Monday, January 30, 2012

సంక్రాంతి సంబరం

       మా చిన్నప్పుడు ధనుర్మాసంలో ఊరంతా ముగ్గులతో, గొబ్బెమ్మలతో, తోరణాలతో, బొమ్మల కొలువులతో, గంగిరెద్దులతో, బసవన్నలతో కళకళలాడుతుందేది. పండుగ మరో సంబరం బంధువుల రాకపోకలు. ఇప్పుడు కూడా ధనుర్మాసమూ ఉందీ, సంక్రాంతీ  ఉంది. కాకపోతే కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి పెద్ద పెద్ద మార్పులకే లోనయింది. అప్పటి సందడిని తీసుకురాలేము కానీ, ఆ సంస్కృతికి చిహ్నాలుగా బొమ్మల కొలువులు పెడుతున్నాం, ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడ మాకు స్నేహితులే బంధువులు, వారందరితో కలసి ఈ సంవత్సరం సంక్రాంతి సందడి సందడిగా జరుపుకున్నాం. 
   
       తెలుగువారందర౦ కలసి చేసుకునే మా ఊరి ‘సంక్రాంతి సంబరాల్లో’ చిన్నపిల్లలు  రంగురంగుల కాగితాల మీద అందమైన బొమ్మలు గీశారు, 'మ్యూజికల్ చైర్స్ 'లో కుర్చీల కోసం వారి పోటీ ఎన్నికలను తలపించిది. 

ఇక పెద్దవాళ్ళేమో 
“బావున్నారా? మనం కలసి చాలా రోజులయింది కదూ.” 
“అవునండీ చాలా రోజులయింది. మనం ఆఖరున కలిసింది జాహ్నవి వాళ్ళ పార్టీలో అనుకుంటా.” లాంటి పలకరింపులూ.....

“ఏంటిలా చిక్కిపోయావ్ గిరిజా? డైటింగా?”
“నిజంగా తగ్గానా! థాంక్యూ థాంక్యూ.”
“శ్రుతి ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడొస్తుంది?”
“నెక్స్ట్ మంత్ వాళ్లకి ఓ ఫోర్ డేస్ బ్రేక్ ఉందిట. టెన్త్ నొస్తుంది భారతీ.”
"ఏంటి౦త లేట్ గా వచ్చారు?"
"మా ఆఫీస్ లో రిలీజ్ వుంది, అందుకే వీకెండ్ కూడా చావగొడ్తున్నారు." 
లాంటి పరామర్శలూ, ప్రశ్నోత్తరాలూ...

“వాణీ, నీ చీర కలర్ చాలా బావుంది. ఏం చీరది?”
“మా అమ్మ ఏదో పేరు చెప్పింది. గుర్తులేదు జానకీ. మొన్న సౌమ్యా వాళ్ళతో పంపించింది.”
“మాగజైన్ చదివారా?”
“ఆ చదివాను సార్. ఆర్టికల్స్ అన్నీ చాలా బావున్నాయి.”
“హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా వుంది?”
“ఏదీ తెలంగాణా విషయం తేలేదాకా ఆగాల్సిందే” లాంటి కబుర్లతో మనసులు కలబోసుకున్నారు. 

      ఈలోగా పిజ్జా కి పిలుపొచ్చింది. పూర్ణ చంద్రబింబాల్లాంటి పిజ్జాలను చూసిన  పిల్లల మొహాల్లో వెన్నెల వెలుగులు విరిశాయి. తల్లులు “అమ్మయ్య! ఈ పూట తినిపించాల్సిన బాధ లేదని” బోలెడంత ఆనందపడ్డారు.

       వంటలన్నీ అందంగా రెండు బల్లల మీద అమిరిపోయాయి. వడ్డించడానికి ఔత్సాహికులంతా గరిటలతో సిద్దమయ్యారు. “ఆహా”....”ఓహో” లతో భోజనాలు ముగిశాయి. అన౦తరం ‘బింగో’ అంకెల కాగితాలు అందరి చేతుల్లో రెపరెపలాడాయి. పిల్లలందరూ పెద్దలుగా సంయమనం పాటిస్తే, పెద్దలు ఉత్కంఠతో పిల్లలైపోయారు. చిట్టచివరగా అంత్యాక్షరి....పాతపాటల పలకరింపులు, కొత్తపాటల కేరింతలలో పాత, కొత్త గొంతులు కలగలసిన ఆనందంలో నవ్య సంక్రాంతి అందంగా నవ్వింది.

కొస మెరుపు 

చిన్నపనిక్కూడా మేమున్నామ౦టూ ముందుకొచ్చిన స్నేహశీలత అభినందనీయం. ఆహుతులను సకుటుంబ సమేతంగా చిత్రాలు తీసి వాటిని అప్పటికప్పుడు తెరపై చూపించడం ఈ సంక్రాంతి ప్రత్యేక ఆకర్షణ. కబుర్ల మధ్యలో భోజనాలు బహు పసందు. 'బింగో' ఆట ఉత్కంఠభరితం. చివరగా ఆడిన అంత్యాక్షరి వేడుకకు చక్కటి ముగింపు. అందరి మధ్య సమయం మాత్రం మాట వినక పరుగులే తీసింది. స్మృతిహారానికి మరో ముత్యం తోడయ్యింది.


Friday, January 27, 2012

కథాజగత్ - ధనలక్ష్మి

కథాజగత్ కథా విశ్లేషణకు నేనెంచుకున్నకథ 'శ్రీరమణ' గారు రచించిన 'ధనలక్ష్మి'.

      ఆత్మవిశ్వాసం, పట్టుదల, లోక్యం ముడిసరుకులుగా రూపొందిన కథ 'ధనలక్ష్మి'. 'శ్రీరమణ' గారు ఈ కథని నడిపించిన తీరు అనితరసాధ్యం. మొదటి వాక్యం నుండి చివరి అక్షరం వరకూ ఆపకుండా చదివించి "ఔరా!" అనిపించుకు౦టు౦దీ కథ. 

        ఈ కథలో ముఖ్య పాత్ర 'ధనలక్ష్మి', పరిస్థితుల కారణంగా ఆస్థి మొత్తం పోయినా, తరగని ఆత్మవిశ్వాతంతో జీవనం సాగించి, పూర్వ వైభవం సంపాదించుకోవడమే కాక జీవితాన్ని నందనవనం చేసుకున్న స్త్రీ . రచయిత 'ధనలక్ష్మి' ద్వారా చెప్పించిన వ్యాపారసూత్రాలుహారంలో పొదిగిన వజ్రల్లా అందంగా అమిరాయి. 

