Friday, July 24, 2015

రంగుల కల

       అందమైన కల ఇచ్చే అనుభూతే వేరు, అది నిద్రలో కాని, మెలుకువలో కాని. నాకు బాగా గుర్తున్న కల.. బుజ్జిపండు ఇక రెండు నెలల్లో పుడతాడనగా వచ్చిన పసుపు పచ్చని పులిహోర కల. నవ్వకండి! నిజంగానే. తెల్లవారి లేచి మామూలు కన్నా కొంచెం ఎక్కువ పసుపుతో పులిహోర కలిపి తినేశాను. ప్రస్తుతం నా కలల్లో రంగులు కనిపించడం లేదు. పోనీ కలలకే రంగులు వేస్తే! ఏమిటీ..  వేయలేం కదూ! అందుకే చుట్టూ ఉన్న పరిసరాలకు అంటే ఇంటి గోడలకు రంగులు వేయాలనిపించింది. ఆ కథా కమామీషంతా ఓ సహస్రం నడిచింది. టూకీగా విశేషాలు చెప్తాను.

             *            *            *            *            *            *    

"ఇవాళ రంగులు చూసి వద్దామా?" తో ఓ రోజు మొదలైంది. ఆ వసంతమాసపు ఉదయం ఉత్సాహంగా 'షెర్విన్ విలియమ్స్' లోకి అడుగు పెట్టాం. కావలసిన రంగులేలో కార్ట్ లో  పెట్టుకుని తెచ్చేద్దాం అనుకుంటూ.
"కెన్ ఐ హెల్ప్ యూ?" సేల్స్ గర్ల్ వచ్చింది.
"మేము ఇంటికి రంగులు వేయాలనుకుంటున్నాం."
"మరి రంగులు ఎంచుకున్నారా?" అని అడిగింది. "ఇంకా లేద"నగానే రంగుల్లో ఎన్ని రకాలున్నాయో, ఏ రంగులైతే ఒకదానిపక్కన ఒకటి సఖ్యంగా ఉంటాయో, సాధారణంగా ఏఏ గదులకు ఏఏ రంగులు వాడతారో ... అన్నీ చెప్పడం మొదలెట్టింది. పూర్తయ్యేసరికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ఆ పూటకు రంగుల వేట చాలించి  ఆ మర్నాడు కొత్తగా రంగులు వేసిన మా స్నేహుతుల ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటాయన వాళ్ళ గదులన్నీ ఉత్సాహంగా చూపించి అన్ని గదులకు కలిపి మొత్తం పదహారు రంగులు వాడినట్లుగా చెప్పాడు. మరో ఇంటికి వెళ్ళాం, వాళ్ళూ అంతే. అంటే ఈ రంగుల ఎంపిక అంత తేలికగా అయ్యే వ్యవహారం కాదని అర్ధం అయింది. "తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది" అన్నట్లుగా మేమొకటి అనుకుంటే మా పిల్లల అభీష్టం మరొకటని అర్ధం అయింది. ఎలాగంటారా...  

