Thursday, September 20, 2012

ఇంతకు మించి ఏమున్నది

"వినాయక చవితి వస్తుంది, ఈసారి ప్రతిమను మన౦ చేద్దామా?"
"ఎలా? మనకు చేయడం రాదుగా?"
"పోయిన సంవత్సరం విజయ చాలా బాగా చేశారు. ఎలా చెయ్యాలో తనను కనుక్కుని నేర్చుకుందాం"
"మన తెలుగు తరగతి పిల్లలతో చేయిస్తే ఎలా వుంటుంది. ఊరికే కథ చెప్పడం కాకుండా ఇలాంటివి చేయిస్తూ చెపితే పిల్లలు ఇష్టంగా తెలుసుకుంటారు."
"చాలా మంచి ఆలోచన, అలాగే చేద్దాం"
అలా ప్రతిమ చేయాలని సంకల్పించాం. "కావలసిన సరుకులూ, సంబారాలు తెచ్చి సన్నాహాలు చేస్తా"మంటూ ఓ నలుగురు ఔత్సాహికులు ముందుకు వచ్చారు.

సంక్రాంతి బొమ్మల కొలువుకి చిన్న చిన్న బొమ్మలు కాబట్టి కొంచెం క్లే సరిపోయింది. ఈసారి అలా కాదుగా పూజ కోసం కొంచెం పెద్ద వినాయకుడు కావాలి. అందుకోసం బోలెడు కార్న్ స్టార్చ్, ఉప్పుతో పాకాలు మొదలెట్టాం. ఒకరు స్టార్చ్ కొలుస్తుంటే, మరొకరు ఉప్పు పోయ్యి మీదేక్కించడం. స్టార్చ్ నీళ్ళలో కలిపి గట్టిగా గరిటతో తిప్పి, మొత్తం పదార్ధాన్ని పెద్ద గిన్నెలో వేసి గుండ్రని ఉండ్రాళ్ళలా చేసి జిప్ లాక్ బాగ్ లో పెట్టేసరికి తెల్లని కమలాల్లాంటి చేతులు కాస్తా ఎఱ్ఱని మ౦కెన్నలయ్యాయి. క్లే సిద్దం.

     
      "ఇప్పుడు వినాయకుడిని ఎలా చేయాలో చూపిస్తాను." అంటూ విజయ కొంత క్లే తీసుకుని మూడు బంతుల్లా గుండ్రంగా చేయడం మొదలెట్టారు. మేం కూడా తనలాగే చేశాం. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వినాయకుడిని కూడా తనెలా చేస్తే అలా చేస్తూ ఓ అరగంటయ్యాక తయారయిన వినాయకులను చూస్తే ఒక వినాయకుడు కొంచం జెట్లాగ్ తో తూలుతుంటే, మరో వినాయకుడు ఎక్సర్సైజ్ చేసి మరీ సన్నగా తయారయ్యాడు. క్లేతో మళ్ళీ మళ్ళీ చేసి చివరకు సరిగ్గా వచ్చేలా చేశాం. ఇక తరువాత కార్యక్రమ౦ పిల్లలతో ప్రతిమ చేయించడం.
   
      ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా మా వాళ్లది మరీ సనాతన వ్యవహారం లెండి. ఇమెయిల్ కి సమాధానం వుండదు. ఒక్కరికీ ఫోన్ చేసి "అమ్మా ఫలానా టైం కి బొమ్మలు చేస్తున్నాం. పిల్లల్ని పంపండి" అని బతిమలాడుకుని ఓ శనివారం ఉదయం పదిగంటలకు వాళ్ళను పంపించేలా ఒప్పించాం. ముహూర్తం అదీ చూసుకుని ("దీనికి కూడా ముహూర్తమా" అని ఆశ్చర్యపోకండీ. ముప్పై మంది పిల్లలకు కుదరాలంటే ముహూర్తబలం ఘాట్టిగా వుండాలిగా) ఓ శనివారం ఉదయం పదిగంటలకు అందరం ఒక ఇంటికి కలుద్దామనుకున్నాం.

