Monday, December 31, 2012

రాళ్ళు

"లక్ష్మీ నేను ఆఫీసుకు వెళ్తున్నాను తలుపేసుకో" చెప్పులు వేసుకుంటూ చెప్పాడు సుబ్బారావ్. "అలాగే" పెరట్లోనుండే చెప్పింది లక్ష్మి. కాసేపటికి వాకిట్లో 'అమ్మా'అంటూ కార్తీక్ ఏడవడం వినిపించింది. "ఏమైంది నాన్నా" అంటూ హడావిడిగా వచ్చిన లక్ష్మికి కార్తీక్ కింద కూర్చుని కాలు పట్టుకుని ఏడుస్తూ కనిపించాడు. దగ్గరకు వచ్చి లేపబోతే కాలు పట్టుకుని బాధతో విలవిలలాడిపోయాడు కార్తీక్.
"అయ్యో కాలు బాగా నొప్పి చేసినట్లుందే?" అనుకుని గబగబా పిల్లాణ్ణి చేతుల్లో ఎత్తుకుని అటో కోసం వీధిలోకి వచ్చింది. ఇంతలో గోడ అవతల నుండి "లక్ష్మీ ఎందుకమ్మా బుజ్జిగాడు ఏడుస్తున్నాడు?" అని అడిగారు పిన్నిగారు.
"కింద పడ్డాడు పిన్నీ కాలు బాగా వాచింది. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను." చెప్పింది లక్ష్మి.
"అయ్యో మీ ఇంటి ముందున్న రాయే తట్టుకుని ఉంటాడు. అయినా అమ్మాయ్ నేను చెప్పానని కాదుగాని ఇంటిముందు మట్టి వాకిలి వున్నట్టయితే దెబ్బ తగిలేది కాదుగా ఏదో ఫాషనని మీరంతా రాళ్ళేయిస్తున్నారు కాని...." గోడ మీద నుండి చూస్తూ అన్నారావిడ. 
వీధిలో కూరలు కొనడానికి వచ్చిన విమలకు లక్ష్మి హడావిడిగా ఆటోలో వెళ్ళడం కనిపించింది. 
"ఏంటి పిన్నిగారు లక్ష్మీ అలా వెళుతుంది? ఏమయింది?" అని అడిగింది.
"బుజ్జిగాడు పడ్డాడు విమలా కాలు బాగా వాచింది. లక్ష్మి హాస్పిటల్ కు తీసుకుని వెళ్తుంది." చెప్పారు పిన్నిగారు. 

"ఓ అలాగా పిల్లలు పడ్డం మామూలేగా మా వాడయితే రోజుకు పదిసార్లన్నా పడుతుంటాడు. ఆ మాత్రం దానికి హాస్పిటల్ కి పరిగెత్తాలా" నిర్లక్ష్యంగా అంటూ లేత బెండకాయలు ఏరుకోవడం మొదలెట్టిది విమల.  

పిన్నిగారు లోపలకు వెళ్ళడంతోటే విమల హడావిడిగా బయలుదేరి సరళ ఇంటిముందు ఆగి "సరళా కార్తీక్ పడ్డాడట వాడికి కాలు విరిగిందట. బహుశ కాలు కూడా తీసేయాలంటారేమో" అప్పటి వరకు బలవంతంగా దాచుకున్న వార్తకు కొంత రంగులు కలిపి చేరవేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
"విరగదూ మరి. అయినా పెద్దవాళ్ళ తప్పులు ఊరికే పోతాయా! చిన్నపిల్లలకు ఇలాగే చుట్టుకుంటాయ్" నిన్న తనను పిలవకుండా లక్ష్మి సినిమాకు వెళ్ళిన అక్కసు తీర్చుకుంది సరళ. 
"బాగా చెప్పావ్, అయినా ఎంత డబ్బుంటే మాత్రం మిడిసిపాటు కాకపోతే ఇంటి ముందు అలా రాళ్ళేయించుకుంటారా" బాగా అయ్యింది అని పైకి అనలేక మనసులో అనుకుంటూ వాళ్ళ పోర్షన్ లోకి వెళ్ళిపోయింది విమల.
సరళ వెళ్లి ఈ విషయం వాళ్ళాయనతో చెప్పగానే అయన "వాడికి దూకుడెక్కువ ఏదో ఒక రోజు ఇలా అవుతుందనే నేను అనుకుంటూనే ఉన్నాను" అన్నాడు. 
ఆయన ఆఫీసుకు వెళ్ళడంతోటే అప్పారావు పిలిచి ఈ విషయం గురించి చెప్పాడు. 
అప్పారావు "మన దేశంలోనే ఈ దరిద్రం అంతా. అదే అమెరికాలో అయితే పిల్లలున్న ఇంట్లో అసలే రాళ్ళే వెయ్యకూడని చట్టముందట. ఎప్పటికి బాగు పడతామో మనం" నిట్టూర్చాడు.
అంతా వింటున్న పక్క సీట్లోని మహేష్ "అసలు తప్పంతా మన ప్రభుత్వానిదేనండి కంపెనీల దగ్గర లంచాలు తీసుకుని నాసిరకం రాళ్ళ తయారికి ఆమోద ముద్ర వేస్తే అవి పైకి లేచి ఇలాంటి ఘోరాలే జరుగుతాయి." ఆవేశం వెళ్ళగక్కాడు. 

