Monday, October 31, 2011

ఆశావాదం

బీటలు వారిన నేలపై
స్వాతి చినుకుల సంబరం!

మోడువారిన మానుపై
చివురాకుల కలకలం!

వసివాడిన పసిమొగ్గ
వికసిస్తున్న పరిమళం!

ఒ౦టరియైన నింగికి 
నెలవంక స్నేహితం!

ముసురేసిన మబ్బును దాటి
దూసుకు వస్తున్న రవికిరణం!

భారమైన బ్రతుకునకు
ఆలంబన ఆశావాదం!! Thursday, October 27, 2011

నందనవనంనిన్న ఉదయం బ్లాగు కిటికీ తెరవగనే అంతా రంగురంగుల పువ్వులే కనిపించాయి. కొన్ని పువ్వులు మీ నవ్వులమన్నాయి, ఇంకొన్ని పిల్లల కోసం అశీస్సులమన్నాయి, మరికొన్ని మీ అభినందనలట.  తెర వెనుకకు వచ్చి రామాయణం తిలకించి బ్లాగును నందనవనం చేసిన అతిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.Sunday, October 23, 2011

తెర వెనుక రామాయణం

            తెలుగు తరగతి పిల్లలకి కథ చెప్తుండగా 'ఉమ్మడి కుటుంబం' గురించి కథలో ఓ ప్రస్తావన వచ్చింది. వాళ్ళకి వివరించి చెప్పాను, కానీ ప్రశ్నార్ధకాలు? "ఎలా వీళ్ళకు అర్ధం అవుతుందా?" అని ఆలోచించాను. ఏదైనా చూపించాలి, లేదా వాళ్ళకు హృదయానికి హత్తుకునేలా సరదాగా ఉండేలా చెప్పాలి. ఆ ప్రహసనంలో పుట్టిందే ఈ 'ఉగాది వేడుకలు'. 
 
          నాటిక వ్రాయడం మొదలెట్టగానే చిన్నప్పటి రోజులూ,  బాబాయిలు, పిన్నులు , అత్తలు, నాన్నమ్మలు, తాతయ్యలూ అందరూ ఎదురుగా వచ్చేశారు. మా వీధిలో తిరిగే పూలమ్మాయి పూల బుట్టతో సహా నా ముందుకు వచ్చి కూర్చుంది. 'ఆక్కూరలో' అని బయట లయబద్దంగా అరుపు వినిపించింది. అంతేనా 'అమ్మా పాలు' అని పాలవాడి కేక, ఇలా అందరూ ఒక్కొక్కరుగా వచ్చేశారు. వీళ్ళ తోపాటే సరదా సరదా సినిమా పిచ్చి గౌరి కూడా. వీళ్ళందరినీ పిల్లలకు పరిచయం చెయ్యాలని, చిన్నప్పటి పండుగలు, సరదాలు, మురిపాలు, ముచ్చట్లు  అందరితో పంచుకోవాలని ఈ నాటికకు శ్రీకారం చుట్టాను.

           తొలి విడతగా నాటకం వ్రాయడం పూర్తయ్యింది. ఈ స్క్రిప్ట్ స్నేహితులకు చూపించాను "బావుంది కాని ఈ తెలుగు రాని పిల్లలతో ఇంత పెద్ద నాటకమా?" అని పెద్ద సందేహం వ్యక్తం చేశారు. "అవును కదూ చేతిలో పెన్ ఉందని రాసుకుంటూ పోయాను. ఇప్పుడెలా?" 

          పిల్లలందరినీ పిలిచాము ఒక్కోరికి ఒక్కో కారెక్టర్ ఇచ్చాము. బావుంది... అదేం చేసుకోవాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళకెలా చెప్పాలో మాకూ తెలియలేదు. అసలే పదిహేను మంది పిల్లలు వాళ్ల కారెక్టర్లకు ఎంచక్కా నవ్యమైన రీతిలో నామకరణం చేసేశాను. ఏ పేరు ఎవరిదో నాకే అర్ధం కాలేదు. "అలాక్కాదుకానీ జ్యోతీ, ముందు నువ్వీ పేర్లన్నీ మార్చేసి శుభ్ర౦గా వాళ్ళ పేర్లు పెట్టి తిరగవ్రాసెయ్" అని ఫ్రెండ్స్ చక్కాపోయారు.

          వాళ్లటు వెళ్ళగానే ఏడుపు మొహం వేసుకుని కూర్చున్నాను. ఈ కమామీషంతా చూస్తున్న శ్రీవారు అప్పుడు రంగంలోకి దిగారు. "అలాక్కాదమ్మడూ ఏదో చూద్దాంలే దిగులు పడకు" అంటూ..ఈ లోగా మరో ఫ్రెండ్ "ముందు వాళ్ళ వాయిస్ లు రికార్డు చేస్తే ఈజీగా ఉంటుందని" సలహా ఇచ్చారు. "వావ్ మా గొప్పగా ఉంది" అనుకుంటూ రికార్డింగ్ రూమూ, మైకూ, ఇంకా ఏమిటేమిటో అన్నీ సిద్దం చేసుకుని....పిల్లల్ని రికార్డింగ్ కి పిలిచాము. "ఒకళ్ళ డయలాగ్ తరువాత ఒకళ్ళు చెప్పేస్తారు చాలా ఈజీ" అనుకుంటూ. 

