Showing posts with label దృశ్య నాటికలు. Show all posts
Showing posts with label దృశ్య నాటికలు. Show all posts

Wednesday, January 29, 2014

అదన్నమాట సంగతి!

"నా అక్కకు రెండు కిడ్లు"
"మాకు ఇద్దరు కల్లున్నారు"


"రామ రామ! సంగతేమిటో చూద్దామని వస్తే, ఏమిటీ భాష?" అనుకుంటున్నారా... 
ఆ సంగతేమిటో నేను చెప్పడం ఎందుకు? స్వయంగా మీరే చూడండి. 




Thursday, April 12, 2012

గుర్..ర్...ర్......

      బ్లాగక్కయ్యలూ, బ్లాగ్ వదినమ్మలూ, చెల్లెమ్మలూ అందరూ కర్రలుచ్చుకొని ఇలా వచ్చెయ్యండొచ్చెయ్యండి.

      ఏమిటీ ఏమీ లేదే అంటున్నారా..మొదలెట్టిన ఓ  నిముష౦ తరువాత వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మీ చెవులతో మీరే వినండి. పైగా అదిచాలనట్టు చివర్లో ఆ పాటొకటి. 



Tuesday, February 21, 2012

అమ్మమ్మ గారూ అమెరికా ప్రయాణం

       నాన్నమ్మ, తాతయ్యల మమకారాలను, వారికి వారి మనుమలకూ వుండే భాషా౦తరాలనూ, అమెరికాలో వున్న పిల్లల, పెద్దల సంఘర్షణలను, ఇతివృత్తంగా తీసికుని చేసిన ప్రయత్నమే ఈ 'అమ్మమ్మగారు అమెరికా ప్రయాణం'.

        ఓ అమ్మమ్మగారు అమెరికాలో ఉన్న మనుమరాలిని చూడడానికి వస్తారు. ప్రయాణం గురించిన కబుర్లు మనం అమ్మమ్మ మాటల్లోనే విందాం.
                                                 
అబ్బ ఏం ప్రయాణమే పరమేశ్వరుడు కనిపించాడనుకో"
"అయినా అంత పెద్ద విమానం నడిపేటప్పుడు మంఛి వంట మనిషిని పెట్టుకోనఖ్ఖర్లా"
"ఆ విమానం బాత్రూముల్లో కనీసం మగ్గులన్నా పెట్టలేదేమే. మన రైళ్ళలోనే నయం. చదవేస్తే ఉన్న మతి పోయిందని"

అమ్మమ్మగారు ఏం తెచ్చారో చూడండి. 

"ఆ ఏమి లేవు అవకాయఉసిరికాయనిమ్మకాయచితకాయ తొక్కుటొమాటో పచ్చడిఉప్పుమిరిపకాయలుకాసిని జంతికలు సున్నుడలుఅరిసెలు"

ఇండియా వెళ్లి తమతో గడపడం లేదన్న బాధతో అమ్మమ్మ వేసిన చెణుకులు

ఆ...చూసి నాలుగేళ్ళవలా ఏం గుర్తుపడతార్లేఆ..అ వచ్చినప్పుడు కూడా షాపింగులనీ , చుట్టాలనీగుళ్లనీ, గోపురాలని తిరుగుతూనే వుంటారాయె."

పిల్లలు కోసం పెద్దల ఆరాటం....వారి మధ్య అడ్డుగోడగా నిలిచిన భాష గురించి బాధతో అమ్మమ్మ గారు ఏమన్నారంటే 

"రెండు నెల్లున్నారమ్మా... అయినా అలవాటే అవలా. ఆ శాంతమ్మవాళ్ళాయన ఆ పిల్లల కోసం కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారంటే నమ్ము. ఒక్కగానొక్క కూతురాయ."
"అందుకే మరి చిన్నప్పట్నుంచి మన భాష నేర్పితే ఈ రోజు ఈ పరిస్థితి రాదుగా. అమ్మమ్మలునాన్నమ్మలు అనుకున్నప్పుడల్లా వీళ్ళని చూడలేరు. చూసినప్పుడన్నా కరువుతీరా కబుర్లు చెప్పుకోవద్దా."

నాటికలో కొత్త పాత్రల ప్రవేశం. వాళ్ళెవరో ఎక్కడికెళ్ళొచ్చారో చూద్దాం.  

 నళిని : కోల్స్ నుంచి 10 డాలర్స్ ఫ్రీ కూపన్ వచ్చిందని వెళ్ళాం. 
రాధిక : ఓ దానికోసం వెళ్ళారా ఏం కొన్నరేమిటి?
నళిని : ఓ 2పిక్చర్ ఫ్రేములురెండు కార్పెట్లు కొన్నాం.
రాధిక : ఏమిటీ 10 డాలర్స్ కే అన్నొచ్చాయా?
కావేరి: కాదులే బావున్నాయని కొన్నా౦.