      ధనలక్ష్మి, సీతారామాంజనేయులు వారు కలసి జీవితం మొదలు పెట్టేనాటికి ఉన్న ఆస్థి పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటారు. రామాంజనేలు ఏదో ఒక చిన్న పనిచేసి జీవితం సాగిద్దాం అనుకుంటాడు. ధనలక్ష్మి అ౦దుకు ఒప్పుకోక వ్యాపారం చేసే ఆలోచన చేస్తుంది. అందుకు సమర్ధులైన వారి సహాయం తీసికుంటారు. ఈ కథలో రచయితే ఆ పాత్ర పోషిస్తారు, వారి ద్వారానే మనకు కథ చెప్పడం జరిగింది. 

      ధనలక్ష్మి రామాంజనేయులు పిండి మరతో వ్యాపారం మొదలు పెడతారు. పిండిమర నడపడం, దాని రిపేర్లు నేర్చుకోవడం ద్వారా మనకు ధనలక్ష్మి తెలివి తేటలు, దాని ద్వారా దొరికిన పిండిని సున్నుపిండిగా మార్చి అమ్మడం, చిల్లర అమ్మడం లాంటి వాటిల్లో ధనలక్ష్మి వ్యాపారదక్షత తెలుస్తుంది. మెల్లగా అప్పులు తీర్చి, అవసరమైన వాటిని జత చేసుకుంటూ చిన్న దుకాణం ఏర్పరచుకునే స్థాయికి ఎదుగుతారు. ఆ సందర్భంగా ధనలక్ష్మి చిన్న వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పిన విషయాలు చదివి తీరవలసినవి. యాత్రాబస్సులు ఏర్పాటు చేసి ఊరి ప్రజల మెప్పు పొందడమే కాకుండా, యాత్రల కవసరమైన వస్తుసామాగ్రిని తమ దుకాణం నుండే బస్సులో వేయించి,  వెళ్ళిన ప్రదేశాల్లో చౌకగా దొరికే వస్తువులను తమ ఊరికి తెచ్చి అమ్మి లాభాలు కూడా పొందుతారు. 

       శకుంతల మాటల్లోని వ్యంగం లోకరీతికి అద్దం పడుతుంది. ఎరువుల వేగన్ దాచి పెట్టడంలోనూ, సదరు వ్యక్తికి సొమ్మందించే విషయంగా ధనమ్మ వ్యవహరించిన విధానం ధనమ్మ యుక్తికి నిదర్శనాలు. అలాగే పనికిరాదనుకున్న స్థలాన్ని తీసుకుని తమకనుగుణంగా మార్చుకోవడంలో కూడా. ఈ విషయం దగ్గర తన భర్త అహాన్ని తృప్తి పరచి సంసారం నిలబెట్టుకోవడంలో మనకు పట్టూవిడుపూ తెలుసున్న ధనలక్ష్మి కనిపిస్తుంది. చివరగా తన కొడుకు విషయంలో తీసుకున్న నిర్ణయం, తదనుగుణంగా వ్యవహారం నడిపి తనకు కావలసిన విధంగా జరిపించుకోవడంలో ధనమ్మ లౌక్యం అమోఘం. సైన్సు మాష్టారుకు ఉద్యోగం రూపేణా ధన సహాయం చేయడం, తమకు వ్యాపారంలో సహాయం చేస్తున్నవారికి ఉచిత యాత్రాసౌకర్యాలు కల్పించడం ఆ దంపతుల పరోపకారానికి నిదర్శన౦.  
  
    చిన్న చిన్న విషయాలక్కూడా  బెంబేలుపడే మనస్తత్వానికి విరుద్దంగా రచయిత ధనలక్ష్మి పాత్రను మలచి, తద్వారా సంకల్పం, ఓపిక, పట్టుదల, తెలివి తేటలు, వ్యవహార దక్షతలన్ని౦టినీ మనకు చూపిస్తారు. ఈ కథలోసంభాషణల తీరూ, కథ చెప్పే విధానం ప్రతిభావంతమైన రచయత శైలిని సుస్పష్టం చేశాయి. ఈ కథ ఆశావాదానికి మారుపేరని కూడా చెప్పొచ్చేమో. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సినదీ కథ.

తూరుపు ముక్క కథాజగత్ లో ప్రచురితమైన 'ధనలక్ష్మి' కథను మీరు ఇక్కడ చదవొచ్చు

Thursday, January 26, 2012

కథాజగత్ -- వాన ప్రస్థం

కథ: వాన ప్రస్థం   రచించిన వారు: సాయి బ్రహ్మానందం గొర్తి

     ఆలోచనా ధోరణిలోని వ్యత్యాసం గురించీ, ఆదర్శవంతమైన జీవన విధాన౦ గురించీ చెప్పే ఈ కథచక్కని కథనంతో ఆద్యంత౦ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ కథలో అనురాగంఆత్మీయత మనకు అడుగడుగునా కనిపిస్తాయి. కథకు తగిన శీర్షిక 'వాన ప్రస్థం'.

    స్వదేశం వెళ్ళిన రాంబాబు, పొలం అమ్మే నిమిత్తం తమ ఊరికి వెళుతూ తన స్నేహితుని తల్లిదండ్రులైన మూర్తి, వర్ధనమ్మగార్లను కలుస్తాడు. ఆ దంపతులు వారి అభిమానంతో అతన్ని ఓ రోజు అక్కడే ఉండేలా ఒప్పిస్తారు. ఆ వయసులో వారి వ్యాపకాలు, తద్వారా చేసే సమాజ సేవ చూసి ముచ్చట పడతాడు రాంబాబు. సుఖమయ జీవనం కోసం ఆహారం విషయంలోనూ వారు తీసుకు౦టున్న శ్రద్ధ, వ్యాయామం, వారు ఆచరించే జీవన విధానం చూసి "నిజం చెప్పద్దూ - మీరిద్దరూ డెబ్బై దాటిన వాళ్ళల్లా కనిపించరు. ఏదో నిన్ననే అరవయ్యో పడిలో వచ్చిన వాళ్ళల్లా ఉన్నారు."  అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. 

     ఆ సమయంలోనే రాంబాబు, తన అక్క అనారోగ్యం విషయంగా, ఆవిడకు శారీరక రుగ్మత కంటే, మానసిక రుగ్మతే ఎక్కువగా ఉన్నట్లు చెప్తాడు. వారి సంభాషణల్లో ఆ దంపతుల మధ్య అవగాహన, కలసి పనిచేసుకోవడంలోని ఆనందం గురించి తెలుసుకుంటాడు. రాంబాబు అక్క, తన పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ, ఆ దంపతులు తమ పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ ఉన్న తేడాలను రచయిత స్పష్టంగా వ్యక్తీకరించారు.