          అసలు కథ ఇక్కడ మొదలు. ఇందులో కొంతమంది అసలు తెలుగు పదం పలకని వాళ్ళు. చాలా మంది పదాలు పలుకుతారు కాని వాక్యనిర్మాణం మనం చేసుకోవాలి. మరికొంతమంది పలికే పదాల్ని మనం సావకాశంగా అర్ధం చేసుకోవాలి. గదిలో నలుగురు పిల్లల్ని కూచోబెట్టి వరుసగా ఒక్కో డైలాగు చెప్పించాలనుకున్నాం, ఖాళీగా ఉన్న పిల్లలు కిచకిచలు. అబ్బే ఇలా కుదరదు.. ఒక్కళ్ళ డయలాగ్స్ రికార్డు చేద్దాం అన్నారాయన. వేరే దారేం కనపడలా, ఒక్కొక్కరివీ రికార్డు చేసి తరువాత అందరివీ స్క్రిప్ట్ ప్రకారం ఒక ఆర్డర్లో పెట్టడం అన్నమాట. ఆ  పూటకి పిల్లల్ని పంపించేసి తరువాత ఒక్కొక్కరినీ వాళ్లకు కుదిరిన టైములో పిలిచి రికార్డింగ్  మొదలు పెట్టాం. 

         ముందస్తుగా అతి చిన్న డయలాగ్స్ ఉన్న పాలబ్బాయిని పిలిచాము. "ఎండలకు గేదె నీళ్లెక్కువగా తాగేసినట్టు౦దమ్మా, డబ్బులీయమ్మా  బేగెల్లాలి ఇదీ డైలాగ్." చెప్పు నాన్నా అన్నాను.
"ఎండల్ కి గేద్" అని ఆపేసాడు. పది సార్లు "ఎండల్ గేద్" అయ్యాక మా వారికో 'బ్రహ్మాండమైన' ఇడియా తట్టింది. ఈ 'బ్రంహాండం' గురించి ముందు ముందు మావారికి బాగా అర్ధం అయిందిలెండి.
నాయనా సురేషూ నువ్వు ఇలా అనమ్మా అని,
ఎండ....లకి....గేదె.... నీళ్ళు.....ఎక్కువ.....గా .......తాగేసి....నట్టు.. ఉంది.......అమ్మా అని పదాలు విడివిడిగా రికార్డు చేయించారు. ఆ  తరువాత అవన్నీ కలపి "ఎండలకి గేదె నీళ్ళు ఎక్కువగా తాగేసినట్టు  ఉంది అమ్మా" అని వినిపించారు. ఈ విధంగా ఆ  నాటకంలోని వాక్యాలు రూపు దిద్దుకున్నాయన్నమాట. ఇలా౦టి  వాక్యనిర్మాణంలోని పెద్ద ఇబ్బంది పదానికి పదానికి మధ్య గ్యాప్ సరిగ్గా ఇవ్వాలి. ఇవ్విదంగా  'బ్రహ్మాండం' వారికి బాగా అనుభవమయ్యింది. 

     పదిహేను మంది పిల్లలకు రీటేకులతో ఓ ఇరవై ఫైళ్లు తయారయ్యాయి. ఓ అందమైన వెన్నెల రాత్రి చేతిలో స్క్రిప్ట్ తో నేనూ, ఒళ్ళో లాప్టాప్ తో మావారూ కూర్చుని డైలాగ్స్ అన్నీ వరుసక్రమంలో పెట్టి ఆ  చిన్నారి గొంతులు పలికిన తీరుకు మురిసిపోతూ, ముచ్చట పడిపోతూ ఎట్టకేలకు రికార్డింగ్ ని ఓ కొలిక్కి తీసుకొచ్చాం. అంతలో ఎలా అయిపోతుందీ శబ్దాలు అదేనండీ సౌండ్ అఫెక్ట్స్ చీపురుతో ఊడుస్తున్నట్టు,  పాలు చెంబులో పోస్తున్నట్టు, నీళ్ళతో కాళ్ళు కడుగుతున్నట్లు, సైకిలు బెల్లులు, మువ్వల శబ్దం ఇలా. అన్నీ బావున్నాయి మజ్జిగ చిలుకుతున్న శబ్దం ఎక్కడా కనిపించలా. ఎంచక్కా పెరుగు గిన్నెలో కవ్వమేసి చిలికేసి, ఆ  శబ్దం రికార్డు చేసేసి,  అటుపిమ్మట ఆ మజ్జిగలో నిమ్మకాయ పిండేసి, ఆహా ఓహో అనుకుంటూ తాగుతూ ఆ  ఆడియో రికార్డింగ్ ని ఎంజాయ్ చేశామన్నమాట. 