టీనేజ్ పిల్లలకు పెద్దలకు మధ్య సంఘర్షణ. 

"ఇంట్లో ఏం వండినా" I don't like this" అంటారు. పోనీ ఏం కావాలో చెప్తారా అంటే అదీ లేదూ. ఒక్కోసారి స్కూల్ నుండి రావడం రావడమే "mom we need to go to staples" అని ఒకటే హడావిడి. వీకెండ్ దాకా ఆగమంటే కుదరదేస్టౌ మీద కూర సగంలో ఆపేసి అలా ఎన్ని సార్లు షాపులకి పరిగెత్తానో..."

వాళ్ళ సమస్యలు విని అమ్మమ్మ ......

"అది మీ మనసులలో ఉన్న సంఘర్షణ కావేరీ. మీరు ఊహించుకున్న జీవితం వేరు. ఇక్కడ మీరేదుర్కుంటున్న పరిస్తితులు వేరు. అందుకే అన్ని సుఖాలు అందుబాటులో వున్నా మీకు జీవితం వెలితిగానే అనిపిస్తుంది."
"వాళ్ళకు మన౦ ఇంట్లో చెప్తున్నవి వేరు బయట వాళ్ళు చూస్తున్నవి వేరు. ఈ సంఘర్షణలో వాళ్ళు నలిగిపోతూ వుంటారు. అది అర్ధం చేసికొని మసలుకోమంటున్నా"
  
తెలుగు నేర్చుకోవాలన్న సరదా....రోజుకు పదిగంటలు ఇంగ్లీష్ ప్రంపంచంలో మెలగాల్సిన పరిస్థితులు...ఇక వాళ్ళ తెంగ్లీషు..

"మను: రేపు కూడా యేవో ప్రాక్టీసులున్నైకాని మానేసి వచ్చేశా౦"
అమ్మమ్మ: రేపు మానెయ్యడమేమిట్రా ?
శ్రీకర్: రేపు కాదురా ఇవాళ. ఇ...వా...ళ. వీడు ఈ మధ్యే తెలుగు నేర్చుకు౦టున్నాడు జేజమ్మా?
మను: ఓకే...ఓకే.... ఈవల.

అమ్మమ్మ గారు, పిల్లలకు పెద్దలకు మధ్య సారధ్యం వహించి పెద్దరికంతో సలహాలిస్తారు. అదండీ కథ. 
మొదటి భాగం 
రెండొవ భాగం 

       ఎప్పుడో విన్న కవితను కొంచెం మార్చి ఓ కవిత వ్రాసి ఈ నాటికలో ఒక పాత్రతో చెప్పించాను. కవి/కవయిత్రి అనుమతి తీసుకోవాలంటే ఎక్కడ ఎప్పుడు చదివానో గుర్తులేదు. ఈ నాటికను ఆదరించిన మా ఊరివాళ్ళకు, నాటికలను ప్రోత్సహిస్తున్న మా తెలుగు అసోసియేషన్ కు, స్ఫూర్తిదాయకమైన కవితను వ్రాసిన కవి/కవయిత్రికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకు౦టున్నాను. 




Monday, December 19, 2011

సరదా సరదా దసరాలు...మావూరి సంబరాలు


        అమెరికాలో దసరా సంబరాలను జరుపుకోని ఊరుజరుపని తెలుగు అసోసియేషన్ వుండదు. మా తెలుగు తరగతి పిల్లల్ని "దసరా అంటే ఏమిటిఎలా జరుపుకుంటాం?" అని అడిగాను. పండుగ గురించి చెప్పలేకపోయారు, కానీ పండుగ సంబరాలుగా వారు స్టేజి మీద వేసే 'గంతులుగురించి చెప్పారు. పిల్లలకు ఈ పండుగ పుట్టు పూర్వోత్తరాలు గురించి చెప్పిమనం చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళమో వాళ్లకు చూపించాలనిపించింది. ఆ ప్రయత్నమే ఈ 'దసరా సంబరాలు' .

       'ఉగాది వేడుకలువేసిన పిల్లలందరూ మాం..ఛి ఉత్సాహంగా 'సైఅన్నారు. ఇక్కడో చిన్న ఇబ్బంది ఎదురైంది. ఉగాది వేడుకలు వేసినప్పుడు తరగతిలో పన్నెండు మంది పిల్లలున్నారుఇప్పుడు ఇరవై ఐదు మ౦ది అయ్యారు. వీళ్ళు కాక ఫ్రెండ్స్ పిల్లలు ఓ ఏడెనిమిది మంది ఎవరిని కాదన్నా బావుండదు. "మరి ఇంతమందితో నాటకం... " చూద్దాం మరో ప్రయత్నం అనుకుంటూఓ ఇద్దరు పిల్లలు కథ చెప్పే లాగానూమరో ఇద్దరు వినే లాగాను స్క్రిప్ట్ మొదలు పెట్టాను. ఇక కథలోకి ఈ సారి సీతా సమేతంగా రాములవారూనూతోడుగా లక్ష్మణుడూ, ఇక హనుమంతులవారు సరేసరి రాముడు ఎక్కడుంటే వారిక అక్కడేగా మరీవచ్చేశారు... సంబరాల విషయానికి వస్తే పంతులు గారూపిల్లలూపులి వేషాల వాళ్ళూ. అబ్బో.. తలచుకుంటేనే భలే ఉత్సాహంగా ఉందిలే. చకా చకా వ్రాశేసి స్నేహితులకి చూపించేశా.

