అప్పుడే వర్షం పడిందేమో ఆకులన్నీ తడితడిగా పచ్చగా మెరుస్తున్నాయ్.
వర్షం బరువుకు వాలిన గులాబీ నుండి నీటిచుక్క నేలమీదకు జారుతో౦ది. చూరు నుండి నీళ్ళు
ధారగా పడుతున్న చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న గాలికి మేపల్ ఆకులు మెల్లగా
కదులుతున్నాయ్. మేఘాల మాటునున్న సూరీడు ఒక్కో కిరణాన్ని గురిచూసి పంపుతున్నట్లుగా
ఏటవాలుగా పడుతోంది నీరెండ. వర్షం వెలిసిన తరువాత మాత్రమే కనిపించే అరుదైన వెలుగుతో
మెరిసిపోతోందా ప్రదేశం. కిటికీలోంచి ఆ సౌందర్యాన్ని చూస్తూ టీ తాగుతోంది రాధిక.
“వెదర్ చాలా బావుంది కదూ” ఎప్పుడొచ్చాడో ఆమె వెనుక
నిలబడి వున్నాడు మోహన్.
తలుపు తెరిచి బయటకు రాగానే చల్లగాలి ఆహ్లాదంగా
పలకరించింది. గోడ వారగా అల్లుకున్న జాజితీగ మెల్లగా ఊగుతోంది. తీగలో అక్కడక్కడా విరిసిన
పూలు నక్షత్రాల్లా వున్నాయి. వీధిలో అప్పుడో కారు ఇప్పుడో కారు వెళ్ళడం తప్ప పెద్ద
హడావిడేమీ లేదు. ఇద్దరూ వరండాలో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.
"ఇంత తీరిగ్గా ఇలా బయట
కూర్చుని చాలా రోజులయింది కదూ!”
“ఊ... ఆ గోవర్ధనం చెట్టు చూడండి వెన్నెల పువ్వులను
కొప్పులో ముడుచుకున్నట్లు లేదూ.. “
ఆమె చూపించిన వైపు చూశాడు. ముదురు ఆకుపచ్చని ఆకుల
మధ్య తెల్లని పువ్వులు. మాట రానట్లుగా చూస్తూ ఉండిపోయాడు. బ్రతకడానికి
జీవించడానికి మధ్య తేడా...
కాళ్ళు రెండూ పైకి పెట్టుకుని సర్దుకుని కూర్చుంటూ
అడిగింది “చెప్పండి ఏంటి కబుర్లు?"
"లైఫ్ ఈజ్ గుడ్" పువ్వు
మీదనుండి చూపు మరలస్తూ ఆమె వైపు తిరిగాడు.
"ఏమిటీ....." కనుబొమలు ముడిచింది.
"నేను మొదలెట్టిన కొత్త కథ
టైటిల్" చిన్నగా నవ్వాడు.
“ఓ...కథా...అయితే ఈసారి మీ కథలో కష్టాలేమీ లేవన్నమాట”
“అవి లేకపోతే ఇక కథే౦ ఉందీ...”
కారు శబ్ద౦ విని పక్కకు చూశాడు. దూరంగా విజయ, కావేరి వీధి మలుపు తిరుగుతూ కనిపించారు.
"మీ ఫ్రెండ్స్ వాక్ చేస్తున్నారు, నువ్వూ వెళ్తావా?"
"లేదులే ఈ మధ్య విజయ ఎందుకో
అదోలా ఉంటోంది. నాతో సరిగా మాట్లాడ్డమే లేదు" చిన్నబోయిన మొహంతో చెప్పింది.
"ఎందుకు.... ఏమైంది?" ఆశ్చర్యపోయాడు మోహన్.
మోహన్ ఆశ్చర్య పోవడానికి కారణముంది.