         ఇక ప్రాక్టీసులు. మళ్ళీ పిల్లలందరినీ పిలిచి రికార్డు చేసింది వినిపించి ఇక కానివ్వండన్నాం. తెలుగులో వాళ్ళ గొంతులు వినేసుకుని నవ్వేసుకున్నారు తప్పితే పని జరగాలా. మళ్ళీ "కట్ కట్" అని యమ తీవ్రంగా ఆలోచించాక సీన్లుగా విడగొట్టాలని అర్ధం అయ్యింది. ఒక్కో సీను చేసి చూపించాను. చిన్న సీన్లు అంటే తక్కువ మంది స్టేజి మీద ఉండే సీన్లు బాగానే ఉన్నాయ్. మరి ఎక్కువమంది ఉన్నప్పుడో మళ్ళీ తికమక మొదలయ్యింది ఆ తికమకలో సీనుకి "స్క్రీన్ ప్లే" ఉండాలని అర్ధం అయ్యింది.  స్టేజి మీద పిల్లలు ఎక్కడి నుండి రావాలో ఎక్కడ నిలబడాలో అన్నీ గీసి చూపించాను. అప్పటికి నా బుర్రలో ఏముందో వినే వాళ్లకి అర్ధం అయ్యింది. 

      మరి మాటలు సరే, పాటలవీ ఉంటే బావుంటుంది కదా. అసలే మన తెలుగు అసోసియేషన్ ప్రోగ్రా౦స్లో  "ఆ  అంటే అమలా పురం" పాటలకి చిన్న పిల్లల హావభావాలూ, నృత్యాలూ చూసి తలలు ది౦చేసుకు౦టున్నాం. కొంచెం తల ఎత్తుకునే లాగ "చెమ్మ చెక్క, ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ, ఉగాది పండగ ఒచ్చింది" లాంటి పాటలతో పిల్లలకు అభినయం నేర్పించాము. కొంచెం సరదాగా మా గౌరి 'సోగ్గాడే సోగ్గాడు' పాటకు డాన్స్ కూడా చేసింది. ఇది మీరు చూసి తీరాల్సిందేన౦డోయ్.

            నాటకానికి కావాల్సిన వస్తువులు లడ్లు, కవ్వం, విస్తర్లు, మజ్జిగ్గిన్నె, పాల కేను, పూల బుట్ట, కూరగాయలు, తాతయ్యకు చేతి కర్ర, గౌరికి చీపురు, అమ్మకు ముగ్గు  ఇలా చదువుకుంటూ పోతే చాలా చాలా..... లడ్లు న్యూస్ పేపర్ ఉండ చేసి ప్లేడో తో పాకం పట్టేసా. నిజం పాకం కాదు లెండి రౌండ్ గా చుట్టేసా. విస్తర్లు వాల్ మార్ట్ లో గ్రీన్ ప్లేస్ మేట్లు దొరికాయి. కవ్వం, పాల కాను ఇల్లిల్లూ గాలించి పట్టాం. ఇలా కూర, నారా, బుట్టా తట్టా, పూలూ పళ్ళూ, గిన్నెలు, గరిటెలు, గ్లాసులతో ఆడిటోరియంకు వెళ్ళడానికి రెడీ అయిపోయాం.


        అసలు రిహార్సల్స్  అప్పుడు మొదలయ్యాయి. కొన్ని డైలాగ్స్  పిల్లలకంటే ముందుగా వచ్చేస్తున్నాయ్. కొన్ని నింపాదిగా వస్తున్నాయ్. మళ్ళీ ఎడిటింగు. ఇవ్విదంగా చివరాఖరకు నాటకం రికార్డింగు పూర్తయ్యింది. ఇక ప్రోగ్రాం రెండు వారాల్లోకి వచ్చేసింది, పిల్లలందరూ బాగా చేస్తున్నారు. అనుకోని అవాంతరం..నాటకంలో పెదనాన్నకి చెస్ టోర్నమెంట్ నాటకం రోజేనని తెలిసింది. హతవిధీ! ఇంకేముంది మరో పెదనాన్నని వెతికి, కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒప్పించాం. ఈ లోగా తాతగారు మరో విషయం చెప్పారు సైన్స్ ఒలంపియాడ్లో రీజెనల్స్ లో విన్ అయితే స్టేట్స్ వెళ్ళాలట అది కూడా ప్రోగ్రాం రోజేనట. సీక్రెట్ గా పోలేరమ్మకి పొంగళ్లవీ పెట్టి, విన్ అవకుండా చేసామనుకోండి. 

          డ్రెస్ రిహార్సల్స్..ఓ ఇద్దరు తప్ప మిగతా పిల్లలందరూ కూడా పది ఏళ్ళ లోపు వారూ, పొట్టి పొట్టి జీన్సుల వారూను. వారికి ఇదు మీటర్ల చీరలు చుట్టబెట్టే మహత్తర బాధ్యతని వారి తల్లులు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. డ్రెస్ రిహార్సల్స్ రోజు అమ్మమ్మ ముచ్చటైన చిలక పచ్చ రంగు లంగా ఓణీలో బాపు బొమ్మలా ప్రత్యక్షమైంది. అది చూసి ఢామ్మని పడబోయి ప్రోగ్రాం గుర్తొచ్చి ఆగిపోయాను.