"నీ రూమ్ కే రంగు వేద్దాం అమ్మలూ",
"పింక్ అండ్ పర్పుల్"
"ప్రెట్టీ కలర్స్, చ్యూజ్ వన్"
"ఐ వాంట్ బోత్"
"బుల్లి రూమ్ కి రెండు రంగులు ఏం బావుంటాయిరా?"
"బావుంటాయమ్మా" అమ్మని ఒప్పించాలంటే ఏ భాషలో మాట్లాడాలో అమ్మాయికి బాగా తెలుసు. 
సరే అందులో షేడ్స్ చూడు. 
"లైట్ పింక్ అండ్ డార్క్ పర్పుల్..  ఐ మీన్ ఫషియా"
"ఫషియా .... ఫషియా అంటే దగ్గర దగ్గరగా నేరేడుపండు రంగు... ఇంకో సారి ఆలోచించరా"
"బాత్ రూమ్ కి లావెండర్ కలర్."
వెంటనే ఓకె  చెప్పేశాను. ఆలస్యం చేస్తే కిటికీ అంచులకీ, డోర్ నాబ్ కి కూడా వేరే రంగులు చెప్పెయ్యగలదు. 
"నీకు పండూ"
"ఐ వాంట్ ఓన్లీ వన్ కలర్. బ్లూ"
"ఓకే. గుడ్"
"డా...ర్క్ బ్లూ".
"రూమంతా అదేనా?" నడి సముద్రంలో మునిగిపోతున్న ఫీలింగ్ తో అడిగారు నాన్న.  
"ఆక్చ్యువల్లీ . ఐ వాంట్  హైపర్ బ్లూ".
"ఒద్దురా బాబూ. ఆ రంగువేస్తే  రూమంతా చీకటై పోతుంది." 
"నాకదే కావాలి. బాత్ రూమ్ అండ్ కోజెట్స్ బ్రైట్ ఆరంజ్"
"నో వే" రామ్ గోపాల్ వర్మ సినిమా చూడకుండానే ముచ్చెమటలు పోశాయి.
"ఎస్."
"ఆ..సరే కానియ్."
ఆ 'నో వె' కి... 'సరే కానియ్' కి మధ్య చాలా అంతరాలు దాటాల్సి వచ్చింది.

మిగిలిన గదులన్నింటికీ ఏ రంగులు వేయాలా? అని ఇంటర్ నెట్  అంతా వెతుకుతూ ఓ రోజు బయటకు చూసేసరికి ఎరుపు, పసుపు, నారింజ రంగులతో చెట్లు హోలీ ఆడినట్లు రంగులే రంగులు. ఫాల్ కలర్స్ తో ఆకులు రంగులు మార్చుకున్నాయి కాని మా గోడలకు ఆ భాగ్యం కలగలా. . ఇక లాభం లేదని పెయింటర్ ని ఇంటికి పిలిచి సలహా అడిగాం. ఏ రంగు బావుంటుందో చూడాలంటే ముందు సాంపిల్స్ తెచ్చి వేసి చూడమన్నాడు. వేశాం. ఏ గోడమీద చూసినా ఎక్సర్ సైజ్ చేస్తున్న ఇంద్రధనస్సులే.

మళ్ళీ వసంతం వచ్చిన కొన్ని రోజులకు గోడలకున్న పటాలన్నీ కిందకు దిగాయి. సోఫాలు, మంచాలన్నీ ముందుకు జరిగాయి. ఏ గదిలోకి వెళ్ళినా గోడమీద నృత్యం చేస్తున్న రంగులు పులుముకున్న కుంచెలు...అర్ధం కాని భాషలో ఆ కుంచెలు పట్టుకున్న వారి కబుర్లు. ఒక్కో గోడకు రంగు వేస్తుంటే అది ఎలా మారుతుందో ఆశ్చర్యంగా చూడడం. నచ్చకపోతే షెర్విన్ విలియమ్స్ కి పరిగెత్తి కొత్త రంగు తెచ్చుకోవడం. ఇలా ఓ వారం గడిచాక...

    మంచి గంధానికి రెండు చుక్కలు లవంగనూనె కలిపినట్లు మధ్య గది, తొలకరి జల్లులో మెరిసే మైదానంలా వంటగది, కుంకుమ పువ్వు పులుముకుని ముందుగది, నడివేసపు చల్లని సాయంత్రంలో మెరిసేటి నీలి సంద్రంలా మరో గది.... ఇలా గది గదిలో ప్రకృతికాంత విన్యాసాలతో నా రంగులకల పూర్తయ్యింది.