"పిలకాయలు అంతేనండి ఎంత చెప్పు పరిగెత్తకుండా ఉండరు, ఏం చెప్పినా అనవసరం... వాళ్ళని మార్చడం దేముడి తరం కూడా కాదు, ఇక మన వల్ల ఏమౌతుందండి" నిరాశ
చుట్టూరా చల్లేశాడు జనార్ధన్.
"ఒక్కళ్ళనని ఏం లాభం. అసలు సమాజమే ఇలా తయారయ్యింది. దీన్ని మార్చాలనుకోవడం మన బుద్ది తక్కువ." వంత పాడాడు రామ్మూర్తి .
"మీరెప్పటికీ మారరా జరిగిన ఘోరం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. 
"ముక్కుపచ్చలారని పిల్లాడు వాడు 
పరిగెత్తి పరిగెత్తి పడ్డాడు చూడు 
ఓ భూదేవి నీకు కరుణ లేదా 
ఓ సుడిగాలి నీకు దయ రాదా" అంటూ వెంటనే ఓ కవిత అల్లేశాడు
హరి.
బుజ్జిగాడి తండ్రి సుబ్బారావు కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. విషయం ఆయన దగ్గరకు వచ్చే సరికి పిల్లాడి వివరాలు మారిపోయాయి. "అసలు వాడి తల్లిదండ్రులను అనాలి పిల్లల్ని పట్టించుకోకుండా వీధిలో వదిలేయడం ఈ మధ్య ఫాషన్ అయిపోయింది." నాలుగు పడికట్టు పదాలు వాడేశాడు.

       ఆ రాయి అక్కడ ఎప్పటినుండో వుంది, ఆ మాటకొస్తే  ఆ వీధి వీధంతా రాళ్ళే పెద్దవాళ్ళు కూడా తట్టుకున్న సందర్భాలు వున్నాయి. ఎవరికీ వాళ్ళు తప్పుకుని పక్కన పోతూ వున్నారు. ఏదో ఒకరోజు ఇలాంటివి ఎదుర్కుంటారని తెలియందేమి కాదు అయినా కొత్తగా ఆశ్చర్యపోతున్నాం?(నటిస్తున్నామా?). 

      ఒక్కరంటే ఒక్కరైనా ఆ పిల్లాడికా దెబ్బ తగలడానికి  కారణమేంటి? వెళ్లి చూద్దామని కాని....ఏ రాయి తగిలి పడ్డాడు? ఒకవేళ రాయి తగిలి పడితే ఆ రాయి ఎక్కడుంది? దాన్ని పక్కకు తీద్దామన్నఆలోచన చేయలేదు. జరిగిన విషయం తెలుసుకోవాలి, పక్కవాళ్ళకు చెప్పాలన్నకుతూహలం మాత్రం మెండుగా వుంది అందరికీ. మన బాధో, ఆక్రోశమో అందరితో పంచుకోవాలి. అలా కాక ఏ ఒక్కరు నడుం కట్టినా నలుగురు కలసి ఆ రాయిని పెకిలించి మరో పదిమంది పిల్లలు పడకుండా చేయగలిగి ఉండేవారు. అది ఒక్కింటి సమస్య కాదు కాబట్టి వీధి వీధే కాదు ఆ ప్రక్షాళణ దేశంమంతా జరిగుండేది.

      ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు వెళ్లబోసుకున్నారు. అక్కసు తీర్చుకున్నారు. ఆ వార్త కాలక్షేపం బఠాని అయ్యింది. సాయంత్రానికల్లా ఆ విషయమే మరచిపోయారు. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయారు. 
మరి మనమో...

