Monday, December 30, 2013

క్రూజ్ టు బహామాస్

 ఓ సాయంత్రం...

"క్రిస్మస్ సెలవలొస్తున్నాయ్ ఎక్కడికన్నా వెళ్దామా?"
"అబ్బా...చలిలో ఎక్కడికెళతాం?"
"చలిలేని ప్రాంతానికి వెళ్తే సరి"
"కరేబియన్ ఐలెండ్స్" 
"గుడ్ ఛాయిస్"

*                        *                   *                        *                          

బహామాస్ లో సూరీడిని చూడాలని చలువ కళ్ళద్దాలు, పూల చొక్కాలు, రంగుల చెప్పులు అల్లరి పెట్టి మరీ చిన్న పెట్టెలోకెక్కేశాయి. దాచినవి, మది దోచినవి, ముచ్చటగా తెచ్చినవి పెట్టెల్లో సర్దుకున్నాయ్. చిరు జల్లులో తడుస్తూ, పొగలు కక్కుతున్న కాఫీ మగ్గులతో, వెలుగు రాకముందే, వేన్ 'జాక్సన్ విల్' కు బయలుదేరింది. తోడుగా మరో నాలుగు వేన్స్. రాత్రంతా ధారగా పడిన వర్షం, ఊరు చివర వీడ్కోలిచ్చింది.

అల్లంత దూరంలో ఊరంత ఓడ, 'కార్నివాల్ ఫాసినేషన్'. గూడ౦త గదిలో పెట్టే బేడా పెట్టేసి పదో అంతస్తులోని కొబ్బరి తోటకు (కోకోనట్ గ్రోవ్ బార్ & గ్రిల్) చేరిపోయాం. అక్కడే భోజనం. దొరికినవన్నీ చూసేసి నచ్చినదొకటి తినేప్పటికి

'బయలు దేరుతున్నామొహో ' అని పడవ ఈల వేసింది.
దక్షిణం వైపుగా ప్రయాణం. తూర్పు పడమరలను కలుపుతున్నవంతెన, తలకు తగులుతు౦దేమో అన్నంత కిందగా ఉంది. ఓడ మాత్రం జ౦కూ బొంకూ లేక ఠీవిగా ముందుకు సాగిపోతో౦ది. చేపల కోసం వెతుకుతూ నీళ్ళ అంచునే ఎగురుతున్న సీగల్స్, ఒడ్డుకు దగ్గరగా గు౦పులుగా నిలబడి తీరిగ్గా కబుర్లాడుతున్న పడవలు,  


ప్రతి ఇంటి పెరటికి ఓ చెక్క బాట, దాని చివరగా కట్టేసిన బుల్లి నావ.....అన్నీ పదకొండో అంతస్తు నుండి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఒడ్డునే నిలబడి కదిలే ఓడను చూస్తూ ఆనందంగా చేతులూపుతున్న పిల్లల్ని చూస్తుంటే, రైలు గేటు పక్కన టాటా చెప్పిన రోజులు గుర్తొచ్చాయి.   


నీలిమేఘాలను తప్పించుకున్న కిరణాలు ఆకాశానికి అక్కడక్కడా నారింజ రంగులు పులుముతున్నాయి.  చేపల వేట పూర్తయినట్లుంది, ఎటో ఎగిరిపోతూ పక్షులు. 


చిరు చీకట్లు ముసురుతున్న వేళ, దీపాల వెలుగులో మెరిసిపోతున్న డెక్ మీద మినీ గోల్ఫ్ కోర్స్ లో పిల్లలెవరో అప్పటికే ఆట మొదలెట్టేశారు. దాని చుట్టూ వున్న కాలిబాట మీద  నడుస్తూ, జాగింగ్ చేస్తున్న ఔత్సాహికులు. ఓడ చివరలో పెద్ద వాటర్ పార్కు. సుమారు ఓ యాభై మందికి సరిపోయేలా పొందిగ్గా అమర్చిన కుర్చీలు. 


అక్కడి నుండి కిందకు వస్తే లిడో డెక్ మీద స్విమ్మింగ్ పూల్, గ్రిల్ నుండి హాట్ డాగ్స్, హామ్ బర్గర్స్ తెచ్చుకుని పూల్ చుట్టూ వేసిన కుర్చీల్లో సరదా సాయంకాలం. అంత చల్లని వేళా చిన్న గొడుగులో ఒదుగుదామనుకుంటున్న పల్చని అనాస చెక్కను చూస్తూ ఫక్కుమని నవ్వుతున్న పినాకోలాడా. హుషారైన సంగీతం చిందులు వేయిస్తోంది.

చీకటి చిక్కబడగానే అప్పటివరుకు తిరిగిన జీన్స్ లన్నీ, అందమైన ఫ్రాక్స్, స్కర్ట్స్, సూట్స్, రంగు రంగుల చొక్కాలుగా మారిపోయాయి. పదో అంతస్తులోని హాలీవుడ్ బులవాడ్ రంగు రంగుల లైట్లతో కళకళలాడి పోతోంది.

కాఫీ షాప్ ఎదురుగా నవ యవ్వనుల నవ్వుల జల్లులు, కాసినోలో గలగల చప్పుళ్ళు, రెండు ఏనుగుల మధ్య నుండి తొంగిచూస్తున్న 'పాసేజ్ టు ఇండియా', ఎడమ వైపు గదిలో చిత్రకారుల విన్యాసాలను కాన్వాసుపై చూస్తూన్న కళాభిమానుల. వాచ్ లు, టోపీలు, బాగ్ లు, బెల్ట్ లు వాటి గొప్పదనాన్ని చాటే అంకెలు అంటించుకుని షాపు అరల్లో సర్దుకున్నాయి. బారేదో ఉన్నట్లుంది చిరుచీకటిలో గాజు గ్లాసుల తళతళ. 

చివరగా ఐదంతస్తులూ చుడుతూ గుండ్రని ఆట్రియం. ఓ అంతస్తులో స్పా, సెలూన్, మసాజ్ సెంటర్, విశాలమైన సముద్రం చూస్తూ మైళ్ళు మైళ్ళు
అలవోకగా నడిచేయొచ్చనిపించే జిమ్. ఎండవేళ విశ్రా౦తి తీసుకుంటున్న ఇల్లాలిలా నిశ్సబ్దంగా అద్దాల అరల్లో పుస్తకాలు దాచుకున్న లైబ్రరీ. ఇంకో అంతస్త్తులో 'సెన్సేషన్ డైనింగ్ హాల్'. ఆ పైన అంతస్తులో సుమారుగా వెయ్యిమంది కూర్చునే వీలుగా 'పేలస్ థియేటర్', మబ్బురంగుమీద బంగారపు పూల డిజైన్తో  సీటింగ్. అలలమీద తేలుతున్నగుర్తుగా పడవ ఊగుతోంది...

హాలీ వుడ్ బులవాడ్ మరో చివర, ఓ అంతస్తు కిందకు దిగితే 'ఇమాజినేషన్ డైనింగ్ హాల్' లేత కనకాంబర౦ రంగు టేబుల్ క్లాత్స్ తో ఆహ్లాదంగా వుంది. అతిధులను ఆహ్వానించడానికి అక్కడే నిలబడి వున్నాడు మిస్టర్
జోగి, ది రెస్టరెంట్ మేనేజర్. సాలడ్, సూప్, మెయిన్ కోర్స్... కావలసినవి రాసుకుంటూ చెదరని చిరునవ్వుల వెయిటర్స్. 'డేర్ టు ఆర్డర్' కింద రాసిన కనీ వినీ ఎరుగని వింత వంటకాలు. పండుతో పాటు మరి కొందరికి ధైర్యమెక్కువని అప్పుడే తెలిసింది. "అంతా బాగనే వుంది కాని, మా ఉప్పు, పులుపూ మాటేమిటంటే?"  అడిగాం. "రేపటినుండి మీకోసం ఇండియన్ ఫుడ్ ప్రత్యేకమని" జోగి వాగ్దానం. అన్నమాట ప్రకారం అప్పడం, ఊరగాయతో సహా పప్పు, కాబేజీ, వంకాయ, బంగాళదుంప, బఠానీల కూరతోపాటు గోట్, ఫిష్, చికెన్ కూడా టేబుల్ మీద దర్శనమిచ్చాయి.  

సూర్యోదయం, సూర్యాస్తమయ౦ సముద్రంలో చూడబోతున్నామని బోలెడు సరదా పడ్డాం. ప్చ్... తుంటరి మేఘాలు, ఆ సమయాల్లోనే సూరీడ్ని దాచేశాయి. 





ప్రతిరోజు సాయంత్రం గదిలోకి వచ్చేసరికి, టవల్స్ తో చేసిన అందమైన  బొమ్మొకటి వేచిచూస్తూ ఉండేది. 




పిల్లీ ఎలుకల్లా పోట్లాడుకునే జంటల్ని కూడా క్రూజ్ చిలకా గోరింకలుగా మార్చేస్తుంది. నిజమో కాదోనని అనుమానమొస్తే, సాయంత్రం పూట హాలీవుడ్ బులవాడ్ లో ఫోటోలు తీయి౦చుకుంటున్న జంటలను చూడండి. అట్రియం చుట్టూ వరుసగా పేర్చిన ఫోటోల్లో....బీచ్ లోఅందమైన సాయంత్రాన్ని చూస్తున్న కుటుంబం, పియానో మెట్ల మీద చేతులానించిన ప్రియురాలి కళ్ళలోకి అరాధనగా చూస్తున్న ప్రియుడు. గురివింద గింజ రంగులో మెరిసిపోతున్న షా౦డిలియర్ కింద ఒకళ్ళనొకళ్ళు పొదివి పట్టుకున్న పడుచు జంట. పాలనురుగు తెర పక్కన తలగడకు అనుకుని కూర్చున మరో నడివయస్సు జంట. అందరి మొహాల్లో చిందులు వేస్తున్న చిరు దరహాసం... 

*              *              *               *                * 


గాలిపట౦ అలా అలా ఎగురుతున్నప్పుడల్లా ఆకాశంలోఎగరాలనిపిస్తుండేది. ఆ కోరిక 'కీవెస్ట్' లో తీరింది. రంగుల గాలిపటం దారం పట్టుకుని అలా పైకి వెళితే మేఘాలకు దగ్గరగా సముద్రపు అలల మీద వెలుగుల తళుకులు,                                                                               
దూరంగా కనిపిస్తున్న లంకల్లో కొబ్బరి చెట్లు, సరుగుడు తోటలు, ఒక్కసారి కిందకు రాగానే చల్లని నీళ్ళలో తడిసిన పాదాలు, నీటిలో కదిలే చేపలు . పేరాశైలి౦గ్ ఓ కొత్త గమ్మత్తైన అనుభవం. 




అనుకున్న తీరానికి చేరిపోయాం. 'నసావ్' ద్వీపంలో ప్రత్యేక ఆకర్షణ 'అట్లాంటిస్' రిసార్ట్. పిల్లలంతా ఆ రిసార్ట్ వాటర్ రైడ్స్ కి వెళ్ళిపోయారు. అక్కడి నుండి సరుగుడు చెట్ల వెంబడి కాలిబాటలో వెళ్తే ఈ చలికాలంలో కూడా వెచ్చని ఎండలో ఎగిసి పడుతున్న అలలతో నీలంగా అట్లాంటిక్ సముద్రం, 
అంచునే ఎత్తైన కొబ్బరి చెట్లు. కలలతీరంలో అలలు  సుతారంగా ఉంటాయనుకున్నాం గాని ఇవి మహా గడుసువి. కాసింత సేపుంటేనే భయపెట్టి దూరంగా పంపేశాయి.




చెమక్కులు

"అక్కడేవో అమ్ముతున్నట్లున్నారు"
"ఆ.. కొబ్బరి బొండాలు. తెమ్మ౦టావేమిటి?"
ఆ నవ్వేదో తేడాగా ఉంది. అనుమానంగా చూశాను.
"అవేమన్నా గంగా బోండాలనుకున్నావా, తాగితే తల గిర్రున తిరుగుతుంది" 
"ఆ!!!  బీచ్ లో కూడానా "
":)" 

"ఇవాళ మెనూలో గ్రిల్డ్ ఆనియన్ సూప్ ఉంది. ఆర్డర్ చేశాను"
"వెజిటేరియన్ సూపేగా?"
"మీకన్నీ అనుమానాలే. అడిగే చేశాను, పూర్తిగా వెజే"
ఇంతలో పక్కనున్న ఫ్రెండ్ కాదని చెప్పింది. మరో వెయిటర్ ని పిలిచి అడిగాం. "ఇట్ హాజ్ బీఫ్ ఇన్ ఇట్ మామ్" 
ఈలోగా మొదట నాకు చెప్పిన వెయిటర్ వచ్చాడు. 
"అదే౦టయ్యా ఇది వెజిటేరియన్ అన్నావ్, ఇందులో బీఫ్ ఉందట" అడిగాను. 
"ఇట్స్ నాట్ బీఫ్ మామ్, జస్ట్ బీఫ్ స్టాక్"  
తస్మాత్ జాగ్రత్త 

డిన్నర్ తరువాత 
"కాఫీ తాగుదామా?"
"ఏం కావాలో ఆర్డర్ చెయ్యి"
మెన్యూ తీసుకుని చదివాను. దీని పేరేదో భలే ఉందని 'ఐరిష్ కాఫీ' ఆర్డర్ ఇచ్చాను"
చిత్రమైన గ్లాసులో నురగలు కక్కుతూ కాఫీ వచ్చింది. 
"వావ్ భలే ఉంది కదూ" ఒక్క చుక్క తాగాను. ఘాటు నషాళానికి అంటింది. 
:)
ఈ చమక్కు ఇప్పటిది కాదు. మెక్సికో క్రూజ్ ఎన్సినాడా వెళ్ళినప్పటిది. ఆ అనుభవంతో షిప్ లో ఏ లిక్విడ్ కూడా కొనకూడదని అర్ధం అయింది.

