Tuesday, November 25, 2014

కాళోజీ నారాయణరావు

అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు!

       ఎవరో  కాళోజీ నారాయణరావు గారట ఆయన కవిత్వమట ఇది. అవనీ, అవకతవకలూ అంటూ అర్ధం లేని కబుర్లు. ఏమైనా అప్పటివాళ్ళకు బ్రతకటం చేతకాదు. ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేసుకున్నామా, తిన్నామా పడుకున్నామా అన్నట్లుండాలి, లేకపోతే ప్రజాసేవ పేరుతో పాపులారిటీ అయినా తెచ్చుకోవాలి గాని ఇలా గుండె కరిగిపోవటాలు, ఒళ్ళు మండిపోవటాలు దేనికంటా?

    అంతేనా, ఇంకా వినండీ "కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక'' అని ప్రకటించుకున్నార్ట. ఏదో కవ్వితం అంటే ప్రాసలు, పద ప్రయోగాలు, వెన్నెల్లూ, వెండి కొండలూ అంటూ రాసుకోవాలి. లేకపోతే ఎవరికీ అర్ధం కాని భాషలో ఆ ఘోషేదో వినిపించాలి కానీ,  ఏమిటో దేశభక్తి, వర్గాల పోరాటం, లోకంలో జరుగుతున్న దగాలు, సామాజిక వ్యత్యాసాలు, కర్షకుల ప్రాధాన్యం అంటూ కవిత్వం వ్రాశార్ట ఈ ప్రజాకవి. ఈయన "నా గొడవ" అంటూ వినిపించిన కవిత్వం చూడండి.

నా గొడవ నాది-అక్షరాల జీవనది
నానా భావనా నది- నీనా భావన లేనిది
మన భావన నది - సమ భావన నది
ఎద చించుక పారునది- ఎదలందున చేరునది
నా గొడవ నాది- కాళోజీ అనునది

    నాది నాదే, నీదీ నాదే అనుకోకుండా సమభావన అని ఇలా గొడవ గొడవగా దాదాపు 3000లకు పైగా కవితలు వ్రాశారట. అప్పటి వాళ్ళు ఇలాంటి కవిత్వంతో మేల్కొన్నారేమో కాని మనమైతేనా నాలుగు పేజీలు తిప్పేసి పుస్తకం పక్కన పడెయ్యమూ!

అన్నపు రాసులు ఒక చోట- ఆకలి మంటలు ఒక చోట
హంస తూలిక లొక చోట- అలసిన దేహాలొక చోట
సంపదలన్నీ ఒక చోట- గంపెడు బలగం ఒకచోట
అనుభవమంతా ఒక చోట -అధికారం బది ఒక చోట''

ఏమాటకామాటే చివర వాక్యాన్ని మనం మరో వెయ్యేళ్ళు మార్చకుండా చదువుకోవచ్చు. 

తెలుగు స్పష్టంగా మాట్లాడడమే నామోషీ అనుకుంటుంటే ఈయనొకరు.
"అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!''
ఇలా తిడితే ఇంకేమైనా ఉందీ! ఎవరైనా మనెదురుగానే వెధవ పని చేస్తున్నా భవిష్యత్తులో వాళ్ళతో మనకు ఏం అవసరం వస్తుందో ఏమిటోనని చూసి చూడనట్లు పోవాలి కానీ ఇలా మాట్లాడితే మన మీద కత్తి కట్టరూ!

    రాజకీయ విప్లవాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించి ఆ ఏర్పడిన ప్రభుత్వాలు సమానత్వాన్నీ స్థాపించవచ్చు. కానీ సౌభ్రాతృత్వం లేనిదే ఈ రెండింటివల్ల కలిగే ఫలితం ప్రజలకు చెందదు. దీనికి నాయకుల కృషి సరిపోదు ఇది రచయితల వలెనే సాధ్యమౌతుంది అన్నార్ట పిచ్చి మారాజు. బాగా డబ్బులు సంపాదించినవాళ్ళకు, దేశమంతా స్థలాలు కొన్నవాళ్ళకు విలువిస్తారు వారి మాటే వింటారు కాని, రచయితలకు విలువిచ్చి వారి రచనలు చదివి మారతారటండీ! 

     పైగా కత్తులూ, కఠార్లతో రజాకార్లు స్వైరవిహారం చేస్తున్న రోజుల్లో ఈయన ఆంధ్రమహాసభల్లో, ఆర్యసమాజ్‌ ఉద్యమాల్లో పాల్గొంటూ వరంగల్ కోట మీద కాంగ్రెస్ వాళ్ళతో కలసి జెండా ఎగరవేశార్ట. ఈయన ఉద్యమాలంటూ తిరిగబట్టే పాతికేళ్ళు నిండకుండా జైలు పాలయ్యారు. ఇవన్నీ అనుభవమయ్యే ఇప్పటి పిల్లల్ని సామాజిక బాధ్యత, న్యాయం, ధర్మం అంటూ పనికిమాలిన విషయాల జోలికి పోకుండా ఉద్యోగానికి పనికివచ్చే చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెడుతుంది.  

