Thursday, March 28, 2019

Jamaica - Attractions

కాన్ కూన్ మొన్న మొన్న వెళ్ళినట్లుగా ఉంది అప్పుడే మూడేళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ పిల్లలిద్దరితో బయటకు వెళ్ళే అవకాశం ఇప్పుడొచ్చింది.
"శనివారం ఉదయం బయలుదేరితే మళ్ళీ వచ్చే శనివారం సాయంత్రానికల్లా ఇంటి కొచ్చెయ్యొచ్చు. ఏమంటావ్?" అంటూ అడిగారు.
"బానే ఉంటుంది. ఓ వారం పిల్లలిద్దరితో సరదాగా గడపొచ్చు." చెప్పాను.
"సరే అయితే జమైకా వెళ్దాం. ఆ మూన్ పాలస్ వాళ్ళు నెలకోసారి ఫోన్ చేసి ఎంతో ఇదిగా
వాళ్ళ  రిసార్ట్ కే రావాలని అడుగుతున్నారు. పాపం వాళ్ళను డిజప్పాయింట్ చేయడం ఎందుకు
అక్కడే ఉందాం." అంటూ ప్రయాణానికి ఏర్పాట్లు మొదలెట్టారు. సరే ఓ వారం ఉంటున్నాం కదా అక్కడ చూడాల్సినవి, చేయాల్సినవి ఏమున్నాయో ననుకుంటూ Things to do in Jamica అని గూగుల్ చెయ్యగానే ఓ చిన్న సైజ్ లిస్ట్ వచ్చింది. Dunn falls, Rose Hall Great House, Dolphin cove, Bob Marley Meusium ... ఇలాక్కాదులే రిసార్ట్ కి వెళ్తే వాళ్ళే చెప్తారు అనుకుంటూ శనివారం తెల్లవారు ఝామున రాలీలో ఫ్లైట్ ఎక్కాం. రెండున్నర గంటల
ప్రయాణం. ఫ్లైట్ దిగి రిసార్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాన్ లో ఓ గంటన్నర ప్రయాణం తరువాత నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాం. ఎదురొచ్చి పువ్విచ్చి నవ్వు మొహంతో పలకరించి "రండి రండి ముందు భోజనం అదీ చెయ్యండి మిగతా విషయాలు తరువాత మాట్లాడుకోవచ్చు" అంటూ మర్యాద చేశారు.  భోజనం అదీ పూర్తి చేసి ఆ పూట రిసార్ట్ అంతా తిరిగి చూశాం. ఈ రిసార్ట్ కాన్ కూన్ లో ఉన్నంత పెద్దది కాదు కాని బావుంది.

మరుసటి రోజు అక్కడ చూడవలసినవి ఏమిటా అని వాకబు చేస్తే Blue Mountains, Dunn Falls, Konoko Falls బావుంటాయని తెలిసింది. పిల్లలు horse riding, snorkeling చేద్దామని సరదా పడ్డారు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రణాళిక వేసుకుని ఎక్స్కర్షన్ ప్లానర్స్ దగ్గరకు వెళ్ళాం.  టూర్స్ మీరు కోరుకున్నట్లువే బుక్ చేశాం. మీరు మాత్రం ఉదయాన్నే ఆమ్లెట్ అదీ వేయించుకుని, జ్యూస్ గట్రా తాగేసి ఖచ్చితంగా ఎనిమిది గంటలకల్లా  వచ్చేయాలి లేకపోతే బస్ వెళ్ళిపోతుంది అంటూ బెదిరించారు. అలా చెప్పకపోతే పిల్లలు సమయానికి రారని వాళ్ళకు ఎట్లా తెలిసిందో మరి.

శానాదివారాలు విశ్రాంతిగా గడిపేశాక సోమవారం
బ్లూ మౌంటైన్స్ కి వెళ్ళాం. అన్నట్లు చెప్పనే లేదు కదూ బ్లూ మౌంటైన్స్ రిసార్ట్ నుండి ఓ రెండు గంటల ప్రయాణం. వెళ్ళగానే బ్లూ మౌంటైన్ కాఫీ ఇచ్చారు. వాన్ లో పైకి తీసుకువెళ్ళి కిందకు దిగడానికి సైకిిళ్ళిచ్చారు. సైకిల్ తొక్కుతూ సగం దూరం దిగాక భోజనం పెట్టారు. జర్క్ చికెన్, స్పానిష్ రైస్, స్తీమ్డ్ వెజిటబుల్స్. ఓపదేళ్ళ క్రితం వెళ్ళినా ఈ భోజనమే పెట్టుండేవాళ్ళు. జమైకా వాళ్ళకు మరేం వంటలు రావనుకునేరు. జర్క్ చికెన్ జమైకాలో ప్రత్యేకమైన వంటకం. అతిధులు వచ్చినప్పుడు అదే పెడతారు మరి.

