Sunday, November 13, 2011

ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు బాబూ..

         ఎంతన్యాయం, ఎంతన్యాయం ఇలాంటి ఘోరం ఎక్కడా చూళ్ళేదంటే నమ్మండి. ఇది జరిగి ఎన్నో ఏళ్ళయినా నిన్న మొన్న జరిగినట్లుగానే ఉంది. మనసుకి యెంత అనిపించక పోతే ఇన్నేళ్ళు గుర్తుటు౦దో మీరే చెప్పండి. "అసలేం జరిగిందంటారా?" అంతా వివిరంగా చెప్తాగా...


         మేమోదో ఇల్లు చూసుకుని 'నీకూ నీ వారు లేరూ..నాకూ నా వారు లేరు... చెల్ మోహనరంగా’ అని ఝామ్మని కొత్త ఇంటిలోకి వెళ్దామనుకున్నామా...ఎలా తెలిసిందో ఏమో! మేం నిద్రలేచేసరికే “గురూ 'యుహాల్' తెద్దామా” అంటూ లోపలి వచ్చి నా చేతికి బాగ్ అందించారు విజయ్. అందులో 'ఏముందా?' అని చూస్తే ఇడ్లీ, పచ్చడీనూ..మేమేదో బేగల్ మీద క్రీం చీజ్ రాసుకుని తినే సంబరంలో ఉన్నాం. “ఆ... ఇడ్లీ తినేయండి బేగల్ ఏం తి౦టారూ” అని బలవంతగా ఆ తెచ్చిన ఇడ్లీలు తినిపించేసారు.


          సరే పాపను లేపి ఆ పనీ ఈ పనీ కానిచ్చే౦తలో ‘యుహాల్’ తేనే తెచ్చారు. ఈ లోగా జీన్స్ పాంట్, కాన్వాస్ షూస్ చేతికి గ్లౌజ్ తో వెంకట్, సురేష్, విక్రం కూడా వచ్చేశారు. ఇంకేముందీ...అందరూ కలసి ఇంట్లో ఒక్కక్క సామానూ యుహాల్ లోకి చారేయడం మొదలుపెట్టారు. నేనేదో చిన్నా చితకా పెట్టబోయినా “మీరుండ౦డి మేమంతా లేమా?” అని నన్ను గట్టిగా ఓ కసరు కసిరారు. నా ఇంట్లో నన్నే కోప్పడతారా హన్నా! అని మొహం ఎర్రగా చేసుకుని ఓ వైపుగా జరిగి నిలబడ్డాను. మా వారు నా పరిస్థికితికి జాలిపడి “అమ్మడూ నువ్వెళ్ళి ‘డోనట్స్’ తీసుకురా” అని అక్కడ నుండి పంపించేశారు. నేనేళ్లి వచ్చేలోగా సామాన్లన్నీ ట్రక్కులోకెక్కేశాయి. అందరం కొత్తింటికి బయలు దేరాం.


         ఆ ఇంటికి వెళ్ళామా “మీరో పక్కన కూర్చోండని” మళ్ళీ నన్నో మూలకు పంపించి అట్టపెట్టెలన్నిటినీ ఏ గదిపేరు రాసున్న వాటిని ఆ గదిలో పెట్టేశారు. అమ్మయ్య ఇంక వీళ్ళకి డోనట్స్ పెట్టి పంపేసి ఎంచక్కా సర్దుకోవచ్చనుకుంటూ డోనట్స్ ఇచ్చాను. మేమలా తినడం పూర్తయ్యిందో లేదో శ్రావణి, సారిక, గీత వాళ్ళ పిల్లలు బిలబిల లాడుతూ వచ్చేశారు. "అబ్బా.. మళ్ళీ వీళ్ళు కూడానా" మమ్మల్ని ప్రశాంతంగా సర్దుకోనివ్వరు కదా అని మనసులో విసుక్కుంటూ, పైకి నవ్వుతూ ఆహ్వానించాను.