     రచయిత, మూర్తి గారి ద్వారా చెప్పించిన ఈ మాటలు, ఈ కథకు ప్రాణమని చెప్పొచ్చు. 

'ఎక్స్పెక్టేషన్' అనేది అది కేన్సర్ లాంటిది. నిన్నూ నీ చుట్టూ ఉన్న వాళ్ళనీ కనిపించకుండా దహించేస్తుంది..."  అని చేప్తూ తమ ఆరోగ్య రహస్యం కూడా చెప్తారు. "మేం సంతోషంగా ఉంటాం. ఒకర్నొకరు తిట్టుకోం. తప్పులెన్నం. వీలయినంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పిల్లల్నుండి మేం ఏమీ ఆశించం. ఇదే మా ఆనందానికి కారణం. మేం ఎవరినుండీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయం." 


     కథ ముగింపులో రాంబాబు తన అక్క గురించి అనుకున్న మాట ఈ కథకు పరిపూర్ణతనిచ్చింది. ఈ కథలో మంచి సందేశం ఉంది. చిరకాలం గుర్తుండి పోయే కథ 'వాన ప్రస్థం'. 

తూరుపు ముక్క- కథా జగత్ లో ప్రచురితమైన 'వాన ప్రస్థం' కథను మీరు ఇక్కడ చదవొచ్చు. 

Tuesday, January 24, 2012

ఓ కన్నీటి బిందువు

ఎద వ్యధగా మసలిన వేళ
రెప్పల మాటున ఒదిగి౦ది!

మనసు భారమై వగచే వేళ
ఓదార్పై నిలిచింది!

చీకటి నిండిన ఏకాంతంలొ
వాగై వరదై పొంగింది!

మబ్బులు వీడిన మరునిముషాన
ఆనవాలే లేక అదృశ్యమైంది !!




Sunday, January 22, 2012

సియాటిల్ టు కెనడా

      పొడవైన పచ్చని చెట్లు, కొండవాలుగా వంపులు తిరిగిన సన్నని రోడ్లు, కదిలే మేఘాలు, కోనసీమ పలకరింతల్లా కురిసే జల్లులు వెరసి ‘సియాటిల్’.

     అందమైన ‘సియాటిల్’ రోడ్డు మీద కారు కదిలిపోతుంది, పక్కన ఎత్తైన పచ్చని చెట్లు, నడి వేసవేమో సియాటిల్ ని అంటి పెట్టుకునుండే వర్షానికి కాస్త విశ్రాంతి. అప్పటికీ ఉండుండి పలకరిస్తూనే వుంది.

      కెనడా వైపుగా ప్రయాణం, కారులో దేశం దాటడం...పిల్లల్లకు మహా సరదాగా ఉంది. మూడు గంటల ప్రయాణం తరువాత సరిహద్దు దగ్గరకు వచ్చాం. అక్కడ వరుసగా చాలా గేట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద ట్రక్కులు, కార్లు దాటడానికి వేచి ఉన్నాయి. సరిహద్దు దళం ఒక్కక్క వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. మా కారు దగ్గరకు కూడా వచ్చి ‘ఐడి’, ‘పాస్పోర్ట్’ చూపించమన్నారు. అవి ఇచ్చేలోగా విండో లోంచి వెనుక సీట్లో పిల్లల్ని అనుమానంగా చూసి, ట్రంక్ చూసి ఎట్టకేలకు “ఎంజాయ్ యుర్ ట్రిప్” అంటూ పంపించారు. అంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడని పిల్లలు బోర్డర్ దాటగానే ‘ఏ’ అని అని అరుస్తూ సంతోష పడిపోయారు.


ముందుగా ‘వే౦కూవర్’ వెళ్ళాము. అక్కడ నుండి ‘గ్రౌస్ మౌంటైన్ అనే ఎత్తైన పర్వతం చూడడానికి ట్రామ్ లో వెళ్ళాము. పద్దెనిమిది అడుగుల ఎత్తున్న చక్కతో చేసిన బొమ్మలు, 'ల౦బర్ జాక్ షో’ ‘కెనడా ఈగల్ షో’ (గద్ద ఎలా చూస్తుందో అలా తీసిన వీడియో) అక్కడి ఆకర్షణలు. ఆ రాత్రి అక్కడే ఉండి తరవాత రోజు ఉదయం ‘విజ్లర్’ బయలుదేరాము.


     ఒక వైపు లేక్, ఒక వైపు పర్వతాలు, అప్పుడప్పుడూ చిరుజల్లులు చాలా అందంగా ఉందా ప్రాంతమంతా. వెళ్ళే దారిలో ‘బి సి అఫ్ మైనింగ్’ చూశాము. అది కాపర్ మైనింగ్, వంద సంవత్సరాల క్రితందైనా చక్కగా కాపాడుతున్నారు. వర్కర్స్ హేట్ పెట్టుకుని టార్చ్ లైట్ వెలుగులో ఆ మైన్స్ లో చాలా దూరం వెళ్ళాము. తరువాత మజలీ ‘షానన్ ఫాల్స్’. బ్రిటీష కొలంబియాలో ఉన్న పొడవైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం మూడు లెవెల్స్ లో ఉంటుంది. రెండొవ లెవెల్ వరకూ వెళ్ళాము. నీళ్ళు ప్రవహిస్తున్నదగ్గర రాళ్ళ మీద నడుస్తున్నప్పుడు ‘కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా పాయల్లో’ పాట గుర్తొచ్చింది.

అక్కడినుండి బయలుదేరి  'ట్రైన్ మ్యూజియుం' దగ్గర ఆగాము. అక్కడ బుజ్జి ట్రైన్ ఏదో బొమ్మలాగా ఉంది. ఆ బుల్లి ట్రైన్, స్టేషన్ అంతా తిప్పి చూపించింది. దారిలో కుందేళ్ళు, పువ్వులు... భలే సరదా రైలు బండి. ఆ స్టేషన్ లో పాత రోజుల్లో ఉండే ట్రైన్స్ ఉన్నాయి. 


