Tuesday, July 7, 2015

ఏమండోయ్...

"మిమ్మల్నే.... పిలుస్తుంటే పలకరేం?"
"పిలిచావా? ఏమని?"
"ఏమని పిలుస్తానో తెలీదా?"
"ఎందుకు తెలీదు. బాగా తెలుసు. అలా దారిని పొయ్యేవారిని పిలిచినట్లు 'ఏవండోయ్' ఏవిటి? చక్కగా పేరు పెట్టి పిలవొచ్చుగా?"
"అలవాటు లేని పని కొత్తగా ఎందుకని?"
"అలవాటుదేముంది చేసుకుంటే అదే వస్తుంది."
"మిమ్మల్ని చేసుకున్నాను చాలదూ!"
"అదంతా ఏం కుదరదు. ఇవాళ నన్ను పేరు పెట్టి పిలవాల్సిందే"
"పేరా... ఏం పేరూ?"
"మా అమ్మా నాన్న పెట్టిన లక్షణమైన పేరు."
"మిమ్మల్ని నాకిచ్చేశారుగా. కనీసం ఆ పేరన్నా వాళ్ళకి వదిలేద్దామని."
"అబ్బో గొప్ప ఆలోచనే!"
"కదా!"
"కదా లేదు ఏం లేదు. పిలవాల్సిందే"
"కుదరదు."
"ఏం.. ఎందుకని"
"ఏవిటో సిగ్గనిపిస్తోంది"
"కొత్త పెళ్ళికూతురా రారా! నీ కుడికాలు ముందుమోపిరారా!...."
"చాల్లే. అయినా నేను సిగ్గుపడితే అందంగా ఉంటానని నిన్నేగా అన్నారు. ఇప్పుడేమో ఎగతాళి చేస్తున్నారు"
"అది రాత్రి మాట కదా!"
"పగలో మాట రాత్రో మాట. మాట మార్చడం మీ వంశంలోనే లేదని మొన్న మీ మామయ్యతో అన్నారు..."
"ఏదో కోపంలో మాటా మాటా అనుకున్నాం. అయినా బోడి గుండుకూ మోకాలికీ ముడి పెడతావే."
"ఎంత కోపం వస్తే మాత్రం పెద్దవాళ్ళతో అందులోనూ మేనమామతో అలాగేనా మాట్లాడేది?
"మరి ఆయనన్న మాటలు యెట్లా ఉన్నాయ్?" 
"యెట్లా ఉన్నాయేమిటి?"
"ఆయన తాతగారిని, అమ్మావాళ్ళను అలా అనడం తప్పుకాదూ"
"తప్పే."
"ఆ విషయం ఆయనకు మాత్రం తెలియదూ?"
"తెలుసు. చివరి రోజుల్లో మీ అత్తయ్య తాతగారిని చూడక పోవడం. ఆస్తంతా ఆయన అత్తయ్యగారి పేరున వ్రాయడం ఈ గొడవలన్నింటికీ కారణం. మీ అత్తయ్య ఆయనని చూడకపోవడంలో మీ మామయ్య తప్పేం ఉంది? పైగా ఆయనకు తండ్రి కోసం ఏమీ చెయ్యలేక పోయాననే గిల్టీ కాన్షస్. దాంతో ఏదో అన్నారు. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఊరుకుంటే పోయేదిగా"

"మరి నాకు మాత్రం కోపం రాదేమిటి?"
"వస్తుంది. ఆ కోపంలో చిన్నప్పట్నుండీ ఆయన మిమ్మల్ని ఎంత గారాబం చేసేవారో, మీ అత్తయ్యకు మీరంటే ఎంత ఇష్టమో మర్చిపోయారా? వాళ్ళతో గడిపిన సమయం అంతా ఇప్పుడు తలచుకుంటే ఎలా ఉంది? అన్నీ పాడుచేసుకుంటారా?"

"నిజమే. బాధగానే ఉంది. కాని ఆయన అలా చేయడం తప్పుకదూ! పైగా అప్పుడు అత్తయ్యకు సర్ది చెప్పుకోలేక ఇప్పుడిలా మాట్లాడడం!"
"మీ తాతగారికి ఆడవాళ్లంటే ఉన్న చులకన మీకు తెలుసుగా! స్వతహాగా మీ అత్తయ్య చాలా మంచివారు. ఆవిడ మనసెంత కష్టపడితే అలా బిహేవ్ చేసి ఉంటారో మీరూహించగలరా?"