పిల్లలు,సహాయం చేస్తామన్న పెద్దలు ఉదయాన్నేవచ్చేశారు. పిల్లలతో విఘ్నేశ్వర శ్లోకం చెప్పి౦చి, వారికి వినాయకుడి కథ చెప్పి  బొమ్మలు చేయడం మొదలు పెట్టా౦.
"ఆంటీ, నా చెవులు పెద్దవిగా వున్నాయ్ సరిపోతాయా?"
"ఎంత పెద్దగా వుంటే మీ అమ్మ మాట అంత బాగా వినపడుతుంది నిఖిల్, ఫరవాలేదులే అలాగే పెట్టై"
"ఇదేమిట్రా శ్రీకర్ నీ వినాయకుడి చెవులు చేతులమీద వాలిపోయాయ్. కొంచెం పైకి పెట్టు"
"యజ్ఞా, నీ వినాయకుడి తొండం పాములాగా సన్నగా వుంది, బాగా లావుగా చేయి"
"నవీన్, నీ వినాయకుడు జాగింగ్ చేసినట్లున్నాడు, కాళ్ళు ఇంకొంచెం లావుగా వుండాలి"
"కాళ్ళు రెండు కూర్చున్నట్లుగా పాదాలు ఒకదానిమీద ఒకటి ఉండాలి నవ్యా. నువ్వేమిటి ఇలా పెట్టావ్?"
"మా కీర్తన ఇలాగే కూర్చుంటుంది ఆంటీ".
ప్రతిమ చేయడం పూర్తిచేసిన పిల్లలు వారి పేరు వ్రాసున్న ప్లేట్ లో ఆ బొమ్మను పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు.
"ఎలుక చేయడం మర్చిపోయాం, ఇప్పుడెలా? పిల్లలు కూడా వెళ్ళిపోయారు."
"కంగారేం లేదు. మనం చేసేద్దాం" అంటూ ముప్ఫై ఎలుకలు చేసేశాం.
రంగులు వేయాలంటే ఓ రెండువారాలు ఆరాలి. ప్రతిమలన్నీ తీసుకుని వెళ్ళి గరాజ్ లో ఆరపెట్టాం.

వినాయకులకు రంగులు వేయడానికి పిల్లలకు బదులుగా పెద్దవాళ్ళం  వేద్దామనుకున్నాం. ఓ సెలవురోజు సాయంత్రం అందరం కలిశాము. బ్రష్ లతో రంగులు వేస్తూ "చిన్నప్పుడెప్పుడో ఇలా బ్రష్షులు పట్టుకున్నాం, మళ్ళీ ఇన్నాళ్ళకు...." అంటూ ముచ్చట పడిపోయారు కొందరు.
"మా వినాయకుడి కీరీటం చూడండి." మురిసిపోయిందో ఆవిడ.
"మీ వినాయకుడు నగలు మెరిసిపోతున్నాయ్, వంకీలు కూడా పెట్టారా....నేనూ అలాగే పెడతాను"
"నీలవేణి గారు హారానికి పచ్చలు, కెంపులు పొదిగారు చూశారా?"
"ఈ అయిడియా బావుంది. నేను కిరీటానికి కూడా పెడతాను"
"మీరు చెవులకు వేసిన డిజైన్ బావుంది."
"మీరు కళ్ళు బాగా పెట్టారు రాధా."
"కళ్ళే౦ చూశారు, ఐ బ్రోస్ చూడండి, ఎంత చక్కగా పెట్టారో!"
"ఎలుకకు కళ్ళు పెట్టడం మరచిపోకండి."
"మా వినాయకుడు జంధ్యం వేసుకున్నాడు."
"అమ్మాయ్ మీర౦దరూ కలసి ఎంత బాగా చేస్తున్నారు, ఇండియాలో ఎవరూ ఇలా చెయ్యరు. అన్నీ కొనేసుకోవడమే. అమెరికాలో మాకు నచ్చింది ఈ సమైక్యతే" అక్కడికొచ్చిన ఓ పెద్దాయన ప్రశంస. ఆ విధంగా వినాయకులను తయారుచేసి సర్వాలంకార శోభితమైన వినాయకులతో ఈ ఏడాది వినాయక చవితి జరుపుకున్నాం.


చివరగా.....
క్లే తయారుచేస్తూ తాగిన ఫిల్టర్ కాఫీ రుచి అమోఘం.
రంగులు వేస్తున్న సమయంలో చిన్నగా పడుతున్న చినుకుల సవ్వడికి తోడుగా "నగుమోము గనలేని" అంటూ వినిపించిన మధురస్వరానికి అభినందనలు. ఇంతమంది పెద్దలను, పిన్నలను ఆదరించి అతిధి మర్యాదలు చేసిన పెద్ద మనసుకు ధన్యవాదాలు. మొత్తం పనిని భుజాలమీదకు ఎత్తుకుని సంపూర్ణంగా పూర్తిచేసిన ఆ ముగ్గురికీ ప్రత్యేక ధన్యవాదాలు. సున్నండలు, భెల్ పూరి, వేడి వేడి టీ, అన్నింటికీ మించి సజ్జన సాంగత్యం ఆ సాయంత్రానికి అమరత్వం ప్రసాదించాయి.