మంగళ వారం డన్ ఫాల్స్ కి వెళ్ళాం. మంగళ వారమే ఎందుకు వెళ్ళామంటే ముహూర్తం బావుందని కాదు. ఆ రోజైతే క్రూజ్ షిప్స్ రావట. అందువల్ల కొంచెం రష్ తక్కువగా ఉంటుందట.
https://en.wikipedia.org/wiki/Dunn%27s_River_Falls

ఏ కొండమీద నుండో చెంగుచెంగున కిందకు దూకే జలపాతాన్ని చూస్తూ ఉంటే ఉత్సాహం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది కదూ! ఉదృతంగా హోరున శబ్దం చేస్తూ అంత ఎత్తునుండి పడుతున్న నీళ్ళ కింద నిలబడి  తడిచి పోయే అనుభవం మహా గమ్మత్తుగా ఉంటుంది. అలాంటి జలపాతాన్ని కిందనుండి పైకి ఎక్కాలని మీకెప్పుడైనా అనిపించిందా? నాకైతే ఊహకూడా రాలేదు. ఈ డన్ ఫాల్స్ ప్రత్యేకత అదే. వడివడిగా పడుతున్న నీళ్ళలో తడిచిపోతూ పైకి ఎక్కడం వింతైన అనుభవం. వడిగా పడుతున్న నీళ్ళ తాకిడి పడిపోకుండా ముందున్న వాళ్ళ చేయి పట్టుకుని  వెనకనున్న వాళ్ళు వస్తున్నారో లేదో చూసుకుంటూ వెళ్ళాం. ఎత్తైన చెట్ల నీడ ఉండడంతో అక్కడంతా చల్లగా ఉంది. టూర్ గైడ్స్ ఎక్కడ గుంటలున్నాయో ఎక్కడ అడుగు వెయ్యాలో చెప్తూ ఉంటారు. లేకపోయినా ఫరవాలేదు ఎక్కెయ్యగలం. వాటార్ షూస్ తప్పకుండా వేసుకోవాలి. మరీ ఖరీదయినవి అఖ్ఖర్లేదు వాల్మార్ట్ లో దొరికేవయినా సరిపోతాయి.

డన్ ఫాల్స్ చరిత్ర: Battle of Las Chorreras ఈ డన్ ఫాల్స్ దగ్గరే జరిగిందట. ఆ యుద్దంలో బ్రిటిష్ వాళ్ళు స్పెయిన్ ని ఓడించి జమైకాను సొంతం చేసుకున్నారట. ఈ యుద్దాన్ని Battle of Ocho Rios అని కూడా అంటారు. Ocho Rivers అంటే స్పానిష్ లో ఎనిమిది నదులు (eight rivers) అని అర్ధం.

డన్ ఫాల్స్ రిసార్ట్ కు చాలా దగ్గరలోనే ఉంది. పదిన్నరకు రిసార్ట్ నుండి బయలుదేరితే రెండు గంటలకల్లా తిరిగి వచ్చేశాం. ఒక్కటే అనిపించింది ఏమిటంటే టూర్ బుక్ చేసుకోవడం వలన అక్కడ ఎక్కువ సమయం గడపలేక పోయాం. అదే విడిగా టాక్సీ మాట్లాడుకుని వుంటే కాస్త స్తిమితంగా గడపగలిగే వాళ్ళం. ఖర్చు కూడా తక్కువ అయివుండేది.
Image result for snorkeling
https://anthonyskey.com/snorkeling/
బుధవారం స్నార్క్లింగ్. స్విమ్మింగ్ డ్రెస్సెస్, టవల్స్, సన్ టాన్ లోషన్స్, హాట్స్, వాటర్ షూస్ అన్నీ సర్దుకుని అట్టహాసంగా బయలుదేరాం. తీరా వెళ్ళి చూస్తే అది ఎక్కడో కాదు రిసార్ట్ కి ఓ చివరన ఉంది.  ఒక చిన్న పడవ ఎక్కించుకుని సముద్రంమధ్యలోకి  తీసుకువెళ్ళి అక్కడ దూకేయ్యమన్నారు. "బాబోయ్ ఈత రాదంటే మరేం ఫరవాలేదు ఇదుగో ఈ ట్యూబ్ పట్టుకుంటే చాలు మేం తీసుకెళ్ళి పోతాం" అంటూ ధైర్యం చెప్పారు. సముద్రం లోపల బుల్లి బుల్లి చాపలు, సీవీడ్, తోక పొడవుగా ఉండే stingray చాపలు కనిపించాయి. పిల్లలకు పాము కూడా కనిపించిందట. ముట్టుకుంటే ముడుచుకుపోయే సి అనిమోన్స్ కూడా చూశాం.

