగాలి నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ ఇప్పిచ్చుసామీ" అంటూ ఆపకుండా ఢక్కీ మోగించడం మొదలుపెట్టాడు. అమ్మ చేటలో బియ్యంతో పాటు ఒక పాతచీర కూడా తెచ్చి అతని జోలెలో వేసింది. "అమ్మగారి కార్యం జయమౌతాది, అయ్యగారి కార్యం జయమౌతాది, ముత్యాల మూటలే మీ ఇంట మూల్గాలె, రతనాల రాసులే మీ చెంత జేరాలి సుభోజ్జయం సుభోజ్జయం" అని దీవిస్తూ డబుక్ డక్ డబుక్ డక్ అని ఢక్కీ మోగిస్తూ వెళ్ళిపోయాడు.


వెన్న కరుగుతున్న కమ్మని వాసన. ముక్కు ఎగబీలుస్తూ వంటింట్లోకి వెళ్ళాను. భగభగమని మండుతున్న పొయ్యి మీద పసుపురాసి కుంకుమ పెట్టిన ఇత్తడి గిన్నె. పక్కనే చిన్న పొయ్యి మీద నేతిలో జీడిపప్పు వేపుతూ ఉంది అమ్మమ్మ. కత్తిపీట ముందేసుకుని ఎరగడ్డలు కోస్తూ ఉంది చిన్నమ్మమ్మ. 

నన్ను చూడగానే "నాయనా, యాలక్కాయల రొన్ని మీ అమ్మకిచ్చా పొడిగొట్టమని జెప్పు." అంటూ ఏలకుల డబ్బా ఇచ్చింది.
"గబాగబా కానీకా ఈ పాటికి గంపలెత్తుకుని వస్తా వుంటారు." తొందర పెట్టింది చిన్నమ్మమ్మ.
"ఎవరొస్తారమ్మమ్మా" అడిగాను
"ఈ రోజు పండగ్గద్నాయనా చాకలోళ్ళు, మంగలోళ్ళు ఇంకా పొలం కాడ్నుండి సేద్దిగాళ్ళు అందరూ వస్తళ్ళా వాళ్ళకు నిప్పట్లు, మణుగుబూలతో పాటు అన్నం కూర్లు గూడా బెట్టాలి." చెప్పింది.
"ఎందుకమ్మమ్మా వాళ్ళు జేసుకోరా?" అడిగాను.
"పోద్దులొస్తం మన పన్లే జేస్తంటిరే నాయనా పండగ నాడైనా వాళ్ళకు మనం జేసుకున్నవి పెట్టబళ్ళా." చెప్పింది అమ్మమ్మ.

ఇంతలో వీధిలో చిరుతలతో తాళం వేస్తున్న శబ్దం, లయగా గజ్జెల చప్పుడు వినిపించాయి. గుమ్మం పట్టుకుని వెనక్కి వంగి చూస్తే "హరిలో రంగ హరి" అని పాడుతూ హరిదాసు. బిక్ష్యం వెయ్యడానికి పెట్టిన చేటలో నుండి దోసిటి నిండుగా బియ్యం తీసుకుని వెళ్ళాను. హరిదాసు మోకాలి మీద కూర్చుని బియ్యం అక్షయ పాత్రలో వేయించుకుని "చిరంజీవ చిరంజీవ" అని దీవించి వెళ్ళిపోయాడు.

"పాపా, అరిటాకులు గోసుకు రమ్మని శేష్మామయ్యకి జెప్పి వొకాకిటు దీసకరా" చెప్పింది పిన్ని. ఆకు తీసుకుని వెళ్ళేసరికి దేముడికి ఎదురుగా ఒక పీట మీద పళ్ళెంలో టెంకాయ, కర్పూరం సాంబ్రాణి కడ్డీలు, ఇంకో పీట మీద కొత్త బట్టలు పెట్టున్నాయి. అమ్మ దీపం వెలిగిస్తూ ఉంది. "ఎందుకుమా ఇక్కడ బట్టలు పెట్టారు?" అడిగాను. పెద్ద పండగ్గద పాపా పెద్దలకి బెట్టాల" చెప్పింది. "ఓ ఇవి అమ్మమ్మకా" అడిగాను. "మీ అమ్మమ్మకి కాదు, మా అమ్మమ్మకీ, నాయనమ్మకీ ఇంకా పెద్దవాళ్ళకి" చెప్పింది అమ్మ. ఆశ్చర్యంగా చూశాను. ఎందుకంటే వాళ్ళెవరినీ నేను ఎప్పుడూ చూడలేదు మరి. "దేవుడి కాడికి బోయినోళ్ళకి పాపా" నా ఆశ్చర్యం గమనించి చెప్పింది పిన్ని.

అమ్మమ్మ వచ్చి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి గంట గణగణ మోగిస్తూ హారతిచ్చింది. అందరం దండం పెట్టుకుని హారతి కళ్ళకద్దుకున్నాం. ఇంకో పీటమీద అరిటాకేసి తీప్పొంగలి, వడలు, పులుసన్నం, దోసకాయ పచ్చడి, ఉర్లగడ్డ తాళింపు, అన్నం, నెయ్యి, పప్పులుసు, పెరుగు వరుసగా వడ్డించారు అమ్మ, పిన్ని.

"ఏం జోతా యెట్టా వుంద మా ఊర్లో పండగ?" అందరం అన్నాలు తినేసి వరండాలో కూచోగానే అడిగింది చిన్నమ్మమ్మ.
"పండగింకా యేడయింది పిన్నమ్మా. కనప్పండగ్గూడా గానీ అప్పుడు చెప్పద్ది " చెప్పాడు మామయ్య.



Saturday, January 12, 2019

భోగి పండగ

“మోవ్ ఈసారి అక్కోళ్ళు, పిలకాయలందరూ పండక్కొస్తళ్ళా. పెద్ద భోగిమంటెయ్యాల" అన్నాడు మామయ్య అమ్మమ్మతో.
"అట్నేలేరా. గెనెం మీద తాటాకులు కొట్టకరారాదా." సలహా ఇచ్చింది అమ్మమ్మ.
మామ్మయ్య భోగికి పదిరోజుల ముందే బోల్డన్ని తాటాకులు తెచ్చి సందులో ఎండబెట్టాడు.
*             *             *             *         *          *       *
"మాయ్ కోడి కూసింది. భోగిమంటేస్కోబళ్ళా. ల్యాండి ల్యాండి." అన్న అమ్మమ్మ పిలుపుతో మెలుకువ వచ్చింది.
"అప్పుడేనా?" దుప్పటి మొహం మీదనుండి తియ్యకుండానే అడిగాను.
"ఆ మీ మావయ్య లేచా తాటాకులు లాక్కొచ్చి రోడ్డుమింద యాస్తా వున్యాడు." చెప్పింది అమ్మమ్మ.
"దిబ్బకాడ ముట్టిబోయిన చీపుర్లు, ఇరిగి పోయిన తలుపురెక్క బెట్నాం. అయ్యిగూడా రోడ్డుమింద యాస్తన్నాడా? అడిగింది పిన్ని.
"యేవోనమ్మా నే జూళ్ళేదా."చెప్పింది అమ్మమ్మ.
"నేంబొయ్యి చూసొస్తానుండు పిన్నీ" అంటూ లేచి దుప్పటి చుట్టూ చుట్టుకుని పరిగెత్తి వీధిలోకి వెళ్ళాను. అప్పటికే తాతయ్య దిబ్బపక్కనున్న విరిగిపోయిన సామాన్లని వీధి పక్కన పేరుస్తున్నాడు.
"ఏం జోతా లేచినావా? రా ఇటు గూచో యెచ్చంగుంటది." పోగేసిన తాటాకులకు నిప్పంటిస్తూ చెప్పాడు మామయ్య. దుప్పటి కింద పడకుండా జాగ్రత్తగా మడుచుకుంటూ కూర్చున్నాను. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి మంట చుట్టూ కూర్చున్నారు. ఎర్రగా మొదలైన చిన్న మంట చూస్తుండగానే రాజుకుని నిప్పు రవ్వలు పైకి లేవడం మొదలుపెట్టాయి. మంటకు అరచేతులు అడ్డం పెట్టి వెచ్చగా చలి కాచుకుంటున్నాం. ప్రతి ఇంటి ముందు ఎర్రెర్రని మాటలు. ఇంటెల్లపాది మంట చుట్టూ చేరడంతో వీధి వీధంతా సందడిగా ఉంది.
"మాయ్ ఇంకా మంటకాడ్నించి లేచా తలకుబోసుకోండి. అట్నే పిలకాయలగ్గూడా తొందరగా తలకులు బొయ్యండి." చెప్పింది అమ్మమ్మ. ఎప్పుడు స్నానం చేసిందో గచ్చకాయ రంగు చీరకి మామిడి పిందెల అంచున్న పాటూరి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉప్పు మిరియాలు కలగలిసినట్లుండే బారెడు జుట్టుకి కాశీ టవల్ చుట్టుకొనుంది.  
"నీర్జా కాస్త కుంకుడ్రరసం దీసి అక్కకీ." అంటూ చిన్నపిన్నికి పురమాయించింది.
స్నానం చేసి వంటింట్లో కొచ్చేసరికి మసాలా ఉడుకుతున్న ఘుమఘుమలు, పెనం మీద నుండి సుయ్ మన్న శబ్దం వినిపిస్తోంది. సన్నికల్లు మీద వేరుశనక్కాయల పచ్చడి నూరుతోంది అక్క.
"అప్పుడే దోశలు పోస్తున్నావా?" అడిగాను అమ్మమ్మని.
"అప్పుడే యేవా ఏడవతళ్ళా. నీళ్ళు బోసుకున్నా, దేవుడికి దణ్ణం పెట్టుకురాపో" చెప్పింది అమ్మమ్మ.
"దండం పెట్టుకునే వచ్చా." సమాధానం చెప్పాను.
"అదిగో ఆ తలుపెనకాల పీటలుండాయ్. ఇటు వాల్చు నాయనా. అట్నే ఆ పళ్ళాలు ఇట్దీసకరా." అంది పెనానికి నూనె రాస్తూ. పొయ్యిలో కట్టెల మీద నిప్పులు కణకణ మండుతున్నాయ్. మంట పెనం కిందంతా పరుచుకుంటోంది.
అమ్మమ్మ చెప్పినట్లుగానే చేశాను. అక్క నూరడం పూర్తిచేసి గిన్నెలోకి పచ్చడి తీస్తోంది. స్నానం చేసిన వాళ్ళు ఒక్కొక్కరే వంటింట్లోకి వస్తున్నారు. పళ్ళెంలో దోశ వేసి పక్కనే కోడి కూర కూడా వేసి నా ముందు పెట్టింది అమ్మమ్మ. ఇంతలో "వొరెవొరెవొరె అందరూ ఈడ్నే ఉండారే. ఎప్పుడొచ్చినారా? యేం ఆదిలచ్చమ్మా  దోశలు బోస్తండా?" అంటూ నేరుగా వంటింట్లోకి వచ్చాడు పక్కింట్లో ఉండే పెద్ద తాతయ్య.
"రామావా. పండగ్గదా, పిలకాయలంతా వొచ్చినారు." సమాధానం చెప్పింది అమ్మమ్మ.
"మేవొచ్చి నాల్రోజులవతా ఉంది పెదనాయినా, సూళ్ళూరుపేట బోయినావంట్నే, యెప్పుడొచ్చినావా?" అంటూ తాతయ్య కూర్చోడానికి పీట వాల్చింది అమ్మ.
"ఇప్పుడే యేడు గంటల బస్సుకొచ్చినా రాజమ్మా. రాంగానే విజ్యమ్మ జెప్పింది మీరంతా వచ్చుండారని, పలకరిచ్చి పోదావని వచ్చినా." పీట మీద కూర్చుంటూ చెప్పాడు తాతయ్య.
"మావకి రొంత కూరేసీ రాజమ్మా." అంటూ దోశలున్న పళ్ళెం అమ్మ చేతికిచ్చింది అమ్మమ్మ.
"నా కోడలు గూడా దోశలు బోస్తా వుండాది." మొహమాట పడ్డాడు తాతయ్య. పోస్తే పోసిందిలే మావా ఈడ గూడ దినొచ్చు. అయినా పిలకాయలంతా ఈడ్నే ఉంటే వాళ్ళు మాత్తరం ఎందుకాడ?"  అంది అమ్మమ్మ.
ఇంతలో "తాతయ్యా అమ్మా పిలస్తా వుంది." అంటూ తాతయ్య పెద్దమనవరాలు విజయొచ్చింది.
"యేమ్మే, మీ యమ్మగూడా దోశలు బోస్తా వుందా?" అడిగింది అమ్మమ్మ.
"ఇంకాలా నాయనమ్మా బుజ్జమ్మకు నీళ్ళు బోస్తా వుంది." చెప్పింది విజయ.
"మాయ్, ఇజ్యగ్గూడా పళ్ళెమీయండి. అని పిన్నితో చెప్పి, పాపా నువ్బొయ్యి అత్తని, మావని పిల్చకరా" పురమాయించింది అమ్మమ్మ.  
"యేంనా సూళ్ళూరుపేట యేం పని మీద బోయినావా?" అడిగాడు తాతయ్య.
"మన పెద యెంకట్రామిరెడ్డి లేడా గూడూర్లో, కూతురుకి సమ్బందాలు జూస్తా నన్నుగూడ పిల్చకపోయినాడు." చెప్పాడు పెద్ద తాతయ్య.
"సంబందం కుదిరినట్టేనా మావా?" అడిగింది అమ్మమ్మ.
"వాళ్ళు కట్నం లచ్చడుగుతుండారు. మన ఎంకట్రాముడు అంత ఇచ్చుకోలేడు."
"పిల్లోడు బాగుండాడా? ఆస్తేమాత్రం వుంటాదా?" అడిగాడు తాతయ్య.
"బాగుండేదేందిలేరా, మంచాస్తి. పదిహేనెకరాల మాగాణి ఏకచక్క. సమచ్చారానికి మూడు పంటలు పండే బూవి. మన నీర్జమ్మకు జూద్దామా?" అడిగాడు పెద్ద తాతయ్య.
"ఈ రోజుల్లో పంటలేంటికిలే మావా? మనం జాస్తళ్ళా యవసాయమా. వొక సంవచ్చరం వానలెక్కువ బడి పంట కుళ్ళిపోయ, ఇంకో సంవచ్చరం నీళ్ళే లేక కంకులెండిపోయ. పిలకాయలకెందుకులే ఆ బాదలు. ఆడపిలకాయలైనా సుబ్బరంగా చదూకుంటుంటిరే గవుర్నమెంటు ఉజ్జోగస్తునికిస్తే ఇద్దరూ ఉజ్జోగాలు జేసుకుంటా వాళ్ళ తంటాలేవో వాళ్ళు బడతారు." చెప్పింది అమ్మమ్మ.
"అదీ నిజమేలే." ఒప్పుకున్నాడు పెద్ద తాతయ్య.  
ఈలోగా పెద్ద తాతయ్య కోడలు పిండి గిన్నె ఎత్తుకుని వచ్చింది. అందరం ఆ పూట అక్కడే కడుపు నిండా దోశలు, కోడికూర దిన్నాం.

