Tuesday, November 25, 2014

కాళోజీ నారాయణరావు

అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు!

       ఎవరో  కాళోజీ నారాయణరావు గారట ఆయన కవిత్వమట ఇది. అవనీ, అవకతవకలూ అంటూ అర్ధం లేని కబుర్లు. ఏమైనా అప్పటివాళ్ళకు బ్రతకటం చేతకాదు. ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేసుకున్నామా, తిన్నామా పడుకున్నామా అన్నట్లుండాలి, లేకపోతే ప్రజాసేవ పేరుతో పాపులారిటీ అయినా తెచ్చుకోవాలి గాని ఇలా గుండె కరిగిపోవటాలు, ఒళ్ళు మండిపోవటాలు దేనికంటా?

    అంతేనా, ఇంకా వినండీ "కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక'' అని ప్రకటించుకున్నార్ట. ఏదో కవ్వితం అంటే ప్రాసలు, పద ప్రయోగాలు, వెన్నెల్లూ, వెండి కొండలూ అంటూ రాసుకోవాలి. లేకపోతే ఎవరికీ అర్ధం కాని భాషలో ఆ ఘోషేదో వినిపించాలి కానీ,  ఏమిటో దేశభక్తి, వర్గాల పోరాటం, లోకంలో జరుగుతున్న దగాలు, సామాజిక వ్యత్యాసాలు, కర్షకుల ప్రాధాన్యం అంటూ కవిత్వం వ్రాశార్ట ఈ ప్రజాకవి. ఈయన "నా గొడవ" అంటూ వినిపించిన కవిత్వం చూడండి.

నా గొడవ నాది-అక్షరాల జీవనది
నానా భావనా నది- నీనా భావన లేనిది
మన భావన నది - సమ భావన నది
ఎద చించుక పారునది- ఎదలందున చేరునది
నా గొడవ నాది- కాళోజీ అనునది

    నాది నాదే, నీదీ నాదే అనుకోకుండా సమభావన అని ఇలా గొడవ గొడవగా దాదాపు 3000లకు పైగా కవితలు వ్రాశారట. అప్పటి వాళ్ళు ఇలాంటి కవిత్వంతో మేల్కొన్నారేమో కాని మనమైతేనా నాలుగు పేజీలు తిప్పేసి పుస్తకం పక్కన పడెయ్యమూ!

అన్నపు రాసులు ఒక చోట- ఆకలి మంటలు ఒక చోట
హంస తూలిక లొక చోట- అలసిన దేహాలొక చోట
సంపదలన్నీ ఒక చోట- గంపెడు బలగం ఒకచోట
అనుభవమంతా ఒక చోట -అధికారం బది ఒక చోట''

ఏమాటకామాటే చివర వాక్యాన్ని మనం మరో వెయ్యేళ్ళు మార్చకుండా చదువుకోవచ్చు. 

తెలుగు స్పష్టంగా మాట్లాడడమే నామోషీ అనుకుంటుంటే ఈయనొకరు.
"అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!''
ఇలా తిడితే ఇంకేమైనా ఉందీ! ఎవరైనా మనెదురుగానే వెధవ పని చేస్తున్నా భవిష్యత్తులో వాళ్ళతో మనకు ఏం అవసరం వస్తుందో ఏమిటోనని చూసి చూడనట్లు పోవాలి కానీ ఇలా మాట్లాడితే మన మీద కత్తి కట్టరూ!

    రాజకీయ విప్లవాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించి ఆ ఏర్పడిన ప్రభుత్వాలు సమానత్వాన్నీ స్థాపించవచ్చు. కానీ సౌభ్రాతృత్వం లేనిదే ఈ రెండింటివల్ల కలిగే ఫలితం ప్రజలకు చెందదు. దీనికి నాయకుల కృషి సరిపోదు ఇది రచయితల వలెనే సాధ్యమౌతుంది అన్నార్ట పిచ్చి మారాజు. బాగా డబ్బులు సంపాదించినవాళ్ళకు, దేశమంతా స్థలాలు కొన్నవాళ్ళకు విలువిస్తారు వారి మాటే వింటారు కాని, రచయితలకు విలువిచ్చి వారి రచనలు చదివి మారతారటండీ! 

     పైగా కత్తులూ, కఠార్లతో రజాకార్లు స్వైరవిహారం చేస్తున్న రోజుల్లో ఈయన ఆంధ్రమహాసభల్లో, ఆర్యసమాజ్‌ ఉద్యమాల్లో పాల్గొంటూ వరంగల్ కోట మీద కాంగ్రెస్ వాళ్ళతో కలసి జెండా ఎగరవేశార్ట. ఈయన ఉద్యమాలంటూ తిరిగబట్టే పాతికేళ్ళు నిండకుండా జైలు పాలయ్యారు. ఇవన్నీ అనుభవమయ్యే ఇప్పటి పిల్లల్ని సామాజిక బాధ్యత, న్యాయం, ధర్మం అంటూ పనికిమాలిన విషయాల జోలికి పోకుండా ఉద్యోగానికి పనికివచ్చే చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెడుతుంది.  

     ఈయనకు రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పొట్లపల్లి రామారావు, టి.హయగ్రీవాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గార్లపాటి రాఘవరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దాశరథి, సినారె, బిరుదురాజు రామరాజు, కన్నాభిరాన్, ఎస్ ఆర్ శంకరన్, సంజీవదేవ్, చలసాని ప్రసాద్, మో, శ్రీశ్రీ, కృష్ణాబాయి, కాళీపట్నం రామారావు, మహాశ్వేతాదేవి, జ్వాలాముఖి, ఆరుద్ర, నగ్నముని, జయశంకర్, నాగిళ్ల రామశాస్త్రి, గద్దర్, వరవరరావు, ఎన్.వేణుగోపాలవీళ్ళంతా స్నేహితులట. ఏవో రెండు మూడు పేర్లు కాస్త తెలిసినట్లుగా ఉన్నాయి కాని ఎవరో మరి వీళ్ళంతా?

   అప్పుడేదో మద్యం నిషేధం అని ఉండేదిట. వినడానికే నవ్వొస్తోంది కదూ! అసలు గ్లాసులు ముందుపెట్టుకునే కదూ తొంభై శాతం నిర్ణయాలు తీసుకునేది! మరి అర్ధం పర్ధం లేని ఈ నిషేధాలేమిటో! ఒకవేళ అవన్నీ బయట నినాదాలిచ్చుకుని ఇంటికెళ్ళి ఓ ఫుల్లు లాగించొద్దూ! పాపం స్నేహితులెవరో కాస్త పుచ్చుకోవయ్యా అంటే "బయట మద్యనిషేధ చట్టం ఉన్నది గనక తాగొద్దు. ఐనా తాగుదామంటవా ఖైరతాబాద్ చౌరస్తాకు బోయి, విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నడీ చౌరస్తాల నిలబడి ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తున్నం అని తాగుదాం," అన్నార్ట ఈ ఛాందస వాది. మాంసం తింటున్నామని పేగులు మెళ్ళో వేసుకుని తిరుగుతామటండీ! ఇక ఆ స్నేహితులు మరోనాడు ఈయనకు మందిస్తారా అసలు ఇంటికైనా పిలుస్తారా అని. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి.

    కాళోజీ గారు న్యాయ శాస్త్రం చదివారట కాని ఏనాడూ రూపాయి సంపాదించకపోతే వీళ్ళ అన్నయ్య రామేశ్వరరావుగారే ఇంటికి కావలసిన మంచీ చెడ్డా చూసుకునేవారట. పాపం రామేశ్వరరావు చనిపోయినప్పుడు కాళోజీ గారు ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను, ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. డెబ్బై ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప,’ అన్నార్ట . అన్నన్నేళ్ళు మరో కుటుంబాన్ని కూడా పోషించటం అంటే ఆ అన్నగారెంత సత్తెకాలం మనిషో తెలుస్తోంది. 

    ఆయన్ను అంతగొప్ప ఇంతగొప్ప అని పొగిడిన వాళ్ళు మణులూ మాన్యాలు ఇచ్చారనుకుంటున్నారా! అబ్బే సెప్టెంబర్ తొమ్మిదిన అదేనండి అయన పుట్టినరోజును “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటామన్నార్ట. హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి 'కాళోజీనగర్' అని పేరు పెట్టార్ట.  

    "ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ళ కదలిక" అంటూ కాళోజీ గారో మాట చెప్పారు. మనం చాలా తెలివైన వాళ్ళం కదూ! మెదడ్ని కష్టపెట్టే పన్లు మనకెందుకు? మన వేల చదరపు అడుగుల ఇళ్ళలో సిరా చుక్కల పుస్తకాలు లేకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు కూడా ఏవో నాలుగు సినిమా కబుర్లు చదువుదామని వెళ్తేనూ సాక్షిలోనూ, విశాలాంధ్ర లోనూ ఇవి కనిపించాయి. 

   బుజ్జిపండు ఈ మధ్య లైబ్రరీనుండి ఏమిటేమిటో పుస్తకాలు తెస్తున్నాడు. ఏం చదువుతున్నాడో ఏమిటో కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఇట్లాంటివి చదివితే ఇంకేమన్నా ఉందీ!


Wednesday, October 8, 2014

సీడర్ పాయింట్

      కమ్మని కాఫీ తాగేశారా? కాఫీ ఏమిటి అంటారా? కథ చెప్పుకుంటూ మధ్యలో చిన్న విరామం తీసుకున్నాం. ఇంతకు ముందు జరిగిందేమిటో తెలుసుకోవాలంటే మీరు అనుబంధాలు జ్ఞాపకాలు చదవండి. 

*                         *                              *                              *

     ఎనిమిదేళ్ళ క్రితం ఇలాగే ఓ చీకటి రాత్రి 'లేక్ టాహో' నుండి వస్తుండగా... పైపైకి దూసుకొస్తున్న తెల్లని కత్తులు.... మొదట అవేమిటో నాకర్ధం కాలేదు. "మనం స్నో పడుతుండగా చూడాలని వచ్చాం, అది ఇలా తీరుతుందనుకోలేదు" అని జ్యోతి భయంగా అంటుంటే తెలిసింది అది మంచని. 
Photo couretsy: Astro Bob

మొదట దూది పింజల్లా తెల్లగా అందంగా నన్ను చుట్టేసి గిలిగింతలు పెట్టాయి కాని రాను రాను అవి మంచు బాణాలై యుద్దానికి దిగాయి. ఆ దాడికి చూపు మసకబారింది. ఆకాశం వేలవేల మంచు బాణాలను నిర్విరామంగా సంధిస్తుంటే తప్పించుకోవడానికి నా వైపర్స్, డిఫ్రాష్టర్ చేసిన కృషిని, జర్రున జారుతున్న రోడ్డుమీద నిలదొక్కుకోవడానికి నా టైర్లు పడిన శ్రమను ఈ రోజుకీ మరచిపోలేను. 
  
     "వర్షం కొంచెం తగ్గినట్లుంది కదూ!" అన్న రఘు మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. "ఒంటి గంటక్కూడా సీడర్ పాయింట్ చేరలేమేమో!" సందేహం వ్యక్తం చేసింది జ్యోతి.  అనుకున్నట్లుగానే హోటల్ కు చేరేసరికి నా గడియారం మూడు చూపిస్తోంది.

