Showing posts with label నచ్చినవి నాలుగు. Show all posts
Showing posts with label నచ్చినవి నాలుగు. Show all posts

Monday, January 27, 2020

యిలువ

"కా, లచ్చింన్నారాయణన్న యిలువ బెంచుకోడం గురించి చెప్పు౦డే యీడియో యిన్యావా?" ఫోన్ తట్టు జూపిస్తా అడిగినాను.
"
ల్యా యెవురాయన్న, యేం జెప్పినాడ". ఫోన్ లోకి జూస్తా ఆనిందక్క.
"
ఆయన్న బాగా జదూకొని పెద్ద పోలీసయి, యెన్నో మంచిపన్లు జేసినాడని కథలకథలుగా జెప్పుకుంటారులే. యిదిగో యినా" అంటా యీడియో బెట్నా.
పూర్తిగా యినీ "ఆయన్న బలే జెప్పినాడు మే" అంటా మెచ్చుకునింది.
"
యేమోకా, అసలీ యిలువ బెంచుకోడమెందుకా?"
"
యిలువ బెంచుకుంటే అదేందో స్ట్రెస్సు తక్కవవతాదంటనే. అప్పుడు జబ్బుల్రావు డాకటర్ల కాడికి పోబళ్ళా అని జెప్పినే య్యిన్లా. మళ్ళొకసారి సరింగా యినుమే యీడియోనా".
"
పళ్ళేదులేకా. అట్టా యిలువ బెంచుకుంటా బోతా వుంటేనే గదా స్ట్రెస్స. డాలరు చొక్కా, రెండు డాలర్లక, పది డాలర్లక, ఐదొందల డాలర్లకా అమ్మే దానికి వూరికినే వుండాదా? యెంతాలోచన జెయ్యాల యెంత పని మిందేసుకోవాల. పైగా తడవతడవకి అట్ట కుదరతాదా. డాలరు చొక్కా యింకో పది సెంట్లు యెక్కవ కమ్మితే యేవా? నాలుగెక్కవ టీ షర్టులమ్ముకుంటే కడుపులో సల్ల గదలగుండా రొ౦త సంపాదిచ్చుకోవొచ్చు. "
"
అదిగాదుమే." ఆపిందక్క.
"
వుండుకా నన్ను సాంతం జెప్పనియ్యా. యియేకానందుడు షికాగో బోకపోతే, అబుదులు కలాం పీపులుసు పరిసిడెంటు అవకపోతే యేమోతాదా? యిట్టాంటియన్నీ బెట్టుకుంటే యీడో గంతూ, ఆడో గంతూ యేసినట్టే, యింక కుదురుగా నిలబడేదెట్టా. సాయంకాలానికి పనీ గినీ పూర్తి జేసుకుని ఇంటికొచ్చినావా, టీవీ జూసినావా, అన్నం గిన్న౦ దిన్నవా, పండుకున్నావా అన్నట్టుండాలి గానా. యిట్టా యిలువ లేడ బెంచుకుందాం."
"
అట్నా, నీయాలోచన గూడా కరస్టేను మే. అయినా ఆ అన్న జెప్పింది పిలకాయలికిలే మనగ్గాదు. పా మిద్ది మిందె౦డబెట్టిన సద్దలూ, మినువులూ దెద్దాం, కాస్తాలితే యింగా తీలేదని నాయనమ్మ తిడతాది" అంటా పైకిలేచిందక్క.

"మే తాలండట్ట. చదూకోక ముందు పెసలు పెసలన్నాడంట, చదూకున్నాక పిసలైదంట, ఆట్టుంది మీ యవ్వారం". అక్కడే కూర్చుని వైనంగా కొబ్బరాకు ఈనెలు దీస్తున్న రత్నమ్మత్త ఆపింది. 
"యేవత్తా అట్టన్యావా?" పైకి లేచిందల్లా మళ్ళా కింద కూలబడతా అనిందక్క.
"
మీ నాయనమ్మ నాకేమోతాది మే" అనడిగిందీనెలు దీస్తా.
"
యీ మాట అడిగేదానికా ఆపినావ. పిన్నమ్మ గదా" చెప్పిందక్క.
"
అట్టయితే నేను మంచి చెబ్బర చెప్పుకునే దానికి రెండు మైళ్ళవతలున్న మాయమ్మ కాడికి గాకుండా పదూర్ల దూరానున్న పిన్నమ్మ కాడికెందుకొస్తండాను?" చేస్తున్న పనాపి మా తట్టు చూసింది.
అక్కా నేను మోహమోహాలు జూసుకున్నం.
మా యెఱ్ఱి మొహాల్జూసీ పెద్దమ్మే జెప్పింది. "ఎందుకంటే మీ నాయనమ్మ యిలువ బెంచుకుంది గాబట్టి."
అర్థం గాలా. నాయనమ్మకేమన్నా చదువా చట్టుబండలా. యిలువ పెంచుకునేదానికి అదే అడిగినాం.
"
మేయ్. యిలువ పెంచుకునేదానికి సదువే గావాల్నాయిలువెట్టా బెరిగిద్దో జెప్తా యినండి. 

