Wednesday, August 28, 2013

కృష్ణ పాదాలు

      చిట్టితల్లి తన టెడ్డీలన్నిటినీ  సోఫాలో వరుసగా పెట్టి, డైనింగ్ టేబుల్ దగ్గరనుండి ఒక కుర్చీ లాక్కొచ్చి సోఫా ఎదురుగా పెట్టి౦ది. ఆ కుర్చీ మీద ముందుగా రెండు చేతులు, తరువాత ఓ కాలు, ఆ తరువాత మరో కాలు పెట్టి బోర్లా పడుకుని వెనక్కి తిరిగి సరిగ్గా కూర్చుంది. పాదాలు భూమికి ఓ అడుగు ఎత్తులో ఉన్నాయి. ఇప్పుడు చిట్టితల్లి పేరు మిస్ టోనీ. ఎదురుగా వున్న విద్యార్ధులందరినీ  ఒక్కక్క పద్యం చెప్పమని ఆ బొమ్మల బదులుగా తనే పద్యాలు చెప్పింది. ఓ పావుగంట గడిచాక చెప్పడానికి ఇక పద్యాలేవీ మిగల్లేదు. 

       కుర్చీలోనుండి చెంగున కిందకు దూకింది. రోజులా ఘల్లుమనే చప్పుడు వినిపించలేదు. మళ్ళీ రెండుసార్లు జింక పిల్లలా చెంగు చెంగున గెంతింది. ఏమీ వినిపించలేదు. ఒ౦గి పాదాల వైపు చూసుకుంది. తెల్లగా బొద్దుగా చిన్ని పాదాలున్నాయి కాని, వాటినంటి పెట్టుకునుండే గజ్జెలు మాత్రం లేవు. ఎలా వుంటాయి? నిన్న పార్కులో ఒక గజ్జ పోయిందని అమ్మ రెండోది కూడా తీసేసిందిగా. చిట్టితల్లి ఎంత ఏడ్చినా ఒక గజ్జే పెట్టుకుంటే కాళ్ళజెర్రి కుడుతుందని లోపల దాచిపెట్టేసింది కూడానూ. చిట్టితల్లికి గజ్జలంటే చాలా ఇష్టం. చిట్టితల్లి గజ్జలంటే వాళ్ళ నాన్నక్కూడా చాలా ఇష్టం. తేలికైన లేతరంగు గౌనులు వేసుకుని, ఘల్లుఘల్లుమ౦టూ చిట్టితల్లి ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళ నాన్నకు ఎంతో బావుంటు౦దట.  

      చిట్టితల్లి మెల్లగా పడగ్గదిలోకి వెళ్ళింది. వెండి వస్తువులు అమ్మ ఎక్కడ పెడుతుందో ఆమెకు తెలుసు. నేరుగా క్లోజెట్ తలుపు తీసింది. లోపల వున్న అరలలో బట్టలన్నీ పొందిగ్గా మడతలు పెట్టి వున్నాయి. వాటిని చూడగానే చిట్టితల్లికి గొప్ప ఆలోచన వచ్చింది. ఒక వరుసలో కింద ఉన్న టవల్ కొస పట్టుకుని లాగింది. ఆ వరుసలోని బట్టలన్నీ జారి ఒకదానిమీద ఒకటి కుప్పలా కింద పడిపోయాయి. అందులోనుండి రెండు టవల్స్, కొన్ని కర్చీఫ్స్ తీసుకుని రెండు చేతులతో గుండెలకు హత్తుకుని వచ్చి హాలు మధ్యగా పడేసింది. టవల్ చుట్టూ తిరుగుతూ నాలుగు వైపులా లాగి సరిగ్గా పరిచి ఒక్కో టెడ్డీని పడుకోబెట్టి వాటిమీద కర్చీఫ్స్ కప్పింది. వాటిని మెల్లగా జో కొడుతూ కాసేపట్లోనే అన్నిట్నీ నిద్రపుచ్చేసింది.  

    ఈలోగా వంటి౦ట్లోనుండి ఏవోవో శబ్దాలు వినిపించడంతో మెల్లగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడన్నీ గిన్నెలు, గరిటెలు, రకరకాల సరుకులు, కూరగాయలు వాటి మధ్యలో అమ్మ. ఎంచక్కా వాటితో ఆడుకు౦టున్న అమ్మను చూస్తే చిట్టితల్లికి బోలెడు అసూయ కలిగింది. మెల్లగా ఒక గిన్నె గరిటె తీసుకుని టంగ్ మనిపించగానే అమ్మ, చిట్టితల్లి చేతిలోంచి గిన్నెతీసి పక్కన పెట్టి ఆమెనెత్తుకుని హాల్లోకి వచ్చి, బెటర్ బ్లాక్స్ డబ్బాలోంచి తీసి కిందపోసి వాటిపక్కనే చిట్టితల్లిని కూర్చోబెట్టి౦ది. రిమోట్ తో టివి ఆన్ చేసి హడావిడిగా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. 