"అమ్మడూ ఏంటి నాన్నా డ్రస్సూ?"
"అమ్మమ్మ పంపించి౦దాంటీ. ఇట్స్ నైస్" అంది.
"డ్రెస్ బావుంది కాని నువ్వు అమ్మమ్మవి కదా చీర కట్టుకోవాలి." అన్నా కొంచెం జంకుతూ.
"హా.... ఇ డోంట్ లైక్ దట్." అంది.
"పోనీ అదే ఉంచేయండి మొడెర్న్ అమ్మమ్మలా ఉంటుంది." ఆ  తల్లి కోరిక.
మరో నాటకం వ్రాస్తానని దానిలో ఆ  అమ్మాయికి ఆ  లంగా ఒణీనే వేయిస్తానని ప్రమాణాలు చేసి మెల్లగా తల్లీ కూతురిని ఒప్పించి ఆ  పూటకి గండం గట్టెక్కి౦చా. తెల్లజుట్టుకు మాత్రం తిలోదకాలే.

          ఈ నాటికలో ఓ బంతి భోజనాల కార్యక్రమం పెట్టాం. ఆడపిల్లలందరూ విప్లవం లేవదీసారు. "ఆంటీ ఎప్పుడూ మేమే ఒడ్డించాలా? అలా కుదరదు ఈ సారి మేం కూర్చుటాం బోయ్స్ ని ఒడ్డించమనండి" అని. వాళ్లకి నాటకం అయిపోగానే మగపిల్లలతో వడ్డన కార్యక్రమం పెట్టిస్తామని నచ్చచెప్పి ఆ  సీను చేయిస్తున్నాం. ఒళ్ళు మండిన ఆ  పూర్ణమ్మలు నిలబడి ప్లేట్లలోకి  పదార్ధాలను ఫ్రిజ్బీల్లా విసరడం మొదలెట్టారు. ఇది రేపు నాటకమనగా ఈ వేళ రాత్రి సన్నివేశమన్నమాట. ఇలా చేస్తే మన నాటిక పరువు పోతుందిరా అమ్మళ్ళూ... నా మాట వినండి అమ్మల్లారా... అని భోరున విలపించాను. వారు కరుణి౦చారో లేదో నాకు స్టేజి మీద కాని తెలియదు.

           ప్రోగ్రాం టైం అయింది పిల్లలందరూ చిన్నవాళ్ళు "ఎలా చేస్తారో? ఏమిటో" అని ఒకటే టెన్షన్. నాటిక మొదలయ్యింది. ఏ సీను దగ్గర ఏ పిల్లల్ని స్టేజి మీదకు  పంపించాలో చూసుకునే హడావిడిలో నాటిక సరిగా చూడనే లేదు. నాటిక అవగానే ఆగకుండా రెండు నిముషాలు పాటు మోగిన చప్పట్లు కళ్ళు చేమర్చేలా చేశాయి. అప్పటి భావాలకు ప్రతిరూపాలే 'సంకల్పం', 'పూలు గుసగుసలాడేనని 'నూ. ఆ  తరవాత 'దసరా సంబరాలు', 'వెళ్ళాలని వుంది కానీ....' అనే నాటికలకు స్పూర్తి కూడా ఆ చప్పట్లే.

        మా ప్రయత్నాలన్నిటికీ కూడా సంపూర్ణ సహకారల౦దిస్తున్న నా ప్రియ మిత్రులకు, మా ఊరి తెలుగు ప్రజలకు బ్లాగ్ముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నాటకం కొరకు బాపు బొమ్మల నేపధ్యంలో ఏకంగా వాకిలినే స్టేజ్ మీద నిలిపిన నా నేస్తానికి ప్రత్యేక ధన్యవాదాలు.

అంతా బాగానే ఉంది ఈ రామాయణం ఏమిటనుకుంటున్నారా? బంగారు జింకను అడిగిన సీతకు ఆ  రాముడు తెచ్చివ్వలేక పోయాడు. నా రాముడు నే మనసుపడిన ప్రతి పని వెనుక తోడై వుండి వీటన్నింటినీ విజయపథం వైపు నడిపిస్తున్నాడు.


కొస మెరుపు 

 తెలుగు మాట్లాడని పిల్లలు కూడా నాటకం పూర్తయ్యేటప్పటికి అందరి డైలాగ్స్ చెప్పడమే కాక
"ఎన్నాళ్ళయిందక్కా మిమ్మల్నందరినీ చూసి", 
"డబ్బులీయమ్మా బెగెల్లాలి"
"ఇలా ఇంటి భోజనం చేసి ఎన్నాళ్లయ్యిందో" 
లాంటి వాక్యాలు ఇంట్లో ప్రయోగించడం మొదలు పెట్టారు...

నాటకంలో  అమ్మ నిజం అమ్మకి ఉగాది పచ్చడి చేయడం నేర్పించింది.

"మా అమ్మాయి అడిగిన డబ్బులివ్వకుండా బేరాలు, పైగా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు" అని కూరలమ్మే వాళ్ళమ్మ, అడపా దడపా నా కవితలు చదివే నా బెస్ట్ ఫ్రెండ్ కూడానూ, బ్లాగును  చూడమన్నా చూడక తన నిరసన వ్యక్తం చేశారు. 

ఈ నాటకం చూసిన మా నాన్నా "అరేయ్ జ్యోతీ, కూరగాయలు ఇండియాలో కన్నా అమెరికాలోనే చీప్ గా  ఉన్నాయే" అని వ్యాఖ్యానించారు. గౌరీ వాళ్ళ తాతగారు ఇంటికి ఎవరొచ్చినా ఓ సారి ఈ వీడియొని చూపించకుండా పంపించట్లేదట.