    మీ తాతయ్య సేద్దె౦ జేసిన్నాడు ఇరవై ఎకరాల మాగాణిపన్నెండెకరాల మెట్ట ఉండేది. కమతగాళ్ళుకూలోళ్ళువచ్చే పొయ్యే సుట్టాలుపండగలుపబ్బాలుపైగా నెల్లూళ్ళో కాపరం. ఆసుపత్రికి బొయ్యేవోళ్ళుకోరుటు పన్ల మిందొచ్చేవోళ్ళుఅంతే లేని జనం. అందరికీ వొంటి చేత్తో వొండి బెట్టిందిమే మీ నాయనమ్మ. పొద్దన్న ఆరు గంటలకి పొయ్యెలిగిస్తే ఆర్పేది రాత్రి పదిగంటల మీందే. 

    పెద్ద కమతమగాళ్ళ మని యేనాడు ఎచ్చరికాలకి బొయ్యిందిల్యా. పాలు బిండీమజ్జిగలమ్మీ ఆడపిలకాయలకి చీరా నారా గొని౦ది. పొలంలో వచ్చే పదీ పరకా పోగేసి నాగా నట్రా అమర్చింది. యేటేటా కానుపులకొచ్చే ఆడపిలకాయలికి చింత చిగురు కాడ్ను౦డీ బిడ్డలగ్గావల్సిన కాటిక్కాయి దాకా అన్నీ అమిర్చి బెట్టింది. పనిలో వైనం, మట్టసం దెలిసిన మనిషి. యేడా యెవురికీ లోటు రానీల్యా. అందర్నీ కడుపులో బెట్టుకుని జూసుకునింది. యిన్ని జేస్తాగూడా యేనాడూ గుడ్డ నలగనీలాకొప్పులో పూలు వాడనీలా. యాపొద్దు జూడు మాలచ్చిమిలాగుండేది.

    ఇంగ మాయమ్మా వుంది. రెండ్రోలు సుట్టాలొస్తే వుసూరుసూరుమనేది యిసురుకునేది. అట్టని వొళ్ళు బాగలేక నీరసంగుందేమో యాడ జేస్తది అనుకునేరు. అట్టే౦ల్యా గుండ్రాయిలా వుండేది. పన్జేసీనా వైనంమట్టసం ల్యా. మెల్ల౦గా సుట్టాల రాకపోకలు దగ్గినయ్. యెవురైనా యెందుకొస్తారాయేదో మనోళ్ళు౦డారు జూసి పోదామనొస్తారుగానికూటికి గుడ్డకి ల్యాకొస్తారా. వొంటికాయి సొంటి కొమ్ములా తయారయ్యింది మాయమ్మ. పైగా అక్క౦టే ఒకటే మంట. అందరూ ఆమె చుట్టూతానేనని.

    మీ నాయనమ్మేమో ముని మనవరాల్ని గూడా కాలిమిందేసుకుని నీళ్ళు బోసిందంటే సూడండి. యీ దినం యా కూతురుకోడలు గూడా యీవ ల్యాకుండా సుబకార్యమే జెయ్యరు. చివరికి అల్లుళ్ళు గూడా “పాపకి పెళ్ళి చూపులుకా నువ్వు రెండ్రోల ముందే రావాల” అనీయీపరాళ్ళేమో “మూవ్, మాగమాసానికి ఇల్లు పూర్తవతాది. ఆపైన ఇళ్ళల్లో జేరతండాం టయానికొస్తావేమో అట్ట గాదు నాల్రోల ముందే రావాల” అని పిలుస్తా వుండారంటే జూడండి. అట్టా యీనాటికీ గూడా అందరూ రా రమ్మని పిలిచే వోళ్ళే. ఆమెకు కాస్త వొళ్ళు యెచ్చబడిందంటే ఆగమేగాల మింద పరిగెత్తే వోళ్ళే.