Thursday, January 10, 2019

నిప్పట్లు - మణుగుబూలు

అమ్మమ్మ వంటింటి పక్కనున్న వరండాలో కూర్చుని పెసలు విసురుతూ ఉంది. తిప్పడం ఆపినప్పుడల్లా గుప్పెడు గుప్పెడు పెసలు తీసుకుని జాగ్రత్తగా తిరగలి మధ్య గుంటలో పోస్తున్నాను. తాతయ్య గుమ్మం పక్కన కూర్చుని విస్తళ్ళు కుడుతున్నాడు. 

"ఎందుకు తాతయ్యా ఆ విస్తరాకులు?" అడిగాను.
"కుప్ప నూర్చేదానికి కూలోళ్ళు వస్తళ్ళా, వాళ్ళకు అన్నాలు బెట్టినప్పుడు కాబళ్ళా" చేస్తున్న పని ఆపకుండానే చెప్పాడు తాతయ్య.
"ఎంతమందొస్తారు తాతయ్యా?" అడిగాను.
"మీ మామయ్యా ముప్ఫైమందికి జెప్పొచ్చినాడు" అని నాతో చెప్పి. కోళ్ళెన్ని గావాల్న" అమ్మమ్మ నుద్దేశించి అడిగాడు.
"నాలుగన్నా గావద్దా? బదులిచ్చింది అమ్మమ్మ.  
"కోళ్ళెందుకు అమ్మమ్మా?"
"కుప్ప నూర్పిళ్ళప్పుడు కూలోళ్ళకు కోడి కూరొండి అన్నాలు బెట్టాల నాయనా." చెప్పింది అమ్మమ్మ.  

ఇంతలో గేటు దగ్గర చప్పుడయ్యింది. చూస్తే చిన్నమ్మమ్మ.
"ఏందికా రామ్మన్నావంట్నే?" ఎప్పుడొచ్చిందో గేటు దగ్గరే నిలబడి అడిగింది చిన్నమ్మమ్మ.
"గేటుకాడ్నించే అడగాల్నా. రామ్మే లోపలకా." పిలిచింది అమ్మమ్మ.
"మళ్ళొస్తాలేకా. బర్రెలొచ్చేయేళవతావుళ్ళా ఇంటికి బోవాల. మందలేందో కనుక్కుందావని వచ్చినా."
"నీడ ఇంకా యాప చెట్టుగాడిగ్గూడా పోలా, బర్రెలప్పుడే యాడొస్తాయా? మీ అక్కేందో రాస్యం జెప్పాలంట రామ్మే" పిలిచాడు తాతయ్య.
"నీక్దెలీని రాస్యాలు యాడుండాయి మావా మాకా" అంటూ నవ్వుతూ లోపలకి వచ్చి అమ్మమ్మ చేతిలోంచి తిరగలి పిడి తీసుకుని తిప్పడం మొదలు పెట్టింది.
"ఏంలేదు మే, పండగ దగ్గరకొస్తావుళ్ళా నిప్పట్లెప్పుడు జేద్దామా?" విసిరిన పెసర బద్దల్నిచాటలోకి ఎత్తుతూ అడిగింది అమ్మమ్మ.
"ఈ రోజు సోమ్వారం గదకా, బేస్తవారం జేద్దావా!"  
"అట్నేలే. అన్నట్టు నిప్పట్లీయేడు యెవురెవురికి పంపీయ్యాల?" అడిగింది అమ్మమ్మ.
"పిలకాయలకు పంపేదానికి తలో పాతిక. పండగరోజు కూలోళ్లు పదిమందన్నా రారా?"
"వస్తారు. ఇంకా కోటపాడుగ్గూడా పంపియ్యాల. పెదనాయన చనిపోయిళ్ళా, వాళ్ళీ యేడు పండగ జేసుకోరు." చెప్పింది అమ్మమ్మ.
"ఇంకా చాకలోళ్ళు, మంగలోళ్ళు, బుడబుక్కలోళ్ళు, జంగం దేవర...ఓ ఐదొందల్దాకా జెయ్యాల." లెక్క తేల్చింది చిన్నమమ్మ. 
"ఆ.. అట్నే" చెప్పింది అమ్మమ్మ. 

"మణుగుబూలగ్గూడా బియ్యం నానెయ్యి. బేస్తవారం పొద్దున్నే బియ్యం నానబెడ్తె మద్దినేళకి పిండి గొట్టుకోవచ్చు. పొద్దున్నే సందులో గాడిపొయ్యి తొవ్వీడం మర్చిపోబాక." అంది చిన్నమ్మమ్మ.   
"అట్నేలేమ్మే. మణుగుబూ గిద్దలు సుబరత్నమ్మ తీసుకుపోయ్యుండాది. అయ్యి కూడా తెప్పీయ్యాల." పెసలు పోసిన టిఫిన్ కేన్ మూతబెట్టింది అమ్మమ్మ.
"నిప్పట్లు ఒత్తేదానికి ముత్తయ్యను గూడ పిలిపిచ్చు."

"సరుకులెన్ని గావాల? బియ్యం నాల్గుమానికలు సరిపోతాయా?" అడిగింది అమ్మమ్మ.
"సాలకేం జేస్కోనుకా. బెల్లం తులం బడద్దేమో. ఏలక్కాయలు ఏబళం, నూనె నాలుగు శేర్లు" వరుసగా లెక్క చెప్పింది చిన్నమ్మమ్మ.  
"శెట్టి కొట్టుకాడ అన్నీ దెప్పిచ్చి పెడతా. బేస్తవారం కాస్త పెందలాడేరా."
"రవన్ని సజ్జ బూరెలు గూడ జేయ్ గూడదా" అడిగాడు తాతయ్య.
"ఏం మావా, సజ్జబూరెలు దినాలనుందా, అట్నేలే. సజ్జలు గూడ దెప్పిచ్చి పెట్టుకా. మూడవతా ఉంది ఇంక నేబోయోస్తా." అంటూ లేచి చీర కుచ్చిళ్ళు దులుపుకుని చక్కాబోయింది చిన్నమ్మమ్మ.  
తాతయ్య విస్తళ్ళు కుట్టడం పూర్తి చేసి ఆకుల మీద తిరగలి ఉంచాడు అణగడానికి.  

Wednesday, December 26, 2018

ముగ్గులు

ఎనిమిదిన్నర అవుతుండగా వీధిలో సందడి మొదలయ్యింది. ముగ్గు గిన్నె పట్టుకుని నేను అక్కా బయటకు వచ్చాం. అప్పటికే పక్కింటి చిట్టెక్క చుక్కలు పెడుతూ ఉంది.
"ఏం జోతా ముగ్గెయ్యడానికి వచ్చినారా?" అడిగింది పక్కింటి చిట్టెక్క.
"లేదుమే ముంజెల్దిండానికి వచ్చినాం, మొహం జూడు మోహమా. ఎన్మిదిగంట్లకు ఎందుకొస్తాంమే" పరాచికాలాడింది అక్క.
నవ్వేసింది చిట్టెక్క. "పెద్దత్తోళ్ళు గోడొచ్చినారా?"
"ఆ వచ్చుండారు." అని అక్క చెప్తుండగానే అమ్మ, పిన్ని బయటకు వచ్చారు. "కా చుక్కలు బెట్టవా? 25 చుక్కలు 5 వరసలు బేసిచుక్క 5 కి ఆపాల." అమ్మ చేతికి ముగ్గు గిన్నె ఇచ్చి చెప్పింది అక్క. అమ్మ చుక్కలు పెడితే సరిగ్గా గీత గీసినట్లు ఉంటుందని ఆ పని అమ్మకే అప్పగిస్తారు.