        ఉదయం ఎనిమిదిన్నరకల్లా నలుగురూ చక్కగా తయారయి వచ్చేసారు. బ్రేక్ ఫాస్ట్ చాలా బావుందట. ముఖ్యంగా ఫ్రెష్ వాఫల్స్. హోటల్ రూమ్ కూడా ఫరవాలేదట. అందరూ చక్కగా నిద్రపోయారట కాని పండు మాత్రం ఆ రాత్రి ఎంతసేపో హోమ్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడట. వాళ్ళమ్మ పడుకోమన్నా "స్కూల్ మానేస్తున్న రెండు రోజులూ చాలా హోమ్ వర్క్ ఉంటుందని" చెప్పేడట. రాత్రంతా వంటరిగా వున్ననాకు వాళ్ళ కబుర్లు వినడం సరదాగా ఉంటుంది. 

       కొత్త ప్రాంతాల కెళ్ళినప్పుడు చిన్న చిన్న రోడ్ల వెంబడి ఊరు చూసుకుంటూ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. సీడర్ పాయింట్ కి అలానే వెళ్ళాము. ఒక చిన్న మోటెల్ ముందు వాళ్ళ అమెనిటీస్ లిస్ట్ లో ‘కలర్ టివి’ ఉండడం చూసి పిల్లలిద్దరూ ఒకటే నవ్వు. "విచ్ సెంచురీ ఆర్ దే ఫ్రమ్" అని. "లేక్ ఎరీ" ఒడ్డునే ప్రయాణిస్తూ గమ్యం చేరాం. పార్కింగ్ లాట్ దాదాపుగా ఖాళీగా ఉంది. వాళ్ళటు వెళ్ళగానే చుట్టూ పరిశీలించడం మొదలెట్టాను. చాలా పెద్ద పార్కింగ్ లాట్ అది. ముందుగా రావడం వలన నాకు మొదటివరుసలోనే స్థలం దొరికింది.  

   ఇంతలో రెండు సీగల్స్ నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాయి. ఎక్కడినుంచి వస్తున్నారని 
అడిగాను. " లేక్ ఎరీ" అని ఆ లేక్ గురించి గొప్పలు చెప్పడం మొదలెట్టాయి. "నేను చూశానులే "లేక్ టాహో". దాని కంటే పెద్దదా?" అని అడిగాను . అవి ఫక్కున నవ్వి ఐదు రెట్లు పెద్దదని, అది 'ఫైవ్ గ్రేట్ లేక్స్ ' లో ఒకటని చెప్పాయి. ఇంకోసారెప్పుడూ ఎక్కువ మాట్లాడి నా అజ్ఞానాన్ని బయటపెట్టుకోకూడని నిర్ణయించుకున్నాను. ఇంతలో హఠాత్తుగా అరుపులు వినిపించడంతో ఉలిక్కిపడ్డాను. ఆ పక్షులు కిసుక్కున నవ్వి, "ఎంటీ, ఎప్పుడూ 'థీం పార్క్' చూడలేదా?" అంటూ ఆట పట్టించాయి. “మా ఊర్లో 'కేరవిండ్స్' ఉంది కాని నేను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. కాని అది కూడా చాలా పెద్దదేనట పండు చెప్పాడు" ఈసారి జాగ్రత్తగా సమాధానం చెప్పాను.


"పండెవరు?" అడిగాయవి. పండు గురించి ఎవరైనా అడిగితే నాకు మహా సంతోషం. ఇక కథ మొదలు పెట్టాను. నేను ప్రపంచాన్ని చూడడం మొదలెట్టిన తొలిరోజుల్లో పండు ఎలా ఉండేవాడో, కార్ సీట్ కూడా వదలని పండు కుకీ క్రంబ్స్, కోక్, కనీసం మంచినీళ్ళు కూడా నా మీద పోయకుండా నన్ను ఎంత శుభ్రంగా చూసుకునేవాడో, వాళ్ళ అక్క చిట్టితల్లి ఎంత అల్లరి పిడుగో, మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్నీ చెప్పాను. 

అవి నాకు 'సీడర్ పాయింట్' గురించి చెప్పాయి. అందులో ‘టాప్ థ్రిల్ డ్రాగన్’  అని ఒకటుంటుందిట. నాలుగొందల ఇరవై అడుగుల నుండి నూట ఇరవై మైళ్ళ వేగంతో కిందకు పడేస్తుందట. అది కూడా కేవలం పదిహేడు సేకన్ల లోనేనట. కాని అది ఎక్కిన వాళ్ళకు మాత్రం జీవితాతం ఆ అనుభవం గుర్తుండి పోతుందిట. అలాంటిదే ‘పవర్ టవర్’ కూడానట.‘మెలినియం ఫోర్స్’ అని ఇంకో రైడ్ ఉంటుందట. దాని పేరు లాగానే  చాలా ఫోర్స్ గా వెళ్తుందట. పండు, చిట్టితల్లి మొదట దానిదగ్గరకే వెళ్ళుంటారని అనుకున్నాను. 
మా ఎదురుగా పచ్చపాములా మెలికలు తిరుగుతూ కనిపిస్తున్న దాన్ని చూపిస్తూ అదే ‘రెప్టార్’ అని చెప్పాయి. రైడ్ ఆకాశం అంచుల్లో ఉన్న దాని తలమీదకు రాగానే ఒక్కసారిగా తలకిందులుగా 
తిప్పేస్తోంది. కెవ్వున కేకలు...అది చూడాగానే నాకు గుండాగినట్లయింది. విండ్ సీకర్ ‘ ఎక్కితే ఆకాశంలోకి తీసుకెళ్ళి గుండ్రంగా తిప్పుతుందట. అక్కడునుండి లేక్ ని చూడడం చాలా బావుంటుందట. 

చెట్టపట్టాలు వేసుకుంటూ ఒకదాన్ని ఒకటి ఉడికిస్తూ తిరిగే ట్రామ్స్ గురించి కూడా చెప్పాయి. అప్పుడప్పుడూ ఇవి వాటిమీద ఎక్కి పార్క్ అంతా తిరిగి వస్తాయట.


'జెయింట్ వీల్’ ఉంటుందట కాని అది సరదాగా ఎక్కడానికే తప్ప పెద్ద రైడ్ కాదట. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే నా నీడ కుడి నుండి ఎడమకు తిరిగింది. ఓ గంట తరువాత చేతిలో కూల్ డ్రింక్స్ పట్టుకుని వచ్చారు నలుగురూ. మోహంలో అలసట కనిపిస్తున్నా ఉత్సాహంగా ఉన్నారు. పండు, చిట్టితల్లి ఇద్దరూ రెండు షర్ట్స్ కొనుక్కున్నారట. ముదురు నీలం రంగు...చాలా బావున్నాయి.  సీగల్స్ కు వీడ్కోలిచ్చి అక్కడినుండి 'షికాగో'బయలుదేరాం.

     రాత్రి గమనించేలేదు గాని ఎటుచూసినా పచ్చని పొలాలతో 'ఒహాయో' చాలా అందంగా ఉంది. నేను వెళ్తున్నది సింగిల్ లైన్, స్పీడు అరవై ఐదు. ఎక్కువ ట్రాఫిక్ లేకపోవడంతో ఓ పది పెంచి దారిని వెళ్తున్న ట్రక్కులను దాటుకుంటూ ఉల్లాసంగా వెళ్తున్నాను. అక్కడక్కడా పొదల పక్కన దాక్కున పోలీస్ కార్లను చూసినప్పుడు మాత్రం కొంచెం మెల్లగా పోతున్నాను. ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో నా వెనుగ్గా మీరూహించిందే... పోలీస్ కార్. ఇక చెయ్యడానికేం వుంది, మెల్లగా రోడ్డు పక్కగా ఆగాను. పిల్లలిద్దరూ హడావిడిగా సీట్ బెల్ట్ పెట్టేసుకున్నారు. కాప్ దగ్గరకొచ్చి విండోలోకి తొంగి చూస్తూ “హౌ ఆర్ యు సర్?’ అని అదీ ఇదీ మాట్లాడి ఓ పావుగంట తరువాత ఓ కాగితం జ్యోతి చేతిలో పెట్టి వెళ్ళాడు. “టికెట్ ఇచ్చాడా?” నన్ను రోడ్డు మీదకు తీసుకురావడానికి కిటికీలో నుండి వెనక్కు చూస్తూ అడిగాడు రఘు. “లేదు రెండొందలు ఫైన్ వేశాడు” చెప్పింది జ్యోతి.

గుడ్డిలోమెల్ల అని నిట్టూర్చాను. పోయినసారి డెల్లాస్ వెళ్ళేప్పుడయితే మరీ దారుణం. ఇది జరిగింది 'అలబామా'లో అనుకుంటాను. “నేను బుద్దిగా క్రూజ్ కంట్రోల్లోనే వెళ్తున్నాను. ఆ విషయం రఘు చెప్తున్నా వినకుండా కాప్ టికెట్ ఇచ్చేసాడు. వేరే ప్రాంతాల నుండి వచ్చే మాలాంటి వారంటే మరీ చిన్నచూపనుకుంటాను. పైగా డిసెంబర్ నెలలో టికెట్లు ఇవ్వడాలు మరీ ఎక్కువట. నా బోర్డు మీద ఊరి పేరు తీసేస్తే బావుణ్ణు.

దగ్గరలో ఎక్కడైనా పెద్ద రెస్ట్ ఏరియా ఉందేమోనని చూశాను. అక్కడైతే నాలాంటి వారు ఎంత మందో వస్తారు. వారిక్కూడా ఇలాగే అయిందేమో కనుక్కుందామనుకున్నాను. కాని నా కోరిక తీరలేదు. చిన్న రెస్ట్ ఏరియాలోనే ఆగి, కనుచీకటి పడుతుండగా 'ఇండియానా'లోకి అడుగుపెట్టాను. “హౌ మచ్ లాంగర్?” అడిగాడు పండు. “షికాగో వెళ్ళేప్పటికింకో మూడు గంటలు పడుతుంది నాన్నా. కాసేపు పడుకోరాదూ టైర్డ్ అయినట్లున్నావ్” చెప్పింది అమ్మ.


Thursday, October 2, 2014

అనుబంధాలు జ్ఞాపకాలు

      నాకు దూరప్రయాణాలంటే చాలా ఇష్టం. నేను తొలిసారిగా పదిగంటలు ప్రయాణం చేసింది ఆరెగాన్ లోని 'క్రేటర్ లేక్' కు. ఆ ప్రయాణం మరీ కొలంబియా నది ఒడ్డునే సాగిందేమో మరింత నచ్చేసింది. ఆ తరువాత చాలా సంవత్సరాలకు 'డెల్లాస్' వెళ్తూ మిసిసిపీని దాటడం మరిచిపోలేని అనుభూతి. తరువాత  'ఫ్లోరిడా'. ఇదిగో మళ్ళీ ఇంత కాలానికి 'షికాగోవెళ్ళే అవకాశం దొరికింది.  

     చిరచిరలాడే ఎండ వేడికి చెట్టూచేమా విసురుకుంటూ మాగన్నుగా కునుకు తీస్తున్న సమయంలో ఓ మూడు సూట్ కేస్ లు మెల్లగా నా వెనుక సర్దుకున్నాయి. రెండు సీట్ల మధ్యలో రంగు రంగుల బాగ్ ఒకటి గర్వంగా నిటారుగా నిలబడింది. ఏమున్నాయో ఇంత మిడిసిపడుతోందని తొంగి చూశాను. నారింజరంగు బేబీ కారేట్స్, నిగనిగలాడే ద్రాక్ష పండ్లూ... మరి హాట్ చీటోస్ పాకెట్ ఏదీప్రయాణం అనగానే చిట్టితల్లి దాన్ని తేచ్చేసుకుంటుందే. బహుశా ఏ గేస్ స్టేషన్లోనో కొంటుంది కాబోలు! బంధు మిత్ర సమేతంగా బిలబిల్లాడుతూ వాటర్ బాటిల్స్ అన్నీ కప్ హోల్డర్స్ లో చేరిపోయాయి.  

