Showing posts with label స్ఫూర్తి. Show all posts
Showing posts with label స్ఫూర్తి. Show all posts

Wednesday, February 19, 2014

ఇంకేమంటాం?

సమీరలాంటి వారిని ఏమనాలో కూడా అర్ధం కాదు. ఆడవాళ్ళంటే కాస్త సుకుమారంగా, కొంచెం బేలగా, అంతో ఇంతో మొహమాటపడుతూ ఉంటే కదా అందం. అలాంటిదేవీ లేకపోగా అమెరికా వచ్చిన ఏడాదిలోనే ఏవో కోర్సులవీ చేసి ఐటిలో ఉద్యోగం సంపాదించింది. ఇండియాలో ఏదో పెద్ద చదువు చదివిందనుకుంటున్నారేమో! అదేం కాదు బికాం డిగ్రీ చేతబట్టుకుని వచ్చింది. ఉద్యోగం కూడా ఏ ఇంటిపక్కనో చూసుకోకుండా ఊరికిరవై మైళ్ళ దూరంలో వున్న ఆఫీసుకు అప్లయ్ చేసింది. డ్రైవింగ్ అన్నా వచ్చా అంటే అదీ అంతంత మాత్రమే. "పాపం ఆడపిల్ల హైవే లవీ ఎక్కి అంత దూరం ఎలా వెళ్తుంది? కొన్ని రోజులన్నా ఆఫీస్ దగ్గర దింపుదా౦" అని లేకుండా వాళ్ళాయన "నువ్వెళ్ళిపో" అని పెళ్ళాం కట్టిచ్చిన కారేజ్ తీసుకుని చక్కా పోయాడు. ఆ ఫ్రీవే మీద మరొకరైతే ఏం చేసేవారో కాని సమీర కదా ఎంచక్కా ఆఫీస్ కెళ్ళిపోయింది. "ఎలా వెళ్ళావ"ని అడిగితే "వేరే దారిలేదుగా" అని నవ్వుతూ సమాధానం.

మేమందరం స్టీరింగ్ పట్టుకోవడానికి భయపడి మగమహారాజులు డ్రైవ్ చేస్తుంటే నిశ్చింతగా పక్కన కూర్చుని ఊరు వాడా తిరిగేస్తున్న సమయంలోనే, ఈవిడ డ్రైవ్ చెయ్యడం ఆయన సుఖంగా ముందు సీట్లో కాళ్ళు డాష్ బోర్డ్ మీద పెట్టుక్కూర్చోవడమూను...అంతలోనే అయిపోతే కథేముంది? వినండి.

ఓ రెండేళ్ళు తిరిగేసరిగి సమీర తల్లి కాబోతుందని తెలిసింది. అంతా మామూలుగా ఉంటే మన౦ వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటాం? నిండు చూలాలు, రేపో మాపో ప్రసవం అయ్యే భార్యను పరాయి దేశంలో ఒంటరిగా వదిలి నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందని సమీర భర్త ఇండియా వెళ్ళాడు. అసలు తప్పంతా సమీరదే, అతనెంత తండ్రి మీద ప్రేమతో వెళ్ళాలనుకున్నా తొలి కాన్పు తనను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దని చెప్పక్కర్లా. అబ్బే అదే౦ లేదు, పైగా బట్టలన్నీ శుభ్రంగా మడతలు పెట్టి సూట్ కేస్ లో సర్ది పెడుతుందా? తీరా పురిటి సమయానికి స్నేహితులెవరో సంతకం చేస్తే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. వాళ్ళాయన ఊరినుండి వచ్చేసరికి మగబిడ్డను ప్రసవి౦చిదనుకో౦డి. పరిస్థితి తారుమారుయ్యుంటే ఎవరు దిక్కు? ఏమైనా చెప్పామనుకోండి. "అతనికి వెళ్ళాలని వుంది నేను ఆగమని చెప్తే ఆగుతారా" అని నవ్వేస్తుంది. ఎక్కడా కోపం, దిగులు మచ్చుకైనా కనబడవంటే నమ్ముతారా?