ఇందులో పాల్గొన్న పిల్లలందరూ మా తెలుగు తరగతి విద్యార్ధులు.

ఉగాది వేడుకలు 1 

ఉగాది వేడుకలు 2గీత డైలాగ్ వ్రాసిన శ్రీ లలిత గారికి ధన్యవాదములు

Friday, October 21, 2011

సహజీవనం

ఓ చూపు స్నేహంగా నవ్వింది
బిడియం రెప్పల పరదా వేసింది!

ఉత్తరం కుశలమడిగింది
సంశయం సమాధానమిచ్చింది!

మానసం మధుకరమై మసలింది
సేనము ప్రసూనమై విరిసింది!

సఖునికి సంవాసము సమకూరింది
చెలువ చెంతకు చేరింది!

సహవాసం సరిగమలు పలికించింది
సంసారం సౌహిత్యంగా సాగింది!!

Thursday, October 20, 2011

ఓ చిన్ని వ్యాఖ్య

అనుకోని వేళల్లో
అదాటుగా ఎదురౌతుంది!

చూపులతోనే
చిరునవ్వులు పూయిస్తుంది!

అంతరంగాన్ని
నూతనోత్సాహంతో ని౦పేస్తు౦ది!

ఓ అనుభూతిని
బహుమతిగా ఇస్తుంది!

వెన్నుతట్టి
మున్ముందుకు నడిపిస్తుంది!!


Tuesday, October 18, 2011

సంకల్ప౦

ఓ చిన్న విత్తనం
చివురులు తొడిగి...

మొక్కై ఎదిగి
మానై నిలిచింది!

శిఖరాగ్రాన్ని చూస్తూ
ఆసక్తి ఆసరాగా..
ఏకాగ్రత తోడుగా...

ఒక్కో మెట్టూ ఎక్కుతూ..
గమ్యం చేరిననాడు!

అంబరాన్నంటే  ఆనందం
సాగరమంత  సంబరం!

ఈ పయనంలో
దొరికిన ఒక్కో అనుభవం
ఓ అనుభూతికి తార్కాణం!!


Friday, October 14, 2011

"వెళ్ళాలని వుంది కానీ...."

అమెరికాలో ఉన్న తెలుగు వారు, అమెరికా వచ్చిన దగ్గరనుండి ఇండియా 'వెళ్ళాలని ఉంది కానీ..' అంటూ ఉంటారు. మరి వాళ్ళు ఇండియా వెళ్ళకుండా ఎందుకు ఉండిపోయారో వాళ్ళనాపేసిన కారణాలేంటో వాళ్లనే అడిగి తెలుసుకుందామా..(ఇది సరదా సరదా నాటిక ఎవర్నీ ఉద్దేసించి వేసినది కాదు)

వెళ్ళాలని ఉంది కానీ...1

వెళ్లాలని ఉంది కానీ...2

Thursday, October 13, 2011

మధురభావం

చూపులు కలసిన శుభవేళ
కలసిన మనసుల ఆనందహేల!

కలబోసుకున్న కబుర్లు
నవజీవన  సోపానాలు!

ఉత్సాహం ఉరకలు వేసింది
ఉల్లాసం పరుగులు తీసింది!

నీవే నేనను మధురభావం
ఇరు హృదయాలకి  ప్రణయవేదం !

పరిచయం చిరునామా మార్చుకుంది
ఒంటరితనం జంటను చేరుకుంది!!

Tuesday, October 11, 2011

మది పలికిన మోహన రాగం...

మొన్నటి ఓ క్షణం..
గమనాన్ని మరచింది!

తలచిన అనునిత్యం ..
నవరాగం వినిపించింది!

మోయలేని భావమేదో..
అరుణిమయై విరిసింది!

మది పలికిన మోహన రాగం...
సమ్మోహన గీతమైంది!!

Monday, October 10, 2011

కలకానిది...నిజమైనది

నిన్న రాత్రి ఓ స్వప్నం..
దూరాన ఎచటికో పయనం!

తరంగిణీ తీరాలు...
హరిద్రువ సమూహాలు!

ఆకశాన ఎగిరే గువ్వలు
మధూలికా మంజరులు
అనన్య సామాన్యములు!

ఊహు...ఇవేవీ కావు
నిరంతరాన్వేషణ... 
ఎందాకో ఈ ప్రయాణం!

రాసులుగా  పోసిన రత్నాలు
మరకతమణి మాణిక్యాలు!
ఎన్నటికీ కానేరవు!

వెతుకుతున్నది కానరాక...
దారి తెన్నూ తెలియక
చటుక్కున కళ్ళు తెరిచాను!

ఆ చిరు కదలికకే చెంతకు చేర్చుకున్న
నీ సాంగత్యంలో  తెలిసింది!

కలలో దొరకనిది ఇలలో నాదైనది 
నా కంటే అదృష్టవంతులెవరు?Friday, October 7, 2011

నిను చూడక నేను౦డలేనూ...

నీవు లేక క్షణమైనా మనగలనా..
నిన్ను వదిలి ఎలా వెళ్ళను?

నేను నీ కోసమే పుట్టానన్నావు
నా తోడిదే నీ లోకమన్నావు!

