Thursday, September 29, 2011

మా ఊరి ముచ్చట్లు

గున్న మావి కొమ్మల్లోన కోయిలమ్మ రాగాలు
పంటచేల దారుల్లోన పైరగాలి సరాగాలు!

సందె గాలిలో తేలియాడే సన్నజాజి పరిమళాలు
పైరు నిండుగ విరగబూసే బంతిపూల సోయగాలు!

కొండ మీద గుడిలోన జే గంటల సవ్వడులు
చెరువు కింద వాగులోన బాల కృష్ణుల కేరింతలు!

అరుణారుణ సమయాన వెనుతిరిగే గోమాతలు
మర్రిచెట్టు ఊడలతో ఆటలాడే మర్కటాలు!

కార్తీకాన చెరువుల్లో ప్రాతఃకాల  దీపాలు
పుష్య మాస వేకువల్లో వెల్లి విరిసేటి రంగవల్లులు!

ఎదురొచ్చి పలకరించే అమ్మమ్మల అనురాగాలు
ఎనలేని ప్రేమగల తాతయ్యల  ముద్దుమురిపాలు!

ఇలా ఎంత చెప్పినా తరగవు
మా వూరి ముచ్చట్లు!!Wednesday, September 28, 2011

మావ ముచ్చట్లు


ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!

పచ్చ చీరాగట్టి వనలచ్చిమోలు౦టే
చీరలోనున్నట్టి 'పడుగు' తానంటాడు!

రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటే
గాజుల్ల నున్నట్టి 'జిలుగు' తానంటాడు!

ముత్యాల పేటతో ముచ్చటగ నేను౦టే
పేటలో నున్నట్టి 'పూస' తానంటాడు!

ముక్కుపుడకా బెట్టి ముత్తెమోలేను౦టే
పుడక మీదున్నట్టి 'మెరుపు' తానంటాడు!

కురులేమో సిగచుట్టి సిరిలచ్చిమోలుంటె
సిగలోన ఉన్నట్టి 'మల్లె' తానంటాడు!

కాలి పట్టీ లెట్టి కలహంస వోలుంటే
పట్టీల నున్నట్టి 'మువ్వ' తానంటాడు!

ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!!


ఎప్పుడో విన్న 'మల్లి ముచ్చట్లు' ఆధారంగా...

Sunday, September 25, 2011

మధురస్మృతులు


ఎన్నాళ్ళుగానో వేచిన తరుణం
సత్యమవుతున్న సుందరస్వప్నం!

మధురమైన ఊహలు....తరగిపోని ఊసులు
పసిపాప నవ్వులతో....కలల కలవరింతలు!

కనుల ఎదుట కలలపంట
సుమధురయానం మనదేనట!
     
          * * * * *
ఎంత ఆశ్చర్యం....
ఎలా వెళ్ళిపోయింది ఈ ఐదేళ్ళ కాలం!

బోసినవ్వుల్ని దాచుకోలేదు...
బుడి బుడి నడకల గురుతులే లేవు!

చిన్నారి పలుకుల్ని తనివి తీరా విననే లేదు,
అక్షరాలు దిద్దించనే లేదు!

చందమామ కధలు చెప్పనే లేదు..
వెన్నెల్లో పాలబువ్వలు కొసరనే లేదు!

ఉరుకులు పరుగుల జీవిత౦లో...
ఏవీ మధురస్మృతుల ఆనవాళ్ళు?

Friday, September 23, 2011

ఎవరు పిలిచారనో....ఏమి చూడాలనో....

       నిన్నుదయం ఆ పనీ ఈ పనీ పూర్తై అట్లా కాఫీ కప్పట్టుకుని ఇట్లా  కూర్చున్నానా,  పిలవని పేరంటానికి మల్లె తగదునమ్మా అని పని గట్టుకుని మరీ  వచ్చి వాలిపోయాయ్. ఇక చేసేదేము౦దీ......రాని నవ్వు ముఖాన పులుముకుని "ఏమైనా పనిమీద వచ్చారా" అన్నా. అప్పుడెప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు రమ్మన్నాన్ట .  అది గుర్తుపెట్టుకుని సందు చూసి మారీ వచ్చాయ్. నాకా ఎక్కడలేని మొహమాటమయ్యె,  పైగా 'మాతృదేవోభవ......అతిధి దేవోభవ......' అని మన సా౦ప్రదాయమొకటు౦డె.  ఇక ఈ నోటితో వెళ్ళమని ఎట్లా చెప్పేది?