       స్క్రిప్ట్ వైపు నా మొహం వైపు మార్చి మార్చి చూశారు. చూశారంటే చూడరు మరీ... పోయినసారి "మీ ఇంట్లో కవ్వముందాపాలకేనుందా?" అని వాళ్ళను అటకలూ అవీ ఎక్కి౦చేశానుగా...చూడ్డం అయిన తరువాత "పోయినసారంటే ఏవో దొరికేశాయి. ఇప్పుడీ కిరీటాలుపూలదండలూపట్టుపీతా౦బరాలూగధలూ ఇవన్నీ ఎలాఇదేమన్నా ఇండియానా" అని మెత్తమెత్తగా చీవాట్లేశారు. "ఏదో చేద్దాంగా" అన్నా నమ్మకంగామనసులో పీచు పీచు మంటూనే ఉంది.

      ఎవరెవరికి ఏ ఏ వేషాలు ఇవ్వాలో నిర్ణయించివారితో ఆమోదముద్ర వేయించుకుని పిల్లల వాయిస్ రికార్డింగ్ మొదలు పెట్టాం. రాక్షసులు ఆ రోజుల్లో ప్రజలను నానా బాధలూ పెట్టడం కథల్లో చదువుకున్నాం. కాని ఈ ఇరయై శతాబ్దంలోకి కూడా వచ్చి బాధ పెడతారని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. 'మహిషాసురుడుఅని పలకడానికి పిల్లల్ని ఎన్నెన్ని బాధలు పెట్టాడని! కొన్ని సార్లు ఆ బాధ భరించలేక 'మైషాసురుడ'నిఅది కూడా కుదరనప్పుడు 'మహిషుడుఅనికూడా అనిపించాం. ఇక కథకు ముఖ్యమైన డయలాగ్స్ దుర్గాదేవి మహిషాసురిడివి. “అవి సరిగ్గా చెప్పాలంటే పిల్లలకు కష్టం ఎవరైనా పెద్దవాళ్ళతో రికార్డు చేయిద్దాం” అన్నా. "ఎందుకమ్మడూ మన ముచ్చట్లు గ్రాంధికంలో మార్చి చెప్పేస్తేపోలా" అని శ్రీవారన్నారు. "అలాక్కానీయండన్నా".

          ఇక మధ్య మధ్యలో దేవతలొచ్చేప్పుడు పెట్టిన మ్యూజిక్ లవీ 'యు ట్యూబ్వారి సౌజన్యంతో. అన్నింటికన్నా ముఖ్యమైన పాట 'ధరణికి సంబరాలుసిలికాన్ ఆంధ్ర వారి అనుమతితో వారి పాటను తీసుకున్నాము. ఆడియో రికార్డింగ్ పూర్తయ్యింది.

           ఇక ఆక్ససరీస్..అదేనండీ వస్తుసామాగ్రి. ము౦దస్తుగా కిరీటాలు: మైకేల్స్ లో గోల్డ్ కలర్ గిఫ్ట్ రాప్జువల్స్గ్లిట్టర్ గ్లూకన్ఫెట్టి లాంటి వన్నీ తెచ్చాం. గిఫ్ట్ రాప్ పోస్టర్కి అంటించి కిరీటం డిజైన్ వేసి కట్ చేసాం. ఇప్పుడు ర౦గుల రంగుల రాళ్ళు అంటించి గ్లూతో అందంగా అలంకరించా౦. టడా.... అందమైన కిరీట౦ రెడీతలకు పెట్టుకుని చూడగానే కళ్ళు కనిపించలాముందు అర్చ్ కట్ చేయడం మరచాం. ఇంకా నయం, అన్నీ అలా చేశా౦ కాదు. అలా౦టి పొరపాటు రాకుండా మిగిలినవన్నీ జాగ్రత్తగా చేశా౦లెండి. అందమైన కిరీటాలు తయారయ్యాయ్.

       స్ట్రీమర్స్ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మాలలు అల్లేశా౦. ఇక బాణాలు 'హోం డిపోలో కర్రలకి గోల్డ్ ఫాయిల్ రాపింగ్. ఇకపోతే పట్టు పీతాంబరాలు....ఉన్నారుగా మన భారతనాట్యం అమ్మాయిలువాళ్ళ డ్రెస్ కొంచెంగా మార్చితే మంచి పంచెలు తయారు.