విజ్లర్ విలేజ్ 
      సాయంత్రానికి ‘విజ్లర్’ వెళ్ళాము. అప్పుడు ఆ ఊరంతా ‘వింటర్ ఒల౦పిక్స్’ కోసం కొత్త అందాలు సంతరించుకుంటోంది. ఇప్పటివరకూ చూసిన ప్రదేశాలకెల్లా అత్యంత సుందరమైన ప్రదేశం. ఎక్కడా హడావిడి లేని ప్రశాంత వాతావరణం. అమెరికాలో చూడని ఒక చక్కని దృశ్యం కనిపించింది, వాహనాల హడావిడి చాలా తక్కువ ఉన్న ఆ వీధుల్లో మనుష్యులు వ్యాహ్యాళి కెళ్తుతున్నట్లుగా నిదానంగా చేతిలో చేయివేసుకుని నడుస్తూ కనిపింస్తారు. ఆ ఊరు, వాతావరణము, ప్రశాంతత ఏదో చిత్రపటం చూస్తున్నట్లుగా అనిపించింది. ఆ రాత్రి అక్కడ ఉండి తరువాత రోజు ఉదయన్నే విక్టోరియాకు బయలుదేరాము.

       ‘విక్టోరియా’కి వెళ్ళాలంటే లేక్ దాటి వెళ్ళాలి. ‘ఫెర్రీ’లో  ప్రయాణం, క్రింద కార్ పార్కింగ్ పైన పాసింజర్స్. కొండల మధ్యగా ఫెర్రీ వెళుతూ ఉంటే, లేక్ మీద నుంచి చల్లగాలి, చుట్టూతా నీళ్ళు, ప్రకృతి అందాలలో మనసంతా నిండిపోయింది.

      ‘విక్టోరియా’ అంతా ఓల్డ్ బ్రిటిష్ కట్టడాలు ఉన్నాయి.  అక్కడ ‘ఎంప్రస్’ హోటల్, 'మ్యూజియం', ‘డైనోసర్ అండ్ వైల్డ్ లైఫ్ ఎగ్జిబిట్స్’, ఐ మాక్స్ లో ‘టైటానిక్’ చూసి ఓ గంట దూరంలో ఉన్న ‘బుచర్డ్ గార్డెన్స్’ కి వెళ్ళాము. అద్భుతమైన తోట. ఎటు చూసినా పచ్చదనం, రంగు రంగుల పువ్వులు, పచ్చని పచ్చిక ఫౌంటైన్స్. ఆ మధ్యాన్నం అంతా ఆ తోటలో విహారం, అస్సలు కదలాలనిపించ లేదు. కానీ తప్పదుగా సాయంత్ర౦ వరకూ ఉండి, ఆ తోటకు చివరి వీడ్కోలు పలికి మళ్ళీ ఫెర్రీ లో వేంకూవర్ కి వెళ్ళాము.

        తరువాత రోజు ‘వే౦నకూవర్’ లో ఇండియన్ షాప్స్ ఉన్న వైపుకు వెళ్ళాము. ఆశ్చర్యం అది అచ్చంగా ఇండియా లాగే ఉంది. ఒక వీధంతా ఇ౦డియన్ షాప్స్.. చిన్నచిన్న రెస్టారెంట్స్, పాన్ షాప్స్ ఉన్నాయి. ఒక వీధిలో ఇంటి మెట్ల మీద కూర్చుని తల దువ్వుకుంటున్న అమ్మాయిలు, రోడ్డు మధ్యలో ఆడుతున్న చిన్నపిల్లలు... ఏదో మన ఇండియాలో చిన్న ఊరికి వచ్చినట్లనిపించిది. బోలెడన్ని అనుభూతలను మూట కట్టుకుని సాయంత్రానికి తిరిగి సియాటిల్ బయలుదేరాము. ఆ రోజు జూలై ఫోర్త్, కెనడా బోర్డర్ దాటి అమెరికా వచ్చేసరికి రాత్రయింది. దారంతా 'ఫైర్ వర్క్స్' చూస్తూ అర్ధరాత్రికి ఇంటికి చేరాము.




Tuesday, January 17, 2012

శ్రీవారూ ఉప్మా..


“అమ్మా ఇవాళ టిఫినే౦టి?” మేడ మెట్లు దిగుతూ మా అమ్మాయి.
“ఏం కావాలి నాన్నా?”
“దోశ వు౦దా?”
ఇప్పుడే పిండి గ్రైండ్ చేశాను. రేపటికి రెడీ అవుతుంది.
“ఇడ్లీ ఉందా?” ఫ్రిడ్జ్ డోర్లు రెండూ తీసి పట్టుకుని.
“లేదు, ఉప్మా చెయ్యనా?”
“ఇంకేం లేదా?” ఇంకా ఫ్రిజ్ లోనే వెతుకుతూ..
“ఉహూ..”
“సరే చెయ్యి”
లాప్ టాప్ తీసి పక్కన పెట్టి లేవబోయాను.
“అమ్మ ఏదో రాసుకు౦టున్నట్లుంది. ఇవాళ టిఫిన్ మనం చేద్దాం" అంటూ ఒళ్ళో ఉన్న లాప్టాప్ పక్కన పట్టి వంట గదిలోకి వెళ్ళారు శ్రీవారు.

రాయడం మొదలెట్టాను

బీటలు వారిన నేలపై
స్వాతి చినుకుల

“ఉల్లిపాయలు, చిల్లీస్ ఇంకా ఏం కావలి జ్యోతీ ఉప్మాకి”
“ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు”
“గుర్తొచ్చాయిలే నువ్వు రాసుకో”

బీటలు వారిన నేలపై
జీడిపప్పుల సంబరం!

ఛీ ఛీ జీడిపప్పేమిటి  

స్వాతి చినుకుల సంబరం!

"అమ్మలూ ఇది ఉప్మా రవ్వో ఇడ్లీ రవ్వో అమ్మని అడిగిరా డిస్టర్బ్ చేయకుండా వచ్చెయ్ ఏదో రాసుకుంటుంది పాపం."
ఆ రవ్వేదో చూపించాను.

మోడువారిన రవ్వపై ఏ రవ్వబ్బా, ఏ రవ్వేమిటి నా మొహం

మోడువారిన నేలపై
చివురాకుల కలకలం!

"జ్యోతీ టమోటోలు అయిపోయినట్లున్నాయే?"
"గరాజ్ ఫిడ్జ్ లో ఉన్నాయ్"
"ఎన్ని టమోటోలు వెయ్యను?"
"రెండు వెయ్యండి."
"మూడు వేస్తా."
"ఎన్నోకన్ని వెయ్యండి."
"అంత చిరాకెందుకు రాసుకునేప్పుడు చాలా ప్రశాంత౦గా ఉండాలి”

వసివాడిన పసిమొగ్గ 

"లవంగాలు ఎక్కడున్నాయ్?"
"పా౦ట్రీలో చిన్న బాక్స్ లో ఉన్నాయ్."

వికసిస్తున్న లవంగం!