     "త్వరగా ఊరు దాటాలి లేకపోతే ఆ సెవెంటీ సెవెన్ మీద విపరీతమైన ట్రాఫిక్" అంటూ రఘు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. అనుకునట్లుగానే ఆరుగంటలయ్యేటప్పటికల్లా ఊరికి వందమైళ్ళ దూరంలో ఉన్నాం. ఇక్కడంతా చుట్టూ నాలాంటి వాళ్ళే  మా ఊర్లో ఇలా లేరని కాదు. ఎంతైనా కొత్తవాళ్ళతో కలసి చేసే ప్రయాణమే వేరు. జ్యోతిరైలు ప్రయాణం గురించి ఇలానే చెప్తూంటుంది. ఎవరెవరో కొత్తవాళ్ళు కలుస్తూంటారట...బోలెడు కబుర్లు చెప్పుకుంటారట...గమ్యం రాగానే ఎవరిదారిన వాళ్ళు దిగిపోతారట. ఇప్పుడు కూడా అలానే నాలాంటి వారు రోడ్డు మీద అక్కడక్కడా కనిపిస్తున్నారు. కొందరు నింపాదిగా వెళ్తుంటేమరి కొందరు ప్రపంచం తల్లకిందులై పోతుందన్నట్లు అడ్డం వచ్చినవారిని దాటుకుంటూపక్కకు తొలగని వారిని విసుక్కుంటూ రయ్యిన ఒకటే పరుగులు. ఎక్కడన్నా కాప్ కారు కనపడగానే ఉలిక్కిపడి ఏమీ తెలీని వాళ్ళలా అతి మెల్లగా వెళ్ళడం. కొందరు కొత్త ముస్తాబులతో కళకళలాడుతుంటే మరికొందరు మట్టికొట్టుకుపోయి మురికిగా ఉన్నారు. నిన్న సాయంత్రమే పండువాళ్ళనాన్న, నన్ను షెల్ దగ్గరకు తీసుకెళ్ళారు. ఆక్కడి ప్లాస్టిక్ కుంచెలు చక్కలిగిలి పెడ్తూ శుభ్రంగా స్నానం చేయించాయి. ఇంటికి రాగానే, అందంగా ముద్దొస్తున్నానంది చిట్టితల్లి.

      ఆసక్తిగా చూస్తున్న చెట్లను పలకరిస్తూ, రోడ్డు పక్కన పచ్చరంగులో మెరిసిపోతున్న సైన్ బోర్డ్ వీడ్కోలు చెప్తూ వెళ్తున్నాం. ఓ గంట గడిచేప్పటికి బుజ్జిపండు కాఫీ కావాలన్నాడు. రెండేళ్ళ క్రితం వరకు ఫ్రాపుచినో అడిగేవాడు. ఇంతలో ఎంత పెద్దవాడయ్యాడు! రెస్ట్ ఏరియా దగ్గర ఆగాం. అదంత పెద్దదేం కాదు కాని చుట్టూ చెట్లతో ముచ్చటగా పర్ణశాలలా ఉంది. నా ఎదురుగా వున్న మేపల్ చెట్టు మీద గూడులోంచి రెండు బుల్లిపిట్టలు తొంగి తొంగి చూస్తున్నాయి. ఆకాశంలో పక్షులు బారుగా రివ్వున ఎగురుతున్నాయి. అవి కనిపించినంతవరకూ చూడడం జ్యోతికి చాలా ఇష్టం. తన అలవాటే నాకూ వచ్చింది. మరి తొమ్మిదేళ్ళ సావాసం కదూ! కాఫీ ఘుమఘుమలతో ఈ లోకం లోకి వచ్చాను. అందరూ సర్దుకుని కూర్చున్నాక బయలుదేరాం. నారింజ రంగు కిరణాలు మేఘాలకు రంగులద్దడాన్ని చూస్తూ ప్రయాణించడం భలే ఉంటుంది. ఓ గంట పండు, చిట్టితల్లి సెల్ ఫోన్ లో ఏమిటో ఆడుకున్నారు. ఎప్పట్లా గేమ్ క్యూబ్ తెచ్చుకోలేదేమిటో?

     నాలుగు గంటల తరువాత "డిన్నర్ కి ఎక్కడాపను?" అని నాన్న అడగ్గాన్నే పండు "సబ్ వే" అని అరిచాడు. అదేమిటో ప్రయాణాలప్పుడు లంచ్డిన్నర్ అనగానే పండు సబ్ వే తప్ప మరోటి అడగడు. హాలోపినోచీజ్చిపోట్లే సాస్ కలిసిన వీట్ బ్రెడ్ వాసనంటే నాక్కూడా చాలా ఇష్టం. హెడ్ లైట్లు వెలిగిందాకా చూసుకోనేలేదు బాగా చీకటి పడిపోయిందే! వెస్ట్ వెర్జీనియాలో ఉన్నట్లున్నాం చుట్టూ కొండలే. ఆఫీస్, స్కూలు కబుర్లతో ప్రయాణం హుషారుగా సాగుతోంది. అందులో చిట్టితల్లి కబుర్లు మొదలెట్టిందంటే ఎవరైనా మంత్ర ముగ్దులై వినవలసిందే. కాసేపటికి నాన్న పిల్లలిద్దరినీ మెల్లగా ఆటలోకి దించాడు. ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్ధాలు చెప్పడం. పిల్లలిద్దరికీ తెలుగులో అన్ని పదాలు తెలుసని నాకు అప్పటిదాకా తెలీనే తెలీదు.

     చీకటి చిక్కబడింది. పిల్లలిద్దరూ మధ్య సీట్లు మడిచేసి వాటిమీద కాళ్ళు చాపుకుని చివర సీట్లో దుప్పట్లు కప్పుకుని నిద్రపోయారు. కొండ మీద ప్రయాణం పక్కనే ఎత్తైన చెట్ల వెనుగ్గా పెద్ద లోయ. ఆకాశంలో ఎక్కడా ఒక్క చుక్క కనపడడంలేదు. రాత్రి పదకొండు దాటిందేమో రోడ్డుమీద పెద్దగా సంచరంలేదు. అప్పుడు మెరిసింది ఓ మెరుపు... చెట్ల వెనగ్గా దూరానున్న కొండమీద. ఆకాశం నుంచి భూమి వరకూ తళుక్కున మెరిసి మాయమైంది, వెనుకే పెద్ద ఉరుము. చిన్నగా చినుకులు మొదలయ్యాయి. ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనదిఅంటూ సిడి లోంచి మధురమైన పాట వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న చల్లగాలి కొమ్మల చుట్టూ తిరుగుతూ గిలిగింతలు పెడుతోంది. ఆకాశాన్ని అందంగా కవ్విస్తూ జలతారు మెరుపులు. "ఇక్కడే ఆగిపోయి అలాగే చూస్తూ ఉండాలనిపిస్తోంది" అంది జ్యోతి. ఆ మైమరుపులో తను రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేక పోతోందనిపించింది.  

     రాత్రి పన్నెండయ్యుంటుందేమో! అనుకున్నదంతా అయింది. చిన్న చినుకులు కాస్తా జడివానగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. కుండలతో కుమ్మరించినట్లుగా వర్షం పడడం మొదలయ్యింది. పక్కన వెళ్తున్న పెద్ద ట్రక్కు చక్రాల క్రింద చిద్రమైన నీటి బిందువులు నాకళ్ళకు అడ్డం పడుతున్నాయి. రఘు పిల్లల్ని లేపి సీట్ బెల్టు పెట్టుకోమని హెచ్చరించాడు. రెండో వైపున లోయ ఎంత దూరంలో ఉందో కనిపించడం లేదు. "సెడార్ పాయింట్ చేరడానికి ఇంకా మూడు గంటలు పడుతుంది. మనం ముందే ఎక్కడన్నా ఆగవలసిందిఅని రఘు అనగానే నాకు వొళ్ళు జలదరించింది. భయం నాగురించి కాదు నా ఒడిలో ఆడుకుని పెరిగిన పిల్లలు, బడికి కాని, మరెక్కడికైనా కాని నేను తీసుకు వెళితేనే తప్ప వెళ్ళని పిల్లలు ప్రమాదంలో ఉన్నారని. అంతవరకూ కారులో వినిపించిన కబుర్లు ఆగిపోయాయి. జోరున కురుస్తున్నవర్షం చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం.....  


ఒక చిన్న కాఫీ బ్రేక్  
తరువాత భాగం ఇక్కడ

Sunday, August 24, 2014

ఇంతకాలం ఏం చేస్తున్నట్లు?

ఒకటా రెండా మూడేళ్ళవుతోంది. అయినా ఏం లాభం? ఏదో ఉద్దరించేస్తారని ఇన్ని రోజులు వృధా చేశాం. ఎన్ని సాయంత్రాలు పార్టీలకు ఆలస్యంగా వెళ్ళామో! ఎన్ని మధ్యాహ్నాలు నిద్రలు త్యాగం చేశామో ఆ భగవంతుడికే తెలుసు. ఇంత చేసి చివరకు ఏమైంది?

మూడేళ్ళ క్రితం ఇదే రోజుల్లో మా పిల్లాడ్ని తెలుగు బడిలో చేర్చాను. అసలు నాకు పంపించాలనే లేదు. "ఈ రోజుల్లో తెలుగెందుకు పనికొస్తుందీ" అంటూనే వున్నారు మా వారు. మా పక్కిళ్ళ వాళ్ళంతా పంపిస్తుంటే మనం పంపకపోతే బావుండదని ఆయన్ను ఒప్పించి మరీ పంపించాను. పైగా అప్పుడప్పుడూ టివిల్లో అదీ కూడా చూపిస్తున్నారుగా తెలుగు నేర్చుకుంటున్న పిల్లల్ని. చెప్పుకోవడానికి కాస్త గర్వంగా కూడా ఉంటుంది.

ఏదో వారానికో గంటే కదా అనుకున్నా. చేరాక తెలిసింది అక్కడ కూడా హోం వర్క్ ఉంటుందని. మొదటే తెలిస్తే ఆ..సింగినాదం అనుకుని అసలు చేర్పించేదాన్నే కాదు. ఆ రోజు పాఠశాల ఓరియెంటేషన్ కి వెళ్ళాల్సింది. కాస్త మబ్బేయడం చూసి బద్దకించాను. అక్కడే చెప్పార్ట రోజుకో పావుగంట చొప్పున వారానికి నాలుగు రోజులు హోం వర్క్ చేయించాలని. స్కూల్ వర్క్, కుమాను చేసేసరికే రాత్రి ఎనిమిదవుతుంది, ఇక తెలుక్కు టైం ఎక్కడుంటుందీ?

