Wednesday, August 15, 2012

అపురూపమై నిలిచె నా అంతరంగాన...

       అక్టోబర్ నెల కావడంతో మధ్యాహ్నం పదకొండు గంటలైనా చిరు చలిగా వుంది. చెట్లమీది పసుపు, ఎరుపు, నారింజ రంగు ఆకులు గాలికి పల్టీలు కొడుతూ నేలమీద వాలుతున్నాయి. పచ్చటి లాన్ మీద రంగురంగుల ఆకుల సోయగం సంక్రాంతి ముగ్గుల్ని గుర్తుచేస్తు౦ది. రోడ్డు మీద అప్పుడో కారు ఇప్పుడో కారు బద్దకంగా వెళుతున్నాయి. పోస్ట్ మాన్ ఒక్కో ఇంటి దగ్గరా అగి మెయిల్ బాక్స్ లో ఉత్తరాలు, సేల్ పేపర్లు పెడుతున్నాడు. ఉడుత ఒకటి దొరికిన కాయనేదో పట్టుకుని చెట్టు కింద కూర్చుని హడావిడిగా తింటోంది.

        అమ్మ చిట్టితల్లికోసం వాటర్ బాటిల్ తీసుకుని బయటకు వచ్చి తలుపు తాళం వేసింది. ఈలోగా మానస, భారతి కూడా వచ్చి కలిశారు. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకు రావడానికి ముగ్గురూ రోజూ కలిసే వెళతారు. ఓ పావుగంట నడిచి 'పాండురోసా' పార్కు దగ్గరకు వచ్చారు. అక్కడినుండి చూస్తే చిట్టితల్లి వాళ్ళ ప్రీస్కూల్ కనిపిస్తోంది.

       చిట్టితల్లి స్కూల్ లో పిల్లలందరూ బయట ఆటస్థలంలో వున్నారు. సైకిల్ తొక్కుతూ, జారుడుబల్ల మీద జారుతూ, ఊయల ఊగుతూ, బొమ్మరిల్లు లోపలకు బయటకు ఏదో పనునట్లు తిరుగుతూ, ఇసుకలో ఆడుకుంటూ తోటలో తిరిగే సీతాకోక చిలుకల్లా ముద్దుగా వున్నారు పిల్లలు. ఈలోగా టీచర్ పిలిచినట్లున్నారు, ఆడుతున్నవన్నీ వాటి వాటి స్థానాల్లో పెట్టేసి స్కూల్ లోపలకు వెళ్ళడానికి తలుపు దగ్గర వరుసగా నిలబడ్డారు.

        అమ్మావాళ్ళు స్కూల్ దగ్గరకు వెళ్ళేసరికి పిల్లలు కూడా ఇంటికి వెళ్ళడానికి తయారుగా బాక్ పాక్ భుజానికి తగిలించుకుని, చేతిలో రంగులు వేసిన పెద్ద పేపర్ పట్టుకుని వున్నారు. అమ్మను చూడగానే చిట్టితల్లి మొహం దివిటీలా వెలిగిపోయింది. మిస్ టోనీకి థాంక్స్ చెప్పి సంతకం చేస్తున్న అమ్మచేయి పట్టుకు౦ది చిట్టితల్లి. అందరూ బయటకు వచ్చి ఇంటిదారి పట్టారు.

చిట్టితల్లి చేతిలోని ఆర్ట్ చూస్తూ, "ఏంటి నాన్నా ఇది?" అడిగింది అమ్మ.
"ఇది చెట్టు, ఇవి ఆకులు" పేపర్ మీద రంగులను చూపిస్తూ చెప్పింది.
"వావ్ చాలా బావుంది" మెచ్చుకుంది అమ్మ.