నాన్నా లవంగాలు వద్దు “ఐ హేట్ లవగంస్.”
“తీసెయ్యడానికి వీలుగా సగం దంచి వేస్తాగా”
సగం దంచుతారా! ఇంకా నయం సగం దంచి వేస్తే తీయడం కష్టం. పౌడర్ చెయ్యండి కలసి పోతుంది. లేకపోతే మొత్తంగా వేస్తే పిల్లలకు తీయడానికి వీలుగా ఉంటుంది. ”
“యు ఆర్ రైట్, యు నో వాట్, యువర్ అమ్మా ఈజ్ సో స్మార్ట్”

ఒ౦టరియైన ఆమ్మకు
నెలవంక స్నేహితం!

"ఉప్మా ఈజ్ రెడీ. అమ్మలూ ప్లేట్లు గ్లాసులు పెట్టు"

ముసురేసిన ప్లేటును దాటి

"అమ్మా డిష్ వాషేర్లో ప్లేట్స్ కడిగినవేనా?"
"ఆ కడిగినవే."

దూసుకు వస్తున్న రవికిరణం!

"జ్యోతీ రా టిఫిన్ తిందాం."
"ఒక్క నిముషం ఇది పూర్తిచేసి వస్తున్నా"

భారమైన టిఫినుకు
ఆలంబన ఉప్మా వేదం!! 

"చూశావా నేను ఎంత మంచి హస్బెండునో నిన్నసలు డిస్ట్రబ్ చేయకుండా రాసుకోనిచ్చాను."
":)"
"ఇంతకూ కవితకు ఏం పేరు పెట్టావ్?
"ఉప్మా వేదం"
"ఎలా ఉంది ఉప్మా?"
"సూపర్ డాడీ."

ఆ కవిత 'ఆశావాదం' చదవాలంటే ఇక్కడ నొక్కండి.

Friday, January 13, 2012

చిట్టి చేతులతో చేసిన బొమ్మల కొలువు


“సంక్రాంతి కదా ఏం చేద్దాం?”
“పిల్లలకు సంక్రాంతి గురించి చెప్దాం”
“ఇంకా...బొమ్మల కొలువు చూపిస్తే ఎలా ఉంటుంది?”
“సూపర్”
“మరి బొమ్మలెలా?”
“ఎవరైనా నేర్పిస్తారేమో చూద్దాం”
“పిల్లలతో చేయిస్తే ఇంకా బావుంటుంది కదూ, వాళ్ళకి ఇలాంటివి చేయడం ఇష్టంగా కూడా ఉంటుంది.”
  

      ఇది టీచర్ల మధ్య జరిగిన సంభాషణ. అనుకున్న వెంటనే బొమ్మలు చేయడం వచ్చినావిడను అడిగాం, ఆవిడ ఎంతో ఉత్సాహంగా ‘చేయిద్దాం’ అన్నారు. ముందు ఆవిడ దగ్గర ఏమేం బొమ్మలు పిల్లలతో చేయించాలో అవి చేయడం నేర్చుకున్నాము. అమ్మాయిలు, అబ్బాయిలు, సీతారాములు, వినాయకుడు, కొన్ని జంతువులు...... మేం నేర్చుకున్నవి.


తరువాత పిల్లల పేర్లు, వయసుల ప్రకారం ఏయే బొమ్మలు ఎవరెవరు చేయగలరో అలోచించి మొత్తం ముప్పయ్యారు మంది జాబితా తయారు చేసి, నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి ఎనిమిది మంది పిల్లలు, వారికి నేర్పడానికి ఇద్దరు పెద్దవాళ్ళు ఉండేలా తొలి ప్రణాళిక సిద్దం చేసుకున్నాము.


       తయారీకి కావలసిన వస్తువులు కార్న్ స్టార్చ్ , సాల్ట్ తో తయారు చేసిన క్లే, కావలసిన రంగులన్నీదాదాపుగా ఆవిడే తీసుకుని వచ్చారు. ఓ రెండు పాకెట్లు మేం కూడా చేసి అరిసెల పాకం తిప్పిన మోజు తీర్చుకున్నా౦. బొమ్మలు పెట్టడానికి కావలసిన మెట్లు ‘శామ్స్’ లో అట్టపెట్టెలు కావలసిన సైజులో వెతికి పట్టుకొచ్చాం. ఈ మెట్లు కూడా ఆవిడే చేశారు, ఎంత బావున్నాయంటే...మీరే చూడండి.


     శుక్రవారం పిల్లలొచ్చే గంట ముందే నాలుగు ప్లాస్టిక్ షీట్స్ మీద చేయవలసిన బొమ్మల నమూనాలు, అవసరమైన వస్తువులూ..అన్నీ సిద్దం చేసుకున్నాం. పిల్లలు వచ్చిన వెంటనే నిర్ణీత స్థలాలలో కూర్చుని బొమ్మలు చేయడం మొదలు పెట్టారు.

“అంటీ నేను పిగ్ చేస్తాను”
“అలాగే”
“ఐ లైక్ బేర్”
“తెలుగులో చెప్పు”
నేను బేర్ చేస్తాను”
“అలాగే”
హాండ్స్ ఎలా పెట్టాలి?”
“నాకు రావట్లేదు, కెన్ యు డూ ఇట్?”
“అ అమ్మాయికి కళ్ళు చిన్నవి పెట్టమ్మా”
“ఐ లైక్ ఇట్ లైక్ థిస్”
“సరే కానివ్వు”
“ఆ బొమ్మకు రెండు జడలు వెయ్యాలి”
“నాకు జుట్టు లివ్ చేస్తే ఇష్టం”
“డైనోస్ కి టూత్ పిక్స్ ఒద్దు”
“వుయ్ వాంట్ టూత్ పిక్స్”


ఆ విధంగా కబుర్లు చెప్పుకుంటూ సరిగ్గా అనుకున్న టైంకి బొమ్మలు చేయడం పూర్తిచేయగలిగాము. “అంటీ మా బొమ్మలేవో ఎలా తెలుస్తాయి?” ఓ సందేహం..
“మీ పేర్లు వ్రాసిన కాగితం ఉన్న ట్రేలు ఉన్నాయి చూడండి. వాటిలో పెడదాం.”
  