సౌజన్య వాళ్ళమ్మాయి అన్ని హోం వర్క్ లు గంటలో చేసేస్తుందని ఆవిడ ఒకటే గొప్పలు.... ఎక్కడా అనకండి. ఆ పిల్ల ఒట్టి ముచ్చు. కూర్చున్న దగ్గరనుండి కదలకుండా మొత్తం హోం వర్క్ చేసేస్తుంది. అలా చేస్తే ఎవరికి మాత్రం అవదూ! మా వాడు అట్లా కాదు. మాహా యాక్టివ్. ఒక్క పావుగంట కూర్చుంటే ఎక్కువ .... నేనట్లా ఫోన్ అందుకోగానే చటుక్కున ఏ స్కూటరో తీసుకుపోయి చీకటి పడ్డాగ్గాని రాడు. పిల్లలన్న తరువాత ఆ మాత్రం ఆడకోకపోతే యెట్లా! అప్పటికీ హోం వర్క్ చేయించకుండా యేమీ లేను. వీలయినప్పుడల్లా ఆదివారాలు ఓ గంట కూర్చోపెట్టి వారం మొత్తం చెయ్యాల్సింది రాయించేస్తాను. అట్లా చేస్తే వాళ్ళకు రాదని వాళ్ళ టీచర్లు ఒకటే ఏడుపు. అట్లాంటివనీ నేను పట్టించుకోనులెండి. మనకు తోచింది మనం చేస్తాం కాని వాళ్ళు చెప్పింది మనం చేసేదేవిటీ?

పద్యం సరిగ్గా చెప్పలేదనీ, ప కు, వ కు తేడా లేకుండా రాస్తున్నాడని, బ కు తలకట్టిస్తున్నాడని...... ఇంకా ఏమిటేమిటో సణుగుళ్ళు. ఆ టీచర్లు తీరి కూర్చుని తెలుగో అని మా ప్రాణాలు తీయకపోతే ఏ తెలుగు సినిమా అన్నా చూసుకోవచ్చుగా అంత తెలుగు మీద అభిమానం ఉన్నవాళ్లు.

అక్షరాలంటే సరే ఏదోలే అనుకోవచ్చు. సుమతీ శతకాలు, వేమన శతకాలు అట. ఎందుకు పనికొస్తాయవి? చిన్నప్పుడు మేమూ చదువుకున్నాం. అవన్నీ బుర్రలో కెక్కించుకుంటే ఇట్లా ఉండేవాళ్ళమా. ఈ రోజుల్లో కావలసింది పక్కవాడ్ని తొక్కేసి యెట్లా పైకి రావాలి? లేదా సూది తీసి పక్కన పెడుతూ దుంగను మోస్తున్న మొహం ఎలా పెట్టాలి" ఇలాంటివి నేర్పాలి కాని..ఇలా నీతి, నిజాయితీ అని పాడుచేసే చదువులెందుకు?

ఈ పిల్లాడు మాత్రం ఎన్నాళ్ళు వెళతాడ్లే అనుకున్నా! మూడేళ్ళయినా మానేస్తాననే మాటే లేదు. పిల్లలకు కథలూ కాకరకాయలూ అంటూ క్లాసు మానకుండా ఏవో ఎత్తులు వేస్తూనే ఉంటారు ఆ టీచర్లు. నాకు తెలీకడుగుతాను తెలుగు నేర్పించడానికి కథలెందుకు? మీరే చెప్పండి. ఉండబట్టలేక ఆ మాట అడిగాను కూడా! "వీళ్ళు చదివే ఇంగ్లీషు పుస్తకాల్లో పెద్దగా నేర్చుకునేవేం ఉండవండీ. వాళ్ళకు లోకజ్ఞానం రావడానికి మేము పంచతంత్రం కథలూ, నీతి కథలూ చెప్తాం" అని సమాధానం. ఆ లోకజ్ఞానమే ఉంటే వీళ్ళు నాలుగు రాళ్ళు సంపాదించుకునే ఆలోచనే చేసేవాళ్ళుగా.

చదువంటే ఏదో అనుకోవచ్చు, వార్షికోత్సవం ఒకటి చేసి నాటకాలు, డ్రామాలు అంటూ మా ప్రాణాలు తోడేస్తారు. అదేమంటే మేమే ప్రాక్టీస్ చేయిస్తాము. మీరు కొంచెం మెయిల్స్ అవీ చూసి వస్తున్నారో లేదో రిప్లై ఇవ్వండి చాలు అంటారు. క్లాసుకు పంపించడమే కాక మళ్ళీ ఈ మెయిల్ చూడ్డం దానికి రిప్లై ఇవ్వడం మనకేం పని లేదనుకున్నారా! నేనేం పట్టించుకోలా. వాళ్ళ తిప్పలేవో వాళ్ళే పడ్డారు. వార్షికోత్సవం నాడు నాటకం చూశాం. అల్లూరి సీతారామరాజుని అందరూ పొగడడమే. మా వాడి వేషం అది కాదు లెండి. ఆ వేషం మా వాడికివ్వలేదేమని అడిగాను. "తెలుగు కాస్త మాట్లాడేవాళ్ళకిచ్చాం అన్నారు కాని, అదేం కాదు వాళ్ళమ్మ ఏ టీచర్ కో ఫ్రెండ్ అయివుంటుంది.

ఈ మధ్య మా వాడు ఇంట్లో కనిపించినవన్నీ తీసి క్లోజేట్ లో పడేసి తలుపేస్తున్నాడు. అదేమంటే మా తెలుగు టీచర్ ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టమన్నాడని సమాధానం. ఆ పద్యాలో శ్లోకాలో పాడో.. ఆ నేర్పించే వాటితో ఊరుకోక మంచి విషయం అని ఒకటి మొదలెట్టారుగా. అప్పటినుండి వీడు అన్నం తింటున్నప్పుడు టివి కట్టేయడం, గుమ్మం ఎదురుగా వదలిన చెప్పుల్ని పక్కకు తోసేయడమూనూ..వెతుక్కోలేక చస్తున్నాం. ఆ మాత్రం విషయాలు మనం చెప్పుకోలేమూ పెద్దయ్యాక, ఎనిమిదేళ్ళ వాడికి అవన్నీ ఇప్పట్నుండే ఎందుకు?

ఇంతకీ వాళ్ళు చెప్తున్న పాఠాలెక్కడివనుకున్నారు... ఏ స్టేట్ సిలబస్సో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇక్కడ పిల్లల అవసరాలకు తగ్గట్లుగా ఏమిటో వాళ్ళే రాసుకున్నారట. పిల్లలకు సరదాగా ఉండేలా వర్క్ షీట్స్ కూడా చేశార్ట. ఇవన్నీ చెయ్యడానికి వీళ్ళకేం తెలుగులో డాక్టరేట్లు లేవు. పదో తరగతి దాకా వెలగబెట్టిన తెలుగు చదువే. ఇలాంటి వాళ్ళే, వీళ్ళకో పది మంది వత్తాసు. "అబ్బా ఇంత బాగా ఉంది అంత బాగా ఉంది. మీరు ఏం ఆశించకుండా ఇంత చేస్తున్నారూ" అని. నేను మాత్రం నమ్మను బాబూ. ఈ రోజుల్లో ఎవరు మాత్రం ఊరికినే చేస్తారు? నాలుగు రోజుల్లో నాలుగొందలు ఫీజు పెట్టకపోతే నన్నడగండి.

ఇవన్నీ సరే. "మీరు పిల్లలతో ఇంట్లో తెలుగులో మాట్లాడండో" అని ఒకటే నస. అది చాలనట్లు రాత్రిపూట తెలుగు కథ చదివి వినిపించాలట. ఓ టీచర్ అయితే ఇంకా రెండు మెట్లు ఎక్కువే. మమ్మల్ని కూడా తెలుగు పుస్తకాలు చదవమంటుంది. అలా అయితే వాళ్లకు మన భాష మీద ఆసక్తి పెరుగుతుందట. ఇంకా నయం వాళ్ళకోసం మమ్మల్ని హిస్టరీ, జాగ్రఫీ పుస్తకాలు చదవమన్నది కాదు! వింటున్నాం కదా అని చెవిలో ఏకంగా కేలీఫ్లవర్స్ పెట్టడమే. మన పిల్లలెవరు కనిపించినా తెలుగులోనే మాట్లాడమని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తున్నారు. నేను మాత్రం పిల్లల్ని తెలుగులో మాట్లాడమని కష్టపెట్టలేను బాబూ!

పోయినాదివారం సౌజన్య వాళ్ళమ్మాయి రేడియోలో ఏదో ప్రోగ్రాం చేసిందట. వాళ్ళ నాన్నమ్మ ఊరూ, వాడా మైకు పెట్టేసింది. వాళ్ళది ఇండియాలో మా పక్క వీధేలెండి. మా వాడు కూడా నాలుగు తెలుగు ముక్కలు రాస్తున్నాడు. కూడుకుని కూడుకుని చదువుతున్నాడు. అయినా మూడేళ్ళు పంపినా ఒక్క ముక్క మాట్లాడించలేక పోయాక తెలుగు బడికి పంపించి ఏం లాభం? ఇంతకాలం వాడి టీచర్ ఏం చేస్తున్నట్లు?

Monday, July 28, 2014

సాహితీ బంధువులు

"అసలు బంధువులతోనే నాలుగు మాటలు మాట్లాడడానికి తీరిక లేకపోతుంటే ఇంకా ఈ సాహితీ బంధువులేమిటి?" అనుకుంటున్నారా. మన బంధువుల సంగతి తరువాత మాట్లాడుకుందాం కానీ ఈ సాహితీ బంధువుల గురంచి మాత్రం మీకు చెప్పకుండా ఉండలేక పోతున్నాను. 

*                        *                         *                       *                         *

"మనమో కుగ్రామంలో ఉంటున్నాం కదూ!" నాటా సభల నుండి బయలుదేరి కారు ఊరిదారి పట్టగానే మా వారితో అన్నాను.
"అదేం? మన ఊర్లో కూడా హారిస్ టీటర్, వాల్మార్ట్, లోవ్స్ అన్నీ ఉన్నాయిగా?" ఆశ్చర్యపోయారు.
"అవన్నీ కాదు. అట్లాంటాలో నెలనెలా సాహితీ సభలు జరుగుతాయట. ఇండియా నుండి సాహితీ వేత్తలు వచ్చినప్పుడు కూడా అందరూ సమావేశమవుతారట." 
"మనమూ మొదలుపెడదాం. పైగా రమణి గారు కూడా వస్తున్నారుగా" సబ్ వే ముందు కారు ఆపుతూ అన్నారు.
"మన ఊళ్ళో పుస్తకం చదివేవాళ్ళని, అందులో తెలుగు పుస్తకం చదివేవాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు." అన్నాను.
"ఫణిగారు, మాధవ్ గారు జులై ఆఖరి వారం రమణి గారిని అట్లాంటా తీసుకువెళ్ళడానికి వస్తామన్నారు. వారికిష్టమైతే ఆ వారాంతం సాహితీ సదస్సు ఏర్పాటు చేద్దాం" 
"అలాగే కాని ఎవరైనా వస్తారంటారా? " 
"ఏమో! ఇలా సాహితీ సదస్సు  జరుగుతుందని మెయిల్ పంపిద్దాం. ఆసక్తి ఉన్నవాళ్ళు వస్తారు".


"సాహితీ మిత్రులకు అభినందనలు, 

మన ఊరికి ప్రముఖ సినీ రచియిత, నంది అవార్డు గ్రహీత బలబద్రపాత్రుని రమణి గారు వచ్చారు, వారితో పాటు హాస్య కథల రచయిత ఫణి డొక్కా గారు, మరియు మరో రచయిత మాధవ్ దుర్భగారు అట్లాంటా నుంచి వస్తున్నారు. మనం ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకుని ఒక సాహితీ సదస్సు ఏర్పాటు చేసుకుంటే ఎలావుంటుందనే ఆలోచన వచ్చింది, వచ్చిన వెంటనే మీరు గుర్తు వచ్చారు. ఈ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మా ఇంట్లో సదస్సు జరుగుతుంది. మీకు తెలిసిన సాహిత్యాభిమానులను కూడా ఆహ్వానించగలరు" అంటూ మెయిల్ పంపించాము.

