Tuesday, March 23, 2021

అరిసెలూ అవాంతరాలు

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళి, ఆచారాలు వ్యవహారాలు, పెళ్ళికి కావలసినవి, అలంకరణ అంటూ నాలుగు రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.  

పెళ్ళికి ఇక మూడు వారాలుందనగా ఒకరోజు “మనం ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించలేదు." అంటూ మా వారికి గుర్తు చేసాను. “అదేంటి అందరినీ ఫోన్ లోనే పిలిచాంగా అందుకనే కార్డ్స్ గురించి ఆలోచించ లేదు.” అన్నారు. “కనీసం కొంతమందికైనా కార్డ్స్ ఇచ్చి పిలుద్దాం" అన్నాను. సరే అంటూ చెన్నై లో ఉన్న ఫ్రెండ్ కి ఫోన్ చేసారు. కరోనా టైమ్ లో మిమ్మల్ని తమిళనాడు బార్డర్ దాటించారే ఆ ఫ్రెండ్ కి. కార్డ్స్ ఏ షాప్ లో దొరుకుతాయో చెప్తే వాళ్ళ వెబ్ సైట్ కి వెళ్ళి చూస్తామని అడిగారు. దానికి ఆయన ఆ వెబ్ సైట్ లో సరైన ఇన్ఫర్మేషన్ దొరకదు, నేను షాప్ కి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను అన్నారు. మిమ్మల్ని ఫ్లయిట్ ఎక్కించాక మళ్ళీ అప్పుడే అట ఇల్లు దాటి వెళ్ళడం. అంత అవసరం లేదండీ అన్నా వినలేదు. పాప పెళ్ళికి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అంటూ షాపు కు వెళ్ళి వీడియో కాల్ చేసి వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్స్ చూపించారు. మాకు నచ్చిన మోడల్స్ ప్రింట్ చేయడానికి రెండు వారాలు పడుతుందిట. షిప్పింగ్ కి మరో వారం. మేము కొంచెం ముందుగా చూసుకోవాల్సింది. అయినా కూడా అవన్నీ కనీసం రెండు వందల కార్డ్స్ అయినా ఆర్డర్ ఇవ్వాలిట.  

అప్పుడే పెళ్ళికొడుకు కార్డ్స్ బావున్నాయి తాను ప్రింట్ చేయిస్తున్నానంటూ ఒక లింక్ పంపించాడు. “ఓ కార్డ్స్ ఇక్కడ కూడా దొరుకుతాయా?” అని వెతికితే అమెజాన్ ప్రైమ్ లో లేజర్ కట్టింగ్ కార్డ్స్ దొరికాయి. ఇక్కడ వందల్లో తీసుకోనక్కర్లేదు పాతికకు కూడా తీసుకోవచ్చు. ఆర్డర్ చేస్తే ఐదు రోజుల్లో పంపించారు. 

కార్డ్స్ చాలా బావున్నాయి కదూ!

మా అమ్మాయి పెళ్ళి అని చెప్పిన నాలుగో రోజే “జ్యోతిగారూ, స్వీట్లెప్పుడు చేద్దా౦?” అన్నారు, ముగ్గేస్తానన్నారే ఆ ఫ్రెండ్. “ఈ హడావిడిలో స్వీట్లు చేయడానికి టైమ్ ఉండదేమో?” అన్నాను. “భలే వాళ్ళే పెళ్ళి ఇంట్లో స్వీట్లు చేయకుండానా? పైగా మీకు కుదరదంటే చెప్పండి, మేము చేసేస్తాం” అని బెదిరింపొకటి. సరే చూద్దా౦ అన్నాను. లడ్లు చేయడం నాకూ సరదాయే, కానీ కరోనానో. అమ్మో నలుగురమూ ఒకదగ్గర కలిస్తే ఇబ్బందేగా.