"అయితే మాత్రం?"
"అయితే గియితే ఏమీ లేదు. ఆవిడ చెప్పుల్లో కాళ్ళు పెట్టి గతాన్నీ భవిష్యత్తునూ మనం చూడలేం. అయినా అలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే చివరకు మనకూ ఎవరూ మిగలరు."

"అవుననుకో అన్ని మాటలనుకున్నాక అంతకు ముందులా ఎలా ఉండగలం?"
"చక్కగా ఉండొచ్చు. బూరెలు చేశాను. మీ మామయ్యకు ఇష్టంగా! తీసుకుని సాయంత్రం వాళ్ళింటికి వెళ్దాం. మీ అత్తయ్య మీ కిష్టమైన మామిడికాయ పులిహోర చెయ్యకపోతే నన్నడగండి"
"అంతేనంటావా?"
"అంతే కాదు. ఇప్పుడంటే కోపంలో ఉన్నారుగాని, మీరెవ్వరూ మీ మామయ్యతో మాటాడక పోవడం, రెండు కుంటుంబాల మధ్య కలతలు రావడం అత్తయ్యగారికి ఎలా ఉంటుందో ఆలోచించండి."
"....."
"అయిన వారి మధ్య కలతలు ఎన్ని మానసిక సమస్యలకు దారి తీస్తాయో మీకు తెలియదు. అహానికి పెద్ద పీట వేస్తే సౌఖ్యానికి తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుంది. పరిస్థితి చేయి దాటనివ్వకండి."
"......"
"ఎమాలోచిస్తున్నారు?"
"నువ్వు గొప్ప మాయల మరాఠివి"   
"అందరం బావుండాలని తోచిన సలహా చెప్పాను. గొప్ప బిరుదే ఇచ్చారు. ఇష్టం లేకపోతే మానెయ్యండి"
"ఆహ అది కాదు" 
"ఏది కాదు సందర్భం వచ్చింది కదా అని చెప్పాను. కోపంలోనో, ఆవేశంలోనో ఒకరు తడబడినప్పుడు రెండో వారు దిద్దుకుంటేనే కదా జీవనం సవ్యంగా సాగేది. నాకెన్నిసార్లు మీరిలాంటివి చెప్పలేదు."

"సర్లేవోయ్. అసలు విషయానికి వద్దాం" 
"ఏ విషయం....ఓ అదా!"
"అదా అని అంత తేలిగ్గా అనేస్తే ఎలా..."
"బరువుగా అనడం రాదు మరి. నేనసలే ఏడు మల్లెలెత్తు. మిమ్మల్ని కలిసిన మొదటి సారి మా బాబాయి చెప్పలేదూ"
"అప్పుడు ఏడు మల్లెలే. ఇప్పుడే ఏడువేల మల్లెలయ్యాలి."
"ఎన్నయినా మల్లెలు మల్లెలే."
"మల్లెలు మల్లెలే జాజులు జాజులే"
"ఇప్పుడా మల్లెలు జాజుల కథలెందుకులెండి!"
"ఔనంటే కాదనిలే... కాదంటే ఔననిలే... ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే....ఇప్పుడు ఎందుకన్నావంటే మరి కావాలన్నమాటేగా!"
"ఆడవాళ్ళందర్నీ కాచి వడపోసి గొప్ప మాటే చెప్పారు కవిగారు"
"కవిగారి సంగతి మనకెందుకు కాని 'బాహుబలి' ఎల్లుండి రిలీజ్ అవుతోందిట. వెళ్దామా?"
"వెళ్దాం. టికెట్స్ దొరుకుతాయా?
"నీకెందుకు నేను తీసుకొస్తాగా. అయితే ఒక షరతు" 
"ఏమిటో..." 
"ఏముంది పేరు పెట్టి పిలవడం."
"మీరింకా మర్చిపోలేదా?"
"లేదు" 
"ఓ విషయం చెప్పనా?"
"చెప్పొద్దు."  
"ఇప్పుడూ..." 
"ఇప్పుడూ లేదు అప్పుడూ లేదు. ఎప్పుడైనా సరే పేరు పెట్టి పిలవాల్సిందే"
"అబ్బ నన్ను కొంచెం చెప్పనిస్తారా?"
"నివ్వను."  
"అది కాదండీ."
"ఏది కాదండీ." 