"ఏం, చిట్టెమ్మా బావుండాా? మీ అమ్మేదా?" అడిగింది అమ్మ.
"నాయనకన్నం పెడతా ఉందత్తా. అబ్బయ్య ఏడా? మావ గూడ వచ్చినాడా?"
"ఆ అందరం వచ్చినాం. అబ్బయ్య నిదరబోతా ఉండాడు. మీ మావ, చినమావ లీలామహల్ లో ఇంగ్లీషు సినిమాకు బొయినారు."
చిట్టెక్కతో మాట్లాడతూనే చకచకా చుక్కలు పెట్టేసింది అమ్మ. పిన్ని ముగ్గువెయ్యడం సగంలో ఉండగానే నేనూ, అక్కా ముగ్గులో రంగులు వెయ్యడం మొదలుపెట్టేశాం. చూస్తుండగానే చిలుకలు జాంపళ్ళతో సహా వాకిట్లో వాలిపోయాయి.

ముగ్గు చుట్టూదిరిగి ముచ్చటగా చూస్తున్న మాతో "మాయ్, తొమ్మిదింకాలౌతావుంది. రాండి లోపలకి." పిలిచింది అమ్మమ్మ.
"మీరు బోయి పొణుకోండిమా చుట్టుకర్ర గీసొస్తా౦." చెప్పింది పిన్ని.
"ముగ్గిన్నె అమ్మకీ నీర్జా తొందరగా గీస్తదా" అంది అమ్మ.
"చాన్నాళ్ళయిందే ముగ్గేశా" అంటూనే ఆ ముగ్గు గిన్నె తీసుకుని అమ్మమ్మ ఐదువేళ్ళు ఇలా కదిలించిందో లేదో వరుసగా నాలుగు గీతలు పడ్డాయి నేలమీద. ఐదే ఐదు నిముషాల్లో చుట్టూ దడిగట్టి ద్వారాలు పెట్టినట్టు చుట్టుకర్ర గీసేసింది.
"నీర్జా, ఆ వీధి మొగదాల ఇంట్లో సుబ్బమ్మత్త నడిగితే పశులకాడి పిల్లోడితో ఆవు పేడ పంపుండాది. రేపెకొంజావునే గొబ్బెమ్మలు జేసి, వాటిమింద మన సందులో గుమ్మడిపువ్వులు నాలుగు బెట్టండి." చెప్పింది అమ్మమ్మ.

"అట్నే మా. మీరు లోపలకు పాండి. ఐద్నిమిషాల్ అట్టా బోయి ముగ్గులు చూసోస్తాం. అంటూ భుజం చుట్టూ కొంగు కప్పుకుంది పిన్ని. ముగ్గేసేటప్పుడు తెలియలేదు కాని మంచు కురవడం మొదలై చలిగా ఉంది. ప్రతి ఇంటి ముందూ ఇద్దరూ ముగ్గురూ ఆడవాళ్ళు ముగ్గు వేస్తూనో, చూస్తూనే వీధంతా సందడిగా ఉంది. ముగ్గేసేవాళ్ళను పలకరిస్తూ వీధంతా చుట్టి వచ్చాం.

* * * * * * *

ఉదయాన్నే తమ్ముడు లేచి ముగ్గు చూస్తూ వాకిలి దగ్గర నిలబడ్డాడు.
"ఏం సుధాకరా, ముగ్గు బావుండాదా?" అడిగింది పిన్ని.
తల ఊపుతూ "ముగ్గు చుట్టూ ఎందుకు పిన్నీ గీతలు గియ్యడం" అడిగాడు తమ్ముడు.
"గీయకయకపోతే మీ చిలకలెగ్గిరి పోవా?"ఎప్పుడొచ్చిందో వెనకింటి గౌరమ్మత్త ముగ్గు వెనకాల నిలబడి నవ్వుతూ అంది.
"మరి మూడు పక్కలా ఆ దార్లేందుకు?" అడిగాను.
"ఈదిలో పిల్లి తిరగతా ఉండాదబయా. పిల్లొస్తే చిలకలు పారిపోయ్యేదానికి" చెప్పింది అత్త.


Saturday, December 22, 2018

పండగనెల

పండగనెల పెట్టి వారమౌతోంది. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. రంగుల ముగ్గులు, మెలికల ముగ్గులు, నెమళ్ళు, చిలకలు, తామరపూల ముగ్గులు.. ఒకటేమిటి ప్రకృతినంతా పటం గట్టి ముచ్చటగా ఇళ్ళ ముందు అలంకరించేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళింట్లో అమ్మమ్మతో సహా అందరిదీ అందె వేసిన చెయ్యే. అమ్మమ్మ వాళ్ళింట్లో వారిని పరిచయం చేసుకోవాలంటే ఇలా వెళ్ళండి. వాకిట్లో ముగ్గులు వంటింట్లో దోశలు 

*            *            *           *            *           *          *          *

ఉర్లగడ్డ తాళింపు, మునగాకు పెసర పప్పు కూర, వంకాయ పులుసుతో సుష్టుగా భోంచేసి మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యగదిలోకి చేరాం నేనూ, పిన్ని, అక్క.

"ఏంకా ఈ రోజేం ముగ్గేద్దామా?" ముగ్గుల పుస్తకం పేజీలు  తిప్పుతూ అడిగింది అక్క.
"మొన్న ఆదివారం పేపర్లో వేసిళ్ళా...తామర పూల ముగ్గు. అదేద్దామా?" అడిగింది పిన్ని.
"వద్దులేకా. నాల్రోల నాడు సెట్టిగారి వందన అట్టాంటి ముగ్గే ఏసిళ్ళా" అక్క గుర్తుజేసింది.
"అవునుమే. అయితే బళ్ళేదులే. ఈ చిలకల ముగ్గు జూడా" ఓ పేజీ చూపించింది పిన్ని.
"బావుందికా. రంగులన్నీ ఉండాయా?చిలకపచ్చ, ఎరుపు రంగు ముక్కుకి, లేతాకుపచ్చ జామకాయలకు."
"పాపా ఆ కొట్టుగదిలో రంగుల డబ్బాల్లో ఈ రంగులుండాయేమో జూసిరా? చెప్పింది పిన్ని.
కొట్టుగదిలోకి వెళ్లాను. పాత ఇనప డబ్బాల్లో రంగులు పోసి ఉన్నాయి. ఎరుపు, బులుగు, ఆకుపచ్చ, చిలకపచ్చ, పసుపు ఇలా చాలా రంగులు ఉన్నాయి. అందులో అక్క చెప్పిన రంగుల డబ్బాలు తీసుకొచ్చాను.
"పిన్నీ సరిపోతాయా?"
"ఆ.. సరిపోతాయి. సాయంత్రమే కళ్ళాపి జల్లేసి రాత్రి అన్నాలు దిన్నాక ముగ్గు మొదలు బెడదాం." చెప్పింది.
ఏడవగానే అన్నం తినేసి ముగ్గు డబ్బా తీసుకొచ్చాను.
"కాసేపు తాలి ఏద్దుర్లే నాయినా. రోడ్డుమీద ఇంకా సైకిళ్ళు పోతా ఉళ్ళా." చెప్పింది అమ్మమ్మ.

ఆ ముగ్గు డబ్బాలన్నీ వరండా చివరగా ఉన్న అరుగు మీదకు చేర్చాను. వరండాలో గోడ పక్కన తెల్ల పెయింట్ తో మెలికల ముగ్గు వేసివుంది. మధ్యలో మరో పెద్ద ముగ్గు. వరండా మెట్లు దిగి వీధి వైపునున్న ఇనుప గేటు దగ్గరకు వచ్చి చూశాను. అక్కడక్కడా వీధి దీపాల వెలుగుతో రోడ్డు మెరుస్తోంది. దూరంగా అక్కడో సైకిల్, ఇక్కడో రిక్షా కనిపిస్తూ ఉన్నాయి. వీ ధిలో ఇంకా ఎవరూ ముగ్గు వెయ్యడం మొదలు పెట్టలా. కాసేపట్లో ప్రతి ఇంటి బయట ముగ్గులు, రంగులతో హడావిడి మొదలవుతుంది.

Monday, November 12, 2012

నరకచతుర్దశి

       "రేపెకొంజావునే లేవాల తొందరగా పడుకోండి" రాత్రి పదైనా కూడా నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్న మమ్మల్ని హెచ్చరించి౦దమ్మమ్మ. ఇంకా కబుర్లు చెప్పుకోవాలని వున్నా ఉదయన్నే లేస్తే కొన్ని టపాసులు కాల్చుకోవచ్చని పడుకున్నాం. నరకచతుర్దశి నాడు పూర్తిగా తెల్లవారిపోతే కాల్చనీయరుగా, అప్పుడు కాకపోతే టపాకాయలు కాల్చడానికి మళ్ళీ దీపావళి రోజు సాయంత్రం వరకూ ఆగాలి.

       ఉదయం లేచేప్పటికి ఇంకా చీకటిగానే వుంది. కొబ్బరాకుల మధ్యన ఆకాశం గులాబి రంగులో కనబడుతోంది. మేడపైన రాత్రి నా పక్కన పడుకున్న వాళ్ళెవరూ కనిపించలేదు, కిందకు దిగి వచ్చేసరికే ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయి. అసలయితే ఇల్లంతా లైట్లు వేయడం అమ్మమ్మకు ఇష్టం ఉండదు. "ఎందుకమ్మా కరెంటు కర్చా, కిటికీ తలుపుల్దెరిస్తే పోలా" అంటుంది కాని ఇవాళ తెల్లవారకుండానే లేచామేమో కిటికీ అవతల కూడా చీకటిగానే వుంది.

      సందులో పొయ్యి మీద పే...ద్ద జర్మన్ సిల్వర్లో దబరలో నీళ్ళు కాగుతున్నాయి. నారింజ రంగులో పైకి లేచిన మంట భగాభగా మండుతూ దబర చుట్టూ మూత దాకా పాకుతోంది. ఉదయం చలికి ఆ మంట దగ్గర వెచ్చగా కూర్చుని అరచేతులకు సెగ చూపిస్తుంటే "నీళ్ళు కాగినాయి నాయనా, మావయ్యనా బావిలోంచి నీళ్ళు తోడి గంగాళంలో పొయ్యమన్జెప్పు" చెప్పిందమ్మమ్మ. "మావయ్యా" అని పిలుస్తూ బావి దగ్గరకు వెళ్ళేసరికే గంగాళం నిండుగా నీళ్ళు తోడున్నాయి. పక్కనే వున్న బిందెల్లో, బక్కెట్లల్లో కూడా నిండుగా నీళ్ళున్నాయి.