బొబ్బట్లు, అరిసెలు, పూతరేకులూ, జీడిపప్పు పాకం, మైసూర్ పాక్, బాదుషా, బకలవా, బ్రౌనీ బైట్స్ తెప్పిద్దామని అనుకున్నాం. మా మరిది పూతరేకులు, జీడిపప్పు పాకం గోదావరి నుండే తెప్పించాలని కంకణం కట్టుకున్నాడు. అదే చేత్తో వెల్లంకి స్వీట్స్ నుండి మైసూర్ పాక్, అరిసెలు, చలివిడి, ఉలవచారు, నల్లకారం, సగ్గుబియ్యం వడియాలు, ఉప్పు మిరపకాయలు కూడా తెప్పించమని అడిగాం.
‘బకలావా’ ఎప్పుడైనా రుచి చూసారా? అంతకుముందు పార్టీల కోసం డెట్రాయిట్ లో ఉన్న షటీలా బేకరీలో తెప్పించుకునే వాళ్ళం. భలే ఉంటుంది. ఆర్డర్ చేద్దామని వెబ్ సైటుకి వెళితే తెలిసింది, కోవిడ్ వలన ఆన్ లైన్ ఆర్డర్స్ తీసుకోవట్లేదని. సరే డెట్రాయిట్ లో ఉన్న కజిన్ ని అడిగాను, షటీలాలో తీసుకుని షిప్ చేయగలవా అని. “అక్కా, నేను పంపిస్తా కానీ, మా ఇంటిదగ్గర ఉన్న ఫరాత్ స్వీట్స్ లో కూడా బావుంటాయి ట్రై చేస్తారా” అంది. ఆ షాప్ సైట్ కి వెళ్ళి చూస్తే కేక్ పిక్చర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సరే అక్కడ బాకలవో ఎలా ఉంటుందో చూద్దాం అని ఆర్డర్ చేసాం. అంత రుచిగా ఉన్న బకలవా ఇప్పటివరకు తినలేదంటే నమ్మండి.
ఇక మిగిలింది లడ్లు, బూందీనూ. “బయటకు ఎక్కడకు వెళ్ళడానికి లేదు ఫామిలీ ఫన్ ఈవెంట్ లడ్లు చేద్దాం” అని ఇంటాయన, మా తమ్ముడు చెరో పక్కన చేరి లడ్డు పాకానికి నాందీ వాక్యం పలికారు. పైగా అప్పటికే ఒక ఫ్రెండ్ సరదా పడుతున్నారుగా. అందరమూ కూర్చుని ఆడుతూ పాడుతూ ఓ మూడొందల లడ్లు చేసేశాం. అదే చేత్తో కాస్త కారబ్బూందీ, మిక్సర్ కూడా చేసేశాం. అలాగ ఫామిలీ లడ్డు ఈవెంట్ సెలెబ్రేట్ చేసుకున్నాం.






ఇండియా నుండి ఆర్డర్ చేసిన స్వీట్స్ పెళ్ళికి ఐదురోజుల ముందు వచ్చాయి. జీడిపప్పు పాకం చిన్న చిన్న పాకెట్స్ లో పంపించారు. ఇక పూతరేకులు గట్టి డబ్బాలో పెట్టి పాక్ చేయలేదు. దాంతో కొన్ని నలిగిపోయాయి. వాటిలో బావున్నవన్నీ డబ్బాలలో సర్దాము. ఇక్కడ సాధారణంగా చీమలు పట్టడం జరగదు కానీ ఎందుకైనా మంచిదని స్వీట్స్ అన్నీ పెద్ద డైనింగ్ టేబుల్ మీద పెట్టాము.

అంతా నల్లేరు మీద నడకలా సాగిపోతోంది హాయిగా అనుకుంటున్నారా? మమ్మల్ని కంగారు పెట్టిన సంఘటనలు కొన్ని జరిగాయి.

బెంగుళూరు నుండి మా కజిన్ గరుడవేగాలో పార్సెల్ పంపించాక రోజూ దాని స్టేటస్ చెక్ చేసుకునే వాళ్ళం. ఒక రోజు మధ్యాహ్నం డెలివర్డ్ అని టెక్స్ట్ వచ్చింది, పార్సెల్ మాత్రం రాలేదు. సాయంత్రం వరకూ చూసాము, రాలేదు. డెలివరీ ఇచ్చినట్టుగా ఫోటో వచ్చింది. అయితే ఆ ఫోటోలో ఉన్నది మా ఇల్లు కాదు. యుపిస్ వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కుంటే ఇచ్చేసాం అంటారు. ఇచ్చారు కానీ మా ఇంటికి కాదు అంటే దానిమీద ఉన్న అడ్రెస్ కే పంపించామని అడ్రస్ చెప్పారు. అప్పటికే రాత్రి తొమ్మిది దాటింది. అడ్రస్ పట్టుకుని వాళ్లింటికి వెళ్దామంటే అంత రాత్రి తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళడం ప్రమాదం. కానీ పెళ్ళికి, డెకరేషన్ కి కావలసినవి చాలా అందులో ఉన్నాయి. వాళ్ళు కనుక బయట వదిలేస్తే ఆ పాకెట్ ఏమై పోతుందో, ఏమైతే అదయిందని నేనూ బుజ్జిపండూ ఆ అడ్రస్ పట్టుకుని వెళ్ళాం. తీరా చూస్తే అది మాకు తెలిసిన వాళ్ళ ఇల్లే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ళింటి పేరు మా ఇంటి పేరు ఒకటే. అలా ఎలా జరిగిందో మరి, అమ్మయ్య అనుకుని మా పార్సెల్ మేము తెచ్చుకున్నాం. ఆ విషయం తలచుకుంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యoగా ఉంటుంది.