నేర్చుకున్న పాఠాలు:

  • ఎవరి ఇంట్లోనైనా అందంగా అనిపించిన రంగు మన ఇంటికి సరిపోకపోవచ్చు. వెలుతురును బట్టి రంగు అందం మారుతూ ఉంటుంది. 
  • ఇంటికి రంగులు వేసిన తరువాత సామాన్లు కొనడం ఉత్తమం.
  • పెయింట్ గోడ మీద చూడాలనుకుంటే పోస్టర్ బోర్డ్ మీద వేసి గోడకు అంటించాలి. అంతే కాని నచ్చిన దగ్గర పులిమేయకూడదు.   
  • చీకటిగా ఉన్నాయి కదా అని క్లోజెట్స్  కి లేత రంగులు వేయక్కర్లేదు. ముదురు రంగులు కూడా బావుంటాయి. లైటింగ్ మార్చుకుంటే సరిపోతుంది. 
  • గోడలమీద వున్న నొక్కులు, చొట్టలు సరిచేసిన తరువాత  రంగు వేస్తే మంచిది. ఈ విషయం మీ పైంటర్ మీకు చెప్పకపోవచ్చు.
  • ముదురు రంగులు వేయడం చూస్తూ ఉన్నప్పుడు గది చీకటై పోతుందేమో అని కంగారుగా అనిపిస్తుంది. మరేం ఫరవాలేదు. తెల్లని గోడపక్కన అలా అనిపిస్తుంది కాని గది మొత్తం వేసినప్పుడు అసలు రంగు తెలుస్తుంది.  
  • లేత రంగు ఎంచుకునేప్పుడు ఆ షీట్స్ తెలుపు రంగు కాగితం మీద పెట్టి చూస్తే రంగు ఎలాంటిదో సరిగ్గా అర్ధం అవుతుంది.

Tuesday, July 7, 2015

ఏమండోయ్...

"మిమ్మల్నే.... పిలుస్తుంటే పలకరేం?"
"పిలిచావా? ఏమని?"
"ఏమని పిలుస్తానో తెలీదా?"
"ఎందుకు తెలీదు. బాగా తెలుసు. అలా దారిని పొయ్యేవారిని పిలిచినట్లు 'ఏవండోయ్' ఏవిటి? చక్కగా పేరు పెట్టి పిలవొచ్చుగా?"
"అలవాటు లేని పని కొత్తగా ఎందుకని?"
"అలవాటుదేముంది చేసుకుంటే అదే వస్తుంది."
"మిమ్మల్ని చేసుకున్నాను చాలదూ!"
"అదంతా ఏం కుదరదు. ఇవాళ నన్ను పేరు పెట్టి పిలవాల్సిందే"
"పేరా... ఏం పేరూ?"
"మా అమ్మా నాన్న పెట్టిన లక్షణమైన పేరు."
"మిమ్మల్ని నాకిచ్చేశారుగా. కనీసం ఆ పేరన్నా వాళ్ళకి వదిలేద్దామని."
"అబ్బో గొప్ప ఆలోచనే!"
"కదా!"
"కదా లేదు ఏం లేదు. పిలవాల్సిందే"
"కుదరదు."
"ఏం.. ఎందుకని"
"ఏవిటో సిగ్గనిపిస్తోంది"
"కొత్త పెళ్ళికూతురా రారా! నీ కుడికాలు ముందుమోపిరారా!...."
"చాల్లే. అయినా నేను సిగ్గుపడితే అందంగా ఉంటానని నిన్నేగా అన్నారు. ఇప్పుడేమో ఎగతాళి చేస్తున్నారు"
"అది రాత్రి మాట కదా!"
"పగలో మాట రాత్రో మాట. మాట మార్చడం మీ వంశంలోనే లేదని మొన్న మీ మామయ్యతో అన్నారు..."
"ఏదో కోపంలో మాటా మాటా అనుకున్నాం. అయినా బోడి గుండుకూ మోకాలికీ ముడి పెడతావే."
"ఎంత కోపం వస్తే మాత్రం పెద్దవాళ్ళతో అందులోనూ మేనమామతో అలాగేనా మాట్లాడేది?
"మరి ఆయనన్న మాటలు యెట్లా ఉన్నాయ్?" 
"యెట్లా ఉన్నాయేమిటి?"
"ఆయన తాతగారిని, అమ్మావాళ్ళను అలా అనడం తప్పుకాదూ"
"తప్పే."
"ఆ విషయం ఆయనకు మాత్రం తెలియదూ?"
"తెలుసు. చివరి రోజుల్లో మీ అత్తయ్య తాతగారిని చూడక పోవడం. ఆస్తంతా ఆయన అత్తయ్యగారి పేరున వ్రాయడం ఈ గొడవలన్నింటికీ కారణం. మీ అత్తయ్య ఆయనని చూడకపోవడంలో మీ మామయ్య తప్పేం ఉంది? పైగా ఆయనకు తండ్రి కోసం ఏమీ చెయ్యలేక పోయాననే గిల్టీ కాన్షస్. దాంతో ఏదో అన్నారు. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఊరుకుంటే పోయేదిగా"