      

Tuesday, December 18, 2012

బాధ్యత

        నేను వెళ్లేసరికి సుమన చింటూకు ఫోన్ ఇచ్చి అన్నం పెడుతూ వుంది. వాడు ఫోన్లో 'కెవ్వు కేక' పాట  చూస్తూ పది నిముషాలకోసారి నోరు తెరుస్తున్నాడు. ఆ తరువాత పెరుగన్నం తినేప్పుడు 'రింగ రింగా' పాట చూస్తూ తిన్నాడు. రోజూ ఉండే తతంగమే ఇది. వాడికి అన్నం పెట్టడానికి సుమనకు ఓ అరగంట పడుతుంది. ఏదో విధంగా తన కొడుకు అన్నం తింటే చాలన్న ఆలోచనను రోజులా నాకెందుకులే అని చూస్తూ ఊరుకోలేక పోయాను. 

"అబ్బ ఈ పిల్లాడికి అన్నం పెట్టేసరికి తల ప్రాణం తోక్కొస్తుందనుకో " అంటూ వచ్చి కూర్చుంది. 
"పిల్లల పోషణ అంటే శారీరక అవసరాలు చూడడమేనా మన బాధ్యత?" అడిగాను.
"అంతేగా మరి రెండేళ్ళ పిల్లలకు అంతకంటే ఏం చేస్తాం?" ఆశ్చర్యపోయింది సుమన.
"చింటూ 'కెవ్వు కేక', 'రింగ రింగా' పాటలు రోజూ చూస్తున్నాడు. ఆడవారిని ఆటబొమ్మగా చూపే అలాంటి పాటలు వాడి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచిస్తున్నామా....మరో రెండేళ్ళు పొయ్యాక వాడు ఆడే వీడియో గేమ్స్ లో గన్స్ తో కాల్చుకోవడమే వుంటుంది. వాడి ఆలోచనా ధోరణి పెద్దయ్యాక ఏవిధంగా ఉంటుందో ఆలోచించు" తను నొచ్చుకోకుండా సాధ్యమైనంత సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాను.
"చిన్నతనంలో ఆడే వీడియో గేమ్స్, టివి పిల్లల మీద అంత ప్రభావం చూపిస్తాయంటే నేనొప్పుకోను." నా ఆలోచనను గట్టిగానే ఖండిచింది.

"మొన్న సెలవల్లో మా అక్కావాళ్ళు వచ్చారు గుర్తుందిగా వాళ్ళ అమ్మాయి ప్రవల్లిక  టెన్త్ చదువుతోంది. తనోసారి పిల్లలతో కూర్చుని టివి చూస్తూ, "ఆ ఏరోప్లేన్ ను గన్ తో కాల్చేయాలనిపిస్తుంది" అంది. నాకర్ధం కాలేదు, "ఎందుకలా అనిపించిందిరా" అనడిగాను. " ఐ డోంట్ నో, వీడియో గేమ్స్ లో అలా చేసి చేసి అలవాటయిపోయింది" అంది."
కొంచెం సేపు నిశ్సబ్దంగా ఉండిపోయింది సుమన. "మొన్న స్కూల్లో తల్లిని, పసిపిల్లలను నిలువునా కాల్చేసిన వాడ్నికరుడు గట్టిన రాక్షసుడనుకోవాలా? నిండా పాతికేళ్ళు కూడా వున్నట్టులేవే" నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాను.
"అతను పెరిగిన పరిస్థితిలు ఎలాంటివో మన వాళ్ళు అలా ఎందుకవుతారు?" మెల్లగా అంది. అంతకు ముందున్నంత విశ్వాసం లేదు స్వరంలో, తన ఆలోచన మీద తనకే పూర్తి నమ్మకం వున్నట్లనిపించలేదు.

"వ్యసనాలకు బానిసై సులభంగా వచ్చే డబ్బుకు ఆశపడి పసిపాపను బలితీసుకున్న వాడు పెరిగింది మన దేశంలోనే. పాపం వాళ్ళమ్మను చూస్తే ఎంత బాధనిపించిందో! "నా కొడుకు మంచి వాడు ఎవరినీ ఇబ్బంది పెట్టే  మనస్థత్వం కాదు వాడిది. ఇలా ఎందుకు చేశాడో" అని ఆవిడ బాధపడుతుంటే నాకు ఎదురుగా మన పిల్లలే కనిపించారు. ఎక్కడుంది లోపం?" ఎన్నాళ్ళుగానో మనసులో ఆలోచన ప్రశ్న రూపంలో బయటకు వచ్చింది. సమాధానం లేనట్లుగా మౌనంగా చూస్తూండిపోయింది సుమన. 