నచ్చినవి 


క్రూజ్ ఫుడ్ 
తాజా మెలాన్స్.
వెయిటర్స్ డాన్స్. 
పేలస్ థియేటర్ లో చూసిన కామెడీ షో
నడి సముద్రంలో పుస్తకం చదవడం.
పిక్చర్స్
జిమ్
పద్దెనిమిది నిముషాల్లో కళ్ళముందే, ఐసు బ్లాక్ 'రెడ్ ఇండియన్' లా మారిపోవడం.
పేరాశైలి౦గ్
మంచి స్నేహితులు కలిసారేమో ఈ వెకేషన్ మరింత సరదాగా సాగింది.


ఆఖరులో తెలిసినవి ముందుగా తెలిస్తే బావుండేదనిపించినవి. 

మాలో అచ్చమైన కాఫీ ప్రియులున్నారు. ఇంటిదగ్గర నుండి బ్రూ కూడా తెచ్చుకున్నారు కాని, వేడిపాలు దొరకలేదు. ఓ రాత్రి భోజనాలయ్యాక ఖాళీగా ఉన్న వెయిటర్ని పాలు వేడి చేసి ఇమ్మని అడిగాము. అరగంట తరువాత ఓ రెండు కప్పులు పాలు తెచ్చి ఇచ్చాడు.  ఆరుగురం ఎలాగో సర్దుకుని అర్ధరాత్రి స్ట్రాంగ్ బ్రూ తాగాము. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే రూమ్ సర్వీస్ ఆర్డర్ చేస్తే వేడిపాలు ఇస్తార్ట. 

ఉదయాన్నే ఓ దగ్గర వేడి వేడిగా ఆమ్లెట్ వేస్తుంటారు. కాకపోతే అందులో ఏమేం వెయ్యాలో మనమే చెప్పాలి. మొదటి రోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్" చెప్పాను. సగమే ఉడికిందది. రెండో రోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్ వెల్ కుక్డ్" చెప్పాను. ఈసారి బాగానే ఉడికింది కాని అందులో ఉప్పూ కారం లేవు. మూడోరోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్ అండ్ హాలోపినాస్ వెల్ కుక్డ్" చెప్పాను. అంతా బాగానే ఉంది కాని ఏమిటో ఆమ్లెట్ మరీ మెత్తగా ఉంది. నాలుగోరోజు "ఎగ్ వైట్స్ విత్ వేజీస్ అండ్ హాలోపినోస్ వెల్ కుక్డ్ నో ఛీజ్" చెప్పాను. అయినా ఏమిటో వెలితి. ఐదో రోజు తెలిసిన విషయమేమిటంటే రియల్ ఎగ్ అని కూడా చెప్పాలిట. అప్పటికే ఓడ దిగి కారెక్కేశా౦. 

ఫార్మల్ నైట్ చక్కగా ముస్తాబయి హాలీవుడ్ బులవాడ్ కి రాగానే పిలిచి మరీ రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసేశారు. తరువాత రోజు ఉదయం వచ్చి చూసేసరికి ఫోటోలు బ్రహ్మా౦డంగా వచ్చాయి. ఫోటోలు ఎప్పుడూ బాగానే వస్తాయి, అందులో మేమే బావుండం. ఈసారి మాత్రం మేము కూడా బానే ఉన్నాం లెండి. నచ్చినవన్నీ వరుసగా తీసేసుకున్నాం. తరువాత నుండి ప్రతి సాయంత్రం అక్కడకు వెళ్ళగానే ఫోటోలు తీసేవాళ్ళు, వాటిలో చాలా వరకు బాగా వచ్చాయి. చివర రోజు వరకు ఆగి అన్నీ ఒక్కసారే కొంటే బావుండేదనిపించింది. 

ఐదురోజులు సముద్రం మీద వున్నదానికే, ఇప్పుడు కూడా అంతా ఊగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇంత ఆనందాన్ని పంచడానికి, ఆరునెలలు నేలను చూడకుండా, చిరునవ్వుతో ఆతిధ్యం ఇచ్చిన షిప్ క్రూకి అభిమానంతో....


Tuesday, October 1, 2013

పెద్దయ్యాక నేను...

 మూడేళ్ళ క్రితం పండునెవరైనా “పెద్దయ్యాక నువ్వేం అవ్వాలనుకుంటున్నావ్?” అనడిగితే వెంటనే వాడు ఆకాశం వైపు చూస్తూ “బర్డ్ అవుతా” అని చెప్పేవాడు. ఒక్కోసారి “అక్కనౌతా” అని కూడా అనేవాడనుకోండి. మరి అక్కయితేనే కదా రంగు రంగుల ఫ్రాక్స్, గోళ్ళకు ఎర్రెర్రని నెయిల్ పాలీషు వేసుకుని, ఎంచక్కా కిచెన్ సెట్ తో ఆడుకునేది. మరో ఏడాది తర్వాత అదే ప్రశ్నకి “ఆస్ట్రోనాట్ అవుతా” అని చెప్పాడు. అది వినగానే వాళ్ళ బాబాయి “అయితే మేము ఫ్లోరిడాలో ఇల్లు కొనుక్కుంటాం పండూ, నువ్వు స్పేస్ కి వెళ్ళేప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీలుగా వుంటుంది” అంటూ వాడి నెత్తిమీద చిన్న జెల్లకాయ వేశాడు. ఇప్పుడేమో ఇంటికొచ్చిన తాతయ్యొకరు ఆ ప్రశ్న అడగ్గానే పండు టక్కున చెప్పిన సమాధానం విని, ప్రేమగా కొడుకు తల నిమిరింది వైష్ణవి. వాడేం సమాధానం చెప్పాడో కౌముదికి వెళ్ళి పెద్దయ్యాక నేను...చదివి తెలుసుకుందాం.

Tuesday, September 3, 2013

Wednesday, August 28, 2013

కృష్ణ పాదాలు

      చిట్టితల్లి తన టెడ్డీలన్నిటినీ  సోఫాలో వరుసగా పెట్టి, డైనింగ్ టేబుల్ దగ్గరనుండి ఒక కుర్చీ లాక్కొచ్చి సోఫా ఎదురుగా పెట్టి౦ది. ఆ కుర్చీ మీద ముందుగా రెండు చేతులు, తరువాత ఓ కాలు, ఆ తరువాత మరో కాలు పెట్టి బోర్లా పడుకుని వెనక్కి తిరిగి సరిగ్గా కూర్చుంది. పాదాలు భూమికి ఓ అడుగు ఎత్తులో ఉన్నాయి. ఇప్పుడు చిట్టితల్లి పేరు మిస్ టోనీ. ఎదురుగా వున్న విద్యార్ధులందరినీ  ఒక్కక్క పద్యం చెప్పమని ఆ బొమ్మల బదులుగా తనే పద్యాలు చెప్పింది. ఓ పావుగంట గడిచాక చెప్పడానికి ఇక పద్యాలేవీ మిగల్లేదు. 

       కుర్చీలోనుండి చెంగున కిందకు దూకింది. రోజులా ఘల్లుమనే చప్పుడు వినిపించలేదు. మళ్ళీ రెండుసార్లు జింక పిల్లలా చెంగు చెంగున గెంతింది. ఏమీ వినిపించలేదు. ఒ౦గి పాదాల వైపు చూసుకుంది. తెల్లగా బొద్దుగా చిన్ని పాదాలున్నాయి కాని, వాటినంటి పెట్టుకునుండే గజ్జెలు మాత్రం లేవు. ఎలా వుంటాయి? నిన్న పార్కులో ఒక గజ్జ పోయిందని అమ్మ రెండోది కూడా తీసేసిందిగా. చిట్టితల్లి ఎంత ఏడ్చినా ఒక గజ్జే పెట్టుకుంటే కాళ్ళజెర్రి కుడుతుందని లోపల దాచిపెట్టేసింది కూడానూ. చిట్టితల్లికి గజ్జలంటే చాలా ఇష్టం. చిట్టితల్లి గజ్జలంటే వాళ్ళ నాన్నక్కూడా చాలా ఇష్టం. తేలికైన లేతరంగు గౌనులు వేసుకుని, ఘల్లుఘల్లుమ౦టూ చిట్టితల్లి ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళ నాన్నకు ఎంతో బావుంటు౦దట.  

      చిట్టితల్లి మెల్లగా పడగ్గదిలోకి వెళ్ళింది. వెండి వస్తువులు అమ్మ ఎక్కడ పెడుతుందో ఆమెకు తెలుసు. నేరుగా క్లోజెట్ తలుపు తీసింది. లోపల వున్న అరలలో బట్టలన్నీ పొందిగ్గా మడతలు పెట్టి వున్నాయి. వాటిని చూడగానే చిట్టితల్లికి గొప్ప ఆలోచన వచ్చింది. ఒక వరుసలో కింద ఉన్న టవల్ కొస పట్టుకుని లాగింది. ఆ వరుసలోని బట్టలన్నీ జారి ఒకదానిమీద ఒకటి కుప్పలా కింద పడిపోయాయి. అందులోనుండి రెండు టవల్స్, కొన్ని కర్చీఫ్స్ తీసుకుని రెండు చేతులతో గుండెలకు హత్తుకుని వచ్చి హాలు మధ్యగా పడేసింది. టవల్ చుట్టూ తిరుగుతూ నాలుగు వైపులా లాగి సరిగ్గా పరిచి ఒక్కో టెడ్డీని పడుకోబెట్టి వాటిమీద కర్చీఫ్స్ కప్పింది. వాటిని మెల్లగా జో కొడుతూ కాసేపట్లోనే అన్నిట్నీ నిద్రపుచ్చేసింది.  

    ఈలోగా వంటి౦ట్లోనుండి ఏవోవో శబ్దాలు వినిపించడంతో మెల్లగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడన్నీ గిన్నెలు, గరిటెలు, రకరకాల సరుకులు, కూరగాయలు వాటి మధ్యలో అమ్మ. ఎంచక్కా వాటితో ఆడుకు౦టున్న అమ్మను చూస్తే చిట్టితల్లికి బోలెడు అసూయ కలిగింది. మెల్లగా ఒక గిన్నె గరిటె తీసుకుని టంగ్ మనిపించగానే అమ్మ, చిట్టితల్లి చేతిలోంచి గిన్నెతీసి పక్కన పెట్టి ఆమెనెత్తుకుని హాల్లోకి వచ్చి, బెటర్ బ్లాక్స్ డబ్బాలోంచి తీసి కిందపోసి వాటిపక్కనే చిట్టితల్లిని కూర్చోబెట్టి౦ది. రిమోట్ తో టివి ఆన్ చేసి హడావిడిగా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. 

      టివిలో ఏదో కార్టూన్ వస్తోంది. చిట్టితల్లికి అది చూడాలనిపించలేదు. బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెడుతూ రెండు పొడవాటి భవనాలు కట్టింది. చిట్టితల్లి చూస్తుండగానే అవి రెండూ పెద్ద శబ్దంతో డాం అని పడిపోయాయి. వాటికేసి దిగులుగా చూసింది. ఆ బ్లాక్స్ మీదకు పెరటి వైపు నుండి ఎండ ఏటవాలుగా పడుతోంది. అక్కడ ఏదో కదిలినట్లయి పెరటివైపుకు చూసింది. పక్షొకటి ఫెన్స్ మీద నిలబడి అటూ ఇటూ గెంతుతూ కిందకు దూకాలని చూస్తోంది. దాని నీడనే చిట్టితల్లి చూసింది. చిట్టితల్లి పరిగెత్తుతూ అటు వెళ్ళి, తలుపు వేసివుండడంతో బయటకు వెళ్ళే వీలులేక అద్దం మీద చేతులు ఆన్చి పక్షిని తదేకంగా చూసింది. అది ఒక్కసారిగా కింద మొక్కల దగ్గరకు ఎగిరొచ్చి ఓ నిముషం పాటు మట్టిలో కెలికి ఏదో పొడుచుకుని తిని ఎగిరిపోయింది. పెరట్లో నిశ్సబ్దంగా వున్న మొక్కలు మాత్రమే మిగిలిలాయి. 