       వచ్చీ రావడంతోటే వాళ్ళు అట్టపెట్టెల మీద దండ యాత్ర మొదలు పెట్టారు. నేను మా వారూ "ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది" అని పాడుకుంటూ చెయ్యాలని రిహార్సల్స్  కూడా వేసుకున్న పనిని వాళ్ళందరూ కొంచెం కూడా హృదయమన్నది లేక చేసేస్తుంటే ఆ బాధ ఎవారితో చెప్పుకోవాలి మీరే చెప్పండి. పైగా  "నువ్వు ము౦దిలా కూర్చో...అసలే వట్టి మనిషివి కూడా కాదు" అని మా ఇంట్లో, ఏంటి మా సొంత ఇంట్లో... వంటిట్లో ఓ మూలగా కుర్చీ వేసి నన్ను బలవంతంగా కూర్చోబెట్టి “ఏవి ఎక్కడ పెట్టాలో చెప్పు” అని ఆర్డరు. అమెరికాలో అత్త ఆడపడచులు లేని లోటు తీర్చారంటే నమ్మండి. నేను లేవబోతే ఒప్పుకోరే, ఒకరు గాజు గిన్నెలకు చుట్టిన పేపర్లు విప్పితే, మరొకరు వాటిని షెల్ఫ్ లో పెట్టేసారు. ఇంకొకళ్ళు డబ్బాలు సర్దేసారు. ఈలోగా ఆ అపార్ట్మెంట్ లో కొంచెం ముఖ పరిచయం ఉన్న వాళ్ళు వచ్చారు ఏం చేస్తున్నామో చూసిపోదామని. వీళ్ల అఘాయిత్యం చూసి "మీకు చాలా మందే ఉన్నారు, ఇంక మేమెందుకు?" అని వెళ్లి పోతుంటే తల తీసేసినట్లయి౦దనుకోండి.


         అన్నీ దిగమింగుకుని వచ్చినవాళ్ళకు మర్యాద చెయ్యాలని గుర్తొచ్చి మా వారితో “పిజ్జా ఆర్డర్ చేయండి” అన్నా. "ఆ..పిజ్జా ఎందుకూ...అందరూ పనులు చేసి ఆకలి మీదుంటారు. పిజ్జా రాత్రికి తెచ్చుకుందాలే" అని వాళ్లే బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పడేశారు. కారులో నుండి రకరకాల బాగులు తీసుకుని వచ్చారు, ముందుగానే  అనుకుని వాళ్ళా కూరలన్నీ చేసి పట్టుకొచ్చినట్టున్నారు. నా వెనుక యెంత కుట్ర పన్నారో చూడండి. ఇంత అమానుషం ఎక్కడైనా ఉంటు౦దా?


           అందరం శుభ్రంగా కొత్తిమీర పచ్చడి, మామిడి కాయ పప్పు, దొండకాయ వేపుడు, వంకాయ కూరతో భోజనాలు చేసేశాం. అంతటితో అయిపోతే ఇక చెప్పుకోవడం ఎందుకు? రేపు, ఎల్లుండి కోసం అని ఇడ్లీ దోసెల పిండి పచ్చళ్ళతో సహా ఫ్రిజ్లో పెట్టేశారు. సాయత్రంమయ్యేసరికి ఎంచక్కా వంటిల్లు సర్దేసి అల్మైరాలన్నీ సామాన్లతో నింపేసి బట్టలన్నీ క్లోజెట్లల్లో తగిలించేసారు. పైగా నా ఎదురుగానే మా వారికి వార్ని౦గ్ 'నాతో ఏమీ పని చేయి౦చొద్దని రేపుదయాన్నే కూరలు పంపుతామనీనూ'.. ఒక్కరోజులో ఇల్లు పీకి వేరే ఇంట్లోకి మమ్మల్ని నెట్టేసారంటే నమ్మ౦డి.


         ఇలాంటి స్నేహితులు మీక్కూడా ఉంటే తస్మాత్ జాగ్రత్త సుమండీ .. ఒక్కసారి మనసులో చోటిచ్చామా ఇక జీవితాంతం వెళ్ళమన్నా వెళ్లరు.