        మా హనుమంతుడ్ని మీరు చూసి తీరాల్సిందే. ఆ అలంకరణలో నా ప్రమేయమెంత మాత్రం లేదు సుమండీ..మొత్తం వాళ్ళ అమ్మగారు చూసుకున్నారు. అలాగే దుర్గాదేవిమహిషాసురుడుగదబతుకమ్మ కూడా....ఇక పులులుఈ కాస్ట్యూమ్ కోసం వెతకని షాపూ, వెబ్సైటు లేదు. చివరాఖరకి అమ్మాయిల సెక్షన్లో చిరుతపులులు దొరికాయి. 'జోయాన్స్లో బట్ట తెచ్చి తోకలు కుట్టాం. సరంజామా అంతా పూర్తయ్యింది కదా. అమ్మాయిలకు పోచ౦పల్లి చీరలు కట్టాలనుకున్నాం. తెలిసినవారందరూ వారి పెట్టెలన్నీ వెతికి చీరలిచ్చారు.

       ముందు నాటిక అనుభవంతో సీనుల వారీగా రిహార్సిల్స్ మొదలుపెట్టాం. ఐయిగిరినందిని పిల్లలుపులివేషం పిల్లలుధరణికి సంబరాలు పిల్లలూఅయోధ్యవాసులూకథకులూచివరగా మహిషాసురుడూ, దుర్గాదేవీనూ. ఈ నాటిక రిహార్సిల్స్ జరిగినన్ని రోజులూ మా మెయిల్ సబ్జక్ట్స్ పేర్లన్నమాట. బావున్నై కదూ. డాన్స్ వేస్తున్న పిల్లలు ఎక్కువ మంది అవడం వల్ల స్థలాభావంసమయాభావం కలిగింది. ఒక్క నెల్లాళ్ళు సాయంత్రం ఐదు ను౦డి ఆరు మధ్యలో ఎవరొస్తే వాళ్ళకు డాన్స్ నేర్పించడంవల్ల దాన్ని అధిగమించాం. అలా నాటిక రిహార్సల్స్ పూర్తయ్యాయి.

       ఈ నాటికవేయడానికి ముందు నాటిక అంత ఆదుర్దా లేదు. మా పిల్లల అభినయం తెలిసిందిగా మరీ. మా పిల్లలు మరోసారి మా ఊరి ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి౦చేశారు. అన్నట్టు ఈ పిల్లల్లో ఒక్క నులుగురైదుగురు తప్ప మిగిలిన వారందరూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలేనండోయ్..

కొస మెరుపు
   
పిల్లలకు దసరా పండుగ గురించి తెలిసింది. మహిషాసురుడు దుర్గాదేవి స్టేజికి ఆ చివర ఒకరు, ఈ చివర ఒకరు నిలబడి వీడియో గ్రాఫర్ లను అయోమయంలో పడేశారు.
రామ లక్ష్మణులు పాపం అడవి నుండి సరాసరి ఇటే వచ్చినట్లున్నారుకాళ్లు నొప్పెట్టి స్టేజికి మధ్యకు రాలేకపోయారు.


మొదటి భాగం 


రెండొవ భాగం 

Sunday, October 23, 2011

తెర వెనుక రామాయణం

తెలుగు తరగతి పిల్లలకి కథ చెప్తుండగా 'ఉమ్మడి కుటుంబం' గురించి కథలో ఓ ప్రస్తావన వచ్చింది. వాళ్ళకి వివరించి చెప్పాను, కానీ ప్రశ్నార్ధకాలు? "ఎలా వీళ్ళకు అర్ధం అవుతుందా?" అని ఆలోచించాను. ఏదైనా చూపించాలి, లేదా వాళ్ళకు హృదయానికి హత్తుకునేలా సరదాగా ఉండేలా చెప్పాలి. ఆ ప్రహసనంలో పుట్టిందే ఈ 'ఉగాది వేడుకలు'.

నాటిక వ్రాయడం మొదలెట్టగానే చిన్నప్పటి రోజులూ, బాబాయిలు, పిన్నులు, అత్తలు, నాన్నమ్మలు, తాతయ్యలు అందరూ ఎదురుగా వచ్చేశారు. మా వీధిలో తిరిగే పూలమ్మాయి పూల బుట్టతో సహా నా ముందుకు వచ్చి కూర్చుంది. 'ఆక్కూరలో' అని బయట లయబద్దంగా అరుపు వినిపించింది. అంతేనా 'అమ్మా పాలు' అని పాలబ్బాయి కేక, ఇలా అందరూ ఒక్కొక్కరుగా వచ్చేశారు. వీళ్ళతో పాటే సరదా సరదా సినిమా పిచ్చి గౌరి కూడా. వీళ్ళందరినీ పిల్లలకు పరిచయం చెయ్యాలని, చిన్నప్పటి పండుగలు, సరదాలు, మురిపాలు, ముచ్చట్లు అందరితో పంచుకోవాలని ఈ నాటికకు శ్రీకారం చుట్టాను.