మరో రెండేళ్ళకు ఇంకో చంటిది. సరే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు...ఇద్దరు పిల్లలు... ఇహనంతా మామూలుగా ఉందిలే అనుకున్నాం. ఈలోగా ఏమైందో ఏమో వున్న ఉద్యోగం మానేసి కన్స్ట్రక్షన్ బిజినెస్ అంటూ ఇల్లు కట్టించడం మొదలు పెట్టింది. "ఇదేం పని, ఇదేమైనా మన దేశమా? లేక మనకేమైనా మిలియన్స్ ఉన్నాయా? ఇలాంటి పని చేశారు. ఈ ఇల్లు కట్టించడం మనవల్ల అయ్యే పనేనా?" అని ఎన్నో విధాల చెప్పి చూశాం. ఇద్దరిదీ చిరునవ్వే సమాధానం. ఇంటి పనికి సమయం సరిపోవడం లేదని ఉన్న ఉద్యోగం మానేసింది. "ఇప్పుడెలా డబ్బులూ అవీ చాలా కావాలేమో కదా" అంటే "అవే వస్తాయని" ఆయన సమాధానం. ఆ ఇల్లు కాస్తా పూర్తయ్యింది. ఏమాటకామాటే ఇల్లు ఇంద్ర భవనంలా ఉందనుకోండి. ఇక అమ్మేద్దాం అనుకునే సమయానికి అమెరికాలో ఆర్ధిక కాటకం అదేనండీ రెసిషన్. చేసేదేం లేక ఆ ఇంట్లోనే కాపురం పెట్టారు. అప్పుడన్నా మోహంలో ఎక్కడైనా దిగులు విచారం కనిపిస్తాయేమో అని చూశాం. అబ్బే అదే చిరునవ్వు.

"ఇప్పుడేంటి సమీరా, మళ్ళీ ఉద్యోగంలో చేరుతావా?" అని అడిగితే "ఇద్దరం బిజీగా వుంటే పిల్లలకు కష్టమౌతుంది. మెడికల్ బిల్లింగ్ చేద్దామనుకుంటున్నాను" అని చెప్పింది. ఏ డాక్టర్ ఆఫీస్ లోనే పని చేస్తుంది కాబోలుననుకున్నాం. ఆ కోర్స్ ఏదో చేసి పదివేల డాలర్లు పెట్టి కావాల్సిన సరంజామా తయారు చేసుకుని సొంతంగా ఆఫీస్ మొదలు పెట్టింది. రెండేళ్ళ వరకూ డాక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగింది తిరిగినట్లే ఉందనుకోండి ఒక్క డాక్టరూ కరుణించలా. ఆ దారిలో వెళ్దామనుకున్నకొందరు స్నేహితులు చేతులెత్తేశారు. కాని తను మాత్రం అనుకున్నది సాధించింది. ఇప్పుడు ఇండియాలో కూడా దానికనుబంధంగా మరో ఆఫీస్ తెరిచి౦దిట. "అబ్బా నువ్వు చాలా గోప్పదానివి సుమా " అంటే కనీసం దానికైనా ఒప్పుకోవచ్చుగా "నేనే చెయ్యగలిగానంటే ఎవ్వరైనా చెయ్యగలరని" మనల్నే మునగ చెట్టు ఎక్కించేస్తుంది. ఇలాంటి వారిని ఏమనాల౦టారూ?

Wednesday, April 25, 2012

ఎందరో మహానుభావులు

మా ఊరిలో కొత్త పత్రిక ప్రచురణ గురించి చెప్పాను కదా.. మేము ప్రచురించిన రెండవ పత్రిక ఇది. తొలి పత్రిక పోయిన ఉగాదికి ప్రచురించాము. ఆ పత్రికావిష్కరణ శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా జరిగింది. ఈ పత్రికలే కాక మరో నాలుగు వార్తాపత్రికలు కూడా చేశాము కాని, వాటిని ముద్రించలేదు.