*                        *                         *                       *                         *

రమణి గారు ఓ పది రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు. అప్పటినుండి మా తోట పువ్వులు పుయ్యడం మానేసి నవ్వులు పుయ్యడం మొదలెట్టింది. బంధు మిత్రులతో ఇల్లంతా సందడే. ఒక్కరేగా వచ్చింది మరి ఈ సందడేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఆ ఒక్కరూ మొత్తం సినీ ఫీల్డ్ ని, కాదు కాదు యావత్ ప్రపంచాన్నే వెంటబెట్టుకుని వచ్చేశారు. 

ఈ శనివారం మధ్యాహ్నానికి ఫణి గారు, మాధవ్ దుర్భా గారు వచ్చారు. భోజనాలు చేస్తూ కబుర్లు చెప్పుకున్నామో, కబుర్లే భోంచేశామో చెప్పడం కష్టమే! ఒక్క క్షణంలో టైం మూడున్నరైంది. 

"ఇంతకూ మేం దేనిగురించి మాట్లాడాలి? "అడిగారు ఫణి గారు. 
"ఏదైనా హాస్య ప్రధానంగా అయితే బావుంటుందేమోనండి. నిజజీవితంలోగాని, సాహిత్యంలోగాని మీ ఇష్టం" చెప్పారు రఘు.
"జ్యోతిర్మయి గారూ సుమారుగా ఎంతమంది వస్తారండి? " అడిగారు మాధవ్ గారు.
"సాహిత్యం అంటే ఆసక్తి ఉండొచ్చని మేం అనుకున్న వాళ్ళకి మెయిల్ పంపాపండి. ఓ పది మంది రావచ్చు." అని సమాధానం ఇచ్చాను. వారు కూడా రారేమోనని మనసులో సందేహమే!

మరో పావుగంట గడిచింది. ఓ నలుగురు మిత్రులు వచ్చి అతిధులను పరిచయం చేసుకుని, మా మధ్యగదిలో ఓ ముప్పై మంది కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేసేశారు. ఓ ఇద్దరమ్మాయిలు వంటగదిలోకి దూరిపోయి వద్దన్నా వినక ఫ్రీజర్ లోని స్వీట్ కార్న్ ని, అరలోని టీపొడిని పొయ్యెక్కించారు. "మీరెళ్ళి ఆ వచ్చేవాళ్ళను చూసుకోండి" అంటూ నన్నా ప్రాంతాల నుండి తరిమేశారు.

మరో పావుగంటకు ఒకరొకరూ రావడం మొదలెట్టారు. వేసవిలో తల్లిదండ్రులు అమెరికాలోని పిల్లల దగ్గరకు రావడం మామూలే. అలా వచ్చిన పెద్దవారిలో లైబ్రేరియన్, తెలుగు ప్రొఫెసర్, సోషల్ వర్కర్ ఇలాంటి వాళ్ళు రావడం సభకు నిండుదనం తెచ్చింది. పరిచయాలతో మొదలై,  చలం సాహిత్యం, సెన్సార్ బోర్డ్, ప్రస్తుతం వస్తున్న సీరియల్స్, వాటి తీరుతెన్నులు,  సినిమా వెనుక కష్టాలు, మంచి కథలు ఇలా అన్ని అంశాలను హాస్యంలో రంగరించి వచ్చిన ఆ ముగ్గురూ మమ్మల్ని మరో లోకంలోకి తీసుకువెళ్ళారు. నవ్వులు, చప్పట్లు, ప్రశ్నోత్తరాలతో సమయం ఎలా గడిచిందో! రాత్రి ఎనిమిదైనా ఎవరికీ కదలాలని లేదు. 


 

అందరూ వెళుతుండగా మాధవ్ గారన్నారు. "సాహితీ సదస్సులకు ఫోన్ చేసి పిలిస్తేనే రావడం కష్టం. అలాంటిది మీ ఊర్లో ఒక్క మెయిల్ పంపితే దాదాపుగా ముప్పై మంది రావడం...ఇలా ఇన్ని గంటలు ఆసక్తిగా వినడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇకనుండి మా సాహితీ సభలు మీ ఊర్లో పెట్టుకోలనిపిస్తుంది" అని. "రావడం మా ఊరి విశేషమైనా వారిని ఆసక్తిగా కట్టిపడేసిన ఘనత మీదేనన్నాను". 

పుస్తకాల్లో ఇంత హాస్యం ఉంటుందా అని మా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓ ఇద్దరు స్నేహితులు నన్ను పక్కకు పిలిచి "ఫణి గారు, మాధవ్ గారు అట్లాంటాలోనే ఉంటారు కదండీ. వారిని మన వేదిక మీద ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమం చేస్తే బావుంటుందని" వారి మనసులో మాట చెప్పారు. ఇంకో నలుగురు "ఇకనుండీ మనం ప్రతి నెలా కలిసి ఒక పుస్తకం గురుంచో ఒక కథ గురుంచో మాట్లాడుకుందాం" అని చెప్పారు. "ఉందిలే మంచి కాలం ముందు ముందునా" అని మనసులోనే పాడుకున్నాను.

అందరూ వెళ్ళాక సినిమాల గురించి మాట్లాడుతుండగా ఫణిగారన్నారు "మంచి సినిమాలు వస్తున్నాయి కాని వాటిని చూసి ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడంతో ఎవరికీ వాటిని తీసే ఉత్సాహం ఉండట్లేదని". 
"నిజమే కదా!" అనిపించింది. ఎందుకంటే మిధునం లాంటి సినిమాలు మా ఊర్లో రిలీజ్ కూడా అవవు. 
దానికి ఆయన చెప్పారు "ప్రతి ఊరిలో ఓ వందమందిమి కలసి మంచి సినిమా తీస్తే మేము తప్పకుండా చూస్తామని చెప్తే ఆ సినిమా తీసేవాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళకు నష్టమూ రాదు" అని. 
గొప్ప పరిష్కారం! సమస్య గురించి వందసార్లు మాట్లాడడం కన్నా పరిష్కారం వైపు ఓ రెండు అడుగులు వేస్తే సమస్య ఇట్టే తేలిపోతోంది. ఏమంటారు?

అవండీ సాహితీ బంధువుల విశేషాలు. అలా నిన్నంతా మా ఇంట్లో హాస్య రసం యేరులై ప్రవహించింది. ఇప్పడు కూడా ఏ వైపు చూసినా నవ్వులే కనిపిస్తున్నాయ్.  



Tuesday, July 8, 2014

పన్నీటి తలపులు నిండగా...

     పూర్వం ఐదు రోజుల పెళ్ళిళ్ళు చేసేవార్ట. ఆత్మీయులతో ముచ్చట్లు, బాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, పట్టు చీరల గరగరలు, కొత్త చుట్టరికాలు, హడావిడి పరుగులు....అలంటి పెళ్ళికి వెళ్ళొచ్చాక ఎలా ఉంటుందో అలా ఉందిప్పుడు. ఇంతకూ ఏమిటీ హడావిడి? ఎక్కడకు వెళ్ళామనే కదూ సందేహం. నాటా సంబరాలకు వెళ్ళాం. 

    శుక్రవారం అట్లాంటా చేరి మేరియట్ ముందు కారు దిగగానే ఆత్మీయ పలకరింపులు, ముప్పైయిదో అంతస్తులో ఓ అందమైన గది. అక్కడినుండి కిందకు చూస్తే ఆశ్చర్యం! సంబరాలు చూడడానికేమో ఆకాశాన్ని ఖాళీ చేసేసి చుక్కలన్నీ నేలకు దిగివచ్చాయి. 

   చీరలమీద చెమ్కీలయ్యాయి. చంద్రబోస్ గారి పాటలో అక్షరాలయ్యాయి, బాలుగారి స్వరంలో రాగాలయ్యాయి, నిర్మల గారి పదానికి అందెలయ్యాయి, రామారెడ్డి గారి పద్యాలలో ఛందస్సయ్యాయి, సాహితీ సభలలో చెణుకులయ్యాయి...అక్కడా ఇక్కడా అనేమిటి అంతటా తామై చుక్కలు మెరిసిపోయాయి....మురిసిపోయాయి.

   మృష్టాన్న భోజనం, చీనీ చినాంబరాలు, పద్యాలు, పాటలు, పుస్తకాలు, అవధానాలు...ఒకటా. రెండు రోజులూ మరో ప్రపంచంలోవున్నట్లే. ఇల్లూ, వాకిలి, మొక్కలు, పిల్లలు, బ్లాగులూ ఇలా ఏవీ గుర్తే రాలేదు. నాకు నచ్చినవి కొన్ని మీతో పంచుకుందామని...పదిలంగా దాచుకుందామని.

సంగీత నవావధానం  


సంగీత నవావధానం 
ఈ అవధానానికి శ్రీనివాస్ కిషోర్ భరద్వాజ గారు అధ్యక్షత వహించారు. మీగడ రామలింగస్వామి గారు అవధాని. రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సింహాచల శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వడ్డే కృష్ణ గారు, బాలాంత్రపు శారద గారు, దుర్వాసుల శిరీష గారు, దువ్వూరి రమేష్ గారు, ప్రాశ్నికులు. 

ఇదే మొదటిసారి సంగీతావధానం చూడడం. ప్రశ్నికులు అవధానిగారికి ఓ పద్యం ఇచ్చి ఫలానా రాగంలో పాడమని చెప్పగానే అవధాని గారు రాగాలు తెలియని వారికి కూడా అర్ధమయ్యే రీతిలో రెండు మూడు పాటల పల్లవులు పాడి ఆ రాగంలో పద్యం పాడారు. కొన్ని రాగాల విశిష్టతలను కూడా చెప్పారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

పాటలు, పాట్లు, హిట్లు 


పేరు గమ్మత్తుగా ఉంది కదూ! చంద్రబోస్ గారే పెట్టారట. ఈ కార్యక్రమంలో రసరాజు గారు, వెన్నెలకంటి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు పాల్గొన్నారు. 

పాట నచ్చితే మన మొబైల్ లోనో, ఐపాడ్ లోనో ఓ వెయ్యిసార్లన్నా వినేస్తూ ఉంటాం. ఆ పాట ఎవరు రాసారన్నది కూడా చాలా సార్లు పట్టించుకోము. అలాంటి పాటలు రాయడానికి పడే పాట్లు గురించే వివరించారు. అది కూడా పొట్ట చెక్కలయ్యేట్లు నవ్విస్తూ. రెండు గంటల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అందరూ పెద్ద పెద్ద రచయితలు ఎలా ఉంటారో అనుకున్నాను. వారికెవ్వరికీ కొంచం కూడా గర్వం లేదు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడారు.

సాహితీ సదస్సు 

అశోక్ తేజ గారు 'నేలమ్మా... నేలమ్మా' అని పాడుతుంటే గుండె చెమ్మ కంటిలో మెరిసింది. వెన్నెలకంటి గారు 
 శ్రోతల ప్రశ్నలకు సమాధానంగా ఘంటసాల గారి పాటల గురించి, పాటల వెనుక కథల గురంచి ఎన్నో విషయాలు చెప్పారు. రమణి గారు మాటలు ఆ సభలో నవ్వుల పువ్వులు పూయించాయి. గెద్దాల రాధిక గారు కథ చదివారు. 
సింహాచల శాస్త్రి గారు వాగ్గేయకారుల గురించి వివరిస్తూ పద్యాలు పాడారు. భవిష్యత్తులో వారి హరికథ వినే భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. 