      "అమ్మమ్మా మామయ్య నీళ్ళు తోడేశాడు" అక్కడ్నుంచే  అరిచాను.
"దబర కాలిపోతావుంది, వేడ్నీళ్ళు తెస్తన్నానడ్డ౦ రాబాకండి" అంటూ సందులోంచి వేడి నీళ్ళు తెచ్చిందమమ్మ. "అన్నిట్లో నిండా తోడ్నారు ఎక్కడ్నే వేడి నీళ్ళు పోసేదా...వాకిట్లో నీళ్ళు జల్లను పిన్ని బక్కెనెత్తుకపోయింది, ఖాళీ అయిందేమో జూసి తీసకరా నాయనా" అని మళ్ళీ నన్నే పంపింది. ఒక బక్కెనలో సగం నీళ్ళు కింద పొయ్యొచ్చుగా! ఊహు..పొయ్యదు. పైగా నేను కనుక చెప్పాననుకోండి "ఎందుకమ్మా ఉర్దాగా పారబొయ్యడమా" అంటుంది. వాకిలి దగ్గరకు వెళ్ళేసరికి పిన్ని నీళ్ళు చల్లేసి ముగ్గేస్తూ వుంది. అప్పటికే పిన్ని స్నానం చేసి తలకు తెల్ల టవల్ చుట్టుకుని వుంది. ఖాళీ బక్కెన తీసుకుని బావిదగ్గరకు వెళ్ళగానే అమ్మమ్మ సగం వేడ్నీళ్ళు సగం చన్నీళ్ళు ఆ బక్కెట్లో పోసి వేళ్ళు తగిలించి చూసింది. "అబ్బ...ఖాలి పోతన్నాయే" అంటూ ఇంకో రెండు చెంబులు పోసి మళ్ళీ పరీక్ష చేసి "ఇజ్యమ్మా పాపకు తలకు బోద్దువురా" అని అమ్మను పిలిచింది.

     అమ్మ ఆనంద కలరు కొత్త పావడా, జాకెట్టు తీసుకుని వచ్చింది. నాకైతే పట్టులంగా వేసుకోవాలని వుంది కాని, అది దీపావళికని చెప్పిందిగా అమ్మ, అందుకని స్నానం అవగానే ఆ కొత్తబట్టలు వేసుకున్నాను. అమ్మ తమ్ముడికి బావి గట్టుమీదే నీళ్ళు పోసినట్టుంది, మధ్యగదిలో పలుచని టవల్ చుట్టుకుని ఎగురుతున్నాడు. దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుని వరండాలోకి వెళ్ళేసరికి వీధిలో కొద్దిగా వెలుతురు కనిపిస్తోంది. వాకిట్లో గేటు పక్కనున్న రెండు స్థంభాల మీద రెండు దీపాలు వెలుగుతున్నాయి. వరండాలో కాకరప్పూవ్వొత్తులు, సీమ టపాకాయలు, లక్ష్మీ బాంబులు పెట్టి వున్నాయి

      నేను తమ్ముడూ కాకరప్పూవ్వొత్తులు వరండా గట్టుమీద నిలుచుని దూర౦గా పట్టుకుని కాలుస్తుంటే మామయ్యలిద్దరూ లక్ష్మీ బాంబులు ఇంటిముందు వీధిలో పెట్టి కాకరపువ్వొత్తితో పేలుస్తున్నారు. ఎంత ధైర్యమో! పిన్ని కూడా భయ౦ లేకుండా సీమటపాకాయల్ని కొవ్వొత్తితో అంటించి వీధిలోకి విసిరేస్తే టపాటపా, ఢమాఢమా అని ఒకటే శబ్దం. మామయ్య తమ్ముడ్ని ఎత్తుకుని వీధిలోకి తీసుకెళ్ళి లక్ష్మీ బాంబు పేలిస్తే, వాడు భయ౦తో కెవ్వున ఏడవడం మొదలెట్టాడు. "పసిపిలకాయల్ని ఎందుకురా ఏడిపిస్తారా, మీ పాటికి మీరు కాల్చుకోకుండా" అని తాతయ్య అంటే, "వాడికి భయం పోగొట్టాలన్లే బాబా" అని నవ్వేశాడు శేష్మావయ్య

      సాయ౦త్రం నేను, తమ్ముడు, శ్యామ్మావయ్య, శేష్మావయ్య రచ్చబండ దగ్గరకు వెళ్ళాం. అక్కడ గడ్డి నరకాసురుణ్ణి కాలుస్తారుగా! నరకాసురుడు తగలబడిపోతుంటే అందరం చప్పట్లు కొడ్తాం. అసలైతే అలాంటి పని చేస్తే పెద్దవాళ్ళు కోప్పడతారు. కాని నరకాసురుడు రాక్షసుడు, పైగా అందర్నీ బోలెడు బాధలు పెడుతున్నాడని సత్యభామా దేవి అప్పుడెప్పుడో చంపేసిందిట. ప్రజలకు రాక్షసుని బాధ తొలగినందుకు సంతోషించి అందుకు గుర్తుగా ఇప్పుడు ఇలా నరకాసురుడు తగలబడిపోతున్నందుకు చప్పట్లు కొడతామన్నమాట. గడ్డి నరకాసురుడిలో పెట్టిన టపాసులన్నీ ఢా౦ఢా౦ అని పేలిపోయి అక్కడా ఇక్కడా పడి గడ్డి పూర్తిగా కాలిపోయేదాకా చూసి ఇంటికొచ్చేశా౦. రేపే అసలు పండుగ దీపావళి.

Wednesday, August 22, 2012

ఏటొడ్డున నీరెండలో...

      సాయంత్రం నాలుగయింది. వేపచెట్టు నీడ ఇంటిమీద పడుతోంది. వీధి వాకిలి పక్కనున్న చంద్రకాంతలు అందంగా విచ్చుకు౦టున్నాయి. దక్షిణపు గాలికి జాజితీగ వయ్యారంగా ఊగుతోంది.

"బాబాయ్ పొలానికెళ్దామా?" అడిగాను.
"అప్పుడేనా? ఇంకా ఎండ పూర్తిగా తగ్గలేదు. ఓ అరగంటాగి వెళ్ళండి." చెప్పిందమ్మ.
"మాపటెండేలే, సల్లగుంటదొదినా, మరీ ఆల్సెమైతే పొద్దుగూకుద్ది" అ౦టూ బండి కట్టడానికి బయటకు వెళ్ళాడు బాబాయి.

         మొహం కడుక్కుని పౌడర్ రాసుకుని తయరయ్యేప్పటికి పోలీస్టేషన్ వీధిలో వుండే పెద్దత్త, సీనుమామయ్య, వాళ్ళ పిల్లలు విజయ, రాజు వచ్చారు. ఉదయాన్నే అత్తావాళ్ళి౦టికెళ్తే ఇటుకరంగు పోలీస్టేషన్ ముందు నిక్కరు చొక్కా వేసుకున్న పోలీసులు౦టారా, వాళ్ళను గోడ చాటునుండి నక్కి నక్కి చూడాల్సిందే, వాళ్ళక్కాని కనపడ్డామా జైల్లో పెట్టేస్తారు. అసలే అన్నం దగ్గర గొడవ చేసిన విషయం అమ్మ చెప్పేసుంటది కదా. నాన్నకు మాత్రం వాళ్ళను చూస్తే అస్సలు భయం వెయ్యదు. ఎదురుగా పొయ్యి "ఏం వెంకటేశులూ కేసులేమైనా ఉన్నాయా?" అని అడుగుతారు. పోలీసు కూడా నాన్నతో నవ్వుతూ మాట్లాడతాడు. సరే సరే ఆలశ్యం అయిపోతుంది, ముందు పొలానికెళ్ళి అక్కడ కబుర్లు చెప్పుకుందాం.

        బాబాయ్ ఎద్దులబండిని ఇంటిముందుకు తీసుకొచ్చి
"హే..హే డుర్" అంటూ ఎద్దులు బెదరకుండా వాటిని నిమురుతూ నిల్చున్నాడు. పిల్లలం బండి జల్లలో కూర్చున్నాం. బాబాయి ఎద్దుల్ని అదిలిస్తూ నగ మీద కూర్చున్నాడు. బండి గతుకుల్లో పడి ఊగుతూ ముందుకు కదిలింది. నాన్న, మామయ్య వెనుగ్గా నడుస్తూ వస్తున్నారు. 

"రావకిష్ణా ఎప్పుడొచ్చినార?" నీరుకావి పంచె కట్టుకుని కర్ర మేడమీద అడ్డంగా పెట్టి రెండు చేతులూ దానిమీద వేసి ఎదురుగా నడుస్తూ వస్తున్నాయన నాన్నని అడిగాడు.
"పొద్దునొచ్చాం చిన్నాయనా, చిన్నమ్మ బావుందా?" అడిగాడు నాన్న.
"మీ సిన్నమ్మకేమా..బెమ్మాండంగుండాది. పిలకాయల్ని తీసుకుని పొలానికి బోతండారా?" బండిలో వున్న మావైపు చూస్తూ అన్నాడు.
"తాటికాయలు కొట్టిద్దామని తీసకపోతండా౦" నవ్వుతూ చెప్పాడు బాబాయి. అసలు బాబాయి ఏం మాట్లాడినా నవ్వుతూనే మాట్లాడుతాడు.
"మీ నాయన నెల్లాళ్ళనుండీ ఆ తూరుపు గట్టుమీద తాటికాయల్ని ఎవుర్నీ గొట్టనీలా. మీకోసరం దాసిపెట్టుండాడు." అని నాన్నతో చెప్పి, "పెందలాడే ఎనిక్కి రాండి. పొద్దుబోతే పురుగూ, పుట్రా తిరగత౦టయ్" అని బాబాయికి జాగ్రత్త చెప్పాడు.

"అట్నేలే చిన్నాయనా" అంటూ బాబాయి ఎద్దుల్ని అదిలించాడు.
వీధి మలుపు తిరిగి ఎత్తరుగుల ఆది శేషారెడ్డిల్లు దాటగానే బుజం మీద బట్టల మూట పెట్టుకుని చాకలి సుబ్బమ్మ కనిపించింది.
"ఎవురీ పిలకాయల సీతారామా? అంటూ బాబాయిని అడిగింది.
"సూపు కాన్రావడం లేదా యేంది? మా పిలకాయాలే గదా" చెప్పాడు బాబాయి.
"ఒరె ఒరె...కనుక్కోలేక పోతినే, అమ్మాయి బాగా పొడుగైపోయిళ్ళా. ఏం జోతమ్మా బాగుండారా?" అంటూ అడిగింది.
"ఆ" అంటూ తల ఊపాను.
"రావకిష్టయ్యా బావుండా, కోడల్రాలా?" పరామర్శించింది సుబ్బమ్మ.
"వచ్చింది సుబ్బమ్మా, ఇంటిదగ్గరుంది." చెప్పాడు నాన్న.
"పొలానికి బోతండారెట్టా, రవణయ్య మావ పొలంలో సీమసింత కాయలు ఇరగ్గాసుండయ్, పిలకాయలకి నాలుగ్గాయలు గోసీ౦డి" అంటూ బోయింది.

       దాదాపుగా ఊరి చివరికు వచ్చేశాం, చిన్న చిన్న తాటాకు గుడిసెల ముందు పిల్లలు మాత్రమే వెళ్ళగలిగే బుల్లి గుడిసెలు వున్నాయ్.
"అవేంటక్కా?" అడిగాడు తమ్ముడు. 