       పోనీ ఆ కబురూ, ఈ కబురూ చెప్తూ ఒద్దిగ్గా ఒక చోట ఉంటాయా! ఉహు..ఎందుకు౦టై,  ఎప్పుడైనా ఉ౦డే అలవాటుంటే కదా  ఇప్పుడు౦డడానికి, ఆ వైపుకి ఈ వైపుకి ఒకటే పరుగులు. ఒక్క నిముషం నిలకడ లేదంటే నమ్మండి. ఎవరికి తప్పినా నాకు తప్పదుగా మరీ..... పైగా పిలిచి౦ది నేనేనైతిని. ఎక్కడోదగ్గరకెళదామంటై,  ఒక ఊరని  లేదూ...వాడని  లేదూ... నే పరుగులు పెట్టాలేకానీ... చంద్రమండలానికైనా సరే.

       ఏమాట కామాట చెప్పుకోవాల్లెండి. వాటితో పాటు వెళ్లినందుకు ఎన్నెన్ని చూపించాయో, ఎక్కడెక్కడ తిప్పాయో, అదే౦  చిత్రమో వాటికి అలుపన్నది లేదంటే నమ్మండి. ఏమిటీ  ఇంతకూ ఎక్కడెక్కడకెళ్ళామంటారా? అదే చెప్పబోతున్నా.....మైదానాలూ, కొండలూ, లోయలూ, సముద్రాలూ, ...అబ్బో చాలా తిరిగాం లెండి. కొండలెక్కాక  గాల్లోనె నిలబెట్టేశాయంటే నమ్మ౦డి,  ఏమిటీ... మరి లోయల్లోనంటారా.... ఎందుకడుగుతార్లెండి.

         చూశారా చూశారా మీతో కబుర్లలో పడిపోయి పరిచయ౦ చెయ్యడమే మరచి పోయాను. అసలు ఈ మరచిపోవడం,  దాని గురించి  చెప్పాలంటే మనం ఓ రెండో, పన్నె౦డో  ఏళ్ళు వెనక్కెళ్ళాలన్నమాట. అప్పట్లో నేనూ విమల, అబ్బ.... స్వీట్ హోం విమల కాదండీ బాబూ నా ఫ్రెండ్ విమల,  రోజూ మధ్యాన్నాల్లు  సరదాగా రేడియోలో పాటలు పెట్టుకుని టీలు తాగేవాళ్ళం. తోడుగా బోలెడు కబుర్లు. ఓ రెండు మూడు గంటలు మా మధ్య సరదాగా తిరిగేస్తు౦డేవి,  తనని పంపించి గేటు ఇలా మూసి అలా వెనక్కి తిరగ్గానే  గుర్తుచ్చేది డబ్బాలో ఉన్న జంతికల గురించి.  రేపొచ్చినప్పుడు తప్పకుండా జంతికలు పెట్టే మాట్లాడాలనుకునేదాన్ని. ఊహూ....కుదర౦దే ....అప్పుడూ ఇంతే.  మరి ఇప్పుడో అని మీరంటే, మళ్ళీ అంతే  అని నేనంటా... తనని చూసిన క్షణం....నాకు జంతికలు గుర్తొస్తే అదే౦  స్నేహమో మీరే చెప్పండి.

            పాపం తిరిగి తిరిగి అలసి పోయ్యాయేమో అని కాసిని అక్షరాలిచ్చా.... అయ్యో పరిచయం చేస్తానినని  మళ్ళీ కబుర్లతో కాలం గడిపేస్తున్నానా,  ఏమిటీ ఇక పరిచాయాలవీ అవసరం లేదంటారా ...అలాక్కానీయండి మరి. నేను చెప్పకుండానే ఆ వచ్చినవి ఊహలని ఎలా కనిపెట్టేసు౦టారబ్బా....  బహుశా అవి ఈ బ్లాగులో అల్లిన మాలలు చూసి కాబోలు.  ఏమిటో అంతా విష్ణు మాయ....

Tuesday, September 20, 2011

నిరీక్షణ


ఈ రేయి ఎన్నటికి తరిగేనో...
నా ఉద్వేగం చూసి
క్షణాలన్నీ చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నై!

చీకటి చిక్కనై చిందులు వేస్తోంది!
వెన్నల చిన్నబోయి
మబ్బుల మాటున మోము చాటేసింది!

విరిసిన మల్లెలు
గుసగుసలు పోతున్నై!
నిశీధి అంచుల్లోకి
నిశ్శబ్దం మెల్లగా జారిపోతోంది!!

వెలుగు రేఖ ఒక్కటి
అలవోకగా తొంగి చూసింది...
నిదురించిన తోట
బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది!

ఏమయిందో ఏమో
చుక్కలు మెల్లగా తప్పుకున్నై!
రేతిరి తన రాజ్యాన్ని వదిలి...
తెలియని తీరాలకు తరిలి పోయింది!

ఎదురు చూసిన యెదలో
సందడి మొదలైయ్యింది...
తూరుపు దిక్కున
సన్నాహాల కోలాహలం!