    టివిలో కార్టూన్ పూర్తయి 'లిటిల్ బేర్' మొదలైంది. ఆ ప్రోగ్రాం అంటే చిట్టితల్లికే కాదు వాళ్ళమ్మక్కూడా చాలా ఇష్టం. రోజూ వాళ్ళిద్దరూ కలిసే ఆ ప్రోగ్రాం చూస్తారు. ఇప్పుడు మాత్రం అమ్మ వచ్చే సూచనలేమీ కనిపించట్లేదు. చిట్టితల్లి కాళ్ళు చాపుకుని సోఫాకు ఆనుకుని కూర్చుని ఓ అరగంట కదలకుండా చూసింది. 

     ఇంతసేపైనా అమ్మ హాల్లోకి రాలేదు, ఏం చేస్తోందోనని మెల్లగా పిల్లిలా అడుగులు వేస్తూ వంటగదిలోకి వచ్చింది చిట్టితల్లి. అమ్మ స్టవ్ మీద నాలుగు గిన్నెలతో చతుర్దావధానం చేస్తోంది. సాంబార్ మరిగిన వాసనతో వంటగది ఘుమఘుమలాడుతోంది. కౌంటర్ మీద ఒక పక్కగా పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు పెట్టివున్నాయి. కొన్నిట్లోనుండి సన్నసన్నగా ఆవిర్లు వస్తున్నాయి. చిట్టితల్లికి వాటిల్లో ఏమున్నాయో చూడాలనిపించింది. కౌంటర్ తనకన్నా ఎత్తుగా ఉండడంతో చూసే అవకాశం లేదు. కుర్చీ ఎక్కి చూడొచ్చు గాని అమ్మ ఉన్నప్పుడు కుర్చీ ఎక్కితే పడిపోతావని తిడుతుంది. రోజులా ఏదైనా గిన్నె బోర్లించి ఎక్కాలని చూసింది. పెద్ద గిన్నెలన్నీ కౌంటర్ మీదే వున్నాయి. డిష్ వాషర్ కి ఆనుకుని నిలబడి కాసేపు అలోచించి రెండు చేతులతో గిన్నెను పైకెత్తి ఒంచి చూసింది. 

       గిన్నెలోని తెల్లని పదార్ధం ధారగా చిట్టితల్లి తలను అభిషేకించింది. అమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి చిట్టితల్లి కనిపించలేదు తెల్లని చిన్న కొండ సాక్షాత్కరించింది. ఏమైందో అర్ధం అవడానికో అరనిముషం పట్టిందామెకు. అర్ధమయ్యాక ఆ గిన్నెలో సాంబారు కాకుండా దోశ పిండి వున్నందుకు చాలా సంతోషించింది. ఆ అవతారం చూసి గట్టిగా నవ్వేస్తూ చిట్టితల్లి చేతిలోని గిన్నె తీసి సింక్ లో పెట్టింది. అంతవరకూ అమ్మ తిడుతుందేమోనని భయంగా చూస్తున్న చిట్టితల్లి అమ్మ నవ్వడంతో పిండి తుడుచుకుంటూ గట్టిగా ఏడవడం మొదలెట్టింది. చిట్టితల్లిని బాత్ రూమ్ లోకి తీసుకెళ్ళి షవర్ కింద నిలబెట్టి శుభ్రంగా స్నానం చేయించి౦దమ్మ. చిట్టితల్లి నడిచినంతమేరా తెల్లని చిన్న పాదాలు, చిన్ని కృష్ణుడు నడిచి వచ్చినట్లు కృష్ణ పాదాలు కనిపించాయి అమ్మకు. 

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Monday, August 5, 2013

బుజ్జిపండు ఇండియా టూర్!

బుజ్జిపండు భారత దేశానికి వెళ్ళాట్ట. కౌముదికి వెళ్ళి బుజ్జిపండు ఇండియా టూర్ కబుర్లు విందామా...


Friday, July 12, 2013

నాన్నమ్మ

అదేందా మీరింకా ఈడ్నే ఉండారే. బుజ్జిపండోళ్ళ నాన్నమ్మ వచ్చిళ్ళా. కౌముదికి బొయ్యా పలకరించొద్దాం పాండి... 



Sunday, June 2, 2013

టూత్ ఫెయిరీ

 “స్కూల్ టైం అవుతోంది, త్వరగా బ్రష్ చేసుకునిరా. బ్రేక్ ఫాస్ట్ చేద్దువుగాని” సీరియల్ డబ్బా అరలోంచి తీస్తూ చెప్పింది వైష్ణవి. 
“నేనివాళ స్కూల్ కెళ్ళను” హై స్టూల్ మీద కూర్చున్నాడు బుజ్జిపండు. 
“ఎందుకు?” ఆశ్చర్య౦గా అడిగింది. 
“ఇవాళ మనం షాప్ కి వెళ్దామమ్మా, నేను షూస్, వాచ్ కొనుక్కుంటాను” 
“అలా స్కూల్ మనేయకూడదు రెండు రోజుల్లో వీకెండ్ వస్తోందిగా, అప్పుడెళ్దాం. నాక్కూడా ఆఫీస్ కి టై౦ అవుతోంది త్వరగా తయారవు నాన్నా” బతిమలాడింది వైష్ణవి. 
వాడికి బడి అనగానే స్నేహితులందరూ గుర్తొచ్చారు, టూత్ ఫెయిరీ వాడికి డాలర్లు ఇచ్చిన విషయం వాళ్ళతో చెప్పాలనిపించింది. ప్రసాద్ పాత పర్సు తీసుకుని డబ్బులు అందులో దాచిపెట్టుకుని బడికెళ్ళాడు.
టూత్ ఫెయిరీ ఎవరు? పండుకు ఏమిచ్చింది? దానితో పండు ఏం చేశాడు? కౌముదికి వెళ్ళి విశేషాలన్నీ తెలుసుకుందాం.











Saturday, May 11, 2013

వాహిని


మా ఊరి వాహిని పత్రిక 

         పిల్లలు, అన్ని విషయాల్లో పెద్దవాళ్ళను అనుకరిస్తూ ఉంటారు. మనం తెలుగు చదవడం నచ్చిన వాటిని పిల్లలకు చదివి వినిపించడంలో పిల్లలకు మన భాష మీద ఆసక్తి పెరుగుతుంది. ఎదురుగా పుస్తకం కనిపిస్తూ ఉన్నప్పుడు చదివే అలవాటులేని వారు కూడా తప్పకుండా పుస్తకం చదువుతారు. ఇలాంటి ఆలోచనలోంచి పుట్టిందే మా 'వాహిని.' 

        పత్రిక కోసం ఇంత అందమైన బొమ్మను వేసిచ్చిన పాణి గారికి, తమ రచనలను ఇచ్చిన రచయితలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పత్రికను సమీకరించి అందంగా తీర్చిదిద్దిన సంపాదకులకు ప్రత్యేక ధన్యవాదాలు.


వాహిని పత్రికలను ఇక్కడ చదవొచ్చు.

Monday, May 6, 2013

తెలుగు నాడిలో నా కథ 'ప్చ్...నాకంత అదృష్టమా!'

      ఝాన్సీ కాఫీ తాగుతూ కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంది. ఆకాశం మబ్బుపట్టి ఉందేమో వేసవికాలం అయినా ఆరుగంటలకే చీకట్లు ముసురు కుంటున్నాయి. రోడ్డుమీద అప్పుడో కారు ఇప్పుడో కారు వెళుతున్నాయి. రోజూ సాయంత్రాలు వీధిలో ఆడుకునే పిల్లలెవరూ ఆ సమయంలో కనిపించలేదు. ముందుగదిలో లైట్ వేసి కిటికీతెర వేసేసింది ఝాన్సి. భర్త, పిల్లలు సెలవలకు ఇండియా వెళ్ళడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడడంతో ఝాన్సీకి వెళ్ళడానికి కుదరక ఆమె అమెరికాలోనే ఉండిపోయింది.

     ఆ గదిలో ఒక మూల స్టాండ్ పైనున్న పింగాణి కుండీలోని 'డ్రాగన్ ట్రీ' ఆకులు చివరలు ఎండిపోయి ఉ౦డడం గమనించి మగ్ తో నీళ్ళు తీసుకునివచ్చి పోసింది. అలాగే ఇంట్లో ఉన్న మిగతా మొక్కలకు కూడా నీళ్ళు పోసి వాటి ఆకులమీద నీళ్ళు చల్లి, వాడిపోయిన 'ఆఫ్రికన్ వైలెట్'  పూలను తీసేసింది. నిశ్శబ్దంగా వున్న ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చెక్కనేల మీద తన అడుగుల చప్పుడు తనకే పెద్దగా వినిపిస్తోంది. ఆ పనవగానే సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. ఓ పావుగంట చూసిన తరువాత తననెవరో గమనిస్తున్నట్లుగా అనిపించిందామెకు.

       మెల్లగా తల తిప్పి చూస్తే పెరటి వైపునున్న కిటికీలన్నీ తెరచివున్నాయి, బయట లీలగా చెట్లు తప్ప మరేమీ కనిపించలేదు. ఇంట్లో వాళ్ళతో వెళ్ళకుండా ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితులను తిట్టుకుంటూ లేచి వెళ్ళి అన్ని కిటికీలు వేసి, తెరలు దించి టివి చూడాలనిపించక కొడుకు గదిలోకి వెళ్ళి అరమర సర్దడం మొదలు పెట్టింది. అక్కడ పిల్లలిద్దరూ దాచుకున్న 'యూగియో కార్డ్లు', 'కాయిన్ కలెక్షన్' పుస్తకం కనిపించాయి. వాళ్ళ వస్తువులు చూస్తున్న కొద్దీ వాళ్ళ మీద మరీ బెంగగా అనిపించి కూతురి గదిలో ఉన్న కంప్యూటర్ లో పవర్ ఆన్ చేసి పాటలు పెట్టి౦ది. సర్దడం పూర్తవగానే వాల్యూమ్ బాగా పెంచి వంటగదిలోకి వెళ్ళింది. ఇంటికి మధ్యగా పెద్ద హాలు, హాలుకు ఒక పక్కగా మూడు పడగ్గదులు, రెండో వైపున డైనింగ్ హాలు దాని వెనుక వంటగది ఉండే ఆ ఇంట్లో వంటగది వరకూ పాటలు వినిపించాలంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టక తప్పదు. ఉదయం చేసిన పప్పు, దొండకాయ వేపుడుతో భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మోగింది. పాటల శబ్దంలో అవతల వాళ్ళు చెప్పేది వినిపించక, పాప గదిలోకి పరిగెత్తి కంప్యూటర్ పాజ్ లో పెట్టి ఫోన్ చేసిన రాగిణితో మాట్లాడుతూ భోజనం ముగించేసరికి రాత్రి ఎనిమిదయింది. 


       కిటికీలూ, తలుపులన్నీ వేసివున్నాయో లేదో మరొక్కసారి చూసి, సెల్ ఫోనూ, మంచినీళ్ళ గ్లాసు తీసుకుని సెక్యూరిటీ అలారం ఆన్ చేసి పడగ్గదిలోకి వెళ్ళింది. గ్లాసు, ఫోన్ మంచం పక్కనే ఉన్న నైట్ స్టాండ్ మీద పెట్టి తలుపు గడియవేసి తలుపునోసారి లాగి చూసి౦ది. ఉదయం నుంచి ఆ గదిలో కిటికీలు మూసి వుండడం వల్ల ఉక్కగా అనిపించి కిటికీ తలుపులు తెరువబోయి, తాను ఒంటరిగా ఉన్న విషయం గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుని ఫాన్ ఆన్ చేసి మంచం మీద వాలి రాత్రి సగం చదివిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. ఆ నిశ్శబ్దం, ఒంటరితనంలో చదవాలనిపించక పుస్తక౦ మూసి పక్కన పెట్టింది. హోరున గాలి వీస్తున్నట్లు౦ది, బయటనుండి వింత శబ్దాలు మొదలయ్యాయి. కొంచెం సేపు ఆలకించి మంచం దిగి మెల్లగా కిటికీ దగ్గరకు వచ్చి తెర తొలగించి చూసింది. ఆ చీకట్లో పెరట్లో వున్న పెద్ద ఆలివ్ చెట్టు ఊగిపోతూ భయకంరంగా కనిపించింది. 