తొలి విడతగా నాటకం వ్రాయడం పూర్తయ్యింది. ఈ స్క్రిప్ట్ స్నేహితులకు చూపించాను "బావుంది కాని ఈ తెలుగు రాని పిల్లలతో ఇంత పెద్ద నాటకమా?" అని సందేహం వ్యక్తం చేశారు. "అవును కదూ చేతిలో పెన్ ఉందని రాసుకుంటూ పోయాను. ఇప్పుడెలా?"

పిల్లలందరినీ పిలిచాము ఒక్కోరికి ఒక్కో కారెక్టర్ ఇచ్చాము. బావుంది... అదేం చేసుకోవాలో వాళ్ళకు తెలియదు. వాళ్ళకెలా చెప్పాలో మాకూ తెలియలేదు. అసలే పదిహేను మంది పిల్లలు వాళ్ళ కారెక్టర్లకు ఎంచక్కా నవ్యమైన రీతిలో నామకరణం చేసేశాను. ఏ పేరు ఎవరిదో నాకే అర్ధం కాలేదు. "అలాక్కాదు కానీ జ్యోతీ, ముందు నువ్వీ పేర్లన్నీ మార్చేసి శుభ్ర౦గా వాళ్ళ పేర్లు పెట్టి తిరగవ్రాసెయ్" అని ఫ్రెండ్స్ చక్కాపోయారు.

వాళ్ళటు వెళ్ళగానే ఏడుపు మొహం వేసుకుని కూర్చున్నాను. ఈ కమామీషంతా చూస్తున్న శ్రీవారు అప్పుడు రంగంలోకి దిగారు. "అలాక్కాదమ్మడూ ఏదో చూద్దాంలే దిగులు పడకు" అంటూ..ఈ లోగా మరో ఫ్రెండ్ "ముందు వాళ్ళ వాయిస్ లు రికార్డు చేస్తే ఈజీగా ఉంటుందని" సలహా ఇచ్చారు. "వావ్ మా గొప్పగా ఉంది" అనుకుంటూ రికార్డింగ్ రూమూ, మైకూ, ఇంకా ఏమిటేమిటో అన్నీ సిద్దం చేసుకుని....పిల్లల్ని రికార్డింగ్ కి పిలిచాము. "ఒకళ్ళ తరువాత మరొకళ్ళు డయలాగ్స్ చెప్పేస్తారు చాలా ఈజీ" అనుకుంటూ.

అసలు కథ ఇక్కడ మొదలు. ఇందులో కొంతమంది అసలు తెలుగు పదం పలకని వాళ్ళు. చాలా మంది పదాలు పలుకుతారు కాని వాక్యనిర్మాణం మనం చేసుకోవాలి. మరికొంతమంది పలికే పదాల్ని మనం సావకాశంగా అర్ధం చేసుకోవాలి. గదిలో నలుగురు పిల్లల్ని కూచోబెట్టి వరుసగా ఒక్కో డైలాగు చెప్పించాలనుకున్నాం, ఖాళీగా ఉన్న పిల్లలు కిచకిచలు. అబ్బే ఇలా కుదరదు. ఒకరి తరువాత మరొకళ్ళ డయలాగ్స్ రికార్డు చేద్దాం అన్నారాయన. వేరే దారేం కనపించలా. ఆ పూటకి పిల్లల్ని పంపించేసి తరువాత ఒక్కొక్కరినీ వాళ్ళకు కుదిరిన టైములో పిలిచి రికార్డింగ్ మొదలు పెట్టాం. 

ముందస్తుగా అతి చిన్న డయలాగ్స్ ఉన్న పాలబ్బాయిని పిలిచాము. "ఎండలకు గేదె నీళ్ళెక్కువగా తాగేసినట్టు౦దమ్మా, డబ్బులీయమ్మా బేగెల్లాలి ఇదీ డైలాగ్." చెప్పు నాన్నా అన్నాను.
"ఎండల్ కి గేద్" అని ఆపేసాడు. పది సార్లు "ఎండల్ గేద్" అయ్యాక మా వారికో 'బ్రహ్మాండమైన' ఇడియా తట్టింది. ఈ 'బ్రంహాండం' గురించి ముందు ముందు మావారికి బాగా అర్ధం అయిందిలెండి.
నాయనా సురేషూ నువ్వు ఇలా అనమ్మా అని,
ఎండ....లకి....గేదె.... నీళ్ళు.....ఎక్కువ.....గా .......తాగేసి....నట్టు.. ఉంది.......అమ్మా అని పదాలు విడివిడిగా రికార్డు చేయించారు. ఆ తరువాత అవన్నీ కలపి "ఎండలకి గేదె నీళ్ళు ఎక్కువగా తాగేసినట్టు ఉంది అమ్మా" అని వినిపించారు. ఈ విధంగా ఆ నాటకంలోని వాక్యాలు రూపు దిద్దుకున్నాయన్నమాట. ఇలా౦టి వాక్యనిర్మాణంలోని పెద్ద ఇబ్బంది పదానికి పదానికి మధ్య గ్యాప్ సరిగ్గా ఇవ్వాలి. ఇవ్విదంగా 'బ్రహ్మాండం' వారికి బాగా అనుభవమయ్యింది.