వాకిట వేచిన నెచ్చెలి కోసం
వెలుతురు బాటలో సూరీడు!!


తొలి ప్రచురణ కౌముదిలో...

Wednesday, September 7, 2011

కార్తీక౦లో ఓ రోజు


            'వనభోజనం' అన్న మాట వింటే చాలు, మనస్సు చిన్నతనంలోకి పరుగులు తీస్తుంది.  ముందుగా గుర్తొచ్చేది కార్తీక మాసం. మా ఊరిలో చిన్న, పెద్ద ఆడవాళ్ళ౦దరూ  తెల్లరగట్లే  చెరువులో అభ్యంగన స్నానాలు చేసి అరటి బోదేలో నూనె దీపాలు వెలిగించి ఆ  నీళ్ళలో వదిలే వాళ్ళు.  పొగమంచులో కనిపించినంత మేర నీళ్ళు, అందులో మెల్లగా కదులుతూ దీపాలు, ఓహ్! ఎంత చూసినా తనివి తీరేది కాదు. 


          ఇక వన భోజనాలు...  సందడే సందడి.  నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు,  పిన్నులు, వాళ్ళ పిల్లలు, ఇంకా  ఊరి నుండి వచ్చే చిన్నత్త, పెద్దత్త, మామయ్యలు ఊరిలో వుండే చుట్టాలతో కలసి ఓ డెబ్బై  మంది దాకా తయరయ్యేవాళ్ళం. రెండెడ్ల బండ్ల మీద కావలసిన సామానంతా బండిజల్లలో వేసికుని తోటలోకి వెళ్ళేవాళ్ళం. మా పాలేరు వెంకడు గాడి పొయ్యి తొవ్వేవాడు. చిన్నత్త వంకాయలు కొస్తే, పెద్ద పిన్ని ఎసట్లో బియ్యం  వేసేది, నాన్నమ్మ పచ్చడి నూరితే, నీలవేణి, సామ్రాజ్యం పిన్ని నీళ్ళు తెచ్చేవాళ్ళు. బాబాయిలు వేడి వేడి అండాలను ఇట్టే ఎత్తి అవతల  పెట్తేసే వాళ్ళు, ఇలా పెద్దవాళ్ళంతా తలా ఒక పని అందుకునే వాళ్ళు.


            పిల్లలమ౦తా కలసి కోతి కొమ్మచ్చి, కుందుడు గుమ్మ, దాగుడు మూతలాట, ఖో ఖో ఆటలతో తోటంతా హోరెత్తించే వాళ్ళం . ఆకలేసిన పిల్లలకి  ఏ లడ్డో, వాంపూసో తాయిలం పెట్టేవాళ్ళు. దాహా నికి కొబ్బరి బోండాలు, నిమ్మకాయ మజ్జిగ ఉండనే ఉండేవి. వంటలన్నీ అయ్యాక అందరికీ ఉసిరిక చెట్టుకింద పంక్తి భోజనాలు. వేడి వేడి అన్నంలో చింతకాయ తొక్కు, దోసకాయ పప్పు, కమ్మని నెయ్యి ఆదరువగా అప్పడాలు, గుమ్మడికాయ వరుగులు, గుత్తి వంకాయ కూర, పులిహోర, మీగడ పెరుగు, ఆవకాయ, చివరగా పాయసం. ఆ  భోజనం అమృతంలా వుండేది.
          
          దేశంకాని దేశం వచ్చాం, ఇక్కడ చెరువులూ  దీపాలు లేవు, వనభోజనాలూ లేవు అని దీర్ఘంగా నిట్టూర్చి ఎవరైనా మెయిల్ పంపించారేమోనని మెయిల్ ఓపెన్ చేశాను. అప్పుడు చూశాను మా తెలుగు అసోసియేషన్ వారి  వనభోజనాల ఆహ్వానం. ఇదేమిటి మనసులో అనుకున్నది మెయిల్ కెలా తెలిసిందని ఆశ్చర్యపోతూ మొత్తం చదివాను. ఈ వనభోజనాలు మన ఊరిలోలాగ ఉంటాయా,  ఏమన్ననా?  అయినా ప్రయత్నించి చూద్దాం అని 'వాలంటీర్ షీట్' ఓపెన్ చేసి 'గుత్తి వంకాయ'కి  సైన్ అప్ చేశాను. ఇలా చేశానో లేదో అలా వెంటనే ధన్యవాదములతో అచ్చ తెలుగులో మెయిల్. ఇక ఆ  రోజు కోసం ఎదురు చూస్తూ పక్కింటి పద్మని దీని గురించి అడిగాను ఎలా ఉంటుందని? "  ఆ... ఏదో ఉంటుందిలే... ఏమీ ఉబుసుపోక ఇలాటివి యేవో ఒకటి చేస్తూనే ఉంటారని" సమాధానం.  అనవసంగా వెళ్తున్నామేమో  అని ఆలోచిస్తూ అన్యమస్కంగానే 'గుత్తొంకాయ కూర' వండి  శ్రీవారు పిల్లలతో  కలసి నిర్ణీత స్థలానికి వెళ్ళాను.
  