"మన వార్తా పత్రికల్లో గ్యాంగ్ రేప్స్ గురించి చదువుతూనే వున్నాం కదా. వాళ్ళు పెరిగింది మన సంస్కృతిలోనే. పిల్లలు ఇక్కడ పెరిగారా, ఇండియాలోనా అన్నది కాదు ముఖ్యం వాళ్ళు పెరుగుతున్న పరిస్థితులు ఎలాంటివి? వాళ్ళను సరిదిద్దవలసిన బాధ్యత మనమీద ఎంతుంది?" నిన్నటినుండి మనసులో సుడి తిరుగుతున్న ప్రశ్నలను ఎవరిని అడగాలో తెలియక  సుమన వైపు సంధించాను.

"అందరూ అలానే తయారవుతున్నారా? ఎంతమంది చక్కగా చదువుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరు."
"నిజమే జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళే వున్నారు. పక్కన అన్యాయం జరుగుతున్నా స్పందించే సున్నితత్వాన్ని కోల్పోతున్నారు. వారి జీవితమే వారికి ముఖ్యం. తమదాకా వస్తే కాని అది పట్టించుకోవాల్సిన సమస్య కానే కాదు వారి దృష్టిలో."
"అలా అని ప్రతి సమస్యనూ మనసుదాకా తీసుకుని ఎప్పుడూ బాధ పడుతూ ఉండాలా?"
"అక్కర్లేదు సుమనా కనీసం మన వలన అలాంటి తప్పులు జరగకుండా చూడాలి. ఇండియా గురించి నాకు తెలియదు కాని ఇక్కడ మాత్రం పిల్లలకు మంచి చెడూ బోధించాల్సిన తల్లిదండ్రులు అమెరికా వ్యామోహంలో పూర్తిగా మునిగి పోయారు. నిద్రలేస్తే జీవనోపాధి కోసం పరుగులు, రెండు దేశాల సంస్కృతలను వంట బట్టించుకునే ప్రక్రియలో క్షణం తీరికలేని వారాంతాలు. 
ఇక మన, తన అని తేడా ఏముంది" కొంత బాధగా చెప్పాను.

"సెలవలలో పెద్దవాళ్ళు రావడమో పిల్లలు ఇండియా వెళ్లడమో జరుగుతూనే ఉంటుందిగా" నేను మాట్లాడుతున్నది అర్ధమౌతున్నా ఒప్పుకోవడానికి సిద్దంగా లేదు.
"మనవల కోసం పెద్దవాళ్ళు వస్తున్నారు. వచ్చిన వాళ్ళతో వీళ్ళెంతవరకూ మాట్లాడ గలుగుతున్నారు? ఇద్దరి మధ్య  సంబంధాలు ఎలా వుంటున్నయ్. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మా వాళ్ళిల్లు అని మధుర స్మృతులు గుర్తుచేసికున్నట్లుగా వీరికి వారితో ఆ అనుబంధం వుందా?"
"నువ్వన్నది నిజమే. దీనికి పరిష్కారం ఏమిటి మరి" సాలోచనగా అంది.

      పరిష్కారం అంత సులువుగా దొరికేది కాదు. ఈ సమస్య మనందరిదీ. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు రేపు ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదుర్కుంటారో, ఎలాంటి పరిస్థితులలో దోషులుగా మారుతారో తెలియదు. పరిస్థితి చెయ్యిదాటి పోకముందే మేల్కొoదాం. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడుపుదాం. వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకుందాం.

     మన చుట్టూ వుండే టివి, సినిమా రంగం మానవతా విలువలు లేకుండా, అసభ్యతతో కలుషితమై పోయి వుంది. వాటిని నిర్మూలించ వలసిన ప్రభుత్వం కొంత మంది వ్యక్తుల లాభాలకోసం, కొన్ని సంస్థల అభివుద్ది కోసమో అమ్ముడు పోయింది. వాటిని మనం మార్చలేనప్పుడు కనీసం పిల్లలను వాటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. మొక్కై వంగనిది మానై వంగదు ... పసిపిల్లలుగా ఉన్నప్పుడే వారికి నీతి కథలు, కబుర్లతో మంచీ చెడూ చెప్దాం.

