అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అందరం నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం. బస్సు మెయిన్ రోడ్డు వదిలి మట్టి రోడ్డు పట్టిందనడానికి గుర్తుగా ఎర్రటి దుమ్ము పైకి లేచింది. నేనూ, తమ్ముడు బస్సులో వెనుక సీట్లోకి వెళ్లి కూర్చున్నాం. అక్కడైతే రోడ్డుమీద గతుకులు వచ్చినప్పుడల్లా బస్సు ఎత్తెత్తి పడేస్తుంది అది మాకెంత ఇష్టమో. సన్నని ఎర్రటి దారి పక్కనంతా నాగజెముడు, బ్రహ్మజెముడు, కలబంద చెట్లు ఆర్ట్ పీసుల్లా నిలబడి ఉన్నాయ్. అక్కడక్కడా పచ్చగా జీడిమామిడి తోటలు. రెండు మూడు ఊర్లు దాటాక మావూరొచ్చింది.
బస్సు అలా దిగేమో లేదో "ఏం రామకృష్ణా కోడల్ని, పిలకాయల్ని తీసుకొచ్చినట్టు౦డావే" అడిగారు ఆ విధిలో కొట్టు దగ్గరున్న నాన్న వాళ్ళ బాబాయి. "ఎండాకాలం సెలవలిచ్చారుగా చిన్నాయనా, మిమ్మల్న౦దరినీ చూడాలని వచ్చాం" చెప్పారు నాన్న. "ఏం జయమ్మా బావు౦డావా?" అని అమ్మ నడిగి "మీ నాయన పొద్దుట్నుంచీ మీ కోసం ఎదురుచూస్తా ఉండాడు." అంటూ నాన్నతో చెప్పి విశాలంగా నవ్వాడు ఆ తాతయ్య.
"ఆక్కడే వున్న ఒక బాబాయి "రేయ్ ఒదిన చేతిలో బాగ్ తీసుకోరా" అని ఓ పదిహేనేళ్ళ అబ్బాయికి పురమాయించాడు.అదేంటో ఆ ఊరంతా చుట్టాలే, ఒకరినొకరు అక్కా, ఒదినా, పిన్నీ, మావా, చిన్నాయనా..అంటూ పిలుచుకుంటారు. అమ్మ వద్దన్నా వినకుండా ఆ అబ్బాయి అమ్మ చేతిలో బాగ్ తీసుకున్నాడు. దారిలో ఎవరెవరో పలుకరిస్తున్నారు కాని, నేను తమ్ముడూ రయ్యిన పరిగెడుతూ నాన్నమ్మ వాళ్ళ వీధి దగ్గరకు వచ్చేశాం. అమ్మ, నాన్న కనిపించిన వాళ్ళతో మాట్లాడుతూ మెల్లగా నడుస్తూ వెనకెక్కడో వున్నారు.
రోడ్డు మీదనుండి ఇల్లు చాలా దూరం ఉంటుంది కదా, రోడ్డు చివరగా తాతయ్య వాళ్ళ ఇల్లు, దారికి అటూ ఇటూ బొంత రాళ్ళతో కట్టిన చిన్న గోడ, గోడకు అటూ ఇటూ రోడ్డు పొడవునా ఇళ్ళున్నాయి. ఎప్పట్లానే తాతయ్య భోషాణం పెట్టె పక్కనున్న చెక్కచేతుల కుర్చీలో కూర్చుని 'మేం ఎప్పుడు వస్తామా' అని వీధి వైపు చూస్తూ కనిపించారు. తాతయ్య తెల్ల చొక్కా, పంచె కనిపిస్తున్నాయి, ఇంకొచెం జాగ్రత్తగా చూస్తే తాతయ్య కళ్ళకున్న అద్దాలు కనిపి౦చాయి. మేం ఇంటిదగ్గరకు రాగానే లోపల్నుండి నాయనమ్మ చూసిందేమో హడావిడిగా బయటకు వచ్చింది. కుచ్చిళ్ళు అంచుపట్టి పైకి దోపిన పచ్చచీర, నుదిటిమీద యెర్రని కుంకుమ బొట్టు, పాపిట తీసి వెనక్కి దువ్వి జడవాసి చుట్టుకున్నముచ్చటైన ముడి, ముక్కుకి ఐదు రాళ్ళ ముక్కు పుడక, చేతిమీద పచ్చబొట్టుతో వేసిన ముగ్గు, చేతినిండా మట్టిగాజులు, వేసి చుట్టిన ముడి, మొహంలో వెలుగుతూ కనిపించే సంతోషం, ఇదీ నాన్నమ్మ రూపం.
"ఏమ్మా కావలి బస్సుకొచ్చారా ఉదయాన్నే ఒంగోలు బస్సుకొస్తారని చూస్తా ఉండాం" అని నాతో చెప్పి "సుగుణా అమ్మాయోళ్లు వచ్చారు" అని పిన్నికి వినిపించేలా పెద్ద కేక పెట్టింది. ఈ లోగా అమ్మా వాళ్ళు కూడా వచ్చారు.
నాయనమ్మ కేకకు మా ఇంటికి అటు పక్కనున్న ఇంటిలో ఉన్న పిన్నివాళ్ళు, ఇటు పక్క ఇంటిలో ఉన్న తాతయ్య వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. ఇలాగా అమ్మావాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంతలో పిన్ని ఇంట్లోంచి వచ్చింది.