వాళ్ళా
ఇంటికి మారి రెండేళ్ళవుతోంది. విజయ వాళ్ళు ఆ పక్క వీధిలోనే ఉంటారు. పరిచయమైన
దగ్గరనుండీ రాధికకు, విజయకు బాగా స్నేహం
కుదిరింది. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళుతుంటారు. అటువంటిది ఈ రోజు రాధిక ఇలా
చెప్పడం....
“ఈ మధ్య నేను వాకింగ్ కి పిలిచిన
ప్రతిసారీ బిజీగా ఉన్నానని చెప్తుంది. కొంచెం సేపటి తరువాత వేరెవరితోనైనా వాక్ చేస్తూ
కనిపిస్తోంది" చెప్పింది రాధిక. తనూ పక్కకు చూస్తూ ఉండడంతో రాధిక మోహంలో
భావమేదీ కనిపించలేదు మోహన్ కి.
“ఏమైందో నువ్వడగలేదా?”
మౌనంగా ఉండిపోయింది. తను ఫోన్ చేసినా తామిద్దరి మధ్య సంభాషణ రెండు మాటలు తరువాత
తడుముకోవలసి వస్తుందన్న విషయన్ని అతనికి చెప్పలేదు.
"కారణం మెల్లగా
తెలుస్తుందిలే, అప్పుడు ఆలోచిద్దాం ఏం
చెయ్యాలో." అతనే అన్నాడు.
“నేనూ అలాగే అనుకున్నాను, కానీ..వద్దులెండి
విషయమేదైనా, నాకు మీ క్లాస్
తప్పదు." అంటూ ఆపేసింది. భర్తకు విషయం చెప్పాలని లేదు రాధికకు, అర్ధం చేసుకోకపోగా అనవసరంగా అలోచిస్తున్నావంటాడతను.
"అలా ఎందుకనుకుంటావ్ సమస్యకు మరో కోణం అనుకోవచ్చుగా”
"చూశారా, విషయం తెలియకుండానే
మొదలెట్టారు.” అంది కొంచెం కినుకగా.
“సారీ
సారీ, నువ్వు పూర్తిగా చెప్పేంతవరకూ మాట్లాడను, చెప్పు.”
"పోయిన నెలలో ఓ రోజు పక్కవీధిలో కొత్తగా వచ్చిన రేణుకను పరిచయం
చేద్దామని అందర్నీ టీకి పిలిచాను. కబుర్ల మధ్యలో కావేరి "ఏమైనా కొత్త
పుస్తకాలున్నాయా?" అని అడిగింది. ఈ మధ్య ఇండియా
నుండి తెప్పించిన పుస్తకాలు, పత్రికలూ ఇచ్చాను. తనకు
తెలుగు భాషన్నా, సాహిత్యమన్నా చాలా ఇష్టమని
మీకు తెలుసుగా. ఇవ్వగానే పుస్తకాలు అలా తిరగేస్తూ పత్రికలో బహుమతి వచ్చిన మీ కవిత
చదివి చాలా బాగుందని మెచ్చుకుంది. మిగిలిన వాళ్ళు కూడా మీకు అభినందనలు చెప్పమన్నారు.
ఆ రోజే మీకా విషయ౦ చెప్పాను గుర్తుందిగా! ఆ తరువాత ఓ రోజు రేణుక ఫోన్ చేసి వాళ్ళింటికేవో
కొనాలని పిలిస్తే, విజయ వాళ్ళ చిన్నబాబుకు జ్వరంతో ఉండడంతో తనకు రావడానికి కుదరక
నేనొక్కదాన్నే తనతో కలసి షాపింగ్ కి వెళ్ళాను.. ఆ తరువాత కూడా మేమో రెండు సార్లు
అలాగే వెళ్ళాము. మరోసారి అందరం కలసినపుడు రేణుక మొక్కల గురించి మాట్లాడుతూ మనింట్లో మొక్కలు చాలా అందంగా ఉన్నాయంది. ఆ
తరువాత నుండీ విజయ ప్రవర్తనలో మార్పు గమనిచాను." సుదీర్ఘంగా చెప్పింది రాధిక.