పదిహేను మంది పిల్లలకు రీటేకులతో ఓ ఇరవై ఫైళ్ళు తయారయ్యాయి. ఓ అందమైన వెన్నెల రాత్రి చేతిలో స్క్రిప్ట్ తో నేనూ, ఒళ్ళో లాప్టాప్ తో మావారూ కూర్చుని డైలాగ్స్ అన్నీ వరుసక్రమంలో పెట్టి ఆ చిన్నారి గొంతులు పలికిన తీరుకు మురిసిపోతూ, ముచ్చట పడిపోతూ ఎట్టకేలకు రికార్డింగ్ ని ఓ కొలిక్కి తీసుకొచ్చాం. అంతలో ఎలా అయిపోతుందీ శబ్దాలు అదేనండీ సౌండ్ అఫెక్ట్స్ చీపురుతో ఊడుస్తున్నట్టు, పాలు చెంబులో పోస్తున్నట్టు, నీళ్ళతో కాళ్ళు కడుగుతున్నట్లు, సైకిలు బెల్లులు, మువ్వల శబ్దం ఇలా. అన్నీ బావున్నాయి మజ్జిగ చిలుకుతున్న శబ్దం ఎక్కడా కనిపించలా. ఎంచక్కా పెరుగు గిన్నెలో కవ్వమేసి చిలికేసి, ఆ శబ్దం రికార్డు చేసేసి, అటుపిమ్మట ఆ మజ్జిగలో నిమ్మకాయ పిండేసి, ఆహా ఓహో అనుకుంటూ తాగుతూ ఆ ఆడియో రికార్డింగ్ ని ఎంజాయ్ చేశామన్నమాట.

ఇక ప్రాక్టీసులు. మళ్ళీ పిల్లలందరినీ పిలిచి రికార్డు చేసింది వినిపించి ఇక కానివ్వండన్నాం. తెలుగులో వాళ్ళ గొంతులు వినేసుకుని నవ్వేసుకున్నారు తప్పితే పని జరగాలా. మళ్ళీ "కట్ కట్" అని తీవ్రంగా ఆలోచించాక కథను సీన్లుగా విడగొట్టాలని అర్ధం అయ్యింది. ఒక్కో సీను చేసి చూపించాను. చిన్న సీన్లు అంటే తక్కువ మంది స్టేజి మీద ఉండే సీన్లు బాగానే ఉన్నాయ్. మరి ఎక్కువమంది ఉన్నప్పుడో మళ్ళీ తికమక మొదలయ్యింది ఆ తికమకలో సీనుకి "స్క్రీన్ ప్లే" ఉండాలని అర్ధం అయ్యింది. స్టేజి మీద పిల్లలు ఎక్కడి నుండి రావాలో ఎక్కడ నిలబడాలో అన్నీ గీసి చూపించాను. అప్పటికి నా బుర్రలో ఏముందో వినే వాళ్లకి అర్ధం అయ్యింది.

మరి మాటలు సరే, పాటలవీ ఉంటే బావుంటుంది కదా. అసలే మన తెలుగు అసోసియేషన్ ప్రోగ్రామ్స్ లో "ఆ అంటే అమలా పురం" పాటలకి చిన్న పిల్లల హావభావాలూ, నృత్యాలూ చూసి తలలు ది౦చేసుకు౦టున్నాం. కొంచెం తల ఎత్తుకునే లాగ "చెమ్మ చెక్క, ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ, ఉగాది పండగ ఒచ్చింది" లాంటి పాటలతో పిల్లలకు అభినయం నేర్పించాము. కొంచెం సరదాగా మా గౌరి 'సోగ్గాడే సోగ్గాడు' పాటకు డాన్స్ కూడా చేసింది. ఇది మీరు చూసి తీరాల్సిందేన౦డోయ్.