"పిల్లలాడుకోవడం కోస౦ చిన్న ఇళ్ళు కట్టారు." ఆ ఇళ్ళు చూసి ముచ్చటపడిపోతూ చెప్పాను. విజయ కిసుక్కున నవ్వింది.
"అయ్యాడుకునే బొమ్మరిళ్లు కాదు సురేషా, పందుల కోసం యేస్తారా గుడిసెలు." తమ్ముడి సందేహం తీర్చాడు బాబాయ్.
"నవీన్ వాళ్ళు కుక్కపిల్లను పెంచుకున్నట్లు వీళ్ళు పంది పిల్లల్ని పెంచుకుంటారా బాబాయ్?" అడిగాను. ఈ మాటకు అందరూ నవ్వారు. ఏదో చెప్పారు కాని నవ్వినందుకు అసలే వుక్రోషంగా వున్నానేమో ఏమీ వినపడ్లేదు.

       మాటల్లోనే ఊరు దాటేశా౦. దారి పక్కనంతా చిల్లచెట్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఓ నాలుగు బర్రెలు మెల్లగా నడుస్తూ వస్తున్నాయ్. అందులో ఒక దానిమీద చొక్కాలేకుండా నిక్కరు మాత్రమే వేసుకుని చేతిలో కర్ర పట్టుకుని "డుర్ డుర్" అని బర్రెల్ని అదిలిస్తూ ఒక 
చిన్నబ్బాయ్ కూర్చునున్నాడు. 

"ఏం కిట్టిగా మేతేడన్నాదొరికినాదిరా?" మామయ్య అడిగాడు.
"దక్షిణప్పొలంలో కాస్త గడ్డి పెరిగుండాదయ్యా. ఆడికే తోలుకుపోయ్యా పసుల్ని." చెప్పాడా అబ్బాయి.
"ఏం కిష్టయ్యా స్కూలికి బోవటంలా?" అడిగాడు నాన్న.
"ఈడా... పలకా బలపం గొనిచ్చి బళ్ళో యేస్తే, ఈడు బడికి బోకుండా రోజంతా పోలాలెంబడి దిరిగి చెర్లో దూకి రౌడిగాళ్ళ సావాసం తగులుకున్నాడని ఈడి నాయన వెంకట్రెడ్డి కాడ పాలేరు పనికి బెట్టినాడు." చెప్పాడు బాబాయ్.
"ఈ పని బడికంటే సుకంగుళ్ళా" అంటూ నవ్వాడు మామయ్య.
కిష్టయ్య పళ్ళన్నీ కనిపించేలా నవ్వి రోడ్డు దిగుతున్న పశువుల్ని పక్కకు మళ్లిస్తూ వెళ్ళిపోయాడు. బండి మట్టిరోడ్డు వదిలి ఇసకదారి పట్టింది. కనుచూపు మేరలో సన్నపాయలాగ యేరు కనిపిస్తోంది.

        "బాబాయ్ ఆపవా ఇ౦క దిగి నడుస్తాం" అంటూ బండి ఆగకుండానే కిందకు దూకేశా౦. పరిగెడుతుంటే ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్నాయ్. "ఎంత వేగంగా వెళ్ళగలరో చూస్తాను" అన్నట్లు ఇసుక మాతో సవాల్ చేస్తోంది. చివరకు మేమే గెలిచాం. చల్లటి నీళ్ళలో నిలబడితే ఇసుక కాలికింద చక్కలిగింతలు పెడుతోంది. ఏటి పక్కన పొలం గట్టుమీద  తాటి చెట్లు నిండుగా 
గెలలతో పొడవుగా నిలబడి వున్నాయి. ఎండాకాలం అవడం వలన ఏటిలో నీళ్ళు తక్కువగా వున్నాయ్. పశువులని విప్పి మేతకోసం వదిలేసి మేమందరం ఏటికడ్డంగా నడిచి తాటిచెట్లదగ్గరకు వెళ్ళాం. 

      బాబాయి తాటినారతో చేసిన బంధం కాళ్ళకు కట్టుకుని, కొడవలి బొడ్లో దోపుకొని , రెండు చేతులతో చెట్టును పట్టుకుని, రెండుకాళ్ళతో మానుమీద ఎగురుతూ చూస్తుండగానే తాటిమోవిపైకి వెళ్ళిపోయాడు. కొడవలి తీసి గెలమీద కొట్టగానే గెలతో సహా కాయలు కింద పడ్డాయి.

        "అమ్మాయ్ ఎనిక్కి రాండి. దూరం జరగాల" అంటూ మామయ్య హెచ్చరిస్తూ కిందపడిన తాటికాయను ఎడం చేత్తోపట్టుకుని కుడిచేత్తో కొడవలితో చెక్కేసి ఇచ్చాడు. ఆకాశంలో చందమామ మూడు ముక్కలై౦దా అన్నట్లు మూడు కళ్ళతో తాటికాయ ఎంత౦దంగా వుందో, తాటిముంజ కింద కదులుతూ నీళ్ళు. "గుడ్డల మీద పోసుకోకుండా తినండి. నీళ్ళు మీదపడితే గుడ్డలు పాడైపోతాయ్" చెప్పాడు బాబాయ్. మామయ్య కాయలు కొట్టిస్తూ వుంటే ఎన్ని కాయలు తిన్నామో లెక్కేలేదు. తమ్ముడికోసం బాబాయి కొడవలితో ము౦జెను పైకి తీసి ఇచ్చాడు. మామయ్య తాటాకు తిరగతిప్పిన గొడుగులా చేస్తే, అందులో కొన్ని ముంజెలను వేసి చివర ముడేసాడు బాబాయ్.

       కాసేపు ఇసకలో ఆడుకున్నాక, "నాన్నా నీళ్ళు కావాలి" అడిగాడు తమ్ముడు. నాన్న ఇసుక తవ్వి చెలం తీశాడు. చూస్తూ వుండగానే అందులో నీళ్ళూరాయి. ఆ నీళ్ళు దోసిలిలో పట్టుకుని తాగితే అచ్చం కొబ్బరి నీళ్ళలా ఎంత తియ్యగా వున్నాయని.

      చూస్తుండగానే ఎండ పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరిపోతున్నాయి. అమ్మావాళ్ళ కోసం తాటిగెలలు కొన్ని౦టిని బండిలోకి ఎక్కించారు. పంతులుగారికి ఇవ్వడానికి తాటిముంజెల్ను ముంగంలో కట్టి దొరికిన పుల్లతో మట్టిలో గీతలు గీస్తూ ఇంటిదారి పట్టాము.

     అసలు ఎండాకాల౦ అంటేనే తాటిముంజెలు, తాటిముంజల౦టేనే ఎండాకాలం, రెంటినీ విడదీయలేం. తరవాత్తరవాత్త ఎన్ని కొత్త కొత్త కాయలు, పండ్లు తిన్నా ఆ ఏటొడ్డున నీరెండలో తిన్న తాటికాయాల రుచి మాత్రం ఎన్నాళ్ళయినా అలా గుర్తుండిపోయింది.


Monday, May 28, 2012

ఆకుపచ్చని జ్ఞాపకం

        అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అందరం నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం. బస్సు మెయిన్ రోడ్డు వదిలి మట్టి రోడ్డు పట్టిందనడానికి గుర్తుగా ఎర్రటి దుమ్ము పైకి లేచింది. నేనూ, తమ్ముడు బస్సులో వెనుక సీట్లోకి వెళ్లి కూర్చున్నాం. అక్కడైతే రోడ్డుమీద గతుకులు వచ్చినప్పుడల్లా బస్సు ఎత్తెత్తి పడేస్తుంది అది మాకెంత ఇష్టమో. సన్నని ఎర్రటి దారి పక్కనంతా నాగజెముడు, బ్రహ్మజెముడు, కలబంద చెట్లు ఆర్ట్ పీసుల్లా నిలబడి ఉన్నాయ్. అక్కడక్కడా పచ్చగా జీడిమామిడి తోటలు. రెండు మూడు ఊర్లు దాటాక మావూరొచ్చింది.

      బస్సు అలా దిగేమో లేదో "ఏం రామకృష్ణా కోడల్ని, పిలకాయల్ని తీసుకొచ్చినట్టు౦డావే" అడిగారు ఆ విధిలో కొట్టు దగ్గరున్న నాన్న వాళ్ళ బాబాయి. "ఎండాకాలం సెలవలిచ్చారుగా చిన్నాయనా, మిమ్మల్న౦దరినీ చూడాలని వచ్చాం" చెప్పారు నాన్న. "ఏం జయమ్మా బావు౦డావా?" అని అమ్మ నడిగి "మీ నాయన పొద్దుట్నుంచీ మీ కోసం ఎదురుచూస్తా ఉండాడు." అంటూ నాన్నతో చెప్పి విశాలంగా నవ్వాడు ఆ తాతయ్య.

      "ఆక్కడే వున్న ఒక బాబాయి "రేయ్ ఒదిన చేతిలో బాగ్ తీసుకోరా" అని ఓ పదిహేనేళ్ళ అబ్బాయికి పురమాయించాడు.అదేంటో ఆ ఊరంతా చుట్టాలే, ఒకరినొకరు అక్కా, ఒదినా, పిన్నీ, మావా, చిన్నాయనా..అంటూ పిలుచుకుంటారు. అమ్మ వద్దన్నా వినకుండా ఆ అబ్బాయి అమ్మ చేతిలో బాగ్ తీసుకున్నాడు. దారిలో ఎవరెవరో పలుకరిస్తున్నారు కాని, నేను తమ్ముడూ రయ్యిన పరిగెడుతూ నాన్నమ్మ వాళ్ళ వీధి దగ్గరకు వచ్చేశాం. అమ్మ, నాన్న కనిపించిన వాళ్ళతో మాట్లాడుతూ మెల్లగా నడుస్తూ వెనకెక్కడో వున్నారు.

      రోడ్డు మీదనుండి ఇల్లు చాలా దూరం ఉంటుంది కదా, రోడ్డు చివరగా తాతయ్య వాళ్ళ ఇల్లు, దారికి అటూ ఇటూ బొంత రాళ్ళతో కట్టిన చిన్న గోడ, గోడకు అటూ ఇటూ రోడ్డు పొడవునా ఇళ్ళున్నాయి. ఎప్పట్లానే తాతయ్య భోషాణం పెట్టె పక్కనున్న చెక్కచేతుల కుర్చీలో కూర్చుని 'మేం ఎప్పుడు వస్తామా' అని వీధి వైపు చూస్తూ కనిపించారు. తాతయ్య తెల్ల చొక్కా, పంచె కనిపిస్తున్నాయి, ఇంకొచెం జాగ్రత్తగా చూస్తే తాతయ్య కళ్ళకున్న అద్దాలు కనిపి౦చాయి. మేం ఇంటిదగ్గరకు రాగానే లోపల్నుండి నాయనమ్మ చూసిందేమో హడావిడిగా బయటకు వచ్చింది. కుచ్చిళ్ళు అంచుపట్టి పైకి దోపిన పచ్చచీర, నుదిటిమీద యెర్రని కుంకుమ బొట్టు, 
పాపిట తీసి వెనక్కి దువ్వి జడవాసి చుట్టుకున్నముచ్చటైన ముడి, ముక్కుకి ఐదు రాళ్ళ ముక్కు పుడక, చేతిమీద పచ్చబొట్టుతో వేసిన ముగ్గు, చేతినిండా మట్టిగాజులు, వేసి చుట్టిన ముడి, మొహంలో వెలుగుతూ కనిపించే సంతోషం, ఇదీ నాన్నమ్మ రూపం. 