ఈ సభకు అధ్యక్షత వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అరుదైన, అందమైన జ్జ్ఞాపకాన్ని పదిలపరుచుకునే అవకాశాన్నిచ్చిన మాధవ్ దుర్భ గారికి, సాహితీ విభాగం సభ్యులకు అనేకానేక ధన్యవాదాలు.  


అష్టావధానం 

శతావధాని నరాల రామారెడ్డిగారి అష్టావధానం చూసే భాగ్యం ఇన్నాళ్ళకు కలిగింది. సంచాలకులు: రసరాజు గారు, పృఛ్ఛకులు: ఆచార్య ఫణీంద్ర గారు, ఓలేటి నరసింహారావుగారు, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, కొత్త రఘునాథ్ గారు, డాక్టర్ బి,కే మోహన్, బాలాంత్రపు వెంకట రమణ గారు,  కొలిచాల సురేష్ గారు డొక్కా ఫణీంద్ర గారు. 
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు అవధాని గారిని, సంచాలకుల వారిని, పృఛ్ఛకులను సన్మానించారు. 
నరాల రామారెడ్డి గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు
రసరాజు గారు 
ఓలేటి నరసింహరావు గారు
డాక్టర్ బి కె మోహన్ గారు  
బాలాంత్రపు రమణ గారు 
ఈమాట సంపాదకులు కొలిచాల సురేష్ గారు
ఆచార్య ఫణీంద్ర గారు ప్రపంచాభాషలందు వెలుగు తెలుగు అన్నారు. గుర్తుంచుకోవలసిన మాట కదూ! వారు గుణింతాలలో దైవత్వాన్ని చూపించారు.
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు 
నాటా జ్ఞాపిక 'స్రవంతి' సంపాదకులు కొత్త రఘునాథ్ గారు
'సాహిత్య రత్న' అవార్డ్ గ్రహీత డొక్కా ఫణి కుమార్ గారు  
రసరాజు గారు, జోన్నవిత్తులు గారు
ఘంటసాల రత్నకుమార్ గారు
ఈ సాహితీ వేదిక నిర్వాహకులు డాక్టర్ మాధవ్ దుర్భాగారు, ఎడవల్లి రామ్ గారు, చెన్నుభొట్ల రాధ గారు.


Tuesday, June 24, 2014

కాఫీ కప్పు.....కాపర్ హెడ్డు

      మొన్నో రోజు మధ్యాహ్నం పూట ఎవరో బెల్ కొట్టారు. తలుపు తెరిచాను. ఆకుపచ్చ రంగు చొక్కా, ఖాకీ పాంట్ వేసుకుని తలుపుకు రెండడుగులు దూరంగా ఒకతను నిలబడి ఉన్నాడు. చొక్కామీదేదో బాడ్జ్ ఉంది.

       "మీ తోటలో చీమల పుట్టలున్నాయ్, మీ చూరు కింద కందిరీగ తిరుగుతోంది" అన్నాడు. బెల్ కొట్టి మరీ ఈ విషయం చెప్పాలా? అనుకుంటుండగా అతను "నా పేరు స్కాట్. ఫలానా పెస్ట్ కంట్రోల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకో నలభై డాలర్లిస్తే వాటిల్నిమీ ఇంటి వైపు రాకుండా చేస్తాం" అన్నాడు.

      మా ఊర్లో చీమలంటే అలాంటిలాంటివి కాదు కరెంట్ చీమలు. తోటలో అక్కడక్కడా తవ్వేసి పుట్టలు పెట్టేస్తాయి. చూడకుండా కాలేస్తే ఇక అంతే కాలిపైకెక్కి చటుక్కున కుట్టేశాయంటే కాలంతా దద్దుర్లే. అయితే మాత్రం చీమలు పోవడానికి నెలకు నలభై డాలర్లా. రాణి చీమను చంపే మందుందిగా దాన్ని కాస్త పుట్టమీద చల్లితే చాలు. చీమలు అమాయకంగా దాన్ని తీసుకువెళ్ళి రాణి చీమకివ్వడం, అది చచ్చిపోవడం, దానితో ఈ చీమలు మరో స్థావరం వెతుక్కోవడం చేస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది ఈ విధంగానే చీమలను తరిమేస్తూ ఉంటాం.

     "చీమలకు, కందిరీగలకు మందు వేస్తూ ఉంటాం. మాకు మీ సర్వీసెస్ అక్కర్లేదు" అని చెప్దామనుకుంటూ ఉండగా స్కాట్, గులాబీలను చూపిస్తూ "జపనీస్ బీటల్స్ కూడా రాకుండా చేస్తాం" అన్నాడు. ఎండాకాలం మొదలవడం ఆలస్యం, ఈ జపనీస్ బీటల్స్ పొలోమని కుటుంబాలతో సహా వలస వచ్చేస్తాయి. ఇక తోటలో ఆకులన్నీ జల్లళ్ళే. గులాబీల పరిస్థితి మరీ దారుణం, రేకు రేకులో బీటిల్స్ దాక్కుని మరీ వాటిని భోంచేస్తుంటాయి. ఇంతకుముందు పుల్లగా ఉందనేమో ఎర్ర గోంగోరను వదలిపెట్టేసేవి. వాటికీ రుచి తెలిసినట్లుంది ఇప్పుడు గోంగోర, బెండ, సొర ఒకటేమిటి అన్నింటినీ తినేస్తున్నాయ్. వాటి కోసం మందులేవో తెచ్చి చల్లి చూశాం. చల్లినప్పుడు పారిపోయి నాలుగురోజులు పోయాక మళ్ళీ వచ్చేస్తాయ్. గులాబీ మొగ్గ కొంచెం రేకు విచ్చగానే అందులో దూరిపోవడం...

       పనిమీద బయటకెళ్ళిన ఇంటాయన కారు దిగడంతోనే స్కాట్ ఆయన్ను అక్కడే ఆపేసి, టర్మైట్స్ గురించీ, అవి ఇంటిని నాశనం చేసే తీరు తెన్నులు గురించి చెప్పేసి, ఈయన్ను ఊదరగొట్టేసి అవునననిపించుకుని ఇంటి చుట్టూ మందు కొట్టేసి వెళ్ళిపోయాడు.

       ఓ నాలుగురోజులు ఎక్కడా చీమ, పురుగు కనిపించలేదు మొన్న శుక్రవారం మాత్రం మళ్ళీ ఓ నాలుగు బీటిల్స్ కానిపించాయి. "చూశారా అతను ఉట్టి కబుర్లు చెప్పి వెళ్ళాడు. నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చాయివి" అంటూ కత్తెర పట్టుకుని బయలుదేరాను ఆ బీటిల్స్ ఉన్న పూలు కత్తిరించడానికి. "వాటినేం చెయ్యకు పెస్ట్ కంట్రోల్ వాళ్ళకు ఫోన్ చేస్తాను. వాళ్ళే వచ్చి మందు వేస్తారు" అన్నారు.

      ఇవాళ ఉదయం సుమారు పదిగంటల ప్రాంతంలో వచ్చాడు స్కాట్. "మొక్కలకు మందు వేస్తున్నాను" అని చెప్పి పెరట్లోకెళ్ళాడు. అలా చెప్పకపోతే "ఏ అగంతకుండో పెరట్లో దూరాడు" అనుకుంటానని కాబోలు! ఓ పావుగంట తరువాత చీమల పుట్టలకు, బీటిల్స్ కి మందు వేశానని రాసున్న కాగితాన్ని ఇచ్చి సంతకం పెట్టమన్నాడు. ఆ పని పూర్తవగానే వెళ్ళడానికి రెండడుగులు వేసి వెనక్కి తిరిగి

"బైదవే మీ తోటలో ఆ వైపు పాముంది" అన్నాడు.
"పామా? ఏం పాము? ఎక్కడ?" కొంచెం కంగారుగా అడిగాను.
"అదిగో అక్కడ వర్షం నీళ్ళు పడడానికి గొట్టం కింద పచ్చగా ట్రే పెట్టేరుగా దాని కింద. మందు చల్లేప్పుడు చూశాను"
"అమ్మయ్య పెస్ట్ కంట్రోల్ తీసుకోవడం మంచిదయ్యింది" అనుకుంటూ "ఏం పామది? నీళ్ళ పామేనా?" అడిగాను.
"కాదు. కాపర్ హెడ్"
"అయ్య బాబోయ్. కాపర్ హెడ్డా. చాలా విషపూరితమైంది కదూ! నువ్వు చూడబట్టి సరిపోయింది. సాయంత్రమైతే వీధిలో పిల్లలంతా గడ్డిలోనే ఆడుతూ ఉంటారు." అన్నాను.
"యా చిన్న పామే. నేను దాన్ని కదిలించలేదు" అన్నాడు.
అతనేం అంటున్నాడో నాకర్ధం కాలేదు. "ఇంకా బతికే ఉందా? అంటే నువ్వు చంపలేదా?" కొంచెం భయంగా అడిగాను.
"నో...నో మేం కేవలం చీడపురుగులనే చంపుతాం. పాముల్ని పట్టుకోవాలంటే యానిమల్ కంట్రోల్ వాళ్ళను పిలవాలి."

        కారు దగ్గరకు వెళ్ళి యానిమల్ కంట్రోల్ నంబరున్న పేపరొకటి తెచ్చి నాచేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అతను పాముందని చెప్పిన వైపు చూస్తే దట్టంగా హైడ్రాంజియా, కమేలియా పొదలున్నాయి. మూడొందల అరవై రోజులు ఇంటి నుండి పనిచేసి అవసరమైన అర్రోజులే ఆఫీసుకి వెళ్ళడం అయ్యవారికి అలవాటు. ఫోన్ చేశాను. ఏ అత్యవసర సమావేశంలో ఉన్నారో ఫోన్ తియ్యలేదు. మెసేజ్ పెట్టాను. పోయిన సంవత్సరం తెలిసిన వాళ్ళింట్లో కాపర్ హెడ్ చంపారని గుర్తొచ్చి అతనికి ఫోన్ చేశాను.

     "మా ఇంటి ముందు పాముందట, యానిమల్ కంట్రోల్ కు ఫోన్ చెయ్యనా?" "వాళ్ళు వెంటనే రారు. అటువైపు వెళ్ళకండి. సాయంత్రం చూద్దాం" అని సలహా ఇచ్చారు.

      ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. "పాము కనిపిస్తే ఏం చెయ్యాలి?" గూగులమ్మను అడిగాను. ఏం చెయ్యొద్దు దాన్ని కదిలించకుండా ఉంటే దాని దారిన అదే పోతుంది అని సమాధానం వచ్చింది. "దాని దారిన అదే పోతుందా! ఎక్కడికి పోతుంది? ఏమో!" "అసలు పాములు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?" ఈ సారి ప్రశ్నను కొంచెం మార్చాను. ఈ ప్రశ్నకు చాలా సమాధానాలే ఉన్నాయి.



      "పిల్లిని పెంచాలి". "పిల్లినా బాబోయ్! పిల్లలతోనే క్షణం తీరిక ఉండడంలేదు. ఇక పిల్లులూ, కుక్కలూ ఎక్కడ. అయినా పిల్లిని పెంచితే పాములు రావా" అనుకుంటూ అసాంతం చదివాను. పిల్లుల వలన ఎలుకలూ, చుంచులూ, పక్షులు రావు కాబట్టి వాటిని ఆహారంగా తీసుకునే పాములు కూడా రావని ఉంది. ఇంట్లో ఎలుకలూ, చుంచులూ లేవు కాబట్టి పిల్లిని పెంచడం పరిష్కరం కాదు.

