Wednesday, November 16, 2011

మరుగేలరా ఓ రాఘవా

నా నీకు,
          ఆకాశం నాలాగే వేచి చూస్తున్నట్టుంది. చందమామను నిన్ననగా పంపాను నిన్ను చూసిరమ్మని, ఇంకా రానేలేదు. నా ఆలోచనలకు అంతరాయం కలుగుతుందనేమో ప్రకృతి సైతం చిత్తరువై చూస్తో౦ది. నిజం, కొబ్బరాకులన్నీ ఏదో మౌనరాగం వింటున్నట్టు గంభీరంగా వున్నాయి. కదలని మబ్బులు నిశ్శబ్దగీత౦ పాడుతున్నాయి. జాజితీగ జాలిగా ఇటే చూస్తోంది. ఒంటరి నక్షత్రం మిణుకు మిణుకుమంటోంది.

          ఏవేవో ఊసులు చెపుతూ నన్నల్లుకుని ఎన్నో ఊహలు. చిరుగాలై నిన్ను చుట్టుముట్టాలని, విరిజల్లై అభిషేకించాలని, సాగారాన్నై నీ పాదాలు తాకాలని, తెలిమబ్బై నీకు గొడుగు పట్టాలని, కిన్నెరనై నీకు సప్తస్వరాలు వినిపించాలని, ఊర్వశినై స్వర్గాన్నే నీ దరికి తేవాలని, ఇలా ఎన్నెన్నో.... నీతో కలసి వెలుగునీడల కలయికను, వేకువలో తొలి ఉషస్సును పంచుకోవాలనుంది. ఈ శరత్కాలపు రేయి మధురమైన పాటలు మంద్రస్థాయిలో వింటూ వినీలాకాశపు పందిరి కి౦ద వెన్నెలస్నానాలు చేయాలనుంది. రాత్రి మనల్ని దాటి సాగిపోతూ ఉంటే, కదిలే కాలాన్ని చూస్తూ అలా ఆగిపోవాలనుంది!

         ఎలా దాటనీ రాత్రిని? నీ పదసవ్వడి వినని నాడు ఇంకే శబ్దమూ నన్ను చేరకున్నది. ఎద వాకిట యుగాలపాటు వేచియున్నాను నువ్వొచ్చే మధురక్షణాల కోసం... అలసటతో రెప్పవాల్చుతానేమో! నన్ను దాటి వెళ్ళిపోకు. ఈ చిత్ర పటానికి నీ స్పర్శతోనే జీవం.

నీ
నేను