         ఆ  పార్కుకు వెళ్ళేసరికే  కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులతో ఆ  ప్రాంతమంతా కళ కళ లాడుతోంది. ఒక  రెండు వరుసలలో స్టాండులు అమర్చి పదార్ధాలను ఒద్దికగా సర్దుతున్నారు.  ఓ ప్రక్క మంచి నీళ్ళ కాన్లు, కూలర్లలో జ్యూసులు సోడాలు. బాడ్జ్ పెట్టుకున్న ఒక కార్యకర్త నన్ను నవ్వుతూ పలకరించి నా పేరు తెలుసుకుని నేను తెచ్చిన ట్రేని అందుకున్నారు. అక్కడ అందరూ కలసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక్క కుటుంబంలా కలసి పనిచేస్తున్నారు. ఇంతలో బుగ్గ మీద సీతాకోక చిలుకతో చిన్నారి, చేతిలో వాటర్ బెల్లూన్ పట్టుకుని పెద్దాడు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇదేంటిరా అని ఆశ్చర్యంగా చూశాను. రెండో షెల్టర్లో పిల్లలకు ఓ ముగ్గురు అమ్మాయిలు ఫేస్  పైంటింగ్ వేస్తున్నారు, కొంత మంది పిల్లలు వాటర్ బెలూన్లతో ఆడుకుంటున్నారు. ఆ  పక్కగా చెట్టు కింద టగ్ అఫ్ వార్, అలా పిల్లలందరూ ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. 

  
        ఇంతలో భోజనాలకు పిలుపొచ్చింది. "పిల్లలు తినడానికి ఏమైనా వున్నాయో, లేవో? కొంచం పెరుగన్నం అన్నా కలుపుకు రావాల్సింది" అనుకుంటూ  ప్లేట్ తీసుకున్నాను. బిర్యాని, పులిహోర, చపాతీలు,  చెన్నా కర్రీ, వంకాయ కూర, పచ్చడి, సాంబార్, గులాబ్ జామ్, చికెన్ కర్రీ, పెరుగు, దద్దోజనం, ఆవకాయ్. "బాబోయ్ ఇన్ని వంటకాలే" అనుకుంటూ పిల్లలకి, చపాతీ చెన్నా కర్రీ, దద్దోజనం పెట్టాను. ఈలోగా పెద్దవాళ్ళు కూడా మొదలెట్టారు. నిజం చెప్పొద్దూ! వంటలన్నీ అమోఘం తృప్తిగా భోంచేశాను . ఇంట్లో కూరలకు వంకలు పెట్తే శ్రీవారు కూడా రెండు మూడు సార్లు వడ్డించుకోవడం చూసి 'ఔరా' అనుకున్నాను. 

        అందరి భోజనాలు అవగానే జనరల్ బాడీ మీటింగ్ కి పిలుపొచ్చింది అప్పటి వరకూ అసోసియేషన్  వారు చేసిన కార్యక్రమాలు, చేయబోయే  కార్యక్రమాలు అన్నింటి గురించీ చెప్పారు. ఈ సంవత్సరం మొట్ట మొదటి సారిగా వాహిని పత్రికను కూడా ముద్రించారట. కథలు కవితలంటే ప్రాణం నాకు వెళ్లి పత్రికను చేతిలోకి తీసికున్నాను ఆశ్చర్యం! ఎంత బావుందో, ఇలా౦టి  తెలుగు పత్రిక చూసి ఎన్నాళ్ళయిందో! ఇలా పేజీలు తిప్పుతున్నాను ఈ లోగా 'ఒక్క నిముషం తెలుగు' అని పిలుస్తున్నారు అలా వెళ్లి చూద్దును కదా ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఒక్క నిమిషం 'తెలుగులో మాత్రమే' మాట్లడాలట. చాలా మంది ప్రయత్నించారు అక్కడున్న అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈలోగా  కొంతమంది ఫుడ్ సర్వ్ చేసిన షెల్టర్ అంతా శుభ్రంగా క్లీన్ అప్  చేసేశారు. ఆ  పక్కగా చెట్టు కింద పిల్లలు 'మ్యూజికల్ చైర్స్' ఆడుతున్నారు.
  