       "పందిని పెంచాలి." మా 'హెచ్ ఓ ఏ' బహుశా దీనికి ఒప్పుకోకపోవచ్చు.
"నెమలిని పెంచాలి" ఏమిటీ పామును చంపడానికి నెమలిని పెంచాలా? అదెక్కడ దొరుకుతుంది? దొరికినా డిసెంబర్ లో ఇక్కడి చలికి తట్టుకుంటుందా! అయినా పామును ఒదిలించుకోవడానికి ఇవన్నీ పెంచుకోవాలా?

       వాటి గురించి చదువుతున్నా మనసంతా బయటున్న పాము మీదే ఉంది. అదింకా అక్కడే ఉందా? ఒకవేళ అదిగాని పొదల్లోకి వెళ్ళిందంటే దాన్ని పట్టుకోవడం కష్టమే. గరాజ్ లోకి కాని వెళ్ళదుకదా! అక్కడ చెప్పులన్నీ ఉన్నాయి. స్టాండ్ మీదే ఉన్నాయి కాని చిన్నపామంటున్నారు, వేసుకునేప్పుడు చూసుకొని వేసుకోవాలి.

       ఇలా లాభం లేదని పామును దూరంగా తరిమేసే మందు కోసం వెతికాను. రకరకాల మందులు కనిపించాయి. అమ్మయ్య ఇవి తెచ్చి ఇంటి చుట్టుపక్కలంతా చల్లేస్తే చాలు. ఆ పాములు పారిపోతాయి అనుకునేంతలో 'ప్రిజర్వింగ్ వైల్డ్ లైఫ్' అట ఆ సైట్ లో అసలు అవేవీ పనిచేయవనీ, పాములు దాక్కోవడానికి వీలులేకుండా చూసుకోవడమే ఉత్తమమైన మార్గమని రాసుంది.

      పెరట్లో సొర, బీర ఇప్పుడిప్పుడే చాటలంత ఆకులతో పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. నిద్రలేస్తే ఆకు పిందె చూస్తూ, కలుపు తీస్తూ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాను. వాటికింద నీడగా ఉందని పాములు అక్కడికి వచ్చేస్తే? రాకుండా ఉండాలంటే ఇప్పుడా మొక్కలు పీకేయ్యలా?

     "మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం" అనుకుంటూ ఇంకొన్ని సమాధానాలు చదవడం మొదలెట్టాను. "ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ పిల్లలకు పాముల గురించి ఎందుకు చెప్పకూడదు?". ఏమిటీ పిల్లలకు పాముల గురించి చెప్పడానికి పెరట్లో పాముని చూపించాలా? ఇదెక్కడ చోద్యం? "మీ పిల్లలు కుక్కల గురించి, పిల్లుల గురించి భయపడడం లేదు. మరి పాములను చూసి ఎందుకు భయపడాలి. వాటి గురించి మీరు వారికి వివరించొచ్చు కదా!" అని ఉంది. పిల్లలకు వాటి గురించి చెప్తాం. వాళ్ళు చూసుకోకుండా పొరపాటున వాటిని ముట్టుకుంటే, లేకపోతే వాటిమీద కాలేస్తే అవి కుట్టకుండా ఊరుకుంటాయా? భలే వాళ్ళే అనుకుంటుండగా గరాజ్ తెరిచిన చప్పుడు వినిపించింది.

        తలుపు తెరిచి చూసేసరికి ఇంకెవరు? ఇంటాయనే మెసేజ్ చూసుకున్నట్లున్నారు దొరికిన గడ్డపార పట్టుకుని హడావిడిగా పొదల దగ్గరకు వెళుతున్నారు. పిల్లలకు చెప్పమన్నారు కదా! పైగా ఒక్కళ్ళే వెళితే ప్రమాదం కూడాను అని బుజ్జిపండును పిలిచాను. పండంటే మూడేళ్ళ వాడు కాదండోయ్. ఆరడుగులకు పైమాటే..ఈ మధ్య జిమ్ కెళ్ళి బస్కీలవీ తీస్తున్నాడు. వాళ్ళనాన్నతో రోజుకోక్కసారైనా కుస్తీ పట్లు వేయడం ప్రస్తుతం వాడి హాబీ.

    ఉదయాన్నే టెన్నిస్ ఆడి అలసిపోయి మంచి నిద్రలో ఉన్నాడు. వాడి గదిలోకి వెళ్ళి "పండూ, నాన్న పామును చంపుతున్నారు. నువ్వు కూడా వెళ్ళు" అని చెప్పాను. దుప్పటి పక్కకు తీసి నిద్ర కళ్ళతో "వాట్ పామా... నాన్నను ముందు ఫోటో తీయమని చెప్పు" అని దుప్పటి మళ్ళీ ముసుగు పెట్టేశాడు.

       ఏమిటి ఇంతకీ పామేమయిందా అని చూస్తున్నారా? ఇంకెక్కడి పాము అది ఎప్పుడో తప్పుకుంది. ఎటు పోయిందో! రేపు ఉదయం కాఫీ కప్పు పట్టుకుని చెట్లమధ్య దూరే సాహసం మాత్రం చెయ్యలేను.



Thursday, April 24, 2014

ఓరి దేముడోయ్!

    దోగాడడం రాగానే బిరబిరా వంట గదిలో స్టీలు గిన్నెల దగ్గరకు వెళ్ళేవాడ్ని. వాటిలో నా మొహం పొడవుగా, అడ్డంగా తమాషాగా కనిపించేది. అమ్మలా వంట చేయాలని గిన్నెలో గరిటె పెట్టగానే, "ఆడపిల్లలా ఈ ఆటలేంటి?" అంటూ పక్కన కూర్చోబెట్టి బంతిని చేతిలో పెట్టేది నాన్నమ్మ. అదెక్కడ నిలిచేది దొర్లుకుంటూ ఎటో పోయేది. పైగా స్టీలు గిన్నెలా అది చమక్ చమక్ మనేదికాదు! ఒళ్ళుమండి దాన్ని పట్టుకుని గట్టిగా ఒక్క తన్ను తన్నగానే "ఎంతైనా మగపిల్లాడి అల్లరే వేరబ్బా" అనేసేది గిరిజత్త. 

      కొంచెం పెద్దయ్యాక నన్ను, పూజని, రోజక్కని అమ్మ బజారుకు తీసుకువెళ్ళేది. వాళ్ళిద్దరికీ రంగు రంగుల గౌనులు, క్లిప్పులు, గాజులు, పట్టీలు, చెప్పులు అలా ఏమిటేమిటో కొని పెట్టేది. నాకు మాత్రం సన్న సన్న గీతలు, గళ్ళు వుండే చొక్కాలు కొనేది. పెద్ద పెద్ద పువ్వుల చొక్కాలు కొన్నప్పుడు మాత్రం మహా సంబరంగా ఉండేదిలే. అయినా ఎప్పుడూ చొక్కాలు, నిక్కర్లు, పేంట్లే. వాళ్ళకు మాత్రం గౌనులు, గాగ్రాలు, చుడీలు, పట్టులంగాలు, వాటిమీద చేమ్కీలు, అద్దాలు, తళుకులు, పూసలు, ఇంకా పేంట్లు, చొక్కాలు. ఆ బట్టలు వేసికుని ఇద్దరూ యువరాణీల్లా మెరిసిపోతుండేవాళ్ళు. ఏడుపొచ్చి కాస్త గట్టిగా ఏడవగానే, "ఆడపిల్లలా ఆ ఏడుపేంటి?" అంటూ కసిరేది సీత పిన్ని.  

    మరికొంచెం పెద్దయ్యాక పుస్తకాల్లోంచి తల పైకెత్తితే చాలు ఏదో ఒక పని, నా ఖాళీ సమయమంతా షాపుల చుట్టూ తిరగడానికే సరిపొయ్యేది. జీవితం మొత్తమ్మీద ఓ టన్ను అల్లం, మూడు టన్నుల మిరపకాయలు, పదహారు టన్నుల టమోటాలు తీసుకొచ్చుంటాను. ఏమన్నా అంటే "ఇంట్లో మొగపిల్లోడివి నువ్వు కాకపోతే ఎవరు తెస్తారు?" అనే మాట వినీ వినీ చెవులు చిల్లులు పడి పోయాయి. నేనేమో ఎర్రటి ఎండలో తిరగడం. రోజక్క మాత్రం చల్లని పిండిలో చేతులు పెట్టి పొత్రం నైసుగా తిప్పుతూ ఆటలు. 

     డ్రాయింగ్ లో మొదటి బహుమతి వచ్చిన రోజు ఊరు వాడా అందరూ మెచ్చుకున్నారు. తెల్లారి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గు  వేస్తానంటే మాత్రం కిసుక్కున నవ్వారు. అందంగా ఉన్నాయని నర్సరీ నుండి పూల మొక్కలు తెచ్చి నాటితే "అబ్బో వీడికి మొక్కలంటే ఎంత ఇష్టమో!" అన్నవాళ్ళే "పూలు కట్టడం నేర్పమంటే" నువ్వేమన్నా ఆడపిల్లవా అని ఎకసెక్కాలు.

    అక్కయ్య నెలకోసారి ఒంట్లో బాగాలేదని సుబ్బరంగా మంచమెక్కి పడుకునేది. అన్నం, పళ్ళు, పాలు సమస్తం మంచం దగ్గరకే వచ్చేవి. నేను కాళ్ళు నొప్పులు అంటే "నీ వయస్సులో మేము మైళ్ళు మైళ్ళు నడిచేవాళ్ళం నువ్వేంట్రా క్రికెట్ ఆడే అలసిపోతావు?" అనేవాళ్ళు.

     పదో తరగతి పాసవ్వగానే మంచి  కాలేజిలో సీటు వస్తుందో లేదోనని ఇంట్లో అందరికీ టెన్షనే. రోజక్క కాలేజికి వెళ్లేముందు ఇంత హడావిడి లేదు. ఏమంటే " అక్కయ్యకు సీట్ రాకపోతే ఏ డాక్టర్ నో ఇంజనీర్ నో అల్లుడుగా తెచ్చుకుంటాం. నువ్వు చదవకపోతే ఎలారా?" అని సమాధానం.

     కాలేజ్ లో అబ్బాయిలు, అమ్మాయిల వెంట పడేది వాళ్ళ అందం చూసి కాదు తాము వేసుకోలేక పోయిన రంగు రంగుల బట్టలు చూసి అని ఎప్పటికి తెలుసుకుంటారో!  

    రోజక్క పెళ్ళి కుదిరింది. గోరింటాకు పెట్టించుకోవడం, వచ్చిన చుట్టాలతో కబుర్లు చెప్పడంతో పూజ బిజీ. నేనేం చేశానంటారా! అడక్కండి. వీధిలో తిరిగి తిరిగి మగపెళ్ళి వాళ్ళకు మర్యాదలు చేసి చేసి బొగ్గులా అయ్యానని అమ్మమ్మ అన్నప్పుడు కాని అద్దంలో ముఖం చూసుకోవడానికి కూడా ఖాళీ దొరకలేదు. అక్క పెళ్ళిలో సరేలేవయ్యా నీ పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేసేవుంటావ్ గా అనుకుంటున్నారా? 

    నాకు పెళ్ళి కుదిరాక అమ్మని షాపింగ్ కి వెళ్దామని పిలిచినా "మీ షర్ట్లు నాకేం తెలుస్తాయిరా? నీ ఫ్రెండ్స్ తో వెళ్లి తెచ్చుకో, పైగా ఇవాళ కోడలికి నగలు చూడడానికి వెళ్తున్నాం" అని చెప్పేసింది. ఇంత అన్యాయమా!