     "ఏమ్మా కావలి బస్సుకొచ్చారా
ఉదయాన్నే ఒంగోలు బస్సుకొస్తారని చూస్తా ఉండాం" అని నాతో చెప్పి "సుగుణా అమ్మాయోళ్లు వచ్చారు" అని పిన్నికి వినిపించేలా పెద్ద కేక పెట్టింది. ఈ లోగా అమ్మా వాళ్ళు కూడా వచ్చారు.

      నాయనమ్మ కేకకు మా ఇంటికి అటు పక్కనున్న ఇంటిలో ఉన్న పిన్నివాళ్ళు, ఇటు పక్క ఇంటిలో ఉన్న తాతయ్య వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. ఇలాగా అమ్మావాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంతలో పిన్ని ఇంట్లోంచి వచ్చింది.

     "రా అక్కా, మంచి ఎండలో బయలుదేర్నారే, కాళ్ళు కడుక్కుందురు గాని 
రండి" అని దొడ్లోకి దారి తీసింది. పిన్నితో మాట్లాడుతూ కాళ్ళు కడుక్కోవడానికి దొడ్లోకి వెళ్లాను. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న తొట్టి నిండా నీళ్ళు నింపి వున్నాయి. మధ్యాహ్నం ఎండ నీళ్ళపై పడి ఎదురుగా ఉన్న గోడమీద కదిలే వృత్తాలు చుడుతూ ఉంది. ఇత్తడి చెంబుతో తొట్లోనుంచి నీళ్ళు తీసుకుని రాళ్ళమీద పరిచిన నల్ల బండపై నిల్చుని కాళ్ళు, చేతులూ, మొహం శుభ్రంగా కడుక్కున్నాను. ఆ నీళ్ళన్నీ బండ కింద గుంటలోకి వెళ్లడం చూస్తుంటే భలే సరదాగా అనిపించేది.

     ఇంతలో బాబాయి వచ్చి "నీ చెట్టుని పలకరించావా జ్యోతీ" అని అడిగాడు. బాదం చెట్టు వైపు చూసి
నేనూ నవ్వాను. నేను పుట్టానని తెలిసిన రోజున తాతయ్య ఆ చెట్టును తీసుకొచ్చినాటారట. అందుకని దాన్ని జ్యోతి చెట్టనో, నా ఫ్రెండ్ అనో పిలుస్తారు. ఆ చెట్టు పచ్చని ఆకులతో ఎంత అందంగా ఉంటుందో...ఆకుల వెనుక అక్కడక్కడా బాదం కాయలు కనిపిస్తున్నాయ్. "జ్యోతీ, ఆ కొమ్మమీద పక్షి గూడు౦ది చూశావా?" అంటూ బాబాయి ఒక కొమ్మను చూపించాడు. 

      ఈలోగా "బయట ఎండగా ఉంది, లోపలకు రండమ్మా" అంటూ నాన్నమ్మ పిలిచింది. లోపలకు వెళ్లి వంటగది గుమ్మానికి రెండు వైపులా వున్న సిమెంట్ తో కట్టిన అరుగుల మీద కూర్చున్నాము. ఆ అరుగుల చివర కొంచెం ఎత్తుగా దిండు పెట్టినట్లు కట్టి ఉంటుంది. ఆ సిమెంట్ సోఫా గమ్మత్తుగా అనిపించేది.

      ఎండలో నుండి లోపలకు రాగానే చీకటిగా అనిపించింది
 కానీ, కాసేపటికి కళ్ళకి అలవాటయి ఇంట్లోవన్నీ స్పష్టంగా కనిపించాయి. నేలంతా చక్కగా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి, గోడ మీద అడ్డంగా వేసిన ముగ్గుగీత చాలా అందంగా ఉంది. ఇంటికి మధ్యలో వున్న రెండు స్థంభాలలో ఒక దానిమీద సీసాలో గనిసి గడ్డలోంచి వచ్చిన తీగ  చెక్కమీద పాకి గమ్మత్తుగా ఉంది. గదిలో మూలగా పే....ద్ద కుండ ఉంది. సుమారుగా ఏడు అడుగుల ఎత్తున్న ఆ కుండలో వడ్లు పోసి వుంటాయట, నేనెప్పుడూ అవి చూడలేదు.

      
ఒక అరుగుమీద పిన్ని, ఎర్రచీర కట్టుకుని పైట భుజమ్మీదుగా ముదుకు వేసుకుని, జారుముడితో ఉన్న పక్కింటి బోసినోటి అమ్మమ్మ, రెండో అరుగు మీద నేనూ, తమ్ముడూ, నాయనమ్మ కూర్చున్నాము. ఆకుపచ్చ, తెలుపు గళ్ళ దుప్పటి వాల్చిన నవారు మంచం మీద అమ్మ, నల్ల గీత ఉన్న బులుగు దుప్పటి వాల్చిన మంచం మీద నాన్న, బాబాయి కూర్చున్నారు. రుగుల పైన గోడమీద వరుసగా మా నాన్న స్కూల్ ఫోటో, పెద్దత్త పెళ్ళి ఫోటో, చిన్నగౌను వేసికుని, ఉంగరాల జుట్టుతో అమాయకంగా చూస్తున్న నా ఫోటో, గుఱ్ఱం బొమ్మమీద కూర్చున్న తమ్ముడి ఫోటో, ఇంకా కొన్ని ఫోటోలు...వరుసగా వేలాడదీసి వుంటాయి. నాయనమ్మ ఎప్పట్లానే ఆ వేళ కూడా ఆ ఫొటోలన్నీ నాకూ, తమ్ముడికీ చూపించి అప్పటి సంగతులు చెప్పింది. 

       "బాబాయ్ తాటి చెట్ల దగ్గరకు ఎప్పుడు వెళ్దాం?" ఉత్సాహంగా అడిగాను. "నువ్వెప్పుడంటే అప్పుడేనమ్మా" తెల్లని పళ్ళు కనిపించేలా నవ్వుతూ చెప్పాడు. అసలు బాబాయి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, బాబాయిని కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఆ మాట కొస్తే ఆ ఇంట్లో ఎవరినీ కోపంగా చూడలేదు. బాబాయి మాటతో క్వీన్ విక్టోరియా లాగా ఫీల్ అయి "అయితే ఇప్పుడే వెళ్దాం" చెంగున అరుగు మీంచి దూకి చెప్పాను. "ఇప్పుడొద్దులేమ్మా అన్నం తిని కాసేపుబ్బడుకోండి, చల్లబడ్డాక పోదురుగాని" చెప్పారు తాతయ్య. 
అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. నేనూ, తమ్ముడూ 'ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు తోటకెళ్దామా ' అని ఎదురుచూస్తూ కూర్చున్నాము. తాటికాయల కబుర్లు కాస్త చల్లబడ్డాక చెప్పుకుందాం. 

Monday, April 16, 2012

మూడు హాళ్ళు...ముప్ఫై ఆరు సినిమాలు

     మధ్యాహ్నం అన్న౦ తిన్నాక నేనూ, అక్కా వరండాలో మెట్ల మీద కూర్చున్నాం. ఇంతకూ అక్కెవరో చెప్పలేదు కదూ.. తాతయ్యకు తెలిసినవాళ్లమ్మాయి, వాళ్ళ ఊరిలో కాలేజి లేదట. అక్కేమో "నేనింకా చదువుకుంటానంటే", వాళ్ళవాళ్ళేమో "చదివింది జాల్లే నువ్వేం ఉద్యోగాల్జేసి ఊళ్లేలబళ్లా, ఇంట్లోనే వుండి, ఆ పొయ్యికాడ కాస్త ఎగదోస్తా ఉండు, మంచి సంబంధం జూసి పెళ్లి జేస్తాం" అన్నారంట. పాపం అక్కకేమో డాక్టర్ అవ్వాలని కోరికట, అన్నం నీళ్ళు మాని ఏడుస్తూ వుంటే వాళ్ళ అన్నయ్య ఏదో పనుండి నెల్లూరికి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పాడంట.

     అప్పుడు తాతయ్య, "చదువు మీద అంత శ్రద్ద వున్న అమ్మాయిని మాన్పి౦చొద్దు నారాయణా" అన్నారంట. దానికి వాళ్ళ అన్నయ్య, "ఆడపిల్లకు చదువెందుకులే పెదనాయనా, పైగా మా ఊళ్ళో కాలేజీ లాకపోయ పక్కూరికాలేజీకి రోజూ రెండు మైళ్ళు నడిచిపోవాలి. ఆ కాలేజీలో పోకిరీ పిలకాయలంతా వుంటారు, ఆడపిల్లని అ౦దూరం పంపేదెట్టా" అన్నాడంట. అప్పుడు అమ్మమ్మ "నెల్లూరికి దీసకరా నారాయణా డికేడబ్యూ కాలేజీలో జేర్పిద్దాము, అది ఆడపిలకాయల కాలేజీయేలే" అని చెప్పిందట". "ఆస్టల్లో ఉంచాలంటే శానా కర్చవుతాదిలేమ్మా. మంచి సంబందం ఉంటే చూడండి పెళ్లి చేద్దాము" అని మనసులో మాట చెప్పాడంట. "ఆస్టల్లో బెట్టడం ఎందుకా.. మా ఇంట్లో ఉంటదిలే నాయనా" అన్నదటమ్మమ్మ. "ఎందుకులేమ్మా మీకు ఇబ్బందా" అన్నాడట అన్నయ్య. "ఇబ్బందేముందా మా పిల్లకాయల్తో పాటే వుంటది, కావాల్సినంత చదువుకోనీ" అన్నదట. ఆ విధంగా ఆ అక్క కూడా మా అమ్మమ్మకి ఇంకో కూతురైపోయింది.

     వరండాలో కూర్చున్నామా, ఎండ మండిపోతూ ఉంది. వీధీలో అప్పుడో రిక్షా, ఇప్పుడో రిక్షా మాత్రం వెళుతూ వున్నాయి, రిక్షాకి గూడు ఉండడం వల్ల  లోపలున్నదెవరో కనిపించడం లేదు. ఇంతలో లోపలనుండి పిన్ని పైట చెంగు బొడ్లో దోపుకు౦టూ వచ్చి స్థంబానికి ఆనుకుని కూర్చుంది. "అక్కా, కావేరిలో చిరంజీవి సినిమా ఆడతందట పోదామా" పిన్నినడిగింది అక్క. "నిన్ననే సినిమా జూసొస్తిమే, అమ్మొప్పుకుంటదా?" పిన్ని సందేహం. "జ్యోతినడగమందాం, అప్పుడయితే అమ్మేమ౦దు." అక్క సలహా. "నేనిప్పుడే వెళ్లి అమ్మమ్మనడిగొస్తా" అంటూ చెంగున లేచాను. పిన్ని చెయ్యిపట్టుకుని ఆపి, "ఈ వారం అప్పుడే రెండు సినిమాలు జూశాం. ఇప్పుడడిగితే అమ్మ సినిమా గినిమా యేంలా, గమ్మున గూసోండి. సినిమా లెక్కువైపోతున్నయ్ మీకు" అని అరుస్తుంది. రేపు పనంతా చేసి అప్పుడడుగుదాం, మద్యాన్నం మాట్నీకి వెళ్ళొచ్చు" అని ఉపాయం చెప్పింది.