      టివిలో ఏదో కార్టూన్ వస్తోంది. చిట్టితల్లికి అది చూడాలనిపించలేదు. బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెడుతూ రెండు పొడవాటి భవనాలు కట్టింది. చిట్టితల్లి చూస్తుండగానే అవి రెండూ పెద్ద శబ్దంతో డాం అని పడిపోయాయి. వాటికేసి దిగులుగా చూసింది. ఆ బ్లాక్స్ మీదకు పెరటి వైపు నుండి ఎండ ఏటవాలుగా పడుతోంది. అక్కడ ఏదో కదిలినట్లయి పెరటివైపుకు చూసింది. పక్షొకటి ఫెన్స్ మీద నిలబడి అటూ ఇటూ గెంతుతూ కిందకు దూకాలని చూస్తోంది. దాని నీడనే చిట్టితల్లి చూసింది. చిట్టితల్లి పరిగెత్తుతూ అటు వెళ్ళి, తలుపు వేసివుండడంతో బయటకు వెళ్ళే వీలులేక అద్దం మీద చేతులు ఆన్చి పక్షిని తదేకంగా చూసింది. అది ఒక్కసారిగా కింద మొక్కల దగ్గరకు ఎగిరొచ్చి ఓ నిముషం పాటు మట్టిలో కెలికి ఏదో పొడుచుకుని తిని ఎగిరిపోయింది. పెరట్లో నిశ్సబ్దంగా వున్న మొక్కలు మాత్రమే మిగిలిలాయి. 

    టివిలో కార్టూన్ పూర్తయి 'లిటిల్ బేర్' మొదలైంది. ఆ ప్రోగ్రాం అంటే చిట్టితల్లికే కాదు వాళ్ళమ్మక్కూడా చాలా ఇష్టం. రోజూ వాళ్ళిద్దరూ కలిసే ఆ ప్రోగ్రాం చూస్తారు. ఇప్పుడు మాత్రం అమ్మ వచ్చే సూచనలేమీ కనిపించట్లేదు. చిట్టితల్లి కాళ్ళు చాపుకుని సోఫాకు ఆనుకుని కూర్చుని ఓ అరగంట కదలకుండా చూసింది. 

     ఇంతసేపైనా అమ్మ హాల్లోకి రాలేదు, ఏం చేస్తోందోనని మెల్లగా పిల్లిలా అడుగులు వేస్తూ వంటగదిలోకి వచ్చింది చిట్టితల్లి. అమ్మ స్టవ్ మీద నాలుగు గిన్నెలతో చతుర్దావధానం చేస్తోంది. సాంబార్ మరిగిన వాసనతో వంటగది ఘుమఘుమలాడుతోంది. కౌంటర్ మీద ఒక పక్కగా పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు పెట్టివున్నాయి. కొన్నిట్లోనుండి సన్నసన్నగా ఆవిర్లు వస్తున్నాయి. చిట్టితల్లికి వాటిల్లో ఏమున్నాయో చూడాలనిపించింది. కౌంటర్ తనకన్నా ఎత్తుగా ఉండడంతో చూసే అవకాశం లేదు. కుర్చీ ఎక్కి చూడొచ్చు గాని అమ్మ ఉన్నప్పుడు కుర్చీ ఎక్కితే పడిపోతావని తిడుతుంది. రోజులా ఏదైనా గిన్నె బోర్లించి ఎక్కాలని చూసింది. పెద్ద గిన్నెలన్నీ కౌంటర్ మీదే వున్నాయి. డిష్ వాషర్ కి ఆనుకుని నిలబడి కాసేపు అలోచించి రెండు చేతులతో గిన్నెను పైకెత్తి ఒంచి చూసింది. 

       గిన్నెలోని తెల్లని పదార్ధం ధారగా చిట్టితల్లి తలను అభిషేకించింది. అమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి చిట్టితల్లి కనిపించలేదు తెల్లని చిన్న కొండ సాక్షాత్కరించింది. ఏమైందో అర్ధం అవడానికో అరనిముషం పట్టిందామెకు. అర్ధమయ్యాక ఆ గిన్నెలో సాంబారు కాకుండా దోశ పిండి వున్నందుకు చాలా సంతోషించింది. ఆ అవతారం చూసి గట్టిగా నవ్వేస్తూ చిట్టితల్లి చేతిలోని గిన్నె తీసి సింక్ లో పెట్టింది. అంతవరకూ అమ్మ తిడుతుందేమోనని భయంగా చూస్తున్న చిట్టితల్లి అమ్మ నవ్వడంతో పిండి తుడుచుకుంటూ గట్టిగా ఏడవడం మొదలెట్టింది. చిట్టితల్లిని బాత్ రూమ్ లోకి తీసుకెళ్ళి షవర్ కింద నిలబెట్టి శుభ్రంగా స్నానం చేయించి౦దమ్మ. చిట్టితల్లి నడిచినంతమేరా తెల్లని చిన్న పాదాలు, చిన్ని కృష్ణుడు నడిచి వచ్చినట్లు కృష్ణ పాదాలు కనిపించాయి అమ్మకు. 

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Monday, August 5, 2013

బుజ్జిపండు ఇండియా టూర్!

బుజ్జిపండు భారత దేశానికి వెళ్ళాట్ట. కౌముదికి వెళ్ళి బుజ్జిపండు ఇండియా టూర్ కబుర్లు విందామా...