      అంతవరకూ ఉన్న ఒంటరితనానికి భయం తోడయ్యింది. ఇలా ఒక్కర్తే ఉండడం ఝాన్సీకి అస్సలు అలవాటు లేదు. అందులోనూ వర్షం రాత్రి.., ఇప్పుడు కరంట్ పోతేనో అనుకుని మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంది. పక్కన ఇంటి వాళ్ళతో కొద్ది పరిచయం ఉన్నా ఏ రాత్రన్నా అవసర౦ పడితే పిలిచేంత చనువు లేదు. పోనీ ఏ స్నేహితులింటికి వెళదామన్నా వర్షం చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో ఝాన్సి భయానికి తగ్గట్టుగా కరంట్ పోయింది. గాలికి పెరట్లో చెట్లు ఊగుతున్న శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. కిటికి మీద వర్షం పడే శబ్దంకూడా చీకట్లో భయం గొలిపేలా ఉంది. గదిలో ఫాన్ ఆగిపోవడంతో మరీ ఉక్కగా ఉంది. సుమారుగా అరగంట తరువాత కరెంట్ వచ్చింది. ఝాన్సీకి టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉండడంతో టివి రిమోట్ లో స్లీప్ మోడ్ కి టైమర్ పెట్టి టీవీ చూస్తూ పడుకుంది. కాసేపటికి మాగన్నుగా నిద్ర పట్టింది.

"ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
ముట్టుకుంటే ముడుసుకు౦టావ్ అంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసి౦దిలే "


        ఉలిక్కిపడి నిద్ర లేచింది ఝాన్సీ. ఒక్కక్షణం తనెక్కడుందో అర్ధం కాలేదామెకి. తను ఒంటరిగా వున్నదన్న విషయం గుర్తురాగానే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. "టైం చూస్తే రాత్రి రెండయింది, ఇంట్లో తనొక్కతే ఉంది. మరి పెద్దగా వినిపిస్తున్న ఆ తెలుగు పాట ఎక్కడినుండి వస్తున్నట్టు? పోనీ బయటెక్కడి నుండో వినిపిస్తు౦దా అనుకుంటే ఇంటి పక్క ఇళ్ళవాళ్ళంతా అమెరికన్లు." అలా ఆలోచిస్తూ వెంటనే ఇండియాలో ఉన్న భర్తకు ఫోన్ చేసింది.

"హలో ఏంట్రా ఈ టై౦లో ఫోన్ చేశావ్...ఇంకా పడుకోలేదా?" అడిగాడు విక్రం.
"పడుకున్నాను. ఇప్పుడే మెలుకువ వచ్చింది."
"ఇప్పుడే బయటకు వెళదామనుకు౦టున్నాం. ఇంతలో నువ్వు ఫోన్ చేశావు" ఝాన్సీ గొంతులోని కంగారు గమనించక చెప్పుకుపోతున్నాడు విక్రం.
"మనింట్లో పెద్దగా పాటలు వినిపిస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది."
"పాటాలా...పాటలేంటి?" అయోమయంగా అడిగాడు.
"అదే నాకూ అర్ధం కావట్లేదు."
"రాత్రి పాటలు పెట్టి మరచిపోయి నిద్ర పోయుంటావ్." 
"నిన్న సాయత్రమెప్పుడో కంప్యూటర్లో పెట్టాను. తరువాత పాజ్ చేశాను. ఎవరూ కదిలించకుండా ఇప్పుడెలా వస్తున్నాయవి?" సందేహం వెలిబుచ్చింది ఝాన్సి.
"కంప్యుటర్ దగ్గరకు వెళ్ళి చూడోసారి."
"అమ్మో నాకు భయం. నేను వెళ్ళను."
"సరే పడుకో అయితే ఉదయాన్నే చూడొచ్చు"

"అసలు మీకు కొంచెమన్నా కంగారు లేదు. అర్ధరాత్రి ఇంత పెద్ద శబ్దంతో పాటలు వస్తుంటే 'ఎవరు పెట్టారా?' అని నేను భయంతో చచ్చిపోతుంటే సింపుల్ గా 'పడుకో పొద్దున్న చూడొచ్చని' చెప్తారా" భయంతో పాటు కోపం కూడా తోడయ్యింది.
"మరి ఎలా? పోనీ సాగర్ వాళ్లను పిలుస్తావా వాళ్ళొస్తారు."
"ఒద్దులెండి, అసలేమయిందో తెలియకుండా మరీ అర్ధరాత్రి ఎలా లేపుతాం. ఉదయం దాకా మీరే ఇలా మాట్లాడుతూ ఉండండి" చెప్పింది ఝాన్సి.
"ఏమిటీ! ఉదయం దాకానా? నాకు ఫరవాలేదు కానీ నీకే సమస్య, రేపు నువ్వు వర్క్ కి వెళ్ళాలి కదా. ఒక్కసారి వెళ్ళి చూడు పాటలు ఎక్కడినుండి వస్తున్నాయో, సెక్యురిటీ అలారం ఆన్ చేసే ఉందిగా భయం లేదులే"

     ఈ కబుర్లలోనే ఓ పావుగంట గడిచింది. పాటల శబ్దానికి పక్క వాళ్ళు లేస్తారేమో అని ఒకపక్క ఝాన్సీకి కంగారుగా ఉంది. ఏమైతే అదయిందని వెళ్ళిచూడడానికే నిశ్చయించుకుని సెల్ ఫోన్ లో '911' నొక్కి చేతిలో పట్టుకుంది. అవసరమై టాక్ బటన్ నొక్కితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు లైన్ లోకి వచ్చి ఇక్కడ జరుగుతున్నది మాటల ద్వారా తెలుసుకుంటారని ఆమె ఉద్దేశం. 


     ఇక్కడ ప్రమాదం జరుగుతుందని తెలిసిన వెంటనే ఐదు నిముషాల్లో పోలీసులొస్తారన్న భరోసాతో "సరే మీరు లైన్ లోనే ఉండండి" అని విక్రం కి చెప్పి 'బహుశా ఇదేనేమో తను చేసే ఆఖరి కాల్' అనుకుంటూ మెల్లగా తలుపు తీసి బయటకు తొంగిచూసింది ఝాన్సి. అనుమాని౦చదగ్గ దృశ్యాలు కాని, భయానక దృశ్యాలు కానీ లేక అంతా మామూలుగా ఉంది. పాటలు పెద్ద శబ్దంతో పాప గదిలోనుండి వినిపిస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా కూతురి గది తలుపు తీసింది. ‘ఏ అగంతకుణ్ణి చూడాల్సివస్తుందో, ఏ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందో’ అనుకుంటూ లైట్ వేసింది. ఆశ్చర్యం! గదిలో ఎవరూ లేరు కిటికీ కూడా మూసే ఉంది. కంప్యుటర్ నుండి పెద్దగా పాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ శబ్దానికి ఫోన్ లో అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినపడడం లేదు. కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి పాటలు ఆపింది ఝాన్సి. 

      "ఇక్కడెవరూ లేరు కాని కంప్యుటర్ నుండే పాటలు వస్తున్నాయి." చెప్పింది. ఝాన్సీ తో సరదాగా మాట్లాడుతున్నాడు కాని విక్రంకి కూడా కంగారుగానే ఉంది. "ఎలా వస్తున్నాయి పాటలు ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారా? పోలీసులను పిలవకుండా తప్పు చేస్తున్నామా" ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఝాన్సీకి కింద పడి ఉన్న ఫైర్ అలారం కనిపించింది. "ఏవ౦డీ ఇక్కడ ఫైర్ అలారం కింద పడు౦ది." ఆన్నది.

      ఏం జరిగిందో అర్ధం అయ్యింది విక్రమ్ కి. "నువ్వు సాయంత్రం పాటలు పాజ్ లో పెట్టానన్నావుగా. ఆ తరువాత ఆ ఫైర్ అలారం కీ బోర్డు మీద పడడంతో పాజ్ లో ఉన్న బటన్ ఆన్ అయి పాటలు వచ్చాయి" చెప్పాడు విక్రం. జరిగిన విషయం అర్ధమై సమస్య ఏమీ లేదని తెలిశాక మనసు తేలికపడింది ఝాన్సీకి. ఈ ఫోన్ హడావిడి వల్ల ఇండియాలో ఉన్నఇంట్లో వాళ్ళందరకూ విషయం తెలిసి అందరూ ఝాన్సీతో మాట్లాడారు. అంతకుముందు వరకు భయం కలిగించిన విషయం కాస్తా సరదాగా మారింది. 


      ఏం జరిగి ఉంటుందో ఆలోచించకుండా ఏవేవో ఊహించుకుని తను భయపడి వాళ్ళను భయపెట్టినందుకు సిగ్గుగా అనిపించిది ఝాన్సీకి. రెండు వారాలుగా ఒంటరిగా ఉంటున్నా, నిన్న సాయంత్రం వాతావరణం, పరిస్థితులు కలిగించిన అనుమానం తనలో భయాన్ని పెంచినట్లుగా గుర్తించింది. అయినా కూడా ఎవరినీ పిలిచి ఇబ్బంది పెట్టకుండా కొంతవరకూ ధైర్యాన్ని ప్రదర్శించి వెళ్ళి చూసినందుకు గర్వంగానూ అనిపించిందామెకు. అలా ఆలోచిస్తూ ఆ తెల్లవారుఝామున నిశ్చింతగా నిద్ర పోయింది ఝాన్సి. 

     విక్రం, పిల్లలు ఇండియా నుండి వచ్చిన తరువాత ఒక ఆదివారం ఈ విషయమంతా గుర్తుతెచ్చుకుని నవ్వుకున్నారు. “ఇప్పుడు తలచుకుంటే సరదాగా వుంది కాని, ఆ రాత్రి తలుపు తీసేప్పుడు పేపర్లో చదివినవి, టివిలో చూసిన వార్తలన్నీ గిర్రున తిరిగాయి నా జీవితలో ఆఖరి రోజన్న నిర్ణయానికి కూడా వచ్చేశాను” అంది ఝాన్సి. "ప్చ్ నాకంత అదృష్టమా" అంటూ ఉడికించాడు విక్రం. 

ఈ కథ 'నాటా మాట' లోనూ 'తెలుగు నాడి' లోను ప్రచురి౦చబడింది.

Thursday, May 2, 2013

కుక్క కావాలీ!

బుజ్జిపండు "కుక్క కావాలీ" అంటూ ఓ రోజు అమ్మతో గట్టిగా చెప్పేశాడు. అక్కకూడా ఏదో ఒక పెట్ కావాలని చెప్పింది. అమ్మకేమో పెట్స్ అంటే అస్సలిష్టం లేదు. వాళ్ళేం చేసారు? 

వివరాలన్నీ కౌముదిలో చదువుకుందాం. 



Sunday, April 28, 2013

వాహిని పత్రికలో నా కథ 'మెంతి చెట్లు'

       మార్చి నెలాఖరి రోజులు, ఏటవాలుగా పడుతున్న నీరెండలో రాత్రి చలికి వణికిన చెట్లన్నీ వెచ్చగా చలి కాచుకుంటున్నాయి. విశాలమైన ఆ ఇంటి పెరట్లో పచ్చని తివాచీ పరిచినట్లు గడ్డి మొలిచివుంది. దూరంగా చెక్కతో కట్టిన ప్రహరీకి ఒక పక్క రంగురంగుల గులాబీలు విరబూసి ఉన్నాయి. వాటి పక్కన అప్పుడే నాటిన బంతి, మందారం, కనకాబరం మొక్కలు లేతగా, పసిపాప నవ్వులా నిర్మలంగా వున్నాయి. మరోవైపు చెర్రీ, పీచ్, ఆపిల్ చెట్లు తెలుపు, గులాబీ రంగులు కలగలసిన పువ్వులను అలంకరించుకుని వసంతాగమనానికి తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ పక్కనే ఎత్తుగా పెరిగిన చెట్టు కొమ్మల్లోoచి నారింజలు సిగ్గుగా చూస్తున్నాయి.

     పెరటిలో దక్షిణపు వైపు మట్టి తొవ్వి నేలను చదును చేస్తున్నాడు నాన్న. బుజ్జి పండు, అక్క చిన్న చెంబుతో నీళ్ళు పట్టి గులాబీ మొక్కలకు పోస్తూ ఇటు అటు పరుగులు పెడుతున్నారు. వాళ్ళిద్దరూ నీళ్ళు మొక్కలకు పోసేలోపు సగం నీళ్ళు ఒంటి మీదే పడుతున్నాయి. ఈలోగా అమ్మ విత్తనాల పొట్లం, చిన్న గిన్నె తీసుకుని పెరట్లో ఈశాన్యం మూలగా ఉన్న పింక్ జాస్మిన్ పందిరి దగ్గరకు వెళ్ళింది. అమ్మ వెనకాలే వెళ్లాడు పండు.

