Sunday, June 12, 2016

అనుకోలేదేనాడూ...

"సమయం ఐదవుతోంది నిద్ర పట్టడం లేదామ్మా?" అనడిగాడు పండు. జీవితంలో కొన్ని రోజులు సప్త వర్ణాల్ని ఒంటికి అద్దుకుని ఇంద్రధనస్సు మీద  ఊయలలు ఊగుతాయట. వినడమే కాని ఆ రోజులెలా ఉంటాయో నిన్నటి వరకు తెలియలేదు. అంతటి భాగ్యాన్ని చవిచూసిన నాడు ఇక నిద్రెలా పడుతుంది? నిన్న సాయంత్రం నుండి జరిగిన ప్రతి అంశమూ మధురంగా మనసును ఊపేస్తూ... ఒక్కొక్క జ్ఞాపకం మెత్తగా మనసులో ఇంకుతుంటే ఇది నిజమా! నిజమేనా? అని ఇంకా అనుమానంగానే ఉంది.  
అక్కడ ప్రతి టేబుల్ మధ్యలోనూ కొలువు తీరాయే తెల్ల గులాబీలు, లిల్లీలు ఇక్కడ తీరిగ్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎవరూ లేరనుకున్నాయో ఏమో ఏమిటేమిటో కబుర్లు. వాటికి స్వర్గలోకం ఎలా ఉంటుందో చూడాలని కోరిక ఉండేదట. ఆ చుక్కలు, చంద్రుని సమక్షంలో నిన్న జరిగిన సంబరం చూశాక ఆ కోరిక తీరిపోయిందట. "మా సుధీర్, శిరీష లాంటి తమ్ముడు, మరదలు, శ్రీదేవి, కేశవరావు గారి లాంటి స్నేహితులు ఉంటే ఆ బ్రహ్మ దేముడు మాత్రం స్వర్గంలో ఎందుకు ఉంటానంటాడు... వెంటనే దిగి భూలోకానికి వచ్చెయ్యడూ" అంటూ గుసగుసలు పోతున్నాయ్.
             *            *          *         *           *            *          *         
ఖాళీగా ఉండే బ్రిడ్జ్ హామ్టన్ క్లబ్ హౌస్ ఆ అలంకరణతో ఏకంగా ఆకాశంతోనే పోటీ పడిందంటే అతిశయోక్తి కాదు. మా ఫొటోలన్నీ ఎలా సేకరించారో అద్భుతమైన ఫోటో సైన్ ఇన్ ఆల్బం తయారు చేశారు. షాండ్లియర్, సెంటర్ పీసెస్, బాక్ డ్రాప్, నక్షత్రాలతో కిటికీ తెరలు....  
ప్రతిదీ శ్రద్దగా తయారుచేసిన శ్రీదేవి, కేశవ్ రావు గారి తీరు చూసి ఆ అనుబంధానికి ఏ పేరు పెట్టాలో అర్థం కాలేదు. అసలీ ఋణానుబంధం ఏనాటిదో అనే సందేహం కలుగుతోంది. 

మా జీవితాన్నే చిత్రంగా చలన చిత్రంలా మలచి మమ్మల్ని కూర్చోపెట్టి మరీ చూపించారు. అందులో నటించిన విజయ, కృష్ణ, అనురాధ, రామారావు, రఘు, సూర్య, రాఘు గారి పేరెంట్స్ నటనా కౌశలం అమోఘం. 



ఆరునెలల క్రితమే ప్రణాలిక సిద్దమైనా పదేళ్ళ పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ రహస్యాన్ని పదిలంగా కాపాడడం ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతెంత దూరలనుండో స్నేహితులు అభిమానంతో వచ్చారు. ఎంతో మంది ఉత్సాహంగా ఎన్నో చేశారు. వారందరి ఆత్మీయతకు గుండె తడి తెలుస్తోంది. ఆ అనుభూతి ఎంత హాయిగా ఉందంటే అభిమానాలు, సంబంధాలు అన్నీ ఎండమావులే అనుకునే బలహీన క్షణాలు ఉంటాయిగా అవి మొహం ముడుచుకుని ఇక తిరిగి రామంటూ పారిపోయేటంత. 

సంతోషాల శిఖరాలు ఎక్కినప్పుడే కాదు, అవరోధాల అగాధాలు దాటినప్పుడు కూడా ఎన్నో సందర్భాలలో మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపించిన ఆత్మీయుల సమక్షంలో మా పాతికేళ్ళ వివాహ వార్షికోత్సవం జరగడం తలుచుకున్న కొద్దీ మహా సంబరంగానూ ఉంది.  

ఏమన్నారు మంజుల... "ఎవరేమి చేస్తారో తెలియదు కాని ప్రతిదీ ఇద్దరిదీని" అని. ఆ ఈశ్వరునికి శరీరంలో సగభాగం పార్వతికి ఇవ్వడమే తెలుసు. నా ఈశుడు తన ఆత్మలో నన్నే నిలుపుకున్నాడు అందుకే ప్రతి పనిలోనూ ఇద్దరం కనిపిస్తూ ఉంటాం. బిందు అనుకుంటుందీ "మా అక్క చిచ్చుబుడ్డీ. తను తల వంచదు, మా రఘు బావను తల వంచనివ్వదు" అని. పిచ్చి బిందూ ఆ నాడు దాక్షాయణి పరాభవాన్ని భరించలేక అగ్నికి ఆహుతి అయింది. ఈశ్వరుడిలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, జరగబోయే ఘోరాన్ని ముందే పసిగట్టి దక్షుని మనసును సైతం మార్చగల ముందు చూపు మీ బావకు ఉండబట్టే నాకు దక్షాయణిలా పరాభవాన్ని చవిచూడాల్సిన అవసరం కలగలేదు.  తలవంచని తనం నాదే కాని ఆ అవసరాన్ని రానివ్వని చాకచక్యం మీ బావది.  

ఈ పాతికేళ్ళ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు... అనుబంధాలు. అవి తలచుకున్న కొద్దీ మనసు గతంలోకి పరుగులు తీస్తోంది. లేలేత పరిచయాలు... ఆ స్నేహ పరిమాళాల ఘుమఘుమలతో ఈ రేయి తెల్లవారబోతోంది. రంగులు అద్దిన 'నేడు' ఇంద్రధనస్సుపై సవారి చేస్తోంది.

"అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
గుండెల్లో ఇన్నాళ్లు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా!"

ఆ చందమామ మీద కూర్చుని ఆత్మీయుల అభిమానంలో తడిసి ముద్దవుతున్నప్పుడు నా మనసులో మెదిలిన భావాలకు అద్దం ఈ పాట.   

మాతో వారి అనుబంధాన్ని నలుగురితోనూ పంచుకున్న ఆత్మీయులకు, ఈ అనుభవాన్ని మాకు పదిలంగా అందించిన ఆత్మబంధువులకు కృతజ్ఞతలు చెప్పి దూరం పెట్టలేను. మీ స్నేహ సంతకాన్ని బ్రతుకు పుస్తకంలో చివరి పేజీలో సైతం పదిలంగా దాచుకుంటాను.