     ఈయనకు రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పొట్లపల్లి రామారావు, టి.హయగ్రీవాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గార్లపాటి రాఘవరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దాశరథి, సినారె, బిరుదురాజు రామరాజు, కన్నాభిరాన్, ఎస్ ఆర్ శంకరన్, సంజీవదేవ్, చలసాని ప్రసాద్, మో, శ్రీశ్రీ, కృష్ణాబాయి, కాళీపట్నం రామారావు, మహాశ్వేతాదేవి, జ్వాలాముఖి, ఆరుద్ర, నగ్నముని, జయశంకర్, నాగిళ్ల రామశాస్త్రి, గద్దర్, వరవరరావు, ఎన్.వేణుగోపాలవీళ్ళంతా స్నేహితులట. ఏవో రెండు మూడు పేర్లు కాస్త తెలిసినట్లుగా ఉన్నాయి కాని ఎవరో మరి వీళ్ళంతా?

   అప్పుడేదో మద్యం నిషేధం అని ఉండేదిట. వినడానికే నవ్వొస్తోంది కదూ! అసలు గ్లాసులు ముందుపెట్టుకునే కదూ తొంభై శాతం నిర్ణయాలు తీసుకునేది! మరి అర్ధం పర్ధం లేని ఈ నిషేధాలేమిటో! ఒకవేళ అవన్నీ బయట నినాదాలిచ్చుకుని ఇంటికెళ్ళి ఓ ఫుల్లు లాగించొద్దూ! పాపం స్నేహితులెవరో కాస్త పుచ్చుకోవయ్యా అంటే "బయట మద్యనిషేధ చట్టం ఉన్నది గనక తాగొద్దు. ఐనా తాగుదామంటవా ఖైరతాబాద్ చౌరస్తాకు బోయి, విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నడీ చౌరస్తాల నిలబడి ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తున్నం అని తాగుదాం," అన్నార్ట ఈ ఛాందస వాది. మాంసం తింటున్నామని పేగులు మెళ్ళో వేసుకుని తిరుగుతామటండీ! ఇక ఆ స్నేహితులు మరోనాడు ఈయనకు మందిస్తారా అసలు ఇంటికైనా పిలుస్తారా అని. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి.

    కాళోజీ గారు న్యాయ శాస్త్రం చదివారట కాని ఏనాడూ రూపాయి సంపాదించకపోతే వీళ్ళ అన్నయ్య రామేశ్వరరావుగారే ఇంటికి కావలసిన మంచీ చెడ్డా చూసుకునేవారట. పాపం రామేశ్వరరావు చనిపోయినప్పుడు కాళోజీ గారు ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. డెబ్బై ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప,’ అన్నార్ట . అన్నన్నేళ్ళు మరో కుటుంబాన్ని కూడా పోషించటం అంటే ఆ అన్నగారెంత సత్తెకాలం మనిషో తెలుస్తోంది. 

    ఆయన్ను అంతగొప్ప ఇంతగొప్ప అని పొగిడిన వాళ్ళు మణులూ మాన్యాలు ఇచ్చారనుకుంటున్నారా! అబ్బే సెప్టెంబర్ తొమ్మిదిన అదేనండి అయన పుట్టినరోజును “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటామన్నార్ట. హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి 'కాళోజీనగర్' అని పేరు పెట్టార్ట.  

    "ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ళ కదలిక" అంటూ కాళోజీ గారో మాట చెప్పారు. మనం చాలా తెలివైన వాళ్ళం కదూ! మెదడ్ని కష్టపెట్టే పన్లు మనకెందుకు? మన వేల చదరపు అడుగుల ఇళ్ళలో సిరా చుక్కల పుస్తకాలు లేకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు కూడా ఏవో నాలుగు సినిమా కబుర్లు చదువుదామని వెళ్తేనూ సాక్షిలోనూ, విశాలాంధ్ర లోనూ ఇవి కనిపించాయి. 

   బుజ్జిపండు ఈ మధ్య లైబ్రరీనుండి ఏమిటేమిటో పుస్తకాలు తెస్తున్నాడు. ఏం చదువుతున్నాడో ఏమిటో కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఇట్లాంటివి చదివితే ఇంకేమన్నా ఉందీ!