Sunday, December 4, 2011

ఎప్పటికీ నాతోనే ఉండిపోవా

ప్రియమైన నీకు,

         శ్రావణంలో వచ్చి వెళ్ళావు, కార్తీకం కూడా వెళ్ళిపోయింది. నీ దగ్గర నుంచి చిన్న కబురు కూడా లేదు. వెన్నెల వెలుగులతో వస్తావు, నీవున్నన్నాళ్ళు వసంతాలు పూయిస్తావు. నువ్వు నా దగ్గర్నున్నంత సేపూ నన్ను నేల మీద నడవనీయవు కదా! కాళ్ళు కందిపోతాయనా? నువ్వు వస్తూ తెచ్చిన బహుమతులన్నీ పదిలంగా దాచాను. మనసు మూగవోయినపుడు నాకవే ప్రియనేస్తాలు. ఎప్పటినుంచో నీకో విషయం చెప్పాలని చూస్తున్నాను. తెలియని సంకోచమేదో అడ్డుతెర వేస్తోంది.

         మొన్నోరోజు బయటకు వెళ్ళాను. అందరూ అడగడమే నీ గురించి, నువ్వు లేని లోటు నా ముఖంలో కనిపిస్తూందట. నలుగురిలో మరీ ఒంటరితనం భరించలేక వెనక్కు వచ్చేశాను. మనం చేతిలో చేయి వేసుకుని చేసిన విహారాలు నీకు గుర్తున్నాయా? నాకా రోజులన్నీ కళ్ళ ముందే మెదలుతున్నాయి, ఆ జ్ఞాపకాల్లోనే నేను నేనుగా మనగలిగేది. పండుగేదో వస్తున్నట్లుంది. అయినా నువ్వులేందే అది పండుగెలా అవుతుంది! తోడుగ నువ్వుంటే అమావాస్య కూడా పండువెన్నెలే నాకు. నీకోసం ఎన్ని రోజులని ఎదురుచూడను?

         నా విన్నపాన్ని మన్నించి దరిచేరవా. అయినా నీకెక్కడ తీరుతుందిలే, వెయ్యిళ్ళ పూజారివి. అందరికీ నువ్వంటే ఎంతో ఇష్టమట, నీకోసం ఎదురుచూస్తూ ఉంటారట, నీకోసం ఏమైనా చేస్తారట. ఏం మాయ చేశావో అందర్నీ ఇలా వశపరచుకున్నావు. నిన్ను చూస్తే ఒక్కోసారి ఎంత అసూయగా ఉంటుందో తెలుసా! మొన్న నువ్వెళ్ళాక, తిరిగి చూస్తే ఏము౦దీ అంతటా శూన్యమే. ‘అన౦దమా’ అత్యాశ అనుకోక ఎప్పటికీ నాతోనే ఉండిపోవా..నా బ్రతుకు దారంతా నాతోనే నడుస్తావని ఆశిస్తూ..

నీ
నేను