      అమ్మ మెచ్చుకోవడంతో, చిన్ని మోహంలో సంతోషం పెయింటింగ్ రంగులతో పోటీ పడుతోంది. చిట్టితల్లి స్నేహితులు ముందుగా పరిగెత్తడం చూసి చిట్టితల్లికూడా ఆ పెయింటింగ్  అమ్మకిచ్చి వాళ్ళతోపాటు పరిగెత్తింది. అపార్ట్మెంట్ దగ్గరకు రాగానే సాయంత్రం మళ్ళీ పార్కులో కలిసే ఒప్పందం మీద పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. 

"అమ్మలూ రెస్ట్ రూం లోకి వెళ్ళి చేతులు కడుక్కుని రామ్మా అన్నం పెడతాను" తాళం తీసి లోపలకు వస్తూ చెప్పింది అమ్మ. బాక్ పాక్ పక్కన పెట్టి వెళ్ళి అమ్మ చెప్పినట్లుగానే చేసింది. ఈలోగా అమ్మ అన్నంలో నెయ్యి వేసి మామిడికాయ పప్పు కలిపి తెచ్చింది. కబుర్లు చెపుతూ చిట్టితల్లికి అన్నం తినిపించింది అమ్మ. అన్నం తినగానే సోఫాలో అమ్మ పక్కన కూర్చుని టివిలో 'లిటిల్ బేర్' చూడడం అలవాటు చిట్టితల్లికి. ఆ రోజు కూడా అలాగే కూర్చుని అమ్మ ఛానల్ మారుస్తు౦టే హఠాత్తుగా ఏదో గుర్తొచ్చిన దాన్లా వెళ్ళి బాక్ పాక్ దగ్గరకు వెళ్లింది చిట్టితల్లి.

"అమ్మా ఇవాళ నేతన్ బర్త్ డే"
"అలాగా..ఏం చేశారు నాన్నా?" అడిగింది అమ్మ.
"పిన్యాటా తెచ్చారు. మేమందరం ఒక కర్ర తీసుకుని దాన్ని ఓపెన్ అయ్యేదాకా కొట్టాం" సంతోషంగా చెప్పింది చిట్టితల్లి. అమ్మకు అర్ధం కాలేదు.
"పిన్యాటా అంటే ఏంటి నాన్నా?"
"అది డా౦కీ అమ్మా. పైన కట్టేశారు. మేమందరమూ టర్న్స్ తీసుకుని ఒక్కోసారి కొట్టాం. అది పగిలిపోయి బోలెడు చాక్లెట్స్ కిందపడ్డాయి. అప్పుడు అందరం ఆ చాక్లెట్స్ తీసుకున్నాం." అమ్మకు అర్ధమయ్యేలా వివరించింది చిట్టితల్లి.
"ఎందుకలా చేశారు?"
"బర్త్ డేకి అలాగే చేస్తారు" అమెరికాలో తను చూసిన మొదటి బర్త్ డే అదే అయినా ఏదో పే...ద్ద తెలిసిన దానిలా అమ్మకు చెప్పింది. తను తీసుకొచ్చినవాటిని బాక్ పాక్ లోంచి తీసి అమ్మ దగ్గరకు వచ్చి౦ది.

"అమ్మా ఇది నీకోసం" అంటూ ఓ పచ్చని తళుకుల ప్లాస్టిక్ గాజు, "నాన్న కోసం" అని ఓ సెంట్(కాయిన్) అమ్మ చేతిలో పెట్టింది పెట్టింది. చుట్టూ చాక్లెట్స్ ఊరిస్తున్నా నాలుగేళ్ళుకూడా లేని పాప అమ్మా నాన్న కోసం అంటూ ప్రేమతో వెతికిన కానుకలు చూశాక ఆ క్షణం అమ్మ కళ్ళలో మెరిసిన భావాన్ని వర్ణించడానికి భాష సరిపోదేమో..

అమ్మమ్మ లక్ష్మీదేవి ఉంగరంతో పాటు 
వాటిని కూడా డబ్బాలో పెట్టి, భద్రంగా లాకర్ లో దాచిపెట్టింది అమ్మ