నాటకానికి కావాల్సిన వస్తువులు లడ్లు, కవ్వం, విస్తర్లు, మజ్జిగ్గిన్నె, పాల కేను, పూల బుట్ట, కూరగాయలు, తాతయ్యకు చేతి కర్ర, గౌరికి చీపురు, అమ్మకు ముగ్గు ఇలా చదువుకుంటూ పోతే చాలా చాలా..... లడ్లు న్యూస్ పేపర్ ఉండ చేసి ప్లేడో తో పాకం పట్టేసా. నిజం పాకం కాదు లెండి రౌండ్ గా చుట్టేసా. విస్తర్లు వాల్ మార్ట్ లో గ్రీన్ ప్లేస్ మేట్లు దొరికాయి. కవ్వం, పాల కాను ఇల్లిల్లూ గాలించి పట్టాం. ఇలా కూర, నారా, బుట్టా తట్టా, పూలూ పళ్ళూ, గిన్నెలు, గరిటెలు, గ్లాసులతో ఆడిటోరియంకు వెళ్ళడానికి రెడీ అయిపోయాం.

అసలు రిహార్సల్స్ అప్పుడు మొదలయ్యాయి. కొన్ని డైలాగ్స్ పిల్లలకంటే ముందుగా వచ్చేస్తున్నాయ్. కొన్ని నింపాదిగా వస్తున్నాయ్. మళ్ళీ ఎడిటింగు. ఇవ్విదంగా చివరాఖరకు నాటకం రికార్డింగు పూర్తయ్యింది. ఇక ప్రోగ్రాం రెండు వారాల్లోకి వచ్చేసింది, పిల్లలందరూ బాగా చేస్తున్నారు. అనుకోని అవాంతరం.. నాటకంలో పెదనాన్నకి చెస్ టోర్నమెంట్ నాటకం రోజేనని తెలిసింది. హతవిధీ! ఇంకేముంది మరో పెదనాన్నని వెతికి, కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒప్పించాం. ఈ లోగా తాతగారు మరో విషయం చెప్పారు సైన్స్ ఒలంపియాడ్లో రీజెనల్స్ లో విన్ అయితే స్టేట్స్ వెళ్ళాలట అది కూడా ప్రోగ్రాం రోజేనట. సీక్రెట్ గా పోలేరమ్మకి పొంగళ్లవీ పెట్టి, విన్ అవకుండా చేసామనుకోండి.

డ్రెస్ రిహార్సల్స్..ఓ ఇద్దరు తప్ప మిగతా పిల్లలందరూ కూడా పది ఏళ్ళ లోపు వారూ, పొట్టి పొట్టి జీన్సుల వారూను. వారికి ఇదు మీటర్ల చీరలు చుట్టబెట్టే మహత్తర బాధ్యతని వారి తల్లులు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. డ్రెస్ రిహార్సల్స్ రోజు అమ్మమ్మ ముచ్చటైన చిలక పచ్చ రంగు లంగా ఓణీలో బాపు బొమ్మలా ప్రత్యక్షమైంది. అది చూసి ఢామ్మని పడబోయి ప్రోగ్రాం గుర్తొచ్చి ఆగిపోయాను.

"అమ్మడూ ఏంటి నాన్నా డ్రస్సూ?"
"అమ్మమ్మ పంపించి౦దాంటీ. ఇట్స్ నైస్" అంది.
"డ్రెస్ బావుంది కాని నువ్వు అమ్మమ్మవి కదా చీర కట్టుకోవాలి." అన్నా కొంచెం జంకుతూ.
"హా.... ఇ డోంట్ లైక్ దట్." అంది.
"పోనీ అదే ఉంచేయండి మొడెర్న్ అమ్మమ్మలా ఉంటుంది." ఆ తల్లి కోరిక.
మరో నాటకం వ్రాస్తానని దానిలో ఆ అమ్మాయికి ఆ లంగా ఒణీనే వేయిస్తానని ప్రమాణాలు చేసి మెల్లగా తల్లీ కూతురిని ఒప్పించి ఆ పూటకి గండం గట్టెక్కి౦చాను. తెల్లజుట్టుకు మాత్రం తిలోదకాలే.

ఈ నాటికలో ఓ బంతి భోజనాల కార్యక్రమం పెట్టాం. ఆడపిల్లలందరూ విప్లవం లేవదీసారు. "ఆంటీ ఎప్పుడూ మేమే ఒడ్డించాలా? అలా కుదరదు ఈ సారి మేం కూర్చుటాం బోయ్స్ ని ఒడ్డించమనండి" అని. వాళ్లకి నాటకం అయిపోగానే మగపిల్లలతో వడ్డన కార్యక్రమం పెట్టిస్తామని నచ్చచెప్పి ఆ సీను చేయిస్తున్నాం. ఒళ్ళు మండిన ఆ పూర్ణమ్మలు నిలబడి ప్లేట్లలోకి పదార్ధాలను ఫ్రిజ్బీల్లా విసరడం మొదలెట్టారు. ఇది రేపు నాటకమనగా ఈ వేళ రాత్రి సన్నివేశమన్నమాట. ఇలా చేస్తే మన నాటిక పరువు పోతుందిరా అమ్మళ్ళూ... నా మాట వినండి అమ్మల్లారా... అని భోరున విలపించాను. వారు కరుణి౦చారో లేదో నాకు స్టేజి మీద కాని తెలియదు.

