Tuesday, January 15, 2019

కనుమ

ముగ్గుడబ్బా, రంగుల డబ్బాలన్నీ తీసుకొచ్చి అరుగుమీద పెడుతున్నా. "పాపా, ఈ రోజు రంగులు బళ్ళా, లోపల బెట్టెయ్" చెప్పింది పిన్ని.
"ఎందుకు పిన్నీ"?
"ఈ రోజు కనప్పండగ్గదా రధం ముగ్గెయ్యాల. రంగులుబళ్ళా, సందులోకి బొయ్యా రొన్ని కారబ్బంతులు, చావంతులూ దీసకరా."
"రథం ముగ్గే ఎందుకెయ్యాలి పిన్నీ"
"దానికో కతుంది చెప్తానుండు.ఈ పండక్కి బల్చక్రవొర్తి పాతాళం నుండి బూలోకానికొస్తాడు."
"బల్చక్రవర్తంటే మూడు వరాలిచ్చాడు. ఆయనేనా?"
"ఆ ఆయనే, ఈ రోజు పండగైపోతళ్ళా మళ్ళాయన పాతాళానికి బొయ్యేదానికీ రధం" చెప్పింది.
"ఒకవేళ మనం రధం ముగ్గు వెయ్యకపోతే మనింట్లోనే ఉండిపోతాడా?"
", వుండి పొయ్యా మనింట్లో బిందెలూ, గంగాళాలు దానం జేసేస్తాడు."
"అమ్మో, అయితే మనం ఎప్పుడూ రథం ముగ్గే వేద్దాం కనుమ రోజు."
నేను పూలు తీసుకుని వచ్చేసరికి చకచకా చుక్కలు పెట్టేసింది పిన్ని. ముగ్గుతో చుక్కల చుట్టూ మెలికలు తిప్పి చివరగా రెండు చక్రాలు వేసి పసుపు కుంకుమలు పూలరెక్కలు చల్లగానే అచ్చంగా పూలరథమే మా వాకిట ముందర.

*                *             *                 *                *             *                 *           
వడ్లకొట్టు మీద కూర్చుని నేనూ తమ్ముడూ నిప్పట్లు తింటున్నాం. "జోతా, అమ్మమ్మ నడిగి పసూకుంకుం తీసకరా" పురమాయించాడు మామయ్య.
"ఎందుకు మావయ్యా?" అంటూ చెంగున కిందకు దూకాడు తమ్ముడు.
"ఇవాళ కనప్పండగ కదా పశూల్ని కడిగి పసుంకుంకాలు బెట్టాల"
"బర్రెలకా?" ఆశ్చర్యపోయాడు తమ్ముడు.
"ఆ బర్లెకీ, ఎద్దలగ్గూడా" అంటూ పశువుల కొట్టం వైపు వెళ్ళాడు. వెనకే తమ్ముడు.
నేనూ, పిన్ని కొట్టంలోకి వెళ్ళేసరికి మామయ్యలిద్దరూ గడ్డి చుట్ట తీసుకుని పశువులను శుభ్రంగా తోమి, చెంబుతో నీళ్ళు పోస్తున్నారు. ముత్తయ్య కొట్టంలో అప్పటికే గడ్డి గాదం లేకుండా శుభ్రంగా చిమ్మి నీళ్ళు జల్లాడు. పిన్ని ఒక పక్కగా ముగ్గేసి ముగ్గు ముందు ఇటుకరాళ్ళతో పొయ్యి చేసి అందులో ఎండుకట్టెలు పెట్టింది.
"ఎందుకు పిన్నీ ఇక్కడ పొయ్యి?"
"పొంగలి బెట్టి పశూలకు నైవేద్దం బెట్టేదానికి." చెప్పింది.
"ఇక్కడా.. కొట్టంలోనా?" ఆశ్చర్యపోయాను.
"ఆ ఇక్కడే."
మాటలల్లోనే అమ్మమ్మ వచ్చింది. పొయ్యి రాజేసి పసుపురాసి కుంకుమ బెట్టిన పొంగలి గిన్నె పొయ్యిమీద పెట్టింది. మామయ్య పశువులను కడగడం పూర్తిచేసి కొమ్ములకు పచ్చని పసుపు, ఎరుపు రంగులు వేసి ఆరాక కొమ్ముల చివరలో కుచ్చులు కట్టాడు.
"పాపా కుంకుం బెడ్డువురా" పిలిచాడు మామయ్య.
భయంగా చూశాను. అదసలే డిల్లీ బర్రె. "రా జోతా, యేం జైదులే నేనుళ్ళా" అంటూ దాని గంగడోలు నిమురుతూ పిలిచాడు. రెండు చెవుల మధ్యగా తలపైన పసుపురాసి కుంకమ పెట్టాను. ఈలోగా మిగిలిన బర్రెలకు, ఎద్దులకు పిన్ని పసుపురాసి బొట్లు పెట్టింది. ఎద్దుల మెడలో కొత్త పట్టెడలు వేసారు. అలికి ముగ్గులు పెట్టిన కొట్టం రంగుల కొమ్ములు, మువ్వల పట్టెడలు, పసుపు కుంకుమలతో పశువులు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. పశువులకు నమస్కారం చేసుకుని పొంగలి నైవేద్యం పెట్టింది అమ్మమ్మ. అమ్మమ్మ చేసినట్టే నమస్కారం చేసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి ఘుమఘుమలు.