     పెద్దరికం వొయిసుతో గాదు యిలువ బెంచుకుంటేనే వస్తాదనేది తెలుసుకుంటే కాపరాలన్నీ కుదురుంగా వుంటయ్. యిలువ బెంచుకోవలంటే కష్టం, సుకం అనుబగిచ్చాల పనీ పాటా జెయ్యాల, అట్టని గుడ్డెద్దు చేలో బడ్డట్టు గాదు, సుట్టుపక్కల గమనిస్తా పనిలో వాటం, వైనం దెలుసుకోవాల. వొకటే మొయిన పిలకాయలు పట్టిచ్చుకోరుఅయినా అడ్డాలు నాడు బిడ్డలుగాని గడ్డాలు నాడు గాదని మా యమ్మ జెప్పినట్టు సామెతలు జెప్పుకుంటే పిల్లాజెల్లా దగ్గరకొస్తారా. అంటూ కొబ్బరి పుల్లలన్నీ కలిపి వైనంగా కట్టిన చీపుర్ని తీసుకుని లోపలకి చక్కా బోయిందత్త.





Tuesday, November 17, 2015

ఏవిటండీ ఈయన...

       ఇప్పుడూ... మనకు మెర్సిడస్ ఫైవ్ సిరీస్ కావాలంటే ఏం చేస్తాం? లేదూ అబ్బా యికి మంచి సంబధం రావాలంటే ఏం చేస్తాం? ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఏం చేస్తాం? అర్ధం కాలేదా సత్యనారాయణ వ్రతం కదా చేస్తాం. పైగా కోరిక కోరడం కోసం కాదు, అది తీరిందన్న కర్ఫర్మేషన్ వచ్చేకే కదా చేస్తాం. ఇండియాలో సంగతేమో గాని అమెరికాలో మేం ఏడాదికొక్కసారి ఓ కోరికల లిస్ట్ పెట్టుకుని, అందులో కొన్ని తీరినవి మరొకొన్ని తీరవలసినవి ఉండేలా జాగ్రత్త చేసుకుని తెలిసిన వారినందరినీ పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం.

     మన పెద్ద వాళ్ళు మన కోరికలు తీర్చుకోవడానికి ఇంత సులభ మార్గం చెపితే... ఈయనేమిటండీ ఇలా అంటున్నారూ...ఒకటే కన్ఫ్యూజనూ...


Tuesday, November 25, 2014

కాళోజీ నారాయణరావు

అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు!

ఎవరో కాళోజీ నారాయణరావు గారట ఆయన కవిత్వమట ఇది. అవనీ, అవకతవకలూ అంటూ అర్ధం లేని కబుర్లు. ఏమైనా అప్పటివాళ్ళకు బ్రతకటం చేతకాదు. ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేసుకున్నామా, తిన్నామా పడుకున్నామా అన్నట్లుండాలి, లేకపోతే ప్రజాసేవ పేరుతో పాపులారిటీ అయినా తెచ్చుకోవాలి గాని ఇలా గుండె కరిగిపోవటాలు, ఒళ్ళు మండిపోవటాలు దేనికంటా?

అంతేనా, ఇంకా వినండీ "కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక'' అని ప్రకటించుకున్నార్ట. ఏదో కవ్వితం అంటే ప్రాసలు, పద ప్రయోగాలు, వెన్నెల్లూ, వెండి కొండలూ అంటూ రాసుకోవాలి. లేకపోతే ఎవరికీ అర్ధం కాని భాషలో ఆ ఘోషేదో వినిపించాలి కానీ, ఏమిటో దేశభక్తి, వర్గాల పోరాటం, లోకంలో జరుగుతున్న దగాలు, సామాజిక వ్యత్యాసాలు, కర్షకుల ప్రాధాన్యం అంటూ కవిత్వం వ్రాశార్ట ఈ ప్రజాకవి. ఈయన "నా గొడవ" అంటూ వినిపించిన కవిత్వం చూడండి.