"అమ్మా"
"ఊ..."
"నువ్వేం చేత్తున్నావ్?"
"పువ్వులు చూస్తున్నాను నాన్నా?"
"ఎందుకు?"
"ఎందుకంటే..అందంగా ఉన్నాయి కదా అందుకు"
"ఓ...మలి పచ్చి?" ఆకాశం వైపు చూపిస్తూ అడిగాడు.
"అది కూడా అందంగా ఉంది"
"చైకిలు?" అన్నాడు దూరంగా వున్న తన బుజ్జి సైకిల్ని చూపిస్తూ.
"బుజ్జిపండు సైకిలు కదా అది కూడా చాలా అందంగా ఉంది" పండు నెత్తుకుని ముద్దుపెట్టుకుని చిన్న గిన్నెలోకి పువ్వులు కోయడం మొదలెట్టింది.

"అమ్మా నేనూ కోత్తాను". పువ్వును ఎలా పట్టుకుని కోయాలో చెప్పింది. పండు ఒక్క పువ్వును పట్టుకుని లాగగానే పసిమొగ్గలు కూడా తెగిపోయాయి. అమ్మకసలే పూలంటే ప్రాణం. పండును కిందకు దించి “చిట్టితల్లీ పండును పిలువమ్మా” అని అక్కతో చెప్పింది.
"పండూ ఇలా రా సైకిల్ ఆట ఆడుకుందాం" పిలిచింది అక్క. పండు దగ్గరకు రాగానే " నీ సైకిల్ లాన్ లోకి రాకూడదు, నా సైకిల్ ఫ్లోర్ మీదకు రానివ్వను" అని చెప్పి సైకిల్ మీద గుండ్రంగా తిరగడం మొదలెట్టింది. 


     పండు తన మూడుకాళ్ళ సైకిలు మీద తిరుగుతూ అక్కని చూస్తున్నాడు, అక్కని అలా సైకిలు మీద చూడడం వాడికి చాలా ఇష్టం. పూలు కోయడం అవగానే అమ్మ పూలగిన్నె గట్టు మీద పెట్టి విత్తనాల పొట్లం తీసుకుని నాన్న చదును చేసిన దగ్గరకు వెళ్ళింది. పిల్లలిద్దరూ కూడా అమ్మ వెనకే వెళ్ళారు.

“చిట్టితల్లీ బకెట్తో కొంచెం నీళ్ళు తీసుకురామ్మా” అంటూ అక్కను పురమాయించింది. “నేను తెత్తా..నేను తెత్తా” అ౦టూ చిన్న చెంబులో నీళ్ళు తీసుకుని అక్కకంటే ముందు పరిగెడుతూ అమ్మ దగ్గరకు వచ్చాడు పండు. 

     అమ్మ మట్టిలో ఒక పక్కగా కూర్చుని జాగ్రత్తగా విత్తనాల పొట్లం విప్పి అందులో వున్న గో౦గూర విత్తనాలు వరుసగా చాళ్ళలో చల్లింది. స్క్వాష్, బీన్స్, వంకాయ విత్తనాలను చిన్న చిన్న కుండీలలో వేసింది. గోడవారగా బెండ విత్తనాలు ఒకదానికొకటి అడుగు దూరంలో వేసింది. టమేటో, మిరప విత్తనాలను నాలుగైదు వరుసలలో నారు పోసింది. అమ్మ చేస్తున్న పనిని ఆసక్తిగా గమనించాడు పండు. 

రకరకాల రంగుల్లో, ఆకారాల్లో వున్న వాటిని చూపిస్తూ “అవేంతి?” అనడిగాడు. “విత్తనాలు నాన్నా. అవి పెరిగి పెద్దై బోలెడు కూరగాయలు కాస్తాయి.” చెప్పి౦దమ్మ. 
“ఏం కాయలు?” అడిగాడు పండు.
“బీరకాయలు, వంకాయలు, బీన్స్, టమాటో, మిరపకాయలు....” అని చెప్తూ చల్లిన విత్తనాలపైన మట్టికప్పింది.
పండుకు నమ్మకం కలగలా. ఆ కూరగాయలేమో పచ్చగా, ఎర్రగా అంత పెద్దగా వున్నాయి, ఇవేమో ఇంత బుల్లిగా నల్లగా వున్నాయి. ఒక బీర విత్తనం, కొంచెం మట్టి తీసి అమ్మ చూడకుండా జేబులో వేసుకున్నాడు.
“ఆ చెట్టు కూడా విత్తన౦ వేస్తేనే మొలిచింది కదూ!” మూలగా వున్న పెద్ద ఆలివ్ చెట్టును చూపిస్తూ అడిగింది అక్క.
“ఆ అలానే మొలిచింది.” అక్క చూపించిన వైపుగా చూస్తూ చెప్పి౦ది. బుజ్జిపండు పైకి చూస్తూ వెనక్కి నడిచి చెట్టు పైనున్న చిటారుకొమ్మ కనిపించేవరకూ వెళ్ళాడు.

“ఎవరు వేశారు?”
“అంతకు ముందు ఇక్కడ వున్న వాళ్ళెవరో వేసి ఉండొచ్చు, లేకపోతే గాలికి విత్తనం యెగిరి అక్కడ పడి కూడా మొలిచి ఉండొచ్చు” చెప్పాడు నాన్న.

      పండు చుట్టూ చూసాడు గాలికి కొమ్మలు ఊగుతున్నాయి, ఆకులు అటూ ఇటూ తిరుగుతూ కింద పడుతున్నాయి, కాని ఎక్కడా విత్తనాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. పెరట్లో మరోవైపు ఏవో రాలుతున్నట్లనిపించి అక్కడకు వెళ్ళాడు. తెల్లని ఆపిల్ పూలరెక్కలు గాలికి జలజలా రాలుతున్నాయి. నేలమీద పడకుండా పూల రెక్కలు పట్టుకుంటూ, దొరికిన వాటిని తలమీద వేసుకు౦టూ ఎందుకొచ్చాడో మరచిపోయాడు.

     “పండూ నీళ్ళు పోద్దువురానాన్నా” అమ్మ పిలుపు వినిపించింది. పరిగెత్తుకుంటూ అమ్మదగ్గరకు వెళ్ళాడు. విత్తనాలు నాటిన ప్రదేశంలో పిల్లలతో నీళ్ళు పోయించి౦దమ్మ. నాన్న మొక్కలు నాటిన గుర్తుగా అక్కడ చిన్న జండా పాతాడు. తరువాత అమ్మ, నాన్న ఇద్దరూ మొక్కల దగ్గర నీళ్ళు నిలవడానికి వీలుగా పాదులు చేశారు. వాళ్ళా పని చేస్తున్నంత సేపూ పండు జేబులో చెయ్యి పెట్టి విత్తనం బీరకాయలా మారుతుందేమో చూస్తూనే వున్నాడు.

“ఇక మెంతులు వేద్దామా? అడిగాడు నాన్న.
వంటగది పక్కగా వున్న రెండడుగుల పొడవు అడుగు వెడల్పు వున్న స్థలాన్ని చూపిస్తూ “అక్కడే కదూ?” అడిగిందమ్మ.
“ఆ...అక్కడే పోయిన సారి కూడా చాలా బాగా వచ్చాయి. పైగా కిటికీలో నుండి బాగా కనిపిస్తుంది కూడాను.” చెప్పాడు నాన్న.

     అమ్మ ఒక చిన్న పుల్ల తీసుకుని వచ్చి అక్కడ నేలలో గీతలు గీయడం మొదలెట్టింది. అమ్మ తనలాగా మట్టిలో ఆడుకోవడం చూసి బోలెడు ఆశ్చర్యపోయాడు పండు. మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఒంగి అమ్మ వైపు చూస్తూ “ఏం చేత్తున్నావ్?” అడిగాడు.
“నీ పేరు రాస్తున్నాను నాన్నా” .
“పిచ్చమ్మ...ఎవలైనా ‘మాగ్నా డూడిల్’ మీద లాత్తారు కాని మత్తిలో లాత్తాలేమిటి?” అనుకుని “అక్కలెందుకు లాచావు?” అడిగాడు.
“పోయిన సారి అమ్మ ఇలాగే నేలమీద నా పేరు రాస్తే అక్కడ మొక్కలొచ్చి పచ్చగా నా పేరు కనిపించింది గుర్తుందా!“ మోహం వెలిగిపోతుండగా చెప్పిందక్క. 

     పండుకు అక్క చెప్పిన విషయం గుర్తు రాలేదు కాని అక్క మోహంలో సంతోషం చూసి ఏదో మంచి సంగతే అనుకుని గట్టిగా చప్పట్లు కొట్టాడు. అక్కకి కొన్ని మెంతులిచ్చి ఆ చాళ్ళలో వరుసగా దగ్గర దగ్గరగా చల్లించిందమ్మ.

“నేను కూలా ఏత్తాను” అంటున్న పండు చేతికి కొన్ని మెంతులిచ్చి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా గీతల్లో పడేలా వేయించింది. దానిపైన కొంత మట్టి, నీళ్ళు చల్లి నిలబడి తృప్తిగా చూసుకు౦ది.
పండు దాని చుట్టూ తిరుగుతూ, “భలే భలే ఇప్పులు నా పేలు కూలా మొలుత్తుందా”? అమ్మని అడిగాడు.
“చక్కగా మొలుస్తుంది, నువ్వు ఇక్కడ తొక్కకుండా ఆడుకోవాలి మరి.”
“ఓ...అచ్చలు తొక్కను” చెప్పాడు పండు.

     మధ్యాహ్నం అవడంతో ఎండ తీవ్రత హెచ్చింది. ఉదయం నుండి పనిచేస్తున్నారేమో అమ్మ, నాన్న పిల్లలను తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నీళ్ళు చల్లుతూ మొలకలు కనిపిస్తాయేమోనని ఎదురుచూస్తున్నారు. ఓ వారం తరువాత మెంతి విత్తనాలు వేసిన దగ్గర నేల పచ్చపచ్చగా కనిపించింది. మరునాటికి అక్కడంతా బుల్లిబుల్లి మొక్కలు మొలిచాయి. పండు అలా పచ్చగా మొలిచిన బుల్లి మొక్కలను ఆశ్చర్యంగా చూశాడు. అక్క ఆ మొక్కలను చూస్తూ ‘బుజ్జిపండు’ అని చదివింది. కొత్త మొక్కలను చూసి బోలెడు సరదా పడిపోయారు అందరూను. ఇంటికి వచ్చినవాళ్ళందరినీ బుజ్జిపండు పెరట్లోకి తీసుకెళ్ళి మె౦తి మొక్కలతో రాసిన తన పేరు చూపించాడు.

      ఓ ఆదివారం సాయంత్రం అమ్మ, నాన్న సినిమా చూస్తున్నారు. పండు, అక్క బ్లాక్స్ పెట్టుకుని ఆడుకుంటున్నారు. ఇంతలో సినిమాలో విమాన౦ వెళ్తున్న శబ్దం వినిపించింది. పండుకు అదంటే బోలెడిష్టం పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఒళ్ళోకూర్చున్నాడు. టివిలో రెండు కొండల మధ్య ఆకాశంలో ఎగురుతూ వున్న విమానం కనిపించింది కింద౦తా ఆకుపచ్చని చెట్లు, వాటి మధ్యగా నది కూడా కనిపించాయి. ఆ విమానం వెళ్ళే వరకు చూసి “నాన్నా ఆ చెత్లన్నీ ఇత్తనాలేనా” అడిగాడు.

“అవును నాన్నా, భలే గుర్తు పెట్టుకున్నావే” అంటూ పండుకు ముద్దిచ్చాడు నాన్న.
“నేను పెద్దయ్యాక ఎలోపెన్లో అకాచంలో ఎల్తున్నప్పులు ఫారెత్ లో బుజ్జి పండు అని కనిపిత్తుంది కదా!” అన్నాడు. నాన్నకు అర్ధం కాలేదు. “ఎక్కడ నాన్నా ఏ ఫారెస్ట్ లో?” అని అడిగాడు.
“మనం బోలెడు ఇత్తనాలు ఏచాం కదా అవి పె......ద్దై పైనుంచి చూత్తే ఫారెత్ లాగా అయి అప్పులు బుజ్జిపండు కనిపిత్తుంది.” అంటూ నమ్మకంగా పండు చెప్పిన మాటలకు అమ్మ, అక్క పెద్దగా నవ్వారు. అమ్మ పండును ఎత్తుకుని రెండు బుగ్గలమీద ముద్దులు కురిపించింది.

      ఆ తరువాత ఎప్పుడు మెంతులు చల్లినా అమ్మకు ఆకాశంలో వెళ్తున్న విమానం, కింద అడవిలో ‘బుజ్జిపండు’ బుల్లి బుల్లి ఆకుల మెంతి చెట్లు కనిపించేవి. 