పొయ్యి మీద మాంసం కూర ఉడుకుతూ ఉంది. ఇంకో పొయ్యి మీద పెద్ద బాండలి పెట్టింది అమ్మ వడలు వెయ్యడానికి.
"నాకాకలేస్తంది అన్నం బెట్టుమా." అమ్మ పక్కన కూర్చుంటూ అడిగాడు తమ్ముడు.
"రొంత తాల్నాయినా అమ్మ వడలేస్తళ్ళా. అయిపోయినంక వడలు, అన్నం అన్నీ తిందువుగాని" చెప్పింది అమ్మ.
"నాకు వడలొద్దు. అన్నం బెట్టు."
"అట్టనగూడదు నాయినా. కనుమనాడు మినుము కొరకాల." చెప్పింది అమ్మమ్మ.
"వడలు గాల్నియ్ గానా మిగతా పిలకాయిల్ని గూడా బిలువ్. అట్నే బాయి కాడ కాళ్జేతులు కడుక్కుని రండి. అందరొక్కసారే తిందురు." పిలిచింది అమ్మ.
ఈ రోజుతో బడి సెలవలైపోయాయి. రేపే ఊరికి ప్రయాణం. 

*                *             *                 *                *             *                 *        

నాతో ప్రయాణం చేస్తూ పండగ సంబరాన్ని పంచుకున్న మిత్రులకు పెద్దలకు ధన్యవాదాలు. "అవీ ఇవీ రాయడం కాదు ఈసారి రాస్తే నెల్లూరి భాషలోనే రాయాలి" అని దబాయించి ప్రోత్సహించిన ప్రియనేస్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. 


Monday, January 14, 2019

సంక్రాంతి


       రోజుకన్నా ముందే తెల్లారినట్లుందివాళ. తీప్పొంగలి, కొత్తబట్టలు గుర్తురాగానే చెంగున మంచం దిగి గుమ్మాన్ని దాటుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. అప్పటికే స్నానం చేసి పెద్ద పండక్కని కుట్టించుకున్న పావడా పైటా వేసుకుని తలకు పిడప చుట్టుకుని దేవుడింట్లోకి వెళ్తూవుంది పిన్ని. చేతిలో తామరాకులో చుట్టిన పూలు. "పిన్నీ పిన్నీ నేను పటాలకు పూలుబెడతా" అంటూ వెంట పడ్డాను. 