"మరి నాకు మాత్రం కోపం రాదేమిటి?"
"వస్తుంది. ఆ కోపంలో చిన్నప్పట్నుండీ ఆయన మిమ్మల్ని ఎంత గారాబం చేసేవారో, మీ అత్తయ్యకు మీరంటే ఎంత ఇష్టమో మర్చిపోయారా? వాళ్ళతో గడిపిన సమయం అంతా ఇప్పుడు తలచుకుంటే ఎలా ఉంది? అన్నీ పాడుచేసుకుంటారా?"

"నిజమే. బాధగానే ఉంది. కాని ఆయన అలా చేయడం తప్పుకదూ! పైగా అప్పుడు అత్తయ్యకు సర్ది చెప్పుకోలేక ఇప్పుడిలా మాట్లాడడం!"
"మీ తాతగారికి ఆడవాళ్లంటే ఉన్న చులకన మీకు తెలుసుగా! స్వతహాగా మీ అత్తయ్య చాలా మంచివారు. ఆవిడ మనసెంత కష్టపడితే అలా బిహేవ్ చేసి ఉంటారో మీరూహించగలరా?"

"అయితే మాత్రం?"
"అయితే గియితే ఏమీ లేదు. ఆవిడ చెప్పుల్లో కాళ్ళు పెట్టి గతాన్నీ భవిష్యత్తునూ మనం చూడలేం. అయినా అలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే చివరకు మనకూ ఎవరూ మిగలరు."

"అవుననుకో అన్ని మాటలనుకున్నాక అంతకు ముందులా ఎలా ఉండగలం?"
"చక్కగా ఉండొచ్చు. బూరెలు చేశాను. మీ మామయ్యకు ఇష్టంగా! తీసుకుని సాయంత్రం వాళ్ళింటికి వెళ్దాం. మీ అత్తయ్య మీ కిష్టమైన మామిడికాయ పులిహోర చెయ్యకపోతే నన్నడగండి"
"అంతేనంటావా?"
"అంతే కాదు. ఇప్పుడంటే కోపంలో ఉన్నారుగాని, మీరెవ్వరూ మీ మామయ్యతో మాటాడక పోవడం, రెండు కుంటుంబాల మధ్య కలతలు రావడం అత్తయ్యగారికి ఎలా ఉంటుందో ఆలోచించండి."
"....."
"అయిన వారి మధ్య కలతలు ఎన్ని మానసిక సమస్యలకు దారి తీస్తాయో మీకు తెలియదు. అహానికి పెద్ద పీట వేస్తే సౌఖ్యానికి తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుంది. పరిస్థితి చేయి దాటనివ్వకండి."
"......"
"ఎమాలోచిస్తున్నారు?"
"నువ్వు గొప్ప మాయల మరాఠివి"   
"అందరం బావుండాలని తోచిన సలహా చెప్పాను. గొప్ప బిరుదే ఇచ్చారు. ఇష్టం లేకపోతే మానెయ్యండి"
"ఆహ అది కాదు" 
"ఏది కాదు సందర్భం వచ్చింది కదా అని చెప్పాను. కోపంలోనో, ఆవేశంలోనో ఒకరు తడబడినప్పుడు రెండో వారు దిద్దుకుంటేనే కదా జీవనం సవ్యంగా సాగేది. నాకెన్నిసార్లు మీరిలాంటివి చెప్పలేదు."