         తరువాత 'కబడ్డీ', 'టచ్ మీ టు' గేమ్స్ ఆడాము. చిన్నప్పుడెప్పుడో స్కూల్ లో ఆడిన ఆటలు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇంత బాగా ఎంజాయ్ చేశాను. ఎండ ఎక్కువగా వుంది పిల్లలు ఏం చేస్తున్నారో అని చూద్దును కదా ఒకళ్ళ చేతిలో పుచ్చకాయ ముక్క, ఇంకొకళ్ళ చేతిలో కాప్రిసన్, దూరంగా శ్రీవారి చేతిలో నిమ్మకాయ మజ్జిగ.ఎండలో తీయని పుచ్చకాయ తింటూ చిన్నప్పటి రోజులు గుర్తుచేసికున్నాను, మా వనభోజనాల సందడి మళ్ళీ తిరిగి వచ్చినట్లైంది. పాత, కొత్త మిత్రులందరికీ వీడ్కోలు చెప్పి మళ్ళీ ఇలాంటి వనభోజనాల సందడి ఎప్పటికో కదా.....అనుకుంటూ పార్కింగ్ లాట్  వైపు కదిలాము. 
        

Saturday, September 3, 2011

దరహాస చంద్రికనిన్న బద్దకంగా నిదుర లేచాను..
చల్ల గాలి వీడ్కోలు చెప్తూ వెళ్లి పోయింది!

కిరణాలు వెచ్చగా గుచ్చుకున్నై..
మెల్లగా వ్యాహ్యాళికి బయలు దేరాను!

అబ్బ! ఈ ప్రకృతి ఎంత అందంగా వుందో..
ఎత్తైన చెట్లు, చెట్టు మీద ఎగిరే గువ్వ పిట్టలు..

ఆ పచ్చటి కొండలు, పరగులేత్తే జింకలు...
నడకలో తెలియ కుండానే చాలా దూరం వచ్చేశాను!

పిల్లలు ఎంత చలాకీగా ఆటలాడు కుంటున్నారో..
స్నేహితులతో కబుర్లు చెపుతూ సాగి పోతున్నారు!

ఆ ఇంటి ముందు ఎర్ర గులాబి గాలికి అందంగా ఊగుతోంది!
ఎన్నెన్ని రంగులో.. ఎన్ని రూపాలో...

రంగు రూపు ఆకృతి లేని నన్ను చూసుకుని
దుఖ్ఖ భారంతో క్రుంగి పోయాను..

నాన్నూ ఆ జీవన స్రవంతి లొ కలిపేయమని
భగవంతుణ్ణి వేడుకున్నాను!

ఇదేమిటి? ఇలా నీలంగా మారిపోతున్ననేమిటి?
క్షణ క్షణానికి ఎలా బరువైపోతున్ననేమిటి?

ఇంతకు మునుపెప్పుడూ ఇలా లేదే!
నా రూపం కరిగినీరై... నేల పైకి జారిపోతున్నాను..

నేను దరి చేరగానే... ఆ చిన్ని విత్తనం మొలకై పోయి౦దేమిటి
నా సంతోషం మొగ్గ తొడిగి... సిరమల్లై పూసింది
ఆ పరిమళం మీ పెదవులపై దరహాస చంద్రికై నిలిచింది!

ఇంతకూ నన్ను గుర్తు పట్టారా..
ఒకప్పటి మేఘాన్ని నేను!!
తొలి ప్రచురణ కౌముదిలో....

Friday, September 2, 2011

చందమామ సాక్షిగా...

చినుకు... చినుకు... మధ్య కలసి చిందులేశా౦
రావి ఆకుల గలగలలో.. రాలుగాయిలమై తిరిగాం!

వెన్నెల్లో.. చెమ్మ చక్క లాడాం
కోయిలతో... గొంతులు కలిపాం!
భేతాలుడి పొడుపు కధలు విప్పాం
ఇసుక తిన్నెల్లో... గవ్వలెన్నో ఏరాం!

ఎక్కడికేళ్లి పోయింది... ఎప్పుడెళ్లిపోయింది?
పంట చేను గట్టు మీద పైరగాలై పోయిందా..
అమ్మ పెట్టిన గోరింటాకులో.. చందమామై పోయిందా..

కారులొద్దు మేడలొద్దు
మిడిమేలపు పయనమొద్దు!
పొరుగు తెలియని బ్రతుకులొద్దు
కాలంతోటి పరుగులొద్దు!

అయ్యయ్యో
ఇప్పుడెలా...ఎక్కడని వెతకను?
చుక్కల పరదా చాటునా...మబ్బుల పల్లకి లోనా...
విరజాజి పరిమళంలోనా..సెలయేటి గలగలల్లోనా...

మీక్కనిపిస్తే  కాస్త జాడ చెప్పరూ...
ఎక్కడున్నా తెచ్చుకుంటా!
నా బాల్యాన్ని గుండెల్లో దాచుకుంటా!
చందమామ సాక్షిగా...వెన్నెలమ్మ మీదొట్టు!