"అట్నేబెడుదువులేగానా, గంగాళంలో నీళ్ళు తోడుండాయి ముందు బొయ్యా నీళ్ళు బోసుకునిరా" చెప్పింది. స్నానం చేసి వచ్చేసరికి పిన్ని దేవుడి పటాలన్నీశుభ్రంగా కడిగి గంధం, పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంది. ఆకు మధ్యలో పసుపుతో గౌరీ దేవిని కూడా చేసి పెట్టింది. "పాపా, తావరాకులో కదంబమాల తుంచి పెట్టుండాను, విడి పూలీడుండయ్ పటాలన్నింటికీ పెట్టు." అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. పటాలకు పూలు పెట్టడం పూర్తవగానే బంతిపూలు, మామిడాాకులతో దండ గుచ్చి వీధి గుమ్మానికి కట్టడానికి బయటకు వచ్చాం.

ఇంతలో "డబుక్ డక్ డబుక్ డక్" అని ఢక్కీ మోగించుకుంటూ బుడబుక్కల అతను వచ్చాడు. "అంబ పలుకు జగదాంబ పలుకు కంచి లోనీ కామాక్షీ పలకు, మహా ప్రభువులకు జయం కలగాలి నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ ఇప్పిచ్చుసామీ" అంటూ ఆపకుండా ఢక్కీ మోగించడం మొదలుపెట్టాడు. అమ్మ చేటలో బియ్యంతో పాటు ఒక పాతచీర కూడా తెచ్చి అతని జోలెలో వేసింది. "అమ్మగారి కార్యం జయమౌతాది, అయ్యగారి కార్యం జయమౌతాది, ముత్యాల మూటలే మీ ఇంట మూల్గాలె, రతనాల రాసులే మీ చెంత జేరాలి సుభోజ్జయం సుభోజ్జయం" అని దీవిస్తూ డబుక్ డక్ డబుక్ డక్ అని ఢక్కీ మోగిస్తూ వెళ్ళిపోయాడు.


వెన్న కరుగుతున్న కమ్మని వాసన. ముక్కు ఎగబీలుస్తూ వంటింట్లోకి వెళ్ళాను. భగభగమని మండుతున్న పొయ్యి మీద పసుపురాసి కుంకుమ పెట్టిన ఇత్తడి గిన్నె. పక్కనే చిన్న పొయ్యి మీద నేతిలో జీడిపప్పు వేపుతూ ఉంది అమ్మమ్మ. కత్తిపీట ముందేసుకుని ఎరగడ్డలు కోస్తూ ఉంది చిన్నమ్మమ్మ. 

నన్ను చూడగానే "నాయనా, యాలక్కాయల రొన్ని మీ అమ్మకిచ్చా పొడిగొట్టమని జెప్పు." అంటూ ఏలకుల డబ్బా ఇచ్చింది.
"గబాగబా కానీకా ఈ పాటికి గంపలెత్తుకుని వస్తా వుంటారు." తొందర పెట్టింది చిన్నమ్మమ్మ.
"ఎవరొస్తారమ్మమ్మా" అడిగాను
"ఈ రోజు పండగ్గద్నాయనా చాకలోళ్ళు, మంగలోళ్ళు ఇంకా పొలం కాడ్నుండి సేద్దిగాళ్ళు అందరూ వస్తళ్ళా వాళ్ళకు నిప్పట్లు, మణుగుబూలతో పాటు అన్నం కూర్లు గూడా బెట్టాలి." చెప్పింది.
"ఎందుకమ్మమ్మా వాళ్ళు జేసుకోరా?" అడిగాను.
"పోద్దులొస్తం మన పన్లే జేస్తంటిరే నాయనా పండగ నాడైనా వాళ్ళకు మనం జేసుకున్నవి పెట్టబళ్ళా." చెప్పింది అమ్మమ్మ.

