Thursday, November 17, 2011

బుజ్జిపండు.....ఓ కథ

“పండూ బెడ్ టైం అయింది పడుకుందాం రా నాన్నా”.
“అమ్మా స్టోరీ చెప్పవా?”
"కథా, ఏం కథ చెప్పనూ...ఆ....అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు". కథ చెప్పడం మొదలు పెట్టాను. 
"ఏడ౦టే?" అడిగాడు పండు. 
 “ఏడ౦టే సెవెన్. ఏడుగురు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు."
"ఎస్టర్ డే వేట అంటే హ౦టింగ్ అని చెప్పావ్. వేటకెళ్ళి ఎవరైనా ఫిష్ లు తెస్తారా ఫిషింగ్ కెళ్ళి ఫిష్ లు తెస్తారు కానీ."పండు సందేహం. 
"యు ఆర్ రైట్ పండూ, ఫిషింగ్ కెళ్ళే ఫిష్ లు తెచ్చారు. తెచ్చి ఆ చేపల్ని ఎండబెట్టారు."
“ఎందుకు ఎండబెట్టారు? కుక్ చెయ్యరా?”
"అంటే అప్పటికే వేరే కూరేదో చేసేసారన్నమాట. అందుకని ఎండబెట్టారు నాన్నా."
“అయితో ఫ్రిజ్లో పెట్టొచ్చుగా” ఆలోచిస్తూ అన్నాడు పండు.
"వాళ్ళకు ఫ్రిజ్ లేదు. అందుకని ప్రిజర్వ్ చెయ్యడానికి ఎండబెట్టారన్నమాట." ఎదో అప్పటికి అలా సర్దేసాను. 
" ఓ వాళ్ళకు ఫ్రిడ్జ్ లేదా? సరే చెప్పు"
"అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా నువ్వు ఎందుకు ఎండలేదు?అంటే" చెప్పడం మొదలు పెట్టాను.
"ఈజ్ దట్ ఫిష్ అలైవ్ ఆర్ డెడ్?" అడిగాడు.
(అప్పుడా ఫిష్ అలైవో కాదో కాని ఇప్పుడు నేను డెడ్) "డెడ్డే." చెప్పాను.
"డెడ్ ఫిష్ ఎలా మాట్లాడిందీ?" గొప్ప సందేహం వచ్చింది పండుకు.
"కథ కదా, కధల్లో డెడ్ ఫిష్ లు మాట్లాడతాయన్న మాట. చేప ఏం చెప్పిందో తెలుసా?"
"ఏం చెప్పింది?"
"గడ్డిమోపు అడ్డమొచ్చింది". అన్నదట.
“గడ్డిమోపు అంటే?”
"గడ్డి మోపు అంటే హాలోవీన్ అప్పుడు, హే బండిల్స్ డెకరేషన్ కు పెడతారు కదా అలాంటిది ఇంకా పే...ద్దదన్నమాట".
"ఓ బిగ్ హే బండిల్. అది కార్టూన్ లో మాట్లాడినట్లు మాట్లాడుతుందా?
"(అమ్మయ్య థాంక్స్ టు వాల్ట్ డిస్నీ) ఆ అలాగే మాట్లాడుతుంది. “గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకడ్డమొచ్చావ్?” అంటే “ఆవు నన్ను మెయ్యలేదు” అన్నదట".
“మెయ్యలేదు అంటే?” మళ్ళీ సందేహం.
“తినలేదు అని” చెప్పాను.
అప్పుడు “ఆవు తినలేదు అనొచ్చుగా మెయ్యలేదు అని ఎందుకు చెప్పావ్?”
“ఆవులు మేస్తాయి మనం తినటాం” చెప్పాను.
“మనం ఎందుకు మెయ్యం?”
(బిడ్డల శిక్షణ రాసినందుకు చలాన్ని, చదివినందుకు నన్నూ తిట్టుకుని)....కొంచెం ఓపిక తెచ్చుకుని మెయ్యడం గురించి చెప్పాను.
“ఆవూ ఆవూ ఎందుకు మెయ్యలేదూ?” అంటే “నన్ను పశువులకాపరి అంటే షెపర్డ్, విప్పలేదు" అంది. (సో స్మార్ట్ ఒక క్వొశ్చన్ తప్పించుకున్నా). “ఎరా అబ్బాయ్ ఎందుకు విప్పలేదు అంటే” కథ కొనసాగించాను.
“బాయ్ అయితే స్కూల్ కి వెళ్ళాలి కదా! ఎనిమల్స్ దగ్గరకు ఎందుకు వెళ్ళాడు”
 (ఏదో అనుకుంటాం కానీ అంతా మన భ్రమ). “బాయ్ కాదు బిగ్ మానే.” సర్ది చెప్పాను.
“మరి బాయ్ అని ఎందుకన్నాడు” మళ్ళీ సందేహం.
ఊరికే అన్నాడు నువ్వు కథ విను ముందు. “నాకు అవ్వ బువ్వ పెట్టలేదు” అన్నాడట.
“అవ్వా అవ్వా బువ్వెందుకు పెట్టలేదు?” అంటే, “పాప ఏడ్చింది అన్నదట”. “పాపా పాపా, ఎందుకు ఎడ్చావ్?” అంటే చీమ కుట్టింది అన్నదట. “చీమా చీమా నువ్వెందుకు కుట్టావే?” అంటే, “నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా!” అన్నదట.” (అమ్మయ్య కథ పూర్తి చేసేసాను)

అవునూ నాకో పెద్ద సందేహం వచ్చి౦దిప్పుడు. చిన్నప్పుడు ఈ కథ ఓ వంద సార్లు వినుంటాను. ఒక్కసారి కూడా నాకీ సందేహాలేవీ రాలేదు. ఎందుకనబ్బా?