తొలి ప్రచురణ తెలుగు నాడిలో.....

చేజారిన స్వప్నం


ఆనవాలు కోసం ...అంతులేని ఆరాటం
నేనడచిన దారి... నన్ను విస్మరించింది
ముక్కలైన నమ్మకం...మంటలు రేపుతోంది!!

మాధుర్యం..మమత...స్వరూప౦ శూన్యం 
స్మృతులన్నీ..చెదల పాలయ్యాయి
ముసుగు తీసిన మమకారం...వికటాట్టహాసం చేస్తోంది!

జీవనయానంలో ..అనుక్షణం 
ఆస్థిత్వానికై... అన్వేషణ
గుట్టలుగా దొరికిన నిరాశా శిధిలాలు!

చేజారిన స్వప్నం..దిగులు పాట పాడింది 
భారమైన కాలం.. మౌనానికి నేస్తమైంది!!

తొలి ప్రచురణ 

ఉనికి


         ఆకాశమంతా చాలా కోలాహలంగా వుంది. సూర్యుడు, చెంద్రుడు,  మేఘాలు, నక్షత్రాలు, మెరుపులు అన్నీ కొలువు తీరి వున్నాయి. ఓ మేఘం చాలా కోపంగా కనిపించింది. మేఘం ఆగ్రహానికి కారణమేమిటని నెలరాజు ప్రశ్నించగా 'సమస్త చరాచర జగత్తుకి మన ఉనికి  ఎంతో అవసరం కదా! అలాటి మనల్ని మానవుడు పూర్తిగా పట్టించుకోవడం మానివేశాడు' అని మేఘం సమాధాన మిచ్చింది. అయితే మనమందరం  మన మన ప్రయత్నాలు చేద్దాం. ఈ మనుష్యులకు మరో అవకాశం ఇద్దాం, అంతే కాదు ఎవరు మనుషులను తమ వైపు తిప్పుకుంటారో వారే గొప్ప  అని కూడా తీర్మానించుకున్నాయి.

                        *************

            ఉదయాన్నే బాలభానుడు నులి వెచ్చని కిరణాలతో ఆకాశమంతా రంగులమయం చేశాడు. వినీలాకాసం వింత కాంతులతో కన్నుల పండువగా వుంది కాని మనుష్యులేవరూ  అసలు పైకే చూడలేదు. చిన్నబుచ్చుకున్న సూర్యుడు మేఘం చాటున దాక్కున్నాడు. మేఘం గర్వంగా ఓ నవ్వు నవ్వి రకరకాల ఆకృతులతో ఆకాశంలో బొమ్మల కొలువు పెట్టింది. ఏ మనిషీ కనీసం తల కూడా తిప్పలేదు.

           మేఘాన్ని, సూర్యుడిని  చూసి మల్లెలూ, మందారాలు విరగబడి నవ్వాయి. గర్వభంగమైన మేఘం నీలం గా మారి ఓ ఉరుము ఉరిమింది. కోపజ్వాల మెరుపై మెరిసింది. ఆ  ఉరుము, మెరుపుల  కొలహలానికి మనుష్యులు హడావిడిగా ఇళ్ళకు చేరాలని తొందర పడ్డారు కాని. ఆ  నీలి మేఘాల సొగసులని మెరుపుల సోయగాన్ని చూద్దమనైనా అనుకోలేదు.

        చల్లగాలి మేఘాన్ని చూసి జాలిపడి స్వాంతన వచనాలు పలికి సాయం చేద్దామని బలంగా వీచింది. కిటికీలు బిగించుకున్నారు తప్ప ఆ  సందడికీ ఎవరూ స్పందించలేదు. వర్షం ఫక్కున  నవ్వుతూ మీ అందరివల్లా  కాదు చూడండి మనుష్యలకి నీళ్ళంటే ప్రాణం ఇప్పుడు చూడండి ఎలా పరవశించి పోతారో  అంటూ ఝల్లు ఝల్లున కురవడం మొదలెట్టింది. తమ పనులకు అడ్డం వచ్చిందని విసుక్కుంటూ  తలుపులు బిగిచుకుని TV ల ముందు కూర్చున్నారు. చిన్నబుచ్చుకున్న వర్షం టక్కున నిలిచి పోయింది. 

