Showing posts with label ఉత్తరాలు. Show all posts
Showing posts with label ఉత్తరాలు. Show all posts

Friday, June 8, 2012

నా ప్రాణమా...

      మీరు వెళ్లి ఒక్కరోజే అయినా ఎన్నో ఏళ్ళయినట్లుగా వుంది. ఈ వేళ నిద్ర లేవగానే అలవాటుగా పక్కకు చూశాను. దుప్పటి చుట్టుకుని నా పక్కనే పడుకునే చిట్టితల్లి కనిపించలేదు. గది బయటకు రాగానే పాప ఆడుతూ వదిలేసిన కుక్కర్ గిన్నెలోని కిచెన్ టవల్, సోఫా పక్కగా బోలెడన్ని గీతలతో 'మేగ్నాడూడిల్' కనిపించాయి. ఇలాంటివి చూసినప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని ఎవరైనా చెపితే నమ్మే వాడిని కాదేమో!

     వంటగదిలో శుభ్రంగా సర్ది పెట్టి ఉంచిన కౌంటర్ మీద రోజూ వుండే సీరియల్ బౌల్ లేదు. అలమరలోని బౌల్ తీసుకుని సీరియల్ వేసుకున్నాను, ఒంటరిగా తినాలనిపించలేదు. కాఫీ కలుపుకున్నాను కానీ చేదుగా ఉంది, కాఫీ పొడి ఎక్కువేయడం వల్లేనని సర్దిచెప్పుకున్నాను. టివీ లో వార్తలు చూసి పాపను లేపడానికి గదిలోకి వెళ్లాను. ఖాళీగా వున్న మంచం నన్ను వెక్కిరించింది. షేవింగ్ చేసుకుంటూ అద్దంలోకి చూస్తే షేవింగ్ క్రీం రాసుకున్న నా మొహాన్ని ఆశ్చర్యంగా చూసే చిట్టితల్లి కనిపించలేదు. కొంచెం క్రీం ముక్కు మీద రాయగానే కిలకిలా నవ్వే ఆ నవ్వు గుర్తొచ్చి౦ది.

     ఇలా లాభం లేదు.. ఆదివారమే అయినా ఆఫీస్ కి వెళ్లాలని షూ స్టాండ్ దగ్గర షూ వేసుకు౦టు౦టే, తనని కూడా తీసికెళ్ళమని షూ తెచ్చుకుని అల్లరి చేసే చిట్టితల్లి గుర్తొచ్చింది. అప్పుడప్పుడూ అల్లరి చేస్తుందని విసుక్కునే వాడిని కదూ, ప్చ్ ఇప్పుడు అలా అల్లరి చేస్తేవాళ్ళుంటే బావుండనిపిస్తోంది. కారెక్కగానే ఖాళీగా ఉన్న కార్ సీట్ పక్కనే పాప సిప్పర్ కనిపించింది. నిన్న హడావిడిలో కారులో వదిలేసినట్లుంది.

      చిట్టితల్లి ఫ్లైట్ లో బాగా పడుకుందా? నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదుగా. నేనిక్కడున్నా నా మనసు మీతో ప్రయాణం చేస్తూనే వుంది. మీరు ఎప్పుడు ఎక్కడ దిగుతారో ఏం చేస్తుంటారో ఊహిస్తూ ఉన్నాను. దుబాయ్ లో దిగగానే మెయిల్ పంపించమన్నాను, పాపతో కుదరలేదా పంపించలేదు. నేను ఇక్కడ లాప్ టాప్ ముందు కూర్చుని ఎంత ఎదురు చూశానో తెలుసా!