వాహిని పత్రికను ఇక్కడ చదవొచ్చు. 

Wednesday, March 20, 2013

ముఖాముఖి

"శర్కరీ"
"ఊ..."
"మల్లీశ్వరి గారు చిన్న ముఖాముఖి  ఏర్పాటుచేశారు"
"ఎవరిదీ?"
"ఎవరిదంటే..."
"తెలిసి౦ది లేవోయ్...నీదే కదూ"
"నాది కాదు మనది"
"మనదా?"
"ఆ మనదే...మన గురించి నాలుగు మాటలడిగారు"
"అన్నీ సరిగ్గా చెప్పావా లేక..."
"అబ్బే.... అడిగినవాటన్నటికీ సూటిగా సమాధానాలు చెప్పాను"
"అందరికీ చక్కని పేర్లిస్తున్నారట. నిన్నేమన్నారేమిటి?"
"'బుద్దిమంతురాలినని మెచ్చుకున్నారు"
"నీ గురించి నాకు తెలియదా...నిజంగా బుద్దిమంతురాలివే"
"   :-)  "
"సరే వచ్చినవాళ్ళకు జాజిమల్లి బ్లాగుకు దారి చూపించు" 

ఇలా ముఖాముఖి వెంట వెళ్ళామనుకోండి జాజిమల్లి బ్లాగుకు వెళ్ళొచ్చు.

రెండు మెట్లు పైకెక్కుతున్నామంటే నాలుగు మెట్లు కిందకులాగే ప్రయత్నాలు చేస్తున్న ఈ రోజుల్లో చెయ్యిపట్టి నిచ్చెన ఎక్కిస్తున్న మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేయడం చిన్నమాటే అవుతుంది. మనసులో భావాన్ని తెలుపడానికి నాకంతకంటే పెద్దపదం తెలియదు. నన్ను పరిచయం చేస్తునందుకు మల్లీశ్వరి గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 



Sunday, March 17, 2013

వ్యసనాల వలన ఉపయోగాలు

"వ్యసనాల వలన ఉపయోగాలా..మతీ గితీ కాని పోయిందా ఏం?" అనుకుంటున్నారా. అబ్బే అలాంటిదేం లేదండి. వ్యసనం అంటే వదలలేనిదట. ఎలాగూ వదలలేంగా సప్తవ్యసనాలకు కొన్ని మార్పులు చేసుకుని అలాగే కొనసాగిద్దాం. పుణ్యం పురుషార్ధం రెండూ దక్కుతాయి. 

వేట: కౄరమృగాలు మారుమూల అడవుల్లో ఎక్కడో దాక్కునేవి ఒకప్పుడు. ఇప్పుడు వీధుల్లో ముసుగు వేసుకుని తిరుగుతున్నాయి. వేటాడి వేటాడి రేపటి తరం నిర్భయంగా బ్రతికేలా చేద్దాం.

జూదం: ఈ వ్యసనాన్ని తప్పకుండా పెంచుకోవలసిందే, చిన్న తేడాతో.....ఎప్పుడూ ఒకటే ఆట అయితే బోర్ కొడుతుంది కూడానూ... ఇవాళ మార్కెట్లో నలుగురూ కలసి ఆడుకోగలిగిన బోర్డు గేమ్స్ ఎన్నో వున్నాయి. కుటుంబంతో కలసి ఈ వ్యసనాలకు బానిసలౌదాం. జీవితం చివరి అంకంలో ఒంటరినని వగచే దుస్థితి కలుగదు. 

పరస్త్రీ వ్యామోహం(కామము):  హద్దులు దాటి పోస్టర్ల మీద అర్ధనగ్నంగా నిలబడుతోంది, వెండితెర మీద తైతక్కలాడుతోంది, అందాల పోటీల్లో విలువలొదిలేసింది, వెబ్ సైట్ల లో వలువలు విడిచేసింది. కళ్ళు మూసుకుపోయి అన్నింటినీ చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నాం. అభినవ కీచకుల్ని తయరుచేస్తున్నాం. 

క్షణికమైన ఆనంద౦ కోసం అడ్డదారి తోక్కేబదులు శాశ్వతమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి రాజమార్గం వెతుకుదాం. రవంత ప్రేమ, ఆదరణ కోసం అలమటించే జీవితాలు ఎన్నో! సోదరభావంతో ఆసరా ఇద్దాం...అక్కున చేర్చుకుందాం. కొండంత అభిమానం మనదౌతుంది. 

మద్యపానం: ఒకప్పుడు తప్పుగా పరిగణింపబడేది. నేడు నాగరికతా చిహ్నంగా చెప్పబడుతోంది. వ్యసనం మనల్ని బానిసలుగా చేసుకున్నదనడానికి పరాకాష్ఠ ఇది. మద్యం తీసుకుంటూ మనస్సుకు ముసుగేసుకుని తప్పొప్పుల గీత చెరిపేస్తున్నాం. రేపటి తరానికి మంచి చెడు చెప్పే అర్హత కోల్పోతున్నాం. 

మనసును జోకొట్టే మద్య౦ మాని మానసికానందాన్ని కలిగించే చిన్నపని ఎంత చిన్నపనైనా సరే చేస్తే అది ఎంతటి తృప్తిని ఇస్తుందో కదా!  

ధనం(వృధా చేయడం): సొంతలాభం కొంతమాని పొరుగువారికి సాయపడదాం. సంపాదించిన దానికన్నాఎక్కువ తృప్తి కలుగుతుంది. 

పరుషంగా మాట్లాడడం(దుర్భాష): అన్యాయాన్నిఎదిరించే ప్రతిసారి మన వాక్కు ఇలానే ఉండాలి. 

పరుషంగా దండించడం(క్రౌర్యం): తప్పొప్పులకు సరైన నిర్వచనం ఇచ్చి, తప్పు చేసిన వారికి ఇది తప్పదంటే ఇక దండిచాల్సిన అవసరం రాదేమో.

ఆచరించడం సాధ్యం కానిపని అంటున్నారా... మన బ్రతుకు మరో క్షణంలో ముగిసిందనుకోండి, సమస్యే లేదు. ఏ పక్షవతమో వచ్చి మంచంమీద రోజులు గడపవలసి వచ్చినప్పుడు మనం చేసిన తప్పులకు మన మనసే పెద్ద శిక్ష వేస్తుంది. బ్రతికుండగానే నరకం చూపిస్తుంది. దిద్దుకోవడానికి కాలం వెనక్కి తిరగదుగా...

మనస్సు కోతిలాంటిదట. నిరంతరం జ్ఞానబోధ చేస్తూ దారిలో పెట్టుకోవాలి. మొదటి ఇరవై సంవత్సరాలు సంపాదించడానికి అవసరమైన చదువుల కోసం వినియోగిస్తున్నాం. ఆ తరువాత జీవనప్రవాహంలో కలసి ఆ వేగానికి కొట్టుకుపోతున్నాం. ఫలితం...గొర్రెదాటు వ్యవహారం. ఎవరేది చేస్తే అదే ఆచరించడం, అదే మంచిదనుకోవడం. నేడు ఏ ఇల్లు చూసినా అందంగా అలంకారాలు కనిపిస్తున్నాయి కానీ, మానసిన వికాసానికి అవసరమైన పుస్తకం ఒక్కటి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించడంలేదు. "పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గది వంటిది"ట. 

మనం చేసిందే గొప్ప అని వాదనలకు దిగుతాం.... ఓ పక్క అనుమానం పీడిస్తూనే వుంటుంది. ఆ అనుమానన్ని నివృతి చేసుకోవడానికో, మెప్పుదల కోసమో ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్ లకు అలవాటు పడుతున్నాం. మనం ఏదో నలుగురికి చెప్పాలనో మన గొప్ప చూపాలనో ఏదో ఓ మాట అంటాం, నలుగురు లైక్ కొడతారు. మనం పెట్టింది చదివారో లేదో, చూసారో లేదో కూడా తెలియదు. లైక్ లు చూసి పొంగిపోతాం. మన మనసును సమాధాన పరచడానికీ, జోకొట్టడానికీ కదూ ఈ వ్యవహారాలన్నీ. ..

ఒక చిన్న పనిచేసి నలుగురికోసమే బ్రతుకుతున్నట్లుగా కబుర్లు చెపుతాం. పేపర్లో ఫోటో వేయించుకుంటాం. ఫేస్ బుక్ లో అప్డేట్స్ పెడతాం. అందుకు అవసరమైతే ఒక హత్యనో, మానభంగాన్నో ఆయుధంగా వాడుకుంటాం. మనల్ని మనం ఎంత అవమానించుకుంటున్నామో అర్ధరాత్రి నిశ్శబ్దంలో  అర్ధమౌతూనే ఉంటుంది. 

యుద్ధం చేద్దాం నిజమైన ఆనందం కోసం...నికార్సయిన జీవితం కోసం. 

Tuesday, March 5, 2013

వికసించిన పువ్వు


       అప్పుడే వర్షం పడిందేమో ఆకులన్నీ తడితడిగా పచ్చగా మెరుస్తున్నాయ్. వర్షం బరువుకు వాలిన గులాబీ నుండి నీటిచుక్క నేలమీదకు జారుతో౦ది. చూరు నుండి నీళ్ళు ధారగా పడుతున్న చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న గాలికి మేపల్ ఆకులు మెల్లగా కదులుతున్నాయ్. మేఘాల మాటునున్న సూరీడు ఒక్కో కిరణాన్ని గురిచూసి పంపుతున్నట్లుగా ఏటవాలుగా పడుతోంది నీరెండ. వర్షం వెలిసిన తరువాత మాత్రమే కనిపించే అరుదైన వెలుగుతో మెరిసిపోతోందా ప్రదేశం. కిటికీలోంచి ఆ సౌందర్యాన్ని చూస్తూ టీ తాగుతోంది రాధిక.

“వెదర్ చాలా బావుంది కదూ” ఎప్పుడొచ్చాడో ఆమె వెనుక నిలబడి వున్నాడు మోహన్.
 చిన్నగా నవ్వింది. “కాసేపలా బయట కూర్చుందామా?”

       తలుపు తెరిచి బయటకు రాగానే చల్లగాలి ఆహ్లాదంగా పలకరించింది. గోడ వారగా అల్లుకున్న జాజితీగ మెల్లగా ఊగుతోంది. తీగలో అక్కడక్కడా విరిసిన పూలు నక్షత్రాల్లా వున్నాయి. వీధిలో అప్పుడో కారు ఇప్పుడో కారు వెళ్ళడం తప్ప పెద్ద హడావిడేమీ లేదు. ఇద్దరూ వరండాలో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

"ఇంత తీరిగ్గా ఇలా బయట కూర్చుని చాలా రోజులయింది కదూ!”
“ఊ... ఆ గోవర్ధనం చెట్టు చూడండి వెన్నెల పువ్వులను కొప్పులో ముడుచుకున్నట్లు లేదూ.. “   
ఆమె చూపించిన వైపు చూశాడు. ముదురు ఆకుపచ్చని ఆకుల మధ్య తెల్లని పువ్వులు. మాట రానట్లుగా చూస్తూ ఉండిపోయాడు. బ్రతకడానికి జీవించడానికి మధ్య తేడా...
కాళ్ళు రెండూ పైకి పెట్టుకుని సర్దుకుని కూర్చుంటూ అడిగింది “చెప్పండి ఏంటి కబుర్లు?"
"లైఫ్ ఈజ్ గుడ్" పువ్వు మీదనుండి చూపు మరలస్తూ ఆమె వైపు తిరిగాడు.
"ఏమిటీ....." కనుబొమలు ముడిచింది.
"నేను మొదలెట్టిన కొత్త కథ టైటిల్" చిన్నగా నవ్వాడు.
“ఓ...కథా...అయితే ఈసారి మీ కథలో కష్టాలేమీ లేవన్నమాట”
“అవి లేకపోతే ఇక కథే౦ ఉందీ...”
కారు శబ్ద౦ విని పక్కకు చూశాడు. దూరంగా విజయ, కావేరి వీధి మలుపు తిరుగుతూ కనిపించారు.
"మీ ఫ్రెండ్స్ వాక్ చేస్తున్నారు, నువ్వూ వెళ్తావా?"  
"లేదులే ఈ మధ్య విజయ ఎందుకో అదోలా ఉంటోంది. నాతో సరిగా మాట్లాడ్డమే లేదు" చిన్నబోయిన మొహంతో చెప్పింది.
"ఎందుకు.... ఏమైంది?" ఆశ్చర్యపోయాడు మోహన్.

       మోహన్ ఆశ్చర్య పోవడానికి కారణముంది. వాళ్ళా ఇంటికి మారి రెండేళ్ళవుతోంది. విజయ వాళ్ళు ఆ పక్క వీధిలోనే ఉంటారు. పరిచయమైన దగ్గరనుండీ రాధికకు, విజయకు బాగా స్నేహం కుదిరింది. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళుతుంటారు. అటువంటిది ఈ రోజు రాధిక ఇలా చెప్పడం....