"నువ్వేదో అపోహ పడుతున్నావ్
రాధీ...." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న మోహన్ని మధ్యలో ఆపేసింది.
"మీరలాగే అంటారని తెలుసు, అందుకే ఈ విషయం మీతో ఇన్నాళ్ళూ చెప్పలేదు. తను కావేరితో ఏమన్నదో
తెలుసా... ఆ బహుమతి వచ్చిన మీ కవిత ఏదో ఇంగ్లీష్ కవితకు అనువాదం అని చెప్పిందట."
"అవునా....అలా ఎందుకు చెప్పిందబ్బా" కోపం పాలు కొంచెం ఉన్నా ఆశ్చర్యమే
ఎక్కువ కనిపిచింది మోహన్ స్వర౦లో.
“నాకూ అదే అర్ధం కాలేదు.”
"ఏమయినా, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న
విషయాలు కావేరి నీతో చెప్పకుండా ఉండాల్సింది." తన ధోరణిలో అన్నాడు మోహన్.
"తనకై తాను చెప్పలేదు. ఒక రోజు
విజయ, నన్ను తప్ప అందర్నీ భోజనానికి పిలిచింది, ఆ రోజు నాకు చాలా బాధనిపించి౦ది.
నావల్ల తెలియకుండా ఏమైనా పొరపాటు జరిగిందేమో దిద్దుకు౦దామని కావేరితో మాట్లాడాను.
అప్పుడు తను చెప్పిన విషయాలు నిన్నాక నాకు బాధకంటే కూడా ఆశ్చర్యమే ఎక్కువ
కలిగింది."
"ఏం చెప్పిందట విజయ?" కుతూహలంగా అడిగాడు మోహన్.
"ఏవైతేనేం లెండి, అవన్నీ అప్రస్తుతాలూ, అసత్యాలూనూ. విన్న కావేరికి, నాకూ కూడా తెలుసా
విషయ౦."
"మరెందుకోయ్ బాధ?" అనునయంగా అడిగాడు.
"బాధ నన్నేదో అన్నదనికాదు. అసలెందుకలా అని, మేమిద్దరం అంత స్నేహంగా ఉండేవాళ్ళమా కొన్ని విషయాల్లో నేను తనకంటే
భిన్నంగా ఉండడం, దానివల్ల అందరూ మనల్ని
మెచ్చుకోవడాన్ని చూసి భరించలేకపోయి౦దా.." బాధగా అంది.
"కొంతమంది మనస్థత్వం అంతే రాధీ, మనమేం చెయ్యలేం. కానీ ఎవరు చేసిన తప్పు వారికి తెలుస్తుంది. ఈ
అబద్దాలన్నీ నీటిమీద రాతలే..నిలకడ మీద నిజాలు అందరికీ తెలుస్తాయి."
"మనసులో అసూయ కలగడం సహజం రాధీ...కాని బుద్ది దాన్ని నియంత్రి౦చగలిగినప్పుడు సమస్య అనేదే తలెత్తదు. మా మామయ్య ఎప్పుడూ ఓ మాట చెపుతుండేవారు."
"ఏమనో..." విషయం మోహన్ తో పంచుకోవడంతో మనసు కొంచెం తేలికపడగా
అడిగింది రాధిక.
"ప్రతి వ్యక్తి దగ్గర్నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి" అని
చెప్పాడు.
"ఈ విషయంలో ఏం నేర్చుకుంటాం...ఇక్కడ నేర్చుకోకూడనిదే ఉంది కదా" ఖాళీ
కప్పును పక్కన పెట్టింది.
"నేర్చుకోవలసి౦ది ఉంది రాధీ, కొంతమందిని చూసి ఎలా ఉండాలో
నేర్చుకోవాలి, మరి కొంతమందిని చూసి ఎలా
ఉండకూడదో నేర్చుకోవాలి". గాలికి కదులుతున్న రాధిక ముంగురులు చూస్తూ చెప్పాడు.