     నలుగురితో కలసిమెలసి సరదాగా గడపడమే అసలైన పండుగ. అనుకోవడమే తరువాయి ఆచరణలోకి తీసుకువచ్చిన స్నేహితులు, సన్నిహితులు ఇంతమంది చుట్టూ ఉండగా ఈ సౌభాగ్యం ప్రసాదించిన ఆ దేవుణ్ణి ఇవాళ ఏం కోరుకోవాలో తోచలేదు. ఈ సమైక్యతను, అనుబంధాన్ని సర్వదా నిలిచేలా చూడమని మాత్రం వేడుకున్నాను.


30 comments:

  1. అభినందనలండీ.. కలసి కలదు సుఖం అన్నమాట. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు.

    ReplyDelete
    Replies
    1. సుభా వచ్చేశావా..ఇప్పటికి నిండుగా వుంది ఈ బ్లాగ్. థాంక్యు.

      Delete
  2. బుజ్జి గణపయ్య ఎంత ముద్దు గా ఉన్నాడో. మీరు ఏ ఊరు లో వుంటారు జ్యోతి గారు..నేను ఆ ఊరికి మారిపోతాను :) భలే ఉంటాయి మీ కమ్యూనిటీ ముచ్చట్లు.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ మా ఊర్లో పండుగైనా, పుట్టినరోజైనా ఇలా నిండుగా జరుపుకుంటాం. తప్పకుండా వచ్చేయండి వినీల గారు. థాంక్యు.

      Delete
  3. Replies
    1. జ్యోతిర్మయి గారు..
      మీరు స్వయంగా తయారుచేసిన బుజ్జి వినాయకులు,
      అందరి శ్రేయస్సు కోరుతూ మీరు చేసిన పూజ అన్నీ చాలా బాగున్నాయండీ..
      మీకు,మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు..!

      Delete
    2. రాజి గారు ఈ అభినందనలు వినాయలకులను చేయించిన వారికి దక్కాలి. ధన్యవాదాలు.

      Delete
  4. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు జ్యోతిర్మయిగారు... :)

    ReplyDelete
    Replies
    1. శోభ గారు చాలా కాలానికి కనిపించారు. బావున్నారా? థాంక్యు.

      Delete
  5. అసలైన వినాయకచతుర్థి జరుపుకున్నారన్న మాట.
    అభినందనలు, శుభాకాంక్షలూ కూడా...

    ReplyDelete
    Replies
    1. శ్రీలలితగారు అవునండి. ధన్యవాదాలు.

      Delete
  6. బాగున్నాయండి బొమ్మలు, క్లే ఎలా తయారుచేసారో,కొంచెం వివరంగా వివరిస్తారా, వీలైతే మరో పోస్ట్ లో..

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా భాస్కర్ గారు. థాంక్స్

      Delete
  7. చాలా బాగున్నాయి
    గణేశ విగ్రహాలు...
    టీం వర్క్ ని తెలియ జేసే మంచి పోస్ట్...
    అభినందనలు జ్యోతి గారూ!
    @శ్రీ

    ReplyDelete
  8. మీరు చాలా practical గా ఉంటారు.పండుగ అంటే అందరూ కలవటమే కదండీ.చివరి మీ సందేశం చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. అందరూ కలిస్తేనే కదండి ఆనందం.థాంక్యు రావిశేఖర్ గారు.

      Delete
  9. spoortikaramgaa.. undi. AACHARANA lo meeku meere saati Jyothirmayi gaaru.

    mee preu saardhakam chesukuntunnaaru.

    andaru kalasina naadu ade panduga.

    Abhinandanalu.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషంగా అనిపించింది వనజగారు. థాంక్యు.

      Delete
  10. బాగున్నాడండి మీ వినాయకుడు . అందరూ కలిసి చక్కగా చేసుకున్నారు .

    ReplyDelete
    Replies
    1. మాలా కుమార్ గారు..ఇంత దూరంలో ఉంటాం. పండుగ రోజు కూడా సెలవ వుండదు. ఇలాంటివి చేసుకుంటే ఆ జ్ఞాపకంతో పండుగ ఆనందంగా జరుపుకుంటాం. థాంక్సండి.

      Delete
  11. baagunnayi mee bujji vinaayaka bommalu. meeku melu jaragaalani korukuntunnaanu

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు మెరాజ్ గారు.

      Delete
  12. ఆలస్యంగా చూసాను ఈసారి చేస్తాను.:)

    ReplyDelete
  13. తప్పకుండా చెయ్యండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  14. భలే బాగుందండీ మీ పండగ సంబరం.. చాలా ముద్దుగా ఉన్నారు బుజ్జాయిలు చేసిన వినాయకులందరూ.. :)

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులకు కనిపించారే. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు మధుర గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.