ఇంతలో వీధిలో చిరుతలతో తాళం వేస్తున్న శబ్దం, లయగా గజ్జెల చప్పుడు వినిపించాయి. గుమ్మం పట్టుకుని వెనక్కి వంగి చూస్తే "హరిలో రంగ హరి" అని పాడుతూ హరిదాసు. బిక్ష్యం వెయ్యడానికి పెట్టిన చేటలో నుండి దోసిటి నిండుగా బియ్యం తీసుకుని వెళ్ళాను. హరిదాసు మోకాలి మీద కూర్చుని బియ్యం అక్షయ పాత్రలో వేయించుకుని "చిరంజీవ చిరంజీవ" అని దీవించి వెళ్ళిపోయాడు.

"పాపా, అరిటాకులు గోసుకు రమ్మని శేష్మామయ్యకి జెప్పి వొకాకిటు దీసకరా" చెప్పింది పిన్ని. ఆకు తీసుకుని వెళ్ళేసరికి దేముడికి ఎదురుగా ఒక పీట మీద పళ్ళెంలో టెంకాయ, కర్పూరం సాంబ్రాణి కడ్డీలు, ఇంకో పీట మీద కొత్త బట్టలు పెట్టున్నాయి. అమ్మ దీపం వెలిగిస్తూ ఉంది. "ఎందుకుమా ఇక్కడ బట్టలు పెట్టారు?" అడిగాను. పెద్ద పండగ్గద పాపా పెద్దలకి బెట్టాల" చెప్పింది. "ఓ ఇవి అమ్మమ్మకా" అడిగాను. "మీ అమ్మమ్మకి కాదు, మా అమ్మమ్మకీ, నాయనమ్మకీ ఇంకా పెద్దవాళ్ళకి" చెప్పింది అమ్మ. ఆశ్చర్యంగా చూశాను. ఎందుకంటే వాళ్ళెవరినీ నేను ఎప్పుడూ చూడలేదు మరి. "దేవుడి కాడికి బోయినోళ్ళకి పాపా" నా ఆశ్చర్యం గమనించి చెప్పింది పిన్ని.

అమ్మమ్మ వచ్చి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి గంట గణగణ మోగిస్తూ హారతిచ్చింది. అందరం దండం పెట్టుకుని హారతి కళ్ళకద్దుకున్నాం. ఇంకో పీటమీద అరిటాకేసి తీప్పొంగలి, వడలు, పులుసన్నం, దోసకాయ పచ్చడి, ఉర్లగడ్డ తాళింపు, అన్నం, నెయ్యి, పప్పులుసు, పెరుగు వరుసగా వడ్డించారు అమ్మ, పిన్ని.

"ఏం జోతా యెట్టా వుంద మా ఊర్లో పండగ?" అందరం అన్నాలు తినేసి వరండాలో కూచోగానే అడిగింది చిన్నమ్మమ్మ.
"పండగింకా యేడయింది పిన్నమ్మా. కనప్పండగ్గూడా గానీ అప్పుడు చెప్పద్ది " చెప్పాడు మామయ్య.