         స్టార్ సేరెమొనీ  అట. మీ అందర్నీ పట్టించుకోని మనుష్యులు మా కోసం  విందులు వినోదాలు  ఏర్పాటు చేశారు వెళ్లి వచ్చి మీకు విశేషాలు చెప్తామని చుక్కలన్నీ సింగారించుకుని ఆ  రాత్రి మరింత ప్రకాశవంతంగా ఆకాశంలొ అందంగా మెరిసి పోతున్నాయి. మనుషులు చాలామంది వస్తున్నారు. అంతా  సందడి సందడిగా వుంది. చుక్కలన్నీ ముసిముసి నవ్వులతో మురిసి పోతున్నాయి. చల్లని సాయంత్రం కరగి  రాత్రయింది. ఎవరూ ఆకాశం వైపు కన్నెత్తైన చూడలేదు. సరికదా  అర్ధం కాని చెవులు హోరిత్తించే సంగీతాన్ని భరించలేని చుక్కలన్నీ వెలవెల పోయాయి.

        ఇలా కాదు ఏక నా ప్రతాపం చూపిస్తాను. మనుష్యుల౦దరకూ  నేనంటే ప్రత్యేక మైన ఇష్ట౦ . 'నెలారాజా వెన్నెలరాజా'  అంటూ నా మీద మధురమైన పాటలు వ్రాసారు. అంటూ నిండు జాబిలి పున్నమి వెలుగులతో  ప్రత్యక్ష మైంది. అసలు మనుష్యులకు అమావాశ్య ఎప్పుడో, పౌర్ణమి ఎప్పుడో చూసే తీరికే లేదని చంద్రుడికి తెలియదు పాపం. ఎవరూ పట్టించుకోని చెంద్రుడు పాపం రోజు రోజుకూ చిక్కిశల్యమై ఆకాశంలో అవసాన దశకు చేరాడు. 

       ఇదంతా చూసిన పుడమి ఇక భరించలేక తన స్నేహితుల భాదలను గమనించి కదలి పోయింది. సముద్రుడు విలయ తాండవం చేసాడు. ప్రపంచమంతా జలమయం. సూర్యుడు, చెంద్రుడు, చుక్కలు, మేఘాలు, మెరుపులు, ఏవీ లేవు ఎటుచూసినా నీరే. ప్రపంచమంతా నీళ్ళల్లో మునిగి పోతో౦ది.
                     
                        *****************

             ఉలిక్కి పడి నిద్ర లేచాడు ప్రకాష్. భావన ప్రక్కనే నిద్ర పోతుంది. తలుపు తెరిచి బయటకు వచ్చాడు. పక్షుల కిల కిలా రావాల నేపద్యంలో ఓ  గులాబి నవ్వుతూ తల ఊపింది. పచ్చని గరిక మీద మెరుస్తున్న మంచు బిందువులు, చిరుగాలికి వుగిసలాడే చివురాకులు. నీలకాశ౦లో వెండి మబ్బులకు బంగారు పూత వేస్తున్న కిరణాలు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల సోయగం కనిపించాయి.  ఇంత అద్బుత సోయగానికి చిత్తరువై  అలోకికమైన అందాన్ని  చవిచూచాడు.

           మనషి కూడా ప్రకృతిలో భాగమేనని తనకు వచ్చిన కలని గుర్తు చేసికుంటూ, ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తన కుటుంబంతో  పంచుకోవడాని ఓ అడుగు ముందుకు వేసాడు.


తొలి ప్రచురణ వాహినిలో....

ప్రేమ లేఖ

ప్రియమైన శ్రీవారికి,

       నిన్న ఉదయం కిటికీ తీయగానే ఇంకా చీకటి పోలేదులా వుంది. చలి చలిగా వుంది. ఓ కప్పు కాఫీ కలుపుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాను. బయట చీకటి కరిగి పల్చని వెలుతురు పరుచుకు౦టో౦ది. ఆకాశం మబ్బు పట్టి ఎంత బావుందో! నింగి నేలా అంతా కలసి పోయినట్లు...ఒకరోజు మీకు గుర్తుందా ఉదయం నిద్రలేచి కళ్ళు తెరవగానే వర్షం పడుతూ కనిపించింది. 'వీపింగ్ విల్లో' మీద నుంచి చినుకులు పడడం.... సిడి లో మంచి పాటలు వింటూ... ఓహ్! ప్చ్ ఇప్పుడు కూడా ప్రక్కన మీరుంటే బావుండేదనిపించింది. ఇలా ప్రకృతిని చూస్తూ జీవితమంతా గడిపేయొచ్చు కదూ! ఓ సారి తెల్ల తెల్లని మంచు కురుస్తూ, మరో సారి ఫాల్ కలర్స్ తో, ఇంకోసారి  రంగు రంగుల పువ్వులు, వాటి కోసం వచ్చే సీతాకోక చిలుకలు, బుల్లి బుల్లి పక్షులు.... కాని ఏమైనా వర్షం అందం వర్షానిదే. ఇలాంటి వర్షంలోనే కదూ మనం కారులో షికారు కెళ్ళే వాళ్ళం. 