"అంటే ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలన్నమాట” అంది నవ్వుతూ.
“సరిగ్గా చెప్పావు, అప్పుడే మనసు బుద్ది రెండూ
కలసి పనిచేస్తాయి.....
నిన్నో విషయం అడిగితే బాధ పడావుగా?”
“ఏమిటో చెప్పండి”
“కావేరి నీతో
అబద్దం చెప్పి ఉండొచ్చుగా..”
“మీకెందుకలా
అనిపించింది?”
“మన గురించి తనలా
చెప్పినప్పుడు కావేరి కూడా దూరంగా ఉండాలి. అలా కాకుండా ఆ ఇద్దరూ మామూలుగా
ఉన్నారంటే... ”
“అదా ... కోరి
ఎవరూ పక్కవారితో వైరం తెచ్చుకోరు, ప్రమాదకరమైన వ్యక్తులేతే తప్ప. విజయ అంత
ప్రమాదకరమైన వ్యక్తి కాదనుకుందేమో...అయినా వాకింగ్ కి వెళ్ళినంత మాత్రాన
ఏమవుతుంది?”
“అలా అని కాదు మన
విషయంలో అబద్దం ఆడింది కదా..తన విషయంలో కూడా...”
“తెలిసిందిగా...జాగ్రత్త
పడుతుంది. ఇంత ఆలోచన ఎందుకూ... మన విషయంలో తనకేదో నచ్చలేదనుకుంటే పోలా...”
“నీకేమీ
బాధనిపించదా?”
“ఎందుకనిపించదు...పుట్టిన
ఊరికి, దేశానికి చాలా దూరంలో ఒంటరి జీవితం గడుపుతున్నాం. ‘ఒంటరి’ అన్నానని అపార్ధం
చేసుకోకండి. మనసులో మాట చెప్పుకోవాలంటే దూరానున్నవారికి ఇక్కడ పరిస్థితి అర్ధం
కాదు, పరిచయమైన వాళ్ళతో బంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది ఇలాంటివి
ఎదురైనప్పుడు చాలా బాధగానే ఉంటుంది...” ఇద్దరూ కాసేపు ఆలోచనలో ఉండిపోయారు.
“చిన్ని జీవిత౦...
అపోహలు, అపార్ధాలు మనసులో పెట్టుకుంటే ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదించగలమా...” తనలో తాను అనుకున్నట్లుగా అంది రాధిక.
“గోవర్ధనం పూవు తెల్లగా కనపడాలంటే బుద్ది వికసించాలి
మరి”
“గోవర్ధనానికా...?”
“ఎవరికో తెలియకే అడిగావా?”
సమాధానం
చెప్పకుండా నవ్వేసింది.
"నువ్వు నాకు నచ్చావ్"
ఆన్నాడు.
"మరో కథ టైటిలా?”
కాదనట్లు తల అడ్డంగా ఊపాడు.
“ఇంత అర్ధాంతరంగా నచ్చడానికి కారణమేంటో "
"తను నీ పట్ల సరిగ్గా ప్రవర్తించక పోయినా కూడా కోపం తెచ్చుకోక ఇలా
ఆలోచించావు చూడు అందుకే"
"మన పెళ్ళయి పదేళ్లయి౦దిగా.... సహవాస దోషం" అంటూ హాయిగా నవ్వేసింది రాధిక. శృతికలిపాడు మోహన్.
"చలి మొదలైంది...ఇక లోపలకు
వెళదామా" అంటూ పైకి లేచింది.
“కథాగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని...” మదిలో
మెదిలిన పాటను చిన్నగా పాడుతూ ఆమెననుసరించాడు.
* * *
ఈ కథ 'వాకిలి' పత్రిక మార్చి సంచికలో ప్రచురితమైంది. సంపాదకులకు
బ్లాగుముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.