ఈ మధ్య నేను వాకింగ్ కి పిలిచిన ప్రతిసారీ బిజీగా ఉన్నానని చెప్తుంది. కొంచెం సేపటి తరువాత వేరెవరితోనైనా వాక్ చేస్తూ కనిపిస్తోంది" చెప్పింది రాధిక. తనూ పక్కకు చూస్తూ ఉండడంతో రాధిక మోహంలో భావమేదీ కనిపించలేదు మోహన్ కి.

“ఏమైందో నువ్వడగలేదా?”
మౌనంగా ఉండిపోయింది. తను ఫోన్ చేసినా  తామిద్దరి మధ్య సంభాషణ రెండు మాటలు తరువాత తడుముకోవలసి వస్తుందన్న విషయన్ని అతనికి చెప్పలేదు. 
"కారణం మెల్లగా తెలుస్తుందిలే, అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో." అతనే అన్నాడు.
నేనూ అలాగే అనుకున్నాను, కానీ..వద్దులెండి విషయమేదైనా, నాకు మీ క్లాస్ తప్పదు." అంటూ ఆపేసింది. భర్తకు విషయం చెప్పాలని లేదు రాధికకు, అర్ధం చేసుకోకపోగా అనవసరంగా అలోచిస్తున్నావంటాడతను.
"అలా ఎందుకనుకుంటావ్ సమస్యకు మరో కోణం అనుకోవచ్చుగా”
"చూశారా, విషయం తెలియకుండానే మొదలెట్టారు.అంది కొంచెం కినుకగా.
సారీ సారీ, నువ్వు పూర్తిగా చెప్పేంతవరకూ మాట్లాడను, చెప్పు.” 

      "పోయిన నెలలో ఓ రోజు పక్కవీధిలో కొత్తగా వచ్చిన రేణుకను పరిచయం చేద్దామని అందర్నీ టీకి పిలిచాను. కబుర్ల మధ్యలో కావేరి "ఏమైనా కొత్త పుస్తకాలున్నాయా?" అని అడిగింది. ఈ మధ్య ఇండియా నుండి తెప్పించిన పుస్తకాలు, పత్రికలూ ఇచ్చాను. తనకు తెలుగు భాషన్నా, సాహిత్యమన్నా చాలా ఇష్టమని మీకు తెలుసుగా. ఇవ్వగానే పుస్తకాలు అలా తిరగేస్తూ పత్రికలో బహుమతి వచ్చిన మీ కవిత చదివి చాలా బాగుందని మెచ్చుకుంది. మిగిలిన వాళ్ళు కూడా మీకు అభినందనలు చెప్పమన్నారు. ఆ రోజే మీకా విషయ౦ చెప్పాను గుర్తుందిగా! ఆ తరువాత ఓ రోజు రేణుక ఫోన్ చేసి వాళ్ళింటికేవో కొనాలని పిలిస్తే, విజయ వాళ్ళ చిన్నబాబుకు జ్వరంతో ఉండడంతో తనకు రావడానికి కుదరక నేనొక్కదాన్నే తనతో కలసి షాపింగ్ కి వెళ్ళాను.. ఆ తరువాత కూడా మేమో రెండు సార్లు అలాగే వెళ్ళాము. మరోసారి అందరం కలసినపుడు రేణుక మొక్కల గురించి మాట్లాడుతూ మనింట్లో మొక్కలు చాలా అందంగా ఉన్నాయంది. ఆ తరువాత నుండీ విజయ ప్రవర్తనలో మార్పు గమనిచాను." సుదీర్ఘంగా చెప్పింది రాధిక.

"నువ్వేదో అపోహ పడుతున్నావ్ రాధీ...." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న మోహన్ని మధ్యలో ఆపేసింది.
"మీరలాగే అంటారని తెలుసు, అందుకే ఈ విషయం మీతో ఇన్నాళ్ళూ చెప్పలేదు. తను కావేరితో ఏమన్నదో తెలుసా... ఆ బహుమతి వచ్చిన మీ కవిత ఏదో ఇంగ్లీష్ కవితకు అనువాదం అని చెప్పిందట."
"అవునా....అలా ఎందుకు చెప్పిందబ్బా" కోపం పాలు కొంచెం ఉన్నా ఆశ్చర్యమే ఎక్కువ కనిపిచింది మోహన్ స్వర౦లో.
“నాకూ అదే అర్ధం కాలేదు.”
"ఏమయినా, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలు కావేరి నీతో చెప్పకుండా ఉండాల్సింది." తన ధోరణిలో అన్నాడు మోహన్.

"తనకై తాను చెప్పలేదు. ఒక రోజు విజయ, నన్ను తప్ప అందర్నీ భోజనానికి పిలిచింది, ఆ రోజు నాకు చాలా బాధనిపించి౦ది. నావల్ల తెలియకుండా ఏమైనా పొరపాటు జరిగిందేమో దిద్దుకు౦దామని కావేరితో మాట్లాడాను. అప్పుడు తను చెప్పిన విషయాలు నిన్నాక నాకు బాధకంటే కూడా ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది."

"ఏం చెప్పిందట విజయ?" కుతూహలంగా అడిగాడు మోహన్.
"ఏవైతేనేం లెండి, అవన్నీ అప్రస్తుతాలూ, అసత్యాలూనూ. విన్న కావేరికి, నాకూ కూడా తెలుసా విషయ౦."
"మరెందుకోయ్ బాధ?" అనునయంగా అడిగాడు.
"బాధ నన్నేదో అన్నదనికాదు. అసలెందుకలా అని, మేమిద్దరం అంత స్నేహంగా ఉండేవాళ్ళమా కొన్ని విషయాల్లో నేను తనకంటే భిన్నంగా ఉండడం, దానివల్ల అందరూ మనల్ని మెచ్చుకోవడాన్ని చూసి భరించలేకపోయి౦దా.." బాధగా అంది.  

"కొంతమంది మనస్థత్వం అంతే రాధీ, మనమేం చెయ్యలేం. కానీ ఎవరు చేసిన తప్పు వారికి తెలుస్తుంది. ఈ అబద్దాలన్నీ నీటిమీద రాతలే..నిలకడ మీద నిజాలు అందరికీ తెలుస్తాయి."

       "విజయ అన్ని విషయాలూ చక్కగా ఆలోచించగలిగి, ఈ అసూయతో, దాన్ని జయించలేని అసమర్ధత వల్ల అల్లిన అబద్దాలతో, తన వ్యక్తిత్వానికి తనే తీరని కళంకం తెచ్చుకుంది. ఒక్కసారి తను మాట్లాడినవి అబద్దాలని తెలిశాక ఎవరైనా తన మాటలు నమ్ముతారా.. తను తీసుకున్న గోతిలో తనే పడుతుంది కదా అన్నదే నా బాధ౦తానూ”.

"మనసులో అసూయ కలగడం సహజం రాధీ...కాని బుద్ది దాన్ని నియంత్రి౦చగలిగినప్పుడు సమస్య అనేదే తలెత్తదు. మా మామయ్య ఎప్పుడూ ఓ మాట చెపుతుండేవారు."
"ఏమనో..." విషయం మోహన్ తో పంచుకోవడంతో మనసు కొంచెం తేలికపడగా అడిగింది రాధిక.
"ప్రతి వ్యక్తి దగ్గర్నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి" అని చెప్పాడు.
"ఈ విషయంలో ఏం నేర్చుకుంటాం...ఇక్కడ నేర్చుకోకూడనిదే ఉంది కదా" ఖాళీ కప్పును పక్కన పెట్టింది.
"నేర్చుకోవలసి౦ది ఉంది రాధీ, కొంతమందిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, మరి కొంతమందిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి". గాలికి కదులుతున్న రాధిక ముంగురులు చూస్తూ చెప్పాడు.
"అంటే ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలన్నమాటఅంది నవ్వుతూ.
సరిగ్గా చెప్పావు, అప్పుడే మనసు బుద్ది రెండూ కలసి పనిచేస్తాయి..... 

నిన్నో విషయం అడిగితే బాధ పడావుగా?”  
“ఏమిటో చెప్పండి”
“కావేరి నీతో అబద్దం చెప్పి ఉండొచ్చుగా..”
“మీకెందుకలా అనిపించింది?”
“మన గురించి తనలా చెప్పినప్పుడు కావేరి కూడా దూరంగా ఉండాలి. అలా కాకుండా ఆ ఇద్దరూ మామూలుగా ఉన్నారంటే... ”
“అదా ... కోరి ఎవరూ పక్కవారితో వైరం తెచ్చుకోరు, ప్రమాదకరమైన వ్యక్తులేతే తప్ప. విజయ అంత ప్రమాదకరమైన వ్యక్తి కాదనుకుందేమో...అయినా వాకింగ్ కి వెళ్ళినంత మాత్రాన ఏమవుతుంది?”
“అలా అని కాదు మన విషయంలో అబద్దం ఆడింది కదా..తన విషయంలో కూడా...”
“తెలిసిందిగా...జాగ్రత్త పడుతుంది. ఇంత ఆలోచన ఎందుకూ... మన విషయంలో తనకేదో నచ్చలేదనుకుంటే పోలా...”
“నీకేమీ బాధనిపించదా?”

“ఎందుకనిపించదు...పుట్టిన ఊరికి, దేశానికి చాలా దూరంలో ఒంటరి జీవితం గడుపుతున్నాం. ‘ఒంటరి’ అన్నానని అపార్ధం చేసుకోకండి. మనసులో మాట చెప్పుకోవాలంటే దూరానున్నవారికి ఇక్కడ పరిస్థితి అర్ధం కాదు, పరిచయమైన వాళ్ళతో బంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది ఇలాంటివి ఎదురైనప్పుడు చాలా బాధగానే ఉంటుంది...” ఇద్దరూ కాసేపు ఆలోచనలో ఉండిపోయారు.

“చిన్ని జీవిత౦... అపోహలు, అపార్ధాలు మనసులో పెట్టుకుంటే ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదించగలమా...”  తనలో తాను అనుకున్నట్లుగా అంది రాధిక.

“గోవర్ధనం పూవు తెల్లగా కనపడాలంటే బుద్ది వికసించాలి మరి”  
“గోవర్ధనానికా...?”  
“ఎవరికో తెలియకే అడిగావా?” 
సమాధానం చెప్పకుండా నవ్వేసింది.
"నువ్వు నాకు నచ్చావ్" ఆన్నాడు. 
"మరో కథ టైటిలా?”
కాదనట్లు తల అడ్డంగా ఊపాడు.
“ఇంత అర్ధాంతరంగా నచ్చడానికి కారణమేంటో "
"తను నీ పట్ల సరిగ్గా ప్రవర్తించక పోయినా కూడా కోపం తెచ్చుకోక ఇలా ఆలోచించావు చూడు అందుకే"
"మన పెళ్ళయి పదేళ్లయి౦దిగా.... సహవాస దోషం" అంటూ హాయిగా నవ్వేసింది రాధిక. శృతికలిపాడు మోహన్.
"చలి మొదలైంది...ఇక లోపలకు వెళదామా" అంటూ పైకి లేచింది.
“కథాగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని...” మదిలో మెదిలిన పాటను చిన్నగా పాడుతూ ఆమెననుసరించాడు.

                     *                          *                             * 


 ఈ కథ 'వాకిలి' పత్రిక మార్చి సంచికలో ప్రచురితమైంది.  సంపాదకులకు

 బ్లాగుముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. 


Friday, March 1, 2013

స్పెల్లింగ్ బీ

        బుజ్జిపండు స్కూల్లో స్పెల్లింగ్ బీ జరిగిందట. అందులో పండు ఎలా చేశాడు... నాన్నకేమి చెప్పాడు....అసలు పండు ఏమనుకుంటున్నాడు. విశేషాలన్నీ కౌముది  లో తెలుసుకుందాం రండి...



Thursday, February 14, 2013

నీకో అరుదైన బహుమానం ఇవ్వాలని....


కొమ్మపై ఊయలలూగే కోయిలమ్మ నడిగాను 
నీ పిలుపుకన్నా మధురమైన పాటేదీ లేదన్నది! 

మాపటేళ మరులు గొలిపు మరుమల్లియ నడిగాను 
నీ స్పర్శకు మించిన లాలిత్యం తనకేదన్నది! 

తోటలన్నీ తిరిగాను! చెట్టు చెట్టునూ వెతికాను 
నీ మనసుకన్నా అందమైన సుమమేదీ లేదన్నవి ! 

నీరెండ జల్లుల్లో విరిసే ఇంద్రధనస్సు నడిగాను 
నీ నవ్వుకు సరితూగే వర్ణం తన దరి లేదన్నది! 