       పరిస్థితి చేయి దాటి పోతోందని రోజూ వార్తా పత్రికలలో వచ్చే వార్తల ద్వారా తెలుస్తూనే వుంది. పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిండ్రుల మీదే వుంది. పసి మనసుల మీద చేస్తున్న వ్యాపారాన్ని అరికట్టవలసిన బాధ్యత మనందరిదీ.

  అన్యాయంగా దురాగతాలకు బలౌతున్న అమాయకులకు అశ్రునయనాలతో...

Sunday, December 9, 2012

బూచాడు

         మొదటిసారిగా నిన్ను సరోజా వాళ్ళింట్లో అనుకుంటాను చూసింది. నీ గురించి అప్పటికే సరోజ ద్వారా చాలా వినున్నానేమో నిన్ను చూడగానే ఇదీ అని చెప్పలేని భావమేదో మనసంతా నిండిపోయింది. పెరట్లో పువ్వులు కోయడానికి వెళ్ళినపుడు నువ్వు ఎవరినో పిలవడం వినిపించింది. శ్రావ్యమైన ఆ పిలుపు విని నీ స్వరంలో అమృతం దాగుందేమో అనిపించింది. ఆ తరువాత నిన్ను అక్కడా ఇక్కడా చూస్తూ వచ్చాను. నీ మీద నా అభిమానం కూడా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. నిన్నెలాగైనా మా ఇంటికి తీసుకువెళ్ళాలని స్థిరంగా నిశ్చయించుకున్నాను.

         ఆ లోగా నాకు పెళ్లిచూపులు...పెళ్ళి నిశ్చయమవడం కూడా జరిగిపోయింది. ఆ సమయంలో నువ్వు నా దగ్గరుంటే బావుండునని ఎంతగా అనిపించిందో తెలుసా. కాపురం పెట్టిన కొత్తల్లో కేవలం నీ కోసమే అర్ధరాత్రి.. అపరాత్రి చీకటిలో, చలిలో సైతం లెక్కచేయక చాలా దూరాలు ప్రయాణం చేశాం. ఏమాటకామాటేలే మా ఊరి ముచ్చట్లన్నీ నీవల్లనేగా తెలిసేవి మరి.

       ఆ తరువాత ఓ నాలుగేళ్ల కనుకుంటాను, తలవని తలంపుగా నువ్వే మాయింటికి వచ్చావు. ఎన్నాళ్ళుగానో నీ కోసం ఎదురుచూశానేమో ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. మా వారికి కూడా నీవంటే అభిమానం ఏర్పడింది. బంధు మిత్రులందరినీ పరిచయం చేశాం, నువ్వు కూడా మా కుటుంబంతో పూర్తిగా కలిసిపోయావు. అన్నట్టు నీకు ఎవరినైనా ఇట్టే పరిచయం చేసుకునే నేర్పు వెన్నతో పెట్టిన విద్య కదూ! నీ తోడుగా వున్నామేమో ఎక్కడెక్కడి వారో స్నేహితులయ్యారు. ఆ తీయ్యని కబుర్లలో మునిగి పోయి వారే మాకు ప్రాణ స్నేహితులు, అత్మీయులు అన్నంతగా ఊహించేసుకున్నాం. ఆ రోజులన్నీ ఎడతెగని కబుర్లతో నిండిపోయేయి.

      ఒకరోజు బహుశా మా పెళ్ళిరోజనుకుంటాను, నా కెంతో ఇష్టమైన పెసర పచ్చరంగు పట్టుచీర కట్టుకుని కనకంబరాలు పెట్టుకుని గుడికి వెళ్దామని తయారయ్యాను. ఓ అరగంటలో బయలుదేరతామనగా నువ్వు ఏదో పను౦దని  వారిని పిలిచావు. అంతే....సాయంత్రం కరిగి రాత్రియినా తనకా స్పృహే కలుగలేదు. ఎదురు చూసి చూసి  విసిగిపోయి మెల్లగా ఆ చీకటి రాత్రి వంటరిగా ఆలోచిస్తూ గడిపాను. దానికి కారణం నువ్వని అర్ధమయ్యాక నీ పట్ల కొంచెం నిర్లక్ష్యం ఏర్పడి నువ్వు పిలిచినా విననట్లుగా నటించడం మొదలు పెట్టాను. రోజులు, నెలలుగా, నెలలు సంవత్సారాలుగా మారాయి.