పిల్లలు వెళ్ళిపోయాక ఆ గది శుభ్రం చేస్తూ “అయితే రంగులు ఎప్పుడు వేద్దాం?”
“ఓ నాలుగు రోజులకు ఆరతాయి అప్పుడు వేద్దాం.” “అయితే బుధవారం అనుకుందాం, ఉదయం తొమ్మిదికి మొదలు పెడదాం. లంచ్ టైం కి  అయిపోతాయి.” “అలాగే”

“జ్యోతీ బొమ్మలెలా ఉన్నాయి?” రెండు రోజుల తరువాత ఓ ప్రశ్న.
“కొన్ని క్షతగాత్రులయ్యాయి, కొన్ని నీరసంగా నిలువలేమంటున్నాయి, మిగిలినవి బావున్నాయి”
“గ్లూతో అంటించి నిలువలేని వాటి కింది క్లే పెట్టిండి” క్లే పెట్టి చూశాను. అమ్మయ్య కొంచెం పరవాలేదు.


బుధవారం నాడు తోమ్మిదిన్నరకల్లా ట్రేలు, రంగులు, బ్రష్ష్ లు, గ్లూ అన్నీ రెడీ..ముందుగా అన్నిటికీ స్కిన్ కలర్, జుట్టుకి బ్లాక్తో మొదలు పెట్టాం..తరువాత వాటి డ్రస్సులు..




“ఈ బొమ్మ చీరకేం రంగేద్దాం?”
“గ్రీన్ అండ్ ఆరంజ్”
“మంచి కంబిననేషణ్”
“ఆ అబ్బాయికి ఆరంజ్ షర్టు వేశారా, ప్యాంటు బ్లాక్ వెయ్యండి బావుంటుంది”
“మా అమ్మాయి చుక్కల చీర కట్టి౦దోచ్”
“ఈ అబ్బాయి పంచ చూడండి యెంత స్టైల్ గా ఉందో”
“వినాయకుడి పంచ బ్రంహ౦డంగా ఉంది”
“సీత మరీ పొట్టిగా ఉందే”
“ఈ అమ్మాయి అచ్చం వాణీశ్రీ లా లేదూ”
“అయ్యో ఆ అమ్మయికి బ్లౌజ్ వెయ్యడం మరచి పోయ్యామే”
“మా అమ్మాయి మందార పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో”
“కళ్ళు, నోరు ఇలా పెట్టాలి”
“అయిబ్రోస్ కూడా పెట్టాను, బావుందా?”
“చాలా బావుంది”

      ఇలా సరదా కబుర్లు చెప్పుకుంటూ రంగులు వేయడం పూర్తి చేశాం. అయితే మేం ఓ మూడు గంటలనుకున్నది కాస్తా సాయంత్రం నాలుగయింది. చెయ్యాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. రంగులు ఆరితే కాని మిగతా పనవదు. అంతటితో ఆ పూటకు రాత్రి ఆపి, రాత్రి టచ్ అప్ వెయ్యడానికి బొమ్మలను చూస్తే..

“ఏంటి జ్యోతి ఈ అబ్బాయిలు ఏదో డిఫరెంట్గా ఉన్నారు”
"అయ్యో ఈ అమ్మాయి జడ విరిగిపోయిందే"
"డైనోసర్లు రెండు సిగ్గుతో మొహం ఎత్తలేక పోతున్నాయి"

జాగ్రత్తగా మళ్ళీ ఒక్కో బొమ్మను చూసి చేయాల్సిన మార్పులు చేశా౦. అబ్బాయిలకు మీసాలు పెట్టే సరిగి అందంగా తయారయ్యారు. ఆ విధంగా విజయవంతంగా బొమ్మల కొలువు పెట్టేశా౦.   



బాగా నచ్చినవిషయం
అందరూ కూడా అనుకున్న టైం కి రావడం.
పిల్లలు పెద్దలూ అందరూ ఉత్సాహంగా పాల్గొనడం.

ధన్యవాదాలు
అడిగిన వెంటనే ఉత్సాహంగా ముందుకు రావడమే కాకుండా, బొమ్మలు చేయడానికి కావలసిన వస్తువులు, రంగులు అన్నీ తీసుకుని వచ్చిన పెద్ద మనసుకు.  
టీచర్లకు, వాలంటీర్లకు, పిల్లలను సరిగ్గా టైం కి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు.
అల్లరి చేయకుండా బొమ్మలు చేసిన పిల్లలకు.

     మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిమీద ఉంది. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం... 


Wednesday, January 11, 2012

హారం పత్రిక 'సరాగ' లో నా కవిత

      హారం పత్రిక నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో నా కవితకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా హారం పత్రిక సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుకు౦టున్నాను. హారం పత్రిక 'సరాగ' ను ఇక్కడ చూడొచ్చు.

చుక్క పొడిచే వేళకైనా...

మంచుతెరను తొలగించుకొని 
భూమిని తాకిందో రవికిరణం!
ఆనందంతో జంటపక్షులు
ప్రభాతగీతం పాడుతున్నాయి! 
రోజులానే!!

నిదురలేచిన నందివర్ధనం 
మనోహరంగా నవ్వుతోంది! 
రెక్కవిచ్చిన మందార౦
సిగ్గురంగును పులుముకుంది! 
ఎప్పట్లానే!!

ఎండవేళ ఆవు, దూడకు
వేపచెట్టు గొడుగయ్యింది!
కొమ్మ మీది కోయిలమ్మ
కొత్త రాగం అందుకుంది!
నిన్నటిలానే!!

పెరటిలోని తులసికోట
దిగులేదో పెట్టుకుంది!
పోయ్యిలోని పిల్లికూన
పక్కకైనా జరగనంది!

చెండులోని మల్లెమొగ్గ 
పరిమళాలు పంచకుంది! 
వీధి గడప ఎవరికోసమో
తొంగి తొంగి చూస్తోంది!

చుక్కపొడిచే వేళకైనా
తలుపు చప్పుడవుతుందా!!

Monday, January 9, 2012

అమ్మా మన్నుతినంగనే...


        ఆ మూడంతస్తుల భవనంలో మొత్తం తొమ్మిది వాటాలు. మూడొవ అంతస్తులో ముచ్చటగా ఓ చిన్ని కుటుంబం, ఓ అమ్మ, నాన్న, పాప. అప్పుడు సమయం ఉదయం పది గంటలు. గదిలో చిట్టితల్లి లియో టాయ్స్ ముందేసుకుని ఆడుకుంటోంది. అమ్మ వంటింట్లో బెండకాయలు తరుగుతూంది. కాసేపటికి పాప కనిపించలేదు.

చిట్టితల్లీ ఎక్కడున్నావ్?”
ఇక్కలున్నా..
అక్కడేం చేస్తున్నావ్?”
మత్తి తింతున్నా..