మనం పాడుకున్న పాటలు
కలబోసుకున్న కబుర్లు ఇందుకేనా?

నేనొక్క ముద్దు పెడితేనే పరవశించి పొయ్యేదానివి
నా సమక్షమే నీకు స్వర్గమనేదానివి!

నా కోసమా! నా మంచి కోసమేనా!
నీవు దరిలేని మంచి నాకెందుకు?

మనం కలసి తిరిగిన చెట్టు చేమలు
నువ్వు వంటరిగా వెళితే బెంగపడవూ..

ఆ చెట్టుమీద పిట్ట, పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెద
నా గురించి అడిగితే నువ్వేమని చెప్తావ్?

నాకు నువ్వు తప్ప ఎవరూ ఇష్టం లేదు
నేను ఇక్కడ తప్ప ఎక్కడా ఉండలేనే...

నువ్వు మాత్రం, నన్నొదిలి ఉండగలవా?
ఈ ఒక్కసారికీ నీ మనసు మార్చుకోవా...

నీ మాట వినలేదన్న కోపమా
ఇంకెప్పుడూ అలా చేయ్యనుగా...నమ్మవా?

నిన్నెవ్వరితోనూ మాట్లాడనివ్వట్లేదనా
అన్నీ నువ్వనుకున్నట్టుగానే చేద్దాం!

నీ ఒడే నా బడి నాకింకేమీ వద్దు
నన్ను బడికి పంపించకమ్మా!!
   

          బాబును స్కూల్ కి పంపించినపుడు వాడి గుండె కరిగి నీరయితే దొరికిన 'అక్షరాలి'వి. నలుగురు పిల్లల్ని పోగేసి,  కాగితం మీద రంగులూ, చిన్న చిన్న బొమ్మలూ వేయించేదాన్ని. చిన్న టేబుల్ దగ్గర కూర్చుని చేసేవాళ్ళు. అది పూర్తవగానే 'అమ్మా చూడు' అంటూ వెనక్కి తిరిగి చూపించడం వాడికలవాటు. ఒకసారి స్కూల్ లో కూడా... వేసిన బొమ్మ పూర్తవగానే అలవాటుగా 'అమ్మా చూడు' అంటూ వెనక్కి తిరిగాడట, చెమ్మగిల్లిన నా మనసు 'ఆ' అక్షరాలకిచ్చిన రూపం ఇది.

Wednesday, October 5, 2011

ఒక ఆకు వెయ్యొచ్చుగా..

       చిక్కటి చీకటి... కారు వేగంగా వెళుతూవుంది. ఇంతలో బ్రిడ్జి...కారు వేగంగా..... చీకటి...ఏం జరగబోతోంది? చిట్టితల్లి నా దగ్గరగా జరిగి కూర్చు౦ది. చేతిలోకి తీసుకున్న పాప్ కార్న్ నోటిదాక చేరలేదు. వేగంగా వెళుతున్న కారు..నీళ్ళలోకి ప.....డి పోయింది. అంతా నిశ్శబ్దం... ఎక్కడో దూరంగా అంబులెన్స్ వస్తున్న శబ్దం...దగ్గరగా వచ్చేసింది...ఫైర్ ట్రక్కులు కూడా వచ్చేశాయి...అంతా హడావుడి....కారు తీయడానికి సన్నాహాలు..పెద్ద హుక్ లోపలికి వేశారు..అంతా హడావుడి...చిట్టితల్లి నాకు ఇంకా దగ్గరగా ... అసలు నీకు...చిన్నపిల్లకి ఇవన్నీ చూపిస్తావా?...ఆగండి....ఆగండి..తర్వాత చెప్తాను. అమ్మయ్య, కారు బయటకి కనిపిస్తోంది....అయ్యో మళ్ళీ మునిగిపొతో౦దే...మళ్ళీ ప్రయత్నాలు....అమ్మయ్య...కారు వచ్చేసింది. పాప నోట్లోకి పాప్ కార్న్.


"ఆకు వెయ్యొచ్చుగా ..."
"ఏమిటీ?...."
"అదే అమ్మా ఒక ఆకు వేస్తే ఎంచక్కా ఆ కారు ఆకు మీదెక్కి వచ్చేస్తు౦దిగా.."
"హ..హ..హ.."


నేను మా చిట్టితల్లి టివి లో '911'  ప్రోగ్రాం చూస్తూ ఉండగా చిట్టితల్లిచ్చిన సలహా...మరి వాళ్లకు ఆ 'పావురం..చీమ' కథ తెలియదుగా... మీకా కథ తెలుసా? మీకెవరైనా ఫైర్ ఫైటర్స్ తెలిస్తే వాళ్ళకీ ఈ కథ చెప్పండి.