నా గొడవ నాది-అక్షరాల జీవనది
నానా భావనా నది- నీనా భావన లేనిది
మన భావన నది - సమ భావన నది
ఎద చించుక పారునది- ఎదలందున చేరునది
నా గొడవ నాది- కాళోజీ అనునది

నాది నాదే, నీదీ నాదే అనుకోకుండా సమభావన అని ఇలా గొడవ గొడవగా దాదాపు 3000లకు పైగా కవితలు వ్రాశారట. అప్పటి వాళ్ళు ఇలాంటి కవిత్వంతో మేల్కొన్నారేమో కాని మనమైతేనా నాలుగు పేజీలు తిప్పేసి పుస్తకం పక్కన పడెయ్యమూ!

అన్నపు రాసులు ఒక చోట- ఆకలి మంటలు ఒక చోట
హంస తూలిక లొక చోట- అలసిన దేహాలొక చోట
సంపదలన్నీ ఒక చోట- గంపెడు బలగం ఒకచోట
అనుభవమంతా ఒక చోట -అధికారం బది ఒక చోట''

ఏమాటకామాటే చివర వాక్యాన్ని మనం మరో వెయ్యేళ్ళు మార్చకుండా చదువుకోవచ్చు.

తెలుగు స్పష్టంగా మాట్లాడడమే నామోషీ అనుకుంటుంటే ఈయనొకరు.
"అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!''
ఇలా తిడితే ఇంకేమైనా ఉందీ! ఎవరైనా మనెదురుగానే వెధవ పని చేస్తున్నా భవిష్యత్తులో వాళ్ళతో మనకు ఏం అవసరం వస్తుందో ఏమిటోనని చూసి చూడనట్లు పోవాలి కానీ ఇలా మాట్లాడితే మన మీద కత్తి కట్టరూ!

రాజకీయ విప్లవాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించి ఆ ఏర్పడిన ప్రభుత్వాలు సమానత్వాన్నీ స్థాపించవచ్చు. కానీ సౌభ్రాతృత్వం లేనిదే ఈ రెండింటివల్ల కలిగే ఫలితం ప్రజలకు చెందదు. దీనికి నాయకుల కృషి సరిపోదు ఇది రచయితల వలెనే సాధ్యమౌతుంది అన్నార్ట పిచ్చి మారాజు. బాగా డబ్బులు సంపాదించినవాళ్ళకు, దేశమంతా స్థలాలు కొన్నవాళ్ళకు విలువిస్తారు వారి మాటే వింటారు కాని, రచయితలకు విలువిచ్చి వారి రచనలు చదివి మారతారటండీ!

పైగా కత్తులూ, కఠార్లతో రజాకార్లు స్వైరవిహారం చేస్తున్న రోజుల్లో ఈయన ఆంధ్రమహాసభల్లో, ఆర్యసమాజ్‌ ఉద్యమాల్లో పాల్గొంటూ వరంగల్ కోట మీద కాంగ్రెస్ వాళ్ళతో కలసి జెండా ఎగరవేశార్ట. ఈయన ఉద్యమాలంటూ తిరిగబట్టే పాతికేళ్ళు నిండకుండా జైలు పాలయ్యారు. ఇవన్నీ అనుభవమయ్యే ఇప్పటి పిల్లల్ని సామాజిక బాధ్యత, న్యాయం, ధర్మం అంటూ పనికిమాలిన విషయాల జోలికి పోకుండా ఉద్యోగానికి పనికివచ్చే చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెడుతుంది.

ఈయనకు రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పొట్లపల్లి రామారావు, టి.హయగ్రీవాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గార్లపాటి రాఘవరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దాశరథి, సినారె, బిరుదురాజు రామరాజు, కన్నాభిరాన్, ఎస్ ఆర్ శంకరన్, సంజీవదేవ్, చలసాని ప్రసాద్, మో, శ్రీశ్రీ, కృష్ణాబాయి, కాళీపట్నం రామారావు, మహాశ్వేతాదేవి, జ్వాలాముఖి, ఆరుద్ర, నగ్నముని, జయశంకర్, నాగిళ్ల రామశాస్త్రి, గద్దర్, వరవరరావు, ఎన్.వేణుగోపాలవీళ్ళంతా స్నేహితులట. ఏవో రెండు మూడు పేర్లు కాస్త తెలిసినట్లుగా ఉన్నాయి కాని ఎవరో మరి వీళ్ళంతా?