అమ్మ పరుగెత్తుకెళ్ళి గోడమూలలో చీమలు పెట్టిన మట్టి దగ్గరున్న పాపను తీసుకుని కుళాయి దగ్గరకెళ్ళి నోరు కడుగుతూ మట్టి యాక్కీ, తినకూడదు నాన్నా
యక్కీ
అవును మట్టి తింటే పొట్టలో పాములు వస్తాయి. ఇంకెప్పుడూ తినకు. పాప పెద్దపెద్ద కళ్ళతో అనుమానంగా చూసింది. అమ్మ చెప్పిన విషయం ఏ మాత్రం నమ్మినట్టులేదు.

     మరోరోజు, ఇంకోరోజు పాప మట్టి తింటూ కనిపించడంతో అమ్మ మట్టి కనిపించిన దగ్గరల్లా కొంచెం కారం కలిపేసింది. ఇంకేముంది పాప కొంచెం నోట్లో పెట్టుకోగానే కారం. అంతటితో ఊరుకుందా మట్టి దొరికే అన్ని ప్రదేశాలకి వెళ్లి రుచి చూసింది. అమ్మ వారం పాటు రోజూ మరచిపోకుండా కారం చల్లింది.

       ఇంతలో సంక్రాంతి పండుగొచ్చింది. పాప, అమ్మ, అమ్మమ్మ గారింటికి వెళ్లేట్టు నాన్న తరువాతొచ్చేట్లు నిర్ణయమైంది. రిక్షా దిగగానే చిట్టితల్లి మొహం సంతోషంతో పుచ్చపువ్వులా విరిసింది. ఎందుకో తెలుసా హైదరాబాదులోలా మట్టి కోసం మూల మూలలా వెతుక్కోనఖ్ఖర్లా ఇక్కడ ఎక్కడ చూసినా మట్టే. అమ్మ చిట్టితల్లి ఆంతర్యం గ్రహించేసి 'మట్టి' ప్రహసనం గురించి అమ్మమ్మ తాతయ్యలకు చెప్పేసింది.  వాళ్ళు పక్కనున్న ఇంకో అమ్మమ్మకు, ఆవిడ వీధిలో వాళ్ళకు ఇలా అందరికీ చెప్పేశారు. దాంతో చిట్టితల్లి 'మట్టి తినడం' గురించి ఊరు వాడా తెలిసిపోయాయి. ఇక కట్టుదిట్టాలు మహా బందోబస్తుగా జరిగిపోయాయి.

     ఒక రోజు ఉదయం తాతయ్య వరండాలో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నాడు. పాప గేటు పట్టుకుని ఆడుతూ ఓపిగ్గా ఎదురుచూస్తోంది. ఎదురుగా ఊరిస్తూ వాకిట్లో బోలెడంత మట్టి.

"తాతయ్యా, ఆపీచుకి వెల్లవా?"
"వెళతానమ్మా" పేపర్ పక్కకు తీసి పాపను చూస్తూ.
"తొందరగా వెల్లూ, లేతుగా వెల్తే మీ మాత్తాలు కొలతాలు."
పెద్దగా నవ్వేసి "నేను వెళితే మట్టి తి౦దామనా" అన్నాడు తాతయ్య.
పాప సిగ్గుగా నవ్వేసింది. ఈ పెద్దవాళ్లకి అన్నీ ఎలా తెలిసిపోతాయో అని ఆశ్చర్యపోతూ... 

      అక్కడున్నంత కాలం పాప మట్టి తినకుండా.....పిన్నులో, మామయ్యలో, తాతయ్యలో ఎవరో ఒకరు ఆ చిన్ని ప్రాణానికి. ఆ విధంగా ఊరిలో కూడా మట్టి తినడం కుదరలేదు. పాపా వాళ్ళు పండుగవగానే తిరిగి హైదరాబాదు వచ్చేశారు.  
                                 *      *    *

      పాపావాళ్ళ బిల్డింగ్లో వున్న తొమ్మిది పోర్షన్లలో బోలెడంతమంది పిల్లలు. దాదాపుగా అందరూ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళే. అందులో మన చిట్టితల్లే చిన్నది. అందువల్ల పిల్లలూ, పెద్దలూ  అందరూ చిట్టితల్లిని చాలా ముద్దు చేసేవారు. రోజూ సాయంత్రాలు పిల్లలు స్కూల్ నుండొచ్చాక  అ౦దరూ టెర్రస్ మీదకెళుతూ చిట్టితల్లిని కూడా తీసుకెళ్ళేవారు.  అమ్మ వాళ్లకు "పాప మట్టితినకుండా చూడమని" బోలెడు జాగ్రత్తలు చెప్పేది. అప్పుడప్పుడూ పైకెళ్ళి తణిఖీలు కూడా చేసేది....పాప చిన్నగా గోడ మూలల్లోని మట్టి తినడం మానేసింది.

       మట్టి తినడమైతే మానేసింది కాని మన గడుగ్గాయి కొత్త మార్గం కనిపెట్టింది. అదేంటంటే గోడకున్న సున్నం నాకడం. అమ్మకు రోజంతా పాపను కాపలా కాయడమే పని. రోజూ లాగే ఆ రోజు కూడా పిల్లలు పాపను మేడపైకి తీసుకెళ్ళారు. అమ్మ రోజూలాగే జాగ్రత్తలు చెప్పింది కూడా..

     ఓ అరగంట గడిచాక, చిట్టితల్లి ఏం చేస్తుందో చూద్దామని అమ్మ పైకి వెళ్ళింది. పైకెళ్ళిన అమ్మ ఆశ్చర్యంగా నిలబడిపోయింది. ఇంతకూ అమ్మకు ఏం కనిపించిందంటారా?

గోడ పొడవునా రెండేళ్ళ చిట్టితల్లికి తోడు పదిమంది పిల్లలు గోడ నాకుతున్న దృశ్యం.




Thursday, January 5, 2012

డెల్లాస్ ప్రయాణం కబుర్లు

       కబుర్లు, పాటలు, సినిమాల మధ్య కారులో పదహారు గంటల ప్రయాణం. ఓ నాలుగ్గంటలు మాకు తోడుగా వర్షం. కారు దిగిన వెంటనే ఆత్మీయుల పలకరింపులు. చెణుకులు, చెలోక్తుల మధ్య పులిహోర, గో౦గోరలతో భోజనాలు, తీపితీపి అరిసెలు. తరువాత రోజు మరో స్నేహితుల ఇంట్లో బ్రంచ్ ఇడ్లీ, వడ, దోశ, ఇదీ అదీ అనేమిటి ఏ పేరు చెప్తే ఆ పలహారం పెట్టేశారనుకోండి.