"రా అక్కా, మంచి ఎండలో బయలుదేర్నారే, కాళ్ళు కడుక్కుందురు గాని రండి" అని దొడ్లోకి దారి తీసింది. పిన్నితో మాట్లాడుతూ కాళ్ళు కడుక్కోవడానికి దొడ్లోకి వెళ్లాను. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న తొట్టి నిండా నీళ్ళు నింపి వున్నాయి. మధ్యాహ్నం ఎండ నీళ్ళపై పడి ఎదురుగా ఉన్న గోడమీద కదిలే వృత్తాలు చుడుతూ ఉంది. ఇత్తడి చెంబుతో తొట్లోనుంచి నీళ్ళు తీసుకుని రాళ్ళమీద పరిచిన నల్ల బండపై నిల్చుని కాళ్ళు, చేతులూ, మొహం శుభ్రంగా కడుక్కున్నాను. ఆ నీళ్ళన్నీ బండ కింద గుంటలోకి వెళ్లడం చూస్తుంటే భలే సరదాగా అనిపించేది.
ఇంతలో బాబాయి వచ్చి "నీ చెట్టుని పలకరించావా జ్యోతీ" అని అడిగాడు. బాదం చెట్టు వైపు చూసి నేనూ నవ్వాను. నేను పుట్టానని తెలిసిన రోజున తాతయ్య ఆ చెట్టును తీసుకొచ్చినాటారట. అందుకని దాన్ని జ్యోతి చెట్టనో, నా ఫ్రెండ్ అనో పిలుస్తారు. ఆ చెట్టు పచ్చని ఆకులతో ఎంత అందంగా ఉంటుందో...ఆకుల వెనుక అక్కడక్కడా బాదం కాయలు కనిపిస్తున్నాయ్. "జ్యోతీ, ఆ కొమ్మమీద పక్షి గూడు౦ది చూశావా?" అంటూ బాబాయి ఒక కొమ్మను చూపించాడు.
ఈలోగా "బయట ఎండగా ఉంది, లోపలకు రండమ్మా" అంటూ నాన్నమ్మ పిలిచింది. లోపలకు వెళ్లి వంటగది గుమ్మానికి రెండు వైపులా వున్న సిమెంట్ తో కట్టిన అరుగుల మీద కూర్చున్నాము. ఆ అరుగుల చివర కొంచెం ఎత్తుగా దిండు పెట్టినట్లు కట్టి ఉంటుంది. ఆ సిమెంట్ సోఫా గమ్మత్తుగా అనిపించేది.
ఎండలో నుండి లోపలకు రాగానే చీకటిగా అనిపించింది కానీ, కాసేపటికి కళ్ళకి అలవాటయి ఇంట్లోవన్నీ స్పష్టంగా కనిపించాయి. నేలంతా చక్కగా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి, గోడ మీద అడ్డంగా వేసిన ముగ్గుగీత చాలా అందంగా ఉంది. ఇంటికి మధ్యలో వున్న రెండు స్థంభాలలో ఒక దానిమీద సీసాలో గనిసి గడ్డలోంచి వచ్చిన తీగ చెక్కమీద పాకి గమ్మత్తుగా ఉంది. గదిలో మూలగా పే....ద్ద కుండ ఉంది. సుమారుగా ఏడు అడుగుల ఎత్తున్న ఆ కుండలో వడ్లు పోసి వుంటాయట, నేనెప్పుడూ అవి చూడలేదు.
ఒక అరుగుమీద పిన్ని, ఎర్రచీర కట్టుకుని పైట భుజమ్మీదుగా ముదుకు వేసుకుని, జారుముడితో ఉన్న పక్కింటి బోసినోటి అమ్మమ్మ, రెండో అరుగు మీద నేనూ, తమ్ముడూ, నాయనమ్మ కూర్చున్నాము. ఆకుపచ్చ, తెలుపు గళ్ళ దుప్పటి వాల్చిన నవారు మంచం మీద అమ్మ, నల్ల గీత ఉన్న బులుగు దుప్పటి వాల్చిన మంచం మీద నాన్న, బాబాయి కూర్చున్నారు. అరుగుల పైన గోడమీద వరుసగా మా నాన్న స్కూల్ ఫోటో, పెద్దత్త పెళ్ళి ఫోటో, చిన్నగౌను వేసికుని, ఉంగరాల జుట్టుతో అమాయకంగా చూస్తున్న నా ఫోటో, గుఱ్ఱం బొమ్మమీద కూర్చున్న తమ్ముడి ఫోటో, ఇంకా కొన్ని ఫోటోలు...వరుసగా వేలాడదీసి వుంటాయి. నాయనమ్మ ఎప్పట్లానే ఆ వేళ కూడా ఆ ఫొటోలన్నీ నాకూ, తమ్ముడికీ చూపించి అప్పటి సంగతులు చెప్పింది.
"బాబాయ్ తాటి చెట్ల దగ్గరకు ఎప్పుడు వెళ్దాం?" ఉత్సాహంగా అడిగాను. "నువ్వెప్పుడంటే అప్పుడేనమ్మా" తెల్లని పళ్ళు కనిపించేలా నవ్వుతూ చెప్పాడు. అసలు బాబాయి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, బాబాయిని కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఆ మాట కొస్తే ఆ ఇంట్లో ఎవరినీ కోపంగా చూడలేదు. బాబాయి మాటతో క్వీన్ విక్టోరియా లాగా ఫీల్ అయి "అయితే ఇప్పుడే వెళ్దాం" చెంగున అరుగు మీంచి దూకి చెప్పాను. "ఇప్పుడొద్దులేమ్మా అన్నం తిని కాసేపుబ్బడుకోండి, చల్లబడ్డాక పోదురుగాని" చెప్పారు తాతయ్య. అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. నేనూ, తమ్ముడూ 'ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు తోటకెళ్దామా ' అని ఎదురుచూస్తూ కూర్చున్నాము. తాటికాయల కబుర్లు కాస్త చల్లబడ్డాక చెప్పుకుందాం.