                               పావురం......చీమ 


              అనగనగా ఒక అడవిలో ఓ పెద్ద చెట్టు. 'ఒక్క చెట్టేనా' అని ఆశ్చర్య పోకండి మా అమ్మాయిలా. చాలా చెట్లున్నై, మన కథ ఈ చెట్టు దగ్గర మొదలవుతుందన్నమాట. ఆ చెట్టు మీద ఓ పావురం అందమైన గూడు కట్టుకుని ఉంటుంది. ఆ చెట్టుకింద పుట్టలో ఓ చీమ. అవి రెండూ మంచి స్నేహితులు. ఓ రోజు చల్ల గాలి వీస్తూ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నై. మన చీమకి పాటల౦టే మహా ఇష్టం. 'చల్ల గాలి అల్లరి ఒళ్లంత గిల్లి' అంటూ డాన్స్ చేస్తూ చెట్టునొదిలి దూర౦గా వెళ్ళింది. ఈ ముచ్చట౦తా మన పావురం చెట్టు మీద నుండి ముసిముసి నవ్వులు నవ్వుతూ సినిమా చూసినట్టు చూస్తూ ఉంది.


                ఈ లోగా చినుకులు...మన చీమ 'అమ్మ బాబోయ్ వర్షం' అంటూ చెట్టు దగ్గరికి పరిగెట్టి౦ది. ఎంతైనా చీమ నడకలు కదా...పాపం ఇంకా దానింటికి చేరనే లేదు. భోరున వర్షం. ఈ లోగా వర్షం నీళ్ళు చిన్న చిన్న కాలువలుగా మారిపోతున్నాయి. చీమ పరిగెడుతూ..పడుతూ...దొర్లుతూ...చాలా కష్టాలు పడిపోతూవుంది. పావురం దాని బాధ చూస్తూ...అయ్యో అనుకుంటూనే ఏం చెయ్యాలా అని ఆలోచించింది. అప్పుడు దానికి చమక్ మని ఓ  ఆలోచన వచ్చింది.


              ఒక ఆకును తుంచి చీమ ముందు పడేలా వేసింది. ఆకు పడుతుందా? గాలికి కొట్టుకు పోతుందా? పడుతుందా లేదా...పడుతుందా లేదా...అమ్మయ్య చీమ ముందే పడింది. అప్పుడు మన చీమ ఆ ఆకు పడవ మీదెక్కి 'లాహిరి లాహిరి లాహిరిలో' అని పాడుకుంటూ చెట్టేక్కేసింది. అప్పుడు చీమ కిందకి చూస్తూ 'అమ్మయ్యో ఎన్ని నీళ్ళో' అనుకుని, పావురంతో  'నీవల్లే నేనివాళ బతికి బయట పడ్డానూ... నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తాను' అని చెప్పి౦ది. అప్పటి నుండి వాళ్ళు ఇంకా మంచి స్నేహితులైపోయారు.


               ఒకరోజు పావురం తన బంధుమిత్రులతో కలసి, ఒక చెట్టుకింద గింజలు తింటూ ఉంది. 'ఆ  మిత్రులలో చీమ లేదా' అన్న సందేహం మీకూ వచ్చిందా?  ఆ మిత్రులలో చీమ లేదు లెండి. చీమ నడకలు నడుస్తూ మెల్లగా వస్తూ వుంటుంది.  అప్పుడు ఒక వేటకాడు 'భలే చాన్సులే, భలె భలే చాన్సులే లలలాం లలలాం  లక్కీ చాన్సులే' అనుకుంటూ' బాణం పావురం వైపు గురిపెట్టాడు. ఆ చెట్టు దగ్గరే ఉన్న చీమ ఆది చూసి వేట గాడి కాలుమీద గట్టిగా  కుట్టేసింది. ఆ వేటగాడు 'చచ్చాను బాబోయ్' అని అరిచి బాణాన్ని పైకి వదిలేసాడు. ఇంకేముంది వేటగాడి అరుపువిని పావురాలన్నీ 'రయ్యిన' ఎగిరిపోయాయి.


అదన్న మాట కథ. కథ కంచి మనం ఇంటికి.

Monday, October 3, 2011

అలా మొదలైంది...

         
              నేను వ్రాసిన కవితలు బావున్నాయా? అసలు ఎవరికైనా నచ్చుతాయా? అనే అనుమానం వుండేది. నా హితులూ, స్నేహితులూ బావున్నాయనే వారు, కాని నా మీద ప్రేమతో చెప్తున్నారేమో అని సందేహం. కౌముదికి పంపించాను.

             'కిరణ్ ప్రభ గారు' "Good concepts and very good expressions.. Keep writing Jyothirmayi Garu...."  అని పంపించినప్పుడు అంత గొప్ప సంపాదకులకు నచ్చాక నా సందేహం తీరిపోయింది. నా కలం కదలడానికి ప్రోత్సాహమిచ్చిన 'కిరణ్ ప్రభ' గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

           ఓ రోజు అలవాటుగా 'చిమటామ్యూజిక్.కాం' లో పాటలు వినడానికి వెబ్సైటు ఓపెన్ చేసాను. అక్కడ కొన్ని పాటలకు 'నిషిగంధ' గారి వ్యాఖ్యానం చదివాను. చాలా చాలా నచ్చింది. ఆ సైట్ లోనే ఆవిడ పొయెట్రీ అని కనిపించి౦ది. వెళ్లి చదవడం మొదలు పెట్టాను. ఆ కవితల్లో నన్ను నేను మరచి పోయాను. ఆవిడ కవితల్లో ప్రతి వాక్యంలో భావుకత వెల్లివిరుస్తుంది. పారిజాతాలు మన మనసులోనే  విచ్చుతున్న అనుభూతి కలుగుతుంది.