అప్పుడేదో మద్యం నిషేధం అని ఉండేదిట. వినడానికే నవ్వొస్తోంది కదూ! అసలు గ్లాసులు ముందుపెట్టుకునే కదూ తొంభై శాతం నిర్ణయాలు తీసుకునేది! మరి అర్ధం పర్ధం లేని ఈ నిషేధాలేమిటో! ఒకవేళ అవన్నీ బయట నినాదాలిచ్చుకుని ఇంటికెళ్ళి ఓ ఫుల్లు లాగించొద్దూ! పాపం స్నేహితులెవరో కాస్త పుచ్చుకోవయ్యా అంటే "బయట మద్యనిషేధ చట్టం ఉన్నది గనక తాగొద్దు. ఐనా తాగుదామంటవా ఖైరతాబాద్ చౌరస్తాకు బోయి, విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నడీ చౌరస్తాల నిలబడి ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తున్నం అని తాగుదాం," అన్నార్ట ఈ ఛాందస వాది. మాంసం తింటున్నామని పేగులు మెళ్ళో వేసుకుని తిరుగుతామటండీ! ఇక ఆ స్నేహితులు మరోనాడు ఈయనకు మందిస్తారా అసలు ఇంటికైనా పిలుస్తారా అని. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి.

కాళోజీ గారు న్యాయ శాస్త్రం చదివారట కాని ఏనాడూ రూపాయి సంపాదించకపోతే వీళ్ళ అన్నయ్య రామేశ్వరరావుగారే ఇంటికి కావలసిన మంచీ చెడ్డా చూసుకునేవారట. పాపం రామేశ్వరరావు చనిపోయినప్పుడు కాళోజీ గారు ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను, ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. డెబ్బై ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప,’ అన్నార్ట . అన్నన్నేళ్ళు మరో కుటుంబాన్ని కూడా పోషించటం అంటే ఆ అన్నగారెంత సత్తెకాలం మనిషో తెలుస్తోంది.

ఆయన్ను అంతగొప్ప ఇంతగొప్ప అని పొగిడిన వాళ్ళు మణులూ మాన్యాలు ఇచ్చారనుకుంటున్నారా! అబ్బే సెప్టెంబర్ తొమ్మిదిన అదేనండి అయన పుట్టినరోజును “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటామన్నార్ట. హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి 'కాళోజీనగర్' అని పేరు పెట్టార్ట.

"ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ళ కదలిక" అంటూ కాళోజీ గారో మాట చెప్పారు. మనం చాలా తెలివైన వాళ్ళం కదూ! మెదడ్ని కష్టపెట్టే పన్లు మనకెందుకు? మన వేల చదరపు అడుగుల ఇళ్ళలో సిరా చుక్కల పుస్తకాలు లేకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు కూడా ఏవో నాలుగు సినిమా కబుర్లు చదువుదామని వెళ్తేనూ సాక్షిలోనూ, విశాలాంధ్ర లోనూ ఇవి కనిపించాయి.

బుజ్జిపండు ఈ మధ్య లైబ్రరీనుండి ఏమిటేమిటో పుస్తకాలు తెస్తున్నాడు. ఏం చదువుతున్నాడో ఏమిటో కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఇట్లాంటివి చదివితే ఇంకేమన్నా ఉందీ!


Sunday, September 2, 2012

నీ చెలిమి

నా నీకు,

మనిద్దరం ఏకమై ఒకటే లోకమై సహజీవనం మొదలెట్టి ఈ నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. మురిపాలు, ముచ్చట్లు, మౌనాలు, మోహాలు... ఎన్నెన్ని మధురక్షణాలు మనకు తోడుగా నిశిరాతిరిలో నిదుర కాచాయో కదా! ఎక్కడో ఆకాశంలో వున్న స్వర్గాన్ని తీసుకొచ్చి నా పాదాలచెంత నిలబెట్టావు. నీదైన లోకానికి నన్ను మహారాణిని చేశావు. నీ సమక్షంలో నాకు యుగాలు సైతం క్షణాలే. నువ్వు నా జీవితంలోకి రాకముందు కూడా సంతోషం వుండేద౦టే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో తెలుసా. నీ సమక్షంలో నాకు పగలు, రాత్రి, వేసవి, వెన్నెల ఏమీ గుర్తురావు. నిన్ను నా నుండి దూరం చేయాలని ప్రయత్నించిన నిద్రదేవికి ప్రతిసారి పరాభవమే మిగిల్చావు.