         ఎందుకో మన పెళ్లి రోజు గుర్తొచ్చింది.  పెళ్ళిపీటల మీద కూర్చుని తలంబ్రాలు పోసుకున్నది నిన్న మొన్నలా లేదు. ఓ సారి నేనిలా అంటే ఏం లేదు...మనం యుగ యుగాలనుండీ కలిసి ఉన్నట్లుగా వుంది అన్నారు. అదీ నిజమే 'ఈ నాటి ఈ బంధమేనాటిదో' అని ఆత్రేయగారన్నట్లు...  మనబంధం ఏ నాటిదో  అనిపిస్తుంది.  ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో. వర్షం తగ్గిపోయిందని వాకింగ్ కి బయలు దేరాను.  

        రోడ్డు మీద వెళుతూ వుంటే పక్కన మీరున్నట్లే అనిపించింది. ఆ  పూల గురించి...పిట్టల గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో కదా! ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాను. వచ్చీ రాగానే 'అమ్మడూ కాఫీ' అనడం మీకలవాటు. స్నానం లేదు, పూజ లేదు దిగాలుగా కూర్చుండి పోయాను. బైట సన్న  సన్నగా తుంపర మొదలైంది. ఎప్పటి సంగతో 'చినుకు చినుకు సందడితో చిట పాట చిరు సవ్వడితో' పాట వింటూ వర్షం చూసిన ఉదయం మదిలో భారంగా మెదిలింది. వర్షం చూస్తూ పుస్తకం చదవడమంటే మీ కిష్టం, నేనేమో పుస్తకంలో మునిగేతే బైట వర్షమే పడుతుందో వరదలే వస్తున్నాయో ఎవరికి తెలుస్తుందని పోట్లాదేదాన్ని కదూ. జాజి పూల మాలకడుతూ ఎన్నెన్ని ఊసులల్లుకున్నమో కదూ! 

            నా ఊహలలో నేను౦డగానే  పన్నెండయ్యి౦ది. అప్పటికి నేనింకా మెయిల్ కూడా చూడలేదు. మెయిల్ ఓపెన్ చెయ్యగానే మొన్న రాత్రి మీరు  పంపిన పాట 'నీవు రావు నిదుర రాదు' విన్నాను. మరీ దిగులేసి మన ఆల్బం ముందు వేసుకుని కూర్చున్నాను. 'షానన్ ఫాల్స్'  లో రాళ్ళ మీద నడిచిన రోజులు, 'మయామి బీచ్' లో గవ్వలేరిన క్షణాలు, 'నయాగరా'లో మన నయగారాలు, తీపి గుర్తులు నెమరువేస్తూ ఉండిపోయాను.

       సంధ్య దిగులుగా వెళ్ళింది. గుండెల్లో గుబులు  చీకటై విశ్వమంతా వ్యాపించిది. దిగులేసిన చెంద్రుడు నాతో చెలిమికి వెన్నెలతో రాయబారం పంపాడు. కిటికీ పక్కగా కుర్చీ వేసుకు కూర్చున్నాను.  బయట వెన్నెల ఎంత అందంగా వు౦దనుకున్నారూ... మీతో కలసి 'వెన్నెల రేయి ఎంతో చలి చలి' పాట వినాలని పించిది. ఎదురు చూసిన చుక్కలు వెల వెలబోతూ తప్పుకున్నై. క్షణాలే   శత్రువులై నా మీద దాడి చెయ్యడం మొదలెట్టాయ్.  ఎంతకీ తరగని రాత్రి ఏవేవో ఆలోచనలతో గడిపేశాను...అన్నీ మీ  గురించే.

        ఇవేమీ తెలియని ఉష గంతులేస్తూ వచ్చేసింది. సంతోషాల తోరణాలు కడుతూ పసిడి కిరణాలు సందడి చేసాయ్.  మొక్కల సరదా చూద్దామని అలా బయటకు వెళ్లాను. మన మినీ రోజెస్ ఇవాళ ఎన్ని పూలు పూశాయో! లోపలికి వస్తూ మీకిష్టమైన ఎర్ర గులాబీలు తెచ్చి వేజ్ లో  పెట్టాను. చిత్రంగా లేదూ పదిహేనేళ్ళ క్రిందటి మాట. మీరప్పుడనేవారు  గుర్తుందా. మన మధ్య ప్రేమ రోజు రోజుకూ పెరుగుతుంది కాని తగ్గదని. ఎన్నటికీ వాడిపోని మన ప్రేమ కుసుమాల సాక్షిగా

          నిను చూడక నేనుండలేనూ ఈ జన్మలో మరి ఆ  జన్మలో మరి ఏ జన్మకైనా ఇలాగే....
                                                          
మీ 
శ్రీమతి 


తొలి ప్రచురణ వాహినిలో....