     అయినా నీకిదేమైనా న్యాయంగా వుందా..మీ అమ్మానాన్నలను చూడాలని నన్నూ, నా కూతుర్ని వేరు చేస్తావా? అదీ రెండున్నర నెలలా..నేను తనను వదిలి వుండగలననే అనుకుంటున్నావా. పోనీ వచ్చేద్దామన్నా ఆఫీస్ లో పరిస్థితి సెలవు పెట్టేలా లేదే...నీ హృదయం ఇంత పాషాణ౦గా ఎలా మారింది? ఏరోజైనా నిన్ను పల్లెత్తుమాటన్నానా? గుండెల్లో పెట్టి చూసుకున్నా కూడా పుట్టింటి ఊసు రాగానే నీ కళ్ళలో వెలిగే వెలుగు నన్నెంత బాధ పెడుతుందో తెలుసా..మన పెళ్ళికి ముందు నన్ను వదిలి క్షణమైనా ఉండలేనన్న నువ్వేనా నన్నొదిలి సంతోషంగా వెళ్లి౦ది? నిన్ను చూడకుండా నేను ఎలా వుండగలననుకున్నావ్?

     రోజూ నా భుజం మీద తల వాల్చి పడుకునే అలవాటు నీకు, మరి ఈ రెండు నెలలు నీకు సరిగ్గా నిద్ర పడుతుందా...మధ్యాహ్నం 'క్రాకర్ అండ్ బారెల్' కి వెళ్ళాను. పోయినసారి మనం వెళ్ళినప్పుడు నీకు నచ్చి సేల్ లో కొంటానని పక్కకు పెట్టావుగా ఆ క్రిస్టల్ వేజ్ కొని తీసుకొచ్చాను. నువ్వు పెట్టినట్లుగా అందులో నీళ్ళు పోసి గులాబీ పెట్టాను. ఆ పువ్వు చూడగానే నవ్వుతున్న నీ మొహం కనిపించింది. 'క్రేటర్ లేక్' కి వెళ్ళినప్పుడు బాక్ గ్రవుండ్ లో నీళ్ళు కనిపించేలాగా నీకు ఫోటో తీశాను చూడు...అది తీసి ఎండ్ టేబుల్ మీద ఫ్రేం లో పెట్టాను. అలా అయినా నువ్వు ఎదురుగా కనిపిస్తూ వుంటావని!

     సాయంత్రం ప్రవీణ్ వాళ్ళింటికి భోజనానికి పిలిచారు. అట్టహాసంగా ఎన్నో వంటలు చేశారు కాని, ఏ కూర కూడా నువ్వు చేసినట్లుగా లేదు. నాకు నీ చేత్తో చేసే పప్పుచారు, పచ్చడే కావాలి, మనిద్దరం కలసి భోజనం చేయాలి. అక్కడ అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మనం ఎవరింటికి వెళ్ళినా నిన్ను పట్టించుకోవట్లేదని గొడవ పెట్టేదానివా..ఇవాళ నువ్వు లేకుండా నేనక్కడ ప్రశాంతంగా ఉండలేకపోయాను.

     చీకటి నీడల్లో ఇంటికి చేరాను, దీపం లేని ఇల్లు శుష్కహాసంతో దర్శనమిచ్చింది. నవ్వు లేని నేను, ఇల్లు ఇరువురమూ ఒంటరులమే. ఉదయం నుండి పట్టించుకోలేదనేమో గులాబి రంగు దుప్పటి అలిగి మంచం మీద ఓ మూల కూర్చుంది. కిటికీలోంచి నెలవంక జాలిగా చూస్తోంది. చల్లగాలి గదిలోదూరి చలిగాలిగా మారింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద దువ్వెనకు చిక్కుకున్న పొడవైన నల్లని వెంట్రుక ఒక్కటే నా కళ్ళకు అందంగా కనిపిస్తోంది. నీ గొంతు విని ఇప్పటికి ముప్పై ఆరు గంటలైంది. నిన్ను చూడకుండా వుండడం నా వల్ల కాదురా...టికెట్ ప్రీపోన్ చేసుకుని వెంటనే వచ్చేయకూడదూ!

ఎప్పటికీ నీ....