      ఇంతలో "ఐస్, పాలైస్...ఐస్, పాలైస్...చల్లైస్" అని అరుపులు వినిపించాయి. రయ్యిన లోపలకు పరిగెత్తాను. అమ్మమ్మ చాపమీద పడుకుని 'ఆంధ్రజ్యోతి' పత్రిక చదువుతోంది. "అమ్మమ్మా..అమ్మమ్మా" పిలిచాను. "ఏమ్మా" అడిగింది, చుదువుతున్న దగ్గర మధ్యలో వేలు పెట్టి, పత్రికను మొహం మీదనుండి తీస్తూ. "ఐస్" అడిగాను. "పోపుల డబ్బాలో ముప్పావలా ఉంది, ఓ పావలా తీసుకొని కొనుక్కో౦డి అంది. కొట్టుగది దాటి వంటి౦ట్లోకి వెళ్లి అరలో ఉన్న పోపులడబ్బా జాగ్రత్తగా కింద పెట్టి మూతతీస్తే మిరపకాయల ప్లేట్ కనిపించింది. అది కూడా తీస్తే మెంతుల గిన్నెలో రెండు పావలాలు, రెండు పదిపైసళ్ళూ, చతురస్రాకారంలో వున్న ఒక ఐదు పైసలు కనిపించాయి. అందులోనుండి పావలా మాత్రం తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా డబ్బా పైన పెట్టి, ఒక్కుదటన పరిగెత్తి గడపలు దాటుకుంటూ వరండాలోకి వచ్చాను. అప్పటికే ఐసబ్బాయి వచ్చిమా ఇంటిముందే బండి ఆపి నిలుచున్నాడు. ఆ అబ్బాయికి మేం కొంటావని తెలుసుగా మరీ..

      తెల్లడబ్బా పైన మూత , లాగడానికి వీలుగా డబ్బాకి రెండు కర్రలు, డబ్బా కింద నాలుగు చక్రాలు వున్న ఐసుబండిని చూడగానే నాకు హిమాలయాలను చూసినంత చల్లగా హాయిగా అనిపించింది. బ౦డి దగ్గరకు వెళ్లాను. "యేమైసు కావాల పాపా"అడిగాడు బండెబ్బాయ్. ఒక ద్రాక్షైసు, పాలైసు, సబ్జా ఐసు చెప్పాను. మూత తీసి ఊదా ఐసొకటి, తెల్లైసొకటి, తెల్లగా వుండి చివర సబ్జాలున్న ఐసొకటి ఇచ్చాడు. ఒక చేతిలో రెండు ఐసులు పట్టుకుని రెండో చేతిలో ఉన్న ఐసు చీకుతూ లోపలకు వచ్చి పిన్నివాళ్ళకు ఐసులిచ్చాను. అమ్మమ్మకు కొనలేదు. "పళ్ళు జిల్లుమంటాయమ్మా ఐసు తింటే' అని ఐసు తినదు. కొద్దిసేపటికి చేతిమీదుగా ఐసునీళ్ళు కారడం మొదలెట్టాయి. తలపైకెత్తి నీళ్ళు కిందపడకుండా తిన్నాను, ఎంతసేపని తింటాం మెడ నొప్పిపుట్టి ఐసు మొత్తం కొరుక్కుని తినేశాను.

       ఆ రోజు రాత్రి మిద్దెమీద పడుకున్నప్పుడు రేపటి ప్రణాళిక సిద్దం చేసుకున్నాం. తెల్లవారి నేను లేచేసరికి పక్కన ఎవరూ లేరు, గబగబా పరుపు మడిచేసి కిందకు వెళ్లాను. జలదాట్లో గిన్నెలు తోమేస్తూ పిన్ని, భావిలో నీళ్ళు తోడి గంగాళంలో పోస్తూ అక్క కనిపించారు. నేను మొహం కడుక్కుని వచ్చేసరికి వాళ్ళిద్దరూ గిన్నెలు కడగడం అయిపొయింది. తోమిన గిన్నెలన్నీ వంటి౦ట్లో పెట్టాను. అమ్మమ్మ ఇచ్చిన కాఫీలు అందరికీ ఇచ్చేసి, ఇక ఆ రోజుకి పనిమనిషి రాదని తెలుసుకుని, పెద్దమూట బట్టలు ఉతికేసి, ఇళ్ళూ, వాకిళ్ళూ ఊడ్చేసి, పచ్చడ్లూ, అవీ చేసేసి, మంచి నీళ్ళూ అవీ తెచ్చేసి, అమ్మమ్మ చెప్పిన పన్లూ, చెప్పని పన్లూ అన్నీ చేసి మధ్యాహ్నానికల్లా పనంతా అవగొట్టేశాం. బుద్దిగా అన్నాలు తినేసి, ఒంటిగంటకల్లా వంటిల్లు కూడా శుభ్రం చేశాం.

      అప్పుడు పిన్ని, "మా మా సినిమాకెల్తాం మా..." అన్నది. "మొన్ననే గదనే అదేదో సినిమాకు బొయినారు, ఇట్టా రోజు సినిమా అంటే మీ బాబరస్తాడు" అన్నది. "పనంతా జేశా౦ గదమా ఇంక వారం దాకా అడగం మా, చిర౦జీవి సినిమా మా" బతిమలాడింది పిన్ని. "నా దగ్గర ఐదు రూపాయలే ఉండాయి, మీకు టికెట్లకు చాలవు" కొద్దిగా కరిగింది అమ్మమ్మ. "మిగతా డబ్బులు నాదగ్గరున్నయ్ మా" అని అమ్మమ్మతో అని "పాపా బట్టలు మార్చుకు౦దా౦రా" అని హడావిడిగా లోపలకు వెళ్ళింది పిన్ని. అక్కడే ఉంటే మా దగ్గర ఎన్ని డబ్బులు వున్నాయో అమ్మమ్మకు చెప్పేస్తానని పిన్ని భయం. అయిదంటే అయిదే నిముషాలలో రెడీ అయి, "మా పొయ్యొస్తాం" అమ్మమ్మతో చెప్పింది అక్క. "కాస్త తాలండి ఏదైనా రిక్షా వస్తుందేమో జూస్తా ఉండండి. ఎండ మండిపోతా ఉంది, ఈ ఎండలో నడిస్తే వడదెబ్బ తగల్తది" హెచ్చరించింది అమ్మమ్మ. "సినిమాకు టైం అవతావుందిమా, వీధి చివర ఎక్కుతాంలే" అని అమ్మమ్మతో చెప్పి బయటపడ్డాం.

      వీధి చివర చెట్టుకింద ఓ రెండు రిక్షాలు ఆగి ఉన్నాయ్. "పిన్నీ రిక్షా ఎక్కుదాం రా" రిక్షా వైపు వెళ్ళబోయాను. పిన్ని ఆపి "మనదగ్గర డబ్బులు లేవు పాపా త్వరగా నడువ్, లేకపోతే టికెట్లు దొరకవు" అంది. ఆ నడి వేసవిలో, మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో నడుస్తూ, నడుస్తూ ఏమిటిలెండి దాదాపుగా పరిగెడుతూ రైలు పట్టాలు దాటి, మూడు హాళ్ళకెళ్ళి సినిమా చూశాం. 


     ఓ సారి పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికని బయలుదేరి నర్తకి థియేటర్ కి వెళ్ళాం. అక్కడికే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఝామ్మని సినిమా చూశాము, ఈ ఏర్పాట౦తా మా పిన్ని కుట్ర..ఒట్టు నాకస్సలు తెలీదు. సినిమా చూసి ఇంటికొచ్చామా ఇంటి నిండా మనుషులున్నారు. మా పెద్ద పిన్ని, "మంచి వాసనొస్తావుంది యేడా" అనగానే మా పై ప్రాణాలు పైనే పొయ్యాయి. గబగబా లోపలికి పొయ్యి బట్టలు మార్చుకుని వచ్చాం. నర్తకి హాలు ఆ వారమే మొదలయ్యింది. ఎసిలో మంచి వాసన ఒచ్చే పెర్ఫ్యూం ఏదో కలిపినట్లున్నారు, ఇంటికొచ్చాక కూడా మా బట్టలు అవే వాసనలొస్తూ ఉన్నాయి. లీలామోహన్ కెళితే మాత్రం వస్తూ సుండలు కొనుక్కుని ఇంటికొచ్చి తినేవాళ్ళం. మరి వీధిలో తినకూడదు కదా...

     అలా నెల్లూరులో ఎన్నో సినిమాలు చాశాం, ముఖ్యంగా కృష్ణా, కావేరీ, కళ్యాణీలలో. ఆ సినిమాలన్నీ అద్భుతంగా అనిపించేవి. తరవాత్తరత ఎన్నో థియేటర్లలో ఎన్నో సినిమాలు చూసినా అప్పటి ఆ అను
వాలు మాత్రం పదిలంగా వుండిపోయాయి. 

Wednesday, March 21, 2012

ఎండవేళ మధ్యాహ్నం పూట..

      ఓ తాతయ్య చేతిలో సంచితో గుమ్మం బయట చెప్పులు వదిలి లోపలకు వచ్చారు. బెల్ కొట్టడాలు అవీ అప్పుడు లేవుగా. అందుకే సరాసరి లోపలికే వచ్చేశారు. పొద్దున్న నిద్ర లేచి తలుపు తెరిస్తే రాత్రి పడుకోబోయేముందే తలుపు వేయడం. తలుపులు మూసి ఉంచితే ఇంటికి అరిష్టం కదూ! అంతగా రోడ్లోకి కనిపిస్తున్నామనుకుంటే కర్టన్ వేసుకోవాలిగాని. ఆ తాతయ్య లోపలి వచ్చి

"ఏం పాపా ఎప్పుడొచ్చినావా? మీ తాతయ్య ఉండాడా?" అన్నారు.
నాకేమో ఆ వచ్చిన తాతయ్యెవరో గుర్తు రావడంలేదు. అయినా సరే మీరెవరో నాకు తెలీదండీ అనకూడదు, అది మర్యాద కాదు కదా. "తాతయ్య లేరు బయటకెళ్ళారు. కూర్చోండి అమ్మమ్మను పిలుస్తాను." అని చెప్పి అమ్మమ్మను పిలవమని చిట్టిని పంపాను. తాతయ్య సంచి పక్కన పెట్టి అక్కడున్నఆకుపచ్చ గాడ్రెజ్ కుర్చీలో కూర్చున్నారు. ఈలోగా లోపలనుండి అమ్మమ్మ, పిన్ని వచ్చారు.