రెండవ సారి ఎంగేజ్ మెంట్ రింగ్ డెలివరీ. పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు వాళ్ళకు నచ్చిన రింగ్స్ ఆర్డర్ చేసారు. పెళ్ళి కొడుకు రింగ్ డెలివరీ మా ఇంటి అడ్రస్ కి పెట్టారు. మా పాప ఇమెయిల్ కి డెలివరీ ఇచ్చినట్లు మెయిల్ వచ్చిందట తాను చూసుకోలేదు. ఒకరోజు తరువాత చూసుకుని చెక్ చేస్తే మా ఇంటికేమీ పార్సెల్ రాలేదు. ఓ గంట సేపు బోలెడు కంగారు పడ్డాము. దీనిని కూడా ఎవరింటికైనా పంపించేసి ఉంటారా అని. తీరా చూస్తే మా మెయిల్ బాక్స్ లో ఉంది. రిజిస్టర్ పోస్ట్ లో కదా అది రావాలి? మరి అంత విలువైన వస్తువు అలా మెయిల్ బాక్స్ లో ఎలా పెట్టి వెళ్ళిపోయారు? కనుక్కుంటే వాళ్ళు చెప్పిందేమిటంటే కరోనా వలన సంతకాలు అవీ పెట్టించుకోవడం లేదట. అందువలన మెయిల్ మాన్/ఉమన్ సంతకం పెట్టేసి మెయిల్ బాక్స్ లో పెట్టి వెళ్ళిపోయారట. పెళ్ళి కూతురి రింగ్ డెలావేర్ లో కజిన్స్ ఇంటికి ఆర్డర్ పెట్టారు. అక్కడ స్టేట్ టాక్స్ ఉండదట. మా తమ్ముడు మరదలు వెళ్ళి ఆ రింగ్ తీసుకుని వచ్చారు. మేనకోడలు అడగాలే కానీ వీళ్ళిద్దరూ అండమాన్ కి కూడా వెళ్ళి రావడానికి కూడా సిద్దం.

మూడవది పెళ్ళి డెకరేషన్. నలుగు, ప్రదానం అన్నీ పూర్తయ్యాయి. మగపెళ్ళి వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. తరువాత రోజు సాయంత్రమే పెళ్ళి. ఆ రాత్రి తొమ్మిది గంటలకు డెకరేటర్స్ పెళ్ళి మండపం పిక్చర్స్ పంపించారు. మాకు వాళ్ళు చూపించిన డిజైన్ లో మండపానికి అటూ ఇటూ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. దీనికి లేవు. అంటే పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు పూజారిగారు మాత్రమే కూర్చోగలిగినంత సైజ్ లో ఉంది మండపం. ఇదేంటి మీరు చూపించింది ఇది కాదు కదా అంటే పిక్చర్ బావుండడానికి అది పంపించాం అన్నారు. ఒరిజనల్ గా ఇదే వస్తుంది అన్నారు. అది మీరు ముందే చెప్పాలి, మాకు వేరే పూజలు చేయడానికి మండపానికి అటూ ఇటూ కూడా కొంచెం స్థలం కావాలి అని మా సిత్తరాల సిరపడు వారికి నయాన భయాన చెప్పి ఒప్పించారు. వాళ్ళు ఉదయం పదిగంటలకల్లా పక్కన ఎక్స్టెన్షన్స్ పెట్టేసారు.

మాకు బాగా దగ్గర బంధువులు, స్నేహితులు ఫ్లయిట్ లో ప్రయాణం చేయడం రిస్క్ అనీ, పెళ్ళికి వచ్చి కరోనా స్ప్రెడ్ చేస్తామేమో అన్న భయంతోనూ రాలేకపోయారు. నాన్న రాకపోవడానికి కూడా ఇదే కారణం. వీళ్ళందరినీ చాలా పెళ్ళిలో మిస్ అయ్యాము.

మిగిలిన కబుర్లు ఇక్కడ చదవొచ్చు.