    అమెరికాలో ఉద్యోగం వచ్చింది, "ఇద్దరం కలిసే వెళ్తాం" అంటే "దేశం కాని దేశంలో ఏం ఇబ్బంది పడతారు. నువ్వు కొంచెం ఇల్లు అదీ ఏర్పరుచుకున్న తరువాత అమ్మాయిని తీసుకెళ్ళు" అని ఒంటరిగా పంపేసారు. చిన్నప్పటినుండి కాఫీ కూడా కలపడం నేర్పలేదు కాని ఇప్పుడు ఇక్కడ ఎలా ఒండుకుని తింటాననుకున్నారు? ఆకలేస్తే వెళ్ళడానికి దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్ కూడా లేదు. వెళ్ళడానికి కారులేదు. దగ్గరలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో నాలంటి శాఖాహారికి తినడానికి ఏమీ దొరకదు. సరే ఎలాగో కష్టపడి ఒక ఇల్లు చూసి కారు కొన్నాక నా భార్య మాహారాణిలా వచ్చింది. అమెరికా విచిత్రాలన్నీ చూస్తూ వారానికో నాలుగు రోజులు రెస్టారెంట్ లో భోజనం చేస్తూ పూటకో మాటు "అమ్మా బెంగగా వుందే" అని వాళ్ళమ్మకు ఫోను.  

    నాలుగురోజులు సెలవు రాగానే స్నేహితులతో కలసి వెకేషన్ అంటూ ఎటో అటు ప్రయాణం. కారులో ఆడాళ్ళు హాయిగా నిద్ర పోతుంటే తెలిసి తెలియని ఊర్లకు దారి వెతుక్కుంటూ చీకట్లో డ్రైవింగ్. అక్కడ గుర్రాలెక్కి తిరగడం, స్నార్క్లింగ్, స్కూబా డైవింగ్ అంటూ మొహానికి మాస్క్ పెట్టుకుని నీళ్ళ లోపలకు వెళ్ళడం. అడ్వెంచరెస్ రైడ్స్ అంటూ తల కిందులుగా పాతిక అడుగుల నుండి కింద పడడం. ఒకటా! గుండెలో బిక్కు బిక్కు మంటున్నా పైకి బింకంగా కనిపించాలి. మగాళ్ళం కదా!

    నేను తండ్రిని కాబోతున్నానని తెలిసి స్వీట్ మా ఆవిడకిచ్చేవాళ్ళు. నాకు మాత్రం "అమ్మాయిని బాగా చూసుకో, ఏ పనీ చేయించకు" అని జాగ్రత్తలు. అప్పటికావిడ లంకంత కొంపలో మందీ మార్బలానికి వండి వార్చి మహా కష్టపడి పోతున్నట్లు. వంశోద్దారకుడు కావాలని అందరికీ కోరికే. వంశభారం అంతా మొయ్యాలికదా!

   నా పుత్రరత్నం పుట్టగానే మా ఆవిడకు మూడు నెలలు మెటర్నటీ లీవు. నేనేమో డ్రైవర్, గోఫర్ గా ఓవర్ టైం చెయ్యడం. అర్ధం కాలేదా  మా ఆవిడ గంటకోసారి "గోఫర్ దిస్, గో ఫర్ దట్" అంటూ బయటకు తరిమేస్తూ ఉంటుందిలెండి. చిన్నప్పుడు టన్నుల టన్నుల కూరగాయలు తెచ్చానా, ప్రస్తుతం వేగన్లు వేగన్లు డైపర్లు, గర్బర్ ఫుడ్ లు తెస్తున్నాను. 

   ఇంతలో "పూజక్క కూతురికి ఓణీలివ్వాలి మీరిండియా రండి. బాబుని కూడా అందరం చూసినట్లుంటుందని" అమ్మ ఫోను. "ఇక్కడనుండి నీకైమైనా కావాలా?" అని అడిగాను. మా అమ్మకు కొరల్ సెట్లు, బెడ్ షీట్లు, జంషోలో పూసలు ఇష్టం లెండి. తనకే కాక చుట్టుపక్కల అందరికీ తెమ్మటుంది. "నాకేమొద్దుగాని మీ అక్కకూతురికే మనం బంగారం పెట్టాలి" అంది. "ఎంతమా ఓ కాయిన్ తీసుకురానా?" అని అడిగాను. వడ్డాణానికి ఓ కాయినేం చాలుద్ది పదో, పన్నెండో కాయిన్లు తీసుకురా. అన్నట్టు ఇప్పుడు పూజకు ఐదోనెల సీమంతానికి బంగారు గాజులు పెడదాం" అన్నది.

    ఇండియా వెళ్ళగానే "ఏం నాయినా అక్కడ్నే ఉంటారా ఏంది? ఒక్కడివే పిల్లోడివైతివే మీ అమ్మా నాయన్నుచూసుకోబళ్ళా. తొందరగా రండి" అంటూ నారాయణ తాత చీవాట్లు.

    ఓరి దేముడోయ్! మగవాడిగా పుట్టడం కంటే మర్రిచెట్టుగా పుట్టినా ఎంతో సుఖం. 

Sunday, March 16, 2014

మా వాళ్ళు ఒప్పుకోరేమోనండీ

"నమస్తే డాక్టర్ గారు."
"రామ్మా రా. ఓ పిల్లల్ని కూడా తీసుకొచ్చావా?"
"అవునండి. ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదుగాని, పిల్లల్ని మీరోసారి పరీక్ష చేస్తే మంచిదని తీసుకొచ్చాను. ముందు మా చిన్నబాబును చూడండి.”
“ఏమైందమ్మా బాబుకు?”
“వీడు ఎవరి దగ్గరికీ పోడండి. ఇరవై నాలుగ్గంటలూ నన్నంటిపెట్టుకునే ఉంటాడు."
"బాబుకిప్పుడు నాలుగేళ్ళు కదూ! సాధారణంగా పిల్లలకు మూడేళ్ళ వయసొచ్చేప్పటికే ఆ భయం పోతుంది. కాని..... “
“చెప్పండి డాక్టర్, సందేహించకండి.”
“మీ బాబుకు మాత్రం పోదమ్మా"
"ఎందుకని డాక్టర్?"
"అది తనకు వంశపారంపర్యంగా సంక్రమించింది."

"మా వాళ్ళెవరూ అస్సలు ఇంట్లో ఉండరుకదండీ. ఉదయం నిద్ర లేస్తే ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూనే ఉంటారు. ఆఖరికి మా అత్తగారు కూడా ఇరవై నాలుగు గంటలూ అరుగుమీద కూర్చుని ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ రాజకీయాలు మాట్లాడుతుంటారు."
"మరి అంతా తెలిసిన వాళ్ళు, ముందు వెనుకలు ఆలోచించకుండా పరిచయస్థులకో, బంధువులకో మాత్రమే ఎందుకు మద్దతిస్తారో తెలుసా? అలాంటి నిర్ణయాల వలన జరిగే అనర్ధాలు కూడా ఊహించగలరు. కాని పాపం మీ వాళ్ళకు కొత్త వాళ్ళంటే భయం. దీన్నే 'స్ట్రేంజర్ యాంగ్జైటీ' అంటారు.

"ఓ...మా మామగారి పెద్ద అమ్మమ్మ గారి చిన్న మనవడు లేడూ, అదేనండీ అందరూ చంటి అంటారే! అతను చదువు చట్టుబండలూ లేక రాజకీయాల్లో తిరుగుతుంటాడు. అతనేం మాట్లాడతాడో అతనికే తెలియదు. మా చేత అతనికి ఓట్లేయించినప్పుడు ఎందుకా అనుకున్నాను. ఇదన్నమాట సంగతి."
"...."

"సర్లెండి. మా పెద్ద బాబునోసారి చూడండి డాక్టర్. దూరానున్నవి సరిగ్గా కనిపించట్లేదటండీ. పాపం టీచర్ బోర్డు మీద ఏం రాస్తున్నారో తెలియట్లేదట."
"దాందేముంది. పరీక్ష చేసి మంచి అద్దాలిద్దాంలేమ్మా."
"అప్పుడు సరిగ్గా చూడగలడా డాక్టర్?"
"ముందున్నదేదో చూడగలడు. కానీ ముందుచూపు మాత్రం తనకు ఎప్పటికీ లేకపోవచ్చు. అదీ వంశపారంపర్యమే"

"అయ్యో అలాగా! అవునులెండి. ఆ ముందుచూపే ఉంటే ఎమ్ ఎల్ ఏ చనిపోతే కనీసం సంతకం పెట్టటం కూడారాని వాళ్ళావిడకు మా వాళ్ళు పట్టుబట్టి మరీ పదవెందుకు ఇప్పిస్తారు? ఆ కుటుంబం మీద సానుభూతి ఉంటే బ్రతుకు తెరువు చూపించాలి కాని, అర్హతలేని ఆవిడకు అధికారం అప్పచెప్పడం..."
"...."
"మా పాపనోసారి చూడండి డాక్టర్ గారు. తనకు సరిగ్గా వినిపించడం లేదండీ. ఏ విషయమైనా గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది."
"పాపా, ఇటు రామ్మా. ఇలా కూర్చో"
.

.

"చెముడేమన్నా ఉందా డాక్టర్?"
"పాపకు బాగానే వినిపిస్తుందమ్మా. తనే వినిపించుకోవడం లేదు"
"ఇది కూడా....."
"అవునమ్మా... నీ అనుమానం నిజమే. మీ మామగారి దగ్గరనుండి అందర్నీ పరీక్ష చేస్తున్నాను. మీ వాళ్ళందరకూ ఉన్నదే ఇది కూడానూ"
“నిజమేలెండి. వినిపించుకుంటే మా వాళ్ళకు మంచీ చెడ్డా తెలిసి ఊరుకి మంచి చేసేవాళ్ళనే ఎన్నుకునేవాళ్ళుగా! అలా వినిపించుకోక పోబట్టి కదూ కనీసం ఊర్లో మంచి నీళ్ళు కూడా లేకుండా నానా ఇబ్బందులూ పడుతున్నాం, ఆడవాళ్ళం పట్టపగలు నడిరోడ్లో ఒంటరిగా నడవడానికి భయపడి చస్తున్నాం.”
“......”

“డాక్టర్ గారూ, మరి మా బావగారు, వదిన గారు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా తెలివికల వాళ్ళని మాష్టారు గారు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు కూడాను. వాళ్ళకిలాంటివేమీ లేవు కదండీ.”
“ఎందుకు లేవమ్మా మొహమాటం అనే అతి ప్రమాదకరమైన జబ్బుంది. మీ ఇంట్లో తీగ మీద ఆరేసిన పట్టుచీరను ఏ దొంగైనా పట్టుకుపోవడం చూస్తున్నా నోరు తెరిచి ఒక్కమాటా మాట్లాడరు. ఆ దొంగేమైనా అనుకుంటాడనీ, దారిని పోయేవాళ్ళకు వినిపిస్తుందనీనూ."
"అయ్యో....అయితే ఇక ఈ పిల్లలు ఇంతేనా డాక్టర్ గారు. ఇవన్నీ పోవడానికి మందేమైనా ఇవ్వండి."

"మందంటే....ఆ, రోజుకో పది నిముషాలు ఆలోచించడం నేర్పమ్మా"
"మా ఇంటా వంటా లేని పనని మా వాళ్ళు ఒప్పుకోరేమోనండీ..."