మాంచి ఎండలో తిరిగి వచ్చాం ఇక బార్ దగ్గర కూర్చుని బ్లడీ మారీ, స్ట్రా బెర్రీ డెకరే, మార్గరీటా,
పినా కోలాడా అలా రకరకాల డ్రింక్స్ తీసుకున్నాం. అన్నీ వర్జిన్ డ్రింక్స్ :). ఏ డ్రింక్స్ నచ్చుతాయో చూడాలంటే రిసార్ట్ మంచి ప్లేస్. ఒక విశేషం చెప్పనా. రిసార్ట్ లో ఇరవై నాలుగు గంటలూ ఆల్కహాల్ సర్వ్ చేస్తూనే ఉంటారు. డ్రింక్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఒక్కరు కూడా తూలడం కానీ, అతిగా వ్యవహరించడం కానీ చూడం. అదేం విచిత్రమో మరి. అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు అందరూ బికినీల్లో తిరుగుతున్నా అక్కడున్న పురుషపుంగవులు ఒక్కళ్ళు కూడా వెధవ్వేషాలు వెయ్యరు. అప్పుడనిపిస్తుంది. అసభ్యత బట్టల్లో కాదు చూసే చూపుల్లో ఉంటుందని.

గురువారం ఉదయం గుర్రపు స్వారీకీ వెళ్ళాం. ఇక్కడ విశేషం ఏమిటంటే గుర్రాలు నీళ్ళలోకి కూడా తీసుకువెళతాయి. అవి అలా అలా చలాగ్గా నడుచుకుంటూ వెెళ్ళాయి. అలాకాక ఒక్కసారి పరుగందుకుంటేనా అని లోపల్లోపల కొంచం భయంగానే ఉండింది. వాటర్ షూస్ కావాలన్నారు కానీ. నీళ్ళ లోకి వెళ్ళేప్పుడు చెప్పులు తీసేసి వెళితే బావుంది. సముద్రం మధ్యలో ఉన్నాం. నీళ్ళు కాళ్ళని వెనక్కి తోసేస్తున్నాయి, ఈత రాదు. పోనీ చేతిలో ఉన్నా కళ్ళెమన్నా గట్టిగా పట్టుకుందామన్నా కుదరదు. అలా పట్టుకుంటే గుర్రం పరిగెడుతుందట. కాసేపలా అనిపించింది కానీ భయం పోయాక చాలా ఎంజాయ్ చేశాను. రిసార్ట్ కి ఓ అరగంట దూరంలోనే ఉంది ఫాం. టూర్ బుక్ చేసుకోకుండా టాక్సీ తీసుకుంటే బావుండేదనిపించింది. లేదా లోకల్ టూర్ గైడ్ కానీ.

మధ్యాహ్నం కొనొకో ఫాల్స్ కి వెళ్ళాం. ఇది కూడా రిసార్ట్ దగ్గరే ఉంది. ఎత్తైన కొండ మీద పెద్ద పార్క్, రకరకాల పక్షులతో చిన్న జూ, మరీ పెద్దది కాని జలపాతం, చిన్న మ్యూజియం. ఇవి అక్కడ ప్రత్యేకతలు. గైడ్ అక్కడ మొక్కల విశిష్టత చాలా చక్కగా వివరించాడు. ఇక్కడ నుండి చూస్తె ఓచో రియోస్ మొత్తం కనిపిస్తుంది.









జమైకాలో ఓచో రియోస్, మంటేగో బే, కింగ్స్టన్ ప్రాంతాలలో చూడవలసినవి ఉన్నాయి. ఎక్కువ శాతం ఓచో రియోస్ లోనే ఉన్నాయి. కింగ్స్టన్, మంటేగో బే రెండు దగ్గర్లా అంతర్జాతీయ విమానాశ్రాయలు ఉన్నాయి.

ఇలా మరో మరపురాని అనుభవాన్ని సొంతం చేసుకుని శనివారం తిరిగి గూటికి చేరాం.
ఈ ప్రయాణంలో గుర్తుంచుకోవలసిన వ్యక్తులు, ఆశ్చర్య పరిచిన వివరాలు, అక్కడి వారి ఆచార వ్యవహారాల గురించి మరోసారి చెప్పుకుందాం.