"పేరుతో పిలవడానికేం అభ్యంతరం లేదు. కాకపోతే...ఈ ప్రపంచంలో ఒకే ఒక్క పేరు....అదీ నాలుగక్షరాల కలయిక మాత్రమే. ఆ పేరు పలకడానికి ఏదో సిగ్గు, బిడియం. తెలియని భావాలేవో ఎదలో మెదులుతుంటే తొలిసారి మిమ్మల్ని యేమని పిలిచానో జీవితాంతం అలానే పిలవాలనిపిస్తుంది. ఆ రోజు మన మధ్య మొదలైన స్నేహానికి గుర్తుగా అనుక్షణం హృదయ సీమలో విహరించే అక్షరాలను పెదవి దాటనీయక పదిలంగా దాచుకోవాలనీ, ఆ అనుభూతిని అలాగే నిలుపుకోవలనీ అనిపిస్తుంది. లేదూ కాదూ పేరుతోనే పిలవాలంటే మీ ఇష్టం"

*                       *                       *                        *          

ఏమండోయ్ మిమ్మల్నే. ఐదున్నరౌతోంది ఇక బయలుదేరదామా?
ఇదుగో వచ్చేస్తున్నా. కారు తాళాలు తీసుకో!


16 comments:


 1. శర్కరి జ్యోతిర్ మాయీ వారు,

  మీరు గొప్ప మాయల మరాఠి :)

  నాకో సందేహం :) సీతమ్మోరు రాములోరి ని పేరు పెట్టి పిలిచి ఉంటుందంటారా ? అబ్బే జస్ట్ ఒక సందేహం మాత్రమె :)


  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. :)

   మీరు పాదరసం. థాంక్యు.

   థాంక్

   Delete
 2. ముద్దుగా పిలిస్తే నోట ముత్యాలు రాలుతాయా? :)

  ReplyDelete
  Replies
  1. మరేనండి. పిలిచేయెచ్చుగా గడుసుగా తప్పించుకుంది.

   Delete
 3. :-) బాగుంది

  "కోపంలోనో, ఆవేశంలోనో ఒకరు తడబడినప్పుడు రెండో వారు దిద్దుకుంటేనే కదా జీవనం సవ్యంగా సాగేది"

  ReplyDelete
  Replies
  1. థాంక్యు భాస్కర్ గారు.

   Delete
 4. "ఆ రోజు మన మధ్య మొదలైన స్నేహానికి గుర్తుగా అనుక్షణం హృదయ సీమలో విహరించే అక్షరాలను పెదవి దాటనీయక పదిలంగా దాచుకోవాలనీ, ఆ అనుభూతిని అలాగే నిలుపుకోవలనీ అనిపిస్తుంది"

  బావుందండీ బా రాసారు

  ReplyDelete
  Replies
  1. థాంక్యు శ్రీనివాస్ రావు గారు.

   Delete
 5. బావుందండి :) రాధిక(నాని)

  ReplyDelete
  Replies
  1. థాంక్యు రాధిక గారు.

   Delete
 6. హమ్మయ్య ! సీతమ్మోరు, రాములోరు అంతా సేఫ్ గా ఉన్నారు :)

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. పుష్కరాల దగ్గర కానీ కనిపించారేమిటండీ..:)

   Delete
 7. చివరి రోజుల్లో అత్తమామలను చూసుకోలేకపోతున్నామనే గిల్టీ కాన్షియస్ అందరికీ ఉంటుంది. ఇపుడు ఎవరూ ఎవరిదగ్గరా ఉండడానికి ఇష్టపడడం లేదు.అందరూ స్వేచ్చ కోరుకుంటున్నారు.
  హం ఆప్ కే హై కౌన్,హం సాథ్ సాథ్ హై సినిమాలు ఎంతో ఇష్టంగా చూసేవాళ్ళం కూడా అత్తమామల ఇంట్లో ఉండడానికి మాత్రం ఇష్టపడడం లేదు.
  ఒక్కడే కొడుకయినా పెళ్ళయిన కొత్తలోనే మా మామగారు మీ లైఫ్ మీది మా లైఫ్ మాది అని తేల్చి చెప్పేసారు,నేనూ అదే ఫాలో అయిపోతున్నా !

  ReplyDelete
  Replies
  1. మీరన్నదీ నిజమేనండి. శిశిరానికి చోటివ్వడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. పూర్తిగా నడవలేని స్థితి గురించి నేను వ్రాసింది.

   Delete
 8. అటుచేసి ఇటుచేసి మొత్తానికి పేరుతో పిలవనే లేదు :-)

  ReplyDelete
  Replies
  1. నిజమేనండోయ్. నాలుగు మాటలు చెప్పి తప్పించేసుకుంది. : - )

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.