ఆవిడ కవితల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.....

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని!

ఈ కవితలో సామీప్యానికి సాన్నిహిత్యానికి ఉన్న తేడా అవిడ వివరించిన శైలి....అద్భుతం. అలాగే వెన్నెల గురించి ఆవిడ వాక్యాలు

'చుక్కల నవ్వుల్ని తోడిచ్చి
జాబిలి దోసిలి నించి
జారవిడిచింది..'

ఈ వాక్యాలలో ఎంత ప్రేమ భావం నిండియున్నదో చూడండి.

'ఏ దిగంతాల అవతల
నీ అడుగుల సడి వినబడిందో
పువ్వు నించి పువ్వుకి
ఆనందం వ్యాపిస్తోంది..'

ఇలా ఎన్నెన్నో...

           ఇక ఈ కవితల వ్యాఖ్యలు. నాకు ఇంకో ప్రపంచం చూపించాయి. అలా కనిపించిందే 'స్నేహమా' రాధిక గారి బ్లాగు. ఆవిడ  చిన్న చిన్న పదాల అల్లికతో కవితలు ఎంత బాగా వ్రాశారో! ప్రతి కవితకి ఒక చిత్రం ఆ కవితలకు అదనపు ఆకర్షణ. ఆవిడ 'గాయ పడిన నమ్మకాలు' కవితలో అంటారూ ..

'గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను'

మనసుని కదిలించే సన్నివేశం మన కళ్ళ ముందు ఆవిష్కృతమౌతుంది. ఇక 'ఊరు' కవితలో

'ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు'

ఇది చాలు ఆవిడ కవితల గురించి చెప్పడానికి.

       నాకు బ్లాగ్ పెట్టాలన్న ఆలోచన అప్పుడు మొదలైంది. బ్లాగుపెట్టి వ్రాస్తుంటే తెలియని ఆనందం నాలో. ఇంతటి ఆనందం నాకు కలగడానికి ఈ బ్లాగు పెట్టడానికి స్ఫూర్తి నిచ్చిన నిషిగంధ గారికి, రాధిక గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

       . మొదలుపెట్టాక "నా బ్లాగుకి వచ్చి వ్యాఖ్యతో పలకరించకపోతే...ఎంత అద్భుతమైన రచనని చదవకుండా ఉండేదాన్నోకదా" అంటూ 'ఇల్లాలి ముచ్చట్లు' సుధ గారి వ్యాఖ్య చూశాక ఎంత ఆనందం కలిగి౦దో మాటల్లో చెప్పలేను. అలాగే మధురవాణి గారు కామెంట్ పెట్టటమే కాక నాతో చెలిమికి తన రాధ నిచ్చిన తొలి నెచ్చెలి, తరువాత 'వెన్నెల్లో గోదారి' శైల బాల గారు నా రెండో అతిధి. ఈ మధ్యనే 'కడలి' సుభ గారు కూడా...

        మధుర వాణి గారికి, శైల బాల గారికి, సుభ గారికి...ఇంకా బ్లాగుకు వచ్చి కామెంటిచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.

జ్యోతిర్మయి

Sunday, October 2, 2011

పూలు గుసగుసలాడేనని...


చిలిపిగ తొంగి చూస్తోంది
దాగని చిరునవ్వొకటి!

పువ్వూ అందమే, ముల్లూ అందమే
గరికా అందమే, విరిగిన కొమ్మా అందమే!

నేల నొదిలి, నింగి కెగరి
చుక్కల లోకంలో, వెన్నెల తీరంలో!

తనువు మరచి, తరుణం మరచి
నన్ను నేనే మరచి!

చెంగున లేడిలా గంతులేయాలని
చేప పిల్లలా ఈదులాడాలని!

అణువణువున ఉత్సాహం
మానసాన  ఆనందతాండవం!!


Saturday, October 1, 2011

కౌముదిలో నా కవిత 'ఎడబాటు'


ఈ దారిలోనే కదూ నా చిన్నారి
బుల్లి బుల్లి అడుగులతో పరుగులు తీసింది!
అదిగో ఆ తోటలోనే మునుపెన్నడో
ఊయల ఊగిన సందడి!

బుజ్జి సైకిలును చూసి
మోమున మెరిసిన సంతోషం!
చారడేసి కళ్ళతో బెంగగా
స్కూలుకు వెళ్ళిన వైనం!

శాంతాతో ఫోటోలు, జింజెర్ బ్రెడ్ హౌసులు,
హాలోవీన్ డ్రస్సులు, ఈస్టర్ ఎగ్ హంట్లు,
కోరస్ పాటలు, టెన్నిస్ ఆటలు ....
ఓహ్! ఎన్నెన్నో!!
అవన్నీ నిన్న మొన్నలా లేదూ!

ప్రతి మలుపులో నీ వేలు పట్టుకుని నడిపించాను!
మలుపులన్నీ దాటి చూద్దును కదా...
ఆ చివర... మలుపు తిరుగుతూ.....
ప్రగతి పధంలో నీవు!!

నీ జ్ఞాపకాల బాసటగా
ఈ చివర నేను!!

నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'అక్టోబర్ 'సంచికలో ప్రచురితమైంది.

నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.