"ఏవన్నా బావుండావా. ఇప్పుడేనా రావడం?" అని తాతయ్యను కుశలం అడిగి "తాతయ్యకు మంచినీళ్ళు తీస్కరాపో నాయనా" అని నాతో చెప్పింది.
"పొద్దునొచ్చినానమ్మా. ఎంకట్రెడ్డిని ఆసుపత్రిలో జేర్చినారూ, వాడితో వాళ్ళమ్మ కూడా ఆసుపత్రిలో ఉంటే ఆయమ్మకు అన్నమిచ్చి రమ్మని మీ ఒదిన నన్ను బంపినాది, సరే ఎట్టా నెల్లూరొస్తినే రెడ్డిన్జూసి పోదామని ఇటొచ్చినా". అన్నాడు తాతయ్య.
"నాల్రోజుల్నాడు ఎంకట్రెడ్డి రోడ్డుమీద బోతావుంటే చూసినానన్నా .. కాలు కట్టుకునట్టే ఉందే. అబ్బయ్య బాగా తిరగతా ఉండాడు, తగ్గిపోయింది గావాల్ననుకున్నా. మళ్ళీ తిరగబెట్టిందా?" అడిగిందమమ్మ పైట చెంగుతో చేతులు తుడుచుకుంటూ.
"కాలు బాగయినాక కుదురుగేడుంటాడమ్మా. పొద్దులొస్తం కట్ట మీద పడి తిరుగతా వుళ్ళా,  కాస్త ఎండ బెట్ట తగిలినాదంట. రెండ్రోజులు ఆసుపత్రిలో ఉంచి సెలైను గట్టాలంట". అన్నారు. ఈ లోగా నేను స్టీలు గ్లాసు, చెంబుతో నీళ్ళు తెచ్చి పిన్నికిచ్చాను. పిన్ని నీళ్ళు గ్లాసులో పోసి తాతయ్యకిచ్చింది.


    ఆ వెంకటరెడ్డి ఎవరో ఎందుకు కాలికి దెబ్బతగిలిందో అమ్మమ్మ తరువాత చెప్పింది. పొలంలో పని చేస్తుంటే కాలుకి ముల్లు గుచ్చుకు౦దంట. ముల్లేగదా యేంజేస్తు౦దిలే  అని పట్టించుకోలేదంట. అది సెప్టిక్ అయి చీము పట్టి కాలు తీసెయ్యాల్సిన పరిస్థితొస్తే పెద్దాసుపత్రిలో నెల్రోజులు౦చుకుని కాలు బాగు చేశారంట. ఆ వెంకటరెడ్డి ఎప్పుడూ పొలమూ, పొలమూ అని పొలం చుట్టూనే తిరుగుతా ఉంటాడంట.

"మావా అత్తమ్మ బావుందా" అడిగింది పిన్ని. 
"ఆ..ఆ..బావుండాదమ్మా" చెప్పాడు తాతయ్య.
"ఎట్టా నెల్లూరొస్తంటివే ఒదిన్ని దీసుకురాగూడదన్నా చాన్నాళ్ళవలా చూశా" అందమ్మమ్మ.
"మీ ఒదిన కేడ కుదరద్దమ్మా  కొడుకూ కోడలూ చీకట్నేపొలం బోత౦ట్రే, పిలకాయల్తో సరిపోతావుళ్ళా"  అని నీళ్ళు ఇంకొంచెం పొయ్యమన్నట్లుగా గ్లాసు ముందుకు పెట్టాడు. పిన్ని గ్లాసు నిండుగా నీళ్ళు పోసింది.
"ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటానే ఉందిగాని రానే రాదుగా మా ఇంటికి" అని నా వైపు చూస్తూ "మనవరాల్ని గుర్తుబట్నావాన్నా" అందమ్మమ్మ.

"నాకెందుకు తెలీదమ్మా మన ఇజ్యమ్మ కూతురు గదా, అచ్చం చిన్నప్పుడిజ్యమ్మను చూసినట్లే వుళ్ళా...ఎప్పుడొచ్చినారు?" అంటూ గ్లాసులో నీళ్ళు ఎత్తి పట్టకుని గటగటా తాగేసి చేతిలో గ్లాసు కుర్చీపక్కగా పెట్టాడు తాతయ్య.
"అమ్మాయోళ్ళు రాలా..సెలవలియ్యంగనే వాళ్ళ తాత బొయ్యి జోతిని తీసుకొచ్చినాడు." అందమ్మమ్మ. కుర్చీ పక్కనున్న గ్లాసు, అమ్మమ్మ చేతిలో చెంబు తీసుకుని అన్నం సరిపోతుందో మళ్ళీ వండాల్నో చూడడానికి లోపలికి వెళ్ళిపోయింది పిన్ని.
"ఇజ్యమ్మకు స్కూల్ సెలవలేగా, రమ్మన్జెప్పలా?"
"జెప్పినావన్నా..రామకిష్టయ్యకు సెలవల్లేవ౦ట. వచ్చేనెల్లో వస్తారంట." అంది.
"ఏం పాపా నేను గుర్తు౦డానా?" అని అడిగాడు తాతయ్య నా వైపు చూస్తూ.

    తల అడ్డంగా నిలువుగా పక్కగా తిప్పాను. గుర్తు పట్టలేదంటే బావుండదు గదా. ఈ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు భలే ఇరకాటంలో పెట్టేస్తారు. నా ఇబ్బంది గమనించి "పోయిన ఎండాకాలంగాక అంతకముందు ఎండాకాలమేగా అమ్మాయోళ్ల౦దరూ మీ ఊరికొచ్చి౦ది. అప్పుడే మర్చిపోద్దా" అంది అమ్మమ్మ. ఆ హింటుతో ఆయనెవరో గుర్తొచ్చింది. కోటపాడు తాతయ్య, అంటే తాతయ్య చిన్నప్పటి ఫ్రెండన్నమాట. ఆ తాతయ్య వాళ్ళ ఊళ్లోనే ఎద్దుల బండి మీద ఏటి దగ్గర కెళ్ళింది. చుట్టూ సరుగుడు తోటలు మధ్యలో చిన్న ఏరు పారుతూ ఉంటుంది. ఆ ఏటి ఒడ్డున ఇసుకలో కూచుని ఆడుకున్నాం కూడానూ. ఈ తాతయ్య అప్పుడు తాటికాయలు కొట్టి ఇచ్చాడు.

"అమ్మా రెడ్డెప్పుడొస్తాడు?" అన్నాడు తాతయ్య బుజం మీద ఉన్న టవల్తో మొహం తుడుచుకుంటూ..

"కోర్టు పనిమీద వకీలుకాడికి బోయినాడన్నా, ఈ పాటికి వస్తా వుండాల" అంటూ వీధి వైపు చూసింది.

      సరిగ్గా ఆ సమయానికే గేటు దగ్గర రిక్షా ఆగింది. అందులో నుండి తాతయ్య దిగి రిక్షా అతనికి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి వచ్చి, "ఆ రిక్షా అబ్బాయికి మంచి నీళ్లీ" అని చెప్పారు జనాంతికంగా. తాతయ్య అమ్మమ్మను పిలవాలంటే పేరుండదు మరి. చాలా రోజుల వరకూ అమ్మమ్మకి పేరు౦టుందని నాకూ తెలీదు. అందరూ అమ్మమ్మని అత్తా, ఒదినా, పెద్దమ్మా, నాయనమ్మా, అక్కా ఇలాగేగా పిలుస్తారు.

"ఏం సుబ్బారెడ్డా చానా సేపయిందా వచ్చి" అని అడిగారు తాతయ్య అక్కడే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంటూ.
"ఇప్పుడేలే ఓ అర్ధగంటయి౦ది వచ్చి. నువ్వేంది కోర్టుకు బోయినావట్నే?" ఆరాగా అడిగాడు ఇంటికొచ్చిన తాతయ్య.
"ఆ వెంకటరాజు పాలెం కాడ రోడ్డు పక్కన మన స్థలం ఆరంకణాలుళ్లా, దాన్ని గవర్నమెంటోళ్ళు రోడ్డు వెడల్పు జేస్తా కలిపేసుకుంటు౦డారూ. ఆ విషయం మాట్టాడేదానికి వకీలు కాడికి బొయినా.
"ఒంటిగంటవతావుంది. అన్నంది౦దురుగాని లేవండన్నా. సుగుణా బావికాడ గంగాళంలోకి నీళ్ళు తోడతా, మీ నాయనోళ్ళు చేతులు, కాళ్ళు గడుక్కుంటారు." అని లోపలున్న పిన్నికి వినిపించేట్లు గట్టిగా చెప్పి౦ది. 

"ఇంటికాడ పొద్దున్నే అన్నం తినేసొచ్చినాను. ఇప్పుడన్నాలవీ ఒద్దులేమ్మా రెండుగంటల బస్సుకి ఊరికి బోవాల" అని మొహమాటపడి పోయారు. 
"మిట్టమద్దానం ఎండలో యాడికి బోతావ్లే. మీ చెల్లెలు పొద్దున్న చాపల్దీసుకుంది. అన్నందిని కాసేపు పొణుకో. సాయంకాలం బోవచ్చులే" అని తాతయ్య అన్నాక రెండో తాతయ్య కూడా భోజనానికి లేచారు.  

      తాతయ్యావాళ్ళు భావిదగ్గరకు పోయాక నేనూ అమ్మమ్మ వంటిట్లోకి పొయ్యాం. అమ్మమ్మ, అంచున్నపెద్ద కంచాలు రెండు తీసి "రవన్ని నీళ్ళు తొలుపుకురా నాయనా" అని ఇచ్చింది. వాటిని సందులో ఉన్న బకెట్లో నీళ్ళతో ఒకసారి కడిగి ఇంట్లోకి తెచ్చాను. ఈలోగా అమ్మమ్మ కూరలన్నీ స్టీలు గిన్నెల్లోకి తీస్తూ ఉంది. నేను లోపలకు వచ్చి రెండు పీటలు వాల్చి, రెండు గ్లాసులు పెట్టి మూలనున్న ఎర్రని కుండలోని నీళ్ళు చెంబుతో ముంచుకొచ్చి పెట్టాను. వాళ్ళు భోజనాలకు కూర్చోగానే పక్కింటి కరుణ వచ్చింది. 

    ఇద్దరం సందులోనుండి పరిగెత్తుతూ వెళ్లి వేప చెట్టు కింద రాలిపడ్డ వేప పుల్లలేరడం మొదలు పెట్టాం. వాటితో ఏం చేస్తాం అనుకుంటున్నారా..మా బుడ్డీల సంసారానికి చిన్న చిన్న చీపుర్లు కావద్దూ..ఇంకా రెండు చివర్లు తుంచి, మస్తానన్న మిషన్ దగ్గర తెచ్చిన గుడ్డ ముక్కలతో పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు బొమ్మలు కూడా చేస్తాం. అప్పుడప్పుడూ పుల్లలాట కూడా వాటితోనే. అసలు పుల్లలాటకు చీపురు పుల్లలైతే బావుంటాయి కానీ "చీపుర్లో పుల్లలన్నీ లాగేసి సన్నంగా జేస్తావు౦డారు చిమ్ముతావుంటే చేతిలో నిలవక ఈడో పుల్ల ఆడో పుల్ల జారిపోతున్నాయని" అమ్మమ్మ కోప్పడిందిగా అందుకని వేప పుల్లలు ఏరుకుంటున్నామన్నమాట. 

    బైట బాగా ఎండగా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే "తెల్లారి లేస్తే ఆటలేనా మద్దినేళ  రొంతసేపు పడుకోకూడదా" అని కేకలేయ్యక ముందే మా సామానంతా ఉన్న బుట్ట తీసుకుని మిద్దిమీద గదికి ఆనుకున్నగూట్లో చేరిపొయ్యాం.