Monday, January 14, 2019

సంక్రాంతి


       రోజుకన్నా ముందే తెల్లారినట్లుందివాళ. తీప్పొంగలి, కొత్తబట్టలు గుర్తురాగానే చెంగున మంచం దిగి గుమ్మాన్ని దాటుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. అప్పటికే స్నానం చేసి పెద్ద పండక్కని కుట్టించుకున్న పావడా పైటా వేసుకుని తలకు పిడప చుట్టుకుని దేవుడింట్లోకి వెళ్తూవుంది పిన్ని. చేతిలో తామరాకులో చుట్టిన పూలు. "పిన్నీ పిన్నీ నేను పటాలకు పూలుబెడతా" అంటూ వెంట పడ్డాను. 

"అట్నేబెడుదువులేగానా, గంగాళంలో నీళ్ళు తోడుండాయి ముందు బొయ్యా నీళ్ళు బోసుకునిరా" చెప్పింది. స్నానం చేసి వచ్చేసరికి పిన్ని దేవుడి పటాలన్నీశుభ్రంగా కడిగి గంధం, పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంది. ఆకు మధ్యలో పసుపుతో గౌరీ దేవిని కూడా చేసి పెట్టింది. "పాపా, తావరాకులో కదంబమాల తుంచి పెట్టుండాను, విడి పూలీడుండయ్ పటాలన్నింటికీ పెట్టు." అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. పటాలకు పూలు పెట్టడం పూర్తవగానే బంతిపూలు, మామిడాాకులతో దండ గుచ్చి వీధి గుమ్మానికి కట్టడానికి బయటకు వచ్చాం.

ఇంతలో "డబుక్ డక్ డబుక్ డక్" అని ఢక్కీ మోగించుకుంటూ బుడబుక్కల అతను వచ్చాడు. "అంబ పలుకు జగదాంబ పలుకు కంచి లోనీ కామాక్షీ పలకు, మహా ప్రభువులకు జయం కలగాలి నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ ఇప్పిచ్చుసామీ" అంటూ ఆపకుండా ఢక్కీ మోగించడం మొదలుపెట్టాడు. అమ్మ చేటలో బియ్యంతో పాటు ఒక పాతచీర కూడా తెచ్చి అతని జోలెలో వేసింది. "అమ్మగారి కార్యం జయమౌతాది, అయ్యగారి కార్యం జయమౌతాది, ముత్యాల మూటలే మీ ఇంట మూల్గాలె, రతనాల రాసులే మీ చెంత జేరాలి సుభోజ్జయం సుభోజ్జయం" అని దీవిస్తూ డబుక్ డక్ డబుక్ డక్ అని ఢక్కీ మోగిస్తూ వెళ్ళిపోయాడు.


వెన్న కరుగుతున్న కమ్మని వాసన. ముక్కు ఎగబీలుస్తూ వంటింట్లోకి వెళ్ళాను. భగభగమని మండుతున్న పొయ్యి మీద పసుపురాసి కుంకుమ పెట్టిన ఇత్తడి గిన్నె. పక్కనే చిన్న పొయ్యి మీద నేతిలో జీడిపప్పు వేపుతూ ఉంది అమ్మమ్మ. కత్తిపీట ముందేసుకుని ఎరగడ్డలు కోస్తూ ఉంది చిన్నమ్మమ్మ. 

నన్ను చూడగానే "నాయనా, యాలక్కాయల రొన్ని మీ అమ్మకిచ్చా పొడిగొట్టమని జెప్పు." అంటూ ఏలకుల డబ్బా ఇచ్చింది.
"గబాగబా కానీకా ఈ పాటికి గంపలెత్తుకుని వస్తా వుంటారు." తొందర పెట్టింది చిన్నమ్మమ్మ.
"ఎవరొస్తారమ్మమ్మా" అడిగాను
"ఈ రోజు పండగ్గద్నాయనా చాకలోళ్ళు, మంగలోళ్ళు ఇంకా పొలం కాడ్నుండి సేద్దిగాళ్ళు అందరూ వస్తళ్ళా వాళ్ళకు నిప్పట్లు, మణుగుబూలతో పాటు అన్నం కూర్లు గూడా బెట్టాలి." చెప్పింది.
"ఎందుకమ్మమ్మా వాళ్ళు జేసుకోరా?" అడిగాను.
"పోద్దులొస్తం మన పన్లే జేస్తంటిరే నాయనా పండగ నాడైనా వాళ్ళకు మనం జేసుకున్నవి పెట్టబళ్ళా." చెప్పింది అమ్మమ్మ.

ఇంతలో వీధిలో చిరుతలతో తాళం వేస్తున్న శబ్దం, లయగా గజ్జెల చప్పుడు వినిపించాయి. గుమ్మం పట్టుకుని వెనక్కి వంగి చూస్తే "హరిలో రంగ హరి" అని పాడుతూ హరిదాసు. బిక్ష్యం వెయ్యడానికి పెట్టిన చేటలో నుండి దోసిటి నిండుగా బియ్యం తీసుకుని వెళ్ళాను. హరిదాసు మోకాలి మీద కూర్చుని బియ్యం అక్షయ పాత్రలో వేయించుకుని "చిరంజీవ చిరంజీవ" అని దీవించి వెళ్ళిపోయాడు.

"పాపా, అరిటాకులు గోసుకు రమ్మని శేష్మామయ్యకి జెప్పి వొకాకిటు దీసకరా" చెప్పింది పిన్ని. ఆకు తీసుకుని వెళ్ళేసరికి దేముడికి ఎదురుగా ఒక పీట మీద పళ్ళెంలో టెంకాయ, కర్పూరం సాంబ్రాణి కడ్డీలు, ఇంకో పీట మీద కొత్త బట్టలు పెట్టున్నాయి. అమ్మ దీపం వెలిగిస్తూ ఉంది. "ఎందుకుమా ఇక్కడ బట్టలు పెట్టారు?" అడిగాను. పెద్ద పండగ్గద పాపా పెద్దలకి బెట్టాల" చెప్పింది. "ఓ ఇవి అమ్మమ్మకా" అడిగాను. "మీ అమ్మమ్మకి కాదు, మా అమ్మమ్మకీ, నాయనమ్మకీ ఇంకా పెద్దవాళ్ళకి" చెప్పింది అమ్మ. ఆశ్చర్యంగా చూశాను. ఎందుకంటే వాళ్ళెవరినీ నేను ఎప్పుడూ చూడలేదు మరి. "దేవుడి కాడికి బోయినోళ్ళకి పాపా" నా ఆశ్చర్యం గమనించి చెప్పింది పిన్ని.

అమ్మమ్మ వచ్చి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి గంట గణగణ మోగిస్తూ హారతిచ్చింది. అందరం దండం పెట్టుకుని హారతి కళ్ళకద్దుకున్నాం. ఇంకో పీటమీద అరిటాకేసి తీప్పొంగలి, వడలు, పులుసన్నం, దోసకాయ పచ్చడి, ఉర్లగడ్డ తాళింపు, అన్నం, నెయ్యి, పప్పులుసు, పెరుగు వరుసగా వడ్డించారు అమ్మ, పిన్ని.

"ఏం జోతా యెట్టా వుంద మా ఊర్లో పండగ?" అందరం అన్నాలు తినేసి వరండాలో కూచోగానే అడిగింది చిన్నమ్మమ్మ.
"పండగింకా యేడయింది పిన్నమ్మా. కనప్పండగ్గూడా గానీ అప్పుడు చెప్పద్ది " చెప్పాడు మామయ్య.