పత్రిక ప్రారంభించడం వెనుక కథ చెప్పాలి మీకు. పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నాము కదా, వారికి ఏవిధంగా స్ఫూర్తి నివ్వాలి అని ఆలోచించాము. పిల్లలు పెద్దలను చూసి అనుకరణతో చాలా విషయాలు నేర్చుకుంటారు. మరి పిల్లలు చూస్తుండగా పెద్దలెప్పుడూ తెలుగు చదవడం, రాయడం జరగడం లేదు. 'ఏ విధంగా పెద్దవాళ్ళను తెలుగు చదవడానికి ప్రోత్సహిచాలా' అన్న ఆలోచనలో ఉండగనే మా ఊరిలో పిక్నిక్ జరిగింది. ఆ సమయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో యాదృచ్చికంగా పత్రిక గురించిన చర్చ వచ్చింది. మా తెలుగు అసోసియేషన్ వారు, ఎవరైనా పత్రిక నడపడానికి స్వచ్ఛందంగా ము౦దుకు వచ్చే పక్షంలో పత్రిక, లేక వార్తా పత్రిక మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అప్పుడు ఈ పత్రిక చేయడానికి శ్రీవారు ముందుకు రావడం జరిగింది. మనం ఏదైనా తలచుకుంటే దైవ సహాయం ఎలా లభ్యమవుతుందో ఆ సంఘటన ద్వారా తెలిసింది.

ఒక పత్రిక రూపుదిద్దుకోవాలంటే ఎన్నిన్ని అంశాలు౦టాయో అనుభవపూర్వకంగా అవగతమయ్యింది. ఏ కథలు కావాలి, ఎన్ని కవితలుండాలి, వ్యాసాలు, పిల్లల కోసం ప్రత్యేకమైన కథ...ఈ విషయాలన్నీ సమగ్రంగా పరిశీలించి కావలసినవి మా ఊరి ప్రజలు రాసేలా ప్రోత్సహించాం. మొదట్లో ఒకరో ఇద్దరో రాసి పంపించారు. ఇప్పుడు మెల్లగా ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని పత్రికలో ఏయే పేజీలలో వచ్చేలా చూడాలనేది రెండో అంశం అదే 'లేఅవుట్' అంటే డిజైన్. మిగిలినది అచ్చుతప్పులు, ఐదారు సార్లు సరిచూసినా కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే
అచ్చుతప్పులు మా ఎడిటోరియల్ బోర్డ్ సమర్ధవంతంగా సరిదిద్దారు.

మన సంస్కృతి, సాంప్రదాయాలకు సంబధించిన ఎన్నో వ్యాసాలు, కథలు, కవితలు, పిల్లల కోసం ప్రత్యేకమైన కథ, ఇలా ఎన్నో అంశాలు ఈ పత్రికలో చోటుచేసుకున్నాయి. ఈ పత్రిక ఇప్పుడు మా ఊరి తెలుగువారి ఇళ్ళల్లో కాఫీ టేబుల్ మీద ఉండడం, వారందరూ కూడా చదవడం జరుగుతోంది. వాహిని పత్రికను మీతో పంచుకోవాలని బ్లాగ్ లో పెడుతున్నాను. మీ సలహాలు, సూచనలు పత్రికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి.

ఒక పత్రిక వెనుక ఇంత కథ ఉందా అనిపించింది. ఏడాదికి రెండు, మూడు పత్రికలకే ఇంత పని ఉంటే స్వలాభాపేక్ష లేకుండా నెలకో పత్రిక వేస్తున్న సంపాదకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఇతర దేశాలలోవు౦డి సాహిత్యసేవ చేస్తున్న పత్రికా సంపాదకులకూ, వారికి తమ సహకారాన్నందిస్తున్నకార్యకర్తలకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.