      'స్టాకీ యార్డ్' లో 'మేజ్' బావుంది, పిల్లల బుల్ ఫైట్లు బావున్నాయి. అందరం వరుసగా నిలబడి తోసుకుని మరీ దున్నపోతుల్ని చూడడం మరీ బావుంది. రామురామన్న పిల్లలుకూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. నలుగురూ కలిస్తే అంతేగామరీ, ఎక్కడున్నా సందడే సందడి.

      మెహందీ పెట్టడం కొత్తగా నేర్చుకున్నానేమో పాప౦ బోలెడుమంది వాళ్ళ చేతులిచ్చి మరీ ప్రోత్సహించారు. చాలా ఏళ్ళ తరువాత పెట్టుకున్న గోరింటాకు చేతిలో ఇంకా ఎర్రగానే ఉంది. ఒక్క రాత్రిలో ఆంటీ హారతి పాట నేర్పి౦చేశారు. ఇక ఎక్కడ ‘హారతి’ మాట వినపడినా నేర్చుకున్న అమ్మాయిలందరూ పాడడానికి చాలా ఉత్సాహ౦గా ఉన్నారట.

     ఈ విహారం పిల్లలకు ఇష్టారాజ్యం....వాళ్ళెప్పటికీ ఈ సెలవలను మరచిపోలేరేమో! ఓ చిట్టితల్లి ఓణీల వేడుకలో చిన్నా పెద్ద అందర౦ సందడిగా గడిపేశా౦. ఆ రాత్ర౦తా కబుర్లు, ఆసక్తికరమైన అనేక విషయాలు అలవోకగా దొర్లిపోయాయి. అందరం ఒకే రకం దుస్తులు వేసుకుని ప్రత్యేకంగా తీసుకున్న పార్క్ లో ఫోటోలు భలేగా ఉన్నాయి.

      ఆఖరి రోజు అన్ని రకాల వంటలున్నా సాంబారు, ఆవకాయతో అందర౦ అన్నం వండి౦చుకుని మారీ, ఇష్టంగా భో౦చేశా౦. ఉదయాన్నే కుర్తీలకోసం చేసిన సరదా ప్రయాణం, దారిలో 'రాయల్ స్వీట్స్' లో తిన్న మసాలా దోసెలు ఇప్పటికీ మురిపిస్తూనే ఉన్నాయి. సాయంత్రం అందర౦ కలసి పలికిన పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం బావుంది. ఆటలు, పాటలు, పద్యాలు, కాలేజి రోజుల ఫోటోలు అన్నీ అలరించాయి.

     చిన్నప్పుడెప్పుడో 'మిసిసిపి' నది గురించి చదువుకున్న జ్ఞాపకం. ఒక్కసారి చూడాలనిపించే కోరిక ఈ ప్రయాణంలో తీరింది. సూర్యాస్తమయంలో అందమైన మిసిసిపిని చూడగలిగాము.

     మైత్రీ వనానికి కొత్త మొక్కలు తోడయ్యాయి. స్మృతి హారానికి కొత్త సొగసులు చేకూరాయి. మాటల మధ్యలో మనసెక్కడో జారవిడుచుకున్నట్టున్నాను, ఇంటికి వచ్చినా అది డెల్లాస్ చుట్టూనే తిరుగుతున్నట్టుగా ఓ చిన్న అనుమానం. పరిచయం లేకపోయినా తప్పక రావాలని పిలిచిన సంస్కారానికి జోహారు. మీరాక మాకెంతో సంతోషమన్న అభిమానానికి ధన్యవాదాలు.

      సర్ప్రైజ్ పేరుతో పంచిన సంతోషానికి శభాషు. వండి వడ్డించిన చేయికి ఆ రుచి ఎన్నటికీ మరువలేమంటున్న ఆప్యాయతలు...కలగలసిన మొన్నటి వారం మదిలో సుస్థిరస్థానం ఏర్పరచుకుంది. కాలాన్ని ఆపగలిగిన గర్వం ఓ చివర తళుక్కుమంటూనే ఉంది. నూతన సంవత్సరం అత్మీయుల మధ్యలో గడపడం మాకో గొప్ప అనుభవం. ఇలాంటి వేడుకలు ఏటేటా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరి దగ్గరా సెలవు తీసుకున్నాము.

Tuesday, January 3, 2012

కౌముదిలో నా కవిత 'ప్రయాణం'

ఉన్న వూరిని కన్న వాళ్ళని చూసి ఎన్నేళ్లయిందో..
ఉరుకులు పరుగుల నుంచి కాస్తంత ఆటవిడుపు!

కనుచూపు మేరలో ప్రయాణం...
అంగళ్లన్నీ తిరిగి... అవీ ఇవీ పోగేశా౦
అటకమీంచి దుమ్ముదులిపి...పెట్టెలేమో సర్దేశా౦!

ఇంకెంత చుక్క పొడిచే లోపే ఊరు చేరిపోతాం..
అయినవాళ్ళ సందిట్లో వేగిరం వాలిపోతాం!

మురిపాలు, ముచ్చట్లు, కౌగిలింతలు, పలకరింపులు..
పేరు పేరునా పలకరించి... కానుకలేవో ఇచ్చేశాం!

తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న
మనకోసమే వేచి వున్నారు మరి!

అదిగదిగో బట్టల దుకాణం, ఆ వైపునేమో సూపర్ బజారు,
ఈ పక్కనే నగల కొట్టు, అటు మూలన బోటిక్కు!

తిరిగేశాం...చూశాశాం ...దొరికినవన్నీ కొనేశాం
అవసరముందో లేదో...అక్కడివన్నీ దొరకవుగా!

హడావిడంతా విచ్చు రూపాయలదే...
ఉన్నచోట ఉండక ఒకటే పరుగులు!

ఆవకాయ, నిమ్మకాయ, మాగాయ, వుసిరి,
సోలెడు పసుపు, తవ్వెడు కారం....
పట్టేసాం..దంచేసాం..మూటలన్నీ కట్టేశా౦!

ఇంకెంత పొద్దు వాలే లోగానే..
తట్ట, బుట్ట, పెట్టె, బేడా
నట్టింట చేరినయ్!

అర్ధరాత్రి జేట్లాగ్ భాగ్యంతో..
ఒంటరిగా కూర్చుని తలచుకుంటే..
ఏవీ కన్నవాళ్ళతో గడిపిన నాలుగు క్షణాలు!
ఈ హడావిడిలో విశ్రాంతి ఏ మూల నక్కిందో మరి!!


నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'జనవరి 'సంచికలో ప్రచురితమైంది.
నా కవితను ప్రచురించిన కౌముది సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.