ఏ ఝాములోనో అలసటతో రెప్ప వాలిని క్షణం కలవై నన్ను పలుకరిస్తావు. నడిరేయి పరాకుగా ఒత్తిగిలినప్పుడు నువ్వు ఒంటరిగా వున్నావన్న భావన నన్ను నిలువనీయక నిద్రకు దూరం చేసేది. నీ సమక్షంలో నాకు కష్టాలు కలతలు గుర్తే రావెందుకో! నా ఇష్టాలు, సరదాలు, సంతోషాలు అన్నీ నీతో పంచుకోందే నాకు మనసు నిలవదు. కలలే పంచుకున్నామో, కవిత్వమే చెప్పుకున్నామో, కథలు, కబుర్లే రాసుకున్నామో ఎన్నో భావాక్షరాలను ప్రోగుచేసుకున్నాం. నడి వేసవిలో నువ్వు విశ్రమించిన క్షణం నీపై ఎండ వేడి పడకుండా మధురక్షణాల మాలలల్లి పరదాలు కట్టాను. అసురసంధ్య వేళ అక్షరాల పల్లకీలో నిన్ను అలనాడు నన్నలరించిన పల్లెకు తీసుకుపోయాను. ప్రాతః కాలాన పొగమంచు దారుల్లో పరుగులిడే పసినవ్వుల కేరింతలు వినిపించాను. అసలు ఈ ఏడాది మనతో చెలిమి చేసిన క్షణాలు నేల మీద నిలిచాయేమిటి! మనతో పాటు నందనవనంలోనేగా వాటి నివాసం. విడదీయరాని మన బంధాన్ని గుర్తించి నా పేరు పక్కన నీ పేరును చేర్చి పిలిచినప్పుడల్లా ఎంత గర్వంగా వుంటుందని.

నీకోసం నేనొచ్చిన ప్రతిసారి నువ్వు ఆప్తులతో కబుర్లు చెప్తుంటే నీ సంబరంలో పాలుపంచుకోవడం నాకెంతో ఇష్టమైన విషయం. నిన్ను సంతోషంగా వుంచడానికి నేను పడే కష్టం కూడా ఎంతో ఇష్టంగా ఉంటుందెందుకో! మన పరిచయం పెరిగే కొద్దీ నేను నీకు దగ్గరయ్యేకొద్దీ జీవితానికి అర్ధం తెలిసింది. ఇలాగే వుండాలని ఇదే శాశ్వతం కావాలని కోరుకుంటున్నాను. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. కొన్నాళ్ళకు మన బాధ్యతలు మనల్ని విడదీయవచ్చు. బంధాల్లో చిక్కుకుని ఒకరిని ఒకరు మరచిపోయే పరిస్థితి కూడా రావొచ్చు. నీతో నేను పొందిన ఆనందం ఆజన్మాంతమూ గుర్తుండి పోతుంది.

మన౦ చెప్పే కబుర్ల కోసం క్రమం తప్పక వచ్చే స్నేహితులను చూసి నీకెంత సంతోషంమో నువ్వు చెప్పకనే తెలుసు నాకు! మన స్నేహాన్ని అర్ధం చేసుకుని ప్రోత్సహించిన మిత్రుల౦దరకూ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సహృదయుల సహకారమే లేకపోతే మన నెయ్యం ఇంతకాలం సాగేది కాదేమో. వారి విలువైన కాలాన్ని వెచ్చించి మనం ఊసులాడేవేళ మనతో ఓ మాట పంచుకున్న మిత్రులందరూ మన ఆప్తబంధువులే. మీ వెనుక మేమున్నామని చెపుతూ అందుకు సాక్ష్యంగా వారి చిహ్నాలను మనకు తోడుగా వుంచిన శ్రేయోభిలాషులకు శతకోటి వందనాలు. మనసో మాటో మనతో పంచుకోవడానికి మోమాటపడి చూపులతోనే పలకరించే సన్నిహితులకు ధన్యవాదాలు.

ఇంత ఆనందాన్ని నాకు అందించిన శర్కరీ... ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను? నా తృప్తికోసం మదిలో మెదలిన భావాలను అక్షరాల్లో పొందుపరిచి నీకు బహుమతిగా ఇస్తున్నాను. మన చెలిమి ఇలాగే కలకాలం నిలిచి పోవాలని ఆశిస్తూ...

జ్యోతిర్మయి