"సర్లేవోయ్. అసలు విషయానికి వద్దాం" 
"ఏ విషయం....ఓ అదా!"
"అదా అని అంత తేలిగ్గా అనేస్తే ఎలా..."
"బరువుగా అనడం రాదు మరి. నేనసలే ఏడు మల్లెలెత్తు. మిమ్మల్ని కలిసిన మొదటి సారి మా బాబాయి చెప్పలేదూ"
"అప్పుడు ఏడు మల్లెలే. ఇప్పుడే ఏడువేల మల్లెలయ్యాలి."
"ఎన్నయినా మల్లెలు మల్లెలే."
"మల్లెలు మల్లెలే జాజులు జాజులే"
"ఇప్పుడా మల్లెలు జాజుల కథలెందుకులెండి!"
"ఔనంటే కాదనిలే... కాదంటే ఔననిలే... ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే....ఇప్పుడు ఎందుకన్నావంటే మరి కావాలన్నమాటేగా!"
"ఆడవాళ్ళందర్నీ కాచి వడపోసి గొప్ప మాటే చెప్పారు కవిగారు"
"కవిగారి సంగతి మనకెందుకు కాని 'బాహుబలి' ఎల్లుండి రిలీజ్ అవుతోందిట. వెళ్దామా?"
"వెళ్దాం. టికెట్స్ దొరుకుతాయా?
"నీకెందుకు నేను తీసుకొస్తాగా. అయితే ఒక షరతు" 
"ఏమిటో..." 
"ఏముంది పేరు పెట్టి పిలవడం."
"మీరింకా మర్చిపోలేదా?"
"లేదు" 
"ఓ విషయం చెప్పనా?"
"చెప్పొద్దు."  
"ఇప్పుడూ..." 
"ఇప్పుడూ లేదు అప్పుడూ లేదు. ఎప్పుడైనా సరే పేరు పెట్టి పిలవాల్సిందే"
"అబ్బ నన్ను కొంచెం చెప్పనిస్తారా?"
"నివ్వను."  
"అది కాదండీ."
"ఏది కాదండీ." 

"పేరుతో పిలవడానికేం అభ్యంతరం లేదు. కాకపోతే...ఈ ప్రపంచంలో ఒకే ఒక్క పేరు....అదీ నాలుగక్షరాల కలయిక మాత్రమే. ఆ పేరు పలకడానికి ఏదో సిగ్గు, బిడియం. తెలియని భావాలేవో ఎదలో మెదులుతుంటే తొలిసారి మిమ్మల్ని యేమని పిలిచానో జీవితాంతం అలానే పిలవాలనిపిస్తుంది. ఆ రోజు మన మధ్య మొదలైన స్నేహానికి గుర్తుగా అనుక్షణం హృదయ సీమలో విహరించే అక్షరాలను పెదవి దాటనీయక పదిలంగా దాచుకోవాలనీ, ఆ అనుభూతిని అలాగే నిలుపుకోవలనీ అనిపిస్తుంది. లేదూ కాదూ పేరుతోనే పిలవాలంటే మీ ఇష్టం"

*                       *                       *                        *          

ఏమండోయ్ మిమ్మల్నే. ఐదున్నరౌతోంది ఇక బయలుదేరదామా?
ఇదుగో వచ్చేస్తున్నా. కారు తాళాలు తీసుకో!