Saturday, January 12, 2019

భోగి పండగ

“మోవ్ ఈసారి అక్కోళ్ళు, పిలకాయలందరూ పండక్కొస్తళ్ళా. పెద్ద భోగిమంటెయ్యాల" అన్నాడు మామయ్య అమ్మమ్మతో.
"అట్నేలేరా. గెనెం మీద తాటాకులు కొట్టకరారాదా." సలహా ఇచ్చింది అమ్మమ్మ.
మామ్మయ్య భోగికి పదిరోజుల ముందే బోల్డన్ని తాటాకులు తెచ్చి సందులో ఎండబెట్టాడు.
*             *             *             *         *          *       *
"మాయ్ కోడి కూసింది. భోగిమంటేస్కోబళ్ళా. ల్యాండి ల్యాండి." అన్న అమ్మమ్మ పిలుపుతో మెలుకువ వచ్చింది.
"అప్పుడేనా?" దుప్పటి మొహం మీదనుండి తియ్యకుండానే అడిగాను.
"ఆ మీ మావయ్య లేచా తాటాకులు లాక్కొచ్చి రోడ్డుమింద యాస్తా వున్యాడు." చెప్పింది అమ్మమ్మ.
"దిబ్బకాడ ముట్టిబోయిన చీపుర్లు, ఇరిగి పోయిన తలుపురెక్క బెట్నాం. అయ్యిగూడా రోడ్డుమింద యాస్తన్నాడా? అడిగింది పిన్ని.
"యేవోనమ్మా నే జూళ్ళేదా."చెప్పింది అమ్మమ్మ.
"నేంబొయ్యి చూసొస్తానుండు పిన్నీ" అంటూ లేచి దుప్పటి చుట్టూ చుట్టుకుని పరిగెత్తి వీధిలోకి వెళ్ళాను. అప్పటికే తాతయ్య దిబ్బపక్కనున్న విరిగిపోయిన సామాన్లని వీధి పక్కన పేరుస్తున్నాడు.
"ఏం జోతా లేచినావా? రా ఇటు గూచో యెచ్చంగుంటది." పోగేసిన తాటాకులకు నిప్పంటిస్తూ చెప్పాడు మామయ్య. దుప్పటి కింద పడకుండా జాగ్రత్తగా మడుచుకుంటూ కూర్చున్నాను. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి మంట చుట్టూ కూర్చున్నారు. ఎర్రగా మొదలైన చిన్న మంట చూస్తుండగానే రాజుకుని నిప్పు రవ్వలు పైకి లేవడం మొదలుపెట్టాయి. మంటకు అరచేతులు అడ్డం పెట్టి వెచ్చగా చలి కాచుకుంటున్నాం. ప్రతి ఇంటి ముందు ఎర్రెర్రని మాటలు. ఇంటెల్లపాది మంట చుట్టూ చేరడంతో వీధి వీధంతా సందడిగా ఉంది.
"మాయ్ ఇంకా మంటకాడ్నించి లేచా తలకుబోసుకోండి. అట్నే పిలకాయలగ్గూడా తొందరగా తలకులు బొయ్యండి." చెప్పింది అమ్మమ్మ. ఎప్పుడు స్నానం చేసిందో గచ్చకాయ రంగు చీరకి మామిడి పిందెల అంచున్న పాటూరి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉప్పు మిరియాలు కలగలిసినట్లుండే బారెడు జుట్టుకి కాశీ టవల్ చుట్టుకొనుంది.  
"నీర్జా కాస్త కుంకుడ్రరసం దీసి అక్కకీ." అంటూ చిన్నపిన్నికి పురమాయించింది.
స్నానం చేసి వంటింట్లో కొచ్చేసరికి మసాలా ఉడుకుతున్న ఘుమఘుమలు, పెనం మీద నుండి సుయ్ మన్న శబ్దం వినిపిస్తోంది. సన్నికల్లు మీద వేరుశనక్కాయల పచ్చడి నూరుతోంది అక్క.
"అప్పుడే దోశలు పోస్తున్నావా?" అడిగాను అమ్మమ్మని.
"అప్పుడే యేవా ఏడవతళ్ళా. నీళ్ళు బోసుకున్నా, దేవుడికి దణ్ణం పెట్టుకురాపో" చెప్పింది అమ్మమ్మ.
"దండం పెట్టుకునే వచ్చా." సమాధానం చెప్పాను.
"అదిగో ఆ తలుపెనకాల పీటలుండాయ్. ఇటు వాల్చు నాయనా. అట్నే ఆ పళ్ళాలు ఇట్దీసకరా." అంది పెనానికి నూనె రాస్తూ. పొయ్యిలో కట్టెల మీద నిప్పులు కణకణ మండుతున్నాయ్. మంట పెనం కిందంతా పరుచుకుంటోంది.
అమ్మమ్మ చెప్పినట్లుగానే చేశాను. అక్క నూరడం పూర్తిచేసి గిన్నెలోకి పచ్చడి తీస్తోంది. స్నానం చేసిన వాళ్ళు ఒక్కొక్కరే వంటింట్లోకి వస్తున్నారు. పళ్ళెంలో దోశ వేసి పక్కనే కోడి కూర కూడా వేసి నా ముందు పెట్టింది అమ్మమ్మ. ఇంతలో "వొరెవొరెవొరె అందరూ ఈడ్నే ఉండారే. ఎప్పుడొచ్చినారా? యేం ఆదిలచ్చమ్మా  దోశలు బోస్తండా?" అంటూ నేరుగా వంటింట్లోకి వచ్చాడు పక్కింట్లో ఉండే పెద్ద తాతయ్య.
"రామావా. పండగ్గదా, పిలకాయలంతా వొచ్చినారు." సమాధానం చెప్పింది అమ్మమ్మ.
"మేవొచ్చి నాల్రోజులవతా ఉంది పెదనాయినా, సూళ్ళూరుపేట బోయినావంట్నే, యెప్పుడొచ్చినావా?" అంటూ తాతయ్య కూర్చోడానికి పీట వాల్చింది అమ్మ.
"ఇప్పుడే యేడు గంటల బస్సుకొచ్చినా రాజమ్మా. రాంగానే విజ్యమ్మ జెప్పింది మీరంతా వచ్చుండారని, పలకరిచ్చి పోదావని వచ్చినా." పీట మీద కూర్చుంటూ చెప్పాడు తాతయ్య.
"మావకి రొంత కూరేసీ రాజమ్మా." అంటూ దోశలున్న పళ్ళెం అమ్మ చేతికిచ్చింది అమ్మమ్మ.
"నా కోడలు గూడా దోశలు బోస్తా వుండాది." మొహమాట పడ్డాడు తాతయ్య. పోస్తే పోసిందిలే మావా ఈడ గూడ దినొచ్చు. అయినా పిలకాయలంతా ఈడ్నే ఉంటే వాళ్ళు మాత్తరం ఎందుకాడ?"  అంది అమ్మమ్మ.
ఇంతలో "తాతయ్యా అమ్మా పిలస్తా వుంది." అంటూ తాతయ్య పెద్దమనవరాలు విజయొచ్చింది.
"యేమ్మే, మీ యమ్మగూడా దోశలు బోస్తా వుందా?" అడిగింది అమ్మమ్మ.
"ఇంకాలా నాయనమ్మా బుజ్జమ్మకు నీళ్ళు బోస్తా వుంది." చెప్పింది విజయ.
"మాయ్, ఇజ్యగ్గూడా పళ్ళెమీయండి. అని పిన్నితో చెప్పి, పాపా నువ్బొయ్యి అత్తని, మావని పిల్చకరా" పురమాయించింది అమ్మమ్మ.  
"యేంనా సూళ్ళూరుపేట యేం పని మీద బోయినావా?" అడిగాడు తాతయ్య.
"మన పెద యెంకట్రామిరెడ్డి లేడా గూడూర్లో, కూతురుకి సమ్బందాలు జూస్తా నన్నుగూడ పిల్చకపోయినాడు." చెప్పాడు పెద్ద తాతయ్య.
"సంబందం కుదిరినట్టేనా మావా?" అడిగింది అమ్మమ్మ.
"వాళ్ళు కట్నం లచ్చడుగుతుండారు. మన ఎంకట్రాముడు అంత ఇచ్చుకోలేడు."
"పిల్లోడు బాగుండాడా? ఆస్తేమాత్రం వుంటాదా?" అడిగాడు తాతయ్య.
"బాగుండేదేందిలేరా, మంచాస్తి. పదిహేనెకరాల మాగాణి ఏకచక్క. సమచ్చారానికి మూడు పంటలు పండే బూవి. మన నీర్జమ్మకు జూద్దామా?" అడిగాడు పెద్ద తాతయ్య.
"ఈ రోజుల్లో పంటలేంటికిలే మావా? మనం జాస్తళ్ళా యవసాయమా. వొక సంవచ్చరం వానలెక్కువ బడి పంట కుళ్ళిపోయ, ఇంకో సంవచ్చరం నీళ్ళే లేక కంకులెండిపోయ. పిలకాయలకెందుకులే ఆ బాదలు. ఆడపిలకాయలైనా సుబ్బరంగా చదూకుంటుంటిరే గవుర్నమెంటు ఉజ్జోగస్తునికిస్తే ఇద్దరూ ఉజ్జోగాలు జేసుకుంటా వాళ్ళ తంటాలేవో వాళ్ళు బడతారు." చెప్పింది అమ్మమ్మ.
"అదీ నిజమేలే." ఒప్పుకున్నాడు పెద్ద తాతయ్య.  
ఈలోగా పెద్ద తాతయ్య కోడలు పిండి గిన్నె ఎత్తుకుని వచ్చింది. అందరం ఆ పూట అక్కడే కడుపు నిండా దోశలు, కోడికూర దిన్నాం.

Thursday, January 10, 2019

నిప్పట్లు - మణుగుబూలు

అమ్మమ్మ వంటింటి పక్కనున్న వరండాలో కూర్చుని పెసలు విసురుతూ ఉంది. తిప్పడం ఆపినప్పుడల్లా గుప్పెడు గుప్పెడు పెసలు తీసుకుని జాగ్రత్తగా తిరగలి మధ్య గుంటలో పోస్తున్నాను. తాతయ్య గుమ్మం పక్కన కూర్చుని విస్తళ్ళు కుడుతున్నాడు. 

"ఎందుకు తాతయ్యా ఆ విస్తరాకులు?" అడిగాను.
"కుప్ప నూర్చేదానికి కూలోళ్ళు వస్తళ్ళా, వాళ్ళకు అన్నాలు బెట్టినప్పుడు కాబళ్ళా" చేస్తున్న పని ఆపకుండానే చెప్పాడు తాతయ్య.
"ఎంతమందొస్తారు తాతయ్యా?" అడిగాను.
"మీ మామయ్యా ముప్ఫైమందికి జెప్పొచ్చినాడు" అని నాతో చెప్పి. కోళ్ళెన్ని గావాల్న" అమ్మమ్మ నుద్దేశించి అడిగాడు.
"నాలుగన్నా గావద్దా? బదులిచ్చింది అమ్మమ్మ.  
"కోళ్ళెందుకు అమ్మమ్మా?"
"కుప్ప నూర్పిళ్ళప్పుడు కూలోళ్ళకు కోడి కూరొండి అన్నాలు బెట్టాల నాయనా." చెప్పింది అమ్మమ్మ.  

ఇంతలో గేటు దగ్గర చప్పుడయ్యింది. చూస్తే చిన్నమ్మమ్మ.
"ఏందికా రామ్మన్నావంట్నే?" ఎప్పుడొచ్చిందో గేటు దగ్గరే నిలబడి అడిగింది చిన్నమ్మమ్మ.
"గేటుకాడ్నించే అడగాల్నా. రామ్మే లోపలకా." పిలిచింది అమ్మమ్మ.
"మళ్ళొస్తాలేకా. బర్రెలొచ్చేయేళవతావుళ్ళా ఇంటికి బోవాల. మందలేందో కనుక్కుందావని వచ్చినా."
"నీడ ఇంకా యాప చెట్టుగాడిగ్గూడా పోలా, బర్రెలప్పుడే యాడొస్తాయా? మీ అక్కేందో రాస్యం జెప్పాలంట రామ్మే" పిలిచాడు తాతయ్య.
"నీక్దెలీని రాస్యాలు యాడుండాయి మావా మాకా" అంటూ నవ్వుతూ లోపలకి వచ్చి అమ్మమ్మ చేతిలోంచి తిరగలి పిడి తీసుకుని తిప్పడం మొదలు పెట్టింది.
"ఏంలేదు మే, పండగ దగ్గరకొస్తావుళ్ళా నిప్పట్లెప్పుడు జేద్దామా?" విసిరిన పెసర బద్దల్నిచాటలోకి ఎత్తుతూ అడిగింది అమ్మమ్మ.
"ఈ రోజు సోమ్వారం గదకా, బేస్తవారం జేద్దావా!"  
"అట్నేలే. అన్నట్టు నిప్పట్లీయేడు యెవురెవురికి పంపీయ్యాల?" అడిగింది అమ్మమ్మ.
"పిలకాయలకు పంపేదానికి తలో పాతిక. పండగరోజు కూలోళ్లు పదిమందన్నా రారా?"
"వస్తారు. ఇంకా కోటపాడుగ్గూడా పంపియ్యాల. పెదనాయన చనిపోయిళ్ళా, వాళ్ళీ యేడు పండగ జేసుకోరు." చెప్పింది అమ్మమ్మ.
"ఇంకా చాకలోళ్ళు, మంగలోళ్ళు, బుడబుక్కలోళ్ళు, జంగం దేవర...ఓ ఐదొందల్దాకా జెయ్యాల." లెక్క తేల్చింది చిన్నమమ్మ. 
"ఆ.. అట్నే" చెప్పింది అమ్మమ్మ. 

"మణుగుబూలగ్గూడా బియ్యం నానెయ్యి. బేస్తవారం పొద్దున్నే బియ్యం నానబెడ్తె మద్దినేళకి పిండి గొట్టుకోవచ్చు. పొద్దున్నే సందులో గాడిపొయ్యి తొవ్వీడం మర్చిపోబాక." అంది చిన్నమ్మమ్మ.   
"అట్నేలేమ్మే. మణుగుబూ గిద్దలు సుబరత్నమ్మ తీసుకుపోయ్యుండాది. అయ్యి కూడా తెప్పీయ్యాల." పెసలు పోసిన టిఫిన్ కేన్ మూతబెట్టింది అమ్మమ్మ.
"నిప్పట్లు ఒత్తేదానికి ముత్తయ్యను గూడ పిలిపిచ్చు."

"సరుకులెన్ని గావాల? బియ్యం నాల్గుమానికలు సరిపోతాయా?" అడిగింది అమ్మమ్మ.
"సాలకేం జేస్కోనుకా. బెల్లం తులం బడద్దేమో. ఏలక్కాయలు ఏబళం, నూనె నాలుగు శేర్లు" వరుసగా లెక్క చెప్పింది చిన్నమ్మమ్మ.  
"శెట్టి కొట్టుకాడ అన్నీ దెప్పిచ్చి పెడతా. బేస్తవారం కాస్త పెందలాడేరా."
"రవన్ని సజ్జ బూరెలు గూడ జేయ్ గూడదా" అడిగాడు తాతయ్య.
"ఏం మావా, సజ్జబూరెలు దినాలనుందా, అట్నేలే. సజ్జలు గూడ దెప్పిచ్చి పెట్టుకా. మూడవతా ఉంది ఇంక నేబోయోస్తా." అంటూ లేచి చీర కుచ్చిళ్ళు దులుపుకుని చక్కాబోయింది చిన్నమ్మమ్మ.  
తాతయ్య విస్తళ్ళు కుట్టడం పూర్తి చేసి ఆకుల మీద తిరగలి ఉంచాడు అణగడానికి.