       ఇన్నాళ్ళుగా మాతో కలసివున్నావు, ఈ రోజున ఇష్టం ఉన్నా లేకున్నా నీ మీద ఆధారం పడడం ఎక్కువయింది. అసలు ఆలోచిస్తే నువ్వు రాకముందు వరకు ఎంతో జీవితం సరదాగా ప్రశాంతంగా వుందనిపించింది. అనిపించడం ఏమిట్లే...పిల్లలతో కలసి ఏటి గట్టున షికార్లు, తోటలలో విహారాలు అన్నీ వాస్తవాలేగా! మా చుట్టూ ఉన్న ఆత్మీయులతో సంబంధాలు తగ్గిపోయాయన్న సంగతి చాలా ఆలశ్యంగా అర్ధమైంది. మా సౌకర్యం కోసమే నువ్వున్నావనుకున్నాం కాని, మా సంతోషాన్ని దోచుకు౦టున్నావని తెలిశాక అప్రమత్తంగా వుండాలని తగు చర్యలు తీసుకువాలని నిర్ణయించుకున్నాం.

       నువ్వు మహా తెలివైనవాడివి సుమా! రెండు వైపులా పదునున్న తేనె పూసిన కత్తివి. మమ్మల్నిక ఏమీ చెయ్యలేవని అర్ధం అయిన వెంటనే మా పిల్లల్ను నీ వైపు తిప్పుకున్నావ్. ఎంతగా అంటే నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ అక్కర్లేనంత. ఏం మంత్రం వేశావో తెలియదు కాని వాళ్ళు నీ సమక్షంలో తప్ప మిగిలిన సమయంలో బాహ్య ప్రపంచంతో మాట్లాడడమే మానేశారు. అసలు వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించే స్థితిలో లేరు. ఇరవై నాలుగు గంటలు నీ నామ స్మరణే నిన్ను చూడకుండా వుండలేని విధంగా వారిని తయారు చేశావ్.

      మా మీద నీ అసూయ ఏ స్థాయికి చేరిందంటే మా పిల్లలు మాతో సరదాగా గడపడం కూడా చూడలేకపోయావు. వారికి చివరకు మేమన్నా, మా మాటన్నా భరించలేని స్థితికి వచ్చారు. అది ఆసరాగా  చేసుకుని రకరకాల ఆటపాటల ప్రదర్శించి వారిని పూర్తిగా నీ బానిసలుగా చేసుకున్నావు. నిన్ను అభిమానించినందుకు ఇదా నువ్వు మాకు చేసిన ఉపకారం, నమ్మించి మోసం చెయ్యడమంటే ఇదే కదూ!

     ఆనాడేదో "బూచాడమ్మా బూచాడు బుల్లి పిట్టలో వున్నాడు" అని నీ గురించి సరదాగా పాటలు పాడుకున్నాం. కాని ఈ నాడు మా పిల్లల్ని ఇలా ఎత్తుకెళ్ళిపోయే బూచాడివని మాకు తెలియకనే పోయనే! మనిషికి మనిషికి మధ్య కనిపించని అడ్డుతెరలు వేలాడదీశావు. ప్రతి మనిషిని నీ సొంతం చేసుకుని మా బలహీనతలతో ఆడుకుంటున్నావు. ఎక్కడికెళ్ళినా, ఎంత వినకూడదనుకున్నా చెవిన పడే నీ వికటాట్టహాసాలు నాకు భయం కలిగిస్తున్నాయి. ఒకనాడు గదిలో ఓ మూలన పడివుండిన నువ్వు ఈనాడు ప్రతి వ్యక్తి చేతిలోనో, జేబులోనో కూర్చుని గర్వంతో విర్రవీగుతున్నావు.

    ఎదురుగా వున్న మనిషితో కళ్ళలోకి చూస్తూ మాట్లాడే అనుభూతి నిన్ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే వుంటుందా! కావలసిన మనిషితో ఉత్తరాలలో వ్యక్తీకరించే భావప్రకటన నిన్ను మద్యవర్తిగా చేసుకుంటే వస్తుందా! నీ ఇనుపచెర వదిలే రోజు రావాలని మళ్ళీ ఉత్తరాలు, ఎదురుచూపులతో వియోగాన్ని, విరహాన్ని అనుభవించాలని, మానస వీణలు మోహనరాగాలు అలపించాలని కోరుకుంటున్నాను.