ప్రోగ్రాం టైం అయింది పిల్లలందరూ చిన్నవాళ్ళు "ఎలా చేస్తారో? ఏమిటో" అని ఒకటే టెన్షన్. నాటిక మొదలయ్యింది. ఏ సీను దగ్గర ఏ పిల్లల్ని స్టేజి మీదకు పంపించాలో చూసుకునే హడావిడిలో నాటిక సరిగా చూడనే లేదు. నాటిక అవగానే ఆగకుండా రెండు నిముషాలు పాటు మోగిన చప్పట్లు కళ్ళు చేమర్చేలా చేశాయి. అప్పటి భావాలకు ప్రతిరూపాలే 'సంకల్పం', 'పూలు గుసగుసలాడేనని 'నూ. ఆ తరవాత 'దసరా సంబరాలు', 'వెళ్ళాలని వుంది కానీ....' అనే నాటికలకు స్పూర్తి కూడా ఆ చప్పట్లే.

మా ప్రయత్నాలన్నిటికీ కూడా సంపూర్ణ సహకారల౦దిస్తున్న నా ప్రియ మిత్రులకు, మా ఊరి తెలుగు ప్రజలకు బ్లాగ్ముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నాటకం కొరకు బాపు బొమ్మల నేపధ్యంలో ఏకంగా వాకిలినే స్టేజ్ మీద నిలిపిన నా నేస్తానికి ప్రత్యేక ధన్యవాదాలు.

అంతా బాగానే ఉంది ఈ రామాయణం ఏమిటనుకుంటున్నారా? బంగారు జింకను అడిగిన సీతకు ఆ రాముడు తెచ్చివ్వలేక పోయాడు. నా రాముడు నే మనసుపడిన ప్రతి పని వెనుక తోడై వుండి వీటన్నింటినీ విజయపథం వైపు నడిపిస్తున్నాడు.

కొస మెరుపు

తెలుగు మాట్లాడని పిల్లలు కూడా నాటకం పూర్తయ్యేటప్పటికి అందరి డైలాగ్స్ చెప్పడమే కాక
"ఎన్నాళ్ళయిందక్కా మిమ్మల్నందరినీ చూసి",
"డబ్బులీయమ్మా బెగెల్లాలి"
"ఇలా ఇంటి భోజనం చేసి ఎన్నాళ్లయ్యిందో"
లాంటి వాక్యాలు ఇంట్లో ప్రయోగించడం మొదలు పెట్టారు...

నాటకంలో అమ్మ నిజం అమ్మకి ఉగాది పచ్చడి చేయడం నేర్పించింది.

"మా అమ్మాయి అడిగిన డబ్బులివ్వకుండా బేరాలు, పైగా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు" అని కూరలమ్మే వాళ్ళమ్మ, అడపా దడపా నా కవితలు చదివే నా బెస్ట్ ఫ్రెండ్ కూడానూ, బ్లాగును చూడమన్నా చూడక తన నిరసన వ్యక్తం చేశారు.

ఈ నాటకం చూసిన మా నాన్నా "అరేయ్ జ్యోతీ, కూరగాయలు ఇండియాలో కన్నా అమెరికాలోనే చీప్ గా ఉన్నాయే" అని వ్యాఖ్యానించారు. గౌరీ వాళ్ళ తాతగారు ఇంటికి ఎవరొచ్చినా ఓ సారి ఈ వీడియొని చూపించకుండా పంపించట్లేదట.

ఇందులో పాల్గొన్న పిల్లలందరూ మా తెలుగు తరగతి విద్యార్ధులు.

ఉగాది వేడుకలు 1

ఉగాది వేడుకలు 2

గీత డైలాగ్ వ్రాసిన శ్రీ లలిత గారికి ధన్యవాదములు

Friday, October 14, 2011

"వెళ్ళాలని వుంది కానీ...."

అమెరికాలో ఉన్న తెలుగు వారు, అమెరికా వచ్చిన దగ్గరనుండి ఇండియా 'వెళ్ళాలని ఉంది కానీ..' అంటూ ఉంటారు. మరి వాళ్ళు ఇండియా వెళ్ళకుండా ఎందుకు ఉండిపోయారో వాళ్ళనాపేసిన కారణాలేంటో వాళ్లనే అడిగి తెలుసుకుందామా..(ఇది సరదా సరదా నాటిక ఎవర్నీ ఉద్దేసించి వేసినది కాదు)

వెళ్ళాలని ఉంది కానీ...1

వెళ్లాలని ఉంది కానీ...2