నిశీధి వీధుల్లో మెరిసే చుక్కని కలిశాను 
నీ కళ్ళలోని కాంతిముందు తన మెరుపేపాటిదన్నది! 

శ్రావ్యమైన పాట కోసం రాగాలను సాయమడిగాను, 
నీ అనురాగానికి మించిన రాగమేదీ లేవన్నవి! 

మదిలోని భావనను కవితను చేసి కానుకివ్వాలనుకున్నాను 
నీ ప్రేమకు సరితూగే భాషలేదని తెలుసుకున్నాను! 

నిండు మనసు తప్ప వేరేమీ ఇవ్వలేని పేదరాలిని 
రిక్తహస్తాలతో నీ ఎదుట నిలిచాను! 

నీ కౌగిలి చేరిన మరుక్షణ౦ రాణినయ్యాను! 
సామ్రాజ్ఞినయ్యాను!! 


Monday, February 11, 2013

తెలుగులో టైప్ చేయడం ఎలా..

  తెలుగులో టైప్ చేయడానికి చాలా ఉపకరణాలు ఉన్నాయి. నాకిది తేలికగా అనిపించింది.

  ఈ లింక్ మీద నొక్కినప్పుడు అది వేరే పేజీకి తీసుకెళుతుంది. అక్కడ తెలుగును ఎంచుకుని I agree మీద చెక్ చేసి డౌన్ లోడ్ మీద నొక్కాలి.  


డౌన్ లోడ్ అయిన ఫైల్ మీ ఫైల్స్ లో వుంటుంది.   

ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ రన్ డయలాగ్ వస్తుంది. Run మీద నొక్కి అప్లికేషన్ ఇన్స్టాల్ చెయ్యాలి. 

ఇన్స్టాల్ చేసాక కీ బోర్డ్ మీద shift, alt రెండూ ఒక్కసారి నొక్కితే కుడి వైపు మూల    ఇలా కనిపిస్తుంది 

ఇప్పుడు ఎక్కడ ఇంగ్లీషులో టైప్ చేసినా అది తెలుగులోకి మారుతుంది. 

    మనం రాస్తున్నప్పుడు పదం సరిచూసుకోవడానికి వీలుగా డ్రాప్ డౌన్ విండోలో నాలుగు పదాలు వస్తూ ఉంటాయి. నాకు ఇందులో బాగా నచ్చిన మరో అంశం కొన్ని అక్షరాల కోసం ప్రతిసారి షిఫ్ట్ నొక్కే అవసరం లేకపోవడం.

    ముఖ్యంగా బ్లాగులో, ఫేస్ బుక్ లో వ్రాసుకోవడానికి, వ్యాఖ్య పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడో రాసి దాన్ని కాపీ చేసి  వేరే దగ్గర పెట్టకుండా ఒకే దగ్గర టైప్ చేసుకోవచ్చు. మైక్రో సాఫ్ట్ వార్డ్ కాని, నోట్ పాడ్ కాని ఎక్కడైనా తెలుగులో సులువుగా టైప్ చెయ్యొచ్చు.

    లేఖిని కూడా వాడొచ్చు కాని తెలుగు టైప్ చేయడానికి ప్రతిసారి ఆ పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం వ్రాసిన విషయాన్ని కాపి చేసి వేరొకదగ్గర పేస్ట్ చెయ్యాలి. తెలుగు ఇప్పటివరకూ టైపు చెయ్యని వారు లేఖినిలో ఇచ్చిన ఇంగ్లీషు అక్షరాల ఆధారంగా తెలుగులో ఎలా టైపు చెయ్యాలో నేర్చుకోవచ్చు.

http://lekhini.org/



Monday, February 4, 2013

అక్షర నీరాజనం

       ఓ కల...ఎదలో మెదిలి నేటికి నాలుగేళ్ళు. నిమిదిమంది పిల్లలతో మొదలైన మా పాఠశాలలో ఇప్పుడు మొత్తం నలభై ఆరు మంది విద్యార్ధులు, ఎనిమిది మంది ఉపాద్యాయులు వున్నారు.

    అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది 'అంతా వృధా ప్రయాసేనా...ఏనాటికైనా పిల్లలు తెలుగులో మాట్లాడం సాధ్యమయ్యే పనేనా...పుట్టిన దగ్గరనుండి అమెరికాలో ఉంటూ, ఒక్క తెలుగు మాట రాని పిల్లలతో తెలుగు మాట్లాడించగలమా' అని. అప్పటకీ తల్లిదండ్రులు "మా పిల్లల భాషలో చాలా మార్పు వస్తోంది, ఇప్పుడు పదాలు స్పష్టంగా పలక గలుగుతున్నారు, వాళ్ళ అమ్మమ్మావాళ్ళతో కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడుతున్నారు" అని చెప్పినా అనుమానంగానే వుండేది.

     ఈ శనివారం తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పిల్లలు వేసిన నాటికలు చూసాక, వారు పాడిన పద్యాలు, పాటలు విన్నాక తెలుగు స్పష్టంగా మాట్లాడగలరనే నమ్మకం కలిగింది.


           ఈ కార్యక్రమాలలో పిల్లలు సమయస్ఫూర్తితో సమస్య ఎలా గట్టెక్కాలి అని సందేశాత్మకమైన "చేపల తెలివి", అర్ధం చేసుకోకుండా బట్టీ పెట్టడం వలన కలిగే అనర్ధాలను తెలిపే "ఎస్ నో ఆల్రైట్", చెడు సావాసాలతో ఎలా కష్టాల పాలౌతమో తెలిపే 'చెడు స్నేహం',  ఐకమత్యం గురించి ప్రభోదించే 'శరీర ఆవయవాలు ఏమంటున్నాయో విందామా!', ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనషి ప్రవర్తన ద్వారా ఎలా బయటపడుతుందో తెలిపే "అప్పు", మాతృదేశానికి ఎంత దూరంలో ఉన్నా మన మూలాలు మర్చిపోకూడనే అంశంతో రూపొందించిన 'రూట్స్' అనే తెలుగు నాటికలు వేశారు. పిల్లలకు ఇంత చక్కని తర్ఫీదు నిచ్చిన ఉపద్యాయులకు ప్రత్యేక అభినందనలు.
మూడు చేపల కథ
శరీర ఆవయవాలు ఏమంటున్నాయో విందామా
     పిల్లలు పెద్ద పెద్ద వాక్యాలు అవలీలగా చెప్తుంటే, "ఇదంతా ఎలా సాధ్యమైంది?" అని ఆశ్చర్యం వేసింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. దీని వెనుక ఉపాద్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల శ్రమ ఎంతుందో అర్ధమైంది. పిల్లలు పాటలు, పద్యాలు కూడా చాలా చక్కగా చెప్పారు.
'లింగాష్టకం' పాడుతున్న నాలుగవ తరగతి పిల్లలు
          ఈ పిల్లలను "మీకు తెలుగు చదవడం వచ్చింది కదా..ఇక ఇంటి దగ్గర  చదువుకోండి" అని చెప్తే, "లేదు మేము పాఠశాలకే వస్తామంటూ" ఈ ఏడాది కూడా వచ్చి స్పష్టంగా చదవడం నేర్చుకుంటున్నారు. వీళ్ళకోసం నాలుగవ తరగతి మొదలు పెట్టాము. ఒక్కరోజు వాళ్ళ ఉపాద్యాయుడు రాకపోతే ఈ పిల్లలు మొహాలు చిన్నబోవడం చూస్తుంటే వారి అనుబంధానికి చాలా ముచ్చటేస్తుంది. వీరు పడిన లింగాష్టకం ఇక్కడ చూడొచ్చు.
ఒకటవ తరగతి ఉపాద్యాయని మంజుల 
ఒకటవ తరగతి ఉపాద్యాయులు సుమతి, స్నేహ
రెండవ తరగతి ఉపద్యాయని లావణ్య
రెండవ తరగతి ఉపాద్యాయులు రాధ, లక్ష్మి 
మూడవ తరగతి ఉపాద్యాయని రాధ 
నాలుగవ తరగతి ఉపాద్యాయులు రఘునాథ్ 
పాఠశాల ఉపాధ్యాయుల బృందం 
   ఈ ఉపాద్యాయులందరూ స్వలాభాపేక్షలేకుండా ఏడాది పొడవునా అంకితభావంతో పాఠాలు చెప్తున్నారు. 
      
     పిల్లలే ముందుకు వచ్చి తెలుగు ఎందుకు నేర్చుకోవాలో, వాళ్ళకు తెలుగు నేర్చుకోవడం ఎంత ఇష్టంగా వుందో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. బోధనలో భాగంగా ప్రతి వారం తరగతిలో చెప్పే 'మంచి విషయం', పిల్లల ప్రవర్తనలో ఎలా మార్పు తీసుకొని వస్తుందో చెప్తూ నేటి విద్యా విధానంలో లోపించిన ఎన్నో అంశాలు వారు ఈ తరగతులలో నేర్చుకుంటున్నారని...ఆ తల్లిదండ్రుల మాటల్లో వింటుంటే మా బాధ్యత మరింత స్పష్టంగా అర్ధం అయింది. 

     తల్లిదండ్రులు, ఉపద్యాయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన 'తెలుగు భాష గొప్పదనం' పాట, ఆ తరువాత తెలుగులో వారు కవిత వ్రాసి ఇచ్చిన మేమెంటో మాకు ఎంతో విలువైనవి.  
   
      'ఒక్క నిముషం తెలుగు', 'మన తెలుగు తెలుసుకుందాం', 'మీకు తెలుసా...' వంటి కార్యక్రమాల పాల్గొన్న పెద్దవాళ్ళ ఉత్సాహం చూసాక మన భాష పట్ల వున్న మమకారం అర్ధం అయింది.

      ఇన్నాళ్ళూ పిల్లలు ఏమి నేర్చుకున్నా, అందరి ముందు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. పిల్లలు చేసిన అక్షర నీరాజనానికి పెద్దల కళ్ళలో  ఆనందభాష్పాలు నిలిచాయి. పెద్దలందరూ వారిని మెచ్చుకున్నందుకు పిల్లలకు చాలా గర్వంగా కూడా అనిపించే ఉంటుంది. ఆ స్ఫూర్తితో వారు మరింత శ్రద్దగా తెలుగు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. 

మా పాఠశాల గుర్తింపు చిహ్నంలో వున్న మూడు అంశాలు 

భాష: మాతృభాషను నేర్పించడం
భావం: మంచి భావాలను పెంపొందించేలా పాఠ్యప్రణాళిక రూపొందించడం.
భవిత: భవితను సన్మార్గం వైపు నడిపించడం.

తెలుగు నేర్పించాలనుకుంటున్న పెద్దల కోసం ఓ నాలుగు మాటలు
  • తెలుగు నేర్పించాలన్న మీ సంకల్పం అభినందనీయం.
  • మన భాష నేర్చుకుంటున్నామన్న ఉత్సాహ౦ పిల్లలకు కలుగజేయాలి.
  • పద్యాలు, శ్లోకాలు చెప్పించడం వలన వారికి తెలుగు మాట్లాడం తేలిక అవుతుంది.
  • సామెతలు, జాతీయాల వంటివి వాడడం ద్వారా వారిలో, ఆసక్తిని కలిగించి వారికి భాషనే కాక లోకజ్ఞానాన్ని కలిగించిన వాళ్ళమౌతాము.
  • చక్కని భావం వున్న పాటలను వినిపించడం, స్పష్టమైన ఉచ్చారణ ఉన్న టివి కార్యక్రమాలను చూపించడం వలన వారికెన్నో కొత్త పదాలు పరిచయమౌతాయి.
  • ఇంట్లో తెలుగులోనే మాట్లాడేలా ప్రోత్సహించండి.
  • తెలుగులో మాట్లాడినప్పుడు వారికి చిన్న, చిన్న బహుమతులు ఇస్తే  ప్రోత్సాహకరంగా ఉంటుంది.
  • రాత్రి పడుకునేప్పుడు తెలుగు కథ చదవడం, లేదా తెలుగులో కథ చెప్పడం వల్ల వాళ్ళకు భాషతో అనుబంధం ఏర్పడుతుంది.
  • పండుగ రోజు ఆ పండుగ యొక్క ప్రాశస్త్యం, కథ చెప్పడం వలన వారికి మన సంస్కృతి గురించి చక్కని అవగాహన వస్తుంది.
  • మీరు తెలుగులో మాట్లాడేప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడకండి.
  • అన్నింటికంటే ముఖ్యమైనది మీరు మీ పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి.
  • ఎవరైనా వారితో ఇంగ్లీషులో మాట్లాడుతున్నా పిల్లలకు తెలుగు అర్ధమౌతుందనే విషయాన్ని గుర్తుచేయడానికి మొహమటపడకండి.
      
       భవితను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది.